4, జనవరి 2010, సోమవారం
ఆగండి, మీరూ కొంచెం ఆలోచించండి ...
మనం నిత్యం ఎదుర్కొనే ఒక యిబ్బంది గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా?
కిక్కిరిసిన సిటీ బస్ లో ప్రయాణం చేస్తున్నాం. ఒంటి కాలి మీద ఆపసోపాలు పడుతూ నిలబడి ఉన్నాం. బస్ ఎంతవరకూ వచ్చిందో తెలీదు. కండక్టరు అరచి చెప్పడు. చెప్పినా, ఆ గోలలో వినబడదు. అంతా కంగారు కంగారుగాఉంటుంది.బస్ లో బయటకి సందు చేసుకుని చూస్తాం. నగరం మీకు పాతదే అయినా, ఆ ఏరియా మీకు కొత్త. ఎంత వరకూ వచ్చారో తెలీదు. ఏబోర్డూ ఉండదు. ఎంతకని పక్క వాళ్ళని అడిగి విసిగిస్తాం చెప్పండి.
పరిష్కారం : రోడ్డు ప్రక్క ఉన్న ప్రతి బోర్డు మీదా వాళ్ళ షాపుల పేర్లూ గట్రా రాసుకోవడంతో పాటు ... ఆ షాపున్నఏరియా పేరు విధిగా రాయాలని కట్టడి చేయడం. ఆ ఏరియా పేరు లేని ఏ బోర్డునీ ఉంచడానికి నగర పాలక సంస్థఅంగీకరించక పోవడం. నిర్బంధంగా, బోర్డుల సైజులని బట్టి, అక్షరాల సైజులు ఉండేలా తెలుగు, ఇంగ్లీషు భాషలలోరాసేలా నిబంధనలు పెట్టడం.
బస్ షెల్టర్ల మీద కూడా ఏవో ప్రకటనలే తప్ప ఆ ఏరియా పేరు కనిపించక పోడం ఘోరం కదూ?
ట్రాఫిక్ ఐలెండ్ దగ్గరుండే పోలీస్ సిగ్నల్ ఉండే చోట బంక్ ల మీద కూడా ఆ ఏరియా పేరు కనిపించదు. గమనించేరా?
నగరంలో అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రమే ఏ రియా పేరు ఏ కొందరో తమ సైన్ బోర్డుల మీద రాసేరు.( ఆ పుణ్యాత్ములకి శత కోటి వందనాలు)
బస్ లో వెళ్ళే వారికే కాదు, నడిచి వెళ్ళే వారికీ, ఇతర వాహనాల మీద వెళ్ళే వరికీ కూడా ఈ యిబ్బంది ఎప్పుడూఎదురవుతూనే ఉంటుంది... ఓ సారి ఓ స్కూటరిస్ట్ నా పక్కకి వచ్చి బండి ఆపి. ‘ ఫలానా ఏరియా ఏదండీ’ అనడిగేడు. ‘అయ్యో, మీరు దాన్ని దాటి చాలా దూరం వచ్చేసారే ! మళ్ళీ వెనక్కి వెళ్ళండి .. ఆరు కిలో మీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడ అడగండి.‘ అని చెప్పాను ... బిక్క ముఖం వేసుకుని,యీసురోమంటూ బండిని వెనక్కి తిప్పడం కోసం ముందుకి మరో అర కిలోమీటరు వెళ్ళి ... అతను పడ్డ అవస్థ గురించి యిప్పుడెందుకు లెండి ... ... వాహన చోదకులకి , వాహనాల మీద పయనించే వారికీ, పాద చారులకి, యీ యిబ్బంది తొలిగి పోవాలంటే మార్గమే లేదా?
తెలిసిన వాళ్ళకి ఫరవా లేదు. కొత్త వారికి మాత్రం నరక యాతనే కదూ?
చదువుకునీ, చదువు రాని వాళ్ళలా కొత్త చోట్ల వెర్రి మొహాలు వేయ వలసి రావడం ఎంత దారుణమో ఆలోచించండి ...
మీకు తోచిన మరిన్ని మంచి పరిష్కారాలని సూచించండి ...
2 కామెంట్లు:
నిజమే బాబాయిగారు మీరు చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందే, ఆ మధ్య ఎవరో ఇంజినీరింగ్ అమ్మాయిలు బస్సులోనె, డిజిటల్ ఎక్విప్మెంట్ ఒకటి కనిపెట్టారని అది బస్సు ఏ ఏరియాలో ఉన్నదె కాకుండా బుస్టాప్ లో కూడా ఒక డిస్ప్లే ఏర్పాటు ఉండేల ఒక ప్రాజెక్టు కనిపెట్టినందుకు ఆ అమ్మాయిలని ఈనాడు వారు వసుంధర ద్వార ప్రత్యెకంగా ప్రశంశించారు కూడా. దాన్ని ఆచరణలో పెట్టడానికి పాపం మన ప్రభుత్వానికి అంత తీరిక ఎక్కడిదండి బాబాయి గారూ పదవుల కోసం, ప్రాంతాల మీద ఆదిపత్యం కోసం కొట్టుకుచావడానికే వారికి పొద్దు చాలట్ల ఏం చెద్దాం చెప్పండి.
నేను ఎదుర్కొంటున్న కష్టాన్ని మీరూ ఎదుర్కొటున్నారన్న మాట. మీ సూచన అవశ్యాచరణీయము.
ఐనా మన బ్లాగుల్ని చూసే వారెవరు? మన కష్టాల్ని చెవిలో జోరీగలాగ వినిపించుతున్నా పట్టించుకొనే ఆసక్తి ఎవరికి? ఐనా మంచి మాట మీ బ్లాగులో చూడగానే ఈ రకమైన కష్టాల్ని గుర్తించేవాళ్ళు కూడా లేకపోలదనే తృప్తికలిగింది.
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి