14, సెప్టెంబర్ 2014, ఆదివారం

మా ‘ వేలు విరిచిన మేన బాబాయి ’ కథ !



వేలు విడిచిన మేన మాఁవ లున్నట్టే, వేలు విడిచిన మేన బాబాయి లుంటారా ?అనేది ఇటీవల ఒకరి సందేహం. ఎందు కుండరూ ,ఉంటారు. ఈ వేలు విడవడం అంటే  మరేం కాదు. వేటినయినా లెక్కించే టప్పుడు చిటికెన వేలు మొదలుకుని వరుసగా ఉంగరపు వేలూ, తర్వాత మధ్య వేలూ, ఆపైన చూపుడు వేలూ ముడుస్తూనో , మన బొటన వేలితో వాటిని తడుముతూనో చెప్పడం వొక ఆన వాయితీ. ఈ లెక్కింపులో వొక వేలు దాట వేయ వలసి వస్తే, అదే వేలు విడిచిన లెక్క అవుతుందన్న మాట. ఏతావాతా తేలిందేమిటంటే, మన అమ్మా నాన్నల అన్నదమ్ములూ, అక్క చెల్లెళ్ళూ -మనకు సొంత మేన మామలూ , మేనత్తలూ, మేన  బావలూ అవుతారు కదా ..... అమ్మా నాన్నల పింతల్లి . పెత్తల్లి బిడ్డలు మనకి వేలు విడిచిన మేన మామలూ, మేనత్తలూ, వేలు విడిచిన మేన బాబాయిలూ అవుతారు.  అంటే, మరీ సొంతం కాకుండా , మన వారే అయినా , కొంచెం ఎడం వారే వేలు విడిచిన వారు !

   ఏమయినా, ఆ తేడా బంధుత్వాన్ని స్పష్టం చేయడం కోసం మన వాళ్ళు ‘‘వేలు విడిచిన’’ అనే ఎంత చక్కని పబంధం కల్పించారో చూడండి ! ముచ్చట వేయడం లేదూ ! అదీ, మన తెలుగు  భాష కమ్మ దనం అంటే !
     వేలు విడిచిన మేన మామలూ, బాబాయిల సంగతి కాస్సేపు పక్కన పెడితే, నేనిప్పుడు మీకు మా ‘‘వేలు విరిచిన   మేన బాబాయి ’’గురించి చెబుతాను ..
వా ట్ ! వేలు విడిచిన బాబాయిల్లాగానే, వేలు  విరిచిన బాబాయిలూ ఉంటారా ? అని ఊరికే తెగ ఆశ్చర్య పోకండి. ఉంటారుంటారు. మా నరసింహం బాబాయే మా వేలు విరిచిన బాబాయి. నా చిన్నప్పటి ఆ ముచ్చటే ఙ్ఞాపక మొచ్చి , మీకు చెబుదామని మొదలు పెట్టాను.
పార్తీ పురం లో మాది లంకంత కొంప . పెరడంతా పెద్ద అడవిలా ఉండేది. ఉండే దేమిటి, దాదాపు ఇప్పటికీ అలాగే ఉంటేనూ ! ఇటు గుమ్మా వారు దడి కట్టి మా పెరట్లోంచి వాళ్ళ పెరడు లోకి పిల్ల కాయల రాక పోకలు లేకుండా కట్టడి చేసారు కానీ, కుడి వేపు పెరళ్ళన్నీ కలిసే ఉంటాయి. అక్కడ వొకటో రెండో బాదం చెట్లు. వేసవి కాలం ఎండ వేళ ,బాదం కాయలు ఏరుకుని రాళ్ళతో బద్దలు కొట్టుకుని తినే వాళ్ళం. అక్కడే చెడుగుడూ, కర్రా బిళ్ళా లాంటి ఆటలు ఆడుకునే వాళ్ళం.

సరి ...సరి .. వీటికీ మీ వేలువిరిచిన బాబాయికీ సంబంధం ఏవిటయ్యా ! అని కోప్పడు తున్నారా ?  అక్కడికే వస్తున్నాను.
వేసవి కాలం ఎండలో మధ్యాహ్నం వేళ చొక్కా నిక్కరుతో, కొండొకచో వొంటి మీద చొక్కా కూడా లేకుండా ,అలా మా పెరళ్ళలో చక్కా ఆడుకుంటూ ఉండే వాళ్ళమా ? ... మా వేలు విరిచిన  మేన బాబాయి - నరసింహం బాబాయి అక్కడికి ఊడి పడే వాడు. చింత రివట పట్టుకుని, పిల్లల నందరినీ వొక వరుసలో నిల బడే మనే వాడు. ఎండలో చక్కా చదూ కోకుండా ఈ ఆట లేమిటని హుంకరించే వాడు. ఏదీ, ఎక్కాలు వొప్ప చెప్పమని నిలదీసే వాడు. మాకు నిక్కర్లు తడిసి పోయేవి.
పన్నెండో ఎక్కం వరకూ ఎలాగో నెట్టు కొచ్చినా, పదమూడో ఎక్కం దగ్గర బెక్కీసీ వాళ్ళం కదా ? ... అదిగో, అప్పుడు మా నరసింహం బాబాయి మొట్టి కాయలూ, తొడ పాశాలూ లాంటి శిక్షలు మామీద అమలు చేసే వాడు. ఆ క్రమంలోనే మా నరసింహం బాబాయి కనిపెట్టిన శిక్ష వొకటుంది. మన కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నిమురుతూ, ‘‘ బాగా చదవాలమ్మా ! చదవక పోతే ఎలా పని కొస్తావు చెప్పూ ..’’ అంటూ, మెత్తగా మాట్లాడుతూనే,  ఒక్క సారిగా చిటికెన వేలు పట్టుకుని దానిని వెనక్కి వంచే వాడు. మా ప్రాణాలు గిల గిల లాడి పోయేవి. లబలబలాడి పోయే వాళ్ళం.
ఇలా వో సారి మా నరసింహం బాబాయి నా చిటికెన వేలు వెనక్కి వంచి నన్ను సన్మార్గంలో పెట్టి సంస్కరించ బోతే నొప్పి భరించ లేక ‘‘ చచ్చేన్రా నాయనోయ్ !చంపేస్తున్నాడ్రా బాబోయ్ !’’ అని పెద్ద పెట్టున కేకలు వేసాను.
 ఇంకే ముందీ, ఇంట్లో పెద్దలు ఏమయిందేమయిందటూ వచ్చేరు.
పసి వాడికి పద మూడో ఎక్కం రానంత మాత్రాన వాడిని చంపేస్తావా ఏమిటిరా ! అని బాబాయిని కూక లేసారు.
అదే అదునుగా తెలివిగా  నేను ఏడుపు రెట్టింపు చేసాను.
‘‘వేలు కానీ విరిగి పో లేదు కదా ! ఆది నారాయణ డాక్టరు దగ్గరకి తీసి
కెడితేనో ..’’అని  ఎవరో అన్నారు.
‘‘ నాకు విండీసనొద్దు బాబోయ్ ’’ అని మరింత ఏడుపు రెట్టింపు చేసాను.
‘‘ సరేలే ... కాస్త వోర్చుకో ... వేలు విరిగితే వాచి ఉండేది. వాపూ అదీ ఏమీ లేదు కదా ... వేలు విరిగి ఉండదులే ..’’ అని సముదాయించేరు.
ఇలా వో ప్రక్క నన్ను బుజ్జగిస్తూనే , మరో పక్క నరసింహం బాబాయిని ముక్త కంఠంతో అంతా దులిపేసారు. ( మనం లోలోన ముసి ముసి నవ్వులు  నవ్వు కున్నాం ! )
అదిగో ... అలా ... అవేల్టి నుండీ మా నరసింహం బాబాయి మా వేలు విరిచిన మేన బాబాయి అయ్యేడన్న మాట ! బెత్తం బాబాయి, మొట్టి కాయల బాబాయి అనేవి వారి ఉపనామాలు లెండి.

చిన్నప్పటి ఈ ముచ్చట పక్కన పెట్టి,  ప్రస్తుతానికి వస్తే,  పిల్లల్ని దండించే విషయంలో మన పెద్దాళ్ళూ, స్కూలుమేష్టర్లూ ఎన్ని రకాల పద్ధతులు కనుక్కున్నారో గమనిస్తే ముచ్చటేస్తుంది.
1.    రెండు చెవులూ పట్టుకుని ఎత్తి కుదేయడం,
2.    గిద్దెడు (వొకప్పటి కొల పాత్ర) నూనె ఇంకేలా నెత్తి మీద మొట్టి కాయలు వేయడం
3.    నిక్కర్లోకి చెయ్యి లాఘవంగా పోనిచ్చి, తొడపాయశం పెట్టడం
4.    చెంప ఛెళ్ళు మనిపించడం
5.    జుత్తు పట్టుకుని వంచి నడ్డి మీద వీశె గుద్దులు గ్రుద్దడం
6.    రెండు బుగ్గలూ పట్టుకుని  సాగదీస్తూ నలిపెయ్యడం.
7.     చింత రివటతో వీపు చీరెయ్యడం.
8.    అరచెయ్యి చాపమని ఆర్డరేసి , చేతి మీద బెత్తంతో  దబదబా బాదడం
9.     గుంజీలు తీయించడం
10.                       గోడ కుర్చీ వేయించడం
11.                       మండే ఎండలో కాళ్ళు బొబ్బలెక్కేలా నించో పెట్టడం
12.                       కోదండం వేయించడం ( ఇది మరీ ప్రాచీన కళ లెండి)

ఇలా ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు ఎంచక్కా పిల్లల్ని  తనివి తీరా సరదాగా
దండించే వారు.
తిట్ల పురాణం వీటికి అదనం !

ఇప్పుడవేం పనికి రావు. పిల్లల్ని  తిట్ట కూడదు . కొట్ట కూడదు. ఏడిసినట్టుంది !
ఇదేం చోద్యం ! పిల్లల్ని కొట్టా తిట్టకుండా ఉంటే మన పెద్దరికం ఏ గంగలో కలవాలి !
పెద్దలన్నాక, టీచర్లన్నాక, పిల్లల్నికొట్టొద్దూ ?
      మొగుళ్ళన్నాక పెళ్ళాలను  కాల్చుకు తినొద్దూ ?
      నాయకు లన్నాక ప్రజలను వేపుకు తినొదూ ?
        బాసులన్నాక, క్రింది  చిరుద్యోగులను సతాయించి ఏడిపించొద్దూ ??
చేతిలో  పిస్తోలు ఉంటే పేల్చమా మరి !
చేతిలో దుడ్డు కర్రుంటే ఎవడినో వొహడిని మోదఁవా మరి !
వొంటి బలుపు తీండ్ర పెడితే ఎవడి జుట్టో పట్టుకోమా మరి !
పెద్దరికాన్ని ప్రదర్శించు కోవాలంటే రకరకాలయిన హింసా పద్ధతులు తెలియాలా వొద్దా ? వాటిని వీలయి నప్పుడల్లా పాటించాలా వొద్దా ? మన ప్రఙ్ఞ నలుగురికీ చూపించాలా వొద్దా ?

మా చిన్నప్పుడు మా వేలు విరిచిన నరసింహం బాబాయి  చేసిందదే !
తెలియక అప్పట్లో   నానా యాగీ చేసాను. బాబాయిని అపార్ధం చేసు కున్నాను. అల్లరిపాలు చేసాను.
అందరి చేతా చీవాట్లు పెట్టించేను. గాఠిగా కోప్పడేలా చేసాను.
 అందరి ముందూ అవమానాలపాలు చేసాను.
ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనే డైలాగు చిన్నప్పుడు నలుపు తెలుపు తెలుగు సినిమాల్లో చాలా సార్లు విన్నాను. మరంచేత ఇప్పుడు బాధ పడుతున్నాను. పిల్లల్ని హింసించే కొత్త పద్ధతుల మీద ప్రయోగాలు చేస్తూ, డాక్టరేట్ చేయాలనుకుంటున్నాను. ఆశీర్వదించండి.

ఇదండీ, మా వేలు విరిచిన మేన బాబాయి కథ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి