29, మే 2010, శనివారం

అంకెల మర్మం ....


ఒకటిఁగొని, రెంటి నిశ్చల యుక్తిఁజేర్చి,
మూఁటి నాల్గింటఁగడు వశ్యములుగఁజేసి,
యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు
విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు



ఈ పద్యం శ్రీమదాంధ్ర మహా భారతము ఉద్యోగ పర్వం లోనిది. తిక్కన రచన.

సంజయ రాయబారం ముగిసింది. ఆ విశేషాలింకా ధృతరాష్ట్ర మహా రాజ చెవిని పడ లేదు. రాజు వ్యాకుల చిత్తుడై ఉన్నాడు. ఆందోళనతో తనకి నిద్ర పట్టడం లేదని, తన మనస్తాపం ఉపశమించేలా నాలుగు మంచి మాటలు చెప్పమనీ విదురుని కోరాడు. ఆ సందర్భంగా విదురుడు కురు మహా రాజుకి బోధించిన హిత వచనాలలో ఇదొకటి ....

ఒక దానిని స్వీకరించి, రెండింటిని స్థిర పరచుకుని, మూడింటిని నాలుగింటి చేత వశపరచుకుని, ఐదింటిని జయించి, ఆరింటి గురించిన ఎఱుక గలిగి, యేడింటిని ఎవడు విడిచి పెడతాడో, అతడే వివేకధనుడని స్థూలంగా ఈ పద్యం చెబుతోంది ....

ఈ అంకెల మర్మం తెలుసుకుంటే నిగూఢమైన తాత్త్వికార్ధం సుబోధకమవుతుంది.

పెద్దలు ఈ పద్య భావాన్ని ఇలా విడమరిచి చెప్పారు. చూడండి ...

ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రం ( ఆలోచన), ఉత్సాహం అనే రెండింటినీ స్థిరంగా చేసుకుని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాల వారినీ సామ దాన భేద దండోపాయాల చేత ( ఈ నాలుగింటి చేత) పూర్తిగా వశం చేసుకుని, పంచేంద్రియాలనూ ( త్వక్కు, చక్షువు,శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము) జయించి, సంధి, విగ్రహము, యానము,ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము లను తెలుసుకుని, సప్త వ్యసనాలను ( స్త్రీ, జూదము, పానము, వేట, కఠినముగా మాటలాడుట, తగని వెచ్చము, కఠిన దండము ) విడిచి పెట్టి ఎవడయితే ప్రవర్తిస్తాడో, అతడు వివేకవంతుడు.

దీనికి మన పెద్దలు ఇంకా వేరే విధమైన వ్యాఖ్యానాలు కూడ చేసారు.

ఈ పద్యానికి ఇంకో విధమైన అర్ధం యిలా చెప్పారు ...
బుద్ధిని కలిగి ఉండి, వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో ఒకటిగా చేర్చి, ధర్మార్ధ కామాలనే మూడింటినీ, బ్రహ్మచర్య, గార్హ్యస్థ వానప్రస్థ, సన్యానములనే నాలుగింటితో వశపరచుకుని, వాక్, పాణి,పాదము,,వాయువు, గుహ్యము అనే కర్మేంద్రియాలను అయిదింటినీ గెలిచి, యజన,యాజన. అధ్యయన, ఆధ్యాపన, దాన, ప్రతిగ్రహములు అనే ఆరు స్మార్త కర్మలనీ తెలుసుకుని, పంచభూతాలూ, బుద్ధి, అహంకారం అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకవంతుడు.

కొన్ని పదముల వివరణలు :

మంత్రము = ఆలోచన
ఉత్సాహమ = ప్రయత్నము
సామము = అనుకూల వర్తనము
భేదము = ఉపాయము. ఇరువురి స్నేహము చెఱచుట
దండోపాయము = శిక్షించుట
త్వక్కు = చర్మము
చక్షువు = నేత్రము
శ్రోత్రము = చెవి
జిహ్వ = నాలుక
ఘ్రాణము = ముక్కు
తగని వెచ్చము = దండగమారి ఖర్చులు చేయడం
యజనము = భుజించు
యాజనము = భుజింప చేయుట


ఇంత చెప్పినా, అంధ రాజుకి కళ్ళు తెరుచుకో లేదు. అంధ రాజు కదా మరి ..



3 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

అద్భుతంగా ఉంది మిత్రమా నీ వివరణ. ధన్యవాదములు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

చాల అద్భుతంగా చెప్పారు.

ఒక చిన్న సందేహము.
౧. సంధి, విగ్రహము, యానము,ఆసనము, ద్వైదీభావము... మరి ఆరవది ఏమిటి?

౨. యజన,యాజన. అధ్యయన, దాన,ప్రతిగ్రహములు... ఆఖరుది ప్రతిగ్రహమా? లేక దన ప్రతిగ్రహమా?

౩. అలాగే అధ్యాపక కూడా ఉంటుంది అనుకుంటాను.

పంతుల జోగారావు చెప్పారు...

ధన్యవాదాలండీ. 1) ఆరవది సమాశ్రయము

2)ఆఖరుది ప్రతిగ్రహము. దానము , ప్రతిగ్రహము ...

3)మీరు పేర్కొన్నట్టు ఆధ్యయనముతో పాటు, ఆధ్యాపనము కూడ ఉంది.

మీకు మరో మారు నా ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి