27, నవంబర్ 2019, బుధవారం

అలకల కొలికి...


ఉ.  మాసిన చీర గట్టికొని మౌనముతోడ నిరస్త భూషయై
      వాసెనకట్టు గట్టి నిడువాలిక కస్తురిపట్టు వెట్టి లో
       గాసిలి చీకటింటికడ కంకటిపై జలదాంతచంద్ర రే
       ఖాసదృశాంగి యై పొరలె గాఢమనోజవిషాద వేదనన్.

భావం: ( కోపించిన సత్యభామ ) మాసిన చీర కట్టుకుంది. ఒంటి మీది నగలన్నీ తీసి వేసింది.తలకి  గుడ్డ కట్టుకుంది. నుదుట దట్టంగా కస్తూరిపట్టు పెట్టింది. మేఘాల చాటున చంద్ర రేఖలా తీవ్ర మయిన మన్మథ వేదనతో చీకటి గదిలో మంచం మీద  అలవిమాలిన దుఃఖంతో, బాధతో దొర్లింది.

   ఈ పద్యం నంది తిమ్మన పారిజాతాపహరణం ప్రబంధం లో  సత్య భామ కోపగృహంలో ప్రవేశించిన ఘట్టం లోనిది. కోపం వస్తే అయినింటి ఇల్లాళ్ళు అందరూ ఏం చేస్తారో, ఈ రాణి వాసపు  స్త్రీరత్నం  సత్య భామ కూడా అదే చేసింది! మాసిన చీర కట్టుకుంది. నగలన్నీ తీసేసింది. తలకి గుడ్డ చుట్టుకుంది. శిరో వేదనకి  వేసుకునే కస్తూరి పట్టు వేసుకుంది. చీకటి గదిలో మంచం మీద అశాంతిగా దొర్లింది !

      సత్య కోప కారణానికి ముందు చాలా గ్రంథమే నడిచింది. శ్రీకృష్ణుడు తన పట్టపు రాణి రుక్మిణి ఇంట ఉండగా, కలహభోజనుడు నారదుడు పారి జాత పుష్పాన్ని తెచ్చి ఇచ్చాడు. అంతటితో ఊరు కోక, నచ్చిన చెలికి ఇమ్మన్నాడు. కృష్ణుడు ఇరుకున పడ్డాడు !  సత్యకి తెలిస్తే ఏమవుతుందో అని శంకిస్తూనే, రుక్మిణికి ఇచ్చాడు. రుక్మిణి ఆనందంగా దానిని అందుకుంది. ఇక నేం ! తగవులమారి  నారదుడు సవతుల మధ్య అగ్గి రాజేసే మాటలు చాలా అన్నాడు.ఆ పారిజాత పుష్పం ఎన్నటికీ వాడదనీ. సువాసన వీడదనీ చెప్పాడు. కృష్ణుడు  దానిని రుక్మిణికే ఇవ్వడంతో సవతులలో  అతనికి ఆమె పట్లనే అనురాగం ఎక్కువ అని తెలుస్తోందన్నాడు. ఇక సవతులందరూ ఆమెకు దాసీ లవడం ఖాయం అన్నాడు. అంతటితో ఊరుకున్నాడా ! శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడనే మాట కల్ల అని దీనితో తేలి పోయిందని కూడా అన్నాడు !

  ఇంకే ముంది !  ఒక చెలికత్తె ద్వారా ఈ మాటలన్నీ సత్యచెవిని పడ్డాయి . ఆమె కర్ర దెబ్బతిన్న పామే అయింది. నెయ్యి పోస్తే భగ్గున మండే అగ్ని కీలలా లేచింది! భర్త అనాదరం చూపితే అభిమానవతులలో వచ్చే కళ్ళు ఎర్రబడడం,గొంతు బొంగురు పోవడం వంటి  శారీరక మార్పులన్నీ వచ్చేయి. తటాలున పడకటింటికి చేరింది. మాసిన చీర కట్టుకోడం, నగలు తీసి పారెయ్యడం,తలకి గుడ్డ బిగించడం,కస్తూరి పట్టు పెట్టుకోడం, మంచం మీద ఆశాంతిగా దొర్లడం, ఇవన్నీ కోప గృహం వాతావరణాన్ని మరింత వేడెక్కించేవే!  చివరకి రానే వచ్చేడు కృష్ణుడు.  అనునయ వాక్యాలతో ఆమెను ఓదార్చాలని చూసేడు. చివరకు ఆ జగన్నాటక సూత్రధారి ఆమె పాదాల మీద తల వాల్చి మ్రొక్కాడు! బ్రహ్మాది  దేవతలచే పూజింప బడే ఆ శిరస్సును  సత్య ఎడమ కాలితో తన్నింది.
నాథుల అపరాధాన్ని సహించని స్త్రీలు ప్రణయ కోపంలో ఉచితానుచితాలు చూస్తారా !

         ఈ సరస శృంగార కావ్యం అంటే తెలుగు వారికి ఎంత మక్కువో చెప్పలేం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి