12, అక్టోబర్ 2010, మంగళవారం

అరుదైన ఆనవాళ్ళు ...

మాసి పోయిన సామ్రాజ్యాలకు చిరిగి పోయిన జెండా చిహ్నం.
అంతరించిన నాగరికతలకు శిధిల కట్టడాలే సాక్షీభూతాలు.

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళానికి దాదాపు 20 కి.మీ. దూరంలో గార మండలం గార గ్రామానికి
దగ్గరలోశాలిహుండం అనే ఒక బౌద్ధ సంఘారామం శిధిల కట్టడాలు కనువిందు చేస్తూ ఉన్నాయి.వంశధార నది ప్రక్కనే దాదాపు 2000 సం.ల నాటి ఈ ఇటుకలతో నిర్మించిన కట్టడాలు దాదాపు శిధాలావస్థకు చెంది పోయాయి.బౌద్ధుల ప్రార్ధనలకు, విద్యాభ్యాసానికీ వినియోగించిన ఈ మహా చైత్యం వర్తులాకారంలో నిర్మించబడి ఉంది. చుట్టూ బౌద్ధ సన్యాసులు నివసించడానికి ఉపయోగించిన వర్తులాకారపు విహారాలు ఉన్నాయి. ఈ సంఘారామం మొత్తం నిర్మాణమంతా ధాతుగర్భ నిర్మితమని చెబుతారు. అంటే, బుద్ధుని శారీరక అవశేషాల మీద నిర్మించబడిన కట్టడం అని అర్ధం. బౌద్ధంలో ఈ చైత్యం హీనయాన మత శాఖకు చెందినదని పరిశోధకుల అంచనా. ఇక్కడ లభించిన విగ్రహాలు మున్నగు అవశేషాలతో ఇక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది.ఒక చిన్న గుట్ట మీద ఈ స్తూపం వుంది.
ఈ ప్రక్కగా ప్రవహించే వంశధార నది, చుట్టూ పచ్చని పంట పొలాలు, దూరంగా సముద్రంలో కలుస్తున్న వంశధార నది, చూపరులకి ఆహ్లాదం కలిగిస్తాయి.

శాలి హుండం అంటే ధాన్యపు గాదె అని అర్ధం.

సచ్చని అందమయిన ప్రకృతి ఒడిలో శాలిహుండం పురా వైభవాలను నెమరు వేసుకుంటూ సేద తీరుతున్నట్టుగా ఉంటుంది.

అంతే కాదు, ఆ అందాలు చూస్తూ ఉంటే, మనం కూడా ఒక అలౌకికానందానుభూతికి లోనై పరవశించి పోక తప్పదు.

శాలిహుండం గురించి డా. ముద్దు వెంకట రమణా రావు తమ ఉదయ కిరణాలు పుస్తకంలో వ్రాసిన చిన్న వ్యాసంలో మరి కొన్ని వివరాలు లభిస్తాయి. చూడండి.

ఇక ఆ అందాల లోకంలో విహారం చేయండి మరి ....

























1 కామెంట్‌:

కొత్త పాళీ చెప్పారు...

చాలా బాగుంది. విశాఖ దగ్గర తొట్లకొండ మీద కూడా ఇలాంటి శిథిల విహారాన్ని చూశాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి