12, ఏప్రిల్ 2016, మంగళవారం

మంచి పుస్తకం మళ్ళీ దొరికింది !



మనకి ఎంతో యిష్ట మయిన వో మంచి పుస్తకం చాలా కాలానికి మళ్ళీ కంట బడితే ఎంత సంతోషంగా ఉంటుందో కదూ ! అదే జరిగింది. నా చిరకాల మిత్రులు లతిక  (   స్వర్గీయ  రాళ్ళపల్లి   గౌరీపతి శాస్త్రి) గారి చిరు పొత్తం అనుకోకుండా ఇవాళ నా కంట పడింది.  వీరిదే  భజరంగ భళీ అనే  వొక కందార్ధ శతకం కూడా అనుకోకుండా ఈ నెలలోనే చాన్నాళ్ళకి తిరిగి చూడడం జరిగింది.

ఆ రోజులలో లతిక గారి రచన లేని ఆంద్ర పత్రిక ప్రభ వారపత్రికలు ఉడేవి కావు. మంచి కవి. రచయిత. భావుకుడు. సహృదయుడు.  లతిక గారి సత్యాభిరామం పుస్తకం అనుకో కుండా ఇవాళ నా కంట పడింది. 81లో నాకు వారిచ్చిన ఆ పుస్తకం నాకెంతో ప్రీతిపాత్రం. ఎక్కడో మరుగున పడి పోయింది. చాలా రోజులుగా వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికి దొరికింది. దానిని మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. 


ఇది విశాఖ సాహితి ప్రచురణ. ముఖ చిత్రం శ్రీ బాలి గారు చాలా అందంగా వేసారు. ప్రస్తావన పేరుతో శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు గారు ముదు మాట వ్రాసేరు. ఇందులో 1. విలాసినీ విజయం (24- 10 -1962 ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలోప్రచురణ.) 2.సుగాత్రి (ఆంధ్ర ప్రభ వీక్లీ 30-5-1962 లో ప్రచురణ) 3.లవంగి (సాహితి మాస పత్రిక సెప్టంబరు 64 లో ప్రచురణ) 4. భామతి (ఆంధ్ర పత్రిక క్రోధి సంవత్సరాది సంచిక లో ప్రచురణ) 5. మీనాంబిక (ప్రభ వీక్లీ 2-9-1966 సంచికలో ప్రచురణ) అనే 5 గేయ కథలు ఉన్నాయి.
ఇందులో విలాసినీ విజయం అనే గేయ కథ నంది తిమ్మన గారి పారిజాతాపహరణం కావ్యం లోని కథకు గేయ రూపం. పారిజాతాపహరణంలో సత్యభామ అలక, కృష్ణుడు ఆమె అలక తీర్చబూనడం. ఆమె ఆ త్రైలోక్యారాధుని ఎడద కాలితో తన్నిత్రోసి వేయడం. చివరకు పంతం నెగ్గించుకుని ఆ విలాసిని పారిజాతాన్ని ఇంద్ర లోకంనుండి గెలిచి తెప్పించుకుని పెరటి చెట్టుగా నాటించు కోవడం కథ మనకు తెలిసినదే.ఇదొక స్వాధీన పతిక కథ!
సుగాత్రి అనే గేయ కథకు మూలం పిగళి సూరన గారి కళాపూర్ణోదయం లోని సుగాత్రీ శాలీనుల కథ. సర్వాభరణ భూషిత అయిన భార్య సుగాత్రిని చేరదీయడు ఆమె భర్త శాలీనుడు. ఆ ఇల్లరికపుటల్లుడి మనోగతం ఎవరికీ అంతు చిక్కదు. చివరకు తోట పనిలో వర్షపు వేళ భర్తకు అలంకారాలన్నీ తీసి వేసి, సాదా వస్త్రధారణతో పని చేసి అలసి సొలసిన అందం చూసి శాలీనుడు ఆమెను అక్కు చేర్చుకోవడం ఇందులో కథ.శ్రమైక జీవన సౌందర్యంతో పతి మనసు చూరగొన్న అతివ కథ యిది.
లవంగి గేయ కథ ... షాజహాన్ చక్రవర్తి కొలువులో జగన్నాథ పండితరాయలు రాజ నర్తకి లవంగిని చూసి ఆమెను భార్యగా స్వీకరించడం.కుల మతాలను భ్రష్టు పట్టించాడని తోటి పండితులు ఛీత్కారాలు.ఇదే కారణంతో ఆ దంపతులను గంగా స్నానానికి కూడ అనుమతించక పోవడం. అరవై మెట్టున్న ఆ గంగా నది ఒడ్డున పండితరాయలుగంగా మాతను ఆశువుగా స్తోత్రం చేయడం. గంగానది అన్ని మెట్లూ అధిగమించి పైకి వచ్చి ఆ దంపతులను తరింప చేయడం ఇందులోకథ.పండితరాయలు ాశువుగా చెప్పినదే గంగాలమరి కావ్యం!
వ్యాసుడు రచించిన బ్రహ్మ సూత్రాలకు ఆది శంకరులు భాష్యం రచించారు. దానికి వాచస్పతి మిశ్రుడు వివరణ వ్రాసాడు. అతని భార్య భామతి. ఆమె పేరే ఆ వివరణ గ్రంథానికి ఉంచాడు వాచస్పతి మిశ్రుడు. ఆ కథకి గేయ రూపమే భామతి.
ఇక చివరిదయిన మీనాంబిక అనే గేయ కథ శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి నవలకు గేయ రూపం.భర్తకు, తండ్రికి ప్రాణ భిక్ష సాధించు కున్న సాధ్వీలలామ కథ యిది.
లతిక గారు ఈ చిన్ని పొత్తాన్ని తమ తల్లిదండ్రులకు అంకితం చేసారు.
శ్రీపాద లక్ష్మీనారాయణ మూర్తి తమ అనుంగు శిష్యుడయిన లతికను ఆశీర్వదిస్తూ చెప్పినట్టుగా యిది ... రమ్య గేయాల సత్యాభిరామ కృతి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి