26, నవంబర్ 2019, మంగళవారం

మీ వాడితో మేం ఇక పడలేం తల్లీ ..



మత్త.   పుట్టి పుట్టఁడు నేఁడు దొంగిలఁబోయి మా యిలు సొచ్చి తా
           నుట్టి యందక రోళ్ళుఁబీటలు నొక్క ప్రోవిడి యెక్కి చే                           
            వెట్టఁ జాలక కుండ క్రిందొక తూఁటొనరించి మీ
             పట్టి మీఁగడ పాలుఁ జేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ !


భావం: అమ్మా, యశోదమ్మా ! ఏం పిల్లడమ్మా, మీ పిల్లడు ! నిన్న గాక మొన్న పుట్టాడో, లేదో, దొంగ తనాలు మొదలు పెట్టాడు !ఇవాళ మా ఇంట జొరబడ్డాడు. ఉట్టి అందక, రోళ్ళు, పీటలు ఒక దాని మీద ఒకటి పేర్చి వాటి మీద ఎక్కి అందుకోవాలనుకున్నాడు. వాడలా చేస్తాడని ఊహించి,ఉట్టి అందకుండా ఎత్తుగా కట్టేం. కన్నయ్యకి ఉట్టిలో చేయి పెట్టడం సాధ్యం కాలేదు. ఇక లాభం లేదనుకున్నాడేమో, కిందనుంచే  కుండకు పెద్ద చిల్లు పెట్టి, మీగడ పాలను దోసిళ్ళతో పట్టి త్రాగాడు !

      చేత వెన్న ముద్దతో,బోసి నవ్వులు చిందిస్తూ బంగురుతూ ఉండే కన్నయ్య వర్ణ చిత్రం తెలుగు లోగిళ్ళలో ఒక అపూర్వ ఆకర్షణ. పసి బిడ్డలున్న ఇంట, చిన్ని కృష్ణుడితో తమ బిడ్డను సరి పోల్చుకుని మురిసి పోని తల్లి దండ్రులూ ఉండరు. వెన్న దొంగ దుడుకు చేష్టలను పోతన మహా కవి తన ఆంధ్ర మహా భాగవతం దశమ స్కంధంలో కమ్మని పద్యాలలో పటం కట్టి  పద్యరూప వర్ణ చిత్రాలుగా ఆవిష్కరించేడు.!

     నల్లనయ్య అల్లరి చేతలు చూసి వ్రేపల్లె లోని ఇళ్ళాళ్ళకు ఓర్పు నశించి పోయింది. అంతా కలసి కట్టుగా నందుని యింటికి వచ్చి యశోదమ్మతో పిల్ల వాని ఆగడాలను ఏకరువు పెట్టారు. నల్లనయ్య బాల్యక్రీడలన్నీ అతని లీలా విలాసాలే !    ‘‘బాలురకు పాలు లేవని బాలింతలు మొత్తు కుంటూ ఉంటే,  నీ బిడ్డ లేగల త్రాళ్ళు విప్పి ఆవుల దగ్గరకి వదిలేస్తూ ఉంటాడు. చక్కగా కాగిన పాలను తన నేస్తాలకు పోస్తాడు. అంతటితో ఊరుకోకుండా కడవలు పగుల కొట్టి మరీ జారుకుంటాడు! ఎప్పుడు ఇంట్లో జొరబడతాడో, పాలు, వెన్న దొంగిలించి ఎప్పుడు బయటకి మాయమవుతాడో తెలియదు. వెళ్తూ వెళ్తూ , యింత వెన్నను నిద్ర పోతున్న కోడలి మూతికి రాస్తాడు. దానితో అత్త కోడలిని దండిస్తుంది.అలాగే పాలూ, నెయ్యీ జుర్రుకున్నాక పగుల కొట్టిన కడవలను  ప్రక్కనున్న యిళ్ళలో పడేసి పోతాడు. దానితో యిరుగు పొరుగులకి తగువులే, తగువులు . ఆ గదులకు భద్రంగా తాళాలు వేస్తే, వేసిన తాళాలు వేసినట్టే ఉండేవి. నీ కొడుకు లోపల నాట్యం చేస్తూ ఉన్నాడమ్మా! కడవలు అందకుండా ఉండడం కోసం మా యిళ్ళలో ఉట్లు ఎత్తుగా కట్టి ఉంచేం. అయినా ,పీటలు, రోళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి అందుకోవాలని చూస్తాడు. అది వీలు కాకపోతే కడవలకి తూట్లు పెట్టి పాలూ, వెన్నాత్రాగేస్తున్నాడు. యశోదమ్మా, యింక మా ఇళ్ళలో నీ కుమారుడు పాలూ పెరుగూ ఉండ నివ్వడు. ఎక్కడికయినా వెళ్ళి పోతాం. నంద ప్రభువుల వారి ఆవుల మీద ఆన !’’  అని గోపికలు వాపోయేరు.
ఇంత చెప్పినా యశోదమ్మ కన్నయ్యనే వెనకేసు కొచ్చింది !  చనుబాలు త్రాడం వదలని తన పసి బిడ్డపై నిందలు వేయ వద్దని బ్రతిమాలుకుంది.    

 మాతృత్వపు మాధుర్యానికి  ఆకాశమే హద్దు మరి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి