27, జూన్ 2010, ఆదివారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 1.

పాండవులు అఙ్ఞాత వాస సమయం ఒక ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిశ్చయించుకున్నాక, రాజ పురోహితుడు ధౌమ్యుడు వారికి వివిధ సేవా ధర్మాలు బోధించాడు. వాటిని గత హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లో ఉంచడం జరిగింది.( ఇక్కడ చూడ వచ్చును)

ఇక పంచ పాండవులు, ద్రౌపది - విరటుని కొలువులో ఎలా కుదురు కున్నారో వరసగా చూదాం. ఆ మహా తేజశ్శాలురు ఎంత ఉదాత్త చరితులో వారు విరటుని కొలువు లో ప్రవేశించడంలోనే తెలుస్తుంది.

( తిక్కన సోమయాజి కృత ఆంధ్ర మహా భారతం విరాట పర్వం ఫ్రథమాశ్వాసం నుండి ...)

ధర్మ రాజు :

ధర్మ రాజు ముందుగా యముని ప్రార్ధించాడు. యముని అనుగ్రహం వలన ధర్మ రాజుకి సన్న్యాసి వేషం వచ్చింది. కాషాయం బట్టలు, కమండలం, వచ్చాయి. ధర్మజుడు అచ్చం సన్న్యాసిలా ఉన్నాడు. తమ్ముళ్ళనూ, ధర్మ పత్ని ద్రౌదిని తను వెళ్ళి విరటుని కొలువులో కుదురు కున్నాక, ఒక్కొక్కరినే రమ్మని చెప్పి, తను బయలు దేరాడు.

పాచికల మూట చంకలో పెట్టుకుని మరీ బయలు దేరాడు. దేవుడి దయ వల్ల ఆ రోజు విరాట రాజు అంత:పురంలో కాకుండా, నగరంలో ఆరుబయట కొలువు తీరి ఉన్నాడు.

విరటుడు దూరం నుండి వస్తున్న ధర్మ రాజుని చూసాడు. ఇలా అనుకున్నాడు : ‘ ఆహా! ఈ వచ్చే వ్యక్తి ఎవరో కానీ, ఎంత తేజస్విగా గోచరిస్తున్నాడు ? చూడడానికి మహా ఆశ్చర్యకరంగా ఉన్నాడు. లోకాలన్నింటినీ పాలించే తేజస్సు ఇతనిలో కనిపిస్తోంది. త్రిమూర్తులతో సమానమయిన రూప సౌందర్యం ఇతనిలో ఉంది. యతీంద్రుడిలా ఉన్నాడు, చూసారా?

ఒంటి మీద రత్నాభరణాలేవీ లేవు. అన్నీ తీసి వేసినట్టుగా కనిపిస్తోంది. ఇరు ప్రక్కలా రాజ లాంఛనాలయిన మదజలధారలకి ఎగబడే తుమ్మెదల ఝంకారాలతో మదపుటేనుగులు కూడా రావడం లేదు.మహా రాజు పుర వీధిని వస్తూ ఉంటే ప్రజలను తప్పు కోండి, తప్పుకోండి అని కేకలేస్తూ అదిలించే వేత్రహస్తలూ వెంట రావడం లేదు. ఎందుకో, మరి ! ముత్యాల కాంతులు వెద జల్లే వెల్ల గొడుగులూ ఎవరూ పట్టడం లేదు. ఇతను తప్పకుండా మహా రాజై ఉంటాడు. కాని, ఎందు చేతనో, యేమో, ఏ విధమయిన రాజ లాంఛనాలూ కనబడడం లేదు. ఇతను రాజు మాత్రమే కాదు, సామంత రాజులనేకుల చేత పాద సేవలందుకునే మహా చక్రవర్తి అయి ఉంటాడు.

మన దగ్గరకి ఎందుకు వస్తున్నాడు చెప్మా ? ఈ మహానుభావుడు నన్ను ఏమి ఆఙ్ఞాపించినా కాదనకుండా చేస్తాను.బంగారాన్ని అడగనీ నూతన వస్త్రాలను అడగనీ, మణిమాణిక్యాలను అడగనీ, ఏదడిగినా ఇతడు అడిగిన దానికంటె అధికంగా ఇస్తాను. ఈ మత్స్య రాజు విభవానికి తాను తగిన వానిగా ఈతడు భావిస్తే, గౌరవ పురస్సరంగా అతడిని గౌరవిస్తాను. నా మంత్రులతో, కుమారులతో, స్నేహితులతో, భటులతో, పుర జనులతో సహా ఇతడిని భక్తితో సేవిస్తాను.... అనుకుంటూ విరటుడు సింహాసనం దిగి, కంకు భట్టుకి ( అఙ్ఞాత వాస సమయంలో ధర్మరాజు పేరు) ఎదురు వెళ్ళాడు. నమస్కరించి, అతని దీవెనలు పొందాడు.మర్యాదలు చేసి, ఉచితాసనం మీద కూర్చో పెట్టాడు. వినయంగా అతనితో యిలా అన్నాడు:

‘‘ మహానుభావా ! మీ జన్మ స్థలం ఏది ? ఏ వంశం వారు? ఇదివరకు ఎక్కడ ఉండే వారు? తమ పేరేమిటి? ఇక్కడకి ఏ కారణం చేత వచ్చేరా శలవియ్యండి.’’

కంకుభట్టు:

‘‘ ఓ విరాట రాజా ! ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు లోకంలో ఎవరున్నారు చెప్పు? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతారు. ఎవరయినా, ఎటువంటి వారయినా అంతగా పట్టి పట్టి చూస్తారా ఏమిటి ?

ఈ శరీరంపంచభూతాత్మకం. ఇక ఈ మనసు ఉంది చూడు, దీనికి అసలే నిలకడ లేదు. మరి అలాంటి వీటిని ఆధారం చేసుకుని సత్య నిరూపణ చేయడం ఎవరికి వీలు పడుతుంది చెప్పు?

సరేలే, నేను ద్విజుడిని కురు దేశంలో పుట్టాను. ధర్మ రాజు స్నేహితుడిని. అయితే, ఇప్పుడు మాత్రం సన్న్యాసం స్వీకరించాను. రాజులకు తగిన విధంగా వినోదాలను సమకూరుస్తూ ఉంటాను. ( ఇక్కడ, ద్విజుడు అనే పదం బ్రాహ్మణుడు,క్షత్రియుడు అనే రెండు అర్ధాలనూ బోధిస్తుంది. ఉపనయన సంస్కారం బ్రాహ్మణులకీ , రాజులకీ కూడా ఉంటుంది కదా? అందు చేత ధర్మజుడు అసత్యం పలికినట్టు కాదు.)

రాజా ! నాకు కొంచెం జూదం వచ్చు. కాని , కిట్టని వాళ్ళు మోసంతో నా చేతిలోని డబ్బుని అంతా కపట జూదంలో కాజేసారు.అంతే కాదు అవమానించేరు కూడ. దానితో నాకు విరక్తి కలిగింది. నా స్వస్థలం విడిచి వచ్చేసాను.

రాజా! నాకు నీతి విద్య తెలుసు. ఆ నేర్పు నాకు ఉంది. పైగా, ధర్మ బుద్ధి కల వారితో సఖ్యంగా ఉంటాను. నా పేరు కంకుడు. నేను కంకుభట్టును. నేను నీచమయిన కొలువు చేయను సుమా ! అలాంటి కొలువులో ఉండడం నాకు యిష్టం ఉండదు. రాజులందరిలో నువ్వు సజ్జనుడవని విన్నాను. అందు చేత నీ కొలువులో చేరి, నిన్ను సేవించడానితకి వచ్చాను.

మరో విషయం. నాకొక వ్రతం ఉంది. వ్రత కాలం ఓ ఏడాది. ఆఏడాది వ్రతం నీ దగ్గరే పూర్తి చేసుకుంటాను.అలా చేయనిస్తే నీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటాను.ఈ ఏడాది వ్రత కాలం పూర్తయాక నాకు అపకారం చేసిన వారి జయించడానికి ఉత్సాహంగా వెళ్తాను.’’

విరటుడు:

‘‘ అలాగే చేయండి. ఉన్నతమయిన ఆసనాలు, వాహనాలు, బట్టలు ఇంకా ఇతర భోజనాది మర్యాదలూ నాకు ఎలా జరుగుతూ ఉంటాయో, నీకూ అలాగే జరిగేలా జరిపిస్తాను.నా సేవకులలో ఎవడయినా నీ పట్ల భయ భర్తులు లేకుండా ప్రవర్తించాడంటే ఆ నీచుడిని కఠినంగా శిక్షిస్తాను. వాడు ఎంత ప్రసిద్ధుడవనీ దండన తప్పదు.

అంతే కాదు, నువ్వు ఈ మత్స్య దేశాన్ని పాలించడం నాకు సమ్మతం. నువ్వు దేవంద్రుడితో సమానుడివి. నా తమ్ముళ్ళు, బంధువులు, మంత్రులు, నాబలగం, నేనూ నిన్ను అతి భక్తితో సేవించుకుంటాం. ఆ అవకాశాన్ని నీవు మాకు ఇప్పించ వలసిందిగా కోరుతున్నాను.’’

ఆ మాటలకు ధర్మ రాజు నవ్వి యిలా అన్నాడు:

‘‘రాజా !హోమార్హమయిన పవిత్ర పదార్ధాలనే నేను భోజనంగా స్వీకరిస్తాను. నేల మీదనే పడుకుంటాను. నేను వ్రతాచరణం చేసే వాడిని. నాకు నువ్వు చెబుతున్న మర్యాదలేవీ వద్దు.

విరటుడు:

సరే. అలాగే కానివ్వండి. మీ యిష్ట ప్రకారం ఏలా ఉండాలనుకుంటారో అలాగే ఉండండి. నచ్చినన్ని రోజులు ఉండండి. మీరెలా ప్రవర్తించినా నాకు యిష్టమే. మీ హోదాకి తగినట్టుగా సుఖంగా ఉండండి.

జూదం తెలిసిన వాళ్ళంటే నాకు చాలా యిష్టం అదీ కాక, మీరు పెద్దలు. మీ యిష్టమే నా యిష్టం. అదే నాకు ఆనందం.’’

ఇలా, ధర్మజుడు కంకుభట్టు పేరుతో విరాట రాజు కొలువులో ప్రవేశించాడు.


ఇక, పాండవులలో రెండవ వాడు భీముడు విరటుని కొలువులో ఎలా కుదురు కున్నాడో రేపటి హిత ‘వచనమ్’ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.



2 కామెంట్‌లు:

Anonymous చెప్పారు...

ఓ బ్లాగవతోత్తమా , ద్విజుడు అబద్ధం కాదని అడక్కుండా సర్ది పుచ్చారు.
మరి ..
అ) " నాపేరు కంకు భట్టు"
ఆ) " నేను ధర్మరాజు స్నేహితుడను"
ఇవి పచ్చి అబద్ధాలు కాదా? అసలు అబ్ద్ధాలు చెప్పకుండానే ఆ ఆరుగురు సంవత్సరం పాటు ఆశ్రయం పొందగలిగారా? భారతం అంతా బొంకు అంటే ఇది కాదా?

పంతుల జోగారావు చెప్పారు...

మీరు లేవనెత్తిన ప్రశ్నలు కొత్తవి కావు, ఇక్కడే కాదు, అశ్వద్థామ హత:కుంజర: అనే పట్టున కూడ ధర్మ రాజు అసత్యం పలికినట్టా కాదా అని చాలా వాదోపవాదాలు జరిగాయి. నేను వాటి జోలికి పోను. హితవచనమ్ డాట్ కామ్ లో మహా భారతం లోని మంచి మాటలను, ఘట్టాలను తెలిసిన వందమంది కోసం కాకుండా తెలియని ఒక్కరి కోసం రాయాలని సంకల్పించుకున్నాను. ఆ సంగతి మొదటి టపాలోనే చెప్పాను. అలాగే , వచనంలో రాస్తున్నాను కనుక ఎంత ప్రసిద్ధి పొందిన పద్యమయినా కోట్ చేయడం లేదు.
కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. మీ సంబోధన అంత వెటకారంగా ఉండనక్కర లేదనుకుంటాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి