7, డిసెంబర్ 2010, మంగళవారం

నస మంజరి


అజాత మృత మూర్ఖాణాం, వర మాద్యౌ న చాంతిమ:
సకృ ద్దు:ఖ కరా వాద్యా, వంతిమస్తు పదే పదే.

ఈ శ్లోకంలో కవి ముగ్గురి గురించి చెబుతున్నాడు.

ఇంకా పుట్టని వాడు , చని పోయిన వాడు, మూర్ఖుడు.

ఈ ముగ్గురిలో కడపటి వాడి కంటె ముందున్న ఇద్దరే మేలు. అంటే, ఇంకా పుట్టని వాడు, చని పోయిన వాడు - వీళ్ళిద్దరూ ఒక్క సారే దు:ఖాన్ని కలిగిస్తారు. కాని ఈ ఆఖరున చెప్పిన వాడున్నాడే, మూర్ఖుడు , వాడు మాత్రం మాటి మాటికి దు:ఖాన్నే కలిగిస్తూనే ఉంటాడు.

అంటే ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు. అని కవి చెబుతున్నాడు.

అలాంటి మూర్ఖులు వంద మంది ఉండడం కన్నా, గుణవంతుడైన ఒక్క కుమారుడు ఉంటే చాలని కూడా చెబుతున్నాడు.

వర మేకో గుణీ పుత్రో, నచ మూర్ఖ శతైరపి
ఏక శ్చంద్ర స్తమో హంతి, నచ తారా గణో2పి చ.

మూర్ఖులైన పుత్రులు వంద మంది కన్నా, మంచి గుణాలు కలిగిన వాడు ఒక్కడు చాలును. కోట్ల నక్షత్రాల కన్నా, చీకట్లు పార ద్రోలే చంద్రుడు ఒక్కడు చాలును కదా అని దీని భావం.

పరి వర్తిని సంసారే, మృత: కోవా న జాయతే
స జాయతో యేన జాతేన, యాతి వంశ స్సమున్నతిమ్

ఈ సంసారము చావు పుట్టుకలతో కూడినది. కనుక ఇచ్చట చని పోయిన వాడు ఎవడు తిరిగి పుట్టడం లేదు ? కాని, యెవని పుట్టుక వలన వంశం కీర్తిని పొందుతూ ఉందో, వాని పుట్టుక మాత్రమే సార్ధకమైనది. అని దీని భావం.

కులము లోన నొకడు గుణ హీనుడుండిన
కులము చెడును వాని గుణము వలన
చెఱకు వెన్ను బుట్టి, చెరపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినుర వేమ

ఒక గుణ హీనుడు చాలు, మొత్తం వంశానికంతటికీ చెడ్డ పేరు తీసుకుని రావడానికి. చెఱకు గడ చివర వెన్ను పుడితే దాని తీపి అంతా నశించి పోతుంది కదా అని వేమన చెప్పనే చెప్పాడు కదా.

బద్దెన కూడ దీనినే తిరుగ రాసాడు

కొఱగాని కొడుకు పుట్టిన
కొఱగామియె కాదు, తండ్రి గుణముల చెఱచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెఱచు కదరా సుమతీ !

కొడుకులు పుట్ట లేదో అని ఏడిచే వారికి హెచ్చరికగా ధూర్జటి ఈ పద్యం చెప్పాడు.

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నే గతుల్
వడసెన్? పుత్రులు లేని యా శకునకున్ వాటిల్లెనే దుర్గతుల్?
చెడునే మోక్ష పదంబపుత్రకునకున్ శ్రీ కాళ హస్తీశ్వరా.

బ్రతుకు మీది మమకారంతో అయ్యో, కొడుకులు పుట్ట లేదే, అని ఏడుస్తూ ఉంటారు. కురుపతికి వంద మంది కొడుకులు పుట్ట లేదా? వారి వలన అతనికి ఏ సద్గతులూ లభించ లేదు. పుత్రులే లేని శుకునికి మంచి గతులే లభించాయి. పుత్రులు లేని వారికి మోక్ష పదవి రాదను కోవడం సరి కాదు .

అందు వలన మందితో పని లేదని తెలుసు కోవాలి.

తెలియని కార్య మెల్ల కడ తేర్చుట కొక్క వివేకి చే కొనన్
వలయు, నట్లైన దిద్దు కొన వచ్చు, ప్రయోజన మాంద్య మేమియున్
కలుగదు, ఫాల మందు తిలకంబిడు నప్పుడు చేత నద్దమున్
కలిగిన చక్క చేసి కొనుగాదె, నరుండది చూచి భాస్కరా.

ఒక తెలివయిన వాని సహకారంతో ఎంతటి దుష్కర కార్యాన్నయినా చక్కగా నిర్వర్తించ వచ్చును.
చేతిలో అద్దం కలిగి ఉంటే, దానిని చూసి చక్కగా తిలకం దిద్దు కో వచ్చును కదా.

ఒక్కడు చాలునని చెప్పడాని మరీ ఇన్ని ఉదాహరణలు చెప్పాలా ! ఒక్కటి చెబితే చాలదూ ?
చాదస్తం కాక పోతే ! కథా మంజరి పేరు మార్చి నస మంజరి అని పెట్టుకో, ఫో అంటారా? తమ దయ. మద్భాగ్యం.

స్వస్తి.





6 కామెంట్‌లు:

Sudha Rani Pantula చెప్పారు...

కులదీపకుడు వంశోద్ధారకుడు అయిన సుపుత్రుడు కావాలని ఊహూ...ఇదయిపోతుంటారు చాలామంది. ఒకవేళ పుత్రుడు కలిగినా వాడు సరైన వాడు కాకపోతే.... అందువల్ల మీరు ఎన్ని శ్లోకాలు చూపించినా విషయానికి అతికినట్టుగా చక్కగానే ఉన్నాయి.
ఒకే విషయానికి తగినట్టుగా ఇన్ని శ్లోకాలు, పద్యాలు ఒక చోట చేర్చి చూపినందుకు మీకు ధన్యవాదాలు

కొత్త పాళీ చెప్పారు...

బాగా చెప్పారు :)

చంద్ర మోహన్ చెప్పారు...

బాగుందండీ. ఐతే మొదటి శ్లోకంలో ముగ్గురిని గురించి చెప్పడం లేదనుకొంటాను. ’అజాత మృత’ అంటే మృతశిశువు అని అర్థం. పుట్టకముందే చనిపోయిన కొడుకు ఒక్క సారే ఏడ్పిస్తాడు. కానీ మూర్ఖుడైన కొడుకు జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటాడు అని (నా)భావం.
తప్పైతే మన్నించగలరు.

కథా మంజరి చెప్పారు...

చంద్ర గారూ, మీరు చెప్పినది సబవుగా తోస్తున్నది. నేను చూసిన పుస్తకంలో మాత్రం ఇంకా పుట్టని వాడూ, మరణించిన వాడూ, మూర్ఖుడూ అని ముగ్గురి ప్రస్తావనా ఉన్నది. పెద్దలెవరయినా ఈ సంశయం తీరిస్తే బాగుండును.

ముగ్గురి గురించిన ప్రస్తావనే నిజమైతే, అయ్యో ఇంకా సంతానం కలగ లేదే అని ఏడిచి ఊరుకుంటారని భావమేమో ?

నవజాత శిశువు అనే ప్రయోగం మనకి ఉంది. అప్పుడే పుట్టిన బిడ్డ అనిదాని అర్ధం.
కాగా, అజాత మృత అంటే, మీరు చెప్పినట్టుగా మృత శిశువు అనే అర్ధమే యుక్తి యుక్తంగా ఉంది. మీ స్పందనకి ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చంద్రమోహన్ గారూ!
జోగారావుగారు చేసిన వివరణ సముచితంగానే ఉంది కదా!
వరమాద్యౌ అని ద్వివచనంలో శ్లోక కర్త స్పశ్టంగా వివరింపగా ఇంక సందేహానికి తావేది?
వరమాద్యౌ = వరం + ఆద్యౌ.= మొదటి రెండూ శ్రేష్ఠమైనవి అనే కదా అర్థం?
కావున జోగారావుగారి వివరణలో దోషం ఉందని అనడానికి తావు లేదు కదా! చక్కగా వివరించిన శ్రీ పంతుల జోగారావు గారికి ధన్యవాదములు.

కథా మంజరి చెప్పారు...

చింతా రామ కృష్ణా రావు గారూ, ఆద్యౌ అనే ద్వి వచన ప్రయోగం వల్ల మొదటి రెండూ అనే అర్ధం సుస్పష్టం. నేనది చూసుకో లేదు. చంద్ర మోహన్ గారికి సందేహ నివృత్తి అయి ఉంటుంది. వారికే కాదు, నాకూనూ. మీ వంటి పెద్దల సాహచర్యం లభించడం నా పురాకృత జన్మ ఫలంగా
భావిస్తున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి