మ. తన వెంటన్ సిరి,లచ్చి వెంట
నవరోధవ్రాతమున్, దాని వె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు,ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపాలమున్ !
భావం: మొసలి బారిన పడి, శరణు వేడుతూ ఆక్రోశిస్తున్న
భక్తుడయిన గజేంద్రుని మొర విని, వైకుంఠ వాసుడయిన విష్ణువు బయలు దేరాడు. అతని వెంట
లక్ష్మీ దేవి, ఆమె వెనుక అంత:పుర కాంతలూ బయలుదేరారు. వారి వెంట గరుడుడూ, ఆతనిని అనుసరిస్తూ విల్లూ, గదా, చక్రమూ, శంఖమూ
వచ్చాయి. వాటి వెంట నారదుడూ, విష్వక్సేనుడూ వచ్చారు. వారి వెంట మొత్తం వైకుంఠ
వాసులంతా శీఘ్రంగా బయలుదేరి వచ్చారు.
త్రికూట పర్వత శ్రేణిసమీపాన ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో తిరిగే
ఏనుగుల గుంపు లోనుండి ఒక రోజు ఒక గజ రాజు మంద నుండి విడి పోయి దారి తప్పాడు. భార్యలతో
తిరుగుతూ బాగా డస్సి పోయాడు. అక్కడొక మడుగు కనిపించి ఆనందంతో మడుగు నీటిలో దిగి క్రీడిస్తూ అక్కడే ఉండే ఒక
మొసలి బారిన పడ్డాడు. శక్తి కొలది మొసలితో పోరాడాడు. ఆ నీరాట వనాటాలకు పోరు వెయ్యేండ్లు అతి భీకరంగా
సాగింది. గజరాజు బాగా అలసి సోయాడు.మొసలితో పోరాడే ఓపిక సన్నగిల్లి పోయింది. ఇక తనకు దిక్కు ఆ మహా విష్ణువే అనుకున్నాడు.
ఈ లోకం ఎవని వలన పుడుతుందో, ఎవని వలన లయమవుతుందో,ఈ విశ్వానికి ఎవడు మూలకారకుడో,
అన్నీ తానైన వాడెవ్వడో అట్టి భగవంతుడినే శరణు కోరుకోడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘
దేవా ! నాలో మరింక పోరాడే శక్తి లేదు. ధైర్యం సన్నగిల్లి పోయింది.ప్రాణాలు
కడతేరుకు పోతున్నాయి.మూర్ఛితుడనవుతున్నాను.నీవే తప్ప అన్యు లెవరూ నన్ను రక్షింప లేరు.
నన్ను కాపాడు !’’ అని ఎలుగెత్తి
విలపించాడు
గజరాజు మొర శ్రీమహా విష్ణువు చెవిని పడింది. అప్పుడా పురుషోత్తముడు అల వైకుంఠ పురంలో రమా దేవితో క్రీడావినోదియై
ఉన్నాడు. గజేంద్రుని మొర ఆలకించాడు. ఆ
భక్త జన రక్షకుడు వెంటనే కదిలాడు. లక్షీ దేవికి మాట మాత్ర మయినా చెప్ప
లేదు.ఆయుధాలయిన శంఖ చక్రాలను చేతులలోకి తీసుకో లేదు.సేవకులనూ.గరుడ వాహనాన్ని పిలువ
లేదు.జారి పోయిన జుట్టు ముడిని సవరించుకో లేదు. చివరకి చేతిలో ఉన్న రమా దేవి పైట
కొంగును కూడా ఆ తొందరలో విడిచి పెట్ట లేదు.! పోతన గారి ఆంధ్ర మహా భాగవతం గజేంద్ర
మోక్షణం లోని ఈ ఘట్టం లోనిదే మీది పద్యం ! కరి రాజును కాపాడడానికి బయలు దేరిన హరి వెంట
లక్ష్మీ దేవి,రాణివాసం, శంఖ చక్రాది ఆయుధాలూ,నారద విష్వక్సేనులూ, మొత్తం వైకుంఠమే
కదిలి వచ్చిన దృశ్యాన్ని కనుల ముందు మత్తేభ వృత్తంలో సాక్షాత్కరింప చేసిన మధుర మనోహర మయిన కల్పన యిది !
మానవ ప్రయత్నం విఫలమైన చోట దైవ
సహాయం భక్తులకు తప్పక లభిస్తుందని చెప్పే కథ గజేంద్రమోక్షణం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి