24, డిసెంబర్ 2019, మంగళవారం

ఇవి ఉంటే అవెందుకు ?



                                                              


నిన్నటి దినం ఏవి ఉంటే ఏవి శోభిస్తాయో చూపాం.  ఇవాళ ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఛూదాం...

అవి ఉంటే, ఇవి అక్కర లేదు

క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?

ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఒక కవి ఈ శ్లోకంలో చక్కగా వివరించాడు. చూడండి ...

ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.
( ఆ సహనమే అతనిని కాపాడుతుంది.)

కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.
( ఆ కోపమే అతడిని నాశనం చేస్తుంది.)

దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు.
 ( ఆదాయాదులే మన కొంపకి చిచ్చు పెడతారు.)

మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు( వారే మనని మంచి మార్గంలో నడిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆలోచనలు అందిస్తారు)

దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పనేముంది ?
( వాళ్ళే పాముల వంటి వారు)

మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు ఎందుకు ?
 ( విద్యా ధనమే తరగని సంపద కదా)

లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు ఎందుకు ?
 ( సిగ్గే కదా చక్కని సింగారం?)

కవితా శక్తి కల వారికి వేరే రాజ్యమెందుకు ?
 ( రాజ్యభోగం కన్నా కవితా శక్తి గొప్ప కీర్తిదాయకం కదా)

.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి