4, జూన్ 2010, శుక్రవారం

మంచి మాట

ఏ ప్రభుత్వమయినా సక్రమంగా నడుస్తూ, అభివృద్ధి పనులు చేయాలంటే ప్రజలు సక్రమంగా పన్నులు కడుతూ ఉండవలసినదే. ప్రజల నుండి పన్నులు వసూలు చేయ వలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ధనాగారాన్ని ఎలా నింపు కోవాలా అనే ఆలోచనతో మరీ క్రూరమయిన విధంగా పన్నులు వేయడం వసూలు చేయడం తగదు.

శ్రీమదాంధ్ర మహా భారతం శాంతి పర్వం ద్వితీయాశ్వాసంలో భీష్ముడు ధర్మ రాజుకి కోశాగారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో చక్కగా వివరించిన సందర్భం ఉంది. సార్వ జనీనమయిన ఆ ఉపన్యాస సారాంశం వచనంలో ...హిత వచనమ్ . కామ్ టపా గా అందిస్తున్నాను .....

భీష్ముడు ధర్మ రాజుతో యిలా చెప్పాడు...

ధర్మ రా జా ! ప్రజల నుండి పన్నులు వసూలు చేసేటప్పుడు రాజు చాల జాగ్రత్త వహించాలి

రాజా ! సావధానంగా విను. పన్నుల రూపంలో రాజునకు ధనం చేకూర్చే వాళ్ళలో రైతులు, వర్తకులు, గోపాలురు ముఖ్యులు.

ధనోత్పత్తికి వర్తక వాణిజ్యాలు ఆధారాలు. అలాగే, ధాన్యాభివృద్ధికి భూమి ఆధారం. అందు వల్ల ఇవి రాజు ఆధీనం లోనే ఉండాలి. వాటికి హాని కలుగ కుండా ఉండే రీతిలో రాజు జాగ్రత్తగా ధనాగారాన్ని అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నించాలి.

ఆకలితో ఉన్న పులి ఈనిన వెంటనే తన పిల్లలను తానే తినేస్తుంది. ఆ విధంగా క్రూరంగా రాజు ప్రజల నుండి పన్నుల వసూలు చేయడం మొదలెడితే పన్నులు సరిగా వసూలు కావు, సరి కదా, కోశాభివృద్ధి ఆగి పోతుంది. అందు వలన ప్రజలకు బాధ కలగనీయకుండా, కష్టం తెలియకుండా జలగ నెత్తురును ఎలా పీలుస్తుందో అలా, రాజు ప్రజల నుండి పన్నులు వసూలు చేయించ గలగాలి. అప్పుడే కోశాగారం కళకళలాడుతుంది.

ప్రజాభి వృద్ధికరమయిన పనులు రాజు చేస్తూ ఉండాలి. మూర్ఖపు పట్టుదలలకు పోకూడదు. చక్కటి ఉపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు సక్రమంగా పన్నులు కడతారు. కోశాగారం తప్పకుండా నిండుతుంది. రాజు ఏం చేయాలంటే, ఎవరిని దండించాలో వారిని తగిన సమయంలో దండించాలి. శిక్షార్హులకు సకాలంలో తగిన దండన విధించాలి. వారి సంపదను స్వాధీన పరుచు కోవాలి. అలా చేస్తే ప్రజలు సంతోషిస్తారు. బొక్కసమూ నిండుతుంది.

రాజుకి అసూయ తగదు. ధనవంతులయిన తన ప్రజల సిరిసంపదలను చూసి ఓర్చుకో లేక, బలవంతంగా, అన్యాయంగా వారి సంపదను స్వాధీన పరుచుకో కూడదు. అలా చేస్తే రాజుకి కీడు కలుగుతుంది. అందు వలన రాజు దయతో వ్యవహరించి అందరికీ ఆనందం కలిగించాలి.

ఉచితానుచితాలు తెలిసిన రాజు ఇహ పరాలలో సిద్ధిని పొందడం కోసం సామంత రాజులను ఆదరించాలి. వారితో స్నేహంగా మెలగాలి.కర్షకులను ఊరికే భయభ్రాంతులకు లోను చేయ కూడదు. అదను చూసి వారినుండి పన్నులు వసూలు చేయాలి. ధనాగారం నింపుకోవాలి.

రాజు బొక్కసం నింపుకోడానికి న్యాయమైన మార్గాలనే ఎంచుకోవాలి. అంతే కాని, పన్నులు రాబట్టకోవడం కోసం కపటోపాయాలు పన్నుతూ కుటిలుడై ఉండడం తగదు సుమా.

ఓ ధర్మ రాజా! జాగ్రత్తగా విను. అపాత్ర దానం చేసి, ధనాన్ని నాశనం చేసుకుంటే ఆ ధన సంపాదన వలన ప్రయోజనం లేదు. అయితే పాత్రులయిన వారికి దానం చేసి, సంపదలను వెచ్చిస్తే మాత్రం అది ఆ సంపదకు ప్రయోజనకారి అవుతుంది. అందు వల్ల పాత్రత ఎరిగి దానం చేయాలి.

ఓ ధర్మ రాజా ! ఈ విధంగా నీవు నడుచుకుంటే నీ భాండాగారం వృద్ధి చెందుతుంది. దానితో పాటు నీ మిత్రబృందం , రాష్ట్రం , సైన్యం అభ్యున్నతి పొందుతుంది. కనుక ఈ మార్గం లోనే నడుచుకో. ప్రజలను చక్కగా పరిపాలించు. ప్రజారక్షణ చెయ్యి. యుద్ధాలకు భయ పడ వద్దు. పరాక్రమంతో నీ శత్రువులను సంహరించు. యాగాలు చెయ్యి. దరిద్రులైన బ్రాహ్మణ కుటుంబాలను కాపాడు. మంచి వారిని రక్షించు.

ఉతథ్యుడనే మహర్షి మాంధాత మహా రాజునకు ఇదే విధమయిన హిత వచనాలు చెప్పాడు. అతను చెప్పిన హిత వచనాలేమంటే ...

ధర్మం వల్లనే ప్రాణి కోటి అభివృద్ధి చెందుతుంది. ధన లాభం కలుగుతుంది. రాజనే వాడు ధర్మాన్ని కాపాడడానికే జన్మిస్తాడు. కనుక అతనికి అహంకారం తగదు. కామాన్ని విడిచి పెట్టాలి. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ధర్మ మార్గంలో రాజ్య పాలన చేయాలి .....

ఇవీ భీష్ముడు ధర్మ రాజుకి చెప్పిన ఆదాయ మార్గాలు.

మరి కొన్ని .... తదుపరి హిత వచనమ్ . కామ్ లో.....

విన్నారా, ... ఆర్ధిక శాఖామాత్యుల వారూ ? !

స్వస్తి..