మీ కోసం ఓ చమత్కార శ్లోకం ... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మీ కోసం ఓ చమత్కార శ్లోకం ... లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2009, శుక్రవారం

చమత్కార శ్లోకం

ఈ క్రింది శ్లోకంలో కవి చమత్కారంగా శివుడినీ. విష్ణువునీ కూడ ఎలా స్తుతిస్తున్నాడో చూడండి ...

పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ:
శశిఖండ శేఖర ఉమాపరిగ్రహోముహురనాదిరవతుత్వామ్

శివ పరమైన అర్ధం :
పన్నగ ధారి కరాగ్ర: = చేతిలో పాముని ధరించిన వాడు
గంగా , ఉమా లక్షిత: = గంగా పార్వతులచే కోరబడిన వాడు
అంగదోగ్రభుజ: = భుజాల మీద బాహుపురులు, స్వర్ణాభరణాలు ధరించిన వాడు
శశిఖండ శేఖర: = చంద్ర రేఖను శిరోభూషణంగా కలవాడు
ఉమా పరిగ్రహ: = పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన వాడు
అనాది: = పుట్టుక లేని వాడు
ముహు: త్వాం అవతు = సదా మిమ్ములను కాపాడు గాక !

ఇక, విష్ణు పరమై అర్ధాన్ని చూదామా?
ముందుగా పై శ్లోకంలోనివిశేఫణ పదాల నుండి తొలి అక్షరాలను తొలిగించి చదవండి ...
నగధారి కరాగ్రహ: = గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు
గోమాలక్షిత: = భూమి, గోవులు, లక్ష్మీ దేవి - వీరిచే కోర బడిన వాడు
గదాగ్ర భుజ:= భుజాన కౌమోదకి అను గదను దాల్చిన వాడు

శిఖండ శేఖర: = శిరసున నెమలి పింఛము కలవాడు
మా పరిగ్రహ: = లక్ష్మీ దేవిని భార్యగా పొందిన వాడు
అనాది: = తొలి అక్షరాలు తొలిగించగా మిగిలిన విశేషణములు కల వాడైన శ్రీ మహా విష్ణువు
ముహు:త్వాంఅవతు = సదా మిమ్ములను కాపాడు గాక !

17, డిసెంబర్ 2009, గురువారం

తోకలున్నవన్నీ గుర్రాలే !!


మన పూర్వ కవి ఒకరు శ్లోకంలో ఎంత చక్కని సెటైరుని విసిరాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
చూడండి ...


రే రే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిం ?
రాజాశ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్
సర్వా పుచ్ఛవతో హయా యితి వదంత్యత్రాధికారే స్థితా
రాజా తైరుపదిష్టమేవ,మనుతేన సత్యం తటస్థాపరే:


కవి గారు గాడిద పడుతున్న శ్రమని చూసి జాలి పడుతున్నట్టుగా గాడిదని ఉద్దేశించి ఈ మాటలంటున్నాడు:

‘‘ ఓ గాడిదా ! బట్టలు మోసుకుంటూ గ్రామాలు తిరుగుతూ ఎందుకు ఊరికే శ్రమ పడతావు ?
రాజుగారి గుర్రాల శాలకి వెళ్ళు. అక్కడ మిగతా గుర్రాలతో పాటు నువ్వూ హాయిగా గుగ్గిళ్ళు తింటూ గడుపు. తోకలున్నవన్నీ గుర్రాలేనని అధికారులంటారులే !! రాజు కూడా అదే నిజమని నమ్ముతాడు !!

అయ్యా, చూసారా !! గాడిదని అడ్డం పెట్టుకుని కవి గారు ఆ కాలం నాటి బ్యరోక్రసి మీదా, ప్రభువుల మీదా ఎంత గొప్ప పెటైరు విసిరాడో ! దీనిని మీరు ప్రస్తుతానికి కూడా అన్వయిస్తామంటే అభ్యంతరం లేదు.

సందర్భం ఎలాగూ వచ్చింది కనుక, గాడిదని పలకరిస్తూ మరో కవి గారు చెప్పిన తమాషా పద్యాన్ని కూడా గుర్తు చేసి చేతులు దులుపుకుంటాను....

బూడిద బుంగలైయొడలు పోడిమిఁదప్పి, మొగంబు వెల్లనై
వాడల వాడలం దిరిగి , వచ్చెడు వారలు ‘‘చొచ్చొచో’’ యనన్
గోడల గొందులం దొదిగి, కూయుచునుండెదు కొండ వీటిలో
గాడిద !! నీవునుం గవివి కావు కదా ?యనుమాన మయ్యెడిన్.

అవునూ, ఈ పద్యం ఎవరిదో చెప్పుకోండి చూద్దాం. మీకు తెలుసని నాకు తెలుసని మీకు తెలుసు కదూ !

14, డిసెంబర్ 2009, సోమవారం

లేడిని చూసి సింహం పారి పోయిన కథ !!మన కవులు భాషను క్రీడా రంగంగా చేసుకుని ఎన్ని చక్కని ఆటలు ఆడుకున్నారో గమనిస్తే చాలా సరదాగా ఉంటుంది ..
క్రింది శ్లోకాన్ని పరికించండి ...


కస్తూరీ జాయతే తస్మాత్ ? కో హన్తి కరిణామ్ శతమ్ ?
కిం కుర్యాత్ కౌతరో యుద్ధే ? మృగాత్ సింహ: పలాయతే.

లేడిని చూసి సింహం పారిపోతోందని కవి గారి ఉవాచ !!

పోదురూ, మరీ బడాయి కాక పోతేనూ !

ఇప్పుడు కవి గారి అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తాను. చూడండి ...

చరణాల వారీగా ఇలా చెప్పు కుందాం...
కస్తూరి దేని నుండి పుడుతుంది ? ... మృగాత్ = మృగం నుండి
అనేక ఏనుగులను చంపేది ఏది ? .... సింహం
పిరికిపంద యుద్ధంలో ఏం చేస్తాడు ? ....పలాయతే ... పారి పోతాడు!

శ్లోకంలోని మూడు ప్రశ్నలకీ వరుసగా చివరి పాదంలోని మృగాత్ సింహ:, పలాయతే అనే వాటిని జవాబులుగా చెప్పుకుంటే మరే అసంగతమూ ఉండదులేడిని చూసి సింహం పరిగెత్తడమూ ఉండదు!
క్రమాలంకారంతో కవి గారు సాధించిన చమత్కారం యిది !
బాగుంది కదూ ? ...

13, డిసెంబర్ 2009, ఆదివారం

రెండు భోజనాల గొడవ !!!మిత్రులారా, ఈ క్రింది శ్లోకాన్ని కాస్త పరిశీలించండి ...ఇందులో అసంగతం కనబడడం లేదూ !

ఏకాదశ్యా మహా రాత్రే కర్తవ్యం భోజన ద్వయం
రాత్రే జాగరణంచైవ, దివాచ హరికీర్తనమ్.


రామ ! రామ!! చూడండి ఎంత అసంగతంమయిన విషయమో ! ...ఏకాదశి నాడు రెండు సార్లు భోజనం చెయ్యాలిట ! ...
రాత్రి జాగరణం చెయ్యాలనీ, పగటి పూట హరి కీర్తనం చెయ్యాలనీ సెలవిస్తున్నాడు ... ఇదంతా బాగుంది కానీ ...హవ్వ !!!
ఈ రెండు భోజనాల సంగతేంటండీ !


మరేం లేదండీ ... ఈ శ్లోకంలో పదాలను భో ! జన! అని విరిచి చదువుకోవాలి. అలాగే, ద్వయం కర్తవ్యం అంటే రెండు పనులు చేయాలి అని అన్వయించుకోవాలి...
ఇప్పుడు చూడండి ...ఏకాదశి పర్వ దినాన ఓ జనులారా ! మీరు రెండు పనులు చెయ్యాలి సుమండీ ! ...రాత్రంతా జాగరణ చేసి, పగలంతా హరికీర్తనం చేస్తూ గడపండి అని బోధన... అంతే తప్ప రెండు భోజనాలు వరస పెట్టి లాగించెయ్య మని కాదు!!!
సరే ...ఈ రెండు భోజనాల గొడవ గురించి చెబుతూ ఉంటే ఎప్పుడో చదివిన ఓ జోక్ గుర్తుకొస్తోంది. అది కూడా వినండి మరి ...

ఓ వ్యక్తి డాక్టరు దగ్గరకి వచ్చి, ‘‘ డాక్టరు గారూ ! నేను రోజుకి ఇరవై సిగరెట్లు తాగడానికి అలవాటు పడి పోయేనండీ ...తగ్గించే ఉపాయం చెప్పండి ...’’ అనడిగేడు. దానికి డాక్టరు ‘‘ దానిదేముందిండీ ... విల్ పవరుండాలంతే ... ఇక నుండీ మీరు భోజనం ముందొక సిగరెట్టూ, భోజనం తర్వాత ఒకటీ తాగడం మొదలెట్టండి ...దెబ్బకి కంట్రోలవుతాయి ...’’ అని చెప్పాడు.
చాలా రోజుల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వచ్చేడు. ‘‘ సిగరెట్లు తాగే అలవాటు యిప్పుడు కంట్రోలయింది కదూ మీకు ?’’ అడిగేడు డాక్టరు.
ఆ మనిషి నీరసంగా ‘‘ ఏం కంట్రోలోనండీ ! ... రోజుకి పది సార్లు భోజనం చెయ్య లేక ఛస్తున్నాను.’’ అంటూ
బావురుమన్నాడుట!