18, జూన్ 2015, గురువారం

మణి ప్రవాళమ్ అదో తుత్తి ... తెలుగింగ్లీష్



రెండు భాషలు కలగలిపి కవిత్వం చెప్తే దానిని మణి ప్రవాళ రచనగా పేర్కొంటారు. తెలుగునీఆంగ్లాన్నీ కల గలపి పద్యాలూ , కవితలూ వ్రాసి, మన కవులు కొందరు చాలా తమాషాలుచేసారు.
మచ్చుకి కొన్నింటిని చూద్దాం ...
ముందుగా కన్యా శుల్కంలో మన గిరీశం గారు వెలగ బెట్టిన రాగ వరసను చూడండి
నీ సైటు నా డిలైటు
నిన్ను మిన్ను కాన కున్న
క్వైటు రెచడ్ ప్లైటు,
మూను లేని నైటు ...
పొటిగరాప్పంతులు పంపిన మనిషిని చూడనట్టుగా,హుషారుగా చెప్పిన తెలుగింగ్లీషుకవిత ( ? )
ఫుల్లు మూను లైటటా
జాసమిన్ను వైటటా
మూను కన్న మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా ! టా ! టా !

మరి, శ్రీ. శ్రీ గారి కందాన్ని చూడండి ...

గోల్డ్వ్యామోహం చెడ్డది
మైల్డ్వ్యాయామం శరీర మాద్యం ఖలుడా,
చైల్డ్వ్యాపారం కూడదు,
ఓల్డ్వ్యూలను హోల్డు చేయకుండుముర, జరూ !

మరి కొన్ని పద్యాలను చూదామా ?

కనులం జూడదు భార్య యేనియును, నీ కాలస్థితింబట్టి, జ
ర్మను తైలమ్ము, జపాను సబ్బమెరికా క్రాఫున్, వియన్నా సులో
చనముల్, స్వీడను చేతి బెత్తమును, స్విడ్జర్లాండు రిస్ట్ వాచి, ఫా
రెను డ్రస్, ఫ్రెంచి కటింగ్ మీసమును, ఫారిన్ ఫ్యాషన్ లేనిచో నిలన్.

( మాధవ పెద్ది బుచ్చి సుందర రామ శా స్త్రి )

ఇన్స్యూరు లేని లైఫును
సెన్సార్ గానట్టి ఫిల్ము, సీక్రెట్ ట్రూతున్
వైన్సర్వు కాని ఫీస్టును
విన్సే లేనట్టి టీము వేష్టుర బ్రదరూ !
, ...

లైఫన నౌవెడే నసలు రైటని చెప్పగ లేము, బెడ్డులో
నైఫును, బోలెడెత్తు ప్రతి నైటును డేయును ఫాలో యవగా
వైఫును, సన్సు, డాటరుల ప్రాపరు రక్షణ ప్రొటెక్షనిచ్చెడిన్
లైఫుకు యిన్సురెన్సు బహుళంబుగ, ప్రాంప్టు ప్రొటెక్షనిచ్చెడిన్.

( మీది రెండు పద్యాలు ఇలపావులూరి సుబ్బారావు గారివి, )

ఇక, విశ్వనాథ కవి రాజు గారి పద్యం చూదామా ?

రామది కింగ్సు సన్ను వితు లక్ష్మణ ఎండ్ వితు సీత క్రాస్డు దీ
ఫేమసు దండకాసు బిగు ఫీల్డును మోస్టు లెబోరియస్లి, దెన్
కేము విరాధ విత్తు హిజు క్రూయలు వర్డ్సు, బివేరు ఫూల్సు నో
టైము టు లూజయాము వెరి టైర్డయి వాంట్మయి బ్రేకు ఫాస్టు సూన్.

చూసారా, తెలుగింగ్లీషు పద్యాలు ... అదో తుత్తి ! ...ఇలాంటి తమాషా మణి ప్రవాళ రచనలు చాల మంది కవులు చేసారు. తెలిసిన వారు తెలిసింది తెలుసుకుని చెప్తే తెలుసుకుని
వెరీ గ్లేడంటాను. ..

16, జూన్ 2015, మంగళవారం

కుర్చీల కథ !


కప్పల కథా, చెప్పుల కథా రాయగా లేనిది కుర్చీల కథ రాస్తేనేం ?

అందుకే ఇప్పుడీ కుర్చీల కథ రాయడం జరుగుతోంది ... అవధరించండి ...

పెద్దలు కురిచీ అనే పదం దేశ్య విశేష్యమని చెబుతారు. కూర్చోడానికి వీలుగా ఉండే ఎత్తయిన పీఠమని నైఘంటుకార్ధం. కుర్చీ అని దీనికి రూపాంతరం కూడా ఉంది. అసలు కంటే కొసరు ముద్దనీ, కురిచీ అనే పదం కంటే కుర్చీ అనేదే బాగా వాడుకలోకి వచ్చింది.



సరే, ఏదయితేనేం, డబ్బూ దస్కం, నీతి నియమాలూ, మనుషుల నడుమ ప్రేమాభిమానాలూ, ... ఇలా ఏవి లేక పోయినా, కనీసం కూర్చోడానికి వో కుర్చీ అంటూ లేని కొంప ఎక్కడా ఉంటుందనుకోను.

కుర్చీ మర్యాదకి చిహ్నం. ఆతిథ్యానికి ఆనవాలు. స్వాగత వచనానికి మారు పేరు. కాసేపు సేద దీరడానికి అనువైన ఉపకరణం. విశ్రమించడమే కాదు, కాలు మీద కాలు వేసుకుని కాస్త దర్పం ఒలకబోయడానికి కూడా తగినది కుర్చీయే కదా !

చెక్క బల్ల, పీట, స్టూలు మొదలయినవి కూడా కూర్చునేసాధనాలే. ఇలాంటివన్నీ కుర్చీలకి తమ్ముళ్ళు అనొచ్చు. చిన్న చిన్న కాకా హొటళ్ళలో కూర్చోడానికి కుర్చీలకు బదులు బల్లలే వేస్తారు. పోతే, సోఫాలూ అవీ మామూలు కుర్చీలకి పెద్దన్నలు. మహా రాజా కుర్చీలయితే మరీనూ, అవి కుర్చీల కుల పెద్దలు.

‘‘ కూర్చుండ మా యింట కురిచీలు లేవు ,,,’’ అంటారు కరుణ శ్రీ. మరీ చోద్యం కాక పోతే కనీసం వో పాత కాలపు ఇనప కుర్చీ అయినా ఉండి ఉండదా ?

వో సంగతి గర్తుకొచ్చింది. చెబుతా వినండి. కరుణశ్రీ గారు మా విజీనారం సంస్కృత కాలేజీకి వచ్చి నప్పటి సంగతి. వారు మాట్లాడుతూ వో సంగతి చెప్పారు. కొంత మంది కాలేజీ అమ్మాయిలు ఓ సారి వారింటికి వచ్చేరుట. అందులో వో గడుగ్గాయి కవి గారితో ‘‘ ఏఁవండీ ... మీ ఇంట్లో ఇన్ని కుర్చీ లున్నాయి కదా ... మరి

‘ కూర్చండ మా ఇంట కురిచీలు లేవు ! ’ అని రాసేరేఁవిటండీ అబద్ధం కాదూ ? ’’ అని అడిగిందిట. కవిగారు వెంటనే ‘‘ అమ్మాయీ, అది కవిత్వం. కుర్చీలు లేవంటే లేవని కాదు దానర్ధం. ఆ స్వామి కూచోడానికి తగిన చోటులు కురిచీలు కావు... అందుకే నా హృదయాంకమే సిద్ధ పరచ నుంటి అని చెప్పారుట.ఈ విరణ ఆ అమ్మాయికి  ఏమర్ధ మయిందో కానీ ‘‘సరే లెండి ఇంకెప్పుడూ అబద్ధాలు రాయకండి’’ అందిట. అంతే సభలో నవ్వులే నవ్వులు ! చప్పట్లే చప్పట్లు ! ...



‘‘ కుర్చీలు విరిగి పోతే కూర్చోడం మాన నట్లు ...’’ అంటూ శ్రీ .శ్రీ  వో గేయంలో  కుర్చీల  ప్రస్తావన తెచ్చాడు. అగ్గి పుల్లనీ. సబ్బు బిళ్ళనీ వదలని కవి కుర్చీల మాట ఎత్తాడంటే అబ్బుర మేముంది లెండి ?

మీకు తెలిసిన పద్యమే ...

కనకపు సింహాసనమున
శునకము కూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణ మేల మాను ? వినరా సుమతీ !

కుక్కని  బంగారు గద్దె మీద కూర్చో పెట్టినా, అది దాని ముందటి  నీచ గుణం మార్చుకోదు ...

థూర్జటి కవి ఒక పద్యంలో ‘‘ ఒకరిం జంపి పదస్థులై బ్రదుక నొక్కొక్కరూహింతు రేలకో ...’’ అంటూ ఆశ్చర్య పోయాడు. అంటే, ఒకడిని పదవి నుండి కిందకి లాగేసి, ఆ పదవి తాను దక్కించు కోవాలని ఒక్కొక్కడు ఎందుకో అనుకుంటాడు. అంటే, ఒకడిని వాడి కురిచీ మీద నుండి లాగీసి తాను ఆ కుర్చీ మీదకి ఎక్కడమే కదా ఎందుకో ఈ తాపత్రయం ... ‘‘తామెన్నడు చావరో ? తమకు లేదో మృతి ?’’ అని కూడా అడుగుతాడు కవి.

అదీ కుర్చీ మహిమ ! ప్రతి వాడికీ కుర్చీ కావాలి. అంటే పదవి కావాలి. నిన్నటి వరకూ టీ డబ్బులకి టికాణా లేని నిరుద్యోగి ఉద్యోగం రాగానే కుర్చీకి అతుక్కు పోయి దర్జా వెలిగిస్తాడు. రాజకీయ నాయకులూ అంతే. పదవి వచ్చే వరకూ కాళ్ళూ గడ్డమూ పట్టు కుంటారు. గద్దె నెక్కాక మరి పట్టించుకోరు.

భరతుడు శ్రీరామపాదుకలను సింహాసనం మీద ఉంచి రాజ్యపాలన చేసాడని రామాయణ గాథ. అంటే కుర్చీ మీదే కదా ? రామపాదుకలను వహించిన ఆ కుర్చీ భాగ్యమే భాగ్యం ...

తన కుర్చీని కాపాడు కోడానికే కదా ఇంద్రుడంతటి వాడు  తపోధనుల దగ్గరకి రంభా, మేనకా మొదలయిన దేవ వేశ్యలను పంపిస్తాడు ?



కుర్చీ కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంత మారణ హోమం జరిగిందో లెక్క లేదు. గతమంతా తడిసె రక్తమున. కాకుంటే కన్నీళులతో .  ఒకప్పుడు మనిళ్ళలో గాడ్రెజ్ కుర్చీలని ఇనుప కుర్చీలు తెగ కనిపించేవి. ప్టాస్టిక్ యుగం మొదలయ్యేక మరుగున పడి పోయేయి..

కూర్చునేందుకు వీలుగా వాడే వన్నీ కుర్చీలే అయినా, కుర్చీల పెద్దన్నలది మరో దారి. సోఫాల పేరుతో వ్యవహరించ బడే వారి దర్జాయే వేరు. వాటిలో మళ్ళీ కుషన్ సోఫాలు మరీ ప్రత్యేకం. సగం ఇంటిని అవే ఆక్ర మిస్తాయి. పెద్ద పెద్ద ఇళ్ళలో అయితే ఫరవా లేదు కానీ, చిన్న కొంపల్లో కూడా దర్జా వెలగ బెట్టడం కోసం పెద్ద పెద్ద సోఫాలు ఇరుగ్గా ఇరకాటంగా కనిపిస్తూ ఉండడం చూస్తుంటాం.. ఆధిక్య ప్రదర్శనకి అదో సద్ధతి మరి ...




సన్మాన సభల్లోనూ, వివాహ వేడుకల్లోనూ ప్రత్యేకంగా ఉపయోగించేవి మహారాజా కుర్చీలు. ఇవి వెనుకటి రోజుల్లో రాజుల సింహాసనాల్లా గొప్ప హోష్ గా ఉంటాయి.


కృష్ణ దేవరాయల వారి సభా భవనంలో ఎనిమిది కుర్చీలను ప్రత్యేకంగా వేసే వారు. అందులో అష్ట దిగ్గజకవులు ఆసీనులయేవారు. అందులో పెద్ద కుర్చీ పెద్దనది.

వెనుకటి రోజులలో సినిమా హాళ్ళలో నేల, బెంచీ, కుర్చీ, బాల్కనీ అనే తరగతులుండేవి. నేలంటే నేలే. కటిక నేల మీదో, ఇసక మీదో కూర్చుని తమ చుట్టూ మరొకరు చేరకుండా ఉమ్మి వేసి ఆ స్థలాన్ని వో దుర్గంగా మార్చీసుకుని మహా విలాసంగా సినిమా చూసే వాళ్ళు.. సోడాల వాళ్ళూ, జంతికలు, కరకజ్జాలూ. వంటి తినబండారాలమ్మే వారి అరుపుల తోనూ నేల తరగతి నానా గలీజుగా ఉండేది. ఈలలూ. చప్పట్లూ తెగ బీభత్సం చేసేవి. మరో అణావో, బేడో పెడితే బెంచీ క్లాసు. ఆపైది కుర్చీ క్లాసు. బాల్కనీ తరగతి మరీ ధనవంతుల తరగతిగా ఉండేది. మరీ టూరింగు హాళ్ళలో నయితే, కొన్ని కుర్చీలు ఊరి పెద్ద మనుసుల కోసం స్పెషల్ గా వేసేవారు. అసలు, వారొచ్చి, ఆ కుర్చీలను అలంకరిస్తే కానీ ఆట మొదలయేది కాదు. సినిమాకే కాదు, నాటకాలకీ, హరికథలకీ, ఇతర సభలకీ కూడా అంతే.

సభలలో అయితే కుర్చీలను ‘‘ఆసనం’’ అని గౌరవిస్తూ ఉంటారు. ఫలానా వారు వచ్చి తమ ఆసనాన్ని అలంకరించాలని కోరుతున్నాము అంటే వచ్చి కుర్చీలో  కూచుని ఏడవరా నాయనా అనే అర్ధం.

భోజనం బల్లలని ( డైనింగు టేబిళ్ళని ) కుర్చీల సంఖ్యతోనే  చెప్పడం వొక రివాజు. గమనించేరా ? మా ఇంట్లో డైనింగు టేబిలు ఆరు కుర్చీలదండీ ... అంటే, మా ఇంట్లో నాలుగు కుర్చీలదే సుమండీ, అదయితేనే సౌకర్యంగా ఉంటుంది అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి ...

ఇంటర్య్యూలకి వెళ్ళే అభ్యర్ధులకి అధికారులకి ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలలో వెంటనే కూర్చోవాలా ? వాళ్ళు అనుమతిస్తేనే కూర్చోవాలా అనేది తెగని సమస్య. ఎంతకీ వాళ్ళు కనికరించకుండా కూర్చోమనక పోతే వాళ్ళడిగే చొప్పదంటు ప్రశ్నలకి కాళ్ళు పీకేలా నిలబడే జవాబులు చెప్పాలి.

టేకిట్ యువర్ ఛైర్ .. అంటే,  నీ కుర్చీ నువ్వుమోసుకొని ఫో అని అర్ధం ఎంత మాత్రమూ కాదు.

కుర్చీకుండే నాలుగు కాళ్ళూ సరిగా లేక పోతే దభాలున కింద పడడం తథ్యం. అందు వల్ల కొందరు బుద్ధిమంతులు ఎందుకయినా మంచిదని కూర్చునే ముందు కుర్చీని కొంచెం  లాగి, కదిపి మరీ చూసుకుని ఏ ప్రమాదమూ లేదని నిశ్చయించు కున్నాకే అందులో కూర్చుంటారు.

ఒకప్పుడు వీధి బడుల్లో తుంటరి పిల్లలు అయ్యవార్ల కుర్చీల కింద టపాసులు పెడుతూ అల్లరి చేసేవాళ్ళు.

కుర్చీలగురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది.



పడక కుర్చీ వైభోగమే వేరు. అందులో ఉంటే సగం కూర్చున్నట్టూ, సగం పడుకున్నట్టూ ఉంటుంది. వయసు మళ్ళిన వారికి ఇది మరీ అనువైనది. పడక కుర్చీ కబుర్లు అనీ ... ఏ పనీ పాటూ లేని కబుర్ల గురించి హేళన చేయడం కూడా ఉంది. ఇప్పుడయితే రాత్రి వేళ తిరిగే దూర ప్రయాణాల బస్సుల్లో ఈ రకం కుర్చీలు కొద్దిపాటి మార్పుతో ఉంటున్నాయి. రైళ్ళలోనూ, విమానాల్లోనూ ఈ తరహా కుర్చీలను హాయిగా రిలాక్సింగ్ గా ప్రయాణం  కోసం



అమరుస్తున్నారు ...అయితే వాటిని కుర్చీలు అనకుండా, సీట్లు అని అంటారు లెండి...

ఇక, మీకు కుర్చీలాట తెలుసు కదా ? అదేనండీ , మ్యూజికల్ ఛైర్ ఆట ! గుండ్రంగా కుర్చీలను అమర్చి, దాని చుట్టూ లయబద్ధంగా వినిపించే సంగీతానికో, పాటకో అనుగుణంగా తిరుగుతూ ఉండాలి. ధ్వని ఆగి పోగానే చప్పున దొరికిన కుర్చీలో కూర్చోవాలి. తిరిగే వారి సంఖ్య కంటె అక్కడ పెట్టే కుర్చీల సంఖ్య ఒకటి తక్కువగా ఉండేలా చూస్తారు కనుక, తప్పని సరిగా ఒకరికి కూచోడానికి కుర్చీ దొరకదు. అతడు ఔటయినట్టే లెక్క. ఇలా తడవ తడవకీ ఒక్కో కుర్చీ తీసేస్తూ ఉంటారు. చివరకి ఇద్దరు వ్యక్తులూ, ఒక్క కుర్చీ మాత్రమే మిగలడం జరుగుతుంది. మళ్ళీ వారిలో ఒక్కరే విజేతగగా నిలుస్తారు ...ఈ ఆటలో  కుర్చీలకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ! పాట ఆగిందా ! సీటు గోవిందా !! అనే పాటా, ఆ సన్నివేశం ఉన్న సినిమా గుర్తుందా ?

ఒకప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మాత్రమే వాడే రివాల్వింగు కుర్చీలు ఇప్పుడు చాలా మందికి అందుబాటు లోకి వచ్చేయి. డెస్క్టాప్ ముందు అవి మరీ అవసరమయ్యేయి.

గవర్నమెంటు ఆఫీసుల్లో గుమాస్తాల కుర్చీలు పని వేళల్లో ఖాళీగా ఉండడం ఆఫీసర్ల చేతగాని తనానికి లేదా ఉదార స్వభావానికీ నిదర్శనం.


ఇక, కుర్చీ కింద చెయ్యి గురించి మనందరికీ తెలిసినదే. కుర్చీ కింద చేతిని తడిపితే కానీ పనులు జరగవు.

కూర్చున్న కుర్చీకి ఎసరు అంటే, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని స్థితి. ప్రైవేటు ఉద్యోగాల్లో, ముఖ్యంగా మీడియా రంగంలో పని చేసే వారికి ఈ భయం జాస్తి అంటారు ...

ఇక, రకరకాల డిజైన్లలో కుర్చీలకి కొదవే లేదు ...మచ్చుకి వొకటి చూడండి ..




పూర్వపు రాజుల రత్న ఖచిత సింహాసనాల్లాగా ఇప్పటికీ విలాసవంతులూ, జనం ధనం తెగ కాజేసిన వాళ్ళూ ఇళ్ళలో బంగారంతో చేసిన కుర్చీలని వినియోగించిన వైనం ఇటీవలి కాలంలో చూసేం.

‘‘ నిన్న మావారి సన్మానానికి జనం బాగా వచ్చేరుట ... సగం హాలు నిండిందిట !‘‘ అందొకావిడ గొప్పగా.

‘‘ పోదూ బడాయి !.. సగం కుర్చీలు ఖాళీయేనట ! మావారు చెప్పారు ’’ అని మూతి మూడు వంకర్లు తిప్పిందిట పక్కింటావిడ.

మరో ముఖ్య విషయం ... పార్టీ టిక్కెట్టు రాని అభ్యర్ధుల అనుచరగణం తమ అక్కసంతా ముందుగా కుర్చీల మీదే చూపిస్తూ ఉంటారు. కుర్చీలను విరిచి పోగులు పెట్టే దృశ్యం తరచుగా చూస్తూ ఉంటాం.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు .. ఎవరి మీదనో కోపం కుర్చీల మీద చూపడం సబఁవా ? మీరే చెప్పండి ? అప్పుడే కాదు, సభల్లోనూ, ఆఫీసుల్లోనూ. ఆస్పత్రులలో, ఇక్కడా అక్కడా అనేమిటి లెండి, ఎవరికి కోపం వొచ్చినా విరిగేవి కుర్చీలే !

















5, జూన్ 2015, శుక్రవారం

హన్నా ! ఏదీ కర్రా !! అనబడు దండం దశ గుణం భవేత్ !!



దండం దశ గుణం భవేత్ అనే మాట తరుచుగా వింటూ ఉంటాం కదా?
దాని పూర్తి పాఠం చూదాం ...

విశ్వా మిత్రా హి పశుషు, కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

వి = పక్షులు
శ్వా = కుక్కలు
అమిత్ర = శత్రువులు
అహి = పాములు
పశు = పశువులు ( వీటిని అదుపు చేయడానికిన్నీ)

కర్దమేషు = బురదలో
జలేషుచ = నీటిలో
అంధే = గుడ్డితనంలో
తమసి = చీకటిలో
వార్ధక్యే = ముసలితనంలో ( సాయంగా ఉండేది కర్ర.)
( ఈ విధంగా)

దండం = కర్ర
దశగుణమ్ = పది విధాలయిన
గుణమ్ = గుణములు కలది
భవేత్ = అగుచున్నది.

అంటే, చేతి కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడుతుంది.

అంతే కాక, బురదలో సజావుగా నడవడానికి, నీటిలో లోతు చూసుకుంటూ దిగడానికీ, చీకటిలో తడుముకుంటూ క్షేమంగా వెళ్ళడానికీ, గుడ్డితనంలో ఆసరాగానూ, ముసలితనంలో ఊతగానూ ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేతి కర్ర పదిరకాలుగా మనకు ఉపయోగ పడుతున్నదన్నమాట.

శ్లోకం అర్ధం ఇలా ఉంటే, మనలో చాలమంది ఎందుకో, దండించడం వల్ల ( శిక్షించడం వల్ల) పదిలాభాలు ఉన్నాయి .. వంటి అర్ధాలు చెబుతూ ఉంటారు. దండం అనే పదాన్ని దండన అనుకోవడం వలన ఈ భావం కలుగుతూ ఉండొచ్చును.

మరయితే, ఈ టపాకి ఎన్నుకున్న చిత్రం అలా ఉందేమిటయ్యా, అని నిలదీయకండి.

ప్రమాదో ధీమతామపి ( బుద్ధిమంతులు కూడ ఒక్కొక్క తూరి పొరబడుతూ ఉంటారు) అని చెప్పడానికి అలా ఉంచానంతే.



2, జూన్ 2015, మంగళవారం

అంతా బూతేనా ?!



కవి చౌడప్ప పేరెత్తితే చాలును, థూ ... అంతా బూతు ! అనెయ్యడం తెలిసిన విషయమే.
చౌడప్ప నిజంగా అన్నీ బూతు పద్యాలే రాసాడా ? కాదనే చెప్పాలి. అందుకే మన సాహిత్య కారులు కవుల చరిత్రలు రాస్తూ కవి చౌడప్పకు సముచిత స్థానమే ఇచ్చారు.
కంద పద్యాలలో రచించాడు కవి తన చౌడప్ప శతకాన్ని. కవికి తనలా వేరొకరు కంద పద్యాలను రాయ లేరనే ఆత్మ ప్రత్యయం ఎక్కువ. అందుకే ఎంత థీమాగా చెప్పాడో చూడండి:
ముందుగ చను దినములలో
కందమునకు సోమయాజి ఘనుడందురు నే
డందరు నను ఘనుడందురు
కందమునకు కుందవరపు కవి చౌడప్పా.
భావం : పూర్వం రోజులలో కందపద్య రచనకు తిక్కన గారిది అందె వేసిన చేయి అంటారు. ఇవాళ నన్ను కంద పద్య రచనలో ఘనుడినని అంటారు.
కందము నీవలె జెప్పే
యందము మరిగాన మెవరియందున గని సం
క్రందన యసదృశనూతన
కందర్పా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: నీలా ఇంత అందంగా కందం చెప్పడం మరెవరికీ చాతకాదయ్యా ! నువ్వు ఇంద్రునితో సమానమైన నూతన మన్మథుడివి సుమీ ! అని కవి తన గురించీ, తన కంద పద్యం గురించీ చెప్పాడు.
కందముల ప్రాసగణయతు
లందముగా కవిత నెందరల్లరు విను నీ
కందంబులు రససన్మా
నందంబులు కుందవరపు కవిచౌడప్పా.
భావం: గణాలూ, యతులూ ,ప్రాసలూ కుదిరేలా చూసుకుని ఎందరు కంద పద్యాలను అల్ల లేదు ?
కాని, నీ కందాలు మాత్రం మహా రుచికరంగా భేషుగ్గా ఉంటాయి సుమీ !
నా నీతి వినని వానిని
భానుని కిరణములు మీద బారని వానిన్
వానను తడియని వానిని
గాననురా కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఈ కవికి ఎంత ఆత్మవిశ్వాసం అంటే, తను చెప్పే నీతులు వినని వాడూ, ఎండ వేడిమి తగలని వాడూ, వానలో తడవని వాడూ ఎవడూ ఉండడు. అలాంటి వాడిని తను చూడ లేదుట !
తెలుగులో పచ్చి బూతు కవిగా ముద్ర పడి పోయిన చౌడప్ప బూతులూ, అశ్లీల శృంగారం పెచ్చు మీరిన పద్యాలు రాయక పోలేదు. అయితే రాసిన వన్నీ బూతులే కావు. చక్కని నీతి పద్యాలూ మిక్కుటంగానే ఉన్నాయి.
హాస్యం కోసం బూతాడక తీరదనుకునే రోజుల వాడు మన కవి.
నీతులకేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా! కుందవరపు కవిచౌడప్పా.
భావం: నీతులు చెప్పడానికేం ! ఓ ! చాలా ఉన్నాయి. కానీ కొంచెమయినా బూతు మాటలు పలుకక పోతేనవ్వు పుడుతుందిటయ్యా ? రాజులను నవ్వించాలి కదా ! నీతులు, బూతులు రెండూ సమానమైన లోకఖ్యాతికరాలే కదా !
పది నీతులు పదిబూతులు
పది శృంగారములు గల్గు పద్యము సభలన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుందవరపు కవిచౌడప్పా.
భావం: పది నీతులు, పది బూతులు , పది శృంగార పద్యాలు సభలో చదివిన వాడే గొప్పవాడు కదా.!
ఛీ ! బూతు ! అంటూ ముఖం వికారంగా పెట్టే వాళ్ళకి కవి ఓ గట్టి చురకే వేసాడండోయ్ !
బూతని నగుదురు గడు తమ
తాతలు ముత్తాత మొదలు తరముల వా
రే తీరున జన్మించిరొ !
ఖ్యాతిగ మరి కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఛీ ! పచ్చి బూతు ! అన్న వాళ్ళే ఆ బూతుని నవ్వుతూ వింటారు. వాళ్ళ తాతముత్తాతలు బూతు లోంచి కాక పోతే మరెలా పుట్టుకొచ్చారు ?
జానపదులలో విస్తారంగానూ, నాగరికులలో రవంత అరుదుగానూ వినిపిస్తూ, నిఘంటువులలో ఎక్కడో మారుమూల బిక్కు బిక్కుంటూ ఉండే బూతు మాటలను ఈ కవి నిర్భీతిగా, ఏ మొఖమాటాలకీ తావు లేకుండా, గుట్టూ మట్టూ లేకుండా చాలా పద్యాలలో వాడిన మాట నిజమే అయినా, చౌడప్ప వన్నీ బూతు పద్యాలే కావు. చక్కని కందాలూ, ఎంచక్కని వృత్త పద్యాలూ చాలా ఉన్నాయి.
నీచులనూ, నీతి బాహ్యులనూ, మేక వన్నె పులలనూ, కుహనా మేథావులనూ, ఈ కవి ఏ శషభిషలూ లేకుండా జలకడిగి పారేస్తాడు.
చూడండి:
వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: కవిత్వాన్ని చదవాలి. చక్కగా ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ హేళన చెయ్య కూడదు. అవమానించ కూడదు. అలా చేసే వాడు తుంటరి గాడిద !
ఇయ్యా యిప్పించ గల
యయ్యలకే గాని మీస మన్యుల కేలా ?
రొయ్యకు లేదా మీసము
కయ్యానకు కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఇచ్చే వాడికీ, ఇప్పించగల వాడికీ మీసాలు ఉండాలి. కానీ మిగతా పనిమాలిన వెథవలందరికీ మీసాలెందుకూ దండగ ! రొయ్యకు బారెడు మీసం ఉంటుంది ! ఎందుకూ !
మునుపాడి వెనుక లేదను
పెను గొంటె గులాము నోరు పీతిరి గుంటే
యనిఘనుడు సత్య వాక్యమె
గన వలెరా కుందవరపు కవిచౌడప్పా.
భావం: ముందు ఇస్తానని మాట యిచ్చి , తరువాత లేదు పొమ్మంటాడే, వాడి నోరు అశుద్ధం గొయ్యితో సమానం ! ఈ మాటలు పూర్తిగా నిజం.
పెద్దన వలె కృతి చెప్పిన
పెద్దన వలె ; నల్ప కవిని పెద్దన వలెనా ?
ఎద్దన వలె, మొద్దన వలె
గ్రద్దన వలె కుందవరపు కవిచౌడప్పా.
భావం: అల్లసాని పెద్దన లాగా కవిత్వం చెప్పిన కవినే పెద్ద అనాలి కానీ, తక్కిన పనికి మాలిన కవులని అందరినీ పెద్ద అనాలా ? ఎద్దనాలి. మొద్దనాలి. గ్రద్ద అనాలి.
కీలెరిగి వాత పెట్టడ మంటే ఇదే కాబోలు.
తులసీదళముల హరిపద
జలజంబుల పూజసేయు సరసుల యమ దూ
తలుజూచిఏమి చేయం
గలరప్పా కుందవరపు కవిచౌడప్పా.
భావం: హరి పాద పద్మాలకు తులసీ దళాలతో పూజ చేసే వాడిని యమ దూతలు కూడా ఏమీ చెయ్య లేరు !
పరవిత్తము గోమాంసము
పరసతి తన తల్లి యనుచు భావించిన యా
నరుడు నరుండా రెండవ
కరి వరదుడె  కుందవరపు కవిచౌడప్పా.
భావం: పరుల సొమ్ము గోమాంసంతో సమానంగానూ, పరుల భార్యలను తల్లితో సమానంగానూ ఎవడయితే చూస్తాడో, వాడు అపర నారాయణుడే !
వానలు పస పైరులకును
సానలు పస వజ్రములకు సమరంబులకున్
సేనలు పస మృగజాతికి
కానలు పస కుందవరపు కవిచౌడప్పా.
భావం: పంటలకు వానలే పస. సానపట్టడం వల్ల వజ్రాలు కాంతితో మెరుస్తూ ఉంటాయి. యుద్ధాలకి సేనలు తగిన బలం. జంతువులకు క్షేమకరమయిన తావులు అవడులే.
పులి నాకి విడుచు దైవము
గల వానికి దైవ బలము గలుగని వేళం
గలహించి గొఱ్ఱె కరచును
కలియుగము కుందవరపు కవిచౌడప్పా.
భావం: దేవుని దయ ఉంటే, పులి కూడా వాడిని ఏమీ చేయదు. అలా తడిమి వదిలేస్తుంది. దైవ బలం లేక పోతే, గొఱ్ఱె కూడా కరుస్తుంది ! కలి కాలపు వింత అంటే ఇదే !
పాండవు లిడుమల బడరే
మాండవ్యుడు కొరత బడడె మహి ప్రాకృత మె
వ్వండోపు మీరి చనగ న
ఖండిత యశ కుందవరపు కవిచౌడప్పా.
భావం: చేసుకున్న వాళ్ళకి చేసుకొన్నంత ! పాండవులు ఎన్న కష్టాలు అనుభవించ లేదు ? మాండవ్య ముని కొరత పడ లేదూ ! పూర్వ జన్మలో చేసిన పాపాలు తప్పించు కోవడం ఎవరి తరమూ కాదు.
ఆడిన మాటను తప్పిన
గాడిద కొడకంచు తిట్టగావిని మదిలో
వీడా ! నా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఆడిన మాటను తప్పిన వాడిని గాడిదా ! అని తిడితే వీడా నా కొక కొడుకు ! అని గాడిద కూడా ఏడిచిందిట !
మూలిక క్రియ కొదిగినదే
నాలుక సత్యంబు గలదె నడిపిన వాడే
యేలిక వరమిచ్చినదే
కాళికరా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: మందుకు పనికొచ్చేదే మూలిక. సత్యం పలికేదే నాలుక. చక్కగా పాలించే వాడే ఏలిక. వరమిచ్చేదే దేవత !
కుటుంబ వ్యవస్థ పట్ల కవి చౌడప్పకి ఎంత గౌరవమో చూడండి:
తన సతి యిడగా మనుమలు
తనయులు తలిదండ్రులన్న దమ్ముల్ బంధుల్
దినదినములు భుజియించుట
ఘనవిభవము కుందవరపు కవిచౌడప్పా.
భావం: భార్య వడ్డిస్తూ ఉంటే, మనుమలు, తల్లిదండ్రులూ, అన్నాదమ్ములు, బంధువులూ అందరూ కలిసి రోజూ భోజనం చెయ్యడం ఎంత వైభవంగా ఉంటుందో కదా !
సరసము చతురోపాయము
హరి భక్తియు శాంత గునము నర్థుల పట్లన్
పరమౌ చుపకారము విను
కరుణాకర కుందవరపు కవిచౌడప్పా.
భావం: సరసం, చతురోపాయం, హరి భక్తి, శాంత గుణం, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి.
సీమ దయా పరుడేలిన
క్షేమంబగు దోసకారి సీమేలినచో
క్షామంబగు నతడేలే
గ్రామంబున కుందవరపు కవిచౌడప్పా.
భావం: దయాపరుడైన వాడు నేలను పరిపాలిస్తే అంతా సుభిక్షంగా ఉంటుంది. దుర్మార్గుడు పాలిస్తే అంతటా కరువే .
చౌడప్ప కవి వర్గ దృక్పథం ఎలాంటిదంటే,
ఎన్నగల యడవి మృగముల
కన్నీరేమైన వేటగానికి ముద్దా ?
నన్నాపు దొరకు బీదల
కన్నీరును కుందవరపు కవిచౌడప్పా.
భావం: వేట గాడికి అడివి జంతువు కన్నీళ్ళు ముద్దా యేమిటి ? వాటికతడు కరిగి పోతాడా ? అలాగే దోచు కునే దొరకు పేదవారి కన్నీళ్ళు ముద్దొస్తాయా ?
చౌడప్ప వృత్త పద్యాలలో మచ్చు కొకటి చూడండి:
ఆసలజేరి దుర్గుణ గణాఢ్యుని దాత వటంచు వేడినన్
మీసలము దువ్వుచున్ దిశల మీదన చూచుచు దుర్మథాంథుడై
మీసము నియ్య లేని నలు విత్త గులాము కీర్తి చేరునా ?
భూసుర వర్య కుందవర భూషణ చౌడ కవీశ్వరోత్తమా !
భావం: దుర్మార్గుడిని మన ఆశ కొద్దీ దాతవు అని వేడుకొంటే యేమవుతుంది ? మీసాలు మెలి త్రిప్పుతాడు. పైకీ కిందకీ చూస్తాడు. వీసం కూడా ఇవ్వడు. ఆ వెధవకి ఏం కీర్తి వస్తుంది చెప్పండి
కావాలనే చాలా బూతు పద్యాలు చెప్పాడు. అలాగే చాలా నీతులూ చెప్పాడు. ఆ సంగతి కవి ఇలా స్పష్టం చేస్తున్నాడు:
బూతులు కొన్నిట కొన్నిట
నీతులు చెప్పితి బుధులు నీతులబూతుల్
బూతుల మెచ్చందగు నతి
కౌతుక మతి కుందవరపు కవిచౌడప్పా.
భావం: నా పద్యాలలో కన్నింట నీతులు చెప్పాను. అలాగే, కొన్నింట బూతులూ చెప్పాను. తెలివైన వాళ్ళు నేను చెప్పిన నీతులతో పాటు ఆ బూతులనీ మెచ్చు కోవాలి సుమా !
చౌడప్ప కవి దెబ్బ ఎలాంటిదంటే ....
కాకులు వేవేలొక్క తు
పాకి రవము విన్న నులికి పడవా మరి ! నా
ఢాకకు తగు నాలాగే
కాకవులును కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఒక్క తుపాకి చప్పుడు వినగానే వేల కొద్దీ కాకులయినా సరే తుర్రుమంటూ ఎగిరి పోతాయ్ ! కదా ! అలాగే, కువులు కూడా నా దెబ్బకు అదిరి పోవలసినదే !
ఏం పెంకెతనం !
ఈ టపా రాసి post చెయ్య బోతూ ఉంటే వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. వస్తూనే వంటింటి వాసలనలని పసి కట్టేసి, ఇవాళ టిపిను పెసరట్లలా ఉందే ! అని సంతోషంగా నవ్వీసి , నేను రాసినదంతా చదివేడు.
‘‘ ఛ ! నువ్వు కూడా ఇంత దిగజారి పోతా వనుకో లేదు. నీ దిక్కుమాలిన కథా మంజరి బ్లాగులో ఇంత కాలం ఏవో పద్యాలూ, శ్లోకాలూ పెడుతూ నీ చేతి దురద తీర్చు కుంటున్నావంటే పోనీ లెమ్మను కున్నాను.. చివరకి ఈ అప్ప కవిగాడి పద్యాలు పెట్టే స్థితికి వచ్చేవన్నమాట !’’
అంటూ ఘాటుగా విమర్శించాడు. నేను కొయ్యబారి పోయేను.
వాళ్ళక్కయ్య ( సొంత సోదరి కాదు లెండి. వరసకి అక్కయ్య. అదీ వాడు కలుపుకొన్న వరసే)
పెసరట్టూ, ఉప్మా టిఫిను పెట్టి, కమ్మని కాఫీ ఇస్తే తాగి నిమ్మళించేడు.
అప్పుడన్నాడు: ‘‘ హు ! నీ ఏడుపేదో నువ్వు ఏడువ్. నాకెందుకు గానీ, ఆ అప్ప కవిగాడి మిగతా పద్యాలన్నీ ఎక్కడ దొరుకుతాయ్ ?!’’ అన్నాడు సూటిగా.
ఈ మారు నిఝంగానే ( ఒక మేజా బల్ల చేయించు కోడానికి సరిపడేటంతగా ) కొయ్యబారి పోయేను.