బాగుందా ? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాగుందా ? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జులై 2015, గురువారం

నవ్వి పోదురు గాక !



కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.

ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.

అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !

అలాంటివాటిని కొన్నింటిని చూదాం !

వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:

ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.

‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.

మరొకటి -

కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !

మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!

భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:

ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.

ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:

గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:

అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:

కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:

పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:

అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం

తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .


మరొకటి చూడండి:

తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి

కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !

చివరగా ఇంకొకటి ...

క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:

ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.







7, జులై 2015, మంగళవారం

మా వెటకారపు వేంకటేశ్వర్లు మీకు తెలీదూ ?!



మా వెటకారపు వెంకటేశ్వర్లుని మీకు పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందు కంటే, వాడికి మామ్మూలుగా మాట్లాడడం తెలీదు. మాట మాటకీ ఏదో వెటకారం దొర్లాల్సిందే.

వాడి ఆహార్యం లోనూ, అహారపు టలవాట్ల లోనూ కూ డా వెటకారమే.
గొట్టాం ఫేంట్ల ఫేషను పోయేక , వాడు గొట్టాం పేంట్లు కు ట్టించుకుని మరీ తిరుగుతాడు.
ఏనుగు చెవుల కాలర్లు పోయేక , వాడు ఏనుగు చెవుల కాలర్లున్న పర్టులు కుట్టించుకుని తిరుగుతాడు.
అలా కుట్టడానికి  నసుగుతూ ఏ టైలరయినా, ‘‘ ఇప్పుడవి ఫేషను కాదండీ! ’’ అంటే, ‘‘నీకు చేత కాక పోతే చెప్పు, మరొకడితో కుట్టించు కుంటాను ’’అని దబాయిస్తాడు.
ఇక భోజనం చేసే విషయంలో కూడా, పంక్తిలో కూచుంటాడా. ముందుగాపెరుగు తే, కలుపు కుంటానంటాడు. ఆ తరువాతే కూరా, పులుసూ. పప్పూనూ.
అప్పడాలో డజను వేయించుకుని, అరచేత్తో వాటిని  ముక్కలయ్యేలా చిదిపి. నవ్వుతూ ‘‘ ఈ చప్పుడు విన్నారూ ? ’’ అంటాడు.
వాడి  వెటకారాల సెగ వాడి పెళ్ళానికి కూడా బాగా తగిలింది.
కాళ్ళకి రెండు రకాల చెప్పు లేసుకోమని సలహా ఇస్తాడు. ఒకటి హైహీల్సూ, మరొకటి మామూలుదీ. అలాగయితే ఎత్తు పల్లాలున్న చోట బ్యాలెన్సు సరిపోతుందంటాడు !
కుడి పైట వేసుకుని తిరగమంటాడు. పువ్వులు కొప్పులో కాదు, చెవిలో పెట్టుకుంటేనే ఆడవాళ్ళకి అందం అంటాడు.
ఈ తిక్క మనిషితో వేగ లేక ఆవిడ కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి పోయింది కూడానూ.
అలాగని వాడికి పిచ్చేమీ కాదు.  లోకంలో అందరూ నడిచే దారిలో నడిస్తే మన విలువేంటని వాడి వాదన. ( దీనికే మారు పేరు పిచ్చి కాబోలు )

ఇక వాడి మాట తీరు ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చెబుతాను :
 ‘‘ ఏఁవండీ ఈ నెల జీతాలు అందేయా ? ’’ అని సమోద్యోగి ఎవడయినా అడగడం పాపం, ‘‘నా జీతమే అందింది. నీజీతమే నాకు అంద లేదింకా ’’అంటాడు.
‘‘ మీ పిల్లలేం చదువుతున్నారండీ ’’ అని ఎవరయినా అమాయక చక్రవర్తి అడిగితే, టక్కున ‘‘ పుస్తకాలు’’ అని ముక్త సరిగా జవాబిస్తాడు.
‘‘అది కాదు ! .. ... ఏం చదువుతున్నారూ ? ’’ అని రెట్టించి అడిగితే, ‘‘ క్లాసు పుస్తకాలు .. అప్పుడప్పుడు  నవలలూ, వార పత్రికలూనూ ’’ అని వాడి నుండి జవాబొస్తుంది.
‘‘ఏఁవండీ .. ఫలానా సినిమా చూసారా ? ఎలా ఉంది ?’’ అనడిగితే, ‘‘ తెలుగులోనే ఉంది ’’ అని జవాబు చెబుతాడు
‘‘ ఇవాళ మీ ఇంట్లో కూరేం చేసారూ ’’ అని ముచ్చట పడి అడిగితే ‘‘ తిన్నాం !’’ అంటాడు ముక్తసరిగా.

కూరల కోసం, కిరాణా సామాన్ల కోసం బజారు కెళ్తూ, ‘‘ ఏమేవ్ ! అలా ఆకాశానికెళ్తా కానీ, వో బస్తాడు డబ్బులు నాముఖాన తగలెయ్యి ! ’’ అని పెళ్ళాన్ని కేకేస్తాడు.
అదేఁవిటండీ చోద్యం ! అని ఆవిడ విస్తుపోతే ..
‘‘ అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయిట కదే ... అందుకే మరి బజారంతా అక్కడే ఉంటుంది కాబోలునే ’’ అంటాడు.
బయటికి వెళ్ళేటప్పుడు కూడా, ‘‘ ఏఁవే, అలా తిరిగొస్తాను కానీ, తలుపు తీసుకుని ఏడువ్ .. ఏదొంగ వెధవయినా చొరబడాలి కదా ’’ అంటాడే తప్ప, తలుపు వేసు కొమ్మని జాగ్రత్తలు  మాత్రం  తిన్నగా చెప్పడు !
పెళ్ళాం ఎప్పుడయినా వాడితో  ‘‘ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాటండీ ! వెళ్దాం ! ’’ అని ముచ్చట పడి  అడిగితే,  వెళ్దాం కానీ,  పక్కకింటి ముస్లిం స్నేహితురాలి నడిగి బురఖా తెమ్మంటాడు.
ఎందుకండీ అంటే ‘‘ కుటుంబ సమేతంగా చూడతగిన తెలుగు సినిమాకెళ్తున్నాం కదా, ,, హాల్లో ఎవరయినా గుర్తు పడితే బావుండదు !’’ అని వెటకారాలు పోతాడు.
‘‘ పిచ్చాసుపత్రి నంబరు డైరీలో ఉందో లేదో చూసుకోవే, పనికొచ్చేలా ఉంది ’’  అంటాడోసారి.
‘‘ఎందుకండీ ?’’ సందేహంగా అడుగుతుంది భార్య.
‘‘ యువ కవి వొహడు ఉదయాన్నే తన కవితల పుస్తకంతెచ్చి చదవమని ఒకటే నస ...చదవాలి ..  తరవాత నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఏఁవిటో’’ అని నిట్టూరుస్తాడు.
‘‘ నా రచనలు కాస్త చదివి పెడతారూ ?’’ అని ఏ అర్భకుడయినా అడిగితే,
‘‘ చదవను ! కానీ  ( ప్రక్కన ) పెడతాను.’’ అంటాడు దురుసుగా.

‘‘ పెళ్ళి కెళ్ళొచ్చేరుగా ! ఎలా జరిగిందేఁవిటి ’’
‘‘సవ్యంగానే జరిగిందనుకుంటున్నాను .... ఎందుకంటే, పెళ్ళి కొడుకు  పెళ్ళి కూతురు మెడలోనే మంగళ సూత్రం కట్టేడు ’’
వీడి వెటకారాలు మామ్మూలుగా తెలిసిన వాళ్ళతోనే కాదు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా అందరితోనూ ఇలాగే మాట్లాడుతాడు !
ఓ సారి  తెలిసిన డాక్టరు దగ్గరి కెళ్ళాడు. ఆయనతో మన వాడికి కొంచెం ఎక్కువ చనువు కూడా ఉంది లెండి
‘‘ఏఁవయ్యా డాక్టరూ !  వారం నుండీ వొకటే జలుబు !  నువ్వే వైద్యం చెయ్యలి ... చెప్పు, పీ.ఎఫ్ లోను పెట్టమంటావా ? పొలం అమ్మమంటావా ’’ అనడిగేడు.
 ( దానితో తిక్క రేగిన ఆ డాక్టరు వాడి జబ్బ అందుకుని నెల్లాళ్ళ వరకూ తగ్గకుండా ఉండేలా వో ఇంజక్షను పొడిచీసేడనుకోండి ! )

ఇదీ మనవాడి వెటకారపు గోల.

కొస మెరుపు :
‘‘ నీ పద్దతి మార్చుకోవయ్యా ... యిదేం బాలేదు .. ఇంతకీ ఇలా వెటకారంగానూ, పిచ్చ పిచ్చగానూ మాట్లాడడం నీకు చిన్నప్పటి నుండీ ఉందా ? ఈ మధ్య మొదలయిందా ? ’’ అనడిగేను, జాలిగా, వాడిని సంప్కరించే సదుద్ధేశంతో.

 వాడు దీనంగా ముఖం పెట్టి అన్నాడు :  ‘‘ మొదటి నుండీ లేదండీ ! ... మీ కథా మంజరి బ్లాగు టపాలు చదివిన తరువాత నుండీ నండీ ... ’’ అన్నాడు వినయంగా.

ఈ సందర్భంగా నాకు మన కవుల  చమక్కు సంభాషణలు కొన్ని గుర్తుకొస్తున్నాయి.
పనిలో పనిగా అవి కూడా చూదాం !
‘‘ ఏఁవండీ ఎక్కడికి బయలు దేరారూ ... ఊరికా ! ’’
‘‘ అవును. ఊరికే.’’
***       *****     ****    ****   ****   *****   ****   ****
‘‘ ఈ రోడ్డెక్కడికి పోతుందీ ? ’’
‘‘ ఎక్కడికీ పోదు ! నాచిన్నప్పటి నుండీ చూస్తున్నాను . ఇక్కడే ఉంది !‘’
***   ****     *****     *****     *****    *****   ****
‘ రామయ్య గారిల్లెక్కడండీ ?’’
‘‘ ఆయనకేం పనీ ! పైగా పెద్ద మనిషి కూడానూ !’’
****                 ******                      *****                       *****
సర్వరూ! ఈ కాఫీలో బొద్దింక పడి నట్టుంది చూడూ ... కాఫీకే డబ్బులిస్తాను. బొద్దింకకు ఇవ్వను సుమీ.’’

*******              *******                      *******                  ******
‘‘నా కవిత్వంలో మరి కొిన్ని నిప్పులు కక్కమంటారా  టారా ? ’’ యువ కవి అడిగేడు.
‘‘ వద్దు. నీ కవిత్వాన్నే నిప్పుల్లో కుక్కు’’ మహా కవి సలహా.



6, జులై 2015, సోమవారం

చిట్టి పాప రాసిన పొట్టి కథ !



దొంగ గారు

మ్మ కథలు చెబుతుంది. అమ్మమ్మ కథలు చెబుతుంది. తాతయ్య కథలు చెప్పడమే కాదు చక్కని చిన్న చిన్న పద్యాలూ, శ్లోకాలూ కూడా చెబుతాడు. నాన్న కథలు చెప్పరు, కానీ, కథలు రాస్తారుట ! నేను చదవ లేదనుకోండి ... పెద్దయితే చదువుతానులే.

అంచేత, నాకూ కథ రాయాలనిపించింది. వెంఠనే పెన్సిలు తీసుకుని నోటు పుస్తకంలో గబగబా రాసీసేను.

కథ పేరు : దొంగ గారు

అనగనగనగా నేమో ఒక ఇల్లు. అందులో అమ్మా, నాన్నా, అక్కా, నేనూనూ.

ఒక రాత్రేమో అమ్మా వాళ్ళింటికి, అంటే మా ఇంటికే లెండి ఒక దొంగ గారు వచ్చేరు. అంతా బజ్జుని ఉన్నాం.

దొంగ గారు మా ఇంటిలో డబ్బూ బంగారఁవూ అదీ పట్టుకు పోడానికి వచ్చేరన్న మాట.

అందరం లేచి దొంగ గారిని చూసేం. దొంగ గారు కూడా మమ్మల్ని చూసేరు.

‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మా ఇంటిలో కొంచెమే డబ్బు లున్నాయి. మా చిట్టికి పుస్తకాలూ, రంగు పెన్సిళ్ళూ అవీ కొనాలి. మా డబ్బులు పట్టుకు పోవద్దండీ ’’ అని, నాన్న దొంగ గారితో అన్నారు.

అమ్మేమో, ‘‘ చిట్టి పాపకి బోర్నవిటా, నూడిల్సూ, పుట్టిన రోజుకి బుట్టల గవునూ అవీ కొనాలి. మా కొంచెం డబ్బుని మీరు పట్టుకు పోవద్దూ ’’ అనంది.

అక్కేమో,‘‘ చిట్టి పాపకి రిబ్బన్లూ, జడ పిన్నులూ కొనాలి. మా ఇంట్లో కొంచెమే డబ్బులున్నాయి. తీసుకు పోవద్దూ, ప్లీజ్ !’’ అంది.

దొంగ గారు విన లేదు. ‘‘ మా చిన్నబ్బాయికి బువ్వ పెట్టాలి. నా దగ్గర డబ్బుల్లేవు. అందుకే మీ కొంచెం డబ్బుని తీసుకు పోతాను’’ అన్నాడు కోపంగా.

అప్పుడు నేనేమా ధైర్యంగా దొంగ గారి దగ్గరకి వెళ్ళి, ‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మరేమో, మా అమ్మ రోజూ దేవుడికి పూజలు చేస్తే, దేవుడు మాకు కొంచెం డబ్బులు యిచ్చేడు. ఇంకా ఎక్కువ పూజలు చేస్తే యింకా ఎక్కువ డబ్బులు యిస్తాడన్న మాట.

మరందు చేత మీరు కూడా ఆంటీకి చెప్పి దేవుడికి ఎక్కువ పూజలు చేయమని చెప్పండి. దేవుడు మీకూ బోలెడు డబ్బులు ఇస్తాడు. మా కొంచెం డబ్బులు ఇప్పుడు తీసుకు పోకండేం ... దేవుడు మీకు చాలా డబ్బులు యిచ్చేక ఆంటీకీ,తమ్ముడికి మంచి బువ్వ పెట్టొచ్చును. మీరు కూడా ఈ మురికి బట్టలు మానీసి మంచి బట్టలు కుట్టించుకో వచ్చును...’’ అన్నాను.

దొంగ గారు నాముఖంలోకి చూసి, నా దగ్గరకొచ్చి. నాబుగ్గ మీద ముద్దు పెట్టీసుకున్నారు.

మరింక మా కొంచెం డబ్బులు తీసుకు పోకుండానే వెళ్ళి పోయేరు.

****** ***** ***** ***** ***** ***** *****

నాన్న నేను రాసిన ఈ కథ చదివి, అమ్మకు చూపించేరు. అమ్మ కూడా చదివింది. ఇద్దరూ ఎందుకో చాలా సేపు పడి పడి నవ్వేరు.

తరవాత నాన్న అన్నారూ : ‘‘ కథ బావుందమ్మా ,,, కానీ దొంగని దొంగ గారూ, దొంగ గారూ అని ఎందుకు రాసేవు. దొంగ  అనో, దొంగ వెధవ అనో రాయొచ్చు కదా ? అలా   రాయలేదేం ?’’ అనడిగేరు.

అందుకు నేను చెప్పేనూ : ‘‘అమ్మో ! నాకు బయ్యం ! ...’’



4, జులై 2015, శనివారం

హెచ్చరిక ( చెడి పోతావురోయ్ ! సర్వ నాశనమైపోతావ్ )



లోకంలో ప్రతి దానికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒకటి జరిగిందంటే దానికి తగిన కారణం ఏదో ఉండే ఉంటుంది.ఒక శ్లోకంలో భర్తృహరి ఈ విషయమై ఏం చెబుతున్నాడో చూడండి:

దౌర్మంత్ర్యా న్నృపతి ర్వినశ్యతి, యతి స్సంగాత్, సుతో లాలనాత్
విప్రో2నధ్యయనాత్, కులం కుతనయా, చ్ఛీలం ఖలోపాసనాత్
హ్రీ ర్మద్యా, దనవేక్షణాదపి కృషి: ప్రవాసాశ్రయాత్
మైత్రీ చా2ప్రణయాత, సమృద్ధి రనయాత్ , త్యాగాత్ ప్రమాదా ద్ధనమ్

దుర్మార్గడైన మంత్రి వలన రాజు నాశనమై పోతాడు.

స్నేహాల వలన యతి (సన్యాసి) చెడి పోతాడు. అంతే కదా, సర్వసంగ పరిత్యాగికి ఇతర సాంగత్యాలు తగవు కదా?

గారం చేయడం వలన పుత్రుడు చెడతాడు. అతిగారాబం అనర్ధ హేతువు.

వేదాధ్యయనం చేయక పోవడం వలన బ్రాహ్మణుడు సంకనాకి పోతాడు. వాడికి విహితమైన వేదాభ్యసనం చేయకుండా, నిగమశర్మకి తమ్ముడిలా అడ్డమైన తిరుగుళ్ళూ తిరిగితే ఏం బాగుపడతాడు లెండి ?

కుపుత్రుని వలన కులం నశిస్తుంది. కులానికో చెడ్డ కొడుకు పుడితే ఇహ చాలు, జనాలు ఆ కులాన్నంతా తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడతారు. ఒక విభీషణుడున్నా, రావణ కులానికి దూషణలు తప్ప లేదు కదా.

దుష్టులతో చెలిమి వలన శీలం నశిస్తుంది. అందుకే పెద్దలు నీ స్నేహితులని చూసి, నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చని అంటారు.

మద్యపానం చేత లజ్జ నశిస్తుంది. తాగుబోతుకి ఎగ్గూ సిగ్గూ ఎక్కడుంటాయి చెప్పండి ?

తరచుగా వెళ్ళి చూడని వ్యవసాయం తగలబడుతుంది. కాలు మీద కాలు వేసుకుని దర్జాలు ఒలక బోస్తే వ్యవసాయం పనులు కావు. కార్తె పోతే రాదు. అందుకే అదనెరిగి వ్యవసాయం పనులు చేయాలి.

దేశాంతరగమనం వలన స్నేహం చెడి పోతుంది. అంతే కదా, ఎప్పుడూ దేశాలమ్మట పట్టుకు తిరుగుతూ ఉంటే మిత్రులే కరువవుతారు.తరుచుగా పలకరింపులు ఉంటేనే కదా, స్నేహాలు నిలుస్తాయి?

కూరిమి చెడి పోతే మైత్రీభావం నశిస్తుంది. కూరిమి గల దినములలో నేరము లెన్నడును తోచవు. ఆ కూరిమి విరసమైతే ఎదుటి వాడిలో అన్నీ తప్పులే కనబడుతూ ఉంటాయని శతక కర్త చెప్ప లేదూ?

అవినీతిచే సంపదలు నశిస్తాయిట. ఇది కొంత విచార మూలకం.అడ్డూ ఆపూ లేని సంపదలు పోగు పడేది అవినీతి పనులు అధికంగా చేయడం వల్లనే కదా? కవి మరి యిలా అంటాడేం? అంటే అవినీతితో చేకూరిన సంపదలు ఒకనాటికి నశించక తప్పదని కాబోలు. ఎంతటి ధనాధికులూ పట్టువడి శ్రీకృష్ణ జన్మ స్థానం చేరు కోవడం ఇటీవలి కాలంలో చూడడం లేదూ?

దానం, ప్రమాదం - వీటి వలన ధనం నశిస్తంది. ప్రమాదం సరే, దానం చేయడం వలన సంపదలు నశిస్తాయిట. కన్నూ మిన్నూ కానక అపాత్రదానాలు చేస్తూ పోతూ ఉంటే చేతికి చిప్ప కాక మరేం మిగులుతుంది ?

కనుక, ఆయా సంబంధాలనీ, విషయాలనీ విడిచి పెడితే మంచిది. లేక పోతే నశించడం ఖాయం అని కవి హెచ్చరిస్తున్నాడు.



3, జులై 2015, శుక్రవారం

గుండెల్లో తగినంత తేమ ఉండడం లేదు !



మనం తరుచుగా అతిథి, అభ్యాగతుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా.
అతిథి అంటే తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అభ్యాగతుడు అంటే పర్వ దినాలలోను, భోజన కాలం లోను వచ్చే వాడు.
సరే, భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం యిచ్చారు. అతిథి సేవను నిష్ఠతో పాటించే వారు.

అతిథి సేవకు చెందిన కొన్ని మంచి మాటలు ఇక్కడ చూదామా?

అతిథిర్బాలక: పత్నీ, జననీ జనకస్తథా,
పంచైతే గృహిణ: పోష్యా , ఇతరే చ స్వశక్తిత:

అతిథులను, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను - ఈ ఐదుగురినీ గృహస్థు తప్పకుండా సేవించు కోవాలి. వీరిని నిష్ఠగా పోషించాల్సిన కర్తవ్యం ఇంటి యజమానిదే. ఇక తక్కిన వారినంటారా, యథా శక్తి పోషించ వచ్చును.

అయితే, కవి ఇక్కడ మరో విషయం కూడా హెచ్చరిస్తున్నాడు.

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా
ఏతే విత్తం న జానంతి, జామాతా చైవ పంచమ:

అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు ! అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా , లేక పోయినా తమకి సేవలు చేయించు కుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ , వేధిస్తూ ఉంటారుట.

అయినా, ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం.

అతిథిర్యస్య భగ్నాశో, గృహాత్ ప్రతి నివర్తతే
స తస్మై దుష్కృతం దత్వా, పుణ్య మాదాయ గచ్ఛతి.

అతిథి సేవను సక్రమంగా చేయని వాడికి ఎలాంటి ఫలితం ఉంటుందో కవి చెబుతున్నాడు.

ఎవరి ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో, ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు, తన యొక్క చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళి పోతాడు. అంటే, అతిథి సేవ చేయని వాడు మునుపు చేసికొన్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాక, కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టు కుంటాడని అర్ధం.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంసభక్షణమ్.

అతిథి వాకిట ఉండగా వానిని విడిచి పెట్టి గృహస్థు తాను ఒక్కడే భుజించడం మహా దోషం సుమా.
అలాంటి వారు అన్నం తినడానికి కూర్చుంటూ పట్టే ఔపోశనం సురాపానంతో సమానం. వాళ్ళు తినే అన్నం గోమాంసంతో సమానం.

మను చరిత్రలో పెద్దన గారి ప్రవరుని అతిథి సేవాతత్పరత ఎలాంటిదో చూడండి:

తీర్ధ సంవాసులే తెంచి నారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన

నేఁగి, తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు

నిచ్చి, యిష్టాన్న సంతృప్తులుగాఁజేయు
చేసి, కూర్చున్నచో చేర వచ్చు

వచ్చి, యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి
త్తీర్ధ మాహాత్మ్యముల్ తెలియ నడుగు

అడిగి యోజన పరిమాణ మరయు, నరసి,
పోవలయుఁజూడఁగా ననుచు నూర్పులు నిగుడ్చు
నను దినము తీర్ధ సందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరు ణాగ్ని హోత్రి

తీర్ధ యాత్రలకు పోతూ ఎవరయినా వస్తున్నారని వింటే చాలు, నిత్యాగ్ని హోత్రడైన ప్రవరుడు ఎంత దూరమైనా సరే , వారికి ఎదురుగా వెళ్ళి, పాదాభివందనం చేసి తన యింటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని వేడు కుంటాడు. వారిని తన యింటికి తోడ్చుకుని పోయి భక్తియుతంగా ఆతిథ్యం యిస్తాడు.ఇష్గ మృష్ఠన్నాలతో వారిని తృస్తి పరుస్తాడు. ఆతర్వాత వారి చెంత చేరి దేశ దేశాలలో ఉండే వింతలూ విశేషాలూ, పుణ్యతీర్ధాలూ వగైరాల గురించి అడిగి, తెలుసుకుని , ఓ సారి చూసి రావాలి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తాడు. అలా ఉండాలి , అతిథి సేవ అంటే.

భాగవతంలో రంతి దేవుని అతిథి సేవ ఎట్టిదో తెలిసినదే కదా

రంతి దేవుడు తన సంపదలన్నీ దాన ధర్మాదులకి సమర్పించి, నిరు పేదయై, భార్యా పిల్లలతోఎనిమిది దినాలు పస్తులు ఉన్నాడు. ఒక నాడు అతనికి దైవవశాన నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. భుజిద్దామని కూర్చున్నాడో, లేదో, ఒక అతిథి వచ్చేడు.

అతిథి భూసురుఁడొక్క డాహార మడగిన గడపక ప్రియముతో గారవించి

హరి సమర్పణ మంచు నన్నంబులో సగమిచ్చిన భుజియించి యేగె నాతఁ

డంతలో నొక శూద్రుఁడశనార్ధియై వచ్చి, పొడసూప లేదనబోక తనకు

నున్న యన్నము లోన నొక భాగ మిచ్చిన సంతుష్టఁడై వాడు సనిన వెనుక

కుక్క గమియు దాను నొక్కక డేతేర నా
యన్న శేష మిచ్చి, సన్నయమున
వాని మ్రొక్కి పంప వరుసతోఁజండాలుఁ
డొక్కఁడరుగు దెంచి, చక్క నిలిచి ...

రంతి దేవుడు అన్నదానాన్ని హరి సమర్పణంగా భావించి, తనకు లభించిన దానిలో కొంత అన్నమును వానికిచ్చి, వానిని సంతుష్టుని చేసి సాగనంపేడు. ఆ తరువాత శూద్రుడొకడు ఆకలితో వస్తే మిగిలిన దానిలో సగ భాగం యిచ్చి వేసి గారవించి పంపించాడు. తరువాత కుక్కల గుంపును వెంట నిడు కొనిన వాడొకడు రాగా, వానికి మిగిలినదంతా యిచ్చి వేసి భక్తితో నమస్కరించి పంపించాడు.

తరువాత క్షుద్బాధతో వచ్చిన నాలవ జాతి వానికి దండమిడి,

అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావు మన్న ! రావన్న ! ... అంటూ వానిని సగౌరవంగా పిలిచి తియ్యని నీళ్ళు సమర్పించుకున్నాడు.

మన వారికి అతిథి మర్యాదలంటే ఇంత నిష్ఠ.

హర విలాసంలో చిరుతొండ నంబి భక్తికి ఆది దంపతులు పరీక్ష పెడితే, ఆ నంబి తన శివ భక్త్యాచార సంపత్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలిసినదే కదా.

పదకొండు రోజుల పాటు ఎడ తెగని వర్షాలు శివ మహిమ చేత కురిస్తే, అతిథి సమర్పణకు వంటలు చేయడమే కష్టమై పోయింది. యింట ఎండిన వంట చెఱకు లేకుండా పోయింది. అయినా తైలంలో ముంచిన గుడ్డలకు నిప్పు అంటించి , పొయ్యలు వెలిగించి, వంటలు చేయించాడు.

అతిథులు భుజిచనిదే తాను ఔపోసన పట్టని వ్రతం కలవాడు. అష్టకష్టాలూ పడి వంటలు ముగించినా, ఒక అతిథీ
( జంగముడూ) కనిపించక ఆశ్చర్య పోతాడు.

ముసురు పట్టిన వేళ, తమ యింటి అరుగులు మీద, పంచల క్రిందా, భస్మం పూసుకున్న వాళ్ళూ, పరమ పావన మూర్తులు, మహా శివ భక్తులూ అయిన వారు అనేకులు ఉండే వారు. ఆ రోజు ఒక్కరూ కనబడక పోవడం చూసి నంబి ఆశ్చర్యచకితుడయ్యాడు. తర్వాత అతను భక్తి పరీక్షలో నెగ్గిన తీరు ఒళ్ళు జలదరింప చేస్తుంది.

భోజరాజీయంలో ఇంటికి పోయి, బిడ్డనికి పాలిచ్చి మగిడి వత్తునని శపథాలు చేస్తూ పులితో ఆవు పలికినది:
అపరాహ్ణ వేళ యందతిథి యాకొని వచ్చి
యడిగినఁ బెట్టక కడపు వాని
గతికి ... ... ... ...

బోవు దాన, నింటికి నేఁబోయి మరల
రాక తక్కితి నేఁబుండరీక వర్య !

ఓ పులి రాజా, నేనింటికి పోయి తిరిగి నీ వద్దకు రాక పోతే, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే వాడు ఏ దుర్గతి పాలవుతాడో నాకూ ఆ చెడ్డ గతే నాకూ పడుతుంది. అని ఆవు ఒట్టు పెట్టు కుంది. అతిథులంటే అంత శ్రద్ధాభక్తులు మరి.


ఇదంతా అలా ఉంచితే, ఈ కాలంలో అతిథి సేవలు చేయాలంటే మరీ అంత వీజీ కాదు.

గేస్ ఎప్పుడు అయి పోతుందో తెలీదు. నల్లాలో నీళ్ళు వస్తాయో రావో తెలీదు. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలీదు. నగరంలో కర్ష్యూ ఎప్పుడు పెడతారో అసలే తెలీదు. కూరల ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి....

చుట్టాల చిచ్చర పిడుగులు బంతాట ఆడుతూ ఏ టీవీ అద్దాన్నో ఎప్పడు బద్దలు కొట్టేస్తారో తెలీదు.
ముచ్చట పడి చేయించుకున్న కొత్త ఫర్నీచరు ఎంతలా నాశనం కానున్నదో తెలీదు

ఇలాంటి భయాలు ఎన్నో ! అందుకే అతిథి సేవా వద్దు, గాడిద గుడ్డూ వద్దు.

మన యింటి తలుపులు మనకే తెరుచు కోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాం.

నిజానికి మీద చెప్పిన భయాలన్నీ కేవలం మన ఊహాపోహలు. కల్పనా కథలు. ముందు తరాల వారు ఇంత కంటె గడ్డు కాలం లో కూడా నిండు మనసుతో అతిథులను గౌరవించే వారు. మనుషులను ప్రేమించే వారు.

ఇప్పుడా సద్భావన ఎందుకు మృగ్య మౌతున్నదంటే,

కాలం మరి పోయి కాదు. కాని కాలం దాపురించీ కాదు.

మనలో ఉండాల్సిన దేదో మనం కోల్పోవడం చేత.



గుండెలో తగినంత తేమ లేక పోవడం చేత. మనం మనుషుల కంటె కూడా రూపాయి నోట్ల లాగానో, రూపాయి బిళ్ళల లాగానో బతకడానికి తెగ యిష్ట పడి పోతూ ఉండడం చేత. అంతేనంటారా?

30, జూన్ 2015, మంగళవారం

మన వల్ల కాదు బాబూ ! ( సేవా ధర్మం చాలా కష్టం )



సేవా ధర్మం చాల కష్టతరమైనది. నిజానికది కత్తి మీది సాము లాంటిది. రాచ కొలువు లభించడం ఎంత కష్టమో, దానిని నిర్వహించడం అంతే కష్టం. ప్రభువుల వారికి ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహం వస్తుందో తెలియదు. ఎంతో మెళకువతో మెలగాలి. ఈ శ్లోకం ఆ అర్ధాన్నే వివరిస్తోంది:

మౌనా న్మూర్ఖ: ప్రవచన పటు:, నాతులో జల్పకో వా,
ధృష్ట: పార్న్వే వసతి నియతం చూరతశ్చా: ప్రగల్భ:
క్షాంత్యా భీరు ర్యది న సహతే ప్రాయశోనా2భిజాత:
సేవాధర్మ: పరమ గహనో యోగినా మస్యగమ్య:

సేవలు చేసి మెప్పు పొందడం చాల కష్టమైన పని. అది నిర్లిప్తంగా ఉండే యోగులకు కూడ అగమ్యగోచరం. సేవకుడు ఎలా ప్రవర్తించినా ఏదో ఒక తప్పు పట్టుకుంటారు యజమానులు.
మాట్లాడ కుండా మౌనంగా ఉంటే వొట్టి మూర్ఖుడని అంటారు.
మాటకారి అయితే వాగుడుకాయ అని తిడతారు.
ఓర్చుకుని సహనంగా ఉంటే పిరికిపంద అని వెక్కిరిస్తారు.
ఎదురాడితే తక్కువ జాతివాడంటారు.
యజమానికి ఎప్పుడే అవసరం ఉంటుందో అని, అతనికి సమీపంలో ఉంటే పొగరుబోతని అంటారు.
దూరం దూరంగా ఉంటే చేత కాని చవట అంటారు.
ఇలా సేవకునిలో లేని తప్పులని పదే పదే ఎత్తి చూపుతూ యజమానులు నానా యాగీ చేస్తారు.


సేవా ధర్మం చాలా కష్టం బాబూ !

ఆహా ! ఏమి రుచి ! ( చల్లి బువ్వ )



కన్యా శుల్కం రెండో అంకం లో మొదటి సారిగా బుచ్చమ్మని చూస్తాడు గిరీశం. బచ్చమ్మ ప్రవేశిస్తూనే తమ్ముడు వెంకటేశంతో, ‘‘ తమ్ముడూ, అమ్మ కాళ్ళు కడుక్కోమంచూందిరా’’ అంటుంది. అదే మొదటి సారి గిరీశం బుచ్చమ్మని 
చూడడం.
ఆమెని చూస్తూనే గిరీశానికి మతి పోతుంది. తనలో హౌ బ్యూటి ఫుల్ ! క్వైటనస్సెక్టెడ్ ! అనుకుంటాడు. బస్తీలో మధుర వాణిని విడిచి వచ్చేక ఇక్కడ కృష్ణా రాయ పురం అగ్రహారంలో ఇంత అందం ఉంటుందని అతను అనుకో లేదు. అందుకే, ‘‘ పల్లెటూర్లో వూసు పోదనుకున్నాను కానీ, పెద్ద కాంపేసుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం ’’ అనుకుంటాడు.

బుచ్చమ్మ గిరీశాన్ని ‘‘ అయ్యా, మీరు చల్ది వణ్ణం తించారా?’’ అనడుగుతుంది.

గిరీశం తడుము కోకుండా ‘‘ నాట్ది స్లైటస్టబ్జక్షన్ ’’ అని తలూపుతాడు. అంతే కాదు, ‘‘ అనగా, యంత మాత్రం అభ్యంతరం లేదు.’’ అని అనువాదం కూడా వెలగ బెడతాడు. అంతటితో ఆగ కుండా

‘‘ వడ్డించండిదిగో వస్తున్నాను.’’ అని చెప్పి, ‘‘ తోవలో యేటి దగ్గర సంధ్యావందనం అదీ చేసుకున్నాను’’ అని కూడా బుకాయిస్తాడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజుల్లో పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా ఇళ్ళలో అంతా ఉదయాన్నే చల్ది అన్నాలు తినేవారు. టిఫిన్లూ గిఫిన్లూ తెలియవు.

చల్ది , చల్లంది , చల్దన్నం ఈ పేర్లతో పిలిచే ఆ తరవాణీ అన్నం మహా రుచిగా ఉంటుంది. గ్రామీణులు సల్లంది అని అంటారు.

చలి + అది = చల్ది. చల్లనిది అని అర్ధం. చల్లని అన్నం అన్నమాట. ఇక్కడ చకారం తాలవ్య చకారం. దంత్య చకారం కాదు. ఈ చల్దన్నం కోసం ప్రతి ఇంట తరవాణి కుండలు ఉండేవి. తరవాణి అంటే పుల్లని నీళ్ళు అని నైఘంటికార్ధం. ఏతావాతా తేలిందేమిటంటే, చల్లంది అంటే, పులిసిన అన్నం అని అర్ధం !

మా ఇళ్ళలో పిల్లలందరకీ ఉదయాన్నే చల్దన్నాలు పెట్టే వారు. తెల్ల వారకుండానే లేచి స్నానాలు చేసి, మడి కోసం ప్రత్యేకంగా కుట్టించిన పట్టు లాగులు (చెడ్డీలు) తొడుక్కుని మరీ పిల్లలం ఒక పంక్తిని కూచుంటే కానీ మాకు చల్దన్నాలు వడ్డంచే వారు కాదు.

మా ఊర్లో ఉదయాన్నే వీధుల్లోకి తామరాకులు అమ్మకానికి వచ్చేవి. నూకలో, బియ్యమో యిచ్చి మా నాయనమ్మ ఆ తామరాకుల కట్టలని కొనేది. వాటిలో వడ్డించిన చల్దన్నం ఎంత రుచిగా ఉండేదో మాటల్లో వర్ణించడం కష్టం. ఆ తర్వాత రోజుల్లో అరిటాకులూ, తర్వాత తెల్లని పింగాణీ కంచాలూ వచ్చేయి. స్టీలు కంచాలు వచ్చే వేళకి ఇంట్లో చల్దన్నాల స్థానాన్ని టిఫిన్లు ఆక్రమించాయి.

ఉదయాన్నే ఆ తరవాణితో కూడిన చల్దన్నం తింటే ఎండ పొద్దెక్కాక ఎంత వేళకీ కానీ అసలు ఆకలనేదే తెలిసేది కాదు. ఆ రుచికరమయిన చల్దన్నం తినడానికి కమ్మగా ఉండడమే కాక, కడుపులో హాయిగా తేలిగ్గా ఉన్నట్టుండేది. అన్న సారం వొంట బట్టేక, కొంచెం మత్తుగా కూడా ఉండేది. నిద్ర ముంచు కొచ్చేది.

మా ఇంట్లో కాఫీల యుగం ప్రారంభ మయేక, అప్పుడప్పుడు ఆ కాఫీ రుచి మరిగి, మా పిల్లలం మాకూ కాఫీలు కావాలని గోల చేసే వాళ్ళం.

మా నరసింహం బాబాయి మాకు నడ్డి మీద ఒక్కటిచ్చుకుని, ‘‘ అన్నాలు తినే వాళ్ళకి కాఫీలు లేవర్రా !’’ అని ఓ తిరుగు లేని అలిఖిత శాసనం వినిపించే వాడు. నేను ఓ సారి అతనా మాట అనగానే ఉడుక్కుని, ‘‘ అక్కడికి, కాఫీలు త్రాగే వారంతా అన్నాలు మానేస్తున్నట్టు !’’ అని గొణిగాను. నా సణుగుడు వినిపించి మా నరసింహం బాబాయి నా నడ్డి ఫెడీల్మనిపించడం జరిగింది లెండి.

సరే, ఇంత రుచికరమయిన చల్ది అన్నం గురించి, అంతే రుచికరమయిన ఒక శ్లోకం మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. చూడండి:

వసంత నవ మల్లికా కుసుమపుంజవ న్మంజులం,
ససర్షపరసాలకం లికుచనీర వృగ్నార్ధకం,
వరాంగ్యుపరికేళిజ శ్రమ నివారణే కారణం,
జలోదన ముపాస్మహే జలజ బాంధవ ప్యోదయే.

వసంత కాలంలోని క్రొత్త మల్లి పువ్వు లాగ మంజులంగా ఉంటుంది. ఆవ తోడి మామిడి కాయ నంజుడుతో, అంటే, ఆవకాయ నంచుకుంటూ, లేదా, నిమ్మ రసంలో ఊరబెట్టిన అల్లపు ముక్కలతో, అంటే అల్లం పచ్చడితో నంచుకుంటూ చల్ది అన్నాన్ని ఉదయాన్నే తింటున్నాను. (మనోజ కేళి వలన కలిగిన) నా శ్రమ అంతా నివారించ బుడుతోంది కదా ! అని దీని భావం.

ఆవకాయ, లేదా, అల్లం పచ్చడి మొదలయినవి నంచుకుంటూ తెలతెల వారుతూ ఉండే తరవాణి లోంచి తీసి పెట్టిన చల్దన్నం తినడం కన్న స్వర్గం మరొకటి లేదని తెలుసుకోవాలి.

చల్దన్నం గురించి చెప్పుకుంటూ శ్రీకృష్ణుడు బాల్యంలో గోపాలురతో కూడి చల్దులారగించిన మధుర ఘట్టాన్ని తలుచు కోకుండా ఉండ లేం కదా !

చూడండి, భాగవతంలో బమ్మెర పోతన శ్రీకృష్ణుని బాల్య చేష్టలు వర్ణిస్తూ, పశువులను మేపుకుంటూ, నెచ్చెలి కాండ్రతో చల్దులు ఆరగించే సన్నివేశాన్ని మనోహరంగా రచించాడు.

గోపాలురు బాల కృష్ణునితో పాటు ఊరి చివర పచ్చిక బయళ్ళలో పశువులను మేపుకుంటున్నారు. మిట్ట మధ్యాహ్నమయింది. ఎండ మాడ్చి వేస్తోంది. అందరకీ ఆకలి వేస్తోంది. ఇక రండర్రా, చల్దులు తిందాం, అని గోపాలుడు గోపాలురను కేకేసి ఎలా పిలుస్తున్నాడో చూడండి :

ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార ! చల్ది గుడువన్ రమ్య స్థలంబిక్కడీ
దండన్ తేగలు నీరు ద్రావి యిరువందం బచ్చికల్ మేయుచుం
దండబై విహరించు చుండగ నమంద ప్రీతి భక్షింతమే

ఎండలో మ్రగ్గి పోయారు. ఆకలితో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయడమెందుకు? ఓ బాలకులారా, రండి ! మనం చల్దులు తినడానికి ఇక్కడ ఈ చోటు చాలా మనోహరంగా ఉంది. ఇక్కడ లేగ దూడలు నీళ్ళు త్రాగి, ఈ చుట్టు ప్రక్కల గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. ఈ అందమయిన స్థలంలో చల్దులు తిందామా?

గోపాలుని పిలుపుతో గోపాలురంతా బిలబిలా అక్కడికి చేరారు. కృష్ణుని చుట్టూ వలయంగా కూర్చుని చల్దులు ఎలా తిన్నారో చూడండి:

జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁగూర్చుండి వీక్షింపుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు, లతల్ , చిక్కంబులున్, బువ్వు లా
కులు కంచంబులుగాభుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా !

పద్మంలో ఉండే కర్ణిక (బొడ్డు) చుట్టూ ఉండే రేకుల లాగ, కృష్ణుని చుట్టూ వలయాకారంగా అతనినే చూస్తూ కూర్చున్నారు గోపాలురు. తర్వాత, ఇళ్ళ నుంచి తెచ్చుకున్న చిక్కాలు విప్పి, చల్దులు తినడం మొదలెట్టారు. శిలలు, చిగుళ్ళు, గడ్డి, లతలు, చిక్కాలు, పువ్వులు, ఆకులు మొదలయిన వాటిని కంచాలుగా చేసుకుని గోపార్భకులు చల్దులు ఆరగించారు.

ఇలా చల్దులు తినే ఆ పిలకాయల సరదాలూ, కోణంగితనాలూ పోతన ఎంత మనోఙ్ఞంగా వర్ణించాడో చూడండి:

మాటి మాటికి వ్రేలు మడచి యూరించుచు
నూరు గాయలు దినుచుండు నొక్క
డొకని కంచము లోని దొడిసి చయ్యన మ్రింగి
చూడు లేదని నోరు సూపు నొక్క
డేగురార్గుర చల్దు లెలమిఁబన్నిదమాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కొక
డిన్నియునుఁదగ బంచి యిడుట నెచ్చెలి
తనమనుచు బంతెన గుండు లాడు నొకడు

కృష్ణుఁజూడు మనుచుఁగికురించి పరు మోల
మేలి భక్ష్య రాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకడు

మాటి మాటికి వేలు ముడిచి ప్రక్క వారిని ఊరిస్తూ ఒకడు ఊరగాయలు తింటూ ఉంటాడు.
ప్రక్క వాడి కంచం లోనుండి కొంత చల్ది లాక్కుని గుటుక్కున మ్రింగి వేసి, అబ్బే, నేను తిన లేదు కావాలంటే చూసుకో ! అని, నోరు చూపిస్తాడు ఒకడు.
పందెం కట్టి ఐదారుగురి చల్దులను కూరుకుని కూరుకుని మరొకడు తింటున్నాడు.
ఇంకొక గోప బాలకుడు, ఒకరిదొకరం పంచుకుని తినడం స్నేహ లక్షణం అంటూ నచ్చ చెబుతూ తింటున్నాడు.
అదిగో, చూడు ! కృష్ణుడు, అంటూ చూపు మరలించి, ప్రక్క వాని కంచం లోని చల్దులలో మేలైన భక్ష్య రాశిని వాడు చూడకుండా లాక్కుని తింటున్నాడు వేరొకడు .ఒకడు నవ్వుతాడు. మరొకడు నేస్తులను నవ్విస్తున్నాడు. ఇంకొకడు ఏవో ముచ్చటలు చెబుతున్నాడు. మరొకడు మురిసి పోతున్నాడు.

ఇలా నెచ్చెలి కాండ్రతో చల్దులు కుడిచే గోపాలుడు ఎలా ఉన్నాడంటే,

కడుపున దిండుగాఁగట్టిన వలువలో
లాలిత వంశ నాళంబుఁజొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద
డాపలి చేత మొనయ నునిచి.
చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు
వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి

సంగిడీల నడుమఁజక్కనఁగూర్చుండి
నర్మ భాషణముల నగవు నెఱపి,
యాగ భోక్త కృష్ణుఁడమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె.

కృష్ణుడు నడుము చుట్టూ దట్టీ కట్టు కున్నాడు. దానిలో తన వేణువును ఏటవాలుగా దూర్చాడు. కొమ్ము బూరా, చేతి కర్ర - ఈ రెండింటినీ జారి పోకుండా ఎడమ చంకలో ఇరికించి పట్టు కున్నాడు. మీగడ పెరుగుతో కలిసిన చల్ది ముద్ద ఎడమ చేతిలో పట్టు కున్నాడు. ఇంటి దగ్గర అల్లరి చేసి కొసరి కొసరి కట్టించు కొని, వచ్చిన ఊరుగాయ ముక్కలను కుడి చేతి వ్రేళ్ళ సందులో ఇరికించి పట్టుకున్నాడు.సంగడీల నడుమ కూర్చున్నాడు. చక్కగా వారినందరినీ నవ్విస్తున్నాడు. అతడు యాగ భోక్త. అట్టి నల్లనయ్య బాల్య క్రీడలతో ఒప్పుతూ నెచ్చెలి కాండ్ర మధ్య కూర్చుని చల్దులు ఆరగిస్తూ ఉంటే, నింగిని దేవతలందరూ నివ్వెర పోయారు. ఆ దేవ దేవుని శైశవ క్రీడలను తన్మయులై చూస్తున్నారు.

ఇదీ చల్ది కథ. చల్దన్నం గురించి ఇంత ఉందా చెప్ప డానికి ?! అంటే, ఉంది మరి !

తవ్విన కొద్దీ తరగని నిధి కదా, మన సాహితీ సంపద !

స్వస్తి.





28, జూన్ 2015, ఆదివారం

అన్నదాతా సుఖీ భవ ! తినడం కూడా వో కళ !



వస్తూనే అన్నాడు కోనేటి రావు: ‘‘ హబ్బ! ఘుమఘుమలాడి పోతోందిఅక్కయ్య గారు పకోడీలు వేయిస్తున్నట్టున్నారు ..’’ అని. సరిగ్గా సమయానికే వస్తాడు కోనేటి రావు.
‘‘ పకోడీలు కావయ్యాబజ్జీలు ...’’ అన్నాను.
‘‘ ఏవో ఒకటిఅక్కయ్య గారూవేగిరం తెండి నోరూరి పోతోంది’’ వంట గది లోకి చూస్తూ కేకేసాడు.
అతను మా యింట్లో ఉన్నప్పుడు నేను వేరే ఎవరి యింట్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఆహార ప్రియుల తీరు ఇలాగే ఉంటుంది. ఇవాళ మన కథామంజరిలో అంతా తిండి గోలే. ఇక చదవండి:
పంక్తిభేదే పృథక్పాకేపాకభేదే తథా2కృతే,
నిత్యం చ గేహకలహేభవితా వసతి స్తవ.
ఒకే పంక్తిలో కూర్చున్న వారికి భేదంగా వడ్డించే చోట లక్ష్మీ దేవి నిలువదట ! అంటేఅయిన వాళ్ళకి ఆకుల్లోనుకాని వాళ్ళకి కంచాల్లోనూ అనే సామెత ఉంది చూసారూ అలాగన్న మాట.
వడ్డించే వాడు మన వాడయితేకడ పంక్తిని కూర్చున్నా ఫరవా లేదంటారు. అయితేఒకే వరసలో కూర్చున్న వారికి వడ్డన విషయంలో భేదం చూప కూడదు. అందరకీ ఒకేలా వడ్డించాలి. ఒకరికి కొంచెం ఎక్కువాకొందరకి కొంచెం తక్కువాకొందరకి కొసరి కొసరికొందరకి విదిలించి నట్టుగానూ వడ్డించ కూడదన్న మాట. అలా చేస్తే ఇంట లక్ష్మి ఉండదంటున్నాడు శ్లోక కర్త.
అలాగేవేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కునే చోట కూడా ధనం ఉండదు. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే పొయ్యి మీద వండుకుని తినాలి. వేరు పడి పోయిఒకే ఇంట వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కోవడం మొదలెడితే ఆ యింట లచ్చి తల్లి ఉండదు.
అసలే వండు కోని ఇంట కూడా ఆ తల్లి ఉండదుట.
అలాగేనిత్యం కలహాలతో నిండి ఉండే ఇంట కూడా లక్ష్మీ దేవి ఉండదు.
అంటేపంక్తి వడ్డనలో భేదం పాటించే వారింటవేరు వేరు పొయ్యలు పెట్టుకుని ఒకే ఇంట వండుకునే వారింటఅసలే వండు కోని వారింటనిత్యం కలహాలతో కాపురం చేసే వారింట పెద్దమ్మ (దరిద్ర దేవత) తిష్ఠ వేస్తుంది. చిన్నమ్మ లక్ష్మి అక్కడి నుండి తొలగి పోతుంది అని దీని భావం.
లక్షాధికారైన లవణమన్నమె కానిమెఱుగు బంగారమ్ము మ్రింగ బోడు.
అయితే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
ఆదరాబాదరాగా తిన కూడదు. నోట్లో కుక్కుకుంటూ ఏదో ఇవేళ్టికి భోజనం అయిందనిపించ కూడదు.
నింపాదిగాశ్రద్ధగా భోజనం చేయాలి.
భుంజానో న బహు భ్రూయాత్న నిందేదపి కంచన
జుగుప్పసితకథాం నైవశ్రుణుయాదపి వా వదేత్.
భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడ కూడదు. ఇతరులను తిడుతూ నిందా ప్రసంగాలు చేయ కూడదు. అసహ్య కరమయిన కథనాలు చేయ కూడదు. విననూ కూడదు.
చరక సంహిత ఏమి చెబుతున్నదో చూడండి:
ఉష్ణ మశ్నీయాత్స్నిగ్ధ మశ్నీయాత్మాత్రావ
దశ్నీయాత్జీర్ణే2శ్నీయాత్వీర్యా2విరుద్ధ మశ్నీయాత్
ఇష్టే దేశే2శ్నీయాత్నాతిద్రుత మశ్నీయాత్నా2తి
విలంబిత మశ్నీయాత్అజల్పన్నహసన్ తన్మనా భుంజీత,
ఆత్మానమభిసమీక్ష్య భుంజీత.
వేడి పదార్ధాలనే తినాలి.
చమురు గల ఆహారాన్ని తినాలి. ( అలాగని ఎక్కువ నూనె పదార్ధాలూ పనికి రావు సుమా )
మితంగా భుజించాలి.
ముందు తిన్నది జీర్ణమయిన తరువాతనే తిరిగి ఆహారం తీసు కోవాలి.
ఒకదానికొకటి పొసగని పదార్ధాలు ఏక కాలంతో తినరాదు.
మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే చోటశుచిగా ఉండే చోట తినాలి. తినే చోట గలీజుగా ఉండ కూడదు.
త్వర త్వరగా మ్రింగ కూడదు. మెక్కడం చేయ కూడదు.
అలాగని అతి నెమ్మదిగా కూడా తిన వద్దు.
అతిగా మాటలాడుతూతుళ్ళుతూకేరింతలు కొడుతూ భోజనం చేయ కూడదు.
ఏకాగ్ర చిత్తంతో తినాలి.
ఏ పదార్ధం ఎంత అవసరమోహితమో తెలుసుకుని అంతే తినాలి.
ఇలా తింటే నూరేళ్ళు బ్రతకొచ్చని శ్లోకంలో కవి భరోసా ఇస్తున్నాడు.
అలాగే ఒంటిపిల్లి రాకాసిలా ఒక్కరే కూచుని తినడం మంచిది కాదు.
ఏకఏవ నభుంజీతయదిచ్ఛేత్సిద్ధి మాత్మన:
ద్విత్రిభి ర్బహుభి స్సార్ధంభోజనం తు దివానిశమ్,
పగలు కానీ రాత్రి కానీఒంటరిగా తిన కూడదు. ఇద్దరోముగ్గురో సహ పంక్తిని కూర్చుని భుజిస్తూ ఉండగా తినాలి. అలా చేస్తే ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.
ఇప్పుడంటే గేదె బోయినాలు ( బఫేలు) వచ్చేయి కానీ వెనుకటి రోజులలో నేల మీద అరిటాకులో, విస్తళ్ళో వేసి వడ్డంచే వారు. వడ్డిస్తున్నాం, కాళ్ళు కడుక్కుని రండి. అనడం అలవాటు.
విందు భోజనాలకు పిలుస్తూ దేవతార్చనకు మా యింటికి దయ చేయండి అనే వారు. మా ఊళ్ళో అయితే, శుభాశుభ కార్యాలకు భోజనాలకి వెళ్తూ , శుభ కార్యాలకయితే పట్టు పంచెలు, దినకర్మలలాంటి వాటికయితే నూలు పంచెలు కట్టుకుని, చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలు దేరే వారు.
ఇక, పెళ్ళిళ్ళలో భోజనాల తంతు సంగతి చెప్పే పని లేదు. మడి కట్టు కోండి అని ఊళ్ళో అతిథులందరకీ మరో మారు గుర్తు చేయాలి. ( ఊళ్ళో సగోత్రీతకులనే భోజనాలకు పిలిచే వారు మరి) ఇదిగో వస్తున్నాం అంటూ ఎంతకీ వచ్చే వారు కారు. వాళ్ళ కోసం విస్తళ్ళ ముందు మిగతా బంధువులు పడిగాపులు పడే వారు. అంతా వచ్చేరనుకుంటే ఒక పెద్దమనిషి నదికో, ఏటికో స్నానానికని వెళ్ళి, ఎంతకీ వచ్చే వాడు కాడు. ఏం అనడానికి లేదు. మగ పెళ్ళి వారంతా భోజనాలు ముగిప్తే కానీ, ఆడ పెళ్ళి వారు బోయినాలకు కూచోడానికి లేదు. అలకలూ, దెప్పి పొడవడాలూ కూడా ఒక్కోసారి విందు భోజనాలలో చోటు చేసుకునేవి.
కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం నాటకంలో విందు భోజనాలకు పిలిస్తే బెట్టు చేసి బాధించే వారి గురించి ఒక చక్కని పద్యం ఉంది. చూడండి:

పిలిచిన పలుకక బిగదన్ను కొని లోన
ముసుఁగు పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకడు
ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని
చుట్ట ముట్టించెడు శుంఠ యొకడు
ఒగిఁదనకై వేచి యుంద్రో లేదో చూత
మని జాగు సల్పెడి యల్పుఁడొకడు
ముందు వచ్చినఁబర్వు ముక్కలౌననుకొని
కడను రాఁజూచు ముష్కరుఁడొకండు
కుడి యింటను హాయిగా కూరుచుండి
వత్తు, రానని చెప్పని వాచి యొకఁడు
వచ్చి, కోపించి పోవు నిర్భాగ్యుఁడొకడు
ఆరు వేల్వారి విందుల తీరు లివ్వి.
పిలిస్తే పలుకడు. బిగదన్నుకొని ముసుగు పెట్టుకుని పడుకునే మూర్ఖుడు ఒకడు.
ఇదిగిదిగో, వచ్చేస్తున్నా, మీ వెనకే వస్తున్నా, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు తీరిగ్గా చుట్ట ముట్టించే శుంఠ మరొకడు.
తన రాక కోసం విందుకు పిలిచిన వారు వేచి చూస్తారో, చూడరో చూద్దాం అని కావాలని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు.
ముందుగా వచ్చేస్తే ఎక్కడ తమ పరవు ముక్కలై పోతుందో అని అందరి కంటె చివరగా రావాలని అనుకునే దుష్టుడొకడు.
హాయిగా నట్టింట కూర్చుని, వస్తాననీ, రాననీ కూడా చెప్ప కుండా తాత్సారం చేసే వాడొకడు.

ఒహ వేళ వచ్చినా, ఏదో విషయంలో అలక వహించి, కోపం తెచ్చుకుని అగ్గిరాముడై పోయి చిందులు తొక్కుతూ తిరిగి వెళ్ళి పోయే నిర్భాగ్యుడు మరొకడు.
ఆరు వేల నియ్యోగుల యింట విందు భోజనాల తంతు ఇలా ఏడుస్తుంది.
( వర విక్రయం - కాళ్ళ కూరి నారాయణ రావు)
పెళ్ళిళ్ళలో ఈ బ్యాచ్ ఉంది చూసారూ, వీళ్ళు కూడా ఎంతకీ భోజనాలకి లేవరు.
వడ్డన కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆకులో ఎక్కడ కూరలు వడ్డించాలి, ఎక్కడ పచ్చళ్ళు వెయ్యాలి, అన్నది తెలిసిన వారే వడ్డనకు పూను కోవాలి. ఆ రోజు వండిన వాటి నన్నింటినీ కొంచెం కొంచెంగానయినా విస్తట్లో ముందుగా వడ్డించాలి. పులుసు, నెయ్యి, పెరుగు కూడా అభిగారం చెయ్యాలి. ( ఇవి ఉన్నాయి సుమండీ అని తెలియ జెప్పే లాగున కొంచెం కొంచెం వడ్డించాలి.) ఓ మూల ఉప్పుతో సహా అన్నీ విస్తట్లో పడ్డాయని ధృవీకరించుకున్నాక, గృహ యజమాని ఇహ ఔపోసన పట్టండి అంటూ వేడుకునే వాడు. భోజనాలు పూర్తయాక, అన్న దాతా సుఖీ భవ అని దీవిస్తూ కొందరు గొంతెత్తి చక్కని పద్యాలు రాగ యుక్తంగా చదివే వారు. పద్యం చదవడం పూర్తయేక, అంతా ఒక్క సారిగా గోవిందా ! గోవింద! అని , గోవింద నామస్మరణ చేసి, లేచే వారు. అయితే,అందరి భోజనాలు పూర్తయి లేస్తే తప్ప పంక్తి లోనుండి లేవ కూడదు. అది అమర్యాద అలా ఉండేవి వెనుకటి రోజుల్లో పెళ్ళి భోజనాలు.
ఇప్పటి గేదె బోయినాలకి ఆ బాధ లేదు. కానీ, ఒకర్నొకరు రాసుకుంటూ, చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో మన వంతు వచ్చే వరకూ నిరీక్షించడం కొంత ఇబ్బందికరం. ఏదో వడ్డించుకుని తింటున్నామంటే, ఎవడు అజాగ్రత్తగా చేయి తగిలిస్తాడో, బట్టలు ఖరాబవుతాయో అనే టెన్షను లోలోపల పట్టి పీడిస్తూ ఉంటే తినడం మొదలెడతాం. మధ్యలో ఏ పదార్ధమో కావాలంటే, మళ్ళీ ఆ ఎంగిలి ప్లేటుతో క్యూ మధ్య చొరబడ వలసిందే.
ఎవరు తింటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. అసలు తింటున్న వాళ్ళంతా బంధువులో కారో కూడా తెలియదు. అంతా దొమ్మీ లాగున తిండి సంత. కాలానుగుణమయిన మార్పులను ఇష్టం ఉన్నా , లేక పోయినా ఆమోదించక తప్పదు.
ఈ సందర్భంగా మందు బాబులకు ఓ శుభ వార్త. ఓ అశుభ వార్త.
కిం తు మద్యం స్వభావేనయథైవా2న్నం తథా స్మృతమ్
ఆయుక్తియుక్తం రోగాయయుక్తాయుక్తం యథామృతమ్
మద్యం కూడా మంచిదే (మరక మంచిదే కదా?)
స్వభావరీత్యా మద్యం దోషభూయిష్ఠం కాదు.
తగినంత మోతాదులో తీసుకుంటే అది అమృతంలా పని చేస్తుంది.
మోతాదు మించితే మాత్రం అదే విషతుల్యమవుతుంది సుమా ! అంటున్నాడు శ్లోక కర్త.
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !!
అంటాడు గురజాడ.
ఈ తిండి టపాసందర్భంగా బరంపురంలో సహపంక్తి భోజనాల గురించి తలచు కుందాం.
అలాగేనాయక రాజుల కాలం నాటి తంజావూరు భోజన సత్రం వైభవ ప్రాభవాల గురించి స్మరించు కుందాం.
దేవాలయాల్లో జరిగే ఉచితాన్నదానాల గురించి చెప్పుకుందాం.
మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి వివాహ భోజనంబు ... గుర్తుకు తెచ్చుకుందాం
ఇక,.
భోజ రాజుని కవిత్వంతో మెప్పించి బహుమానం పొందాలనుకున్న ఒక అల్ప కవి -
భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్
అని తొలి పాదం రాసేక ఇహ దానిని ఎలా పూర్తి చేయాలో తెలీక జుట్టు పీక్కుంటూ ఉండగా కాళిదాసు పోనీ పాపంఅని రెండో పాదం ఇలా పూర్తి చేసి ఇచ్చాడుట.
మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి:
ఓ రాజా, నెయ్యీ, పప్పూ కూడిన భోజనం ఇయ్యవయ్యా అని మొదటి పాదానికి కవితా రసం లేని రసహీనమయిన అర్ధమయితే,
నిండు కవిత్వం తొణికిసలాడే కాళిదాసు పూరణ రెండో పాదం.
నిండు వెన్నెల వంటి తెల్లనయిన గేదె పెరుగుతో అన్నం పెట్టవయ్యా.
వెనుకటి రోజులలో ఓ దొర గారికీ ఓ ఛాందస పండితునికి భలే దోస్తీ ఉండేది.
ఒక సారిపండితుని ఇంట ఏదో శుభ కార్యానికి దొర గారు ఫుల్ సూటూటైహేటూబూటూతో వెళ్ళాడు. పండితుని ఇంట పెట్టిన బూరెల రుచి చూసి వాటిని ఓ పట్టు పట్టాడు. కానీ అతడిని ఓ సందేహం పీడించ సాగింది . ఇక ఊరుకో లేక. పండితుడిని అడిగాడు: ఇవి చాలా రుచిగా ఉన్నాయి సుమా. ఇంతకీ ఈ (పూర్ణం) ముద్ద దీని లో ఎలా పెట్టారో చెప్పండి. అని.
పండితుడు నవ్విఅది సరే కానీ, ముందు నువ్వీ సూట్ లోరి ఎలా దూరేవో కాస్త చెబుదూ అని అమాయకంగా అడిగేడుట.
ఓ ఆసామీ డాక్టరు దగ్గరకి చ్చేడు.
‘‘ నవ్వింక సిగరెట్లు తాగడం తగ్గించాలోయ్. లేక పోతే ఛస్తావ్ ! పోనీభోజనం ముందొకటీతర్వాత ఒకటీ చొప్పున లిమిట్ చేసుకో ’’ అని డాక్టరు సలహా ఇచ్చేడు.
కొన్నాళ్ళు పోయేక ఆ ఆసామీ పిప్పళ్ళ బస్తాలా తయారై ఆప సోపాలు పడుతూ డాక్టరు దగ్గరకి మళ్ళీ వచ్చేడు.
‘‘నా సలహా పాటించావా ఇప్పుడెలా ఉంది ?’’ అడిగేడు డాక్టరు.
‘‘ ఏం చెప్పమంటారు డాక్టరు గారూరోజుకి ఇరవైసార్లు తిండి తిన లేక ఛస్తున్నననుకోండి’’ అన్నాడుట ఆ ఆసామీ.
ఇదిలా ఉంచితేతిండితో లింక్ ఉన్న మరికొన్నింటిని కూడా చూదాం
తిండికి తిమ్మ రాజు. పనికి పోతరాజు.
తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.
తినగ తినగ వేము తీయనుండు.
అన్నమో రామచంద్రా !
అమ్మ పెట్టా పెట్టదు. అడుక్కుని తినానివ్వదు.
వండుకునే వాడికి ఒకటే కూరయితే అడుక్కునే వాడికి చెప్పలేనన్ని.
ఇక,
తిండి అంటే అన్నం తినడమే కాదు.
లంచాలు తినడంబుర్ర తినడంసమయం తినడంక్రికెట్ లో ఓవర్లు తినడందేశాన్ని తినెయ్యడం...కాల్చుకు తినడం, వేధించుకు తినడం, చూపులతో కొరుక్కు తినడం ... ... ఓఇలా చాలా తినడాలు ఉన్నాయి లెండి.
మా ఆవిడ పెట్టిన బజ్జీలు కడుపారా తిని, కాఫీ ఊదుకుంటూ సేవించి, లేచాడు కోనేటి రావు.
‘‘ ఇహ వెళ్తానయ్యా, అక్కయ్యగారివాళ భలే రుచికరమయిన టిఫిను పెట్టారు. అన్నదాతా సుఖీ భవ ! ... కాదు కాదు ... టిఫిన్ దాతా సుఖీ భవ అనాలి కాబోలు ...’’ అంటూ వెళ్ళి పోయాడు.
మళ్ళీ రేపు ఉదయం మా ఆవిడ స్టవ్ వెలిగించిన శబ్దం చెవిని పడి కానీ రాడు.
తిండి గురించి కొంత చెప్పుకున్నాం. ఈ సారి పస్తుల గురించి చెప్పుకుందాం.
స్వస్తి.