మహా భారతంలో రాజ నీతి విషయాలు, ధర్మాలు, హిత వచనాలు చాల ఉన్నాయి. వాటిని వచనంలో ఇక్కడ పొందు పరుస్తున్నాను. చర్విత చర్వణంగా వాటిని మళ్ళీ రాయడమెందుకయ్యా, అంటే, తెలిసిన వారు లక్షల్లో ఉన్నా, తెలియని పదిమంది చదువరుల కోసం నాకు తెలిసినంతమట్టుకు రాస్తే తప్పు లేదనిపించింది. అదీ కాక, ఆయా పర్వాలలో ఉండే వాటిని అన్నింటినీ ఒక చోట క్రోడీకరించి వచనంలో రాయడం వల్ల యువతరం వారికి భారతేతి హాసం మీద మక్కు వ పెరగ వచ్చును కదా అనిపించింది. ఇక నుండి వరసగా ఈ టపా క్రింద వచనంలో రాదామనుకుంటున్నాను.
మహా భారతం సభా పర్వం ( నన్నయ రచన) మొదటి ఆశ్వాసంలో నారద ముని ధర్మ రాజుని కొన్ని రాజనీతి విషయాల గురించి తరచి తరచి అడుగుతాడు. సార్వకాలీన మయిన ఆ పలుకులివి:
( సభా పర్వం ప్రథమాశ్వాసం 26 -56)
ధర్మ రాజా ! మీ వంశంలో ఎంతో మంది రాజ శ్రేష్ఠులు చక్కని ధర్మ పద్ధతిని ఏర్పరచి ఉన్నారు. నీవు ఆ ధర్మ పద్ధతిని విడిచి పెట్టకుండా ఆచరిస్తున్నావు కదా? ధర్మాన్ని తెలుసుకోవాలి. ధర్మార్ధ కామాలు ఒక దానికొకటి బాధకాలు కాకూడదు.కాలోచితంగా వాటిని విభజించుకుని ధర్మ కామాలని ఆచరిస్తున్నావు కదా? ధర్మం మీదనే మనస్సును నిలిపి, చేయ దగిన పనులను గురించి రాత్రి నిద్రించడానికి ముందు స్వంత బుద్ధితో ఆలోచించుకుంటున్నావు కదూ? నీ కొలువులో రక రకాల ఉద్యోగులను నియమించి ఉంటావు. ఆ ఉద్యోగులలో స్థిర బుద్ధి కల వాళ్ళనీ, యోగ్యులైన వాళ్ళనీ, వారి వారి శక్తి సామర్ధ్యాలు గమనించి వారి గౌరవానికి భంగం లేకుండా, స్థిరంగా నియమించావు కదా?
పుణ్యాత్ములనీ, శాస్త్ర విషయాలు బాగా తెలిసిన వాళ్ళనీ, నీమీద ప్రేమ కల వారిని, మీ పూర్వీకుల నుండి మీ కొలువులో నమ్మకంగా పని చేస్తున్న బ్రాహ్మణోత్తములను రాచ కార్యాలు చేయడం కోసం నీకు మంత్రులుగా నియమించుకున్నావు కదా?
ఓ ధర్మ రాజా ! రాజు విజయానికి మూల మైనది మంత్రాంగం. అంటే రహస్యాలోచన. అట్టి మంత్రాంగాన్ని బయటకి వెల్లడి కాకుండా పదిలంగా కాపాడుతున్నావు కదూ ?
రాజా ! నీ పురోహితుడు ఎలాంటి వాడయ్యా? ధైర్యవంతుడేనా? ధర్మాధర్మాలు బాగా తెలిసిన వాడే కదా? వివిధ శాస్త్రాలు బాగా చదువుకున్న వాడేనా? రాగ ద్వేషాలు లేని వాడే కదా?
రాజా ! నీవు ఎన్నొ యఙ్ఞాలు చేస్తూ ఉంటావు. నీ యాజి నిపుణుడే కదా? ప్రయోగ నిపుణత్వం, కర్తవ్యపరాయణత్వం కల వాడే కదా?
ఈ మంత్రులున్నారు చూసావా, పలుకు బడి, సమర్ధతా కలిగి, నీ శత్రు వర్గం రాజ పుత్రులతో చేతులు కలిపి, వాళ్ళకి లంచాలిచ్చి, వారిని మహా ధనవంతులుగా చేసి, నీకు వ్యతిరేకులుగా చేసే అవకాశం కూడా ఉంది. అలా జరుగకుండా చూసుకోవాలి సుమా ! డబ్బు ఎలాంటి వారికయినా, దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది.
రాజా ! నీ ఆస్థాన జ్యోతిష పండితులు స్వీయ ప్రతిభతో దేవతా సంబంధాలు, అంతరిక్ష సంబంధాలు, భూ సంబంధాలు అయన ఉత్పాతాలను ముందుగానే కని పెట్టి, వాటికి విరుగుడుగా నీ చేత శాంతి క్రియలు జరిసిస్తున్నారు కదా?
ఇక, ఆయుర్వేద విద్యలో సమర్ధులైన నీ ఆస్థాన వైద్యులు లోకోపకార బుద్ధితో, ప్రజల మీద ప్రేమతో ఎనిమిది శాఖలుగా విస్తరించిన ఆ వైద్య విధానంతో సేవలు చేస్తున్నారు కదా?
పెద్దలను సేవిస్తూ మనోవ్యథలేవయినా ఉంటే తొలగించుకుంటున్నావు కదా? అలాగే నీ ఆరోగ్యాన్ని చక్కని ఔషధాలు సేవిస్తూ కాపాడుకుంటున్నావు కదూ ?
నీ కొలువులో రక రకాల పన్నులు వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నీతి మార్గంలో నడుచుకునే వారే కదా? రాగ ద్వేషాలు లేకుండా అందరి పట్ల సమ బుద్ధి కలవారే కదా? అలాంటి వారిని చక్కగా పరీక్షించి మరీ ఎన్నిక చేసి నీ కొలువులో నియమిస్తున్నావు కదూ ?
ఓ ధర్మ రాజా ! ఉత్తములు, మధ్యములు, అధములు ఉంటారు. ఆయా వ్యక్తుల ఉత్తమ, మధ్యమ, అధమ యోగ్యతలని గుర్తించి, వాళ్ళని ఎవరికి తగినట్టుగా అలా ఉత్తమ మధ్యమ, అధమ కార్య నిర్వహణకి నియమిస్తున్నావు కదా? ఎవరికి తగిన పని వారికి పురమాయించాలి. నీ సేవకులందరకీ తగిన జీతం దయతో సకాలంలో ఇస్తున్నావు కదా?
చేయించుకున్న సేవలకి తగినంత జీతం లేక పోయినా, అది కూడా సకాలానికి అందక పోయినా, సేవకులు దరిద్రంతో బాధలు పడతారు. అలా వారిని బాధించడం దేవేంద్రుడికి కూడా మంచిది కాదు సుమీ !
వంశ పారంపర్యంగా ఎందరో సేవకులు నీ వద్ద పని చేస్తూ ఉంటారు. వారిని ఉచిత రీతిని సన్మానిస్తున్నావు కదా? అలా చేస్తే వాళ్ళు నీ కోసం యుద్ధంలో ప్రాణాలయినా అర్పిస్తారు.
నీ కోసం యుద్ధాలలో పాల్గొని, ఎందరో వీరులు వీర మరణం పొంది ఉంటారు. మరి, ఆ వీర సైనికుల కుటుంబాలకు కూడుగుడ్డలకి లోటు లేకుండా యిచ్చి కాపాడుతున్నావా లేదా?
రాజా ! నీవు రాజకార్యం చేయడం కోసం ఎందరినో నియమిస్తూ ఉంటావు. ధనం పట్ల లోభత్వం కలవాళ్ళనీ, దొంగలనీ,స్నేహానికి తగని వాళ్ళనీ, శత్రుపక్షం వహించే వారినీ ధైర్యం లేని వాళ్ళనీ, దుర్మార్గులనీ అలాంటి పనుల కోసం నియమించడం లేదు కదా?
రాజా ! నీ రాజ్యంలో దొంగల భయం లేకుండా చూసుకుంటున్నావు కదూ? నీ ప్రభుత్వంలో ధనాశాపరులైన లంచ గొండులు ఎవరయినా, ఆ దొంగల నుండి డబ్బు దీసుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే అవకాశమూ ఉంది. గచనించు.
నీ రాజ్యంలో అనా వృష్టి భయం లేకుండా చెఱువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి కదా?
రాజా ! ఉదార బుద్ధితో రైతులకి ధాన్యపు విత్తనాలు ఇస్తున్నావు కదూ? అలాగే వర్తకులుంటారు. వారికి వ్యాపారం చేసికోడానికి డబ్బు కావాలి. ధర్మ వడ్డీకి, అంటే, నూటికి ఒక రూపాయ వడ్డీ వంతున అప్పులు ఇవ్వాలి. ఆపని నీవు చేస్తున్నావు కదా?
ఇక, రాజ్యంలో ఎందరో అనాథలూ, అంగ వికలురూ ఉంటారు. కుంటి, మూగ, గ్రుడ్డి, ఏ బంధువులూ లేని వారూ... యిలా ఎందరో ఉంటారు. వారిని దయతో పోషిస్తున్నావు కదూ ? యుద్ధంలో శరణు వేడిన వాడు నీ శత్రువయినా వాడిని కాపాడాలి. అలా చేస్తున్నావా?
చేసిన మేలు గుర్తించి, ఆ మేలు చేసిన వ్యక్తిని పెద్దలున్న నీ రాజ్య సభలో తగిన రీతిని సత్కరిస్తున్నావు కదూ? అలా చేసిన రాజే రాజ్యాన్ని చక్కగా పాలించ గలడు. నీకు వచ్చే ఆదాయంలో నాల్గవ భాగాన్ని, లేదా మూడవ భాగాన్ని, లేదా, సగ భాగాన్ని మాత్రమే నీవు ఖర్చు చేయాలి. అంతకు మంిచ చెయ్య కూడదు. నమ్మతగిన వారిని, ప్రభు భక్తి కలవారిని, సమర్ధులను నీ కొలువులో నియమించు కోవాలి. గురువులను, వృద్ధ శిల్పులను, గొప్ప వాణిజ్యవేత్తలను, బంధువులను, ఆశ్రితులను, మంచి వారిని వారికి పేదరికం రాకుండా నువ్వే కాపాడుతూ ఉండాలి.
రాజ్యం లోపల, వెలుపల ... అలాగే కోట లోపల వెలుపల అనేక శత్రువులుంటారు. వారినుండి నిన్ను నీవు సతతం కాపాడు కోవాలంటే నీకు గూఢచారులే శరణ్యం. రాజులు చార చక్షువులు. శత్రు రాజుల ప్రవర్తనలని గూఢచారులు అనే కళ్ళతో నిత్యం గమనిస్తూ ఉండాలి సుమా !
పండితులతో చర్చిస్తూ, రాగ ద్వేషాలు లేకుండా సమ బుద్ధితో లోక వ్యవహారాలు చూస్తున్నావు కదా?
ఓ ధర్మ రాజా ! ప్రపంచమంతా వార్త మీదనే ఆదార పడి నడుస్తోంది. అది లేక పోతే ప్రజలంతా చిమ్మ చీకటిలో మునిగి పోతారు. అందు వల్ల రాజు వార్తను బాగా నడపాలి. అంటే రాజు వార్తా నిర్వహణకి ప్రాధాన్యమివ్వాలి.
రాజా ! భార్యను పొందడానికి ఫలం సంభోగ సుఖం, పుత్రులు పుట్టడం. ధర్మాలు వినడానికి ఫలం సచ్ఛీలం.మంచి ప్రవర్తన సిద్ధించడం. సంపాదించిన దానికి ఫలం దానం చేయడం, అనుభవించడం వేదాలకు ఫలం అగ్ని హోత్రాలు. ఈ సంగతి తెలుసుకో.
రాజా ! కోటని దుర్భేద్యంగానూ ,చక్కగానూ రక్షించు కోవలసి ఉంటుంది సుమా ! నీ రక్షణలో ఉన్న కోటలన్నీ ధన ధాన్యాలతో, ధనుర్బాణాలతో, వివిధ ఆయుధాలతో ఎప్పుడూ నిండి ఉండాలి. అలాగే నీళ్ళకి లోటు రానియ్య కూడదు. పశువులకు గడ్డి నిల్వ చేసి ఉంచాలి. అలాగే ఉప్పు, పులుపు,కారం వంటి ఆహార పదార్ధాలు, వివిధ పానీయాలు, వంట కట్టెలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి సమా !
దైవ బలాన్ని పొంది, కామ క్రోధాదులయిన లోపలి శత్రువులని జయించి, ఇంద్రియాలని జయించి, బలపరాక్రమంతో దుష్టులయిన నీ శత్రువులని జయిస్తున్నావు కదా?
దండయాత్రకి బయలు దేరే ముందుగానే బలవంతులయిన నీ శత్రు రాజుల మీద సామ దాన భేద దండోపాయాలను చక్కగా ప్రయోగిస్తున్నావు కదూ?
రాజా ! ముఖ్యంగా 14 రకాలయిన రాజ దోషాలు ఉన్నాయి. నాస్తికత అసత్యం పలకడం, ఏమరుపాటుగా ఉండడం, సోమరితనం, తెలివి తక్కవ వారితో రాచ కార్యాలు కోసం ఆలోచన చేయడం, అతి కోపం, ఎక్కవగా దుఃఖించడం, చేయ వలసిన పని కోసం చాలా సేపు ఆలోచిస్తూ కాలయాపన చేయడం, ఆలస్యంగా చేయడం, బుద్ధిబంతులని గుర్తించక పోవడం, ప్రయోజనాలను దెబ్బతీసే పనులు చేయడం,చేదామనుకున్న మంచి పనులు చేయక పోవడం, రహస్యాలోచనలని బయటకి పొక్క కుండా కాపాడుకో లేక పోవడం, శుభ కార్యాలను చేయకుండా ఉండడం, నిత్యం ఇంద్రియ సుఖాలలో తేలియాడుతూ గడపడం ... ఇవీ రాజ దోషాలు. వీటిని విడిచి పెట్టావు కదా ?
ఇవీ నారదుడు చెప్పిన రాజ నీతి ధర్మాలు. ఎంత సమకాలీన సత్యాలో ఎంత సార్వజనీనమయిన విషయాలో గమనిస్తే మహా భారతం ఎందుకు భారతీయులకు అంత ప్రామాణిక గ్రంథమయిందో తెలుస్తుంది.
మరో సారి మరి కొన్ని ....
ఇప్పటికి స్వస్తి.
2 కామెంట్‌లు:
చాలా మంచి పని చేశారు జోగారావు గారూ!
చాలా చక్కని హితవచనాలు వెలుగులోనికి తెచ్చావు మిత్రమా!ఆయా భావాలను కలిగిన వ్యాస విరచిత భారత మూల శ్లోకాలను కూడా చేర్చి ఉంటే బంగారానికి పరిమళమబ్బినట్టుంటుందని నా భిప్రాయం.ధన్యవాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి