20, నవంబర్ 2019, బుధవారం

తెలుగు మధురిమలు


సీ. తనయందు నఖిలభూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగు వాఁడు !
      పెద్దలఁబొడగన్నభృత్యుని కైవడిఁ జేరి నమస్కృతుల్ సేయువాఁడు !
       కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృభావము సేసి మరలు వాఁడు !                            
       తల్లిదండ్రుల భంగి ధర్మ వత్సలతను దీనులఁ గావఁజింతించు వాఁడు !

తే.    సఖులయెడ సోదర స్థితి జరుపువాఁడు, దైవతములంచు గురువులఁ దలచు వాఁడు !
        లీలలందును బొంకులు లేని వాఁడు, లలితమర్యాదుఁడైన ప్రహ్లాదుఁ డధిప !
భావం: ఓ ధర్మ రాజా ! దానవ రాజయిన హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు  మర్యాదా పూర్వక మయిన మంచి నడత కల వాడు. హరిభక్తుడయిన  అతడు లోకము నందలి అన్ని ప్రాణులనూ తన లాగా భావిస్తాడు. పెద్దలు ఎదురయితే సేవకుని లా మిక్కిలి గౌరవభావంతో నమస్కరించే వినయ సంపన్నుడు. పర స్త్రీలను తల్లి వలె భావించి, అణకువతో ప్రక్కకి తొలగి పోతాడు. దీనులను తల్లిదండ్రుల లాగా ఆదరిస్తాడు.   స్నేహితులను  సోదర భావంతో చూసే సహృదయుడు. గురువులను దైవంతో సమానంగా కొలుస్తాడు. హాస్యానికి కూడా ఎప్పుడూ అబద్ధమాడడు.
         పోతన గారి ఆంధ్ర మహా భాగవతంలో రాజసూయ యాగ సమయంలో విచ్చేసిన నారద మహర్షి ధర్మ రాజుకి ఈ హరి తత్వ కథలను చెప్పినట్టుగా శుకుడు పరీక్షిత్తుకు వివరిస్తాడు సనక సనందనాదులను వైకుంఠద్వారం వద్ద నిరోధించి, శాపగ్రస్థులయిన ద్వార పాలకులు జయవిజయులు తదనంతర జన్మలలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగను, రావణ కుంభ కర్ణులుగను, శిశుపాల దంతవక్తృలుగను పుట్టి ,వైర భక్తితో  విరోధించి హరి చేతిలో నిహతులయ్యారు.  వీరిలో ,దితి కుమారులు హిణ్యకశిప,హిరణ్యాక్షులలో హిరణ్యాక్షుని శ్రీహరి వరాహ రూపంలో వధించాడు. సోదరుని మరణంతో ఖిన్నుడయిన హిరణ్య కశిపుడు మరింత విష్ణు ద్వేషిగా మారాడు. హరి నామం చెవిని పడితేనే కుపితుడయ్యే వాడు.
    అట్టి హరి ద్వేషికి కుమారుడయిన ప్రహ్లాదుడు మహా విష్ణు భక్తుడు. నిత్యం హరినామ స్మరణతో పులకించి పోయే వాడు. తనయుని హరి భక్తి మాన్చటానికి హిరణ్యకశిపుడు చేయని దుష్కృత్యాలు లేవు. చివరకు ఆ వైర భక్తితోనే  నరసింహావతారమెత్తి వచ్చిన  శ్రీమహా విష్ణువు చేతిలో వధింప బడతాడు.
     
       హరి ద్వేషి అయిన దానవ వీరుని కుమారుడయిన ప్రహ్లాదుని గుణగణాలు పోతన ఈ పద్యంలో మనోహరంగా వర్ణించాడు.సర్వభూతాలను తనతో సమానంగా చూసుకునే సమదర్శి. పెద్దల యెడ అమిత వినయశీలి. పరస్త్రీలను తల్లుల వలె భావించే సుగుణాల ప్రోవు.దీన జనులను సమాదరించే ఆర్ద్ర హృదయుడు. సంగడికాండ్రను సోదర భావంతో చూసే సహృదయుడు.గురువులను దైవంతో సమానంగా చూసుకునే ఆదర్శ విద్యార్ధి. హాస్యానికయినా  అసత్యమాడని సత్యసంధుడు లలితమర్యాదుడు .
         మానవ వ్యక్తిత్వ వికాసానికి మహాకవి పోతన చెప్పిన  తొలి పాఠాలు కదూ యివి !
   
   


   















































1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మంచిచ మంచి పద్యాలు ఇలాగే అదిస్తూ ఉండండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి