బాగుందా ? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాగుందా ? లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2015, శనివారం

కథా మంజరి బ్లాగయినా మూసెయ్యాలి ! పేరయినా మార్చాలి !



బ్లాగు టపా ఏదో రాసుకుంటూ ఉంటే, ఎప్పు డొచ్చేడో తెలియదు. వచ్చి, నా వెనకాల నిలబడి నేను టైపు చేయడం పూర్తి చేసే లోగా అంతా చదివేసాడు. రాయడం, అదే, టైపు చేయడం ముగించాక , వాడి శ్వాస వెచ్చగా తగలడంతో తుళ్ళి పడి వెనక్కి తిరిగి చూసాను, పళ్ళికిలిస్తూ కనబడ్డాడు. వెనకాల నుంచి మనకి తెలియ కుండా అంతా క్షణంలో చదివెయ్య గల వాడి  ప్రావీణ్యం  అంతా యింతా కాదు ! అసలు ఆ విద్య తోనే వాడు పరీక్షలన్నీ గట్టెక్కాడు. ఖర్మకాలి ముందు వాడు శుంఠ అయితే పాపం వీడూ పరీక్ష తప్పాల్సి రావడం కూడా అప్పుడప్పుడూ జరిగేదనుకోండి ! అది విషయాంతరం.

‘‘నువ్వెప్పు డొచ్చావు ? ’’ అన్నాను ఆశ్చర్యంగా,

‘‘నువ్వు రాయడం మొదలు పెట్టడం నేను రావడం ఒకే సారి జరిగేయి . అంతా చదివేసాను.’’

‘‘ఎలా ఉంది ? ’’ అడిగేను, మానవ సహజమయిన చాపల్యంతోనూ, కుతూహలంతోనూ, ఇంకా చెప్పాలంటే కుతి తోనూ.

చాక్లెట్ చప్పరించీసి నట్టు చప్పరించీసేడు.

గాలంతా తీసీసేడు. ఇంతకీ ఈ వచ్చిందెవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? గుర్తు లేదూ ?! మా తింగరి బుచ్చి గాడు. వాడి గురించి ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే ఇక్కడ నొక్కి చదవండి ,,,

సరే , ప్రస్తుతానికి వద్దాం. ..

‘‘ఐతే ఏమీ బాగు లేదంటావ్ ? ’’ అన్నాను నీరసంగా.

‘‘బాగుండడం, బావు లేక పోవడం నీ చేతిలో లేదు. అందుకే మార్చెయ్ ! వెంటనే మార్చెయ్ ! ’’ అన్నాడు.

‘‘ ఏమిటి మార్చేది ? నీ తలకాయ్ ’’

‘‘ మార్చ వలసి వస్తే అదీ మార్చాలి. ముందు నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు ధృఢంగా.

‘‘ ఎందుకూ ? ’’ అన్నాను కోపంగా.

‘‘ న్యూమరాలజీ ప్రకారం. కథా మంజరి పేరులో అక్షరాలు సరిగా లేవు. కొంచెం మార్చాలి. అందుకే సరైన టపాలు పెట్ట లేక పోతున్నావు. ఆ పెట్టిన వాటిని కూడా ఎవరూ చదవడం లేదు. కంటి తుడుపు కోసం అన్నట్టుగా ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ కామెంట్ లు పెట్టడం లేదు ... అవునా ? ’’అడిగాడు.

నా ఇగో మీద వాడలా దెబ్బ తీసాక, కొంచెం నీరసం వచ్చి, ‘‘ అయితే ఇప్పుడేం చేయాలంటావ్ ’’ అనడిగేను.

‘‘వెంఠనే మార్చెయ్ ! కథా మంజరి పేరు మార్చెయ్ ! ‘‘

‘‘ మార్చడం ఎందుకూ ? ’’

‘‘ ఎందుకంటే, న్యూమరాలజీ ప్రకారం నీ కథా మంజరి బ్లాగు పేరు ఏమీ బాగా లేదు. అందుకే నీ దశ అలా తగలడింది. అందుకే దాని పేరు నేను చెప్పి నట్టుగా మార్చి పారెయ్. అప్పుడు చూసుకో ! నీ బ్లాగు దశ వెలుగుతుందీ ... హిట్టులే హిట్టులు ! కామెంట్ లే కామెంటులు ! వాటిని ప్రచురించ లేక నీ చేతి వేళ్ళు నొప్పి పుడతాయనుకో ! ఒక్క రోజు కొత్త టపా వెయ్యక పోయినా మొత్తం తెలుగు బ్లాగు ప్రియులందరూ నీమీదకి దండెత్తి వచ్చే ప్రమాదమూ ఉంది ! అందు చేత వెంటనే నేను సూచించే విధంగా నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు.

‘‘ ... .. ...’

‘‘ అప్పుడిక తెలుగు బ్లాగర్లు నీ ధాటికి తట్టుకో లేక బ్లాగులు రాయడం మానుకుంటారు. బ్లాగు లోకంలో నువ్వొక్కడివే మహా రాజులా వెలిగి పోతావ్ ’’

‘‘ బ్లాగులే లేక పోతే ఇక సంకలిను లెందుకూ వాళ్ళూ మూసేస్తారు కాబోలు’’

‘‘ హ్హ ! హ్హ! హ్హ! ... అంచేత, నేను చెప్పినట్టు చెయ్. ముందో కాగితమూ పెన్నూ తీసుకుని కథా మంజరి అని ఇంగ్లీషులో రాయ్ ...’’

ప్రయత్నించి చూస్తే పోలా ? అనే బలహీనత ఆవరించి కలం కాగితం తెచ్చు కున్నాను. వాడు చెప్పి నట్టుగా రాసేను.

Katha manjari

‘‘ బావుంది. ఇప్పుడు ఆ పేరులో నేను చెప్పిన ఇంగ్లీషు అక్షరాలు చేర్చు. నేను తీసెయ్య మన్నవి తీసెయ్ ...‘‘ అంటూ నా బ్లాగు పేరుకి శస్త్ర చికిత్స మొదలెట్టాడు.

ఇంగ్లీషు పేరులో వాడు చెప్పిన చోటల్లా కొత్త అక్షరాలు ఉంచేను. పాత అక్షరాలు కొన్ని తొలగించేను.

‘‘ ఇప్పుడీ ఇంగ్లీషు పేరుని తెలుగులో ఎలా ఉచ్చరిస్తావో ఒక్క సారి చదువు ’’ అని ఆదేశించాడు

కూడ బలుక్కుని చదివాను తెలుగు పేరు.

‘‘ ఖ్ఖదా  లంఝలి ’’ ... అని తయారయింది.

‘‘ వెరీ గుడ్ ! ఇక నుండీ నీ బ్లాగు పేరు ఇదే ! ఇక చూస్తో ! నీకింక తిరుగు లేదు .. ... ...అన్నట్టు ...’’

‘‘ ఇంకా ఏఁవిటి ; ’’ అడిగేను నీళ్ళు నములుతూ ...

అబ్బే, చిన్న విషయమే ... ఈ కంప్యూటర్ ఉంచిన చోటు కూడా వాస్తు ప్రకారం సరిగ్గా లేదు. అంచేత ఈ గోడ కొట్టించీసి, కంప్యూటర్ని ఆ మూలకి ఉండేలా  పెట్టుకో ! అప్పుడింక నీ ‘‘ ఖ్ఖదా లంఝలి ’’ వెలిగి పోతుందీ ...’’

నా కళ్ళు బైర్లు కమ్ము కొస్తున్నాయి. నేనేదో అనబోయే లోగా ...

‘‘ చెల్లెమ్మా ! పెసరట్టు రెడీయేనా ?!’’ అనరిచేడు వంట గది వేపు తొంగి చూస్తూ.

లోపలి నుంచి వాడి ప్రసంగ మంతా వింటున్నట్టే ఉంది ... ‘‘ఆఁ ! వచ్చె ... వచ్చె ... ఒక్క నిముషం అన్నయ్య గారూ ! ’’ అంటూ వినిపించింది మా ఆవిడ గొంతు.

అనతి కాలంలో తన భర్త ప్రపంచ ప్రఖ్యాత ఏకైక తెలుగు బ్లాగరు కాబోతున్నాడని ఏవేవో ఊహించు కుంటూ కలలు కంటోందేమో , ఖర్మ !నా  వెర్రి బాగుల శ్రీమతి

వాడు చెప్పిన తొక్కలోని న్యూమరాలజీ ప్రకారం నా కథా మంజరి బ్లాగు పేరు మారిస్తే వెలిగి పోవడం మాట ఎలా ఉన్నా, నన్ను అంతా తన్నడానానికి రావడం మట్టుకు ఖాయం . అంచేత బ్లాగుని మూసెయ్యడమే మేలు !


( సంఖ్యా శాస్త్రం పేరుతో మూఢనమ్మకాల విషాన్ని జన బాహుళ్యం లోకి వెద జల్లుతున్న ఓ తెలుగు ఛానెల్ వారికి స ‘ భక్తి ’ కంగా ఈ టపా అంకితమ్. )


26, జూన్ 2015, శుక్రవారం

కాకి గోల ! అను నామాంతరము గల కథా మంజరి బ్లాగు



అవి చేసుకున్న పాపం ఏమిటో కానీ, పక్షులలో కాకులనూ, జంతువులలో గాడిదలనూ మనుషులు తెగ ఈసడించు కుంటూ ఉంటారు. నిజానికి ఏదో రూపంలో వాటి అవసరాన్ని ఈ మనుషులు పొందుతూనే ఉంటారు. గాడిదల సంగతి మరో మారు చూదాం కానీ, ముందు కాకుల గురించి చూదాం.

నల్లని రూపం. కర్ణ కఠోరమైన గొంతు. ఉచ్చిష్ఠాలను తినే స్వభావం. వెధవ కాకి గోల ! అని విసుక్కుపోతూ ఉంటాం.

ముందుగా కాకి గల వేరే పేర్లు చూదాం.

అన్యభృత్తు, అరిష్టం, ఆత్మఘోషం, ఏకదృష్టి, ఏకాక్షం, కంటకం, కిరవం, గుమికాడు, పిశునం, యమదూత, బలిభృక్కు, మహానేమి, వాయసం, ద్వికం, దీర్ఘాయువు, చిరంజీవి , కృష్ణం, ప్రత్యలూకం,దివాటనం ...ఇలా చాలా పేర్లు ఉన్నాయి  లెండి !

కాకిని గురించిన కొన్ని ప్రస్తావనలు చూడండి:

వసంత కాలే సంప్రాప్తే కాక: కాక: పిక: పిక:

కాకులూ కోకిలలూ చూడ్డానికి దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వసంతకాలం వస్తే మాత్రం ఏది కాకో, ఏది కోకిలో ఇట్టే తెలిసి పోతుంది.

కాటికి కట్టెలు చేరెను
యేటీవల పక్షులన్ని యేడువ సాగెన్
కూటికి కాకులు చేరెను
వేటవరపు పోతురాజు లేడా ? రాడా ?

(భీమకవి తిట్టు కవిత్వం )

వయం కాకం వయం కాక:
ఇతి జల్పంతి వాయస:
తిమిరారి తమోహంతి
అస్మాత్ హంతి యితి శంక:

సూర్యుడు ఉదయించేడు. చీకట్లను తరిమి కొడుతున్నాడు. కాకులు గోల చేస్తున్నాయి. మేం కాకులం. మేం కాకులం అంటూ. లేక పోతే, సూర్యుడు చీకట్లతో పాటూ తమను కూడా ఎక్కడ తరిమి కొడతాడో అని వాటి భయం !

కాకులు చీకట్ల లాగా అంత కారు నలుపన్న మాట.

రామాయణంలో కాకాసురుడు అనే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. వాడు మందాకినీ తీరంలో సీతా దేవి నిద్రిస్తూ ఉంటే, ఆమె పయ్యెద తొలగించాడు. ఆమె స్తనాలను గోళ్ళతో గీరాడు. అది చూసి రాముడు కోపించి బాణంతో దానిని కొట్టాడు. అప్పుడా కాకి రాముడిని తప్పు మన్నించమని శరణు కోరింది. రామ బాణం అమోఘం కనుక కనీసం ఒక్క అవయవమైనా ఇమ్మన్నాడు రాముడు. కాకి తన కన్ను ఒకటి ఇచ్చివేసింది. అప్పటి నుండీ కాకులకు ఒక కన్ను లేదు.
అందుకు కాకికి ఏకాక్షి అని కూడా పేరు వచ్చింది.
తద్దినాలలో కాకి పిడచ పెడతారు. కాకి పిండం అని దానినంటారు. పితృ దేవతలు కాకి రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారని విశ్వాసం. ఉచ్చిష్ఠాలు తినే కాకి పితరు డెట్లాయెరా ! అని కవి వెక్కి రించాడు. దాని జోలికి మనం పోవద్దు.

యాగంటి క్షేత్రంలో కాకులు కన బడవుట. పూర్వం అగస్త్యుడు   తన తపస్సునకు  విఘ్నం  కలిగించాయని  కోపించి యాగంటిలో కాకులు కనబడకుండా పోవు గాక ! అని శపించాడుట.

కాకి బంగారం బంగారం కాదు.

కాకీకలను సిరా బుడ్డిలో ముంచి మా చిన్నప్పుడు సరదాగా రాసుకునే వాళ్ళం.

కాకి అరిస్తే ఇంటికి చుట్టా లొస్తారని మన వాళ్ళ నమ్మకం.

కుండలో నీళ్ళు అడుగంటి పోతే, రాళ్ళు వేసి పైకి ఉబికి వచ్చిన నీళ్ళను త్రాగిన తెలివైన కాకి కథ చిన్నప్పుడు చదువు కున్నాం కదూ !

పంచ  తంత్రం కథల్లో కాకి కూడా వొక ముఖ్య పాత్రే. లఘు పతనకం గుర్తుందా ? !

కాకి గూట్లో కోకిల పిల్ల అనే సామెత ఎందుకు వచ్చిందంటే, కోకిల గ్రుడ్లను పెడతాయే కానీ వాటిని పొదగ లేవుట. అందు చేత అవి పిల్లలయే వరకూ వాటిని కాకి గూట్లో కాకి గ్రుడ్లతో పాటూ ఉంచుతాయిట.

కాకి గూడు పెడితే కడపటి వర్షం అనే సామెత కాకి గూడు కట్టడం మొదలెడితే ఇక వానలు కురియవు అనిచెబుతారు

కాకి పిల్ల కాకికి ముద్దు.

కాకిని తెచ్చి బంగారు పంజరంలో ఉంచినా చిలుకపలుకులు పలుకుతుందా ?

కాకి ముక్కుకు దొండపండు అనే సామెత ఒకరు నలుపూ, ఒకరు తెలుపూ అయిన మొగుడూ పెళ్ళాల గురించి.

కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు. బలహీనులను దోచి బలవంతులకు ఇచ్చినట్టుగా అన్నమాట.

పిల్ల కాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ.

ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు .

లోకులు పలుగాకులు.

కాకులను ప్రస్తావిస్తూ గల కొన్ని సంస్కృత న్యాయాలు చూడండి:

కాక దంత పరీక్ష ... అనవసరమైన చర్చ అన్నమాట.

కాకతాళీయం ... కాకి తాటి చెట్టు మీద వాలడం, తాటి పండు రాలి తటాలున నేలన పడడం ఒకే సారి జరిగితే అది కేవలం కాకి వాలడం వల్లనే జరిగిందని అపోహ చెంద రాదు.

కాకరుత బీరు న్యాయం ... పగలు కాకి కూత విని భయపడి పోయి భర్తను ఆలింగనం చేసుకున్న ముద్దరాలు రాత్రి పూట నదిని దాటుకుంటూ విటుడి దగ్గరకి ఒక్కర్తీ వెళ్ళిందిట. అదీ ఎలాగూ, నదిలో ఉన్న మొసళ్ళకు ఆహారంగా మాంసం ముద్దలు వేసుకుంటూ , వాటి బారిన పడకుండా.

కాకాధికరణ న్యాయం ... పలానా వాడి ఇల్లు ఏదని అడిగితే, కాకి వాలి ఉంటుంది చూడూ అదే వాడి ఇల్లు ! అని తిక్క సమాధానం ఇవ్వడం.

కాకోలూకనిశాన్యాయం ... అంటే, కాకికి పగలయితే గూబకు రాత్రి. దానికి రాత్రయితే, దీనికి పగలు.

రావణుడికి భయపడి యముడు కాకి రూపం ధరించాడుట. జనం తమ పితృదేవతలకు తద్దినాలు పెట్టి కాకి పిడచను కాకులుకు పెట్టాలని, పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి ఆ పిండాలను తిని వెళ్తారుట. అప్పుడే వారికి తృప్తి కలుగుతుందిట. కాకులకు రావణుడు ఇచ్చిన వరంగా దీనిని చెబుతారు.

కాకులలో మాల కాకుల పరిస్థితి మరీ అధ్వాన్నం.

కవి యను నామంబు నీటి కాకికి లేదా ? అని అడిగే కవి ఒకడు.

పిండం తినే కాకి పితరుడెలా అవుతాడని తెగేసి చెప్పే కవి మరొకరు.



కాకేమి తన్ను తిట్టెనె?
కోకిల ధనమేమి తన్ను గో కొమ్మనెనే ?
లోకము పగయగు బరుసని
వాకున, చుట్టమగు మధుర వాక్యము కలిమిన్.

కాకి నిన్ను తిట్టిందా ఏమిటి ? కోకిల నీ కేమయినా డబ్బులిచ్చిందా? కాకిని అసహ్యిం కుంటావు. కోకిలను మెచ్చుకుంటావు. అంటే, లోకం కఠినంగా మాటలాడే వారికి దూరంగా ఉంటారు. సరుషంగా మాటలాడే వారు అందరకీ శత్రువులవుతారు. మధురంగా పలికితే మిత్రులవుతారు.

ఒక వృత్యనుప్రాసం సరదాగా చూడండి. ఇదీ కాకుల గురించే.

కాకీక కాకికి కోక. కుక్కీక కుక్కకి కోక. కాకీక కాకికి కాక, కుక్కకా ? కుక్కీక కుక్కకి కాక కాకికా ? కాకీక కాకికే కోక.
కుక్కీక కుక్కకే కోక...


ఇదీ కాకి గోల. గాడిదల గురించి మరోసారి.





23, జూన్ 2015, మంగళవారం

మా ఆవిడకి కోపం వొచ్చింది ...

మా ఆవిడకి కోపం వచ్చింది ! 

వచ్చిందంటే , రాదూ మరి ! అసలు మొగుళ్ళు చేసే తింగరి పనులకు ఆవిళ్ళకు కావిళ్ళ కొద్దీ కోపాలు వస్తాయంటే, పాపం, వారిదా  తప్పు ?

 భర్త అంటే, భరించే వాడని వ్యుత్పత్తి చెబుతారు కానీ, నిజానికి ఆ మాట భార్యలకు వర్తిస్తుంది. క్షమయా ధరిత్రీ అన్నారు కదా !

మన కోపాలను, చిరాకులను, పరాకులను, బలహీనతలను, వ్యసనాలను, అధిక ప్రసంగాలను, అవమానకర వ్యాఖ్యానాలను, పిలుపులను, తింగరి వలపులను, తలపులను, దుబారాలను, తెలివి తక్కువ  పనులను, తెచ్చే తగాదాలను, అలవిమాలిన అహంకారాలను, బద్దకాలను, అవసరాలను కూడా వాయిదా వెయ్యడాలను, అర్ధ నగ్నంగా ఇంట్లో తిరగడాలను, మాసిన బట్టలు రోజుల కొద్దీ మార్చుకోక పోవడాలను, చెప్పుకునే గొప్పలను, కప్పి పుచ్చుకునే తప్పులను, రాద్ధాంతాలను, వెర్రి మొర్రి సిద్ధాంతాలను, పిచ్చి కవిత్వాలను, వెర్రి బ్లాగులను, పువ్వులయినా కొనని పిసినారి తనాలను,ముభావాలను, ముఖం చాటేయడాలను, మన బట్ట తలలను, బాన పొట్టలను, పిట్ట కథలను, ... ఇది అనంతం. వీటిని ఆడాళ్ళు భరించడం లేదూ ? అన్నింటినీ భరిస్తూనే మొగుళ్ళను ప్రేమించ గలిగే, ఆడవారి ఓపికకి జోహార్లు !



ఆగాండాగండి. ధోరణి మరీ ఏక పక్షంగా ఉందంటారా ?

కొంపన్నాక, ఇన్నో, మరి కొన్నో ఇలాంటివి కొంచెం ఎక్కువ తక్కువలలో ఉంటాయి లెండి ...

ఇంతకీ ఏదో చెప్పాలని మొదలు పెట్టి , ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం కదూ !

అసలు విషయ మేమిటంటే, మా ఆవిడకి కోపం వచ్చిందని కదూ చెప్పాను ? !

అవును. మా ఆవిడకి కోపం వచ్చింది !

ఎప్పుడంటారా ? దాదాపు ఏభై ఆరేళ్ళ క్రిందట !

ఆగాగాగాగాగు. ఏఁవిటీ, ఏభై ఆరేళ్ళ కిందట మీ ఆవిడకి కోపం

వచ్చిందా ? నీ ప్రొఫైల్ చూసాం. నీ వయసెంతో తెలుసు. ఏభై ఆరేళ్ళ క్రితం ఆ చిట్టి తల్లి మీ ఆవిడెలా అయిందీ ? ! మీది బాల్య   వివాహమా ?! అని మీకు డౌటొచ్చింది కదూ ?

అదేం కాదు, ఆమెకి ఆరేడేళ్ళప్పటి సంగతే యిది. ఆ వయసులోనే ఆ పిల్ల కి నేనే మొగుడినని పెద్దలు తీర్మానించీసేరు.  (  నేనూ డిసైడయి పోయే ననుకోండి !)  మాది మేనరికం. అంచేత,

ఆ పాపే ( ఆవిడే ) మా ఆవిడ. .

మా ఆవిడకు కోపం వచ్చిన విధంబెట్టి దనిన ...

అప్పట్లో మేం మా తాతగారింట అనంత పురం జిల్లా ఉరవ కొండలో చాలా కాలం ఉండే వాళ్ళం. మా తాత గారక్కడ రిటైర్డ్ సివిల్ సర్జనుగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూ ఉండే వారు.

తాత గారు మనవళ్ళకీ మనవరాళ్ళకీ వెళ్ళి నప్పుడల్లా కొత్త బట్టలు కుట్టించి యిచ్చే వారు. అందరికీ ఒకే రకం నిక్కరూ చొక్కాలూ, అమ్మాయిలకు ఒకే రకం గౌన్లూ అన్నమాట.

సరే, మా ఆవిడ కోపం గురించి చెబుతాను ...

ఆ రోజు అలాగే తాత గారిచ్చిన కొత్త బట్టలు నేనూ, ( తర్వాత ఎప్పుడో కానున్న ) మా ఆవిడా , మా చెల్లి కాంతీ
 ( పన్నెండో ఏటనే దానిని దేఁవుడు నిర్దాక్షిణ్యంగా మానుండి తీసుకు పోయేడు ) , మా ఆవిడ అన్న , అంటే , మా బావా వేసు కున్నాం.

మా ఆవిడ కోపానికి బీజం ఇక్కడే పడింది !

ఏం జరిగిందంటే, మా చెల్లి కాంతి కావాలనే పెంకె తనంతో మా ఆవిడకి కుట్టించిన గౌను వేసేసుకుంది ! దాని గౌను మా ఆవిడకి ఇరుకయి పోతుంది. ఎవరెంత చెప్పినా మా చెల్లి కాంతి ఆ గౌను తిరిగి ఇవ్వడానికి ఒప్పు కోలేదు. దాంతో పెద్దలు మా ఆవిడనే బతిమాలి , బామాలి మా చెల్లెలి గౌనునే ఫొటో కోసం వేసుకో మని ఒత్తిడి తెచ్చి బలవంతంగా అంగీకరింప చేసారుట. ఆ ఇరుకైన గౌను వేసు కోవాల్సి వచ్చి నందుకు మా ఆవిడకి కోపం వచ్చింది. రాదూ మరి ? ధుమ ధుమలాడి పోయింది. అందుకే ఫొటోలో బుంగ మూతితో కనిపిస్తోంది.

ఆ కోపంలోముద్దు ముద్దుగా లేదూ !

ఇంతటితో అయిందీ ? ! మా ఆవిడ ముచ్చట  పడి తెచ్చుకున్న గులాబి పువ్వును కూడా మా కాంతి లాక్కుంది . ఎంత అడిగినా ఛస్తే ఇవ్వనని భీఫ్మించుకు కూర్చుంది.

అందుకే ఫొటోలో చేతిలో గులాబీ పువ్వుతో నవ్వుతూ మా చెల్లాయి కాంతీ, కోపంతో చిటపట లాడి పోతూ బుంగ మూతితో, పొట్టి గౌనుతో మా ఆవిడా కనిపిస్తున్నారు చూడండి ... వాళ్ళకి చెరో వేపూ, అంటే, ఎడమ వేపు నేనూ, కుడి వేపు మా బావా ఉన్నాం. ఇది డబ్బా కెమేరాతో మా చిన్న మామయ్య  తీసిన ఫోటో.

ఇదండీ ఈ ఫొటో కథ ! ఈ చిన్నప్పటి ఫొటో అంటే నాకూ మా ఆవిడకీ ఎంతిష్టమో. చూసి నప్పుడల్లా నవ్వు కుంటూ ఉంటాం.

ఉరవ కొండ తీపి ఙ్ఞాపకాలతో కబుర్లు కలబోసు కుంటూ ఉంటాం.

ఇదీ ఆ ఫొటో   చూడండి ...
 

22, జూన్ 2015, సోమవారం

నీకంత సీన్ లేదులే ! అనబడు కుండ బ్రద్దలు కొట్టిన పద్యాల కథ !

‘‘ తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు
దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?

ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !


మరో పద్యం చూడండి:


స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట ! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చిన మాత్రనె యింత గర్వమా !
మానవతీ శిరోమణుల మాలికలయందును గూర్ప వత్తువో ?
కానుకలియ్య వత్తువో, వికాసము నిత్తువొ , విల్వ దెత్తువో ?!

ఈ పద్యం ముక్కు తిమ్మన గారిదని చెబుతారు.

స్థాన విశేష మాత్రం చేత మాత్రమే కొందరకి, లేదా కొన్నింటికి గొప్పతనం చేకూరుతూ ఉంటుంది. తామరపాకు మీద నీటి బొట్టు ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. అంత మాత్రం చేత అది మంచి ముత్యం ఎన్నటికీ కానేరదు కదా !
కవి అదే చెబుతున్నాడు : ఓ తామరపాకు మీద నీటి బొట్టూ ! నువ్వు తామరపాకు మీద నిలచి ఉండడం చేత నిన్ను ముత్యంతో పోలుస్తూ ఉంటారు. అది స్థానవిశేషం వల్ల వచ్చిన గొప్పతనం. అంత మాత్రం చేత నీకు ఇంత గర్వం తగదు సుమా ! నువ్వేమయినా లలనల శిరోరత్నాలలో కూర్చడానికి పనికి వస్తావా ? ఎవరికయినా కానుకగా ఇవ్వడానికి తగుదువా ? నీకు వికాసమూ లేదు, విలువా లేదు!

అంతే కదా, నీటి బొట్టు తామరపాకు మీద ఉన్నంత సేపే ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. స్థానభ్రంశం చెందిందా, యిక దాని పని అంతే. వొట్టి నీటి బొట్టే. కదా.

మరో పద్యం చూడండి:



తక్కక నేల ముట్టెగొని త్రవ్వగ నేర్తునటంచుఁదాకుతా
వొక్కటి జాతియందు మదమెక్కకు బుద్ధిని వెఱ్ఱిపంది ! నీ
వెక్కడ ! యాది ఘోణియన నెక్కడ ! యద్రి సముద్రదుర్గ భూ
ర్భాక్కు తలంబు నొక్క యరపంటినె మింటికినెత్త నేర్తువే ? !

ఓ వెఱ్ఱి వరాహమా ! నేలను ముట్టెతో త్రవ్వడంలో నాకు నేనే సాటి అంటూ గొప్పలు పోతూ గర్విస్తున్నావు.
నువ్వెక్కడ ? ఆదివరాహ మెక్కడ ? సముద్ర గర్భంలోని భూమిని ఒక కోరతో అవలీలగా ఆ తొలి కిటి మీదికి ఎత్తలేదూ ! ఆ ఆది వరాహం ముందు నువ్వెక్కడ, నీ ప్రతాపమెక్కడ !


ఈ పద్యం భట్టు మూర్తిదిగా చెబుతారు.

తమకు లేని పోని గొప్ప తనాన్ని ఆపాదించు కుంటూ. అహంకరించే అల్పులను అభిశంసిస్తూ కవులు చెప్పిన పద్యాలు చూసాం కదా.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.


గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఇలాంటిదే శ్రీనాథుని మరో చాటువు చూడండి:


ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !

ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

ఇదీ, నీకంత సీన్ లేదు ! అని కుండ బద్దలు కొట్టిన పద్యాల కథ .



20, జూన్ 2015, శనివారం

మా తింగరి బుచ్చి గాడి తిరుగలి గూర్చిన తింగర్యోపన్యాసమ్



ఇప్పుడంటే మిక్సీలూ , గ్రైండర్లూ వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో ఆడవాళ్ళు జబ్బలు పీకే లాగున పిండి రుబ్బాలంటే రుబ్బు రోలునీ, దంచాలంటే రోళ్ళూ రోకళ్ళనీ, విసరాలంటే తిరుగళ్ళనీ ఆశ్రయించే వారు.

ప్రస్తుతం మనం తిరుగలికి చెందిన కబుర్లు చెప్పు కుందాం.

మీదో రాయీ, కిందో రాయీ ఉండే విసురు సాధనం తిరుగలి. కింద రాయి స్థిరంగా ఉంటే, మీద రాయి చేత్తో త్రిప్పడానికి అనువుగా ఉంటుంది. మీద రాతిని చేత్తో త్రిప్పడానికి అనువుగా ఒక కర్రతో చేసిన పిడి ఉంటుంది. విసర వలసిన గింజలను మీద రాయి మధ్యలో ఉండే ఖాళీ లోంచి పోసి, ఇంక త్రిప్పడం ( అంటే విసరడం) మొదలు పెట్టే వారు. విసరగా విసరగా మెత్తని పిండి రెండు రాళ్ళ మధ్యా ఉండే ఖాళీ ప్రదేశం నుండి కింద పడేది. ఇదీ తిరుగలి పని చేసే తీరు.

ఈ తిరుగలికే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి !

అంజి, అనఘట్టము,కణలాభము, ఘరట్టము,జిక్కి,యంత్రపేషిణి,యంత్రము, రాగల్రాయి, విసుర్రాయి ... ఇవండీ తిరుగలికి ఉన్న మరో పేర్లు !

ఇంత ఆయాసపడి పోవడం ఎందుకు కానీ, హాయిగా మనం తిరుగలి అనో, విసుర్రాయి అనో తెలిసిన పేర్లతో ప్రస్తుతానికి ముద్దుగా పిలుచు కుందాం ! ప్రాణానికి సుఖంగా ఉంటుంది.

తిరుగలి ఊసెత్తితే సాయి భక్తులకి సాయి బాబా షిర్దీలో తిరుగలి విసరడం గుర్తుకు వస్తుంది. కదూ !

ఆ కథ ఇక్కడ మరొక్క సారి గుర్తుకు తెచ్చు కుందాం.

అన్నా సాహెబ్ ధబోల్కర్ అనే ఒక పెద్ద మనిషి బాబా కీర్తి గురించి విని ఆయన దర్శనం కోసం షిరిడీ రావాలనుకున్నాడు. అతడు వచ్చిన రోజు ప్రొద్దున సాయి బాబా మసీదులో ఒక తిరగలి ముందర కూర్చుని గోధుమలు విసురుతున్నారు. బాబాకు ఇల్లు సంసారం లేవు. వారు భిక్షాటనంతో జీవిస్తారు గదా! మరి ఈ గోధుమ పిండి ఎందుకు? అని అతడు వచ్చి ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అంతలో నలుగురు ఆడవాళ్ళు బాబాను తిరగలి ముందు నుంచి లేపి, పాటలు పాడుతూ పిండి విసిరారు. తరువాత దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకు పోబోయారు. అపుడు బాబా వాళ్ళను కోప్పడి "ఈ పిండి మీకు కాదు. దిన్ని తీసుకువెళ్ళి ఊరి సరిహద్దులలో చల్లండి" అని ఆజ్ఞాపించారు. ఇదంతా చూస్తున్న అన్నా సాహెబ్ ఆ ఊరి వాళ్ళను అడిగాడు - అలా పిండి ఊరు చుట్టూ చల్లటం దేనికి? అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం: "షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. దాన్ని పోగొట్టడానికి బాబా యిలా చేసారు. ఆయన విసిరింది గోధుమలు కావు, వ్యాధినే" అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే మరునాటికి కలరా వ్యాధి తగ్గు ముఖం పట్టింది. అన్నా సాహెబ్ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. ఇక ఆయన దగ్గరే ఉంది పోయాడు. బాబా కూడా అంతర్నేత్రంతో ప్రేమగా చూచేవారు. అతని "హేమాడ్పంత్" అని పిలిచేవారు. అతని మనసులో ఏ సందేహం వచ్చినా, బాబా తీర్చే వారు
తిరుగలి గురించి ఇంత పవిత్రమూ, ప్రశస్తమూ, ప్రఖ్యాతమూ అయిన కథలూ, విశేషాలూ ఉండగా ఓ సారి మా తింగరి బుచ్చి గాడు ఒక మహిళామణుల సభలో తిరుగలి గురించి అవాకులూ చవాకులూ ఉపన్యసించి మెడ మీదకి ( పీక మీదకి అని ఎందుకు అన లేదో మొత్తం ఆ వృత్తాంతం చదివితే గానీ మీకు తెలియదు) తెచ్చు కున్నాడు.
ఇంతకీ, మా తింగరి బుచ్చి గాడి గురించి మీకు చెప్పనే లేదు కదూ ! సన్నగా రివట వలె గాలికి తూలి పోవు రీతిని ఒప్పు వాడు. అడపాదడపా సభలలో సందడి చేయు వాడు. పిలిచిననూ, పిలువక పోయిననూ సభా ప్రాంగణము నందు తిరుగాడు వాడు. వీలు చిక్కించు కుని వేదిక నెక్కి తన ధోరణిలో ఉపన్యాసము లిచ్చు వాడు. మిక్కిలి తరుచుగా ఉపన్యాసము పూర్తి చేయక ముందే బలవంతముగా వేదిక నుండి నిర్దాక్షిణ్యముగా దింపి వేయ బడు వాడు. అంతియ కాక, లోకములో ఏ విషయము తనకు తెలియదను మాట లేని వాడు. సమస్త విషయముల గూర్చిన సమగ్ర సమాచారము తన వద్ద మాత్రమే కలదని అహంకరించు వాడు ...
మా తింగరి బుచ్చిగాడి ఘనత గురించి చెబుతూ పోతే తరిగేది కాదు కానీ , ఇప్పుడు వాడిచ్చిన తిరుగలి గురించిన ఉపన్యాసం గురించి మాత్రం చెబుతాను వినండి:
‘‘ మన వాళ్ళుట్టి వెధవలోయ్‘‘ అని గురజాడ ఊరికే అన లేదు. గురజాడకి అసలు మన వారి గురించిన ఆ గ్రహింపు మా ముత్తాత బ్రహ్మశ్రీ తింగరి హనుమాన్లు శాస్త్రుల వారి వలన కలిగిందని మీలో ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చును. సరే ఈ విషయం కాస్సేపు ప్రక్కన పెడదాం ! మన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాక పోతే, ఆలు మగల సంసారాన్ని బండి చక్రాలతోనా పోలుస్తారూ ! చక్రాల సంగతి అలా ఉంచితే, బండిని లాగేవి ఎద్దులు కదా ? ఆ రెండున్నూ పుంలింగములు కదా ? మరి ఆలు మగలలో ఒకరు పురుషుడున్నూ, వేరొకరు స్త్రీయున్నూ అయి ఉన్నారు కదా !
అందు చేత ఈ పోలిక శుద్ద చవటలు చేసిన పోలికగా నేను ఈ వేదిక మీద నుండి ధృవీకరిస్తున్నాను.... ’’ మా తింగరి బుచ్చి గాడి ఉపన్యసం ఈ వరకూ వచ్చే సరికి సభలో కొంత అలజడి బయలు దేరింది. అసహనం పురులు విప్పింది. హాహాకారాలు చెలరేగాయి. అదంతా తనఉపన్యాస ధోరణికి ప్రశంసారూపమయిన శబ్ద ఘోషగా ఎంచి, మా తింగరి బుచ్చి తన ఉపన్యాసాన్ని ఇంకా ఇలా కొన సాగించాడు:
‘‘ అందు చేత నా మట్టుకు నాకు భార్యా భర్తలను తిరుగలితో పోల్చడం సరైనదని పిస్తుంది. కింద ఉండే రాయి భార్య అయితే, పైనుండే రాయి భర్త. కింద రాయి అంగుళం కదలదు. అంటే, ఏమిటంటా, ఆడది గడప దాటకుండా ఇంట్లోనే పడి ఉండాలన్నమాట ! ఇక మగాడు పైన ఉండే రాయిలాగా సదా తిరుగుతూ డబ్బులు సంపాదించాలన్నమాట!అంతే కాకుండా మీది రాయి తిరుగుతూ ఉంటే, కింది రాయి ఆ రాపిడిని తట్టు కుంటూ ఉంటుంది. అంటఏ ఏమిటంటా ? భర్త పెట్టు నసను భార్య సదా భరిస్తూ ఉండడమే సృష్టి ధర్మం. అంతే కానీ నేటి ఆధునిక తుచ్ఛ వనిత వలె తిరుగబడుట అవివేకమూ, అనాగరికమూ ... ఇక, తిరుగలి తిరిగి నప్పుడే మెత్తని పిండి అనే సంసార సుఖాలు లభిస్తాయి. అయితే, సంసారం అనే ఈ తిరుగలి త్రిప్పేది ఎవరని మీకు ఆలోచన రావచ్చును. తిరుగలి పిడి అనే కాలం పట్టుకుని విధాత తిరుగలిని విసురుతూ ఉంటాడు....’’
ఇహ విన లేక సభలోని మహిళామణులంతా ఏక కంఠంతో దిగు ! దిగు !! ధ్వానాలు పలికి, మైకు లాక్కుని, చొక్కా గుంజుతూ, వేదిక మీద నుండి అర్ధాంతరంగా ఇవతలకి లాగి, సభాప్రాంగణం నుండి బయటకు ఎప్పటి వలె గెంటి వేసారట.
మా తింగరి బుచ్చి గాడు అందుకు నొచ్చు కోలేదు కానీ, తన గభీరమైన ఉపన్యాసం ఇంకా పూర్తి కాకుండానే అవాంతరం ఏర్పడింది కదా ! అని చింతించాడుట. ఆ రాత్రి అతనికి ఇంట అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా లభించ లేదని నమ్మకమైన సమాచారం కథామంజరి వద్ద ఉంది.
ఇదీ మా తింగరి బుచ్చిగాడి తిరుగలి మీద ఉపన్యాసం. వీలు చూసుకుని తింగిరోపన్యాసాలు అనే లేబిల్ క్రింద వాని ఉపన్యాసాలు మును ముందు మీముందు ఉంచగలను.
ఇక, తిరుగలి గురించి లోగడ కవిగారు ఒకరు చెప్పిన ఆశువు చూడండి
ఏడిచెదవేలనోయిక ఘరట్టమ ! త్రిప్పల బెట్టుచుందురే
చేడెలు నన్నటంచు కడు చిత్రముగా కడగంటి చూడ్కి చే
రేడులనైన ద్రిప్పెదరు రేలు పవళ్ళిక కేలుబట్ట నె
వ్వాడు పరిభ్రమింపడు సుమా ! సుదతీమణి త్రిప్పు చేతలన్ !!
దీని భావం:
ఓ తిరుగలీ ! ‘‘ఆడవాళ్ళు నన్ను స్థిరంగా ఉండనివ్వ కుండా అరిగి పోయేలాగున తెగ త్రిప్పుతూ ఉంటారు ’’
అని ఎందుకే ఏడుస్తావు ? స్త్రీలంటే ఏమిటను కున్నావ్ ! ఓర చూపులతో ప్రభువులనయినా గిర్రున తమ వెంట రేయింబవళ్ళు త్రిప్పుకో గలరు. ఒక తూరి చేయి అందుకుంటే, ఆ చేతిని వదలకుండా ఆవిడగారి కనుసన్నలలోతిరుగాడుతూ ఉండ వలసినదే కదా !
అన్నట్టు మాతింగిరి బుచ్చిగాడికి తెలుసో, లేదో, తిరుగలి మాహాత్మ్యం గురించిన ఓ విషయం వాడి చెవిని వెంటనే వేయాలి. అవపరమయితే ఏదో చోట తన ఉపన్యాసంలో ఉపయోగించుకుంటాడు కదా.
అదేమిటంటే, కోదాడ దగ్గర ఒక నరసింహస్వామి దేవాలయంలో ఒక తిరుగలి ఉంది. దానిని కౌగలించుకుని వేడుకుంటే ఎలాంటి కోరికలనయినా తీరుస్తుందని భక్త జనుల విశ్వాసం ! ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే తిరుగలి అదిట ! కావాలంటే ఈ క్రింది ఫొటో మీరే చూడండి: :
ఈ భక్తాగ్రేసరి ఇప్పట్లో లేవదు కానీ, ఇక శెలవ్.

ఇతి తిరుగలి ఉపాఖ్యానమ్ సర్వం ప్రస్తుతానికి సమాప్తమ్

కొంచెం టచ్ లో ఉంటే చాలును

అతి పరిచయా దవఙ్ఞా, సంతతగమనా దనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం కురుతే.

అతి పరిచయం వల్ల అలుసై పోతామట. తరుచు వస్తూ పోతూ ఉండడం వల్ల కూడా అనాదరం కలుగుతూ ఉంటుంది. రోజూ చచ్చే వాడి కోసం ఎంతని ఏడుస్తాం అంటారు కదా, అలాగే, రోజూ కనిపించే వాడు వస్తే ఏమీ పట్టనట్టుగా ఊరుకుండి పోతాం. మలయ పర్వతం మీద మంచి గంధం చెట్లు చాలా విస్తారంగా ఉంటాయి. మనకవి అపూర్వం. చాలా విలువైనవి. కాని అక్కడ ఉండే భిల్ల వనితలు ఆ మంచి గంధం చెక్కలనే వంట చెఱకుగా ఉపయోగించడం చూడ లేదూ ? అంటున్నాడు కవి. అతి పరిచయం వలన అలుసై పోవడ మంటే ఇదే. పని కట్టుకుని పుణ్య క్షేత్రాలకో, దర్శనీయ స్థలాలకో వెళతాం. అక్కడి ప్రతి అణువునీ కళ్ళార్పకుండా చూస్తూ తన్మయులై పోతూ ఉంటాం. కెమేరాలలో ఆ అందమైన
దృశ్యాలను అపురూపంగా బంధిస్తూ ఉంటాం. అక్కడి స్థానికులు మాత్రం మనంతగా విచలితులు కావడం జరుగదు. రోజూ చూసేదా కదా, అనే భావనతో రవంత నిర్లిప్తంగా కనిపిస్తారు.

ఆలు మగలైనా సరే, అప్పుడప్పుడు ఏ పుట్టినింటికో ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి నాల్రోజులు ఉండి వస్తూ ఉండడం మంచిది. ఎడబాటు ఎప్పుడూ మరింత చేరువ చేస్తుంది. అందుకే కదా, మన ప్రబంధ కవులు విప్రలంభ శృంగారానికి అంత ప్రాముఖ్యమిచ్చి, పోషించారు?

అంచేత, మరీ అతుక్కు పోకుండా, తగు మోతాదులో కొంచెం టచ్ లో ఉంటే చాలు ... కదూ !

18, జూన్ 2015, గురువారం

మణి ప్రవాళమ్ అదో తుత్తి ... తెలుగింగ్లీష్



రెండు భాషలు కలగలిపి కవిత్వం చెప్తే దానిని మణి ప్రవాళ రచనగా పేర్కొంటారు. తెలుగునీఆంగ్లాన్నీ కల గలపి పద్యాలూ , కవితలూ వ్రాసి, మన కవులు కొందరు చాలా తమాషాలుచేసారు.
మచ్చుకి కొన్నింటిని చూద్దాం ...
ముందుగా కన్యా శుల్కంలో మన గిరీశం గారు వెలగ బెట్టిన రాగ వరసను చూడండి
నీ సైటు నా డిలైటు
నిన్ను మిన్ను కాన కున్న
క్వైటు రెచడ్ ప్లైటు,
మూను లేని నైటు ...
పొటిగరాప్పంతులు పంపిన మనిషిని చూడనట్టుగా,హుషారుగా చెప్పిన తెలుగింగ్లీషుకవిత ( ? )
ఫుల్లు మూను లైటటా
జాసమిన్ను వైటటా
మూను కన్న మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా ! టా ! టా !

మరి, శ్రీ. శ్రీ గారి కందాన్ని చూడండి ...

గోల్డ్వ్యామోహం చెడ్డది
మైల్డ్వ్యాయామం శరీర మాద్యం ఖలుడా,
చైల్డ్వ్యాపారం కూడదు,
ఓల్డ్వ్యూలను హోల్డు చేయకుండుముర, జరూ !

మరి కొన్ని పద్యాలను చూదామా ?

కనులం జూడదు భార్య యేనియును, నీ కాలస్థితింబట్టి, జ
ర్మను తైలమ్ము, జపాను సబ్బమెరికా క్రాఫున్, వియన్నా సులో
చనముల్, స్వీడను చేతి బెత్తమును, స్విడ్జర్లాండు రిస్ట్ వాచి, ఫా
రెను డ్రస్, ఫ్రెంచి కటింగ్ మీసమును, ఫారిన్ ఫ్యాషన్ లేనిచో నిలన్.

( మాధవ పెద్ది బుచ్చి సుందర రామ శా స్త్రి )

ఇన్స్యూరు లేని లైఫును
సెన్సార్ గానట్టి ఫిల్ము, సీక్రెట్ ట్రూతున్
వైన్సర్వు కాని ఫీస్టును
విన్సే లేనట్టి టీము వేష్టుర బ్రదరూ !
, ...

లైఫన నౌవెడే నసలు రైటని చెప్పగ లేము, బెడ్డులో
నైఫును, బోలెడెత్తు ప్రతి నైటును డేయును ఫాలో యవగా
వైఫును, సన్సు, డాటరుల ప్రాపరు రక్షణ ప్రొటెక్షనిచ్చెడిన్
లైఫుకు యిన్సురెన్సు బహుళంబుగ, ప్రాంప్టు ప్రొటెక్షనిచ్చెడిన్.

( మీది రెండు పద్యాలు ఇలపావులూరి సుబ్బారావు గారివి, )

ఇక, విశ్వనాథ కవి రాజు గారి పద్యం చూదామా ?

రామది కింగ్సు సన్ను వితు లక్ష్మణ ఎండ్ వితు సీత క్రాస్డు దీ
ఫేమసు దండకాసు బిగు ఫీల్డును మోస్టు లెబోరియస్లి, దెన్
కేము విరాధ విత్తు హిజు క్రూయలు వర్డ్సు, బివేరు ఫూల్సు నో
టైము టు లూజయాము వెరి టైర్డయి వాంట్మయి బ్రేకు ఫాస్టు సూన్.

చూసారా, తెలుగింగ్లీషు పద్యాలు ... అదో తుత్తి ! ...ఇలాంటి తమాషా మణి ప్రవాళ రచనలు చాల మంది కవులు చేసారు. తెలిసిన వారు తెలిసింది తెలుసుకుని చెప్తే తెలుసుకుని
వెరీ గ్లేడంటాను. ..

5, జూన్ 2015, శుక్రవారం

హన్నా ! ఏదీ కర్రా !! అనబడు దండం దశ గుణం భవేత్ !!



దండం దశ గుణం భవేత్ అనే మాట తరుచుగా వింటూ ఉంటాం కదా?
దాని పూర్తి పాఠం చూదాం ...

విశ్వా మిత్రా హి పశుషు, కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

వి = పక్షులు
శ్వా = కుక్కలు
అమిత్ర = శత్రువులు
అహి = పాములు
పశు = పశువులు ( వీటిని అదుపు చేయడానికిన్నీ)

కర్దమేషు = బురదలో
జలేషుచ = నీటిలో
అంధే = గుడ్డితనంలో
తమసి = చీకటిలో
వార్ధక్యే = ముసలితనంలో ( సాయంగా ఉండేది కర్ర.)
( ఈ విధంగా)

దండం = కర్ర
దశగుణమ్ = పది విధాలయిన
గుణమ్ = గుణములు కలది
భవేత్ = అగుచున్నది.

అంటే, చేతి కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడుతుంది.

అంతే కాక, బురదలో సజావుగా నడవడానికి, నీటిలో లోతు చూసుకుంటూ దిగడానికీ, చీకటిలో తడుముకుంటూ క్షేమంగా వెళ్ళడానికీ, గుడ్డితనంలో ఆసరాగానూ, ముసలితనంలో ఊతగానూ ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేతి కర్ర పదిరకాలుగా మనకు ఉపయోగ పడుతున్నదన్నమాట.

శ్లోకం అర్ధం ఇలా ఉంటే, మనలో చాలమంది ఎందుకో, దండించడం వల్ల ( శిక్షించడం వల్ల) పదిలాభాలు ఉన్నాయి .. వంటి అర్ధాలు చెబుతూ ఉంటారు. దండం అనే పదాన్ని దండన అనుకోవడం వలన ఈ భావం కలుగుతూ ఉండొచ్చును.

మరయితే, ఈ టపాకి ఎన్నుకున్న చిత్రం అలా ఉందేమిటయ్యా, అని నిలదీయకండి.

ప్రమాదో ధీమతామపి ( బుద్ధిమంతులు కూడ ఒక్కొక్క తూరి పొరబడుతూ ఉంటారు) అని చెప్పడానికి అలా ఉంచానంతే.



31, మే 2015, ఆదివారం

పొటిగరాప్పంతులు ( జూ ) తో మాటా మంతీ ...

ఈ మధ్య విజయ నగరం వెళ్ళినప్పుడు అలా మూడు లాంతర్ల వరకూ వెళ్తే పొటిగరాప్పంతులు కలిసేడు.
కన్యాశుల్కం మొదటి అంకంలో వచ్చే పొటిగరాప్పంతులు పని వాడుగుర్తున్నాడా?
సాన్దీ గిరీశమూ కలిసి తీయించుకున్న ఫొటోల డబ్బులు వసూలు చేసుకుని రమ్మని వాడిని పంతులు పంపిస్తాడు.
నేను కలిసింది ఆ పొటిగరాప్పంతులు గారి మనవడిని. పొటిగరాప్పంతులు, జూనియర్ నన్న మాట.
‘‘పొటిగరాప్పంతులూ ఎలా ఉన్నావెలా ఉన్నావ్’’ అనడిగేను.
‘‘ ఏం ఉండడంలే, ఏదో, యిలా ...’’ అన్నాడు.
‘‘ అదేం ? ’’
‘‘ మా తాత గారు కాలం చేసే వరకూ గిరీశం గారి బాకీ కోసం మనుషులని పంపించీ, తను కాళ్ళరిగేలా తిరిగీ కూడా ఆ బాకీ రాబట్టుకో లేక పోయేరు. వారి తదనంతరం మా తండ్రి గారూ . తర్వాత నేనూ, కనీసం గరీశం గారి మనవళ్ళెవరయినా కనిపించక పోతారా, వారి తాత గారివ్వాలిసిన బాకీ తీర్చక పోతారా అనే ఆశతో ఇలా విజనగరం వీధులంట తెగ తిరుగుతున్నాను..‘‘
‘‘ ఎవరూ కనిపించ లేదూ?’’
‘‘ కనిపించకేం. కానీ అందరూ ఆ తాత గారి చందమే‘‘
‘‘అదేమిటి?’’
‘‘ అందరూ దాదాపు గిరీశం గార్లాంటి వాళ్ళే తయారయేరు. సానుల్తో ఫొటోలు దిగడం, డబ్బుల కోసం మనిషిని పంపిస్తే ఏవో మాయ మాటలు చెప్పి తప్పించు కోవడం ... పైగా గాయత్రి మీద ప్రమాణాలు చెయ్యడమొకటీ ... బిజినెస్సు దివాళా తీసిందనుకో’’ అన్నాడు విచారంగా.
పాపం. అనుకున్నాను. పొటిగరాప్పంతులు పంపిన మనిషికి టోకరా ఇచ్చి, గిరీశం , శిఫ్యడు వేంకటేశంతో ఆ బడుద్ధాయికి చదువు చెప్పే నెపంతో ఉడాయించడం ..... క్రిష్ణరాయపురం అగ్రహారం వెళ్ళిఅగ్ని హోత్రావధాన్లు ఇంట తిష్ఠ వేయడం..... అన్నీ గుర్తొచ్చాయి,
‘‘ సరే కానీ, విజయ నగరం అందాలు చూపించే ఫొటోలు ఏవయినా ఉంటే ఇద్దూ, మా బ్లాగు మిత్రులకి చూపిస్తాను’’ అనడిగేను.
‘‘ బ్లాగా ? అంటే ...? ’’ అనడిగేడు అనుమానంగా.
‘‘ దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ, ముందు ఫొటోలుంటే ఇవ్వు’’
‘‘సరేలే, నీ ఏడుపేదో నువ్వుఏడువ్. ఏవో కొన్ని ఫొటోలున్నట్టున్నాయి. ఇస్తాను తీసికెళ్ళి ఎలా తగలడతావో నీ ఇష్టం.
ముందు నాకో మాంఛి చుట్ట పీక ఉంటే ఇలా పారెయ్‘‘
‘‘ చుట్ట లేదు కానీ, కింగ్ సైజు ఫిల్టరు సిగరెట్టుంది, కాల్చు’’ అంటూ ఓ సిగరెట్టూ, అగ్గి పెట్టె అందించాను.
చీదరగా ముఖం పెట్టాడు పంతులు.
‘‘ చుట్ట లేదూ? గురజాడ వారు మా గిరీశం నోటంట చుట్ట మాహాత్మ్యం గురించి ఎంత గొప్పగా చెప్పారో అప్పుడే మరిచి పోయేరా వెధవ కక్కకట్టల్లారా.... ’’ అంటూ అయిష్టంగానే సిగరెట్టు వెలిగించి, ఓ దమ్ము లాగి వదిలేడు.
‘‘ మరి నేనడిగిన ఫొటోలో?’’
‘‘ నీ అమ్మ కడుపు కాల. వదలేలా లేవురా. సరే నా దగ్గర కొన్ని ఫొటోలేవో ఉన్నట్టున్నాయి. ఇస్తాను. అప్పటి విజయనగరం కాదురా తండ్రీ. చాలా మారి పోయింది. పండు ముత్తయిదువులా ఎంత బాగుండేదని ... ఇప్పటి రూపంలో మన విజయ నగరాన్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కు పోతుందిరా బాబూ ....నువ్వే చూడు ...’’ అంటూ కొన్ని ఫోటోలు అందించేడు.
ఆత్రంగా వాటినందుకుని, గబగబా చూసేను. ‘‘ అవునూ, ఇంకా చాలా స్థలాలకి చెందిన ఫొటోలు ఉండాలే , ఏవీ,
చా.సో గారి హవేలీ , మచ్చ కొండా, కొట లోని రౌండ్ మహల్, మోతీ మహల్, పెద్ద చెరువు గట్టు మీద రాజుల విగ్రహాలూ, ఏనుగుల తోటా, నారాయణ దాసు గారూ, ద్వారం వారూ, కోడి రామ్మూర్తి గారూ నివసించిన ఇళ్ళూ, వ్యాయామశాల, పూల్ బాగ్, , బాబా మెట్ట , దివాన్ గారి మేడ, రాజారావు మేడ, అంబటి సత్రం, అయ్య కోనేరు గట్టున వెలసిన వేంకటేశ్వర స్వామి వారి చిన్న గుడీ. చిన్న ఆంజనేయ స్వామి వారి కోవెలా, లంక వీధి, కానుకుర్తి వారి సత్రం, అయోధ్యా మైదానం,, రాజు గారి సాని సింహాచలం మేడ ... ఇవన్నీ ఏవీ ? ’’ అడిగేను.
‘‘ నీ ముఖం తగలెయ్య. పైసా విదల్చకుండా ఫొటోలన్నీ దొబ్బుకు పోతూ, మళ్ళీ అవి లేవు, ఇవి లేవు అంటూ సణుగుడొకటా.? ఇప్పటికి ఉన్నవి తీసికెళ్ళు. ఈ సారి మిగతావి దొరికితే ఇస్తానులే. సరే కానీ, ఈ సారి వచ్చి నప్పుడు మంచి చుట్టల కట్ట తేవడం మాత్రం మరిచి పోవద్దు సుమీ....ఇక వెళ్ళు ఆ గిరీశం ఎలానూ ఇక దొరకడు. కనీసం వాడి మనవలో, మునిమనవలో కనిపిస్తారేమో చూడాలి. మా తాత గారు తీసిన పుటిగరాపుల బాకీ వసూలు చేసుకోవద్దూ? అసలప్పుడే మా తాత గారు సౌజన్యారావు పంతులు గారిని కలిసి ఆ గిరీశం మీద దావా పడేద్దామనుకున్నారట కానీ, విశాఖ పట్నం వెళ్ళి రావడానికి ఛార్జీలు లేక ఉండి పోయార్ట. .. సరేలే, వెళ్ళిరా ...’’ అంటూ జనంలో కలిసి పోయేడు.
ప్రవాహంలా సాగి పోతున్న అ జన వాహినిలో ఈ జూనియర్ పుటిగరాప్పంతులుకి వందలాది, వేలాది గిరీశంలాటి వాళ్ళు కనిపిస్తారు.
గిరీశం నేర్పించి పోయిన టక్కరి విద్యలు ఉపయోగించి పంతులుని లాఘవంగా బురిడీ కొట్టించి చక్కా పోతారు.
పంచె కట్టు మానీసి, ఫేంటూ చొక్కాలతో లుబ్ధావధాన్లూ, కరటక శాస్త్రీ , అగ్ని హోత్రావధాన్లూ వగైరాలు కాని ,
వాళ్ళ లాంటి వారు కానీ, కూడా కనిపించ వొచ్చును.
సౌజన్యారావు పంతులు కనిపించడు. కనీసం అలాంటి మహానుభావులూ కనిపించరు.
ఇక మధుర వాణి సంగతంటారా? అక్కడే కాదు యావద్దేశంలోనూ, ఆ మాట కొప్తే యావత్ ప్రపంచం లోనూ పొటిగరాప్పంతులకే కాదు, అసలు ఎవరికీ మరి కనిపించదు. ఎందుకంటే ఆవిడ గురజాడ వారి కాళ్ళొత్తుతూ
ఏ స్వర్గంలోనో అంత గొప్ప పాత్రగా తనని తీర్చి దిద్దిన ఆ మహా రచయిత ఋణం తీర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ....
మరింక పుటిగరాప్పంతులు (జూ) ఇచ్చిన ఫొటోలు చూడండి .......
మహా రాజా వారి కోట. ఇందులోనే రౌండ్ మహల్, మోతీ మహల్ వగైరా భవనాలు ఉన్నాయి. ఇప్పుడీ కోట లోని భవనాలన్నీ రాజుల వితరణ త తో విద్యాసంస్థలకు నెలవులయి విలిసిల్లుతున్నాయి.

ఈ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అని అంటారు. గురజాడ వారి కన్యాశుల్కం నాటకం మొదటి అంకం లోని మొదటి స్థలం ఇదే. బొంకుల రాయడు గరీశం బొంకుల దిబ్బ దగ్గరే నాటకంలో తొలి సారిగా కనిపిస్తాడు..ఇప్పుడీ ఖాళీ జాగాలో కూరగాయల మార్కెట్టు ఉంది.

దీనిని మూడు లాంతర్ల జంక్షన్ అంటారు. నిజానికిది నాలుగు రోడ్ల కూడలి కాదు. ఇక్కడ మూడు రోడ్ల కూడలి ఉంది. ఒకటి కస్పా బజారు మీదుగా కోట వేపు వెళ్ళే రోడ్డు కాగా, దానికి ఎదురుగా అంబటి సత్రం, పూల్ బాగ్లకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఇక, మూడులాంతర్లకి ఎదురుగా పోయే రోడ్డు లో మొదట్లోనే అమ్మ వారి గుడీ, అది దాటేక గంట స్థంభం వస్తాయి. ఆ దారి తిన్నగా రైల్వే స్టేషన్కి దారితీస్తుంది. గంటస్థంభం నుండి మధ్యలో ఎడమ వేపు తిరిగితే పెద్ద చెరువు, రాజుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఈ మూడు లాంతర్లు మూడు సింహం బొమ్మలు. వాటి మీద ఒకప్పుడు చవురు దీపాలను వెలిగించే వారుట. తర్వాత తర్వాత ఎలక్ట్రిక్ దీపాలూ ఉండేవి. ఇప్పుడా దీపాలూ లేవు. ఆ వెలుగులూ లేవు. ఒకప్నపుడు రోడ్డుకి ఎత్తుగా మూడు మెట్లతో ఉండే ఈ కట్టడం , రోడ్డు మందంగా బలియడం వల్ల కురచగా మారి పోయింది.
మహా కవి గురజాడ . ఈ విగ్రహం గురజాడ స్మారక గ్రంథాలయం ఆవరణలో ఉంది.
ఇదే అయ్య కోనేరు. కన్యాశుల్కం నాటకం మొదటి అంకంలో పొటిగరాప్పంతులు మనిషి గిరీశం నుండి అతనూ మధురవాణీ తీయించుకున్న ఫొటోల బాకీ డబ్బులు అడగాడానికి వస్తే, గరీశం వినబడనట్టు నటిస్తూ, ‘ అయ్యకోనేటికి తోవ ఇదే’ అంటాడు కదూ? ఆ అయ్య కోనేరు ఇదే.
విజయనగర ప్రభువులు పితృకర్మలు ఇక్కడ చేసే వారట. 1980 వరకూ అనుకుంటాను, దానికి చెందిన శిధిల కట్టడాలు ఇక్కడ కనిపించేవి.
ఈ కట్టడాన్ని గుమ్చీ అంటారు. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు ఇక్కడ హరి కథలు చెప్పే వారు.
విజనగర రాజుల పరమత సహనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ దర్గా కోటకు అతి సమీపంలో కస్పా బజారుకి వెళ్ళే దారిలో ఉంది.
ఇది కోటకీ, బొంకుల దిబ్బకీ సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ముద్దుగా ప్యారిస్ కార్నర్ అని పిలుచుకుంటూ
రోజూ సాయంత్రాల వేళ కవులూ, రచయితలూ కబుర్లతో సందడి చేస్తూ ఉండే వారు.

ఈ మూడు కోవెళ్ళ లోనే దాసు గారు తరచుగా హరి కథలు చెప్పే వారు.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల. ఇక్కడ వేద పాఠశాల, భాషా ప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, వ్యాకరణ విద్యాప్రవీణ కోర్సలు నిర్వహించే ప్రాచ్య కళాశాల, ఉన్నత పాఠశాల, ఉన్నాయి. దేశం గర్వించే మహా పండితులు మెసలిన చోటు,
ఇది విజయనగర ప్రభువులు నిర్మించి అవిఘ్నంగా నిర్వహిస్తున్న విద్యార్ధి ఉచిత భోజన శాల.
సింహాచల దేవస్థానం చౌలటరీ అంటారు. ఏళ్ళ తరబడి రోజూ వందలాది విద్యార్ధులకి ఉచితంగా కమ్మని భోజనాన్ని సమకూరుస్తూ వారి విద్యాభ్యాసం కుంటు పడకుండా కాపాడుతున్న చల్లని తల్లి.

విజయగరం ప్రభుత్వ మహా రాజ సంగీత కళాశాల.
ద్వారం నాయుడు గారి లాంటి సంగీత దిగ్దంతులు నడయాడిన చోటు. ఘంటసాల సంగీత సాధన జరిగింది ఇక్కడే.

అయ్య కోనేరు తూర్పు గట్టున వెలసిన పెద్ద ఆంజనేయ స్వామి వారి కోవెల.

కోట వెనుక భాగం. కందకం

రాజా వారి డిగ్రీ కళాశాల. గురజాడ చదివినదీ, ఉద్యోగం చేసినదీ ఇక్కడే
గంటస్థంభం. విజనగరానికి ఇది తలమానికం.
పెద్ద చెరువు. వేలాది ఎకరాల నేలకు సాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఓ సారి తమ విజయనగర అనుభవాలను స్మరించుకుంటూ , విజయగరంలోని ఒక్కో ప్రదేశాన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు:
‘‘విజయనగరంలో నాకన్నీ ఇష్టం. చివరకి పెద్ద చెరువులో దోమలు కూడా. ’’ అని.
ఈ పెద్ద చెరువు దగ్గర దోమల మందిరం అని ఒకటుండేది. అక్కడ దోమలు ఎక్కవగా ఉండే రోజులలో దాదాపు ఒక నెల రోజుల పాటు పాఠశాలలకి ప్రత్యేకంగా సెలవులు ప్రకటించే వారుట.
శ్రీ పైడితల్లి అమ్మ వారి గుడి. విజయనగర రాజుల ఇల వేలుపు. ఏటా విధిగా జరిగే అమ్మ వారి పండుగలో సిరిమానోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణ.
అమ్మ వారికి చెందిన తొలి గుడి విజయ నగరం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంది. వనం గుడి అని ఆ గుడికి పేరు.
కన్యాశుల్కం, ముత్యాల సరాలు, తెలుగు తొలి కథ దిద్దుబాటు మొదలయిన గురజాడ రచనలు జాతి నోముల ఫలంగా వెలుగు చూసిన చోటు ఇదే
గుమ్చీ ఈ ప్రక్కగా వెళ్తే శంకర మఠం వస్తుంది. కౌముదీ పరిషత్తు తొలి రోజుల కార్యక్రమాలు అక్కడే జరిగేవిట.


ఇవీ జూనియర్ పొటిగరాప్పంతులు నాకిచ్చిన ఫొటోలు. మరోసారి అతను మిగతా ప్రదేశాల ఫోటోలు ఇచ్చాక మీముందు పెడతాను.
ఈ లోగా అతని కోసం మంచి చుట్టలు ఎక్కడ దొరుకుతాయో వాకబు చేయాలి. మరి ఉంటాను.

















23, మే 2015, శనివారం

మరీ ఇంత అన్యాయమా ! అన బడు వొక జుత్తుల పోలిగాని వ్యథ !

ఈ కథామంజరి నస బ్లాగు ఉంది చూసారూ దాని ఓనరు పరమ పిసినారి సుమండీ. ఏడాదిగా అతని దగ్గర ఎంతో వినయంగా పని చేస్తున్నాను. ఒళ్ళు దాచుకో కుండా పని చేస్తున్నాను. ఒళ్ళు హూనం చేసుకొని అతని ఇంటిని శుభ్రం చేసే చాకిరీ నాదే. రోజూ వాడి ఇంటిని శుభ్రం చేసే పని నాదే. చేసేది వాడే అయినా నన్నుఉపయోగించు కుంటున్నాడు కనుక నేనే ఆ చాకిరీ అంతా చేస్తున్నట్టు లెఖ్ఖ కదా ! ఇంత చాకిరీ వాడి కోసం చేసినా వాడు నామీద రవంత ప్రేమ కూడా చూపించడు.
పనంతా అయ్యేక దులిపి ప్రక్కకి విసిరేస్తాడు. నన్నసలు మళ్ళీ వాడి అవసరం వచ్చే వరకూ తాకనయినా తాకడు.
సరే వాడి పాపాన వాడు పోతాడులే.
ఈ మధ్య జుత్తు బాగా పెరిగి పోయి ఒకటే చిరాగ్గా ఉంది. నన్ను చూస్తూనే‘‘ తలమాసిన వెధవా’’ అంటూ తిడుతున్నాడు. నాకు ఒళ్ళు మండి పోతోంది. వాడి బ్లాగును ఎవడూ చూడకుండు గాక ! చూసినా ఒక్క కామెంటూ పెట్టకుండు గాక ! వాడి తొక్కలో సిస్టం చీటికీమాటికీ మొరాయించు గాక ! అని వాడిని మనసులోనే శపించేను.
వాడి ఇల్లంతా శుభ్రం చేయడం కోసం నన్ను ఇంతగా హైరానా పెడతాడా నా ఒళ్ళంతా చీదరగా ఉంది. మురికి పట్టి పోయాను. సబ్బో గిబ్బో పెట్టి కొంచెం స్నానం చేయిస్తే వాడి సొమ్మేం పోయింది నా వొంటిని అంటిన దుమ్మూ ధూళిని వదిలించడానికట - నన్నుటేబిలు అంచుకేసి టపా టపా బాదేడు. ఊపిరాడింది కాదు. వాడి మీద ఏ మర్డరు కేసో పెట్టి బొక్కలో తోచించేస్తేనో అన్నంత కోపం వచ్చింది.
ఆ మధ్య వాడి ఫ్రెండొకడు వచ్చి నన్ను చూసి పగలబడి ఒకటే నవ్వడం ! నా తల తీసేసి నట్టయింది.
ఎంత అవమానం !
‘‘ఈ తలమాసిన శాల్తీ ఎక్కడిదోయ్ ! ’’ అని వెక్కిరిస్తూ ఒకటే నవ్వేడు.
ఇహ నేను ఈ కథామంజరి ( ఏకైక నస బ్లాగు ) గాడి అథార్టీ భరించ లేను. కానీ ఏమీ చెయ్య లేను కదా. చేతిలో ఎర్ర ఏగానీ కూడా లేని వాడిని కదా అస్వతంత్రుడిని కదా !
అంచేత మనమే తగ్గాలి. ఒదిగి ఉండాలి. శాంతం భోషాణం పెట్టె అన్నారు పెద్దలు.
ఇలా ఉండగా నాకో దివ్యమైన ఆలోచన వచ్చింది. పోనీ మనమే జుత్తు కటింగ్ చేయించుకుని కాస్త ట్రిమ్ గా తయారై కనిపిస్తేనో అప్పుడయినా ఈ వెటకారాలూ వెక్కిరింతలూ తగ్గిస్తాడేమో?!
ఈ ఆలోచన వచ్చేక మా కథా మంజరి గాడి మూడ్ బాగుందని అనుకుని నా మనసులో మాట వాడి ముందు బయట పెట్టాను
‘‘ పారూజుత్తు బాగా పెరిగి పోయింది. తల మాసి పోంది. చిరాగ్గా ఉంది. సెలూన్ కి వెళ్ళి క్షవరం చేయించుకు రావాలనుకుంటున్నాను. డబ్బులివ్వరూ ? ’’ అని దేబిరిస్తూ అడిగాను.
అంతే. వాడేమన్నాడో తెలుసునా ?
‘‘ ఓరి జుత్తుల పోలిగా ! నీకు క్షవరం కూడానా దండగ ఖర్చు ! అట్టే మాట్లాడితే పెంట మీద విసిరి పారెయ్య గలను జాగ్రత్త !’’
అని కసిరేడు. ఏడాదిగా నా చేత అరవచాకిరీ చేయించుకొని ఇంత మాటంటాడా ! మరీ ఇంత అన్యాయమామీరే చెప్పండి ?
నా తమ్ము డొకడు ఉన్నాడు. మా ఓనరు గాడి షేవింగు కిట్ లో ఉన్నాడు. వాడూ నాలాగే తలంతా మాసిపోయిజుత్తుల పోలి గాడిలా ఉన్నాడు.
ఏదో ఒక రోజున మా కథామంజరి నస బ్లాగరు ఓనరు మహాశయుడు మా ఇద్దరినీ పెంట కుప్ప మీద విసిరి పారెయ్యక తప్పదనిపిస్తోంది. ఈ అన్యాయం ఖండించే వారే లేరా మము బ్రోచే వారే లేరా ! హే ! భగవాన్ !
గమనిక : ఈ టపాలో వాడిన‘‘ ఇల్లు ’’ అనే పదమునకు మానిటరూసీ.పీ.యూకీ బోర్డూమౌసూప్రింటరుస్కానరూ వగైరాలని అర్ధం చేసుకో గోరుతాను.
ఇట్లు,
తమ విశ్వాసపాత్రుడు,
జుత్తుల పోలిగాడు.