29, డిసెంబర్ 2009, మంగళవారం
రామ గోపాలమ్ !
కోలాచలం పెద్ది భట్టు కవి శ్రీరాముని పరంగానూ, గోపాలుని పరంగానూ చెప్పిన చక్కని శ్లోకమిది ...
య:పూతనా మారణ లబ్ధ వర్ణ:
కా కోదరోయేన వినీత దర్ప:
యస్సత్యభామా సహితస్సపాయా
న్నాధో యదునా మధనా రఘూణామ్.
ముందుగా గోపాలుని పరంగా అర్ధాన్ని చూదామా !
య:, పూతనా,మారణ లబ్ధ వర్ణ: = ఎవడు పూతనను చంపి కీర్తి పొందెనో
యేన కాకోదర: , వినీత దర్ప: = ఎవని చేత కాళీయుని గర్వం అణచి వేయ బడిందో
య:, సత్యభామా సహిత: = ఎవడు సత్యభామతో కూడి ఉంటాడో
యదూనాం నాధ: , స: , పాయాత్ = అట్టి యదువంశ ప్రభువయిన గోపాలుడు కాపాడు గాక !
ఇక, శ్రీరాముని పరంగా అర్ధం పరిశీలిద్దామా !
య: , పూత నామా = ఎవడు పవిత్రమైన పేరు గల వాడో
రణ లబ్ధ వర్ణ: = ఎవడు యుద్ధంలో కీర్తిని గడించాడో
అదర:, కాక: , వినీత దర్ప: = భయం లేని కాకాసురుని గర్వం అణచి వేసాడో
య: , సత్య , భా , మా, సహిత: = ఎవడు సత్యము, కాంతి మరియు లక్ష్మిలతో కూడిన వాడో
స: , రఘూణామ్ నాధ: , పాయాత్ = అట్టి రఘువంశ ప్రభువు కాపాడు గాక !!
తెలుగు సాహిత్యంలో కూడ ద్వ్యర్ధి , త్ర్యర్ధి కావ్యాలు రాఘవ పాండవీయం వంటివి ఉన్నవి. వీలున్నపుడు వాటిని గురించి ...
2 కామెంట్‌లు:
అత్యద్భుత శ్లోకంబిది.
నిత్యము పఠియింపఁ దగిన నిరుపమమిది. యౌ
న్నత్యముఁ గొల్పెడు నీకును.
స్తుత్యుడ! పద్యముగ మార్చి చూపుము, ఘనమౌన్.
ఎల్లలె లేని వానికి యదెట్టులఁ గల్గును రే బవళ్ళు? యా
తల్లిని పట్టి యాడుటకు తానొనరించెడి పిల్ల చేష్టలౌన్.
చల్లని తల్లిఁ గాంచి కడు చక్కఁగ చూచెడి చూపులొప్పఁగా
నెల్లరఁ జూచి కాచుత! సమీప్సిత సత్ఫల వృద్ధిఁ గొల్పుచున్.
మిత్రమా! చాలా బాగుందని ఆంధ్రామృతం బ్లాగులో ఈ శ్లోకానికనువాదమ్ చేసి పోష్ట్ చేసాను. దాని ప్రతి చూడు.
సాహితీ బంధువులారా!
శ్లో:-
య:పూతనా మారణ లబ్ధ వర్ణ:,
కా కోదరోయేన వినీత దర్ప:,
యస్సత్యభామా సహితస్సపాయా
న్నాధో యదునా మధనా రఘూణామ్!(రచన:- కోలాచలం పెద్దిభట్టు)
తే.గీ:-
లక్ష్య పూతనామారణ లబ్ధ కీర్తి,
ఉగ్ర కాకోదరో వినీతోద్ధతియును,
తుష్టి సత్యభామా సహితుండు నయిన
కృష్ణ రాముఁడు మిమ్ము రక్షించుఁ గాక!
రాముని పరముగా అన్వయార్థ దండాన్వయములు.:-
లక్ష్య = లక్ష్యముతోఁ గూడిన,
పూత=పవిత్రమైన
నామా=పేరు గలవాడును,
రణ = యుద్ధము చేయుటయందు,
లబ్ధ కీర్తి=లభించిన కీర్తి గలవాడును,
ఉగ్ర =భయంకరమైన
కాకోదరో(కాక+ఉదర:)=నిర్భయముగ ప్రవర్తించు కాకాసురుని యొక్క,
వినీతోద్ధతియును=గర్వాపహారియును,
తుష్టి =తృప్తి కరముగా,
సత్య=సత్య వర్తియు,
భా=ప్రకాశవంతమైనవాడును,
మా సహితుండు నయిన=లక్ష్మితో కూడిన వాడును అయిన,
కృష్ణ =నీలి వర్ణుడయిన,
రాముఁడు=శ్రీరాముడు,
మిమ్ము రక్షించుఁ గాక=మిమ్ములను కాపాడును గాక!
దండాన్వయము:-
లక్ష్యముతోఁ గూడిన పవిత్రమైన పేరు గలవాడును, యుద్ధముఁ జేయుట యందు లభించిన కీర్తి కలవాడును, నిర్భయముగ ప్రవర్తించు భయంకరుడగు కాకాసురుని యొక్క గర్వాపహారియును, తుష్టుగా సత్యప్రవర్తకుడును, కాంతివంతుడును,గృహ రాల్య లక్ష్మితో కూడుకొన్నవాడును, నీలి వర్ణుడయిన శ్రీరాముడు మిమ్ములను కాపాడు గాక!
కృష్ణుని పరముగా అన్వయార్థదండాన్వయములు:-
లక్ష్య =లక్ష్యమును కలిగి,
పూతనా=పూతన యను రాక్షసిని,
మారణ =చంపుట చేత,
లబ్ధ కీర్తి=లభించిన కీర్తి కలవాడును,
ఉగ్ర =భయంకరమైన,
కాకోదరో=కాళియుడను సర్పము యొక్క,
వినీతోద్ధతియును=అణచివేయఁబడిన గర్వము కలవాడును,
తుష్టి =తృప్తికరముగ,
సత్యభామా సహితుండు నయిన=సత్యభామా సహితుడును అయిన,
కృష్ణ = కృష్ణుడను పేరుతోగల,
రాముఁడు=రమ్య మూర్తి,
మిమ్ము రక్షించుఁ గాక= మిమ్ములను కాపాడును గాక.
దండాన్వయము:-
లక్ష్యమును కలిగి పూతన యను రాక్షసిని చంపుట చేత లభించిన కీర్తి గలవాడును, భయంకరమైన కాళీయుఁడను సర్పము యొక్క గర్వ మడంచిన వాడును, తృప్తికరముగ సత్యభామతో కూడి యున్నవాడును, రమ్యమూర్తి యగు కృష్ణుఁడు మిమ్ములను రక్షించుఁ గాక!
జైహింద్.
రాసింది చింతా రామకృష్ణారావు. AT WEDNESDAY, DECEMBER 30, 2009
కామెంట్‌ను పోస్ట్ చేయండి