29, జూన్ 2010, మంగళవారం

మా టామీ కథ

మొన్నీ మధ్య మా యింట్లో ఒక శుభకార్యం జరిగితే, దానికి విజయ నగరం నుండి మా చిన్నమ్మాయీ, అల్లుడు, పిల్లలు ( మనవడు, మనవరాలు) తో వచ్చేరు. అప్పుడు మా చిన్నమ్మాయి మన టామీ ఫొటో ఒకటి ఉండాలి కదా ఒక సారి చూపించరూ? అని అడిగింది. ఉంది. కాని , ఎక్కడో మా దగ్గర ఉన్న చాలా ఫొటోలలో కలిసి పోయి కనబడ లేదు. సరే, యీ సారి దొరికేక, దానిని మీ బ్లాగులో పెట్టండి. అని మా అమ్మాయి మరీ మరీ చెప్పింది. నిన్న అనుకోకుండా సుధా రాణి గారి ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులో ఆవిడకి దైవమిచ్చిన కుక్క స్నోవీ గురించి రాసిన కథనం చూసాక ( దాని కోసం ఇక్కడ నొక్కండి) అరే ! మా టామీ గురించి నేను కూడా ఎందుకు రాయ కూడదు? అనిపించింది. ఆ కుతూహల ఫలితమే
ఈ కథనం .....

మేము విజయ నగరం జిల్లా సాలూరులో ఉండేటప్పుడు నాగావళి ఏటవతల ఓ చక్కని ఇంట్లో అద్దెకి ఉండే వాళ్ళం. ఆ ఇల్లు మా డాక్టరు మిత్రులదే. నాగావళి ఏటికి అటు వేపు ఉండే శ్రీనివాప నగర్ కాలనీ అది. పట్టుమని పది యిళ్ళు ఉండేవి. అన్నీ కొత్తగా కట్టిన ఇళ్ళే. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాద కరంగా ఉండేది. మా ఇంటి ముందు పెద్ద ఆట స్థలం ఉండేది. ఆ చివర డిగ్రీ కాలేజీ ఉండేది. అది కూడా కొత్తగా వచ్చినదే. అందు వల్ల పెద్ద పెద్ద భవనాలేమీ లేవు.

మా కాలనీలో టామీ అని ఓ కుక్క తిరుగుతూ ఉండేది. ఎవరు పెంచే వారో తెలియదు. కాలనీ అంతా నాదే నన్నట్టుగా తెగ తిరిగేది. దానికి టామీ అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. మా ఆవిడా, పిల్లలూ దానిని చాలా యిష్టంగా చూసే వారు. దానికి రోజూ మూడు పూటలా తినడానికి ఏదేనా పెడుతూ ఉండే వారు. మా అమ్మాయిలిద్దరూ అప్పటికి చాలా చిన్న వయసు వాళ్ళు. టామీతో ముచ్చటగా ఆడుకుంటూ ఉండే వారు.

ఇదంతా 1988 నాటి సంగతి.

తర్వాత, నాగావళికి 1990 లో ఎప్పుడూ రానంత వరదలు వచ్చేయి. వర్షం కుండ పోతగా కురిసింది. మన్నూ మిన్నూ ఏకమయింది. నాగావళి మీద సాలూరు ఊర్లోకి వెళ్ళడానికి ఉండే బ్రిడ్జి కూలిపోయింది. ఊర్లోకీ, మా కాలనీ వారికీ రాక పోకలు బంద్ అయ్యాయి. కాలనీ అవతల 8 కిలో మీటర్ల దూరంలో రామభద్రపురం ఉంది. అక్కడి నుండి విజయ నగరం, విశాఖ పట్నం , ఇటు - బొబ్బిలి, పార్వతీపురం - అది దాటేక ఒరిస్సా - వీటిని కలిపే హైవే ఉంది.

బ్రిడ్జి కూలిపోవడంతో మా కాలనీ ఒకటి ఒంటరి అంకెలా మారి పోయింది.

ఇహ లాభం లేదని వరద నీరు తీసాక పదిహేను రోజులకి సాలూరు ఊర్లోకి ఇల్లు మార్చేసాం.

మా పిల్లలు దాదాపు ఓనెల రోజుల వరకూ టామీని గుర్తు చేసుకుంటూ బెంగ పడే వారు. తర్వాత క్రమేపీ టామీ గురించిన ఆలోచనలు మా ఇంట్లో మరుగున పడి పోయాయి.

చెప్పొచ్చేదేమిటంటే ....

నాగావళి అవతలి వేపున్న కాలనీ లోని ఇల్లు మారేక మేం చాలా సంవత్సరాల పాటు అక్కడికి మరి వెళ్ళ లేదు. ప్రత్యేకంగా ఏకారణమూ లేక పోయినా, వీలు పడ లేదంతే. మా అందరి మనస్సులలోను టామీ గురించిన ఆలోచనే తుడిచిపెట్టుకు పోయింది. టామీ మా ఎవరికీ గుర్తే లేదు.

1998 లో అంటే, దాదాపు పదేళ్ళ తర్వాత, మా పెద్దమ్మాయి పెళ్ళి కుదిరితే, కాలనీలో మా పరిచయస్థులను పెళ్ళికి పిలవడానికి నేనూ, మా ఆవిడా నడుచుకుంటూ బయలు దేరాము.

ఇప్పుడంతా మారి పోయింది. పడి పోయిన బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన కట్టేరు. రాక పోకలు బాగా జరుగుతున్నాయి. పెద్ద దూరం కాక పోవడంతో, సాయంత్రం పూట చల్లగా ఉందని చెప్పి, కబర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాము.

అక్కడికి మేం అప్పట్లో ఉండే కాలనీ ఇంకా దాదాపు కిలోమీటరు ఉంటుంది. హఠాత్తుగా ఓ కుక్క వచ్చి మా మీద పడింది ! మేం తుళ్ళి పడ్డాం. అది సంతోషం పట్ట లేనట్టుగా బిగ్గరగా అరుస్తూ, నాలుక పెట్టి మా ఒళ్ళంతా నాకేస్తూ, అబ్బ ! దాని హడావిడి అంతా యింతా కాదు ... ఒక్క సారిగా ఎక్కడి నుండో ( దూరాన ఉన్న కాలనీ నుండి ) వచ్చి అది మా మీద పడడంతో మా కంగారు, భయం చెప్పనలవి కాదు. ముచ్చెమటలు పోసాయి. మా గుండెలు అదిరిపోయేయి.

తీరా చూస్తే అది మా టామీ !!

అది మమ్మలనేమీ చేయడం లేదనీ, చాలా ఏళ్ళకి మేం కనిపించినందుకు ఆనందంతో ఉక్కిబిక్కిరవుతోందనీ, దాని సంతోషాన్ని, ప్రేమనీ అలా మా మీద కలియబడుతూ చాటుతోందనీ మరి కొద్ది సేపటకి కానీ మాకు అర్ధం కాలేదు.
అర్ధమయేక మాకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. నిజం.

మా టామీ జాతి కుక్క కాక పోవచ్చును. ఒట్టి ఊర కుక్క కావచ్చును. కాని అది మా జాతైన కుక్క అనడంలో మాకు సందేహం లేదు.

ఇదీ మా టామీ కథ.

( అన్నట్టు, మా నాగావళి వరదల వల్ల వంతెన కూలిపోయిన నేపథ్యంతో ఆంధ్ర ప్రభ లో వరద అనే కథ
ఒకటి అప్పట్లో రాసేను. వీలు చూసుకుని ఆ కథని మీతో బ్లాగులో పంచుకుంటాను)

మా టామీ ఇప్పుడేమయిందో తెలీదు. నాగావళి ఒడ్డున ఇసుక తిన్నెల మీద నా కోసం, మా ఆవిడ కోసం, మా పిల్లల కోసం అటూ, యిటూ తిరుగుతోందో, యేమో ....











4 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

bagundi :-)

sudharani65 చెప్పారు...

మీ టామీ గురించి రాసిన పోస్టు చూశాను. అంత కాలమయిన తర్వాత కూడా టామీ మీపైన చూపిన ప్రేమకి కళ్ళు చెమర్చాయి. ఎప్పుడో అన్నం పెట్టిన వాళ్ళని అంతగా గుర్తుంచుకొని చుట్టూ తిరిగిందంటే శునకజాతిది ఎంత విశ్వాసం గల జాతో నిరూపించుకుందన్నమాట. పెంచిన వ్యక్తి కనిపించకపోతే అన్నం నీళ్ళు ముట్టవట. ఎన్ని పాట్లు పడినా అది ఎంత అల్లరి చేసినా స్నోవీని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అనిపిస్తోంది నాకు-అది నామీద పెంచుకున్న ప్రేమ కోసమయినా.

కొత్త పాళీ చెప్పారు...

టచింగ్ స్టోరీ.

పంతుల జోగారావు చెప్పారు...

రాధిక గారు, సుధా రాణి గారు, కొత్త పాళి గారు - మీకు నా ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి