(ఆంధ్ర మహా భారతం సభా పర్వం ప్రథమాశ్వాసం నుండి)
మయుడు నిర్మించి యిచ్చిన సభలో పాండవులు ప్రవేశించారు. ఆ సమయంలో నారద ముని వచ్చి ధర్మ రాజుతో కొన్ని రాజనీతి విషయాలు ముచ్చటిస్తాడు. వాటిని ఇంతకు ముందు హిత వచనమ్ డాట్ కామ్ టపాలో ఉంచాను. వాటిని ఇక్కడ చూడ వచ్చును.
ఇక ... మరి కొన్ని ....
జరాసంధుని వధకు బయలు దేరే ముందు భీమ సేనుడు, అర్జునుడు ధర్మ రాజుతో పలికిన పలుకులు :
లోకంలో ప్రయత్నమే చేయని వానికి ఎప్పుడూ సిరి సంపదలు లభించవు. పురుషుడు బలహీనుడయినా సరే, ప్రయత్నం చేసే స్వభావం కలిగి ఉండాలి. అలాంటి స్వభావం కలవాడు, అసలు ప్రయత్నమే చేయని వాడిని, వాడు ఎంతటి బలవంతుడయినా జయించ గలడు.
పరాక్రమవంతుని రూప గుణ సంపదలు లోక ప్రసిద్ధాలై రాణిస్తాయి. పరాక్రమం లేని వాడికి అవన్నీ ఉన్నా ( రూప, గుణ, సంపదలు) అవి లేనట్లే కాంతి హీనాలవుతాయి.
ఓ ధర్మ రాజా ! శాస్త్రంలో చెప్ప బడిన విధంగా ధర్మ పద్ధతిలో పరాక్రమాన్ని ప్రదర్శించాలి. బద్ధి బలం, పురుష ప్రయత్నం చేసే పురుషులకు ఇది తప్పక చేయ వలసిన కర్తవ్యం సుమా !
( ద్వితీయాశ్వాసం నుండి ...)
ధర్మజుడు ఒనర్చిన రాజ సూయ యాగాన్ని చూసి. ఆనందించి , భీష్ముడు అగ్రపూజ ఎవరికి చేయడం సముచితమో ధర్మ రాజుకి వివరిస్తూ ....
ఓ ధర్మ రాజా ! స్నాతకుడు, , ఋత్వికుడు , సద్గురుడు , ఇష్టుడు , భూపాలుడు, ఙ్ఞాన సంపన్నుడు - వీరందరూ పూజార్హులు. వీరిలో సద్గుణాల చేత ఎవడు అధికుడో అలాంటి వాడిని ఒక్కని పూజించు. వానికి అగ్రపూజ చేయి.
శిశుపాలుడు శ్రీ కృష్ణునకు ధర్మజుడు అర్ఘ్యప్రదానం చేయడాన్ని నిరసిస్తూ పలు చెనటి మాటలు పలుకుతాడు. అప్పుడతనితో ధర్మజుడు అననయ పురస్సరంగా పలికిన మాటలు :
గొప్ప గుణాల చేత శ్రేష్ఠులని చెప్ప దగిన వాళ్ళకు, పండితులకు , ప్రభువులకు ఈ విధంగా కఠినంగా మాటలాడడం తగదు. పలుకు కాఠిన్యం విషం కంటె , అగ్ని కంటె కూడ అతి భయంకరమయినది సుమా !
ఓ శిశుపాలా, పరమార్ధ తత్వాన్ని భీష్ముడు అవగతం చేసి కొన్నట్టుగా నీకు అర్ధం కాదు. ఎక్కడయినా మహాత్ముల చరిత్రలు అల్పులు తెలుసుకో గలరా ?
భీష్ముడు:
ఈ శిశుపాలుడు మితి మీరిన చెడు నడత కలవాడు. అపరిపక్వ బుద్ధి కలవాడు. అసూయ, క్రోధావేశాలు ఇతనిలో మితి మీరాయి. తనకి గల కొద్ది రాజ్య సంపద చేతనే వివక్ష కోల్పోయి, అహంకరిస్తున్నాడు. మహాత్ములను నిందించే స్వభావం కలవాడు. ఇలాంటి వాడికి ధర్మ తత్వం తెలుసు కోవడం సాధ్య పడదు.
భీష్ముడు శిశుపాలునితో:
ఉత్తమ ఙ్ఞాన సంపద చేత ఎవడయితే గొప్ప వాడో, అట్టి వాడు వయస్సు చేత బాలుడయినా, బ్రాహ్మణుడు పూజింప దగిన వాడే. అపరిమితమయిన పరాక్రమంతో రాజుల్లో అధికుడయితే క్షత్రియుడు కూడ పూజార్హుడే.
వయోవృద్ధులయిన వాళ్ళు ఒక లక్ష మంది ఉండ వచ్చును. కాని, ఎవరినయినా వారి ఙ్ఞానాన్ని బట్టి మాత్రమే పూజిస్తాం.
శిశుపాలుడు భీష్ముని తూలనాడుతూ ....
ఈ భీష్ముడొక వెర్రి ముసలి వాడు. గుణహీనుడయి శ్రీకృష్ణుని అకారణంగా పొగుడుతన్నాడు.ధర్మ తత్వాలు పాండవులకే తెలుసునట ! ఇతని మాట విని కృష్ణుడికి ధర్మ రాజు అర్ఘ్యం ఇచ్చాడు.తన అర్హత ఎలాంటిదో తెలుసుకోకుండా కృష్ణుడు దానిని స్వీకరించాడు. బాగుంది. ఓడతో కట్టిన ఓడలాగా తన గౌరవాన్ని కోలుపోయి మాట తూలుతున్నాడు. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడా లేరు. ఇక్కడ రాజులు చేత కాని వాళ్ళా ఏమిటి ?
కృష్ణుడి గొప్పదనం ఏపాటిదో తెలిసిందే కదా ? పూతన అనే ఒక ఆడుదాన్ని చంపాడు. ప్రాణం లేని బండిని (శకటాసురుడుని) కాలితో తన్ని సంహరించాడు. సారం లేని ( మద్ది) చెట్లను విరిచాడు. పుట్టంత చిన్న కొండను ( గోవర్ధన పర్వతాన్ని) పెద్ద బలవంతుడిలా ఏడు రోజులపాటు ఎత్తాడు. ఎద్దుని (వృషభాసురుడి ని) చంపాడు. ఇవా ఇతని పరాక్రమాలు ? హవ్వ ! వీనిని పొగుడుతున్న నీ నాలుక వంద చీలికలు కావాలి.అప్పుడింకా బాగా పొగడ గలవు. ..
స్త్రీలను, గోబ్రాహ్మణులను, అన్నం పెట్టే వారిని, నమ్మిన వారిని చంపడం మహా పాతకమని చెబుతారు. ఈ పాపాలన్నీ గోవిందుడు చేసాడు కదా ? అలాంటి వీనికి అర్ఘ్యం యిప్పించడం తప్పు కాదూ? అంతే కాదు, వేరొకరిని ప్రేమించిన కన్యను ( అంబని) బలిమిని తన తమ్ముడికి కట్టబెట్టడానికి తెచ్చాడు. . మరో సంగతి. నువ్వు అనపత్యుడివి. నీకు పిల్లలు లేరనే దోషం ఉంది. అలాంటి నువ్వు చెప్పేధర్మాలు ప్రజలు ఎలా పాటిస్తారు ?
ఓ గాంగేయా ! ఇతరులను పొగడడం, నిందించడం, తనను తాను పొగుడు కోవడం, నిందించు కోవడం ఇవన్నీ చెయ్య కూడని పనులని పెద్దలు చెప్పారు.
( గమనిక: శిశుపాలుడు పలికిన వన్నీ కఠినోక్తులు. వీటిని హిత వచనమ్ డాట్ కామ్ లో ఎందుకు చేర్చావయ్యా అంటే ....శిశుపాలుడు తాను ఆచరించినా, ఆచరించక పోయినా పెద్దలు చెప్పిన హిత వచనాలను కొన్నింటిని తన వదరుబోతు తనంతో అయినా వల్లించాడు కదా? అదీ కాక, అహితం తెలిస్తే హితం గొప్పతనం మరింతగా ప్రకాశిస్తుంది మరి !)
ఇక, కపటజూదానికి రంగం సిద్ధమయింది. ఆ సందర్భంగా ధర్మజుడు దుర్యోధనునితో పలికినది:
మోసం , జూదం - ఇవి రెండూ కూడా క్షత్రియ ధర్మానికి తగినవి కావు. ధర్మాన్ని ఆచరించే వారు ఈ రెండింటినీ వదిలెయ్యాలి. అంతే కాక, మోసపు మార్గాలు అనుసరిస్తూ జూదం ఆడే నీచపు జూదగాళ్ళతో జూదమాడ కూడదు. దాని వలన లోకంలో ఎటువంటి వారయినా ధనం, ధర్మం కోల్పోతారు. అంతే కాదు, కపటపు జూదంలో గెలవడం మహా పాపమని, ధర్మంగా ఆడిన జూదంలో గెలవడం ధర్మ యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అసితుడయిన దేవలుడు కూడ చెప్పాడు.
అప్పుడు శకుని ధర్మ రాజుతో పలికినది:
ఇదేం మాట ! బలహీనులను బలవంతులు ఎన్ని మోసాలతోనయినా ఓడించడం లోక సహజమే కదా? లోకంలో ఏ విధంగానయినా జయాన్ని సాధించాలి.
కపట జూదం ఆపించే ప్రయత్నంలో విదురుడు దుర్యోధనునితో:
చెడిపోయేలా ఎవరయితే చెడ్డ బుద్ధులు చెబుతారో, వారే నీకు స్నేహితులు. నీలాంటి వాడికి మాలాంటి వారు చెప్పే హితవచనాలు చెవికెక్కవు,
అంతేలే. లోకంలో వినడానికి ఇంపుగా ఉండే మాటలు పలికే వాళ్ళనే ఎక్కువగా మెచ్చుకుంటారు. మేలు చేసేదయినా వినడానికి ఇంపుగా లేక పోతే ఎవరూ వినడానికి యిష్టపడరు అందు చేత ప్రతిభావంతులు కూడ కటువైన మాటలు చెప్పడానికి వెనుదీస్తారు.
( ఇది హితం మనోహారిచ వచం దుర్లభ: ... అనేసూక్తి వంటిది.)
అయితేనేం? మొదట వినడానికి ఇంపుగా ఉండక పోయినా, చివరకి మేలు చేసే మాటను ఇష్టులైన వారు ఏ మాత్రం మొగమాటం లేకుండా బలవంతంగానయినా చెప్పాలి. అది ధర్మం. అలాంటి వాడే రాజుకి తగిన సహాయకారి అవుతాడు.
ధర్మజుడు జూదంలో ద్రౌపదిని ఓడాడు. ఆమెను తీసుకు రమ్మని ముందుగా దుర్యోధనుడు విదురుడిని కోరుతాడు ఈ దుర్విదగ్ధత సహించ లేక విదురుడు దుర్యోధనుడితో :
మూర్ఖుడా ! పొగరెక్కి మలినమైన మనస్సు కలవాడు , ఆయువుపట్టును నొప్పించే క్రూరుడు , ... యిలాంటి వారి సంపదలు నశించి పోతాయి.
ఇక, ద్రౌపది సభ వారిని తాను ధర్మ విజితనా , అధర్మ విజితనా అని అడిగిన దానికి పెద్దలు సమాధానం చెప్పి తీరాలని వికర్ణుడు అంటాడు.
అతని మాటలను సమర్ధిస్తూ విదురుడు పలికినది:
సభకు వచ్చి ఎవరయినా ధర్మ సందేహం అడిగితే సభ్యులలో ఎవరయినా తెలిసిన వారు దాని గురించి చెప్పాలి. అలా తెలిసీ చెప్పక పోతే, అసత్యం ఆడడం వల్ల కలిగిన ఫలితంలో సగాన్ని పొందుతారు.
ధర్మాన్ని తెలిసి కూడ, లాభాపేక్షతోనో , లోభం చేతనో , ఊగిసిలాడే బుద్ధి చేతనో ఎవరయినా దానిని మరొక విధంగా పలికితే అతను అసత్యమాడే దోష ఫలితాన్ని అనుభవిస్తాడు.
ధర్మం అధర్మం చేత బాధించబడి సభకు వస్తే సభ్యులు దానిని తీర్చాలి. లేక పోతే వారు అధర్మం చేత బాధించబడుతారు. సభ్యులు కామక్రోధాదులు విడిచి అధర్మాన్ని ఆపాలి. అలా చేయని నాడు ఆ అధర్మంలో నాల్గవ భాగం ఆ సభ్యులకు , మరొక నాల్గవ భాగం రాజునకు, మిగిలింది కర్తకు సంక్రమిస్తుంది. అందు చేత అడిగినప్పుడు తెలిసిన సభ్యులు తప్పక ధర్మం చెప్పాలి.
ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలు యిచ్చాడు. ద్రౌపది ముందుగా ధర్మరాజుకు దాస్య విముక్తిని వరంగా కోరుకుంది. రెండవ వరంగా ధర్మజుని నలుగురు తమ్ములకు దాస్యం నుండి విముక్తి కోరింది. రాజు యిక మూడవ వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ద్రౌపది యిలా అంది :
రాజా ! వైశ్య స్త్రీ ఒక వరం, ఉత్తమ క్షత్రియ స్త్రీ రెండు వరాలు , శూద్ర స్త్రీ మూడు వరాలు , బ్రాహ్మణ స్త్రీ వంద వరాలు కోరుకో వచ్చును. అందు వలన నేను రెండు వరాలు తప్పితే మూడోది కోరుకో కూడదు.
రాజు సంతోషించి: అమ్మా, నీవు ధర్మఙ్ఞవు. నీకు నేను బోధించ వలసిన నీతులు వేరే ఏమీ లేవు.
మనసులో వైరాన్ని తలచక పోవడం, ఓర్పు కలిగి ఉండడం, గుణాలు స్వీకరించి, దోషాలను విడిచి పెట్టడం ఇవి గొప్ప వ్యక్తి లక్షణాలు. ఇవన్నీ నీకు ఉన్నాయి. తల్లీ వర్ధిల్లు..
ఇవీ ఈనాటి హితవచనాలు ....
మరి కొన్ని ... తదుపరి హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లో చూదాం ...
ఇప్పటికి స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి