ఒకటి నుండి వంద వరకూ ఉన్న అంకెలలో వందదే అగ్రస్థానం. వంద ఒక పూర్ణత్వానికి నికషగా మనం భావిస్తూ ఉండడం కద్దు.
ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే సినీ జీవులు దానిని ఒక గొప్ప కితాబుగా భావిస్తూ ఉంటారు. తమ చిత్ర రాజం వంద రోజులు ఆడడం కోసం ఎన్ని పుర్రాకులయినా పడుతూ ఉంటారు. వంద రోజుల ఆటలూ ఎలాగో ఒక లాగ పడే లాగున నానా తంటాలూ పడుతూ ఉంటారు. ఆడక పోయినా, ఆడిస్తారు.చివరకి వంద రోజులూ పూర్తి కాగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చు కుంటారు. భుజాలు చరుచు కుంటారు.
అలాగే, మన పెద్దలు ఆశీర్వదించేటప్పుడు ‘ శతమానం భవతి’ అంటూ ఆశీర్వదిస్తారు. నూరేళ్ళు బ్రతకమని కోరు కుంటారు. ( కాకిలా కలకాలం బ్రతకడం వేష్టుగా భావించే నిరాశా వాదులూ ఉంటారు. అది విషయాంతరం)
మహానుభావుల శత జయంతులు ఘనంగా జరుపు కుంటూ ఉంటాం. వందేళ్ళ నాటికి కూడా వారి పేరు స్మరించు కోవడం వారి ఘనతకు నిదర్శనం.
వంద సంఖ్యను తలుచు కుంటూ ఉంటే వంద మంది కౌరవులు గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు. వంద సంఖ్య ప్రత్యేకతను మంట గలిపిన వారు కౌరవులు
కవి ఆరుద్రకి కూడా వంద సంఖ్య మీద ఏమంత ప్రత్యేక మైన మోజు ఉన్నట్టుగా తోచదు.
తరాని కో వంద కవులు
తయారవుతా రెప్పుడూ
వంద లోనూ మంద లోనూ
మిగల గలిగే దొక్కడు !
అని తేల్చి చెప్పీసేడు.
సరే, ఈ శ్లోకం చూడండి ...
శతనిష్కో ధనాఢ్యశ్చ, శతగ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా, శత శ్లోకేన పండిత:
వంద నిష్కలు కల వాడు ధనికుడు. వంద గ్రామాలు కల వాడు భూకామందు. వంద గుఱ్ఱాలు కల క్షత్రియుడే రాజు. వంద శ్లోకాలు ఎవడి కయితే వచ్చో, వాడు పండితుడు అని దీని అర్ధం.
ఈ లెక్కలో నిష్కము అంటే, మాడ, టంకము, నూట యెనిమిది మాడలు, పతకము, బంగారము, వెండి అనే అర్ధాలు ఉన్నాయని శబ్ద రత్నాకరం చెబుతోంది.
మాడ అంటే బంగారం అని నిఘంటువు. ఒక ప్రత్యేక మైన విలువ కలిగిన బంగారు నాణెము మాడ.
టంకము అనే దానికి పదహారు డబ్బుల బంగారు నాణెము అని నిఘంటువు. దీనికే దీనారము అని మరో పేరు.
మరి, డబ్బు అంటేనో ? రెండు దుగ్గానుల రాగి నాణెము అని అర్ధం.
దుగ్గాని అంటేనో ?
దుగ + కాని = దుగ్గాని. అంటే రెండు దమ్మిడీల విలువ కలది. ఈ పాత కాలపు నాణేల గురించి తెలుసు కోవడం తమాషాగా ఉంటుంది. ఒక టంకానికి పదహారు డబ్బులు కనుక ఈ లెక్క ప్రకారం ఇక్కడ కాని అంటే దమ్మిడి అని శబ్ద రత్నాకరం చెబుతోంది.
అయిదు కాసుల నాణెమును దమ్మిడి అంటారుట. కొందరయితే, రెండు కాసుల నాణెమును దమ్మిడి అంటారని నిఘంటువు వివరిస్తోంది.
ఇక, కాసు అనే పదానికి నిఘంటువు ఏం చెబుతోందో సరదాగా చూదాం ...
కాసు అంటే,దుగ్గానిలో నాలుగవ భాగమని కొందరు, కాదు కాదు ... దుగ్గానిలో పదవ భాగమని కొందరు అంటారుట.
కాసు వీసం కలిగి ఉంటే ... అని ఒక గేయంలో గురజాడ ప్రయోగించాడు. వీసం అంటే ఒక రూకలో పదహారవ భాగం.
నిఘంటువు రూక అనే పదానికి ధనము అనే అర్ధంతో పాటు, చిన్న మెత్తు వెండి బంగారముల నాణెము అని కూడా అర్శాన్ని ఇచ్చింది.
ఇప్పుడోసారి మళ్ళీ వెనక్కి డబ్బు దగ్గరకి వెళదాం.
డబ్బు అంటే రెండు దుగ్గానుల నాణెం అని తెలుసు కున్నాం కదా?
డబ్బు అనే దానికి బొంకు, బొంకు పలకడం అనే వేరే అర్ధాలు కూడా ఉన్నాయి !
వాడొక డబ్బు డబ్బేడు అంటే, వాడొక అబద్ధం చెప్పేడు అని అర్ధం. ( ఈ ఉదాహరణ నిఘంటు కారుడు ఇచ్చినదే)
ఈ అర్ధాలే కాక, డబ్బు అనే దానికి డంబము అనే అర్ధం కూడా ఉంది. డంబము అంటే, స్థితికి మంచిన వేషము అని అర్ధం.
ఏతావాతా ఇంతలా కొండను తవ్వి నేను పట్టిన ఎలుక ఏమిటయ్యా అంటే,
డబ్బు అంటే వొట్టి అబద్ధం అని మనం గ్రహించాలి. డబ్బు అనే పదార్థం వొట్టి మిథ్య. వచ్చి నట్టే ఉంటుంది. రాదు. ఉన్నట్టే ఉంటుంది, ఉండదు. వస్తూనే పోతూ ఉంటుంది. పోతూ వస్తూ ఉంటుంది. నానా రగడా చేస్తుంది. దానికి అల్లరీ ఆగమూ హెచ్చు. ఉన్నప్పటికీ తృప్తి నివ్వదు. లేక పోతే బతక నివ్వదు. లక్ష్మి చంచలమైనదని ఊరికే అన్నారా?
అందు చేత ఈ డబ్బు మాయలో పడి కొట్టుకు పోకుండా జీవితం వేరే విధంగా సార్ధకం చేసుకోడానికి మార్గాలు ఏమైనా వెతుక్కోవాలి. తప్పదు.
ఎందు కంటే,
ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే, నారీ గృహ ద్వారి, జన:శ్మశానే
దేహాశ్చితాయాం పర లోక మార్గే, కర్మా2నుగో గచ్ఛతి జీవ యేక:
అని పెద్దలు చెబుతున్నారు.
మనం సంపాదించు కున్న ధనం ( డబ్బు) మన వెంట రాదు. భూమి మీదే ఉండి పోతుంది.
మనం పోషించిన పశువులు పశుశాల విడిచి మన పార్ధివ దేహం వరకూ కూడా రావు.భార్య ద్వారం దాటి ఇవతలికి అడుగు పెట్టదు (పెట్టరాదని నియతి కాబోలు) బంధువులు పరేత నిలయ ప్రాంతం వరకూ వస్తారు. దేహం చితి వరకూ మాత్రమే వస్తుంది.
మరి, పర లోక ప్రయాణంలో మన వెంట వచ్చేది ఏమిటయ్యా అంటే, మన పుణ్య పాప కర్మలు మాత్రమే అని దీని భావం.
అందండీ సంగతి.
అయితే, డబ్బే వద్దా, అంటే కావాలి.‘‘ డబ్బు తేలే నట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయి ’’ అని కవి చెప్పాడు
‘‘ వ్చర్ధం నిర్ధనికస్య జీవన మహోదారైరపి త్యజ్యతే’’ అన్నారు. అంటే ధనం లేని వ్యర్ధుడిని జీవన సహచరి కూడా ఫో, ఫోవోయ్ అంటుందిట.
అంచేత, మన గుండె డబ్ డబ్ మని కొట్టుకుంటున్నంత వరకూ డబ్బు కావాలి. కాని అది మన నిజమైన అవసరాలకి మించి అక్కర లేదని తాత్పర్యం. మన సంపాదనకి మనం ట్రష్టీలం మాత్రమే అని అంటారు గాంధీజీ.
అదండీ డబ్బు జాలం ( నెట్) కథ !
1 కామెంట్:
డబ్బు ముఖ్యమే. అత్యాశ చెడ్డది. ధనమూలం ఇదంజగాత్ అన్నారు. పాత నాణేలను గుర్తు చేసారు. దమ్మిడికి కూడా ఏదో ఒకటి కొనవచ్చునంటే ఆశ్చర్యమే. రూపాయికి పదహారు అణాలు. ఒక అణా కి నాలుగు కాణీలు. ఒక కాణీ కి మూడు దమ్మిడీలు. అంటే ఒక దమ్మిడి అంటే రూపాయి లో 1/ 192 భాగము. రెండు దమ్మిడీలు అంటే ఒక ఏగాని. ఒక బేడ అంటే రెండు అణాలు. హోటల్ లో ఒక బేడ ఇస్తే ఒక plate ఇడ్లి కప్పు కాఫీ వచ్చ్హేది. ఇవి నా జ్ఞాపకాలు. thanks for the బ్లాగ్. thanks for taking me down memory lane.
కామెంట్‌ను పోస్ట్ చేయండి