2, డిసెంబర్ 2011, శుక్రవారం

అంతా బూతేనా ? !


కవి చౌడప్ప పేరెత్తితే చాలును, థూ ... అంతా బూతు ! అనెయ్యడం తెలిసిన విషయమే.

చౌడప్ప నిజంగా అన్నీ బూతు పద్యాలే రాసాడా ? కాదనే చెప్పాలి. అందుకే మన సాహిత్య కారులు కవుల చరిత్రలు రాస్తూ కవి చౌడప్పకు సముచిత స్థానమే ఇచ్చారు.

కంద పద్యాలలో రచించాడు కవి తన చౌడప్ప శతకాన్ని. కవికి తనలా వేరొకరు కంద పద్యాలను రాయ లేరనే ఆత్మ ప్రత్యయం ఎక్కువ. అందుకే ఎంత థీమాగా చెప్పాడో చూడండి:

ముందుగ చను దినములలో

కందమునకు సోమయాజి ఘనుడందురు నే

డందరు నను ఘనుడందురు

కందమునకు కుందవరపు కవి చౌడప్పా.

భావం : పూర్వం రోజులలో కందపద్య రచనకు తిక్కన గారిది అందె వేసిన చేయి అంటారు. ఇవాళ నన్ను కంద పద్య రచనలో ఘనుడినని అంటారు.

కందము నీవలె జెప్పే

యందము మరిగాన మెవరియందున గని సం

క్రందన యసదృశనూతన

కందర్పా ! కుందవరపు కవిచౌడప్పా.

భావం: నీలా ఇంత అందంగా కందం చెప్పడం మరెవరికీ చాతకాదయ్యా ! నువ్వు ఇంద్రునితో సమానమైన నూతన మన్మథుడివి సుమీ ! అని కవి తన గురించీ, తన కంద పద్యం గురించీ చెప్పాడు.

కందముల ప్రాసగణయతు

లందముగా కవిత నెందరల్లరు విను నీ

కందంబులు రససన్మా

నందంబులు కుందవరపు కవిచౌడప్పా.

భావం: గణాలూ, యతులూ ,ప్రాసలూ కుదిరేలా చూసుకుని ఎందరు కంద పద్యాలను అల్ల లేదు ?

కాని, నీ కందాలు మాత్రం మహా రుచికరంగా భేషుగ్గా ఉంటాయి సుమీ !

నా నీతి వినని వానిని

భానుని కిరణములు మీద బారని వానిన్

వానను తడియని వానిని

గాననురా కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఈ కవికి ఎంత ఆత్మవిశ్వాసం అంటే, తను చెప్పే నీతులు వినని వాడూ, ఎండ వేడిమి తగలని వాడూ, వానలో తడవని వాడూ ఎవడూ ఉండడు. అలాంటి వాడిని తను చూడ లేదుట !

తెలుగులో పచ్చి బూతు కవిగా ముద్ర పడి పోయిన చౌడప్ప బూతులూ, అశ్లీల శృంగారం పెచ్చు మీరిన పద్యాలు రాయక పోలేదు. అయితే రాసిన వన్నీ బూతులే కావు. చక్కని నీతి పద్యాలూ మిక్కుటంగానే ఉన్నాయి.

హాస్యం కోసం బూతాడక తీరదనుకునే రోజుల వాడు మన కవి.

నీతులకేమి యొకించుక

బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో

నీతులు బూతులు లోక

ఖ్యాతులురా! కుందవరపు కవిచౌడప్పా.

భావం: నీతులు చెప్పడానికేం ! ఓ ! చాలా ఉన్నాయి. కానీ కొంచెమయినా బూతు మాటలు పలుకక పోతేనవ్వు పుడుతుందిటయ్యా ? రాజులను నవ్వించాలి కదా ! నీతులు, బూతులు రెండూ సమానమైన లోకఖ్యాతికరాలే కదా !

పది నీతులు పదిబూతులు

పది శృంగారములు గల్గు పద్యము సభలన్

చదివిన వాడే యధికుడు

కదరయ్యా కుందవరపు కవిచౌడప్పా.

భావం: పది నీతులు, పది బూతులు , పది శృంగార పద్యాలు సభలో చదివిన వాడే గొప్పవాడు కదా.!

ఛీ ! బూతు ! అంటూ ముఖం వికారంగా పెట్టే వాళ్ళకి కవి ఓ గట్టి చురకే వేసాడండోయ్ !

బూతని నగుదురు గడు తమ

తాతలు ముత్తాత మొదలు తరముల వా

రే తీరున జన్మించిరొ !

ఖ్యాతిగ మరి కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఛీ ! పచ్చి బూతు ! అన్న వాళ్ళే ఆ బూతుని నవ్వుతూ వింటారు. వాళ్ళ తాతముత్తాతలు బూతు లోంచి కాక పోతే మరెలా పుట్టుకొచ్చారు ?

జానపదులలో విస్తారంగానూ, నాగరికులలో రవంత అరుదుగానూ వినిపిస్తూ, నిఘంటువులలో ఎక్కడో మారుమూల బిక్కు బిక్కుంటూ ఉండే బూతు మాటలను ఈ కవి నిర్భీతిగా, ఏ మొఖమాటాలకీ తావు లేకుండా, గుట్టూ మట్టూ లేకుండా చాలా పద్యాలలో వాడిన మాట నిజమే అయినా, చౌడప్ప వన్నీ బూతు పద్యాలే కావు. చక్కని కందాలూ, ఎంచక్కని వృత్త పద్యాలూ చాలా ఉన్నాయి.

నీచులనూ, నీతి బాహ్యులనూ, మేక వన్నె పులలనూ, కుహనా మేథావులనూ, ఈ కవి ఏ శషభిషలూ లేకుండా జలకడిగి పారేస్తాడు.

చూడండి:

వేడుక పడి వినవలెనా

దోడు కవిత్వంబునైన తులువ నలువురన్

గోడిగము సేయు వాడే

గాడిదరా ! కుందవరపు కవిచౌడప్పా.

భావం: కవిత్వాన్ని చదవాలి. చక్కగా ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ హేళన చెయ్య కూడదు. అవమానించ కూడదు. అలా చేసే వాడు తుంటరి గాడిద !

ఇయ్యా యిప్పించ గల

యయ్యలకే గాని మీస మన్యుల కేలా ?

రొయ్యకు లేదా మీసము

కయ్యానకు కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఇచ్చే వాడికీ, ఇప్పించగల వాడికీ మీసాలు ఉండాలి. కానీ మిగతా పనిమాలిన వెథవలందరికీ మీసాలెందుకూ దండగ ! రొయ్యకు బారెడు మీసం ఉంటుంది ! ఎందుకూ !

మునుపాడి వెనుక లేదను

పెను గొంటె గులాము నోరు పీతిరి గుంటే

యనిఘనుడు సత్య వాక్యమె

గన వలెరా కుందవరపు కవిచౌడప్పా.

భావం: ముందు ఇస్తానని మాట యిచ్చి , తరువాత లేదు పొమ్మంటాడే, వాడి నోరు అశుద్ధం గొయ్యితో సమానం ! ఈ మాటలు పూర్తిగా నిజం.

పెద్దన వలె కృతి చెప్పిన

పెద్దన వలె ; నల్ప కవిని పెద్దన వలెనా ?

ఎద్దన వలె, మొద్దన వలె

గ్రద్దన వలె కుందవరపు కవిచౌడప్పా.

భావం: అల్లసాని పెద్దన లాగా కవిత్వం చెప్పిన కవినే పెద్ద అనాలి కానీ, తక్కిన పనికి మాలిన కవులని అందరినీ పెద్ద అనాలా ? ఎద్దనాలి. మొద్దనాలి. గ్రద్ద అనాలి.

కీలెరిగి వాత పెట్టడ మంటే ఇదే కాబోలు.

తులసీదళముల హరిపద

జలజంబుల పూజసేయు సరసుల యమ దూ

తలుజూచిఏమి చేయం

గలరప్పా కుందవరపు కవిచౌడప్పా.

భావం: హరి పాద పద్మాలకు తులసీ దళాలతో పూజ చేసే వాడిని యమ దూతలు కూడా ఏమీ చెయ్య లేరు !

పరవిత్తము గోమాంసము

పరసతి తన తల్లి యనుచు భావించిన యా

నరుడు నరుండా రెండవ

కరిరవదుడె కుందవరపు కవిచౌడప్పా.

భావం: పరుల సొమ్ము గోమాంసంతో సమానంగానూ, పరుల భార్యలను తల్లితో సమానంగానూ ఎవడయితే చూస్తాడో, వాడు అపర నారాయణుడే !

వానలు పస పైరులకును

సానలు పస వజ్రములకు సమరంబులకున్

సేనలు పస మృగజాతికి

కానలు పస కుందవరపు కవిచౌడప్పా.

భావం: పంటలకు వానలే పస. సానపట్టడం వల్ల వజ్రాలు కాంతితో మెరుస్తూ ఉంటాయి. యుద్ధాలకి సేనలు తగిన బలం. జంతువులకు క్షేమకరమయిన తావులు అవడులే.

పులి నాకి విడుచు దైవము

గల వానికి దైవ బలము గలుగని వేళం

గలహించి గొఱ్ఱె కరచును

కలియుగము కుందవరపు కవిచౌడప్పా.

భావం: దేవుని దయ ఉంటే, పులి కూడా వాడిని ఏమీ చేయదు. అలా తడిమి వదిలేస్తుంది. దైవ బలం లేక పోతే, గొఱ్ఱె కూడా కరుస్తుంది ! కలి కాలపు వింత అంటే ఇదే !

పాండవు లిడుమల బడరే

మాండవ్యుడు కొరత బడడె మహి ప్రాకృత మె

వ్వండోపు మీరి చనగ న

ఖండిత యశ కుందవరపు కవిచౌడప్పా.

భావం: చేసుకున్న వాళ్ళకి చేసుకొన్నంత ! పాండవులు ఎన్న కష్టాలు అనుభవించ లేదు ? మాండవ్య ముని కొరత పడ లేదూ ! పూర్వ జన్మలో చేసిన పాపాలు తప్పించు కోవడం ఎవరి తరమూ కాదు.

ఆడిన మాటను తప్పిన

గాడిద కొడకంచు తిట్టగావిని మదిలో

వీడా ! నా కొడుకని యేడ్చెను

గాడిదయును కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఆడిన మాటను తప్పిన వాడిని గాడిదా ! అని తిడితే వీడా నా కొక కొడుకు ! అని గాడిద కూడా ఏడిచిందిట !

మూలిక క్రియ కొదిగినదే

నాలుక సత్యంబు గలదె నడిపిన వాడే

యేలిక వరమిచ్చినదే

కాళికరా ! కుందవరపు కవిచౌడప్పా.

భావం: మందుకు పనికొచ్చేదే మూలిక. సత్యం పలికేదే నాలుక. చక్కగా పాలించే వాడే ఏలిక. వరమిచ్చేదే దేవత !

కుటుంబ వ్యవస్థ పట్ల కవి చౌడప్పకి ఎంత గౌరవమో చూడండి:

తన సతి యిడగా మనుమలు

తనయులు తలిదండ్రులన్న దమ్ముల్ బంధుల్

దినదినములు భుజియించుట

ఘనవిభవము కుందవరపు కవిచౌడప్పా.

భావం: భార్య వడ్డిస్తూ ఉంటే, మనుమలు, తల్లిదండ్రులూ, అన్నాదమ్ములు, బంధువులూ అందరూ కలిసి రోజూ భోజనం చెయ్యడం ఎంత వైభవంగా ఉంటుందో కదా !

సరసము చతురోపాయము

హరి భక్తియు శాంత గునము నర్థుల పట్లన్

పరమౌ చుపకారము విను

కరుణాకర కుందవరపు కవిచౌడప్పా.

భావం: సరసం, చతురోపాయం, హరి భక్తి, శాంత గుణం, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి.

సీమ దయా పరుడేలిన

క్షేమంబగు దోసకారి సీమేలినచో

క్షామంబగు నతడేలే

గ్రామంబున కుందవరపు కవిచౌడప్పా.

భావం: దయాపరుడైన వాడు నేలను పరిపాలిస్తే అంతా సుభిక్షంగా ఉంటుంది. దుర్మార్గుడు పాలిస్తే అంతటా కరువే .

చౌడప్ప కవి వర్గ దృక్పథం ఎలాంటిదంటే,

ఎన్నగల యడవి మృగముల

కన్నీరేమైన వేటగానికి ముద్దా ?

నన్నాపు దొరకు బీదల

కన్నీరును కుందవరపు కవిచౌడప్పా.

భావం: వేట గాడికి అడివి జంతువు కన్నీళ్ళు ముద్దా యేమిటి ? వాటికతడు కరిగి పోతాడా ? అలాగే దోచు కునే దొరకు పేదవారి కన్నీళ్ళు ముద్దొస్తాయా ?

చౌడప్ప వృత్త పద్యాలలో మచ్చు కొకటి చూడండి:

ఆసలజేరి దుర్గుణ గణాఢ్యుని దాత వటంచు వేడినన్

మీసలము దువ్వుచున్ దిశల మీదన చూచుచు దుర్మథాంథుడై

మీసము నియ్య లేని నలు విత్త గులాము కీర్తి చేరునా ?

భూసుర వర్య కుందవర భూషణ చౌడ కవీశ్వరోత్తమా !

భావం: దుర్మార్గుడిని మన ఆశ కొద్దీ దాతవు అని వేడుకొంటే యేమవుతుంది ? మీసాలు మెలి త్రిప్పుతాడు. పైకీ కిందకీ చూస్తాడు. వీసం కూడా ఇవ్వడు. ఆ వెధవకి ఏం కీర్తి వస్తుంది చెప్పండి

కావాలనే చాలా బూతు పద్యాలు చెప్పాడు. అలాగే చాలా నీతులూ చెప్పాడు. ఆ సంగతి కవి ఇలా స్పష్టం చేస్తున్నాడు:

బూతులు కొన్నిట కొన్నిట

నీతులు చెప్పితి బుధులు నీతులబూతుల్

బూతుల మెచ్చందగు నతి

కౌతుక మతి కుందవరపు కవిచౌడప్పా.

భావం: నా పద్యాలలో కన్నింట నీతులు చెప్పాను. అలాగే, కొన్నింట బూతులూ చెప్పాను. తెలివైన వాళ్ళు నేను చెప్పిన నీతులతో పాటు ఆ బూతులనీ మెచ్చు కోవాలి సుమా !

చౌడప్ప కవి దెబ్బ ఎలాంటిదంటే ....

కాకులు వేవేలొక్క తు

పాకి రవము విన్న నులికి పడవా మరి ! నా

ఢాకకు తగు నాలాగే

కాకవులును కుందవరపు కవిచౌడప్పా.

భావం: ఒక్క తుపాకి చప్పుడు వినగానే వేల కొద్దీ కాకులయినా సరే తుర్రుమంటూ ఎగిరి పోతాయ్ ! కదా ! అలాగే, కువులు కూడా నా దెబ్బకు అదిరి పోవలసినదే !

ఏం పెంకెతనం !

ఈ టపా రాసి post చెయ్య బోతూ ఉంటే వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. వస్తూనే వంటింటి వాసలనలని పసి కట్టేసి, ఇవాళ టిపిను పెసరట్లలా ఉందే ! అని సంతోషంగా నవ్వీసి , నేను రాసినదంతా చదివేడు.

‘‘ ఛ ! నువ్వు కూడా ఇంత దిగజారి పోతా వనుకో లేదు. నీ దిక్కుమాలిన కథా మంజరి బ్లాగులో ఇంత కాలం ఏవో పద్యాలూ, శ్లోకాలూ పెడుతూ నీ చేతి దురద తీర్చు కుంటున్నావంటే పోనీ లెమ్మను కున్నాను.. చివరకి ఈ అప్ప కవిగాడి పద్యాలు పెట్టే స్థితికి వచ్చేవన్నమాట !’’

అంటూ ఘాటుగా విమర్శించాడు. నేను కొయ్యబారి పోయేను.

వాళ్ళక్కయ్య ( సొంత సోదరి కాదు లెండి. వరసకి అక్కయ్య. అదీ వాడు కలుపుకొన్న వరసే)

పెసరట్టూ, ఉప్మా టిఫిను పెట్టి, కమ్మని కాఫీ ఇస్తే తాగి నిమ్మళించేడు.

అప్పుడన్నాడు: ‘‘ హు ! నీ ఏడుపేదో నువ్వు ఏడువ్. నాకెందుకు గానీ, ఆ అప్ప కవిగాడి మిగతా పద్యాలన్నీ ఎక్కడ దొరుకుతాయ్ ?!’’ అన్నాడు సూటిగా.

ఈ మారు నిఝంగానే ( ఒక మేజా బల్ల చేయించు కోడానికి సరిపడేటంతగా ) కొయ్యబారి పోయేను.

28, నవంబర్ 2011, సోమవారం

కుంచెకారులతో ఓ కులాసా సాయంకాలం !



‘ కుంచె’కారులూ, కొంత మంది ‘కలం’కారులూ కలిసి నిన్న ఆదివారం
( తే 27.11.2011దీ) సాయంత్రం కులాసాగా, దిలాసాగా, నిండుగా ఒక పండుగలా నవ్వుతూ గడిపిన సందర్భాన్ని మీకిప్పుడు పరిచయం చేస్తున్నాను.

సరస్వతుల రామ నరసింహం అంటే చాలా మందికి తెలియక పోవచ్చును. తెలియక పోయినా వచ్చే ప్రమాదమేమీ లేదు. కాని ‘సరసి’ అనే పేరు తెలియని వారు తెలుగు పత్రికలతో ఎంతో కొంత పరిచయం ఉన్న వారదరకీ తెలిసి ఉంటుంది. ఉండాలి కూడా. లేక పోవడం బాగోదు సుమండీ, ముందే చెబుతున్నాను.




ఎందుకంటే, సరసి గారు తెలుగునాట వచ్చే దాదాపు అన్ని పత్రికలలోనూ అసంఖ్యాకంగా కార్ట్యూనులు వేస్తూ ఉంటారు.

వారం వారం నవ్యలో వచ్చే ‘మన మీదే నర్రోయ్ !’ చప్పున గుర్తొచ్చి తీరుతుంది. తెరలు తెరలుగా నవ్వు మన పెదాల మీద అసంకల్పితంగా విరగబూస్తుంది. ఇంత వరకూ సరసి గారు తన కార్టూన్ పుస్తకాలు రెండింటిని ప్రచురించారు. ఇప్పుడేమో ముచ్చటగా తన మూడో కార్టూన్ల పుస్తకం

వెలువరించారు !

సరసి కార్టూన్లు 3 (వైశంపాయనుడి కథలతో కలిపి) అనే పుస్తక ఆవిష్కరణ సభ ఆదివారం నాడు హైదరాబాద్ బాలానందం భవనంలో మహా సందడిగా జరిగింది. చాలా మంది కుంచెకారులూ, కలంకారులూ వచ్చి చాలా సందడి చేసారు. అందులో ఉభయకారులూ కూడా ఉన్నారు. అంటే కార్టూనిస్టులూ, రచయితలూ కూడా నన్నమాట.

నాకయితే పరిచయం కాలేదు కానీ, కవులు కూడా వచ్చే ఉంటారు. వీళ్ళతో పాటు చాలామంది కార్టూన్ల ఇష్టులు కూడా వచ్చి ఎంతో సందడిగానూ, సరదాగానూ ఈ సాయంత్రాన్ని కరగదీసారు.

సభకి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు అథ్యక్షత వహించారు. పుస్తకావిష్కరణ నవ్య సంపాదకులు శ్రీ ఎ.ఎన్.జగన్నాథ శర్మ చేసారు. సరసి గారి పుస్తకాన్ని శ్రీ సుధామ గారు పరిచయం చేసారు. వారి మాటలు విన్నాక మన సరసి గారు అందరికీ మరింత ముద్దొచ్చేసారు. సభలో ఇంకా బాలానందం కార్యదర్శి కామేశ్వరి గారూ, సరసి అని (కలం పేరుని) నామకరణం చేసి, గీతలు నేర్పిన గురువు గారు శ్రీ తమ్మా సత్యనారాయణ గారు సరసి గారిని తమ మానస పుత్రులుగా పేర్కొనడం ప్రేక్షకులను ఆనందపరవశులను చేసింది.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు ప్రముఖ కార్టూనిస్టులు మోహన్, చంద్ర, రాంపా, రవికిషోర్, శంకు, గీతా సుబ్బారావు, ప్రముఖ సినీ దర్శకులు, రచయిత జనార్ధన మహర్షి, మొదలయిన కుంచెకారులు, కలంకారులూ, కళాకారులూ చాలామంది పాల్గొని ఈ సాయంకాలాన్ని నిజంగా ఒక కులాసా సాయంకాలంగా మార్చేసారు !

సరసి గారు ఈ పుస్తకాన్ని సరస వ్యంగ్య గీత గోవిందుడు / సకల కళా హృదయ జయ దేవుడు డా. జయదేవ్ బాబు కి అంకింతం చేసారు.

పుస్తకానికి ఆప్తవాక్యంగా, కాదు, పరమాప్త వాక్యంగా శ్రీ బాపు గారు రాసిన మాటలు ‘గురు దీవెన’ పేరిట ప్రచురించి. సరసి గారు తమ గురు భక్తిని చాటుకున్నారు.

ఆ మాటలివి : ( వీటిని చదివేక కూడా ఈ పుస్తకాన్ని కొని చదవకుండా ఉండలేం)

చూడండి:

మన తెలుగు లోగిళ్ళలో
అచ్చ తెలుగు నవ్వుల్ని
ఏరుకొచ్చి - సొంత టైన్ దారంతో
మాల కడుతూన్న సరసి గారూ !

నేను గర్వపడే స్నేహితుడా!
మీరందించే పరిమళాలు
ఎల్ల వేళలా ఇలాగే గుబాళించాలని
ఆ సీతారాముణ్ణి వేడుకుంటూ ...

మీ వీరాభిమాని బాపు.


ప్రముఖ హాస్యనటులు శ్రీ బ్రహ్మానందం గారు ఈ పుస్తకానికి ఎంచక్కని కొసమెరుపు మెరిపించారు.

‘‘సరసి కార్టూన్లంటే నాకిష్టం. అందుకే వారం వారం క్రమం తప్పకుండా నవ్య వీక్లీ కొంటూ ఉంటాను.’’

ఈ కార్టూన్ల పుస్తకంలో కార్టూన్లతో పాటు మధ్యే మధ్యే వైశంపాయనుడి కథలు ఓ 24 కూడా మనకందించారు !

ఇవన్నీ గిలిగింతలు పెట్టే చక్కని హాస్య, వ్యంగ్య కథలే !

పుస్తకంలోని ఒక్క కార్టూను గురించి కానీ, ఒక్క కథ గురించి గానీ ప్రస్తావన చేయకుండానే, ఈ టపా ఎందుకు ముగిస్తున్నానంటే, బాపూ గారి మాటలూ, బ్రహ్మానందం గారి పలుకులూ విన్న తర్వాతయినా ఎవరికి వారే ఒక్క క్షణం ఆలస్యం చేయ కుండా పుస్తకాన్ని కొని తెచ్చుకొని ఆనందిస్తారనే భరోసా, ప్రగాఢమైన నమ్మకం ఉండడం చేతనే.

పుస్తకం ఎక్కడ దొరుకుతుందంటారా ?

శ్రీ భారతీ పబ్లికేషన్స్, ప్లాట్ నెం. 56, 3వ వీధి, అనంత సరస్వతీ నగర్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ 500 047 వారిని సంప్రదించండి.

లేదా, నేరుగా సరసి గారినే, ‘‘ ఇలా డబ్బులు పంపుతానూ, నాకూ, నేను ముందంటే నేను మందంటూ పేచీలు పడకుండా మా ఆవిడ కోసమూ, పిల్లల కోసమూ, ’’ అంకుల్ గారూ ఏవేనా మంచి పుస్తకాలుంటే ఇద్దురూ, చదివి ఇచ్చేస్తానూ ! అనడిగే మా పక్కింటి వాళ్ళ కోసమూ, నా బంధు మిత్రుల కోసమూ , పెళ్ళిళ్ళకీ, వేరే శుభకార్యాలకీ కానుకగా ఇవ్వడం కోసం నాకు బోలెడు కాపీలు కావాలీ, వెంటనే పంపించండీ’’ అని డిమాండ్ చెయ్యండి. ఎందుకు పంపించరో చూస్తాను .హన్నా ! తమంత సరసులు పంపించమని (డబ్బులకే సుమండీ) అడిగితే పంపకుండా ఉండడానికి ఎన్ని గుండెలు ఉండాలి చెప్పండి ?

ఇదీ సరసి గారి ఫోను నంబరు: 09440542950

మెయిల్ ID : sarasicartoonist@gmail.com

పళ్ళ దుకాణం వాడయినా, మనం టోకున ఎక్కువ కిలోల పళ్ళు తీసుకునే రకంలా కనిపిస్తే, దోర ముగ్గిన పళ్ళ లోంచి ఒకటి తీసి ముక్కలు కోసిఒక ముక్క మనకందిస్తూ, ‘‘ తినండి సార్ ! తిని రుచి చూడండి ! బాగుంటేనే కొనండి.’’ అనడం కద్దు. కదా,

అంచేత, ఈపుస్తకంలో మచ్చు ( రుచి) కోసం ఒక చక్కని కార్టూన్ మీ కోసం. చూడండి:



చివరిగా,

సరసి గారి కార్టూన్ లలో నాకు బాగా నచ్చినదీ. అస్సలు నచ్చనిదీ ఒక దాని గురించి చెప్ప వలసి వస్తే,

నచ్చినది : నా వల్ల కాదు. ఆయన వేసిన వేలాది కార్టూన్ల నుండి ఎంచి‘ ఇదీ ’ అని చెప్పడం.

నచ్చనిది: ఇంత వరకూ వెయ్య లేక పోయారు. వెయ్యడం అతనికి చేత కాలేదు. నాకు నచ్చని కార్టూను వెయ్యడం అతని తరం కాదు.

శలవ్





25, నవంబర్ 2011, శుక్రవారం

ఈ ఫొటోలో వ్యక్తి ఎవరని అడగను. నేనే పరిచయం చేస్తాను ...


గత మే నెలలో కామమ్మ కథ అనే ఒక టపా ఉంచాను. ఆ కథలో నేను ప్రస్తావించిన నా మిత్రుని ఫొటో అప్పట్లో లభించ లేదు.

కానీ, ఇటీవల మరో మిత్రుని షష్టి పూర్తి కార్యక్రమం కోసం మా స్వగ్రామం పార్వతీపురం వెళ్ళడం జరిగింది.
అప్పుడు నా పుస్తకాల మిత్రునికి నేను తీసిన ఫొటో ఇది. ఈ ఫొటో అక్కడే, ఆ టపా లోనే, ఉంచ వచ్చును. కానీ మరో సారి కామమ్మ కథ పుస్తకం నా పుస్తకాల గూటి లోకి గువ్వలా వచ్చి ఎలా చేరిందో, ఆ ముచ్చట పూర్తిగా బ్లాగు మిత్రులతో పంచు కోవాలని దీనిని పెడుతున్నాను. అదీ కాక, అలా చేస్తే, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అయి పోతుందనిపించింది కూడా. అది కూడా ఒక కారణం. అందుకే ఆ టపా మరొక్క తూరి ...



చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...

నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ.

ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను.

విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే.

ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార పత్రికలూ, ఒక మాస పత్రికా వచ్చేవి. ఊళ్ళో ఒక మనిసిపల్ లైబ్రరీ, మరో శాఖా గ్రంథాలయం ఉండేవి.

నా పుస్తక దాహార్తి అక్కడే తీరేది. ఇక మా చిన్న ఊళ్ళో రాధా గోవింద పాఢి గారని ఒక ఒరియా వ్యక్తి ఉండే వారు. తెలుగు మాట్లాడడం వచ్చు. కూడ బలుకుకుని చదివే వారేమో కూడా. రాయడం వచ్చేది కాదను కుంటాను. వారికి ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఆ పనులతో తెగ బిజీగా ఉండే వారు. దానితో పాటు ఆయన ఆ రోజులలో వచ్చే అన్ని దిన, వార , పక్ష, మాస పత్రికలు అన్నింటికీ కూడా ఏజెంటుగా ఉండే వారు. మెయిన్ రోడ్డులో వారి ఫొటో స్టూడియో కమ్ పుస్తకాల షాపు నన్ను అమితంగా ఆకట్టు కునేది. ఎక్కవ గంటలు అక్కడే గడిపే వాడిని. వారు మా కుటుంబ మిత్రులు కూడానూ. పేపర్లూ, పీరియాడికల్స్ తో పాటు ఆయన ఎన్నెన్నో మంచి పుస్తకాలు కూడా అమ్మకానికి తెప్పించే వారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పాఠశాలలకీ, ఆఫీసు లైబ్రరీలకీ వాటిని విక్రయించే వారు. మంచి పుస్తకాలు తెప్పించడం కోసం వారు ఒక పద్ధతి అవలంబించే వారు. పుస్తకాల ఏజెంటుగా వారికి ఎందరో రచయితలతోనూ, ప్రముఖ సంపాదకులతోనూ మంచి పరిచయాలు ఉండేవి. వారి షాపులోనే నేను చాలా మంది గొప్ప రచయితలను చూసేను. విద్వాన్ విశ్వం, రాంషా వంటి సంపాదకులనూ చూసేను. సోమ సుదర్ గారిని కూడా అక్కడే చూసినట్టు గుర్తు. పాఢి గారు ఆయా రచయితలనూ, సంపాదకులనూ కలిసినప్పుడు తెలుగులో ఏవి మంచి పుస్తకాలంటూ కేటలాగులు ఇచ్చి మరీ వారినుండి వివరాలు సేకరించే వారు. ఆ క్రమంలో నేను కూడా నాకు తోచిన గొప్ప పుస్తకాల గురించి చెప్పే వాడిని. ఈ విధంగా తనకు తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేక పోయినా అమ్మకం కోసం ఎన్నో గొప్ప పుస్తకాలను తెప్పించే వారు. చెంఘిజ్ ఖాన్, అతడు ఆమె, నేరము శిక్ష , పెంకుటిల్లు, సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటాలు, లత , రావి శాస్త్రి, ముళ్ళపూడి, బీనాదేవి, గోపీచంద్, తిలక్, శ్రీ.శ్రీ, మధురాంతకం రాజారాం, మొదలయిన గొప్ప గొప్ప రచయితల రచనలు తెప్పించే వారు. అనువాద సాహిత్యమయితే లెక్కే లేదు.శరత్ సాహిత్యమంతా ఉండేది.

ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, వారి షాపుకి వచ్చే వార, మాస పక్ష పత్రికలన్నీ ఇలా బంగీ రాగానే ఒక కాపీ నాకు చదువుకోమని ఇచ్చే వారు. విజయ,నీలిమ , యువ, జ్యోతి వంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ప్రభ వంటి వార పత్రికలు షాపుకి రాగానే అమ్మకానికంటె ముందుగా నాకు ఇచ్చేసే వారు. ఏ రోజయినా, నేను షాపుకి వెళ్ళక పోతే, ఆ రోజు వచ్చిన కొత్త పత్రకలను మా ఇంటికి పంపించి వేసే వారు. వీటితో పాటు, అమ్మకానికి వచ్చిన నవలలు, కథా సంపుటాలు, సాహిత్య గ్రంథాలు అన్నింటి ప్రతులు ఒక్కొక్కటి చొప్పున నాకు చదువుకోడానికి అంద చేసే వారు. వీలయినంత వేగిరం, అంటే, తిరిగి ఆయా పుస్తకాలను అమ్ముకునేందుకు వీలుగా ఇచ్చి వేసే నియమం పెట్టే వారు. అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఏ పుస్తకమూ నలగ కూడదు. చిరగ కూడదు.

ఈ నిబంధన కూడా చాలా సున్నితంగా చెప్పే వారు. నేనెక్కడ నొచ్చు కుంటానో అని తెగ బాధ పడి పోయే వారు కూడా.

హైస్కూలు చదువు చదువుకుంటూ, పైసా సంపాదన లేని నా బోటి వాడికి ఆ రోజుల్లో అన్ని పత్రికలు, విలువైన పుస్తకాలు, గొప్ప సాహిత్య గ్రంథాలు అన్నీ కేవలం ఉచితంగా చదివే వీలు కలగడం నా అదృష్టం కాక మరేమిటి చెప్పండి ?

నా పుస్తక దాహార్తిని తీరుస్తూ, నేనొక రచయితగా ఎదిగే క్రమంలో ఎంతగానో దోహద పడి, చేయూత నందించిన ఆ దయామయుని రుణం ఎలా తీర్చు కోగలను ?

ఇంతకీ ఈ కామమ్మ కథ అనే పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో ఇంకా చెప్పనే లేదు కదూ ?

సరే, అలాగ, నా హైస్కూలు చదువు పూర్తయి, తరువాత విజయ నగరంలో భాషా ప్రవీణ చదువు నాలుగేళ్ళూ గడిచే వరకూ వారి దయ వల్ల అసంఖ్యాకంగా పుస్తకాలు ఉచితంగా చదివేను. చదువు ముగిసి, తెలుగు పండితునిగా ఓ చిరుద్యోగం లోకి ప్రవేశించాక కూడా మీరు ఊహించ లేనంత కమీషను డిస్కవుంట్ పొందుతూ వారి నుండి ఎన్నో చాలా మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. చాలా వరకూ అరువు. నెలల తరబడి ఆ వాయిదాలు కడుతూ ఉండే వాడిని. నేనంటే వారికి ఎంత అభిమానమో. ఆ పుస్తకాలు చదివి నేను ఏదయినా పుస్తకం గురించి మెచ్చుకుంటూ పొగిడితే అతనూ పొంగి పోయే వారు. అప్పటి వారి చూపుల్లో అన్నం వడ్డించే అమ్మ కున్నంత ఆదరణ ఉండేది.

ఇంకా ఈ పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో చెప్పనే లేదు కదూ.

మరింక విసిగించను లెండి. వారిచ్చిన ఉచిత పుస్తకాలతో నన్ను నేను ఉన్నతీకరించు కుంటూ ,ఇలా ఓ ముప్ఫయ్ ఏళ్ళు గడిచేక, నేను ఉద్యోగ రీత్యా మా ఊరికి దూరంగా ఉండి పోవలసి రావడం చేత వారిని ఒకటి రెండు సార్లు తప్ప మరి కలియడం జరుగ లేదు. వారి గురించిన వివరాలూ తెలియ రాలేదు.

ఉద్యోగ విరమణ చేసాక, మా అన్నగారితో పాటు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. అప్పటికి అక్కడ మాకు ఇల్లూ, పొలాలూ అన్నీ చెల్లి పోయాయి. తెలిసిన వారు కూడా కొద్ది మందే మిగిలేరు. చాలా ఏళ్ళ అనతంరం మా ఊరు చూడాలనే కుతూహలంతో నేనూ మా అన్న గారూ అక్కడికి వెళ్ళాం.

మా పుస్తకాల మిత్రుడు రాధా గోవింద పాఢి గారిని చాలా సంవత్సరాల తరువాత చూడాలని వారింటికి వెళ్ళాం.

ఆయన లేవ లేని స్థితిలో మంచం మీద ఉన్నారు. మాట కూడా సరిగా రావడం లేదు. అప్పటికి పది, పదిహేను ఏళ్ళ క్రిందటే ఫొటో స్టూడియో, పుస్తకాల షాపూ మూసి వేసారుట. ఆయన బహు కుటంబీకుడు. ఆరుగురు కూతుళ్ళు. ఒక కొడుకు. అందరికీ వివాహాలు చేసారు. ఆర్ధికంగా ఇబ్బంది ఏమీ లేదు. శరీరం సహకరించక ఫొటోల బిజినెస్సూ, పుస్తకాల షాపూ మూసి వేసారుట. నాకీ వివరాలేవీ తెలియదు. తెలుసు కోడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్య లేదేమో. ఉద్యోగం, పిల్లలు, వారి చదువులూ, బదిలీలూ, అమ్మాయిల పెళ్ళిళ్ళూ, పురుడు పుణ్యాలూ ... వీలు చిక్క లేదని సిగ్గు లేకుండా చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి.

మా రాక చూసి ఎంతగానో సంతోషించారు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టు కున్నారు. వారు పడుకున్న మంచం క్రిందకి సైగ చేసి చూపించారు. వంగి , అక్కడ ఏముందా అని చూసి, ఒక పెద్ద పుస్తకాల కట్ట ఉంటే దానిని ముందుకు లాగేను. దళసరి అట్టతో వాటిని పేక్ చేసి ఉన్నారు. వాటి మీద జోగారావు గారికి అని వచ్చీ రాని తెలుగులో రాసి ఉంది. ఉద్వేగం ఆపుకో లేక పోయాను. కళ్ళంట నీళ్ళు ఆగ లేదు. ఎప్పుడో, మామధ్య రాక పోకలు ఆగి పోయినా, దూరాలు పెరిగి పోయినా, వారు పుస్తకాల షాపు మూసి వేసే రోజులలో నాకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు పదిలంగా పేక్ చేసి ఉంచారుట. ఆ తరువాత వారిని నేను కలవడానికి నాలుగు దశాబ్దులకి పైగా పట్టింది. అయినా, వారి మంచం క్రింద నా పేరు రాసి ఉంచిన ఆ పేకెట్ అలాగే పదిలంగా ఉంది. చెక్కు చెదరని వారి అభిమానం లాగా. తరగని ప్రేమలాగా.

వారి గురించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసు కోలేక పోయిన నా అల్పత్వం స్ఫురించి సిగ్గు కలిగింది.

వారు నాకోసం దాచి ఉంచిన ఆ పుస్తకాల కట్టలో సి.నా.రె. గారి ఆధునికాంధ్ర కవిత్వం , సీతా దేవి మట్టి మనుషులు, కుటుంబరావు చదువు, రావి శాస్త్రి గారి నిజం నాటకం, రక్తాక్షరాలు, ఏడుతరాలు, ఊహాగానం ...లాంటి మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎలా వచ్చి చేరిందో ఈ కామమ్మ కథ పుస్తకం కూడా ఉంది.

నా పుస్తకాల గూటి లోకి గువ్వ పిట్టలా వచ్చి చేరి పోయింది.

ఇదీ, కామమ్మ కథ పుస్తకం నా దగ్గరకు వచ్చి చేరిన వైనం.

అయితే, ఈ పుస్తకంలో ఏముందో కూడా చెప్పాలి కదూ. నిజానికి అంత గొప్పగా దాన్ని గురించి చెప్పడానికి లేదు.

శుభము కామమ్మ శుభము కామమ్మా కామమ్మ

శుభ మొంది సామర్ల కోటలో నమ్మా కామమ్మ ... అంటూ పాట రూపంలో సాగి పోయిన నలభై పుటల చిన్ని పుస్తకం ఇది.

సుకపట్ల లక్ష్మయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె కామమ్మ. తల్లి దండ్రులు చిన్నప్పుడే పోవడంతో పిన తండ్రి రామన్న ఇంట అల్లారు ముద్దుగా పెరిగింది. బాల్యం వీడక ముందే తిరుపతి మారయ్యతో వివాహం జరిగింది. పెళ్ళినాటికి భర్త కలక్టరు దొర దగ్గర నెలకు మూడు వరహాల జీత గాడు. దొరతో ఎందుకో మాటా మాటా వచ్చి, కొలువు చాలించు కున్నాడు. తరువాత తల్లి ఎంత వారించినా వినకుండా చెన్నపట్నం వెళ్ళి అక్కడ దొరల దగ్గర మంచి కొలువునే సంపాదించు కున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి మీద మనసు పుట్టి, నాలుగు మాసాలు సెలవు పుచ్చుకుని, ఇంటికి తిరిగి వచ్చేడు. చిత్రమేమిటంటే, వివాహమయినా, అప్పటికింకా భార్య కామమ్మ కాపురానికి రానే లేదు. పెళ్ళవుతూనే కొలువులకి వెళ్ళి పోయేడు మరి. సరే, ఇంటికి చేరిన మారయ్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. మరి కోలుకో లేదు. కామమ్మను చూడాలని కోరేడు. కామమ్మ సారె, సరంజామాతో తొలిసారిగా అత్తింట అడుగు పెట్టింది. తొలి సారి చూపు మంచాన పడిన భర్తను. అదే కడ సారి చూపు కూడా అయింది. తరువాత కామమ్మ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎందరికో తలలో నాలుకగా మెలిగింది. చివరలో కామమ్మ మరణంతో ఊరు ఊరంతా విలపించింది. ఊరి ప్రజలు కామమ్మకు గుడి కట్టి గ్రామ దేవతగా ఆరాధించడం మొదలు పెట్టారు.

స్థూలంగా ఇదీ కామమ్మ కథ. పాట రూపంలో ఉన్న ఈ కథను గాయకులు అప్పట్లో గానం చేసే వారేమో తెలియదు. రచయిత పేరు ఎక్కడా కానరాక పోవడం వల్ల ఈ పాట పరంపరగా సామర్ల కోట ప్రాంతంలో పాడు కునే వారేమో కూడా తెలియదు.

ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం ఎందుకయ్యా అని మీరడుగ వచ్చును.

చిన్ని పుస్తకమే కావచ్చును. కానీ, అది నా దగ్గరకు చేరిన వైనం నా వరకూ చాలా గొప్పది. విలువైనది.

ఒక తియ్యని ఙ్ఞాపకం. ఒక మరపు రాని అనుభూతి. ఒక కన్నీటి తరంగం. ఒక మధుమయిన హృదయ స్పందన.

ఈ చిన్ని పుస్తకం కామమ్మ కథను చూస్తూ ఉంటే, నాకు నా మిత్రుని చూసి నట్టే ఉంటుంది. పలకరించి పులకరించి పోతున్నట్టుగా ఉంటుంది...

నా పుస్తకాల గూటిలో ఆ గువ్వ పిట్ట మంద్రంగా కువలాడుతూనే ఉంటుంది ...

అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీనూ ...



24, నవంబర్ 2011, గురువారం

వేథం దిట్టగ రాదు ! ... కానీ ...


అవున్నిజఁవే ! బ్రహ్మ దేవుడ్ని తిట్ట కూడదు. ! తప్పు. కళ్ళు పోతాయ్ ! కానీ, అతడు చేసే తింగరి పనులకు ఒక్కోసారి శతక కవి థూర్జటి style లో తిట్టాలనిపిస్తుంది. కదూ !

లేక పోతే ఏఁవిటి చెప్పండి ?

అష్టైశ్వర్యాలూ ప్రసాదిస్తాడు. అజీర్తి రోగం పట్టు కునేలా ఆశీర్వదిస్తాడు.

సకల విద్యాపారంగతునివి కమ్మని చెబుతాడు. అష్ట దరిద్రాలూ అనుభవించు పొమ్మంటాడు.

అందమైన మనోహర రూపం ప్రసాదిస్తాడు. అలవి మాలిన అహంకారాన్నీ, అఙ్ఞానాన్నీ అంట గడతాడు.

ఏ టీ ఎమ్ సెంటర్లో ఏ.సీ ఉండి, అది పని చేస్తూ, ఏ టీ ఎమ్ మాత్రం పని చేయ నట్టుగానూ ...

రైల్ లో బెర్తు కన్ ఫరమ్ అయిన కులాసాలో మనం ఉండగా రైలే రద్దయే పరిస్థితి కలిగినట్టుగానూ ...

నువ్వు పో గొట్టు కొన్న నీ పర్సులో వేలాది రూపాయలు ఉండడమూ, నీకు దొరికిన ఎవడో తల మాసిన వాడి పర్సులో చిల్లర నాణేలు మాత్రమే ఉండడమూ ...

ఎందుకు లెండి . చెబితే చేంతాడంత. వాడు చేసే తిక్క పనులు అన్నీ ఇన్నీ కావు.

ఈ శ్లోకం చూడండి :

యాత: క్ష్మామఖిలాం ప్రదాయ హరయే పాతాల మూలం బలి:
సక్తుప్రస్థవిసర్జనాత్ స చ ముని: స్వర్గం సమారోపిత:
ఆబాల్యా దసతీ సురపురీం కుంతీ సమారోహయత్
హా ! సీతా పతి దేవతా2గమదధో ధర్మస్య సూక్ష్మా గతి:

దీని అర్ధం ఏమిటంటే,

వామనుడు మూడడుగుల నేల దానం ఇమ్మని బలిని కోరాడు. ముందూ వెనుకా చూసు కోకుండా సరే ఇస్తున్నా పట్టు అన్నాడు మహా దాత బలి. అప్పటికీ రాక్షస గురువు శుక్రాచార్యడు వద్దు సుమీ, దుంప నాశనమై పోతావ్ ! అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ బలి విన లేదు ! అంత గొప్ప దానాన్ని చేసిన బలికి ఏం జరిగింది ?
పాతాళానికి పోయేడు !

సక్తుప్రస్థుడు అనే ఒక ముని కొద్దిపాటి పేల పిండిని ఎవడికో పెట్టాడు. వానికి స్వర్గం లభించింది !

వివాహం కాకుండానే తల్లి అయిన కుంతికి స్వర్గం లభించింది.

పరమ పతివ్రత అయిన సీతా దేవి మాత్రం భూగర్భంలో పడిపోయింది. ఆహా ! ధర్మం నడక ఎంత సూక్ష్మమైనదో కదా !

ఇదీ శ్లోక భావం.

అలారాసి పెట్టి ఉంది మరి అనుకుంటాం. కానీ అలా రాసిన వాడిని థూర్జటి కవిలాగా తిట్ట కూడ దంటూనే తిట్టే సాహసం చెయ్యం !

ఇంతకీ థూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో వేథను ఎలా తిట్టాడో కాస్త చూదామా ?

వేథం దిట్టగ రాదు గాని భువిలో విద్వాంసులం జేయనే
లా ? థీ చాతురిం జేసినన్ యటుల రా బాటంచు నేఁ బోక క్షు
ద్భా దాదుల్ కలిగింప నేల ? యది కృత్యంబైన దుర్మార్గులం
యీ ధాత్రీశుల చేయ నేటి కకటా ! శ్రీకాళ హస్తీశ్వరా !

దీని భావం:

ఓ శ్రీకాళహస్తీశ్వరా ! బ్రహ్మ దేవుడిని తిట్ట కూడదు. కానీ, లేక పోతే, మమ్మల్ని పండితులు గానూ, కవులుగానూ పుట్టించడం ఎందుకు ? పోనీ, తన బుద్ధి నేర్పరితనం వల్ల అలా చేసేడే అను కుందాం. ఆ పాండిత్యం వలన కలిగిన ఙ్ఞానంతో మిమ్ములను సేవించు కుంటూ, ఆ మార్గంలో నడవనీయ కుండా మాకు ఆకలి దప్పులు ఎందుకు పెట్టాడయ్యా

మాకుండే ఆ బాధలను ఆసరాగా చేసుకొని, తమ చుట్టూ తిరిగేలా చేసుకొంటున్న ఈ దుర్మార్టులయిన రాజులను ఎందుకు పుట్టించాడయ్యా !

ఈ ఆకలి బాధలూ, సంసార జంఝాటాలూ లేకుండా ఉంటే, ఓ దేవా ! నీవు మాకు ప్రసాదించిన పాండిత్యంతో , దాని వలన కలిగిన మంచి ఙ్ఞానంతో సదా మిమ్ములనే సేవించు కుంటూ ఉండే వారము కదా !

(తిక్కలోడివి కాక పోతే, మాకు మంచి పాండిత్యం ఇవ్వడ మెందుకు ? దానిని మీ కోసం వినియోగించ కుండా రాజులను ఆశ్రయిస్తూ దేబిరించడ మెందుకూ ? అలా దేబిరించడానికి కారణభూత మయిన ఆకలిదప్నులను మాకు ఇవ్వడ మెందుకూ ? వాటిని ఆసరాగా చేసు కొని మా బలహీనతలనూ, దీనత్వాన్నీ ఆసరాగా చేసుకొని మమ్ములను తమ చుట్టూ తిప్పుకొని రాక్షసానందం పొందే ఈ దుర్మార్గులయిన రాజులను పుట్టించడ
మెందుకూ ! )

లలాట లేఖో న పున: ప్రయాతి.

తల రాత మార్చ లేం కదా.