15, జనవరి 2015, గురువారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా, ఏమి రుచి !

కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.





అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా, నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లుచాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా  హొటల్ ఉండేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాస్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.



చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లుళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ( ఆ ప్రక్కనే ఉపాధ్యయ భవన్ కదా ! దాని ప్రభావం కాబోలు ! ) ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ..... మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి