22, డిసెంబర్ 2019, ఆదివారం

మంచి చెడ్డలు


                                                                               
    
నిన్నా మొన్నా విడి విడిగా  సుజన  దుర్జనుల వైఖరి చూసాం కదా? ఇప్పుడు జమిలిగా చూదాం ...
తమ కార్యంబుఁబరిత్యజించియుఁబరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్ధ వ్యాపృతుల్ మధ్యముల్
దమకై యన్య హితార్ధఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్ధ భం
గము గావించెడి వార లెవ్వరొ యెఱుంటన్ శక్యమే యేరికిన్ ?
తమ పని మానుకుని ఇతరుల పనులు చక్కబెట్టే వారు సజ్జనులు
తమ పని చూసుకుంటూనే, ఇతరులకు ఉపకారం చేసే వారు మధ్యములు.
తమ స్వార్ధం కోసం ఇతరుల పనులను చెడగొట్టే వారు రాక్షసులు.
మరి, ఏ ప్రయోజనమూలేక పోయినా, ఊరకనే ఇతరుల పనులు చెడగొట్టే వారు ఎవరో చెప్పడం ఎవరి తరమూ కాదు.

21, డిసెంబర్ 2019, శనివారం

చెప్తే వినాలి

           
             



చెప్తే వినాలి

సంతస్తాయసి సంస్థితస్య పయసో నామాసి నశౄయతే
ముక్తాకారతయా తదేవ నలినీ పత్ర సితం దృశ్యతే
అంతస్సాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధం మధ్యమోత్తమ జుషా మేవం విధా వృత్తయ :

నీరము తప్త లోహమున నిల్చి యనామకత్వ మై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీ దళ సంస్థితమై తనర్చు , నా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభు
బౌరుష వృ త్తులిట్లధమ మధ్యమునుత్తముఁగొల్చు వారికిన్

బాగా కాలిన లోహం మీద పడి నీరు వెంటనే అనామకంగా ఆవిరయి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుమీద ముత్యంలా మెరుస్తుంది. అదే నీరు శుక్తిలో పడితే... మణిగా భాసిస్తుంది.

అలాగే, మనం అధములను సేవిస్తే నాశనమై పోతాం. మధ్యములని సేవిస్తే ఒకింత రాణిస్తాం. ఉత్తములని సేవించుకుంటే గొప్ప కీర్తిమంతులమౌతాము.

దుర్జనులు ఎప్పుడూ పరిహరించదగిన వారే. పడగ మీద మణి ఉంది కదా అని, నాగుపాముని ఆదరించం కదా ?

19, డిసెంబర్ 2019, గురువారం

మంచి మనసు


                                                             


                                                   మంచి మనసు

సంత స్తృణోత్పారణ ముత్తమాంగాత్,
సువర్ణకోట్యర్పణ మామనంతి
ప్రాణ వ్యయేనా2పి కృతోపకారా:
ఖలా: పరే వైర మివోద్వహంతి

మంచి చెడుల తారతమ్యం ఎప్పుడూ ఉండేదే. మంచి వారికీ, చెడ్డ వారికీ ప్రవర్తనలో భేదం స్పష్టంగా కనిపించి పోతూనే ఉంటుంది.

తల మీద ఉన్న గడ్డి పోచను తొలిగించినంత మాత్రాన , వాళ్ళేదో మనకి మహోపకారం చేసినట్టుగా సత్పురుషులు భావిస్తూ ఉంటారు. అంటే, మనం వారికి ఏ చిన్న ఉపకారం చేసినా అది మహోపకారం చేసినట్టుగా కృతఙ్ఞత కనబరుస్తారు. చేసిన మేలు ఎప్పటికీ మరిచి పోరు.

అదే, చెడ్డ వారయితేనా, మన ప్రాణాలు పణంగా పెట్టి గొప్ప ఉపకారం చేసినా, కృతఘ్నులై చేసిన మేలు మరిచి పోవడమే కాక, అకారణంగా మన మీద పగ సాధిస్తూ ఉంటారని మీది శ్లోకం చెబుతోంది.

18, డిసెంబర్ 2019, బుధవారం

కలగా పులగం




నవ్వితే నవ్వడి ..నాకేం అభ్యంతరంయలేదు..

కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.
ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.
అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !
అలాంటివాటిని కొన్నింటిని చూదాం !
వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:
ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.
‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.
మరొకటి -
కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !
మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!
భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:
ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.
ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:
గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:
అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:
కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:
పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:
అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం
తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .
మరొకటి చూడండి:
తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి
కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !
చివరగా ఇంకొకటి ...
క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:
ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.


17, డిసెంబర్ 2019, మంగళవారం

గోరంత మేలు


                           
    



గోరంత మేలు

ప్రథమవయసి పీతం తోయ మల్పం స్మరంత:
శిరసి నిహితభారా నారికేళా నరాణాం,
సలిల మమృతకల్పం దద్యు రాజీవితాతం
నహి కృత ముపకారం సాధవో విస్మరంతి.

మంచి వారికి ఎంత చిన్న ఉపకారం చేసినా వారు దానిని తమ జీవితాంతం మరిచి పోరు.
కొబ్బరి చెట్టుని చూడండి, ఎప్పుడో చిఱుత ప్రాయంలో మనం పోసే కొద్దిపాటి నీటిని త్రాగి, ఆ మేలు మరి ఎప్పటకీ మరిచి పోదు. బరువైన కాయలను గుత్తులు గుత్తులుగా మోస్తూ, కలకాలం మనుషులకు తీయని నీటిని ఇస్తున్నది కదా !


15, డిసెంబర్ 2019, ఆదివారం

మంచి పలుకు


                                                       



అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్ల గాను
కంచు మ్రోగు నట్లు కనకంబు మ్రోగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ.

సుప్రసిద్ధ మయిన ఈ వేమన పద్యం వివరించే అర్ధమే కలిగిన ఒక సంస్కృత శ్లోకం చూదామా ?

నిస్సారస్య పదార్ధస్య, ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ధ్వని స్తాదృక్ , యాదృ క్కాంస్యే ప్రజాయతే.

నిస్సారములయిన అల్ప వస్తువులకు ఆడంబరం ఎక్కువగా ఉంటుంది.
కంచు మ్రోగినట్లు బంగారం మ్రోగదు కదా !


14, డిసెంబర్ 2019, శనివారం

వీళ్ళని భరించడం మనతరం కాదు బాబూ...



సతాయింపు

ద్వా విమౌ పురుషౌ లోకే, శిరశ్శూల సమౌ మతౌ,
గృహస్థశ్చ నిరారంభో, యతిశ్చ సప్రతిగ్రహ:

లోకంలో ఇద్దరి వల్ల చాలా ఇబ్బంది. వాళ్ళు మనకు తల నొప్పిగా పరిణమిస్తారు.
ఎవరయ్యా వాళ్ళు, అంటే,

ఏపనీ చేయని ఇంటి యజమాని ఒకడు.

రెండో వాడు సన్యాసం తీసుకుని కూడా గృహస్థుల దగ్గర డబ్బు ఆశించే యతి.

వీళ్ళిద్దరితో తల నెప్పి ఇంతా అంతా కాదు. శ్లోకంలో శిరశ్శూల సమౌ అనే పదం వీళ్ళు మనకి తల నెప్పితో సమానం అని చెబుతోంది.

నిజమే కదూ, ఏపనీ చేయకుండా, నిర్వ్యాపారంగా ఇంట కూర్చుని తింటూ, అలాగని ఊరు కోకుండా ప్రతి దానికీ సతాయిస్తూ ఉండే మగాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళతో తల నెప్పి కాక మరేమిటి?

ఇక, సన్యాసం తీసి కొన్న యతులు మన మతులు పోగొట్టే వైభోగాలు అనుభవిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం కదా? కాషాయం కట్టి, సర్వం పరిత్యజించామని చెప్పుకునే వాళ్ళు కూడా, ధనం కోసం పీడించడం సతాయింపు కాక మరేమిటి చెప్పండి ?

వీళ్ళలో కొందరికి కట్న కానుకలు కావాలి. పాద పూజలు కావాలి. పూల దండలు కావాలి. ఎర్ర తివాచీ ఆహ్వానాలు కావాలి. ఏసీ కార్లూ, గదులూ కావాలి. విమాన ప్రయాణాలు కావాలి. విదేశాలలో లభించే సకల వైభోగాలూ కావాలి.

కుదిరితే కప్పు కాఫీ లాగ, అందమైన అమ్మాయిలూ, సినీ తారలూ కావాలి ...

అబ్బో, ఆశా పాశము కడున్ నిడుపు. లేదంతంబు ....

పనీ పాటు చేయని వాళ్ళంటే, కేవలం రిటైరయిన వాళ్ళూ, వృద్ధులూ మాత్రమే అనుకో నక్కర లేదండీ. మంచి వయసులో ఉండే మగానుబావులు కొందరిలోనూ ఈ పని గండం గాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ సతాయింపు అనుభవించే ఇంట్లోని వ్యక్తులకే ఎరుక. వీళ్ళే కదా, ఆడవాళ్ళ మీద ఫేసు బుక్కుల లోనూ, వాట్సాఫ్ లలోనూ కుళ్ళు జోకులు పేలుస్తూ ఉంటారు.

శ్లోకంలో పురుషుల గురించే చెప్పారు కనుక ఆడవారికి మినహాయింపు ఉందనుకో నక్కర లేదండోయ్.

పని చేస్తూనో, చేయకుండానో, , చేస్తున్నట్టు నటిస్తూనో, సతాయించే తల నెప్పి లలనలకు
తక్కువేం లేదు.

ఏతావాతా ఈ సతాయింపు గాళ్ళు తల నెప్పి మాత్రలూ, మందులూ తయారు చేసే కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లుగా చక్కగా పనికొస్తారు.

అయితే, అందుకూ సతాయిస్తారేమో, కదూ !


13, డిసెంబర్ 2019, శుక్రవారం

అవును, ఏది చెప్మా ?




రూపాయి .. ... పాయె !

 ఏమయి పోయింది చెప్మా ?!

మా చిన్న తనంలో మా నరసింహం బాబాయి     ( ఈ సింహం బాబాయికి  ఆ మధ్య ఘనంగా సహస్ర చంద్ర దర్శన కార్యక్రమం జరిగింది కూడానూ )  ఈ తప్పి పోయిన రూపాయి  లెక్క చెప్పి, మమ్మల్ని జవాబు చెప్పమని అడిగాడు. మేం బిక్క ముఖాలు వేసేం.

 మీరు కూడా మీ పిల్లకాయలకి ఈ లెక్క చెప్పి, జవాబు చెప్పమని అడగండి.
ఏం చెబుతారో చూడండి:

ఇదిగో ఆ లెక్క:

రాముడు, భీముడు ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు తమ బెస్ట్ ఫ్రెండ్ సోముడి పుట్టిన రోజు కానుకగా ఏదేనా మంచి కానుక కొని ఇద్దామని బజారుకి వెళ్ళారు.

షాపులో ఒక మంచి బొమ్మని చూసి అదెంత అని, అడిగారు. అప్పుడు షాపు యజమాని లేడు. పని కుర్రాడు ఏభై రూసాయలు అని చెప్పాడు.

సరే అని రాముడు , భీముడు చెరో పాతిక రూపాయలూ ఇచ్చి, బొమ్మను కొన్నారు. వాళ్ళు ఆ బొమ్మను కొని ఇంటికి వెళ్ళాక, ఆ షాపు పని కుర్రాడు వచ్చి, వారికి మూడు రూపాయలు తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా అన్నాడు : ‘‘ ఈ బొమ్మ నేను మీకు ఏభై రూపాయలకు అమ్మేను కదా. కానీ, మా యజమాని వచ్చి, దీని ధర ఏభై కాదని, నలభై అయిదు రూపాయలే ననీ, తిరిగి అయిదు రూపాయలు మీకు ఇచ్చి రమ్మన్నాడనీ చెప్పాడు. అయితే వచ్చే దారిలో తను ఆ అయిదు రూపాయలలో రెండు రూపాయి ఎక్కడో పారేసానని, అందు వల్ల వారికి మూడు రూపాయలే ఇస్తున్నాననీ అన్నాడు. అంతే కాక, తాను రెండు రూపాయలు పారేసిన సంగతీ, మూడు రూపాయలు మాత్రమే వారికి ఇచ్చిన సంగతి యజమానికి చెప్ప వద్దని కూడా బ్రతిమాలు కొన్నాడు.

రాముడు, భీముడు భలే, భలే అనుకుంటూ, వచ్చిందే చాలుననుకుని ఆ మూడు రూపాయలూ తీసు కున్నారు. షాపులో బొమ్మ కొనడానికి చెరో పాతికా ఇచ్చేరు కనుక, తిరిగి ముదరాగా వచ్చిన మూడు రూపాయలని కూడా వారిద్దరూ సమానంగా చెరి రూపాయిన్నర చొప్పునా పంచు కున్నారు.

ఇదీ కథ. ఇప్పుడు అసలు ప్రశ్న  ఏమిటంటే,

రాముడు భీముడు కలిసి షాపు పని వాడికి ఇచ్చిన మొత్తం చెరొక పాతిక - అంటే ఏభై రూపాయలు.

బొమ్మ అసలు ఖరీదు నలభై అయిదు.

పని వాడు తెచ్చినది ఐదు రూపాయలు.

వాడు పారేసానని చెప్పినది రెండు రూపాయలు.

రాముడు , భీముడు పంచు కున్నది - చెరొక రూపాయన్నర. మొత్తం మూడు రూపాయలు.

ఇప్పుడు చెప్పండి:

బొమ్మ అసలు ధర నలభై అయిదు . పంచు కొన్నది మూడు. పని వాడు పోగొట్టు కున్నది రెండు . మొత్తం ఏభై.

లెక్క సరి పోయిందే !

ఇప్పుడు ఇదే లెక్కని ఇలా చూడండి:

బొమ్మ కోసం మొదట రాముడు తన వాటాగా ఇచ్చినది : 25 రూపాయలు.
భీముడు తన వాటాగా ఇచ్చినది: 25 రూపాయలు
మొత్తం: 50 రూపాయలు. అయితే వారికి తిరగి పని వాడు తెచ్చి ఇచ్చినది మూడు రూపాయలు.

పని వాడు తెచ్చి ఇచ్చిన దానిలో రాముడి వాటాగా వచ్చినది రూపాయిన్నర. అంటే, రాముడి జేబు లోనుండి తీసి ఖర్చు చేసిన మొత్తం ఎంతన్నమాట ? ఇరవై మూడు న్నర రూపాయలు. అంతే కదా !

అలాగే, భీముడికి తన వాటాగా వచ్చిన రూపాయిన్నర కలిపితే వాడి వాటాగా ఖర్చయినది ఎంతన్నమాటా ?

ఇరవై మూడున్నర రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడు తమ జేబుల లోనుండి ఖర్చు చేసిన డబ్బు మొత్తం కూడితే ఎంతవుతోందీ ?

ఇరవై మూడున్నర + ఇరవై మూడున్నర = 47 రూపాయలు. కదా !

పని వాడు పారేసినది ఎంతా ? రెండు రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడుల అసలు నిఖర ఖర్చు 47 రూపాయలు + పని వాడు పారేసిన 2 రూపాయలు = 49 రూపాయలు.

అరే ! ఒక రూపాయి తక్కుఃవ వస్తోందే ? ఏమయి పోయింది చెప్మా ?!

టాఠ్ ! రాముడు ; భీముడుల నిఖర ఖర్చు 47 , పని వాడు పారేసినది 2 మరి వాడు ఇచ్చినది మూడు రూపాయలు కదా. దానిని కలపొద్దూ అంటారా ? సరే, మీ ఇష్టం. నాదేం పోయింది ? అలాగే కలపండి. కానీ అప్పుడు మొత్తం 52 అయి పోవడం లేదూ ? అదనంగా ఈ రెండు రూపాయలూ ఎక్కడి నుండి వచ్చేయి   చెప్మా ?


12, డిసెంబర్ 2019, గురువారం

కష్ట సుఖాలూ...కావడి కుడలూ...



                                                            


మహా కవి కాళిదాసు అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో జీవితం సుఖ దు:ఖాల సమ్మేళనం అని చెప్పిన ఒక గొప్ప శ్లోకాన్ని యూడండి...

  యాత్యేకతో2స్త శిఖరం పతిరోషధీనా
 మావిష్కృ తో2రుణ పురస్సర ఏకతో2ర్క:
  తేజో ద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యామ్
 లోకో నియమ్యత ఇవాత్మదశాన్తరేషు.

చతుర్ధాంకంలో  కణ్వ శిష్యుడు ప్రభాత కాలాన్ని వర్ణిస్తూ చెప్పిన శ్లోకమిది.

ఒక వేపు చంద్రుడు అస్తగిరికి పోతున్నాడు. ఒక వేపు దినకరుడు అనూరుడు రధసారధిగా రధం నడుపుతూ ఉండగా ఉదయిస్తున్నాడు.

ఆహా! రెండు దివ్య తేజస్సులు ఒకే సమయంలో వ్యసనోదయములు పొందుతున్నవి కదా.
ఒక తేజస్సు అంతర్హితమవుతూ ఉంటే, ఒక తేజస్సు ప్రవర్ధమానవవుతున్నది.

ఏక కాలంలో కనిపిస్తున్న ఈ సూర్య చంద్రుల ఉదయాస్తమయాలు లోకంలో ప్రాణులకి సంభవించే సుఖదు:ఖాలని గుర్తునకు తెచ్చేదిలాగ ఉన్నది కదా !

ఇదీ ఈ శ్లోక భావం.



10, డిసెంబర్ 2019, మంగళవారం

బెలగాం కథలు పుస్తక పరిచయ కార్యక్రమం


         బెలగాం కథలు  పుస్తక పరిచయ                              కార్యక్రమం


                                                     
ఓలేటి శ్రీనివాస భాను అంటేనే , నిలువెత్తు భావుకత.

తీయందనాల తెలుగు పదాల పోహళింపు.

భాను పేరు చెబితేనే పొగబండి కథలు కథా సంపుటం మదిలో మెరుపులా మెరుస్తుంది. వెనుకటి రోజులలో నల్లని పొగలు చిమ్మే రైలు ప్రయాణంలా ఎన్నో పాత ముచ్చట్లను మదిలో మేలు కొలుపుతుంది. జీవన మాధుర్యం తెలియజేస్తుంది.
కలకండ పలుకులు చవులూరిస్తాయి.

ఇక, ఎల్వీ ప్రసాద్, పుల్లయ్య గార్ల జీవిత చరిత్రలు కళ్ళ ముందు  కదలాడుతాయి.

శ్రీ కుల శేఖర ఆల్వారుల కృతికి అను సృజన - ముకుంద మాలను గేయ రూపంలో గుండెలకు చేరువ చేసిన ధన్యుడు..

భాను విరామ మెరుగని కలం యోద్ధ. చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు.   అటు పత్రికా రంగం, ఇటు మీడియా... ఎనలేని విలువైన రచనలు వెలువరిస్తున్న చిర పరిచితుడు.

ఇప్పుడు బెలగాం కథలు.

పుట్టి పెరిగిన ఊరి కథలు.  బాల్యం లోని తీపి గుర్తులను చవులూరిస్తూ చెప్పే కథలు. మనసు ప్రఫుల్లం చేసే కథలు.   మన బాల్యాన్ని మనకు తిరిగిచ్చే కథలు.  ఒక నాటి సమాజ చిత్రాన్ని రూపు కట్టిన కథలు. మనమెరిగిన మన జీవిత చిత్రాలను మరోమారు ఎరుక పరిచే కథలు. జీవితాంతం వెంటాడే కథలు. అలరించే కథలు. అపురూప రత్నాలు. బంగారానికి సుగంధం అబ్బినట్టు  బెలగాం కథలకి జీవకళ ట్టి పడే బాలి గారి బొమ్మలు.

సాహితీ  లహరి బెలగాం లోనే బెలగాం కథలని పరిచయం చేసే కార్య క్రమం పుట్టినింట పెద్ద పండుగ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఆత్మీయంగా పలకరించి నట్టుగానూ, పెద్ద మనసుతో ఆశీర్వదించినట్టుగానూ ఉంది.
భానుతో నా పరిచయం ఇప్పటిది కాదు.  మా కథా ప్రస్థానం మన  ఊర్లోనే జరిగింది.
మా జగన్నాథ శర్మా, భానూ ఆ పరిమళాలను భాగ్య నగరం వరకూ తీసికెళ్ళి వెదజల్లారు.
మన ఊరి ఖ్యాతిని ఇనుమడింప చేసారు.

మన పార్వతీపురం రైల్వే ప్లాట్ ఫారమ్ మీద గంటల తరబడి చెప్పుకున్న కథల ఊసులు భాగ్య నగరంలో ప్రతిధ్వనించాయి.      మా చిన్ననాటి కలలని సాకారం చేసాయి.... 
ఈ చక్కని కార్యక్రమంలో నేను ఆరోగ్యం సహకరించక పాల్గొన లేక పోతున్నదుకు బాధ పడుతున్నాను . 
మన ఊరి వాడిని, మన కథలను అక్కున చేర్చుకోడం అంటే, మనని మనం  పలకరించు కోవడం. మనని మనం గౌరవించుకోవడం. ఈ కార్యక్రమంలో  సత్కారం స్వీకరిస్తున్న  సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత బెలగాం  భీమేశ్వర రావు గారికీ, నూతలసాటి సాహితీ సత్కార గ్రహీత సిరికి స్వామి నాయుడు గారికీ కూడా అభినందనలు.

ఇంత మంచి కార్య క్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ నా నమోవాకాలు

 శలవ్


.