24, ఏప్రిల్ 2010, శనివారం

చిన్నారి పొన్నారి తండ్రీ ... ...


శిశువు గురించి శ్రీ జాషువా కవి చాలా మంచి పద్యాలు వ్రాసారు. చాలా మందికి ఇవి పరిచిత పూర్వాలే అయి ఉండ వచ్చును. తెలియని వారి కోసం యీ టపా ...

గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు

ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !

జాషువా పద్యాలకి వివరణ అక్కర లేదు. అయినా, కొద్దిపాటి వివరణ ...
పాట పాడితేనే కాని నిద్దుర పోడు. తల్లి కౌగిలి అనే పంజరంలో చిలుకలాగా ఒరిగి పోతాడు. ఆ లేత వయసులోనే కండలు తిరిగిన పిల్ల వస్తాదులా ముద్దొస్తాడు. ఎంత భాగ్యవంతుడో ! ఉయ్యేల దిగకుండానే అన్ని పనులూ జరిపించుకుంటాడు. ఉ ఊ అనే రెండక్షరాలు నేర్చిన వింత చదువరి. సతిని తాకని సాంబ శివుడిలా ఉంటాడు. కానుపు సముద్రాన్ని దాటి వచ్చిన పర దేశి. తన యింటికి కొత్త యజమాని. ఈ భూమి మీదకి ఏ రాచ కార్యం చేడానికి వచ్చేడో కదా ? కొంచెం నడక రానీ, అప్పుడు అడుగుదాం. ముందు ముందు వయసు వచ్చేక ఎలాగ ఉంటాడో తెలియదు కానీ, ఇప్పటికి మాత్రం ఈ చిన్నారి శిశువుకి ఏ పాపం తెలియదు !!

నవ మాసములు భోజనము నీర మెఱుఁగక
పయనించు పురుటింటి బాట సారి
చిక్కు చీకటి చిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసి నవ్వుల లోన
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృ క్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకున్న యతిథి

బట్టఁగట్టడు బిడియాన పట్టువడడు
ధారుణీ పాఠ శాలలో చేరినాడు
వారమాయెనొ లేదొ? మా ప్రకృతి కాంత
కఱపి యున్నది వీనికాకలియు నిద్ర


తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో అన్నం , నీరు లేకుండా గడిపి, ప్రయాణం చేసి వచ్చిన బాట సారి. చిమ్మ చీకటిగా ఉండు జేనెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణ స్వరూపుడు. నునుపైన చెక్కిళ్ళలో బోసి నవ్వులలో ముద్దులు కురిపించే మోహనాకారుడు. తరగని తల్లి పాలు అనే మధు ధారలను తన అన్నంగా తచ్చుకున్న అతిథి.బట్ట కట్టుకోడు. సిగ్గు పడడు. నేల తల్లి అనే బడిలో చేరి ఇంకా వారం అయిందో, లేదో, మా ప్రకృతి కాంత వీడికి ఆకలీ నిద్రా నేర్పించింది.


ఊయేల తొట్టి యే ఉపదేశ మిచ్చునో
కొసరి యొంటరిగ ఊ కొట్టు కొనును
అంబతో తన కెంత సంబంధ మున్నదో
యేడ్చి యూడిగము సేయించు కొనును.
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా కేకిసల్గొట్టు కొనును
మూన్నాళ్ళ లోన నెప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చు కొనును

ముక్కు పచ్చలారి పోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నప్పుడు
‘ నాదు పసిడి కొండ నా రత్న’ మని తల్లి
పలుకు పలుకు లితడు నిలుపు కొనునె ?

పడుకున్న ఊయ్యేల తొట్టి వాడికి ఏం ఉపదేశం చేస్తందో కానీ, ఒంటరిగా ఊ కొడుతూ ఉంటాడు. తల్లితో ఏ జన్మల సంబంధమో కాని ఏడ్చి సేవలు చేయించుకుంటూ ఉంటాడు. ఆ దేవ దేవుడు అతనితో ఏ సల్లాపాలు చేస్తాడో తెలియదు భలే భలే అన్నట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటాడు
ఈ మూడు రోజులలో ఎప్పుడు నేర్చుకున్నాడో వెర్రి తండ్రి ఛీ ఫో అని సరదాకి అంటే ముఖం చిన్న బుచ్చు కుంటాడు. ఆ బుగ్గల లేతదనం తగ్గి, చదువు సంధ్యలు నేర్చకున్నాక ‘ నా బంగారు కొండ , నా రతనాల కొండ ’ అని తల్లి ముద్దుగా అంటూ ఉండే మాటలు నిలుపుకుంటాడో లేదో , చూదాం !

తన చేతి గిలక పండునకు ముచ్చటలు సెప్పు
పలుక లేదని కోపంబు సేయు
పొరుగింటి యిల్లాలి సరస చీదర చెంది
పరులన్న భేద భావమునుఁజూపు
మకరందమునకు సమ్మతిఁజూపి నోరూరి
దరిఁజేరి రుచుల భేదములు తెలియు
ప్రతి శబ్దమీను నుగ్ర ధ్వానమాలించి
కంపించి తల్లిని కౌగిలించు

దాయలార్గురు నొకరు నిద్దరును తప్ప
చేరుకున్నారలీతని చిత్త వీధి
జగతి నీతని జాతక చక్రమందుఁ
బొంచి యుండునదప యశంబొ ? యశంబొ ?


తన చేతి గిలక పండుకి ముచ్చటలు చెబుతూ ఉంటాడు. అది తిరిగి పలక లేదని కోపం వచ్చి విసిరి కొడతాడు. పొరుగింటి ఆడవాళ్ళు చేర దీస్తే వెళ్ళడాని యిష్ట పడడు. తన పర భేద భావం వీడికి అప్పుడే తెలిసి పోయింది. తేనె అంటే ఇష్టం రుచుల భేదం గ్రహించేస్తున్నాడు. పెద్ద చప్పుడుని వింటే చాలు భయంతో తల్లిని గట్టిగా కరుచుకు పోతాడు. ఇతనికి అరిషడ్వర్గాలు అనే ఆరుగురు శత్రువులలో ( కామం, క్రోధం, లోభం, మోహం, మదం , మాత్సర్యం) ఒకరో ఇద్దరో తప్ప మిగతా వారు అప్పుడే వీడి మనసులో చేరుకున్నారు కదా ? వీడి జాతకంలో గొప్ప కీర్తిమంతుడవుతాడని ఉందో, బొత్తిగా అప్రతిష్ఠ పాలవుతాడని రాసి ఉందో కదా !!

ఎంత చక్కని పద్యాలో చూసారు కదూ ? !!

5 కామెంట్‌లు:

మందాకిని చెప్పారు...

చాలా చక్కని పద్యాలు! మరచిన వాటిని గుర్తు చేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు!

పంతుల జోగారావు చెప్పారు...

స్పందించినందుకు ధన్య వాదాలండీ. చిన్నప్పుడు ఆడుకున్న ఆట బొమ్మ పెద్దయ్యాక మళ్ళీ దొరికినట్టు, ఎప్నుడో చదివిన మంచి పద్యాలు మరో సారి గుర్తుకు తెచ్చుకుంటే , మీరన్నట్టు చాలా బాగుంటుంది. నిజమే.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

చిన్నప్పుడెప్పుడో. చదువుకున్న పద్యాలు. మళ్ళీ గుర్తు చేశారు. ధన్యవాదములు.

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

మిత్రమా!
ధన్యవాదములు.

సుమధురభావనాగరిమఁజూపుచు గుఱ్ఱముజాషువా యిటన్
సముచితమైన బాల్యగుణ సంపదలన్మదిఁ గాంచి సత్కవి
త్వమునను వెల్వరింప గని భవ్యముగా తమ బ్లాగుపాఠకుల్
సుమధురమై పఠించునటు చూచుచు వ్రాసితి వీవు మిత్రమా!

karlapalem Hanumantha Rao చెప్పారు...

చాలా మంచి పద్యాలు.ఓపికగా గుర్తు చేసినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి