డా. ముద్దు వెంకట రమణారావు ఎనిమిది పదుల వయసులో చేస్తున్న సాహితీ వ్యాసంగం గురించి, ప్రచురిస్తున్న పుస్తకాల గురించి కథా మంజరి లో ‘‘ విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం’’అనే శీర్షిక లో వారి పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది.
అవి:
1. రమణీయం ( కవితా వ్యాస సంపుటి)
2. కమనీయం ( కవితా సంపుటి)
3. ఉదయ కిరణాల (వ్యాస సంపుటి)
4. మహనీయం ( కవితా సంపుటి)
5. సంధ్యారాగం ( వ్యాస సంపుటి )
ఆ వివరాలు ఇక్కడ నొక్కి చూడ వచ్చును.
ఇక, ఇటీవల వారు ‘‘వెన్నెల వెలుగులు ’’ అనే వ్యాస సంపుటిని, ‘‘ అనలానిల గీతాలు ’’ అనే కవితా సంపుటిని కొత్తగా వెలువరించారు.
వాటి గురించిన క్లుప్త పరిచయం:
వెన్నెల వెలుగులు:
ఇందులో వివిధ అంశాల మీద సాధికారికంగా వారు వ్రాసిన 33 వ్యాసాలు ఉన్నాయి.
ఈ పుప్తకానికి అక్కిరాజు రమాపతిరావు గారు సాహితీ కదంబం పేరిట ముందు మాటను, డా.ఎస్.వి. సత్యనారాయణ గారు వ్యాస వెన్నెలకు అభినందన పేరిట ఆప్తవాక్యాలను వ్రాసారు.
అక్కిరాజు వారు ఈ గ్రంథాన్ని ప్రపంచ సాహిత్యాన్ని స్థూలంగా ఎరుక పరిచే పెద్దబాల శిక్షగా అభివర్ణించారు.వీటిలో చిత్రణలు మన మనసుని ప్రపంచ యాత్ర చేయిస్తాయి అని చెబుతున్నారు.
అంతగా ప్రాచుర్యం పొందని కావ్యాలను సైతం మరుగున పడి పోకుండా, సామాన్య పాఠకులకు పరిచయం కలిగించడమే ధ్యేయంగా వీటిలో కొన్ని వ్యాసాలను వారు రచించడం జరిగింది. అద్దంకి కేశవరావు గారి తథాగతీయం ఐతిహాసిక కావ్యం గురించిన వ్యాసమే ఇందుకు నిదర్శనం. తాము చెప్ప దలచుకున్న విషయాన్ని నిదానంగాభావించి, పాఠకుల సంభావింప చేసే నైపుణ్యం గ్రథనంలోనూ, కథనంలోనూ కనబడుతుంది అని రమణారావు గారిని అక్కిరాజు ప్రశంసించారు. పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చూపే అంతర్వీక్షణం, ప్రపంచాన్నంతా తెలియాలన్న ఆర్తి ఉండాలని, అవి రమణారావు గారిలో పుష్కలంగా ఉన్నాయని, అందు చేతనే ఈ వ్యాస సంపుటి ఇంత సరళ సుందరమై, సుబోధకమై, విషయావగాహనా సమన్వితమై, ఆసక్తి పరులైన తెలుగు వారికి అత్యంత సన్నిహితంగా చేరువయ్యేలాగున వెలువడిందని అక్కిరాజు రమాపతి రావు గారు అభిప్రాయ పడడం సహేతుకమే అనిపిస్తుంది.
డా.ఎస్.వి.సత్యనారాయణ గారు తమ ఆప్త వాక్యంలో చర్విత చర్వణంగా పూర్వ సాహిత్య సౌరభాల గురించి లోగడ విమర్శకాగ్రేసరులు చెప్పిన విషయాలనే తిరిగి చెప్పకుండా, వారు దర్శించిన వినూత్న సాహిత్యాంశాలను రేఖామాత్రంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న సదాశయంతో రమణారావు గారు ఈ వ్యాస వెన్నెలను రూపొందించారని చెబుతున్నారు.
ఆయా సాహిత్యాంశాలలో చక్కని పరిశ్రమ చేసి కూడా, సామాన్య పాఠకజన పఠనపరిశ్రమని గణన లోనికి తీసుకుని నాతి దీర్ఘమైన రీతిలో ఈ వ్యాసాలను రచించడం జరిగిందని రచయిత తమ ముందు మాటలో తెలియజేసారు.
ఈవ్యాస సంపుటిలో వసు చరిత్రం, ఆముక్త మాల్యద, అనిరుద్ధ చరిత్రము, తొలి అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, ఐతిహాసిక కావ్యం తథాగతీయం, వంటి గొప్ప ప్రాచీన కావ్యములను గురించిన అనుశీలనమే కాక, నాయని సుబ్బారావు కృతులు, జాతీయోద్యమ కాలం నాటి రచనలు, ప్రపంచ సాహిత్యంలో గొప్ప కథకులు, మరాఠీ నాటక కర్త విజయ్ తెందూలక్కర్, విక్టోరియా యుగం నాటి ఆంగ్ల సాహిత్యపు పోకడలు, రష్యన్ సాహిత్య పరిచయం, అప్పటికీ ఇప్పటికీ షేక్స్పియర్, లాంటి వ్యాసాలు పొందు పరిచారు.
సంగీతాభిమానులైప ఈ రచయిత వాటికి సంబంధించిన కొన్ని మంచి వ్యాసాలను కూడ ఇందులో జత చేసారు. హిందూస్థానీ శాష్త్రీయ సంగీత పరిచయం, సూర్య కుమారి జాతీయ గీతాలు ఈ కోవకి చెందిన వ్యాస రచనలు.
వీరికి చిత్రకాళాభినివేశం కూడ మెండు. ఆధునిక చిత్ర కళ, ఆంధ్ర చిత్ర కళ వంటి లఘు వ్యాసాలను చదివితే ఈ విషయం కాదనలేం.
ప్రాచీన, అర్వాచీన సాహిత్య గ్రంథాల పట్ల అభిరుచి కలిగి ఉండడం, తగినంత కృషి చేసి సంస్కృత సాహిత్యం అధ్యయనం చేయడం తాను అనుభవించిన వాటిని అక్షరాలలో అందంగా పలవరించడం, పదిమందితో పంచు కోవడం వీరికి చాల ప్రీతి పాత్రమైన విషయంగా తోస్తుంది. అది. సాహిత్యం, చిత్ర కళ, నృత్య రీతులు, శిల్పం, పర్యటనానుభవాలు , సంగీతం ... ఏదయినా కావచ్చును. వాటి ఆనుపానులు తెలుసు కోవాలనే అనురక్తి వీరిలో మెండు. తెలిసిన దానిని, తెలుసుకున్న దానిని, సామాన్య పాఠకులకు తెలియ జేయాలనే ఆర్తి కూడ ఎక్కువే. ఎదిగిన కొద్దీ ఒదిగే మనస్తత్వంతో,
వీరు ప్రపంచాన్ని, సాహిత్య ప్రపంచాన్నీ అక్షర బద్ధం చేసి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సఫలీకృతులయ్యారని ఈ పుస్తకాలే చెబుతున్నాయి.
ఈ వ్యాస సంపుటిని వీరు తమ బాల్య మిత్రులు, సహృదయులు, విద్యా వేత్త, అశేష శేముషీ ధురంధరుడు, కీ.శే. ఆచార్య తూమాటి దొణప్ప ( మాజీ వైస్ ఛాన్సలర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం) మధుస్మృతికి అంకితం చేసారు.
ఇక, వీరు ప్రచురించిన కొత్త కవితా సంపుటి అనలానిల గీతాలు:
62 కవితలు గల ఈకవితా సంపుటికి డా.సి.నారాయణ రెడ్డి గారు, డా,ఎన్. గోపి గారు అభినందన వాక్యాలు అందచేసారు.
భావపూర్ణంగా, సముచిత పదనిహితంగా పాఠకులకు అందించే సృజనాత్మక ప్రతిభ రమణారావు గారిదని సి.నా.రె ప్రశంసించగా,అనలానిల గీతాలలో అనల గీతాలు ( అగ్నికి సంబంధించినవి) అనిలగీతాలు ( వాయువుకి చెందినవి) , వాటి గూర్చిన కవితాలాపన, తాత్వ్తిక స్పర్శ కనిపిస్తున్నదని ఆచార్య గోపి వివరించారు. మృదుత్వం, తగ్గని ప్రౌఢశైలిలో రాసిన పద్యాలు రమణారావు గారి కవితా శక్తిని తెలియ జేస్తాయి అని అభినందిస్తున్నారు.
వీటిలో అనలానిల గీతాలే కాకుండా అన్య వస్తు సంబంధితాలయిన మరి కొన్ని కవితలను కూడ చేర్చడం జరిగింది.
వీటిలో అనల గీతాలు 15, అనిల గీతాలు 12, ఇతరములు 31, అనువాద గీతాలు 4 మొత్తం 62 కవితలు చేర్చారు. సంఖ్యాపరంగా ఇతర గీతాలు, అనువాద కవితలు అనలానిల గీతాల కన్న ఎక్కువ కనిపించే ఈ కవితా సంపుటికి అనలానిల గీతాలు అనే పేరు ఉంచడం చిత్రమనిపించినా, అసంగతంగా తోచదు. పాంచభౌతిక పరివ్యాప్తమైన లోకంలో అనల స్పర్శ, అనిల స్పర్శ లేనివి ఏవీ ఉండనేరవు అనే స్పృహ ఈ కవి లో ఉండడం చేత దీనికి అనలానిల గీతాలు అనే పేరు సముచితమని భావించి ఉంటారు.
అనల గీతాలు అగ్నిమీళే పురోహితమ్ అనే వేద వచనంతోను, అనిల గీతాలు మలయానిల గీతం తోను మొదలు పెట్టడం వీరి ఔచితీ ప్రదర్శనకు తార్కాణ.
ఈ కవితా సంపుటిలో వీరి కవితా సామర్ధ్యానికి ఉదాహరణ ప్రాయంగా కొన్ని కవితా పంక్తులని చూడండి:
అణువునణువున నిక్షిప్తమైన అగ్ని
జఠర మందు జీర్ణాగ్నిగా జ్వలనమందు
ప్రాణులన్నిట వెలిగెడి ప్రాణ జ్యోతి
పీడితుల మానసమ్ముల విప్లవాగ్ని.
అగ్ని గీతం అనే శీర్షికన వెలువరించిన ఈ చిన్ని కవితలో ప్రాణులన్నిట వెలిగే అనల జ్యోతి పీడితుల మనస్సులలో రగిలే విప్లవాగ్నిగా అభివర్ణించడం కవికి గల అభ్యుదయ దృక్ఫథాన్ని తెలియ జేస్తోంది.
ఒక దీపం చాలు వేయి దీపాలను వెలిగించును అనే భావనకు పద్య రూపం:
ఒక్క దీపమ్ముతోడ ప్రద్యోతమౌను
శతసహస్ర దీపమ్ములు ; సకల శుష్క
వనములనెల్లను దావాగ్ని కణము కాల్చు
మంచి చెడ్డల రెంటిని పంచునగ్ని.
ఇక, అనిల గీతాలలో తొలియూరుపు అనే కవిత గొప్ప తాత్త్విక కోణం ఆవిష్కరించే కవిత.
తొలియూరుపు నుండి కడపటి యూరుపు వరకు జీవధార ప్రవహింపగ, చేతన ప్రభ వికసింపగ అవిరామంగా ప్రసరించే మారుత తరంగాలకు కవి అంజలి ఘటిస్తున్నారు.
అనిల గీతాలాపనలో గాలిలో కలసి పోయిన కాలకూట విషవాయువు బారిన మృత్యువాత పడిన అసంఖ్యాక జనుల మృత్యు ఘోష విషవాయువు కవితలో వినిపిస్తున్నారు. ఇది వీరి సామాజిక స్పృహకు నిదర్శనం.
భీకర దృశ్యమ్మది
వేలకొలది జనులు
విగత జీవులైన వేళ
విషాద చరిత సృష్టించును
అని చెబుతూ ఈ దండనీతి యేరీతిగ సాగిందని, ఎవరు దీనికి బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.
ఇతర గీతాలలో చక్కని గీతాలు కనిపిస్తాయి. సెల్ ఫోన్, టైమ్ మిషీన్ వంటి చమత్కార జనితాలయిన కవితలను ఈ విభాగంలో చూడవచ్చును.
మనలోనే కాలయంత్రములు
మనస్సులోనే ఇమిడి వున్నవి ...
అంటూ, మన ఙ్ఞాపకాలే గత కాలం లోకి మనలని మోసుకుని పోతాయనీ, మన కలలే భావి మార్గంలోకి మనలను పయనింప చేస్తాయనీ, అందు వలన కడు క్లిష్టమైన ఖరీదయిన యంత్రాలతో పని లేదని వివరణ యిస్తున్నారు.
ఈ కవి తమ కవితావేశాన్ని ఇలా అక్షరీకరిస్తున్నారు:
కవితావేశము పొంగు వేళల లసత్
కావ్యాకృతుల్ మన్మనో
భవమై, సుందర పద్య గేయ రచనల్
భాసించు స్వేచ్చా విధిన్
మివులన్ సమ్మదమై, నవరసో
న్మీలమ్ముగా వ్రాసెదన్
ఇవినా తప్పులుగా బుధుల్ తెలిసి
సైరింపంగ ప్రార్ధించెదన్.
ఈ కవితాభివేశం యిలాగే నిండు నూరేళ్ళు కవిలో ఉండాలని కోరుకుందాం,
ఈ కవితా సంపుటిని వారు తమ ఆప్తుడు, సహృదయుడు, కవి, పండితుడు అయిన కీ.శే. పంతుల విశ్వనాధ రావు మధుర స్మృతికి అంకితం ఇచ్చారు.
సుందరంగా వెలువడిన ఈ రెండు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),వారు ప్రచురించారు. వారి ప్రథాన కార్యాలయం శ్రీకాకుళంలో ఉంది. వెన్నెల వెలుగులు వ్యాస సంపుటి వెల రూ. 125. కాగా, అనలానిల గీతాలు కవితా సంపుటి రూ.75 లకు లభిస్తోంది.
ఇతర వివరాలకు: శ్రీరామిశెట్టి, ప్రథాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),
శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం వీధి,
పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001
పెల్: 9441707772
చిరునామాకి సంప్రదించ వచ్చును.
లేదా, నేరుగా రచయిత గారినే పంప్రదించ వచ్చును. వారి చిరునామా:
డా,యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ
రిటైర్డ్ సివిల్ సర్జన్
ప్లాట్ నం. 211, ఎస్.బి.ఐ కాలనీ,
పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001
ఫోన్: (08942)223143 సెల్: 9849696511
1 కామెంట్:
"డా. ముద్దు వెంకట రమణారావు ఎనిమిది పదుల వయసులో చేస్తున్న సాహితీ వ్యాసంగం గురించి, ప్రచురిస్తున్న పుస్తకాల గురించి కథా మంజరి లో విశ్రాంత నే..."
ప్రియమైన పంజోరాకు,
నా కొత్త పుస్తకాలపై మీ పరిచయం చూసాను.క్లుప్తంగా గ్రంధాలను ముఖ్యాంశాలను రీడర్సుకి అవగాహన కల్పించే విధంగా సమీక్ష చేసే నైపుణ్యం అలవరచు కున్నందుకు అభినందనలు. ఎక్కువమంది ఎందుకో కవిత్వాన్నే మెచ్చుకొన్నారు. ఆ తర్వాతనే వ్యాసాలను. మీ సమీక్షకి నా ధన్యవాదాలు. ==రమణీయం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి