మ. వడుగా ! యెవ్వరి వాఁడ? వెవ్వఁడవు?
సంవాస స్థలం బెయ్య? ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్;
గడు ధన్యాత్ముఁడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
గడతేఱెన్ ! సుహుతంబులయ్యె శిఖులుం ! గల్యాణ మిక్కాలమున్.
భావం: ఓ బ్రహ్మచారీ !నీ పేరేమిటి? ఎవరి
కుమారుడవు? నీ నివాసం ఎక్కడ?నీ రాక వల్ల నా వంశం, జన్మ ధన్యమయ్యాయి. నేను
చేస్తున్న ఈ యాగం కృతార్ధ మయింది. నా కోరికలు నెర వేరాయి.అగ్నులు చక్కగా వ్రేల్చ
బడ్డాయి.( దేవతలకు సమర్పించ బడిన
హవిస్సులు సఫల మయ్యాయి) ఈ సమయం మిక్కిలి శుభప్రదం!
రాక్షస ప్రభువైన బలి చక్రవర్తి ఆడి తప్పని వాడు. సద్ధర్ముడు అమరావతి నుండి
దైత్య కులానికి శత్రువయిన ఇంద్రుడినీ ఇతర దేవతలనూ వెళ్ళ గొట్టాడు.ముల్లోకాలకు
ప్రభువయ్యాడు.దేవతలకు చేటు కాలం దాపురించింది. దేవతల తల్లి అదితి వారి దురవస్థను చూడ లేక పోయింది. భర్త కశ్యప
ప్రజాపతి సూచన మేరకు శ్రీహరిని ధ్యానించింది. ఆమె ప్రార్ధన మన్నించి బలిని
సంహరించి దేవతలను కాపాడడానికి శ్రీహరి ఆమె
గర్భాన వామనుడై జన్మించాడు.తండ్రి
కశ్యపుడు వామనునికి వడుగు చేసాడు.ఆ సందర్భంగా వటువుకి సూర్యుడు గాయత్రినీ, బృహస్పతి జంద్యాన్నీ,కశ్యపుడు
ముంజ దర్భల మొల త్రాడునీ,అదితి కౌపీనాన్నీ,భూ దేవి నల్లని జింక చర్మాన్నీ,దండాన్ని
చంద్రుడూ, గొడుగును ఆకాశమూ,బ్రహ్మ కమండలాన్నీ, సరస్వతి జపమాలనూ, సప్తర్షులు
దర్భలనూ ఇచ్చారు! భిక్షాటనకు వటువుకి అన్నీ అమిరాయి !
ఆ పిమ్మట వటువయిన వామనుడు బలి
చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. బలి వామనుని భక్తితో సత్కరించి, కుశల ప్రశ్నలు అడిగిన
ఈ పద్యం పోతన భాగవతంలోని వామనావతార ఘట్టం లోనిది.
బలి ఇవ్వ జూపిన సకల భోగోపకరణాలనీ కాదని
మూడడుగుల నేల దానమిమ్మని వామనుడు కోరాడు. అదే తనపాలిట బ్రహ్మాండమని పలికాడు ! రెండడుగులతో
భూనభోంతరాలను ఆక్రమించాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా మహా దాత
అయిన దైత్య రాజు మూడో అడుగు తల దాల్చి వటువు చేత పాతాళానికి అణచి వేయబడ్డాడు. ఆ దాన వైభవం అపూర్వం ! అజరామరం . అనితర సాధ్యం !
‘‘ కారే రాజులు ...’’, ‘‘ ఆదిన్
శ్రీసతి కొప్పుపై ..’’ ‘‘ ఇంతింతై వటుడింతయై ...’’, ‘‘ రవి బింబంబుపమింప ..’’
మొదలయిన పద్యాలతో పోతన గారి భాగవతంలో వామనావతార ఘట్టమంతా ఒక తేనె వాక లాగ మధురాతి
మధురం ! రస బంధురం ! తెలుగు వారి భాగ్య వశాన పోతన కవి ప్రసాదించిన కవితా స్వాదు
ఫలం !
1 కామెంట్:
కామెంట్‌ను పోస్ట్ చేయండి