చం. మును మునుఁబుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే
డెనిమిది నాళ్ళ పాటి గలఁడింతియ పూరియ మేయ నేరఁడేఁ
జని కడుపార చన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
మ్మని సుకృతంబు గట్టి కొనవయ్య దయా గుణ ముల్లసిల్లఁగన్.
భావం: నిన్న గాక మొన్న నాకొక ముద్దుల కుమారుడు పుట్టాడు. వాడు పుట్టి ఇంకా ఏడెనిమిది రోజులు కాలేదు. ఇంత గడ్డి కూడ తిన లేడు.నేను ఇంటికి పోయి వాడికి కడుపు నిండా పాలిచ్చి ఇక్కడున్నట్టుగా వేగంగా వచ్చేస్తాను. దయతో నన్ను పోయి రమ్మని పుణ్యం కట్టుకోవయ్యా పులి రాజా!
‘‘అవు – పులి’’ కథ చెప్పని పెద్దలూ, వినని బిడ్డలూ తెలుగు నాట ఏ ఇంట్లోనూ ఉండరు. ఈ కథని అనంతామాత్యుడు భోజరాజీయం లో పద్య రూపంలో చాలా ఆర్ద్రంగా వ్రాసాడు.. ఈ కథా కావ్యంలో మూడు పెద్ద కథలూ, మరెన్నో ఉప కథలూ ఉంటాయి. అనంతుడు ఇదే కాక, రసాభరణం అనే ఆలంకారిక గ్రంథమూ, ఛందో దర్పణం అనే ఛందో గ్రంథమూ కూడా వ్రాసాడు.
ఒక అడవిలో మేతకు వెళ్ళిన ఒక ఆవు దారి తప్పి పోయింది. ఒక పెద్ద పులి ఎదురు పడి, దానిని తిని వేస్తానంటుంది. ఆకొన్న వారికి ఆహారం పెట్టడం కన్నా పుణ్యం లేదని, పులికి ఆహార మవడానికి సిద్ధ పడుతుంది ఆవు. కాని, ఒక్క సారి ఇంటికి పోయి, ఏడెనిమిది రోజుల వయసున్న తన బడ్డకు కడుపు నిండా పాలిచ్చి రావడానికి అనుమతి కోరింది. అంతే కాదు, ‘‘ ఈ ఉదయం పాలిచ్చి వచ్చాను. నా బిడ్డ అటూ, యిటూ గెంతులు వేయడంతో ఆ పుడిసెడు పాలు ఈపాటికి అరిగి పోయి ఉంటాయి. ఇప్పుడు వాడి కేది దారి?’’ అని దిగులు చెందింది. ‘‘ గుమ్మెడు పాలు నా బిడ్డకి తృప్తి నిచ్చి వాడి ఆకలి తీరుస్తాయి. నా ఒంట్లో మాంసం అంతా తిన్నా సరే, నీ జఠరాగ్ని చల్లారదు. కనుక ఇందులో మొదట చేయ దగిన పని ఏదో నీకు తెలయదా ! అన్నా! పులి రాజా! నన్ను పోయి రమ్మను. ఇలా వెళ్ళి అలా వస్తాను’’ అని కూడా ప్రార్ధించింది. ఆ మాటలతో కూడ పులి మనసు కరగ లేదు. గోవుని చూసి అపహాస్యం చేసింది. ‘‘ నన్ను బేల్పరచి, నీ కొడుకు దగ్గరకి పోయి, నేను తినేస్తానని తెలిసి కూడా తిరిగి వస్తావా ?! చెప్పే వారు ఎన్నయినా చెబుతారు. వినే వారికి వివేకం ఉండొద్దూ !’’ అని వెక్కిరించింది. ‘‘ అడవిలో ఉన్నంత మాత్రం చేత పులి అంత తెలివి మాలిన దనుకున్నావా !’’ అని కూడ నిష్ఠర మాడింది. అప్పుడు ఆవు తన మాట నమ్మమని ఎన్నో ఒట్లు పెట్టి మరీ చెప్పింది. మాట జవదాటితే తనకు ఎలాంటి దుర్గతి పడుతుందో చెప్పింది. ఎలాగయితేనేం చివరకి పులి అంగీకరించి ,ఆవును సత్వరమే తిరిగి రమ్మని పంపించింది. సత్య నిష్ఠ గల ఆవు ఆడిన మాట తప్ప లేదు! బిడ్డకి పాలిచ్చి, నీతులు చెప్పి, పులి దగ్గరకి తిరిగి వచ్చి, తనని తిని, ఆకలి చల్లార్చు కొమ్మంది. విభ్రమం కొలిపే ఆ సత్య సంధతకి నివ్వెర పోయిన పెద్ద పులి ఆవుని శ్లాఘించి, విడిచి పెట్టింది!
సత్య వాక్కుకి ఉన్న శక్తి అలాంటిది మరి ! ఈ కథ ప్రతిపాదించే విశ్వజనీన మయిన నీతి అదే !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి