15, జులై 2015, బుధవారం

చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...



చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...
నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ.
ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను.
విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే.
ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార పత్రికలూ, ఒక మాస పత్రికా వచ్చేవి. ఊళ్ళో ఒక మనిసిపల్ లైబ్రరీ, మరో శాఖా గ్రంథాలయం ఉండేవి.
నా పుస్తక దాహార్తి అక్కడే తీరేది. ఇక మా చిన్న ఊళ్ళో రాధా గోవింద పాఢి గారని ఒక ఒరియా వ్యక్తి ఉండే వారు. తెలుగు మాట్లాడడం వచ్చు. కూడ బలుకుకుని చదివే వారేమో కూడా. రాయడం వచ్చేది కాదను కుంటాను. వారికి ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఆ పనులతో తెగ బిజీగా ఉండే వారు. దానితో పాటు ఆయన ఆ రోజులలో వచ్చే అన్ని దిన, వార , పక్ష, మాస పత్రికలు అన్నింటికీ కూడా ఏజెంటుగా ఉండే వారు. మెయిన్ రోడ్డులో వారి ఫొటో స్టూడియో కమ్ పుస్తకాల షాపు నన్ను అమితంగా ఆకట్టు కునేది. ఎక్కవ గంటలు అక్కడే గడిపే వాడిని. వారు మా కుటుంబ మిత్రులు కూడానూ. పేపర్లూ, పీరియాడికల్స్ తో పాటు ఆయన ఎన్నెన్నో మంచి పుస్తకాలు కూడా అమ్మకానికి తెప్పించే వారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పాఠశాలలకీ, ఆఫీసు లైబ్రరీలకీ వాటిని విక్రయించే వారు. మంచి పుస్తకాలు తెప్పించడం కోసం వారు ఒక పద్ధతి అవలంబించే వారు. పుస్తకాల ఏజెంటుగా వారికి ఎందరో రచయితలతోనూ, ప్రముఖ సంపాదకులతోనూ మంచి పరిచయాలు ఉండేవి. వారి షాపులోనే నేను చాలా మంది గొప్ప రచయితలను చూసేను. విద్వాన్ విశ్వం, రాంషా వంటి సంపాదకులనూ చూసేను. సోమ సుదర్ గారిని కూడా అక్కడే చూసినట్టు గుర్తు. పాఢి గారు ఆయా రచయితలనూ, సంపాదకులనూ కలిసినప్పుడు తెలుగులో ఏవి మంచి పుస్తకాలంటూ కేటలాగులు ఇచ్చి మరీ వారినుండి వివరాలు సేకరించే వారు. ఆ క్రమంలో నేను కూడా నాకు తోచిన గొప్ప పుస్తకాల గురించి చెప్పే వాడిని. ఈ విధంగా తనకు తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేక పోయినా అమ్మకం కోసం ఎన్నో గొప్ప పుస్తకాలను తెప్పించే వారు. చెంఘిజ్ ఖాన్, అతడు  ఆమె, నేరము శిక్ష , పెంకుటిల్లు, సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటాలు, లత , రావి శాస్త్రి, ముళ్ళపూడి, బీనాదేవి, గోపీచంద్, తిలక్, శ్రీ.శ్రీ, మధురాంతకం రాజారాం, మొదలయిన గొప్ప గొప్ప రచయితల రచనలు తెప్పించే వారు. అనువాద సాహిత్యమయితే లెక్కే లేదు.శరత్ సాహిత్యమంతా ఉండేది.
ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, వారి షాపుకి వచ్చే వార, మాస పక్ష పత్రికలన్నీ ఇలా బంగీ రాగానే ఒక కాపీ నాకు చదువుకోమని ఇచ్చే వారు. విజయ,నీలిమ , యువ, జ్యోతి వంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ప్రభ వంటి వార పత్రికలు షాపుకి రాగానే అమ్మకానికంటె ముందుగా నాకు ఇచ్చేసే వారు. ఏ రోజయినా, నేను షాపుకి వెళ్ళక పోతే, ఆ రోజు వచ్చిన కొత్త పత్రకలను మా ఇంటికి పంపించి వేసే వారు. వీటితో పాటు, అమ్మకానికి వచ్చిన నవలలు, కథా సంపుటాలు, సాహిత్య గ్రంథాలు అన్నింటి ప్రతులు ఒక్కొక్కటి చొప్పున నాకు చదువుకోడానికి అంద చేసే వారు. వీలయినంత వేగిరం, అంటే, తిరిగి ఆయా పుస్తకాలను అమ్ముకునేందుకు వీలుగా ఇచ్చి వేసే నియమం పెట్టే వారు. అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఏ పుస్తకమూ నలగ కూడదు. చిరగ కూడదు.
ఈ నిబంధన కూడా చాలా సున్నితంగా చెప్పే వారు. నేనెక్కడ నొచ్చు కుంటానో అని తెగ బాధ పడి పోయే వారు కూడా.
హైస్కూలు చదువు చదువుకుంటూ, పైసా సంపాదన లేని నా బోటి వాడికి ఆ రోజుల్లో అన్ని పత్రికలు, విలువైన పుస్తకాలు, గొప్ప సాహిత్య గ్రంథాలు అన్నీ కేవలం ఉచితంగా చదివే వీలు కలగడం నా అదృష్టం కాక మరేమిటి చెప్పండి ?
నా పుస్తక దాహార్తిని తీరుస్తూ, నేనొక రచయితగా ఎదిగే క్రమంలో ఎంతగానో దోహద పడి, చేయూత నందించిన ఆ దయామయుని రుణం ఎలా తీర్చు కోగలను ?
ఇంతకీ ఈ కామమ్మ కథ అనే పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో ఇంకా చెప్పనే లేదు కదూ ?
సరే, అలాగ, నా హైస్కూలు చదువు పూర్తయి, తరువాత విజయ నగరంలో భాషా ప్రవీణ చదువు నాలుగేళ్ళూ గడిచే వరకూ వారి దయ వల్ల అసంఖ్యాకంగా పుస్తకాలు ఉచితంగా చదివేను. చదువు ముగిసి, తెలుగు పండితునిగా ఓ చిరుద్యోగం లోకి ప్రవేశించాక కూడా మీరు ఊహించ లేనంత కమీషను డిస్కవుంట్ పొందుతూ వారి నుండి ఎన్నో చాలా మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. చాలా వరకూ అరువు. నెలల తరబడి ఆ వాయిదాలు కడుతూ ఉండే వాడిని. నేనంటే వారికి ఎంత అభిమానమో. ఆ పుస్తకాలు చదివి నేను ఏదయినా పుస్తకం గురించి మెచ్చుకుంటూ పొగిడితే అతనూ పొంగి పోయే వారు. అప్పటి వారి చూపుల్లో అన్నం వడ్డించే అమ్మ కున్నంత ఆదరణ ఉండేది.
ఇంకా ఈ పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో చెప్పనే లేదు కదూ.
మరింక విసిగించను లెండి. వారిచ్చిన ఉచిత పుస్తకాలతో నన్ను నేను ఉన్నతీకరించు కుంటూ ,ఇలా ఓ ముప్ఫయ్ ఏళ్ళు గడిచేక, నేను ఉద్యోగ రీత్యా మా ఊరికి దూరంగా ఉండి పోవలసి రావడం చేత వారిని ఒకటి రెండు సార్లు తప్ప మరి కలియడం జరుగ లేదు. వారి గురించిన వివరాలూ తెలియ రాలేదు.
ఉద్యోగ విరమణ చేసాక, మా అన్నగారితో పాటు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. అప్పటికి అక్కడ మాకు ఇల్లూ, పొలాలూ అన్నీ చెల్లి పోయాయి. తెలిసిన వారు కూడా కొద్ది మందే మిగిలేరు. చాలా ఏళ్ళ అనతంరం మా ఊరు చూడాలనే కుతూహలంతో నేనూ మా అన్న గారూ అక్కడికి వెళ్ళాం.
మా పుస్తకాల మిత్రుడు రాధా గోవింద పాఢి గారిని చాలా సంవత్సరాల తరువాత చూడాలని వారింటికి వెళ్ళాం.
ఆయన లేవ లేని స్థితిలో మంచం మీద ఉన్నారు. మాట కూడా సరిగా రావడం లేదు. అప్పటికి పది, పదిహేను ఏళ్ళ క్రిందటే ఫొటో స్టూడియో, పుస్తకాల షాపూ మూసి వేసారుట. ఆయన బహు కుటంబీకుడు. ఆరుగురు కూతుళ్ళు. ఒక కొడుకు. అందరికీ వివాహాలు చేసారు. ఆర్ధికంగా ఇబ్బంది ఏమీ లేదు. శరీరం సహకరించక ఫొటోల బిజినెస్సూ, పుస్తకాల షాపూ మూసి వేసారుట. నాకీ వివరాలేవీ తెలియదు. తెలుసు కోడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్య లేదేమో. ఉద్యోగం, పిల్లలు, వారి చదువులూ, బదిలీలూ, అమ్మాయిల పెళ్ళిళ్ళూ, పురుడు పుణ్యాలూ ... వీలు చిక్క లేదని సిగ్గు లేకుండా చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి.
మా రాక చూసి ఎంతగానో సంతోషించారు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టు కున్నారు. వారు పడుకున్న మంచం క్రిందకి సైగ చేసి చూపించారు. వంగి , అక్కడ ఏముందా అని చూసి, ఒక పెద్ద పుస్తకాల కట్ట ఉంటే దానిని ముందుకు లాగేను. దళసరి అట్టతో వాటిని పేక్ చేసి ఉన్నారు. వాటి మీద జోగారావు గారికి అని వచ్చీ రాని తెలుగులో రాసి ఉంది. ఉద్వేగం ఆపుకో లేక పోయాను. కళ్ళంట నీళ్ళు ఆగ లేదు. ఎప్పుడో, మామధ్య రాక పోకలు ఆగి పోయినా, దూరాలు పెరిగి పోయినా, వారు పుస్తకాల షాపు మూసి వేసే రోజులలో నాకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు పదిలంగా పేక్ చేసి ఉంచారుట. ఆ తరువాత వారిని నేను కలవడానికి నాలుగు దశాబ్దులకి పైగా పట్టింది. అయినా, వారి మంచం క్రింద నా పేరు రాసి ఉంచిన ఆ పేకెట్ అలాగే పదిలంగా ఉంది. చెక్కు చెదరని వారి అభిమానం లాగా. తరగని ప్రేమలాగా.
వారి గురించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసు కోలేక పోయిన నా అల్పత్వం స్ఫురించి సిగ్గు కలిగింది.
వారు నాకోసం దాచి ఉంచిన ఆ పుస్తకాల కట్టలో సి.నా.రె. గారి ఆధునికాంధ్ర కవిత్వం , సీతా దేవి మట్టి మనుషులు, కుటుంబరావు చదువు, రావి శాస్త్రి గారి నిజం నాటకం, రక్తాక్షరాలు, ఏడుతరాలు, ఊహాగానం ...లాంటి మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎలా వచ్చి చేరిందో ఈ కామమ్మ కథ పుస్తకం కూడా ఉంది.
నా పుస్తకాల గూటి లోకి గువ్వ పిట్టలా వచ్చి చేరి పోయింది.
ఇదీ, కామమ్మ కథ పుస్తకం నా దగ్గరకు వచ్చి చేరిన వైనం.
అయితే, ఈ పుస్తకంలో ఏముందో కూడా చెప్పాలి కదూ. నిజానికి అంత గొప్పగా దాన్ని గురించి చెప్పడానికి లేదు.
శుభము కామమ్మ శుభము కామమ్మా కామమ్మ
శుభ మొంది సామర్ల కోటలో నమ్మా కామమ్మ ... అంటూ పాట రూపంలో సాగి పోయిన నలభై పుటల చిన్ని పుస్తకం ఇది.
సుకపట్ల లక్ష్మయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె కామమ్మ. తల్లి దండ్రులు చిన్నప్పుడే పోవడంతో పిన తండ్రి రామన్న ఇంట అల్లారు ముద్దుగా పెరిగింది. బాల్యం వీడక ముందే తిరుపతి మారయ్యతో వివాహం జరిగింది. పెళ్ళినాటికి భర్త కలక్టరు దొర దగ్గర నెలకు మూడు వరహాల జీత గాడు. దొరతో ఎందుకో మాటా మాటా వచ్చి, కొలువు చాలించు కున్నాడు. తరువాత తల్లి ఎంత వారించినా వినకుండా చెన్నపట్నం వెళ్ళి అక్కడ దొరల దగ్గర మంచి కొలువునే సంపాదించు కున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి మీద మనసు పుట్టి, నాలుగు మాసాలు సెలవు పుచ్చుకుని, ఇంటికి తిరిగి వచ్చేడు. చిత్రమేమిటంటే, వివాహమయినా, అప్పటికింకా భార్య కామమ్మ కాపురానికి రానే లేదు. పెళ్ళవుతూనే కొలువులకి వెళ్ళి పోయేడు మరి. సరే, ఇంటికి చేరిన మారయ్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. మరి కోలుకో లేదు. కామమ్మను చూడాలని కోరేడు. కామమ్మ సారె, సరంజామాతో తొలిసారిగా అత్తింట అడుగు పెట్టింది. తొలి సారి చూపు మంచాన పడిన భర్తను. అదే కడ సారి చూపు కూడా అయింది. తరువాత కామమ్మ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎందరికో తలలో నాలుకగా మెలిగింది. చివరలో కామమ్మ మరణంతో ఊరు ఊరంతా విలపించింది. ఊరి ప్రజలు కామమ్మకు గుడి కట్టి గ్రామ దేవతగా ఆరాధించడం మొదలు పెట్టారు.
స్థూలంగా ఇదీ కామమ్మ కథ. పాట రూపంలో ఉన్న ఈ కథను గాయకులు అప్పట్లో గానం చేసే వారేమో తెలియదు. రచయిత పేరు ఎక్కడా కానరాక పోవడం వల్ల ఈ పాట పరంపరగా సామర్ల కోట ప్రాంతంలో పాడు కునే వారేమో కూడా తెలియదు.
ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం ఎందుకయ్యా అని మీరడుగ వచ్చును.
చిన్ని పుస్తకమే కావచ్చును. కానీ, అది నా దగ్గరకు చేరిన వైనం నా వరకూ చాలా గొప్పది. విలువైనది.
ఒక తియ్యని ఙ్ఞాపకం. ఒక మరపు రాని అనుభూతి. ఒక కన్నీటి తరంగం. ఒక మధుమయిన హృదయ స్పందన.
ఈ చిన్ని పుస్తకం కామమ్మ కథను చూస్తూ ఉంటేనాకు నా మిత్రుని చూసి నట్టే ఉంటుంది. పలకరించి పులకరించి పోతున్నట్టుగా ఉంటుంది...
నా పుస్తకాల గూటిలో ఆ గువ్వ పిట్ట మంద్రంగా కువలాడుతూనే ఉంటుంది ...
అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీనూ ...



13, జులై 2015, సోమవారం

హా ! దొరికెన్ !



హమ్మయ్య ! దొరికిందండీ, ఇన్నాళ్లకి !

పఠాభి ‘ ఫిడేలు రాగాల డజన్ ’ పుస్తకం ఓ మిత్రుని ఇంట దొరికింది. మద్రాసు రామరాయ ముద్రణాలయం వారు వేసిన ఈ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించ బడిందో వివరాలు ప్రచురణ కర్తలు ఇవ్వ లేదు. శ్రీ. శ్రీ ధర్మమా అనీ, ఇది ప్రమాది అధిక శ్రావణ మాసంలోనో, కాస్త అటూ ఇటూ గానో వెలువడి నట్టుగా భావించ వచ్చు. దానికి సరిపోయిన ఇంగ్లీషు సంవత్సరం చూసుకుంటే సరి. వెల మాత్రం‘‘ డజన్ అర్ధణాలు’’ అని ఉంది. అంటే ఆరు అణాలని తాత్పర్యం ! అనగా పావలా బేడ. అనగా అర్ధ రూపాయికి రెండణాలు తక్కువ. అనగా, నలుబది ఎనిమిది కానులు. అనగా ... అనగా .... అనగా ....

పాత ఎక్కాల బుక్కు మీరే చూసుకోండి.

కవి ఈ పుస్తకాన్ని వచన పద్యములు అని పేర్కొన్నాడు. నేను తెలుగులో పీ.జీ

చేసి నప్పుడు ఫిడేలు రాగాల డజన్ కోసం చాలా వెతికాను, ఎక్కడా కాపీలు నాకయితే దొరక లేదు. ఇందులోని కవితలను ( వచన పద్యములను ? ) అక్కడా ఇక్కడా చూసి, ఎత్తి రాసుకొని బండి లాగించీసేను. ఇప్పుడు దొరికింది, ఈ చిన్న పుస్తకం. ఎలా ఉందో చూసారూ ? పఠాభి రచన మీద చెదలు తమ అభిప్రాయం చెప్పాలని అనుకుని, మధ్య లోనే విరమించు కున్నట్టున్నాయి. మహా భారతంతో పాటూ, మహా ప్రస్థానం వరకూ అవి ఇలాగే తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా తెలియ జేస్తూ ఉంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండక పోతే !

పుస్తకం అట్ట మీద - ‘‘చదవండి ఫిడేలు రాగాల డజన్ ’’ అని ఉంది. కింద చిన్న ఫిడేలు బొమ్మ చూసారు కదూ. ఇక్కడ కొంత కొంటె దనం. అప్పట్లో కొత్త దనం- కన బరిచారు. ఫిడేలు బొమ్మ కింద రాగాల డజన్ అని ముద్రించారు. కింద చలం గారి మాటలు ... వెనుక అట్ట మీద విద్వాన్ విశ్వం గారివీ, వేదుల (సత్య నారాయణ శర్మ) వారివీ , మాటలు ఉన్నాయి. తర్వాత,

ఆంధ్ర పత్రిక వారివీ, కథాంజలి వారివీ అభిప్రాయాలు కూడా వేశారు.

ఆ కింద చివరాఖరిగా ఎర్రక్షరాలతో రాగాల డజన్ కాదు, దీన్ని రోగాల డజన్ అనాలి. అని B.R.R గారు అభిప్రాయ పడ్డారు. ( వీరెవరు చెప్మా ? )



పుస్తకములు దొరుకు స్థలము : నమ్మాళ్వారు, పోస్టు బాక్సు 251, మద్రాసు అని ఉంది.

అంకితము మృణాళినికి, కాదు కల్యాణికి ; కాదు ఇరువురికి అని ఉంది.

కవి గారే రాసారో, ముద్రాపకులే రాసారో కానీ అంకితం తరువాతి పేజీలో ఇలా ఉంది:

‘‘అక్కడక్కడ ఈ పద్యాలలో వచ్చునట్టి పఠాభి అనే పేరు గల పాత్రకు, గ్రంథ కర్తకు

ఏ మాత్రం సంబంధం లేదని గమనింపు ; ‘‘ కృష్ణ పక్షం’’ లోని ‘‘ కృష్ణ’’ కును, దాని గ్రంథ కర్త నామం లోని ‘‘కృష్ణ’’ కును ఏలా సంబంధం లేదో అలాగే. ’’



ఇక, ఇంట్రో శ్రీ.శ్రీ రాసేరు. శ్రీ.శ్రీ నవ కవుల తిరుగు బాటుని గురించి రాస్తూ ఫిడేలు రాగాల డజన్ చదవమని సలహా ఇచ్చాడు. 38 పేజీలున్న ఈ చిన్ని పుస్తకంలో పుటల సంఖ్య లన్నీ తెలుగు అంకెలే వేసారు.

ఫిడేలు రాగం పద్యం ఇదీ .....

చూడండి.



ఫిడేలు రాగమ్ ఫిడేలురాగమ్

ఫిడేలు రాగమ్బులు

వినూతన పదప్ రేమికులు , మహా కాముకులు ;

అన్ యోన్ యమగు దమ్ పతులు కూడ;

ఫిడేలన్ నది,, ‘‘ మయ్డియ రాగ్రా

మీ వారన్దరు సనాతనాచార్ యుల్

ముఖమ్విరిచి, ఇన్ గ్ లీష్టానిని

నన్ ను న్జేపట్ టవద్ దని

గద్ దిన్చినా కూడ నీవు

మహా సాహసన్తో, రుమాన్ టిక్ గా

మ్ యారేజ్జేసుకొన్ నావు గదా ! స్ వీట్ హార్ ట్ ! ’’

రాగమ్ అనినాడు

‘‘థ్ యాన్ క్ స్ టు పఠాభి

నా కతడు ధయ్రిన్గా

సహాయమ్ జేయ పట్ టి మనకు

వివాహమయిన్ ది డార్ లిన్ గ్ !’’



ఫిడేలు రాగమ్బులు ఆదర్ శమగు జమృతులు

తటాల్ మని కలకన్ ఠ మున, ఫిడీలీలా

స్ ర శ్ ని న్ చినది. ‘‘ రాగా డియర్నన్ ను

నిజన్గా ప్ రేమిస్ తావా నీవు ?

ఏమ్ మాటన్టున్నావు ఫిడేలీ జీవితేశ్ వరీ!

నా జన్ మనీలో లీనమయి పోయిన్ది,

సన్ ఘమ్ నన్ వినా గూడా

నిన్ను చేపట్టినన్ దుక్నాకు , వచిమ్ప రాని

సవుఖ్ యమ్’’ ఫిడీలు చిత్ తతస్త్రులు

ఆపనందంతో మ్ రోగినవి.



రాగమ్ అంత ఫిడీలీని గాఢమ్ గా

కన్గిలించాడు. తర్వాత వారి

దేహాలు న్నే కమయినాయి సరళ శయ్యన్.

అపూర్ వమ్ బగు అన్దంబగు సన్తానమ్ వారికి

జనిన్చి అసన్ ఖ్ యాకముగ ; --- వారన్తా

పఠాభిని గని ‘‘ తాతా తాతా ’’ అనే వారు.



----------



దీనికి టీకా టిప్పణులు చెప్పడానికి శ్రీ. శ్రీ లేడు. ఆరుద్రా లేడు. రోణంకీ లేడు.

తెలిస్తే ఎవరయినా చెబుదురూ .......



అప్పుడు .... హా దొరికెన్ ! అని ఊరుకోకుండా, హా ! తెలిసెన్ ! అని కూడా అనుకుంటాను.

బాబ్బాబు ! ఎవరయినా పుణ్యం కట్టుకుందురూ !


ఎందుకయ్యా వెక్కి వెక్కీ ఏడ్చినావూ ?!




యే నామ కేచిదిహ న: ప్రథయం త్యవఙ్ఞాం
జానంతి తే కిమపి తాన్ర్పతి నైష యత్న:
ఉత్పత్స్యతే మమ తు కో2పి సమాన ధర్మా
కాలో హ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ

నా రచన చదివి, దాని మీద ఆదరం లేని వారికి ఒక్క మాట చెబుతున్నాను. ఈ రచన మీ కోసం చేసినది కాదు. కాలం అనంతమయినది. నేల తల్లి చాల విశాలమైనది. నా కావ్య గుణ ధర్మాలను వెల కట్ట గల రసికుడు ఎక్కడయినా ,ఎప్పుడయినా పుట్టక పోడు సుమా !

మంచి కవిత్వాన్ని ఆదరించ లేని కొందరు సమ కాలికుల గురించి మన కవులు ఈ విధంగా వాపోవడం జరిగింది.

చేమకూర వేంకట కవి ఏ గతి రచియించి రేని సమ కాలము వారలు మెచ్చరే గదా ? అని రవంత బాధ పడిన సంగతి తెలిసినదే కదా.

అరసికేషు కవిత్వ నివేదనమ్ మాలిఖ మాలిఖ మాలిఖ అని ఓ కవి ఓ బ్రహ్మ దేవుడా, రసికులు కాని వారికి నా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం నాకు ముమ్మాటికీ కలిగింకయ్యా. నా నుదుటున అలాంటి రాత రాయకయ్యా అని వాపోయేడు.

గురజాడ కూడా,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటావీవు నీవిక
మెచ్చకుంటే మించి పాయెను ...

అని ఊరుకోకుండా,
కొయ్య బొమ్మలు మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా ?
అని ఓ చురక కూడా వేసాడు.

కవితా మాధురి సంగ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబు గా
దు, విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్ , వహ్వరే !
కవిరాజా !’’ యని మెచ్చి యిచ్చు నృపుఁడొక్కండైనఁగర్వైనచో
కవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !

ఈ విధంగా తిరుపతి కవులు అరసికులయిన ప్రభు వులున్న లోకంలో కవిగా పుట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని బాధ పడిన సందర్భమూ లేక పో లేదు.

శ్రీనాధుడు కూడ, భీమేశ్వర పురాణంలో ఇలాంటి వారి గురించే కుకవి నింద చేసాడు ...

బోధమల్పంబు గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరము మచ్చరము ఘనము
కూప మండూకములఁబోలె కొంచెమెఱిఁగి
పండితమ్మన్యులైన వైపండితులకు

తెలిసింది తక్కువా, గర్వమా, ఎక్కువా. . నిదానం లేదు. మాత్సర్యమా, జాస్తి. నూతిలో కప్పల్లాంటి
వారు ఈ పండితమ్మన్యులు.

ఎందుకయ్యా ఏడుస్తున్నావు ? అంటే, ఎదుటి వాడు గొప్పోడైపోతున్నడ్రోయ్ బాబోయ్ ... అని ఏడిచే మగానుబావులు అన్ని కాలాల లోనూ ఉంటారని చెప్పడానికి మచ్చుకి రెండు మూడు ఉదాహరణలివి.


12, జులై 2015, ఆదివారం

తిరగబడు ! ( విప్లవం ఎంత మాత్రమూ కాదు ! )




ఈ శ్లోకంలో చమత్కారాన్ని చూడండి ...

సాక్షరా విపరీతాశ్చేత్ , రాక్షసా ఏవ కేవలం
సరసో విపరీతో2పి , సరసత్వం న ముంచతి.

అక్షరాస్యులు విపరీతులయితే , అంటే దుర్మార్గపు వర్తనులయితే , రాక్షసులవుతారు. వారి చదువు చట్టుబండలై , మహా దూకుడుకుగా తయారవుతారు.

అంతే కదా, సాక్షరులు అంటే అక్షరాస్యులు. శ్లోకంలో సాక్షరా అనే పదాన్ని తిరగేసి చదవండి రాక్షసా
( రాక్షసులు) అని రావడం లేదూ !

అయితే, సరసుల (పండితులు ) తలక్రిందులయినా , అంటే , ఎట్టి పరిస్థితిలోను కూడా , తమ సరసత్వాన్ని వీడరు.

శ్లోకంలో రెండో పాదం మొదటి పదం చూడండి. దానిని సరస: , విపరీత: అపి అని చదువుకోవాలి.

ఇప్పుడు చూడండి ... సరస అనే పదం వెనుక నుండి చదివినా మారడం లేదు. కదూ ?

చదవేస్తే ఉన్న మతి పోతుంది కొందరికి. చదువుకున్న మూర్ఖులుగా తయారవుతారు. కొందరు మాత్రం ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణాన్ని కలిగి ఉంటారు. అదన్న మాట సంగతి.

10, జులై 2015, శుక్రవారం

మీకెప్పుడయినా ఇలాంటి ( పీడ ) కల వచ్చిందాండీ ? !


కింవాససైవం న విచారణీయం ,
వాస: ప్రధానం ఖలు యోగ్యతాయా:
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం
దిగంబరం వీక్ష్య విషం సముద్ర:

‘నాకు బట్టల మీద అంత శ్రద్ధ లేదండీ, అయామ్ వెరీ సింపుల్. ’ అంటారు కొందరు కించిద్గర్వంగా. మేచింగుల కోసం , బట్టల సెలక్షన్ కోసం ఆడవాళ్ళు వెచ్చించే సమయం అంతా యింతా కాదు. గణితం వేస్తే గుండె

తరుక్కు పోతుంది. కొందరు మగవాళ్ళూ దీనికి మినహాయింపు కాదు. ఈ శ్లోకం గురించి చెప్పుకునే ముందు ఆ మధ్య నా కొచ్చిన గమ్మత్తయిన కల గురించి చెబుతాను వినండి. ఆ కల రావడం నిఝ్ఝంగా నిఝం సుమండీ ...
ఏదో ఓ మహా పట్టణంలో రోడ్డు మీద నడుస్తున్నాను. ఓ బట్టల షాపు ముందు పేద్ధ బోర్డొకటి కనిపించింది. దానిమీద ఏం రాసుందో నాకు మెళకువ వచ్చేక కూడా అక్షరం పొల్లు పోకుండా గుర్తుంది. చూడండి ...

రండి ! రండి !
యువకులారా ! యువతుల్లారా !

దయ చేయండి. మా వద్ద చిరిగినవీ, లెక్క లేనన్ని మాసికలు వేసినవీ, అట్ట కట్టి అలుగ్గుడ్డలా ఉన్నవీ, వెలిసి పోయినవీ, చీకి పోయినవీ, మీరే లెక్క పెట్టడానికి విసుక్కునేటన్ని జేబులు కలవీ అయిన రక రకాల కొత్త జీన్ ఫేంట్లు సరి కొత్త స్టాక్ వచ్చింది. త్వర పడండి. జీబురు గడ్డం వాళ్ళకీ, తల మాసిన వాళ్ళకీ , నిక్క బొడుచుకున్న తల వెండ్రుకలు కలవారికీ ప్రత్యేక డిస్కౌంటు కలదు. ఆలసించిన ఆశా భంగం ...

మరో క్షణంలో అక్కడ చేరిన వేలాది మంది కుర్రాళ్ళని కంట్రోలు చేయ లేక పోలీసులు లాఠీ చార్జి చేయడం జరిగింది. బాష్పవాయు ప్రయోగం కూడా జరిగింది. కుమ్ములాటలో అంతా కకావికలై పోయేరు. చాలా మందికి గాయాలయ్యాయి. నానా  గలాభా  జరిగిందక్కడ. ఆ వింత చూస్తున్న నా నుదుటి మీద కూడా ఓ దెబ్బపడడంతో మెళకువ వచ్చింది. ( మెలకువ వచ్చేక తెలిసింది. తలకి మంచం కోడు తగిలిందని )

ఇది సరదాకి రాసింది కాదు. నమ్మక పోతే నేనేం చేయను ? త్వరలో ఇలాంటి (పీడ) కలలు
మీకూ రావాలని ఉడుకుమోతుతనంతో శపించడం తప్ప ?

ఇక, శ్లోకం చూదాం ...

ఎలాంటి బట్టలు కట్టుకుంటేనేం అని అనుకోడం తగదు సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే, లోకం లో ఒక మనిషి యోగ్యతను అతను వేసుకున్న బట్టలను బట్టే నిర్ణయించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

క్షీర సాగర మథనం జరిగేటప్పుడు శ్రీ మహా లక్ప్మితో పాటు, కాలకూట విషం కూడా పుట్టిందని తెలిసిన విషయమే కదా ? అయితే, సముద్రుడేం చేసాడో చూడండి ...
పీతాంబరధారికి ( మహా విష్ణువుకి ) తన కూతురు రమని ఇచ్చేడు. దిగంబరుని (శివుడిని ) చూసి ఈ మొఖానికిది చాలునులే అన్నట్టుగా కాలకూట విషాన్ని ఇచ్చేడు.

లోకం ఇలా ఉందండీ బాబూ , ఏం చేస్తాం !

మహాత్మా గాంధీ ఓ సారి రౌండ్ టేబిలు సమావేశానికి గావంచా కట్టుకుని పై మీది కండువాతో వెళ్తే అక్కడ వాళ్ళతనిని పోల్చుకో లేక లోపలకి పోనివ్వకుండా తరిమేసారుట.
అప్పుడు గాంధీజీ మంచి సూటు బూటు వేసుకుని వస్తే ఆదరంగా లోపలికి పంపించేరుట. సరే, లోపలికి వెళ్ళాక, విందు మొదలయితే, గాంధీజీ ఆహార పదార్ధాలను తినడం మానేసి తొడుక్కున్న ఖరీదయిన కోటు మీద వేసుకోడం మొదలెట్టారుట. ఇదేం పిచ్చి పని అని అందరూ విస్తుపోతే  ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపింది నా కోటుకే కాని, నాకు కాదు కదా ! దాని విందు నేనెలా తింటాను ? అనడిగారట. అక్కడి అధికారులకి కొంచెం ఆలస్యంగా ట్యూబు లైటు వెలిగి, మహాత్ముని క్షమాపణలు వేడుకున్నారుట. ఈ కథ నిజమో కాదో కాని, చిన్నప్పుడు మా డ్రిల్లు మాష్టరు (ఆటలాడించడం మానీసి మరీ ) కథలు కాకరకాయలు చెప్పేటప్పుడు దీనిని మాకు చెప్పారు. 

ఈ కథలో గాంధీకి బదులు ఈశ్వర చంద్ర విద్యా సాగర్ అని సరిచేసుకోవాలని మిత్రులు  శ్రీ ఫణీంద్ర రామ కుమార్ వ్యాఖ్యలో చెబుతున్నారు. వారికి నా ధన్యవాదాలు !
  శ్లోక సందర్భానికి సరి పోతుందనిపించి చెప్పానంతే ...
(ఇక్కడ పొందుపరచిన కార్టూన్ గీసిన  వ్యంగ్య చిత్రకారునికి వందనాలు. పాపం, అతనికీ ఇలాంటి పీడ కల ఏదో వచ్చి ఉంటుంది ! )


9, జులై 2015, గురువారం

నవ్వి పోదురు గాక !



కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.

ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.

అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !

అలాంటివాటిని కొన్నింటిని చూదాం !

వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:

ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.

‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.

మరొకటి -

కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !

మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!

భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:

ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.

ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:

గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:

అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:

కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:

పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:

అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం

తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .


మరొకటి చూడండి:

తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి

కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !

చివరగా ఇంకొకటి ...

క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:

ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.







7, జులై 2015, మంగళవారం

మా వెటకారపు వేంకటేశ్వర్లు మీకు తెలీదూ ?!



మా వెటకారపు వెంకటేశ్వర్లుని మీకు పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందు కంటే, వాడికి మామ్మూలుగా మాట్లాడడం తెలీదు. మాట మాటకీ ఏదో వెటకారం దొర్లాల్సిందే.

వాడి ఆహార్యం లోనూ, అహారపు టలవాట్ల లోనూ కూ డా వెటకారమే.
గొట్టాం ఫేంట్ల ఫేషను పోయేక , వాడు గొట్టాం పేంట్లు కు ట్టించుకుని మరీ తిరుగుతాడు.
ఏనుగు చెవుల కాలర్లు పోయేక , వాడు ఏనుగు చెవుల కాలర్లున్న పర్టులు కుట్టించుకుని తిరుగుతాడు.
అలా కుట్టడానికి  నసుగుతూ ఏ టైలరయినా, ‘‘ ఇప్పుడవి ఫేషను కాదండీ! ’’ అంటే, ‘‘నీకు చేత కాక పోతే చెప్పు, మరొకడితో కుట్టించు కుంటాను ’’అని దబాయిస్తాడు.
ఇక భోజనం చేసే విషయంలో కూడా, పంక్తిలో కూచుంటాడా. ముందుగాపెరుగు తే, కలుపు కుంటానంటాడు. ఆ తరువాతే కూరా, పులుసూ. పప్పూనూ.
అప్పడాలో డజను వేయించుకుని, అరచేత్తో వాటిని  ముక్కలయ్యేలా చిదిపి. నవ్వుతూ ‘‘ ఈ చప్పుడు విన్నారూ ? ’’ అంటాడు.
వాడి  వెటకారాల సెగ వాడి పెళ్ళానికి కూడా బాగా తగిలింది.
కాళ్ళకి రెండు రకాల చెప్పు లేసుకోమని సలహా ఇస్తాడు. ఒకటి హైహీల్సూ, మరొకటి మామూలుదీ. అలాగయితే ఎత్తు పల్లాలున్న చోట బ్యాలెన్సు సరిపోతుందంటాడు !
కుడి పైట వేసుకుని తిరగమంటాడు. పువ్వులు కొప్పులో కాదు, చెవిలో పెట్టుకుంటేనే ఆడవాళ్ళకి అందం అంటాడు.
ఈ తిక్క మనిషితో వేగ లేక ఆవిడ కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి పోయింది కూడానూ.
అలాగని వాడికి పిచ్చేమీ కాదు.  లోకంలో అందరూ నడిచే దారిలో నడిస్తే మన విలువేంటని వాడి వాదన. ( దీనికే మారు పేరు పిచ్చి కాబోలు )

ఇక వాడి మాట తీరు ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చెబుతాను :
 ‘‘ ఏఁవండీ ఈ నెల జీతాలు అందేయా ? ’’ అని సమోద్యోగి ఎవడయినా అడగడం పాపం, ‘‘నా జీతమే అందింది. నీజీతమే నాకు అంద లేదింకా ’’అంటాడు.
‘‘ మీ పిల్లలేం చదువుతున్నారండీ ’’ అని ఎవరయినా అమాయక చక్రవర్తి అడిగితే, టక్కున ‘‘ పుస్తకాలు’’ అని ముక్త సరిగా జవాబిస్తాడు.
‘‘అది కాదు ! .. ... ఏం చదువుతున్నారూ ? ’’ అని రెట్టించి అడిగితే, ‘‘ క్లాసు పుస్తకాలు .. అప్పుడప్పుడు  నవలలూ, వార పత్రికలూనూ ’’ అని వాడి నుండి జవాబొస్తుంది.
‘‘ఏఁవండీ .. ఫలానా సినిమా చూసారా ? ఎలా ఉంది ?’’ అనడిగితే, ‘‘ తెలుగులోనే ఉంది ’’ అని జవాబు చెబుతాడు
‘‘ ఇవాళ మీ ఇంట్లో కూరేం చేసారూ ’’ అని ముచ్చట పడి అడిగితే ‘‘ తిన్నాం !’’ అంటాడు ముక్తసరిగా.

కూరల కోసం, కిరాణా సామాన్ల కోసం బజారు కెళ్తూ, ‘‘ ఏమేవ్ ! అలా ఆకాశానికెళ్తా కానీ, వో బస్తాడు డబ్బులు నాముఖాన తగలెయ్యి ! ’’ అని పెళ్ళాన్ని కేకేస్తాడు.
అదేఁవిటండీ చోద్యం ! అని ఆవిడ విస్తుపోతే ..
‘‘ అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయిట కదే ... అందుకే మరి బజారంతా అక్కడే ఉంటుంది కాబోలునే ’’ అంటాడు.
బయటికి వెళ్ళేటప్పుడు కూడా, ‘‘ ఏఁవే, అలా తిరిగొస్తాను కానీ, తలుపు తీసుకుని ఏడువ్ .. ఏదొంగ వెధవయినా చొరబడాలి కదా ’’ అంటాడే తప్ప, తలుపు వేసు కొమ్మని జాగ్రత్తలు  మాత్రం  తిన్నగా చెప్పడు !
పెళ్ళాం ఎప్పుడయినా వాడితో  ‘‘ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాటండీ ! వెళ్దాం ! ’’ అని ముచ్చట పడి  అడిగితే,  వెళ్దాం కానీ,  పక్కకింటి ముస్లిం స్నేహితురాలి నడిగి బురఖా తెమ్మంటాడు.
ఎందుకండీ అంటే ‘‘ కుటుంబ సమేతంగా చూడతగిన తెలుగు సినిమాకెళ్తున్నాం కదా, ,, హాల్లో ఎవరయినా గుర్తు పడితే బావుండదు !’’ అని వెటకారాలు పోతాడు.
‘‘ పిచ్చాసుపత్రి నంబరు డైరీలో ఉందో లేదో చూసుకోవే, పనికొచ్చేలా ఉంది ’’  అంటాడోసారి.
‘‘ఎందుకండీ ?’’ సందేహంగా అడుగుతుంది భార్య.
‘‘ యువ కవి వొహడు ఉదయాన్నే తన కవితల పుస్తకంతెచ్చి చదవమని ఒకటే నస ...చదవాలి ..  తరవాత నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఏఁవిటో’’ అని నిట్టూరుస్తాడు.
‘‘ నా రచనలు కాస్త చదివి పెడతారూ ?’’ అని ఏ అర్భకుడయినా అడిగితే,
‘‘ చదవను ! కానీ  ( ప్రక్కన ) పెడతాను.’’ అంటాడు దురుసుగా.

‘‘ పెళ్ళి కెళ్ళొచ్చేరుగా ! ఎలా జరిగిందేఁవిటి ’’
‘‘సవ్యంగానే జరిగిందనుకుంటున్నాను .... ఎందుకంటే, పెళ్ళి కొడుకు  పెళ్ళి కూతురు మెడలోనే మంగళ సూత్రం కట్టేడు ’’
వీడి వెటకారాలు మామ్మూలుగా తెలిసిన వాళ్ళతోనే కాదు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా అందరితోనూ ఇలాగే మాట్లాడుతాడు !
ఓ సారి  తెలిసిన డాక్టరు దగ్గరి కెళ్ళాడు. ఆయనతో మన వాడికి కొంచెం ఎక్కువ చనువు కూడా ఉంది లెండి
‘‘ఏఁవయ్యా డాక్టరూ !  వారం నుండీ వొకటే జలుబు !  నువ్వే వైద్యం చెయ్యలి ... చెప్పు, పీ.ఎఫ్ లోను పెట్టమంటావా ? పొలం అమ్మమంటావా ’’ అనడిగేడు.
 ( దానితో తిక్క రేగిన ఆ డాక్టరు వాడి జబ్బ అందుకుని నెల్లాళ్ళ వరకూ తగ్గకుండా ఉండేలా వో ఇంజక్షను పొడిచీసేడనుకోండి ! )

ఇదీ మనవాడి వెటకారపు గోల.

కొస మెరుపు :
‘‘ నీ పద్దతి మార్చుకోవయ్యా ... యిదేం బాలేదు .. ఇంతకీ ఇలా వెటకారంగానూ, పిచ్చ పిచ్చగానూ మాట్లాడడం నీకు చిన్నప్పటి నుండీ ఉందా ? ఈ మధ్య మొదలయిందా ? ’’ అనడిగేను, జాలిగా, వాడిని సంప్కరించే సదుద్ధేశంతో.

 వాడు దీనంగా ముఖం పెట్టి అన్నాడు :  ‘‘ మొదటి నుండీ లేదండీ ! ... మీ కథా మంజరి బ్లాగు టపాలు చదివిన తరువాత నుండీ నండీ ... ’’ అన్నాడు వినయంగా.

ఈ సందర్భంగా నాకు మన కవుల  చమక్కు సంభాషణలు కొన్ని గుర్తుకొస్తున్నాయి.
పనిలో పనిగా అవి కూడా చూదాం !
‘‘ ఏఁవండీ ఎక్కడికి బయలు దేరారూ ... ఊరికా ! ’’
‘‘ అవును. ఊరికే.’’
***       *****     ****    ****   ****   *****   ****   ****
‘‘ ఈ రోడ్డెక్కడికి పోతుందీ ? ’’
‘‘ ఎక్కడికీ పోదు ! నాచిన్నప్పటి నుండీ చూస్తున్నాను . ఇక్కడే ఉంది !‘’
***   ****     *****     *****     *****    *****   ****
‘ రామయ్య గారిల్లెక్కడండీ ?’’
‘‘ ఆయనకేం పనీ ! పైగా పెద్ద మనిషి కూడానూ !’’
****                 ******                      *****                       *****
సర్వరూ! ఈ కాఫీలో బొద్దింక పడి నట్టుంది చూడూ ... కాఫీకే డబ్బులిస్తాను. బొద్దింకకు ఇవ్వను సుమీ.’’

*******              *******                      *******                  ******
‘‘నా కవిత్వంలో మరి కొిన్ని నిప్పులు కక్కమంటారా  టారా ? ’’ యువ కవి అడిగేడు.
‘‘ వద్దు. నీ కవిత్వాన్నే నిప్పుల్లో కుక్కు’’ మహా కవి సలహా.



6, జులై 2015, సోమవారం

చిట్టి పాప రాసిన పొట్టి కథ !



దొంగ గారు

మ్మ కథలు చెబుతుంది. అమ్మమ్మ కథలు చెబుతుంది. తాతయ్య కథలు చెప్పడమే కాదు చక్కని చిన్న చిన్న పద్యాలూ, శ్లోకాలూ కూడా చెబుతాడు. నాన్న కథలు చెప్పరు, కానీ, కథలు రాస్తారుట ! నేను చదవ లేదనుకోండి ... పెద్దయితే చదువుతానులే.

అంచేత, నాకూ కథ రాయాలనిపించింది. వెంఠనే పెన్సిలు తీసుకుని నోటు పుస్తకంలో గబగబా రాసీసేను.

కథ పేరు : దొంగ గారు

అనగనగనగా నేమో ఒక ఇల్లు. అందులో అమ్మా, నాన్నా, అక్కా, నేనూనూ.

ఒక రాత్రేమో అమ్మా వాళ్ళింటికి, అంటే మా ఇంటికే లెండి ఒక దొంగ గారు వచ్చేరు. అంతా బజ్జుని ఉన్నాం.

దొంగ గారు మా ఇంటిలో డబ్బూ బంగారఁవూ అదీ పట్టుకు పోడానికి వచ్చేరన్న మాట.

అందరం లేచి దొంగ గారిని చూసేం. దొంగ గారు కూడా మమ్మల్ని చూసేరు.

‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మా ఇంటిలో కొంచెమే డబ్బు లున్నాయి. మా చిట్టికి పుస్తకాలూ, రంగు పెన్సిళ్ళూ అవీ కొనాలి. మా డబ్బులు పట్టుకు పోవద్దండీ ’’ అని, నాన్న దొంగ గారితో అన్నారు.

అమ్మేమో, ‘‘ చిట్టి పాపకి బోర్నవిటా, నూడిల్సూ, పుట్టిన రోజుకి బుట్టల గవునూ అవీ కొనాలి. మా కొంచెం డబ్బుని మీరు పట్టుకు పోవద్దూ ’’ అనంది.

అక్కేమో,‘‘ చిట్టి పాపకి రిబ్బన్లూ, జడ పిన్నులూ కొనాలి. మా ఇంట్లో కొంచెమే డబ్బులున్నాయి. తీసుకు పోవద్దూ, ప్లీజ్ !’’ అంది.

దొంగ గారు విన లేదు. ‘‘ మా చిన్నబ్బాయికి బువ్వ పెట్టాలి. నా దగ్గర డబ్బుల్లేవు. అందుకే మీ కొంచెం డబ్బుని తీసుకు పోతాను’’ అన్నాడు కోపంగా.

అప్పుడు నేనేమా ధైర్యంగా దొంగ గారి దగ్గరకి వెళ్ళి, ‘‘ దొంగ గారూ, దొంగ గారూ ! మరేమో, మా అమ్మ రోజూ దేవుడికి పూజలు చేస్తే, దేవుడు మాకు కొంచెం డబ్బులు యిచ్చేడు. ఇంకా ఎక్కువ పూజలు చేస్తే యింకా ఎక్కువ డబ్బులు యిస్తాడన్న మాట.

మరందు చేత మీరు కూడా ఆంటీకి చెప్పి దేవుడికి ఎక్కువ పూజలు చేయమని చెప్పండి. దేవుడు మీకూ బోలెడు డబ్బులు ఇస్తాడు. మా కొంచెం డబ్బులు ఇప్పుడు తీసుకు పోకండేం ... దేవుడు మీకు చాలా డబ్బులు యిచ్చేక ఆంటీకీ,తమ్ముడికి మంచి బువ్వ పెట్టొచ్చును. మీరు కూడా ఈ మురికి బట్టలు మానీసి మంచి బట్టలు కుట్టించుకో వచ్చును...’’ అన్నాను.

దొంగ గారు నాముఖంలోకి చూసి, నా దగ్గరకొచ్చి. నాబుగ్గ మీద ముద్దు పెట్టీసుకున్నారు.

మరింక మా కొంచెం డబ్బులు తీసుకు పోకుండానే వెళ్ళి పోయేరు.

****** ***** ***** ***** ***** ***** *****

నాన్న నేను రాసిన ఈ కథ చదివి, అమ్మకు చూపించేరు. అమ్మ కూడా చదివింది. ఇద్దరూ ఎందుకో చాలా సేపు పడి పడి నవ్వేరు.

తరవాత నాన్న అన్నారూ : ‘‘ కథ బావుందమ్మా ,,, కానీ దొంగని దొంగ గారూ, దొంగ గారూ అని ఎందుకు రాసేవు. దొంగ  అనో, దొంగ వెధవ అనో రాయొచ్చు కదా ? అలా   రాయలేదేం ?’’ అనడిగేరు.

అందుకు నేను చెప్పేనూ : ‘‘అమ్మో ! నాకు బయ్యం ! ...’’



5, జులై 2015, ఆదివారం

వొక్క చెత్త కార్టూన్ వెయ్యడం రాదు ! నువ్వేం కార్టూనిష్టు వయ్యా ?!



 తర్వాత,  చెప్ప లేదంటనక పొయ్యేరు సుమీ ! .. ఈ టపా పాతదే ... కానీ. సరసి గారి గీతా ప్రపంచం నిత్య హరితం. నవ నవోన్మేషం. ఈ తర్వాత కూడా మన సరసి గారు వందలాది కార్టూనులు వేసారు. వేస్తూనే ఉన్నారు. ఇటు అచ్చులోనూ, అటు అంతర్జాల పత్రికలలోనూ  వీరి కార్టూనులు అసంఖ్యాకంగా వస్తూనే ఉన్నాయి. అంచేత, సరసి గారి పుట్టిన రోజు సందర్భంగా మరో సారి  ఈటపా మళ్ళీ వెలుగు చూస్తే తప్పు లేదు కదా !

చదవండి మరి .....

తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచే వ్యక్తి, ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఎక్కడా తూలి పడి పోకుండా నడిస్తేనే కదా, అతడు ఆ విద్యలో విజయం సాధించి నట్టు !
రంజకం అంటుకుని, ఝయ్ ఝయ్ మని వెలగడం మొదలు పెట్టిన చిచ్చు బుడ్డి అంత లోనే తుస్సుమంటే అదోలా ఉంటుంది.
బ్రహాండమయిన పబ్లిసిటీ ఇచ్చిన చిత్రరాజం మొదటి రీలే మొహం మొత్తేస్తే రెండో ఆట వేసే ప్రసక్తే ఉండదు కదా.
గొప్ప ఆర్భాటాలకు నీరసమైన ముగింపులు అందగించవు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక కార్ట్యూన్ల పుస్తకంలో మొదటి కార్టూను నుండి చివరి కార్టూను వరకూ కూడా పొట్ట పగిలేలా నవ్వించ గల కార్టూన్ల పుస్తకం దొరికితే ఎంత బావుంటుంది చెప్పండి?
ఆ ముచ్చట నిశ్చయంగా నూటికి రెండు వందల పాళ్ళు తీర్చ గల మంచి కార్టూన్ల పుస్తకాలు - సరసి గారి కార్టూన్ల పుస్తకాలు రెండూనూ.
సరస్వతుల రామనరసింహం గారు సరసి అనే కలం పేరుతో రెండు కార్ట్యూన్ పుస్తకాలు ప్రచురించారు.
ఇప్పటికే వందలాది కార్ట్యూన్ అభిమానుల పొట్టలు చెక్కలు చేసిన నేరానికి సరసి గారు ఇలాంటి కార్టూన్లు ఇంకా వేలాదిగా వేయాలని , ఆవిధంగా వీరికి కఠిన దండ (న) విధించాలని యువరానర్,
కోరుకుంటున్నాను.

సరసిజ మనువిద్ధం శైవలేనా2పి రమ్యం
మలినమపి హిమాంశో ర్లక్ష్మ లక్స్మీం తనోతి ...

అంటాడు శకుంతల గురించి కాళిదాసు. నాచు చేత కూడినదై నప్పటికీ పద్మం మనోహరంగా ఉంటుంది. మాలిన్యం కలదైనప్పటికీ చంద్రుని లోని మచ్చ శోభను విస్తరిస్తోంది అని శ్లోకంలో ఈ రెండు పాదాలకీ అర్ధం.

సరసి గారి కార్టూన్లు కూడా ఆయన మాటల్లోనే చెబుతే, ఆస్తిపాస్తులు అట్టే వున్నవి కావు. ఎక్కువగా మధ్య తరగతి ప్రాణులు. సూటు వేసుకో లేని బడుగు బనీను జీవులు. నేతల చుట్టూ తిరగకుండా , నేత బట్టలు చుట్టుకుని తిరిగేవి. సమస్యల్లో నవ్వులు వెదుక్కునేవి. తమ మీద తామే పడి నవ్వుకునేవి. ఆ విధంగా ఈ కార్టూన్లన్నీ బడుగుల జీవితాల్లో నుండి, వారి అలవాట్ల నుండి, ఆలోచనల నుండి, ఆశల నుండి, నిరాశల నుండి,మాటల్లోంచి, చేతల్లోంచి, వచ్చిన దినుసులే.

అలా ఈ రెండు పుస్తకాలలోని కార్టూన్లు ‘సరసి’జ మనువిద్ధాలు.

సరసి గారి కార్టూన్లు ఆంధ్ర ప్రభలో వచ్చే రోజులలో శ్రీ బాపు గారి నుండి ఆ పత్రికా సంపాదకులకు ఈ విధంగా ఉత్తరం వచ్చింది:

‘‘ మీ పత్రికలో సరసి అన్నతను ( లేదా, ఆమె) వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి.
తెలుగు కార్టూనిస్టులలో ఆమాత్రం తెలివైన వానిని ఇంత వరకూ చూడ లేదు’’
బాపు గారి నుండి ఇంత గొప్ప కితాబు అందుకున్న సరసి గారి కార్టూన్ల గురించి వేరే చెప్పనవసరం లేదు.
ప్రతి పద్యము నుందు చమ
త్కృతి గలుగం చెప్ప నేర్తు వెల్లడ బెళుకౌ
కృతి వింటి మపారముగా
క్షితిలో నీ మార్గ మెవ్వరికిన్ రాదు సుమీ !

అని, నుతిస్తాడు రఘునాథుడు విజయ విలాస కర్త చేమకూరి వెంకన్నను.
చేమకూర కవి ప్రతి పద్యం లోనూ చమత్కారం చిలికిస్తే, ప్రతి గీత లోనూ, ప్రతి రాత లోనూ చక్కని చమత్కారాన్ని, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పండించిన అచ్స తెలుగు కార్ట్యూనిస్ట్ సరసి గారు. వారి కార్టూన్ లు తెలుగుతనంతో చక్కిలిగంతలు పెడుతూ ఉంటాయి.
మనమీదేనర్రోయ్ అనిపిస్తూ ఉంటాయి.
ఆ పుస్తకాలను చూస్తే ఈ రహస్యాన్ని మీరు కూడా నాలాగే కనిపెట్ట వచ్చును.
సరసి గారి గీతా మాధుర్యం రుచి చూడడం కోసం వారి కార్టూన్ పుస్తకాలలో ప్రచురించిన మొదటి, చివరి కార్టూన్ లు సరదాగా ఇక్కడ చూడండి:

ఇవి సరసి కార్టూన్లు మొదటి సంకలనం లోని తొలి పుట లోని కార్టూన్ లు.




అదే పుస్తకం లోని చివరి పేజీ కార్టూను ఇది!



సరసి కార్టూన్లు - 2 పేరుతో వచ్చిన రెండవ సంకలనం లోని మొదటి కార్టూను ఇది !




ఆ కార్టూన్ల పుస్తకం లోని చివరి పేజీలో ఉన్న కార్టూను ఇది !
రెండు పుస్తకాల లోనూ తొలి , మలి కార్టూన్ ల రుచి చూసారు కదా ? ఇహ మధ్యలో ఉండే మాధుర్యాన్ని మీరే జుర్రుకోండి ...తనివి తీరా నవ్వు కోండి. అంత కంటె ముందు ఈ కార్టూన్ పుస్తకాలను కొనుక్కోండి. అది మాత్రం మరిచి పోకండేం?
ఎక్కడ దొరుకుతాయంటారా? అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద దొరుకుతాయి. వెల గురించి బెంగ లేదు. మీరు ఒక్కో పుస్తకానికీ వంద చొప్పున రెడింటికీ రెండు వందలు యిచ్చి, పాతిక రూపాయల చొప్పున మొత్తం ఏభై రూపాయలు ఇమ్మని దబాయించి మరీ వసూలు చేసుకోండి. కాదంటే సరసి గారికి కంప్లయింట్ చేయండి.
అన్నట్టు, ఈ కార్టూను పుస్తకాలు కొన్న వారికి కలకండల్లాంటి తియ్యని ముందు మాటలు - శ్రీరమణ,తనికెళ్ళ భరణి గార్లవి - పూర్తి ఉచితంగా ఇవ్వబడును. ఆలసించిన కార్టూన్ భంగం. ఆపైన మీ యిష్టం. నన్ననకండి.
సరసి గీతలే కాదు, రాతలు కూడా చక్కిలి గింతలు పెట్టేవే. వాటి గురించి మరో మారు ....
ఇంకా వివరాలూ గట్రా కావాలంటే సరసి గారితోనే నేరుగా మాట్లాడితే ఓ పనైపోతుంది ...

హాస్యానందం పత్రిక వారు మన సరసి గారి పుట్టిన రోజు సందర్భంగా వొక ప్రత్యేక సంచిక వెలువరించారు. ఆద్యంతం నవ్వులే నవ్వులు !    ఇక్కడ  నొక్కి చదువు కోండి,








వారి ఫోను: 09440542950 మెయిలెడ్రసు: sarasi-cartoonist@yahoo.comhttp://www.chamatkaram.com/home_page_main.jpg

4, జులై 2015, శనివారం

హెచ్చరిక ( చెడి పోతావురోయ్ ! సర్వ నాశనమైపోతావ్ )



లోకంలో ప్రతి దానికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒకటి జరిగిందంటే దానికి తగిన కారణం ఏదో ఉండే ఉంటుంది.ఒక శ్లోకంలో భర్తృహరి ఈ విషయమై ఏం చెబుతున్నాడో చూడండి:

దౌర్మంత్ర్యా న్నృపతి ర్వినశ్యతి, యతి స్సంగాత్, సుతో లాలనాత్
విప్రో2నధ్యయనాత్, కులం కుతనయా, చ్ఛీలం ఖలోపాసనాత్
హ్రీ ర్మద్యా, దనవేక్షణాదపి కృషి: ప్రవాసాశ్రయాత్
మైత్రీ చా2ప్రణయాత, సమృద్ధి రనయాత్ , త్యాగాత్ ప్రమాదా ద్ధనమ్

దుర్మార్గడైన మంత్రి వలన రాజు నాశనమై పోతాడు.

స్నేహాల వలన యతి (సన్యాసి) చెడి పోతాడు. అంతే కదా, సర్వసంగ పరిత్యాగికి ఇతర సాంగత్యాలు తగవు కదా?

గారం చేయడం వలన పుత్రుడు చెడతాడు. అతిగారాబం అనర్ధ హేతువు.

వేదాధ్యయనం చేయక పోవడం వలన బ్రాహ్మణుడు సంకనాకి పోతాడు. వాడికి విహితమైన వేదాభ్యసనం చేయకుండా, నిగమశర్మకి తమ్ముడిలా అడ్డమైన తిరుగుళ్ళూ తిరిగితే ఏం బాగుపడతాడు లెండి ?

కుపుత్రుని వలన కులం నశిస్తుంది. కులానికో చెడ్డ కొడుకు పుడితే ఇహ చాలు, జనాలు ఆ కులాన్నంతా తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడతారు. ఒక విభీషణుడున్నా, రావణ కులానికి దూషణలు తప్ప లేదు కదా.

దుష్టులతో చెలిమి వలన శీలం నశిస్తుంది. అందుకే పెద్దలు నీ స్నేహితులని చూసి, నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చని అంటారు.

మద్యపానం చేత లజ్జ నశిస్తుంది. తాగుబోతుకి ఎగ్గూ సిగ్గూ ఎక్కడుంటాయి చెప్పండి ?

తరచుగా వెళ్ళి చూడని వ్యవసాయం తగలబడుతుంది. కాలు మీద కాలు వేసుకుని దర్జాలు ఒలక బోస్తే వ్యవసాయం పనులు కావు. కార్తె పోతే రాదు. అందుకే అదనెరిగి వ్యవసాయం పనులు చేయాలి.

దేశాంతరగమనం వలన స్నేహం చెడి పోతుంది. అంతే కదా, ఎప్పుడూ దేశాలమ్మట పట్టుకు తిరుగుతూ ఉంటే మిత్రులే కరువవుతారు.తరుచుగా పలకరింపులు ఉంటేనే కదా, స్నేహాలు నిలుస్తాయి?

కూరిమి చెడి పోతే మైత్రీభావం నశిస్తుంది. కూరిమి గల దినములలో నేరము లెన్నడును తోచవు. ఆ కూరిమి విరసమైతే ఎదుటి వాడిలో అన్నీ తప్పులే కనబడుతూ ఉంటాయని శతక కర్త చెప్ప లేదూ?

అవినీతిచే సంపదలు నశిస్తాయిట. ఇది కొంత విచార మూలకం.అడ్డూ ఆపూ లేని సంపదలు పోగు పడేది అవినీతి పనులు అధికంగా చేయడం వల్లనే కదా? కవి మరి యిలా అంటాడేం? అంటే అవినీతితో చేకూరిన సంపదలు ఒకనాటికి నశించక తప్పదని కాబోలు. ఎంతటి ధనాధికులూ పట్టువడి శ్రీకృష్ణ జన్మ స్థానం చేరు కోవడం ఇటీవలి కాలంలో చూడడం లేదూ?

దానం, ప్రమాదం - వీటి వలన ధనం నశిస్తంది. ప్రమాదం సరే, దానం చేయడం వలన సంపదలు నశిస్తాయిట. కన్నూ మిన్నూ కానక అపాత్రదానాలు చేస్తూ పోతూ ఉంటే చేతికి చిప్ప కాక మరేం మిగులుతుంది ?

కనుక, ఆయా సంబంధాలనీ, విషయాలనీ విడిచి పెడితే మంచిది. లేక పోతే నశించడం ఖాయం అని కవి హెచ్చరిస్తున్నాడు.