24, మార్చి 2013, ఆదివారం

ఈ ఇష్గాలంటే నా కెంతో ఇష్టం !!





నాకు మా విజయ నగరం అంటే చాలా ఇష్టం.తెలుగు కథకు పురిటి గడ్డ కనుకయిష్టం. గురజాడ తిరిగిన తావు కనుక ఇష్టం. కన్యా శుల్కం లాంటి గొప్ప నాటకం వెలిసిన ఊరు కనుక యిష్టం. ఆ నాటకం తొలి ప్రదర్శన జరిగిన ఊరు కనుక ఇష్టం. తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో నేల కనుక యిష్టం.
   నాకింకా చాలా ఇష్టాలు ఉన్నాయి. తడియారని అచ్చు వేసిన కొత్త పుస్తక మయితే ఇష్టం. అది కథల పుస్తక మయితే మరీ మరీ  ఇష్టం.  
మా ఊరి  కోట,  పెద్ద చెరువు, గంట స్తంభంమూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు,అయ్య కోనేరు, బొంకుల దిబ్బ, మహా రాజావారి కళాశాల, మా చదువుల తల్లి
 మా సంప్కృత కళాశాల,  అమ్మ లాగ అన్నం పెట్టి ఆదరించిన సింహాచల దేవస్థానం వారి అన్నదానసత్రవూ, సంగీత కళాశాల,అమ్మ వారి  కోవిల, గుమ్చీ,  రాజారావు మేడ, డంకే షావలీ మసీదు, వ్యాస నారాయణ మెట్ట,. ఇంకా దోమల మందిరం .... నిజమే  మా విజీనారం దోమలంటే కూడా నాకు చాలా ఇష్టం. మా పతంజలి చెప్పినట్టు, అవి రాత్రి వేళ కుడుతూ, కథలూ కాకరకాయలూ రాసుకోమనీ, చదువుకోమనీ సదా హెచ్చరిస్తూ ఏండేవి కదా.
నిజమే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. మా దాట్ల నారాయణ మూర్తి రాజు, పతంజలి, ఎ.ఎన్.జగన్నాథ శర్మ, గార్లతో ఎంతో ఇష్టంగా రాత్రీ పగలూ తిరిగిన ఊరు కనుక చాలా ఇష్టం. మరింకా మా గురు దేవులు మానా ప్రగ్గడ శేషసాయి గారు మా భాగ్యవశాన  మమ్ములను సదా ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారు కనుక ఇష్టం...... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇష్టాలకు అంతూ పొంతూ ఉండదు.  అలా చెప్పడం కూడా నాకు చాలా యిష్టం.

ఈ ఇష్టాల పుస్తకంలో కొన్ని పుటలు వెనక్కి తిప్పితే, మా రసాలూరు సాలూరు వస్తుంది. ఆ ఊరంటే, అక్కడి సందు గొందులతో, మురికి వాసనaతో, పేదరికపు బీద జీవిత ముఖ పత్రాలతో నాకు చాలా ఇష్టం.
అక్కడి వేగావతి నది, పంచముఖేశ్వర స్వామి వారి ఆలయం, నేను దాదాపు పాతికేళ్ళు పని చేసిన మా కాలేజీ, ...ముత్యాలమ్మ కోవిల, పారమ్మ కొండ,దూరంగా కనిపించే   కొండలూ,  అక్కడి మల్లె తోటలు, తియ్యని పాటల బాదుషా కబీర్ షా  గారు పాడిన మా కళా వేదికా,  ఇంకా, వేగావతి బ్రిడ్జి మీద సాయంత్రాలు కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకుపన్న మా మిత్ర బృందమూ,.. ఒకటేమిటి ... అన్నీ గుర్తుకు వస్తాయి.

ఆ రోజులలో మా రసాలూరు సాలూరు గురించి రాపిన నా పద్యం ఒకటి గుర్తుకు వస్తూ ఉంది. అది కూడా చెప్పి, నా ఇష్టాల జాబితా చాలా అసమగ్రంగా ఇంతటితో ముగిస్తాను ..

సీ.
పొలిమేర విడిసి తా తొలి పూజ లందు మా
    తల్లి ముత్యాలమ్మఁ దలతు నేను. !
వేగమే లేనట్టి వెర్రి బాగుల తల్లి
     వేగావతికి నుతులు వేనవేలు !
తనుఁగొల్చు భక్తుల తరియించి వేలుపు
   పరమ పావన మూర్తి పంచ ముఖుడు !
శి రాత్రి వేళలో జన సంద్రమై కాచు
కొండ పారమ తల్లి అండ మాకు !


చాల దయగల తల్లి మా శ్యామలాంబ !
వేల్పుటెకిమీడు జోతలు వేంకటేశ !
మరులు కల్పించు మాయూరి మల్లె పొదలు !
మంచి గంధము మాయూరి మంచి తనము !!




4 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...





ఎవరికైనా చదువుకున్న వూరు,బడి, ఎక్కువ కాలం అనుబంధమున్న స్థలం అంటే అది ఎలాటిదైనాయిష్టంగానే ఉంటుంది.కాని మీ పుట్టిపెరిగిన స్వంతవూరు గురించి రాయలేదేం ?

కథా మంజరి చెప్పారు...

ధన్యవాదాలండీ.
పుట్టినూరు ఇష్టాలు పుట్టెడు ! తీరిగ్గా మరోసారి. !

www.apuroopam.blogspot.com చెప్పారు...

పుట్టినూరినీ కన్నతల్లినీ మరచిపోనివారంటే నాకు భలే ఇష్టం. మీ ఇష్టాలన్నీ బాగున్నాయి కానీ మీరు చెబుతానన్న ఆ ఇష్గా ల కథేమిటి?

అజ్ఞాత చెప్పారు...

Mee ishtaalannee naakkooda ishtame!Pani kattukoni oka rojantaa tirigi tirigi choosi madhura jnaapakaalanu ippatikee nemaresukuntaanu!

కామెంట్‌ను పోస్ట్ చేయండి