సరదాకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సరదాకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మే 2012, మంగళవారం

మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్సృహ ...


‘‘ ఎటు వేపేనా వెళ్ళు, కానీ, ఉత్తరం దిక్కు వేపు మాత్రం వెళ్ళకు ! ’’ అని ముసలి రాజు మరీ మరీ చెప్పి పంపిస్తాడా ? రాకుమారుడు అటు వేపే వెళ్తాడు.
ఇచ్చట నోటీసుల అంటించ రాదు అనే బోర్డు మీది అక్షరాలు రకరకాల వాల్ సోష్టర్ల నడుమ బిక్కు బిక్కుమంటూ కనిపిస్తూ ఉంటాయి.
ఇచ్చట మూత్రము చేయ రాదు ( మా హైదరాబాదులో అలాగే రాస్తారు మరి) అని ఉంటుందా ? అక్కడంతా ముక్కులు బద్దలయ్యేంత దుర్వాసన గుప్పు మంటూ ఉంటుంది.
నిశ్శబ్దమును పాటించుము అనే చోట నయాగరా జలపాత హోరు వినిపిస్తున్నా , లైబ్రేరియన్ ఒకటి రెండు సార్లు చెప్పి చూసి నిస్సహాయంగా చేతులెత్తేస్తాడు.
వాహనములకు ప్రవేశము లేదు అని వ్రాసి ఉన్న హెచ్చరికను తుంగలో తొక్కి ఏ పోలీసో ఎదురయ్యే వరకూ ఆకతాయి వాహనాలు పరిగెడుతూనే ఉంటాయి.
ప్లేట్లలో చేతులు కడగరాదు అని మా ఊళ్ళో చిన్న చిన్న హొటళ్ళలో బోర్డు రాసి పెట్టే వారు. అందు చేత జనాలు ఆ వినతిని  మన్నించి, టిఫిన్ తిన్నాక, చేతులు గ్లాసులలో ముంచి చక్కా పోయే వారు.
స్త్రీలకు మాత్రమే అని కనిపిస్తున్నా కొందరు జబర్దస్తీ రాయుళ్ళు బస్సులలో ఆ సీట్ల లోనే కూర్చోడం అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే.
మెడలు పక్కకి వాల్చి వాహనాలు నడిపే చోదకుల విన్యాసాలూ,పట్ట పగలు కూడా వెలిగే వీధి దీపాలూ, బస్సుల్లో వ్రేలాడుతూ ప్రయాణం చేసే ఫుట్ బోర్డు వీరుల సర్కస్  ఫీట్లూ  ...
ఇలా చెప్పు కుంటూ పోతూ ఉంటే అంతూ పొంతూ ఉండదు. మన సామాజిక  సామాజిక స్పృహ  అలాంటిది మరి !
ఈ మేడే నాడు సామాజిక స్పృహ  గుర్తుకు రావడం యాదృచ్ఛిక మేమీ కాదు.
దానితో పాటు మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్పృహ గురించి మీకు చెప్పాలనిపించడం కూడా సహజమైన విషయమే.
మా తింగరి బుచ్చిగాడు గుర్తున్నాడు కదూ ?  పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మా తింగరి బుచ్చిగాడు ఆరేడేళ్ళ వయసు లోనే గొప్ప  సామాజిక స్పృహ సంతరించు కున్నాడు. అది విశేషమే కదా ?
ఆ ముచ్చట చెప్పాలనే ఈ టపా పెడుతున్నాను.
నేనూ , మా తింగరి బుచ్చిగాడూ ఎలిమెంటరీ బడిలో చదువుకునే రోజులవి. మా బడి పేరు జంగం బడి. మా బడి పోలీసు స్టేషను వీధికి దగ్గరలోనే ఉండేది. మా బడికి ఎదురుగా ఒక చేకు గోడౌను ఉండేది. అంటే తెలుసు కదా ? గోగు నారని అక్కడ మిషన్ల లో పెట్టి పెద్ద పెద్ద బేళ్ళగా కట్టి ఎక్కడికో ఎగుమతి చేసే వారు.
ఆరోజుల్లో అక్కడ తయారయే చేకు బేళ్ళు మాకంటికి ఆకాశమంత ఎత్తుగా కనిపించేవి. ఆ తయారీ కూడా మాకు చాలా వింతగా కనిపించేది. నార బేళ్ళు కట్టే మిషన్లు ఒకటో, రెండో ఉండేవి. వాటిలో నార వేసి మనుషులు తొక్కే వాళ్ళు.  తర్వాత పెద్ద పెద్ద చక్రాలను నలుగురైదుగురు మనుషులు బలంగా పట్టుకుని తిప్పే వారు. పెద్ద పెద్ద తాళ్ళతో ఆ మిషన్లోనే వాటిని పెద్ద బేళ్ళుగా కట్టే వారు. అలా కట్టిన బేళ్ళ నుండి ఒక్క చిన్న నార పీచు లాగి తియ్యడం కూడా మాకు చాతనయ్యేది కాదు. మా శలవు రోజులన్నీ ఆ గోడౌను లో ఉండే రావి చెట్టు కిందే గడిచి పోయేవి.
సరే, ఇదంతా అలా ఉంచితే, ఒక రోజు మా తింగరి బుచ్చి నన్ను రహస్యంగా ప్రక్కకి పిలిచి, ‘‘ నీకో రహస్యం చెబుతాను. మన చేకు గోడౌనులో దొంగతనం జరుగుతోంది. తెలుసా ! ’’ అనడిగేడు.
‘‘ దొంగతనమా !’’ అన్నాను భయంగా.
‘‘ అంటే, దొంగ వ్యాపార మన్న మాట.’’ అని వివరించేడు. కల్తీ , దొంగ వ్యాపారం, దోపిడీ లాంటి పదాలు వాళ్ళ అన్నయ్య తరుచుగా అంటూ ఉంటాడు. అవే వీడికీ వంట బట్టేయి.
‘‘ మనం ఈ విషయం పోలీసులకి చెప్పాలి. పోలీసు స్టేషన్ కి వెళదాం పద !‘‘ అన్నాడు.
నా నిక్కరు తడిసి పోయింది.
‘‘ అమ్మో ! నాకు భయం’’ అన్నాను.
‘‘ నీకు సామాజిక స్పృహ లేదు.’’ వెక్కిరించాడు వాడు. ఈ పదం కూడా వాడు వాళ్ళ విప్లవ అన్నయ్య నుండి నేర్చుకున్నదే. అసలీ విప్లవమనే పదం కూడా వాడికి అలాతెలిసిందే. ‘‘ అంటే ఏమిటి ’’ అనడిగేను. ‘‘ నాకూ సరిగా తెలియదు. తిరగ బడడంట.’’ అన్నాడు. మా అవ్వ ఆ మధ్య నీరసంతో కళ్ళుతిరిగి నేలకు తిరగ బడి పోయింది. ఇది సామాజిక స్పృహ  అవునో కాదో నాకు తెలియదు. నిజంగా. నిజం. సరస్వతి తోడు.
నాకు సామాజిక స్పృహ లేదని ఖాయమై పోయేక, వాడొక్కడూ పోలీసు స్టేషన్కి బయలు దేరాడు.


 అక్కడ జరిగిన బోగట్టా అంతా నా మనో నేత్రంతో ( అంటే ఏఁవిటో నాకు సరిగ్గా తెలియదు. మా కథా మంజరి బ్లాగరు అంకుల్ చెప్పాడు ) చూసాను కనుక మీకు చెబుతున్నాను. 

మా తింగరి బుచ్చి గాడు వీరోచితంగా పోలీసు స్టేషను వరకూ వెళ్ళి , అక్క డ చాలా సేపు తటపటాయించి, ఎలాగయితేనేం, స్టేషను లోకి ప్రవేశించాడు.
అక్కడింకా పోలీసు బాబాయిలు మేలుకో లేదు. మేలుకునే ఉన్నా,  అంటే,  ఉత్త బాబాయిల్లా గానే ఉన్నారు.
కానీ, పోలీసు బాబాయిల్లా లేరన్న మాట.
అంచేత, ఏం కావాలి బాబూ ! అనడిగేరు లాలనగా.
‘‘ కంప్లయంటు ఇవ్వడానికి వచ్చానండీ’’ అన్నాడు వీడు.
‘‘ మీ నాన్న మీదా ?’’
‘‘ కాదండీ ...’’
‘‘ మీ అమ్మ మీదా ?‘‘
‘‘ కాదండీ ..’’
‘‘ పోనీ, ఇంకెవరయినా మీ ఇంట్లో వాళ్ళ మీదా ? లేక మీ పక్కింటి అంకుల్ గారి మీదా ’’
’’ఉహూఁ !  కాదండీ ...’’
‘‘ నీ జేబులో అయిదు పైసల బిళ్ళ పోయిందా ?’’ చివరి ప్రయత్నంగా కొంచెం లాలనగానే అడిగాడు పో.బా.
‘‘ కాదండీ ..’’ అంటూ, ఎందుకయినా మంచిదని నిక్కరు జేబు ఓసారి తడిమి చూసుకున్నాడు మా తింగరి బుచ్చి గాడు.
అప్పటికి పోలీసు  బాబాయిలో నిజమైన పోలీసు బద్ధకంగా నిద్ర లేచాడు.
‘‘ మరెవరి మీదరా నా కొడకా  ?’’ విసుగ్గా అడిగేడు. అయినా, ముద్దుగానే అడిగాడు. మన వాడికి  కాళ్ళలో సన్నని వణుకు మొదలయింది.
’’ మా బడి దగ్గర గోడౌన్ వాళ్ళ మీదండీ ....వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తున్నారు ...’’అన్నాడు, ఎలాగో కొంచెం ధైర్యం చిక్కబట్టుకొని.
పో.బా కి ఓ క్షణం తను  ఏం విన్నాడో అర్ధం కాలేదు.
‘‘ సరేలే ... నువ్వు మీ ఇంటికి పోయి, మీ పెద్ద వాళ్ళు ఎవరి నయినా పంపించు. వాళ్ళొచ్చి రిపోర్టు ఇస్తారు ’’ అన్నాడు.
‘‘ వాళ్ళకంత సామాజిక స్పృహ  లేదండీ !’’ అన్నాడు టక్కున మా తింగరి బుచ్చిగాడు.

ఈ సారి పోలీసు బాబాయిలందరికీ నిజంగానే మతి పోయింది ! కాసేపు మాట పడి పోయింది.

‘‘ సరేలే, పద ...ఓయ్, 110 నువ్వు వీడి వెంట వెళ్ళి ఆ సంగతేమిటో చూడు ...’’ అన్నాడొక పెద్ద పో.బా.

తింగరి బుచ్చి గాడికి ఏనుగు నెక్కి నంత సంబర మనిపించింది.

110 పో.బా తనని తన సైకిలు వెనుక కూర్చుండ పెట్టుకొని తొక్కడం వాడికి మరింత గర్వ మనిపించింది. 




సామాజిక స్పృహ ఉండడం వల్ల ఎంత గౌరవమో కదా అనుకున్నాడు.

పో.బా ని మన వాడు నేరుగా గోడౌను లోకి తీసుకు వెళ్ళి అక్కడ దొంతరలుగా ఉన్న చేకు బేళ్ళను చూపించాడు.
‘‘ ఇక్కడ ఎన్ని బేళ్ళు ఉన్నాయో చూసారు కదండీ ...’’
‘‘అయితే ? ...’’ బిక్క మొహంతో అడిగాడు పో.బా.
‘‘ రండి చెబుతాను.’’ అని పో.బా ను మా తింగరి బుచ్చి గాడు గోడౌను గేటు వెలుపలి గోడ దగ్గరకు తీసుకు వచ్చాడు. అక్కడ గోడ మీద రాసి ఉన్న అక్షరాలు చదవమన్నాడు.

పో.బా కూడ బలుక్కో కుండానే వీజీగానే చదివేసాడు :  ‘‘STICK NO BILLS  ... ’’
అప్పుడు మా తింగరి బుచ్చి గాడు విజయ గర్వంతో తల ఎగరేస్తూ కాస్త గట్టిగానే అన్నాడు. ‘‘ చూసారా సారూ ? గోడౌన్ లోపల అంత స్టాకు ఉంచుకొని , ఇక్కడ చేకు బేళ్ళు స్టాకు లేవని బోర్డు పెట్టారు. ఇది దొంగ వ్యాపారమే కదా ? మీరు వీళ్ళని జైల్లో పెట్టాలి.’’ అన్నాడు .

పో.బా కి తల తిరిగి, మూర్ఛ వచ్చినంత పనయింది. పోలీసు ఉద్యోగం వదిలేసి ఎక్కడి కయినా పోవాలన్నంత విరక్తి  కలిగింది.

Stick no bills  అనే బోర్డుని మా తింగరి బుచ్చి గాడు తన ఆంగ్ల భాషా పాండిత్యాన్ని ఉపయోగించి,కూడ బలుక్కొని,  
 ‘‘ స్టాక్ నో బేల్స్   ’’ అని చదువు తున్నాడని అర్ధం కావడానికి  అతనికి  కొంత సేపు పట్టింది. అతనా షాకు నుండి తేరుకునే లోపల మా తింగరి బుచ్చిగాడు ‘‘ మీకు సామాజిక స్పృహ  కానీ ఉంటే వెంటనే ఈ దొంగ వ్యాపారులను జైల్లో పెట్టాలి ! ’’ అని   ఒకటే సతాయిస్తున్నాడు.

పోలీసు బాబాయి ‘‘ సరే ... సరే ..నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, వీళ్ళందరినీ నేను జైల్లో పెడతానుగా ! ’’ అన్నాడు.

విజయ గర్వంతో విజిలు వేస్తూ మా తింగరి బుచ్చి గాడు  జారి పోతున్న నిక్కరును మీదకి లాక్కుంటూ ఇంటి ముఖం పట్టాడు.

వాడు నాలుగడుగులు వేసాడో లేదో, వెనుక నుంచి ’’ మళ్ళీ మా పోలీసే స్టేషను వేపు వచ్చావంటే ముందు నిన్ను బొక్కలో పడేసి మక్కలు విరిచేస్తాను జాగ్రత్త ! ’’ అన్న పో.బా. మాటలు వినిపించి వాడి నిక్కరు తడిసి పోయింది.   అవి పో.బా. తనని గురించి అన్న మాటలేనని వాడు వెనక్కి తిరగ నక్కర లేకుండానే పోల్చుకున్నాడు.


 అంతే ! ... ఇల్లు చేరే వరకూ పరుగో ... పరుగు !  పరుగో, పరుగు !!

ఇదండీ మా తింగరి బుచ్చిగాడి సామాజిక స్పృహ అను ఇంగ్లీషు పాండిత్యం !



ఇది నిజంగా జరిగిందంటే మీరు నమ్ముతారా ?














8, మార్చి 2012, గురువారం

అదయినా ఉండాలి ... ఇదయినా ఉండాలి !


విద్వాంసుడు సర్వత్రా పూజ్యనీయుడే కదా.

స్వగృహే పూజ్యతే మూర్ఖ : స్వగ్రామే పూజ్యతే ప్రభు:
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

మూర్ఖుడికి ఇంటి లోనే గౌరవం. అధికారికి అతని గ్రామంలోనే గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజు పూజించ బడేది అతని దేశం లోనే. కానీ, పండితుడు అంతటా పూజింప బడతాడు.

దీనికి ఉపబలకంగా ఉండే ఒకటి రెండు విషయాలు ఇక్కడ ముచ్చటించు కుందాం.

శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు హరి కథా పితామహులు. పువ్వు పుట్టగానేపరిమళించి నట్టుగా వారి ప్రతిభ అతి బాల్యం లోనే ద్యోతకమయిందిట.

ఒక సారి దాసు గారు తమ తల్లి దండ్రులతో కలసి అజ్జాడ అగ్రహారం నుండి పార్వతీపురం మీదుగా గుంప క్షేత్రంలో జరిగే తిరుణాలకి వెళుతున్నారుట. వంశధార, నాగావళి నదుల సంగమ ప్రదేశంలో జరిగే గుంప తిరుణాలు చాలా ప్రసిద్ధమైనవి. అక్కడ వెలసిన స్వామి సోమేశ్వరుడు. దాసు గారి వయసు అప్పటికి నాలుగైదు ఏండ్లు మించవట !
త్రోవలో ఒక పుస్తకాల అంగడి దాసు గారికి కనిపించిందిట. వెంటనే ఆ దుకాణంలో ఉండే పుస్తకాలను పరీక్షగా చూస్తూ ఉంటే బాల దాసు గారి కంట పోతన గారి శ్రీమదాంధ్ర మహా భాగవతం పడింది. వెంటనే అది తనకు కొని పెట్టమని దాసు గారు మాతాపితలను అడిగి, వారు స్పందించక పోవడంతో మారాం చేయ సాగేరుట. అది చూసి దుకాణదారు బాల దాసుతో ఇలా అన్నాడుట: ‘‘ అబ్బాయీ ! ఇంత మహా గ్రంధం నీకెందుకయ్యా ! ఇది పెద్దలు చదివే పుస్తకం’’

దాసు గారు తన పట్టు విడువ లేదు. నాకదే కావాలని ఏడుపుకి లంకించు కున్నారుట.

చాలా రకాలుగా చెప్పి చూసిన దుకాణదారు ‘‘ సరే, అసలు నీకీ పుస్తకంలో ఏముందో కూడా తెలిసి నట్టుగా లేదు. ఇందులో ఉన్న పద్యాలలో కనీసం ఏ ఒక్కటి చదివినా ఈ పుస్తకాన్ని నీకు ఉచితంగా ఇస్తాను ! ’’ అన్నాడుట.

వెంటనే బాల దాసు ఆ పుస్తకాన్ని చూడకుండానే భాగవత పద్యాలను రాగయుక్తంగా ఒప్పగించడం మొదలు పెట్టారుట ! ఒకటీ రెండూ కాదు ! ఏకంగా భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టమంతా గడగడా చదివేసారుట !
ఆ బాల మేధావి మేథా శక్తికి దుకాణదారు నివ్వెర పోయాడుట !

వెంటనే ఆ బాలుడిని అక్కున చేర్చుకొని, భాగవతం పుస్తకాన్ని వానికి ఉచితంగా ఇవ్వడమే కాక, కొంత రొక్కం కూడా వాని చేతిలో ఉంచి ఉచిత రీతిని సత్కరించాడుట !

ఇది చదువుతూ ఉంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే వాక్కులో ఎంత సత్యం ఉందో కదా అనిపిస్తుంది కదూ ?

మా నాన్నగారు నా చిన్నప్పుడు ఒక ముచ్చట చెబుతూ ఉండే వారు. అది :

మా ఊళ్ళో మెయిన్ రోడ్ లో ఒక అయ్యరు హొటల్ ఉండేదిట. ఆ హొటలు యజమానికి సంగీతం అంటే ఎన లేని ఇష్టంట. హొటల్ కి వచ్చిన వాళ్ళలో ఎవరయినా ఏదేనా ఒక కృతి ఆలపించడమో, లేదా, కనీసం ఒక చక్కని ఆలాపన చేయడమో చేస్తే. ఇక, ఆ పూట ఆ వ్యక్తికి తన హొటల్ లో ఉచితంగా కాఫీ, టిఫిన్లు, భోజనం దగ్గరుండి వడ్డించే వాడుట !
ఇది తెలిసిన వాళ్ళుకొందరునిత్యం వచ్చి తమగాత్రంతో అయ్యరుని మెప్పించడానికి ప్రయత్నాలు చేసే వారుట. ఈ క్రమంలో ఒకరిద్దరు ఏమాత్రం గాత్ర శుద్ధి లేని వారు కూడా వచ్చి ఏదో పాడి వినిపించడానికి నానా తంటాలూ పడే వారుట. చిత్రం ఏమంటే, అలాంటి వారికికి కూడా అయ్యరు లేదు పొమ్మనకుండా ఓ నాలుగు ఇడ్డెనులు తినమని పెట్టించే వాడుట ! ఇది చూసి పెద్ద లెవరో ‘‘ ఇలా అయితే నీ వ్యాపారం ఎలాగయ్యా అయ్యరూ ! ’’ అని కసిరే వారుట. దానికి ఆ అయ్యరు చెప్పిన జవాబు : ‘‘ అయ్యా ! వానికి పొట్టలో ఏమీ సంగీతంలేదు. కానీ రొంబ ఆకలి ఉండాది. పాపం, తిననీండి సారూ !’’ ఈ ముచ్చట విన్నప్పుడల్లా కదిలి పోయేవాడిని. ఒక గొప్ప కథకి ఇంతకన్నా మంచి ముగింపు ఏం ఉంటుంది చెప్పండి ?

మరో ముచ్చట. ఇది కూడా హొటల్ యజమాని గురించినదే. విజయ నగరంలో నేను చదువుకునే రోజులలో ప్రత్యక్షంగా చూసేను.

ఒకాయన ( పేరు చెప్పడం అంత బాగుండదేమో) విజయ నగరం వీధులలో తిరుగుతూ తరుచుగా కనబడుతూ ఉండే వారు. ఆయన ఆహార్యం విచిత్రంగా ఉండేది. పంచె, పొడవాటి మాసిన జుబ్బా, గుబురుగా పెరిగిన గడ్డం. ఎప్పుడూ అంతర్ముఖునిగా కనిపించే వారు. వారి కుడి భుజాన పొడవాటి ఖాకీ సంచీ ఒకటి వ్రేలాడుతూ ఉండేది. అది చాలా బరువుగా కూడా ఉన్నట్టు కనిపించేది. అందులో ఏయే వస్తువులు ఉన్నాయో అని నాకు కుతూహలంగా ఉండేది.
ధ్యాన మగ్నుడయిన ఒక గొప్ప యోగిలా ఆయన విజయ నగరం వీధులలో తిరుగుతూ ఉండే వారు. విడీ విడని పెదవులు సన్నని సంగీతమేదో ఆలపిస్తూ ఉండేది. కోవెల గట్టూ, కోనేటి గట్టూ వారి విశ్రమ ప్రదేశాలు.

అలా తిరుగుతూ,తిరుగుతూ మిట్ట మధ్యాహ్నం భోజనం వేళకి విజయ నగరంలో ఏ హొటలు కనిపిస్తే ఆ హొటలు ముందు ఆగేవారు. వెంటనే హొటలు యజమాని చప్పున లేచి వచ్చి, సగౌరవంగా అతనిని లోనికి తోడ్చుకొని పోయి దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తూ ఆతిథ్యమిచ్చే వాడు. అంతే గౌరవంగా వీడ్కోలు పలికే వాడు. డబ్బులు తీసుకోవడమంటూ ఉండేది కాదు. అంతా ఉచితమే.

తర్వాతి రోజులలో వారి గురించి తెలిసింది. వారు ఒక గొప్ప సంగీత వేత్త. బాగా బతికిన రోజులలో గొప్ప కచేరీలు ఎన్నో చేసి ఖ్యాతి గడించిన వ్యక్తి. అందరూ ఉన్నా, ఒక వైరాగ్య భావంతో, సర్వ సంగ పరిత్యాగిలా అందరినీ కాదనుకొని ఇల్లు చేరకుండా తిరిగే వారుట. సరే, ఇంతకీ అతని ఖాకీ జోలెలో ఏముండే దంటే, ఎవరో ఇచ్చిన అరటి పళ్ళూ, ఇతర ఫలాలూ, తిండి పదార్ధాలూనూ ... వీటిని వీధులలో సేకరించి అతనేం చేసే వారంటే, ఎక్కడ గోవు కనిపించినా , వాటి నోటికి వాటిని అందిస్తూ ఉండే వారు ! ఈ విధంగా గోసంరక్షణ చేస్తూ ఉండే వారన్నమాట.

ఇట్టి విశిష్ఠ వ్యక్తిని తగు రీతిని గౌరవించే ఆ హొటలు యజమానుల సంస్కారం ఎంత గొప్పదో కదా. ( ఈ నేపథ్యంలోనే నేనొక కథ రాసేను. దాని పేరు చెమ్మ మిగిలిన నేల. ఈ కథకు స్వాతి పత్రిక లో బహుమతి లభించింది. )

మా పితా మహులు తరుచుగా ఒక ముచ్చట చెబుతూ ఉండే వారు. మా బంధువులలో ఒకాయన ( పేరెందుకు లెండి. వారిని పేకాట ... గారని పిలిచే వారుట. ) పేక ముక్కలతో భలే తమాషాలు చేసే వారుట. వారొక సారి ఏదో దేశంవెళ్ళారు. డబ్బు చాలక పోవడమో, లేదా, డబ్బు పోవడమో జరిగిందిట. వెంటనే ఆ దేశంలో ఒక చోట నలుగురూ తిరిగే చోట రకరకాల పేక మేజిక్కు ప్రదర్శించి అందరినీ ఆకట్టు కున్నారుట. దాంతో కొంత మొత్తం డబ్బు అతనికి సమ కూడిందిట.

ఈ పేకాట ... గారే మరో సారి ఏదో దేశంలో పట్టు పంచె, లాల్చీ ధరించి, నొసట విబూది రాసుకుని , మెడలో రుద్రాక్ష తావళాలు ధరించి, చేతిలో ఏవో పుస్తకాల కవిలె కట్టలతో జనాలను ఆకర్షంచి, జాతకాలు చెప్పి, అందరినీ ఇట్టే ఆకర్షించేరుట. ఇది కూడా వారు ఆ దేశంలో డబ్బుకి అవస్థ పడుతున్నప్పుడే చేసారని మా తాత గారు చెబుతూ ఉండే వారు. ఏతావాతా తేలిందేమిటంటే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే ! అన్న మాట నూటికి నూరు పాళ్ళూ నిజం !

ఇదిలా ఉంటే,

విద్వత్తు ఉన్నా, లేక పోయినా రవంత లౌక్యం, తెలివి తేటలు వ్యవహార దక్షత ఉంటే ఎక్క డయినా నెగ్గుకు రావచ్చును.

విజయ నగరం దివాణంలో ఒకాయన పని చేసే వాడుట. వాడు పరమ లంచగొండి అని తెలిసి ప్రభువుల వారికి కోపం వచ్చింది. అయితే, తాతల కాలం నుండీ పని చేస్తున్న ఆ వంశీకులలో మనిషిని తొలగించ లేక, వాడికి కోట గుమ్మం దగ్గర కాపాలా పని అప్పగించారుట ప్రభువులు.

సరే, అంటూ వాడు అక్కడ నౌకరీకి కుదురుకొని, అక్కడా తన చేతి వాటం చూపించడం మొదలు పెట్టాడుట.
ఎలాగంటారా ? కోట లోనికీ ఏవో పనుల మీద వెళ్ళే వారి మహజరుల మీద చివరలో ఒక చిన్న సంతకం గిలికి, సంతకానికి ఒక కాణీ ( ఆ నాటి నాణెం) వసూలు చేసే వాడుట. తన సంతకం లేనిదే ఏ కాగితానికీ విలువ లేదని అవి ప్రభువుల ఉత్తర్వులని బొంకే వాడుట.కామోసు అనుకొని అంతా తలో కాణీ ఇచ్చి, అతని చేత ఎగబడి మరీ సంతకాలు పెట్టించుకునే వారుట.

ఇలా ఉండగా, ఒక సారి సాక్షాత్తు ప్రభువు వారు సంతకం చేసి, దివాను గారి చేత బ్యాంకుకి డబ్బు కోసం పంపిన ఒక చెక్కు చెల్లదంటూ బ్యాంక్ అధికారులు వెనుకకు తిరిగి పంపించి వేసారుట .

కారణం - దాని మీద ఓ చివర ఉండ వలసిన చిన్న సంతకమేదో లేక పోవడం చేతనట ! దివాణం అంతా బిత్తర పోయి మొత్తం విషయం గురించి వాకబు చేసారుట. చివరికి చెక్కుల మీద ఆ పొట్టి సంతకానికి బ్యాంకు అధికారులు అంతగా అలవాటు పడి పోయేరన్నమాట !

తెలివయిన వాడిని అడవిలో పడేస్తే చింత పండునీ, సముద్రపొడ్డున పడేస్తే ఉప్పునీ సేకరించి, ఊరగాయ పెట్టి,
ఊళ్ళో అమ్మేస్తాడు ! అని మా నాన్న గారు అంటూ ఉండే వారు.

అంచేత అదయినా ఉండాలి. లేదా ఇదయినా ఉండాలి. అంటే విద్వత్తయినా ఉండాలి, లౌక్యమయినా ఉండాలి. లేక పోతే నెగ్గుకు రాలేం బాబూ !

మరింక శలవ్.





28, డిసెంబర్ 2011, బుధవారం

చెప్పండి చూద్దాం ! -3


ఈ క్రింది చిత్రాల ఆధారంగా ఓ ఆరు పదాలకు నానార్ధాలు చెప్పండి చూద్దాం !

1. ఒక్కో పదానికీ రెండేసి నానార్ధాలు చెప్పాలి. కొండొకచో అంత కంటె ఎక్కువ పదాలు కూడా.

2. ఎప్పటి లాగే చిత్రాలు ఒక క్రమంలో ఉంచడం లేదు.
3. చిత్రాలు పూర్తిగా కానీ, చిత్రం లోని కొంత భాగాన్ని కానీ ఆధారంగా తీసుకోవాలి.
4. ఒక పదానికి రెండు కాని అంత కంటె ఎక్కువ కానీ అర్ధాలు కలిగిఉంటే వాటిని నానార్ధాలని అంటారని తెలిసినదే కదా.

ఆరు పదాలూ, వాటికి నానార్ధాలూ చెప్పి అందుకోండి వీరతాడు !

ఇదేం బాగు లేదయ్యా నస బ్లాగరూ ! అంటారా ? సరే, ఇక మానేద్దాం.

ప్రకటన : తింగరి బుచ్చి గాడి జీవిత చరిత్ర అతి త్వరలో విడుదల !































ఒక సుళువు: ముందుగా ఈ చిత్రాల లోని సూర్యుడు, ఆకాశం, పద్మం, చెయ్యి, విష్ణువు, తోడేలు ... ఈ పదాలకు పర్యాయ పదాలు చూడండి. అప్పుడు ఆ పదాలకు ఉన్న నానార్ధాలు చెప్పండి చాలు. అంతే. ఎంత వీజీవో కదా !




8, డిసెంబర్ 2011, గురువారం

పరీక్షా సమయమ్ - 1.


‘‘ ఎప్పుడూ శ్లోకాలూ , పద్యాలూ, కవితలూ కథలేనా ? నీ కథా మంజరిలో మామూలు విషయాలేవీ పెట్టవ్
కదా ! ’’ అని విసుక్కున్నాడు మా తింగరి బుచ్చి.

‘‘ ఏం పెట్టమంటావ్ ? ’’ అడిగేను కొంచెం నీరసంగా.

‘‘ పోనీ నా జీవిత చరిత్ర రాసి పెట్టెయ్ ’’ అని సలహా ఇచ్చేడు. ‘‘తింగరి బుచ్చి జీవిత ప్రస్థానం’’అని దానికి వాడే ఓ పేరు కూడా పెట్టీసేడు.

తన జీవిత చరిత్ర రాయక పోతే కథా మంజరి జన్మ చరితార్థం కానేరదని దబాయించేడు కూడానూ.

నా పుణ్యం పుచ్చి పోయి, నా పాపం పండి, నా మెదడు మొద్దుబారి పోయి, ఏం రాయడానికీ తోచక ఆలోచన గడ్డకట్టి నప్పుడు - అప్పుడు రాస్తాను కాబోలు , మా తింగరి బుచ్చి గాడి జీవిత చరిత్ర.

సరే, వాడి దాడి నుండి తాత్కాలికంగా నయినా తప్పించు కోడానికి ఈ పరీక్షా సమయమ్ - 1 పెడు తున్నాను.

ఇప్పు డంటే బ్లూ టూత్ లూ, సెల్ ఫోన్లూ లాంటి అత్యాధునిక పరికరాలేవో ( నాకు తెలీనివి) వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో పరీక్షలు రాసే పిలకాయలకి పాపం ఇవేమీ అందు బాటులో ఉండేవి కావు.

చిన్న చిన్న కాగితాలు చింపుకొని వాటి మీద జవాబులు ఓపిగ్గా రాసుకొచ్చే వారు. వాటిని స్లిప్పులనీ, చిట్టీలనీ అంటారు.

రహస్యంగా వాటిని తమ శరీరాల మీద బట్టల్లోనో, చెప్పుల్లోనో, చొక్కా మడతల్లోనో - వివిధ రహస్య స్థావరాలలో దాచుకొచ్చే వారు. సంప్రదాయానికి విలువ నిచ్చే విద్యార్ధులు ఇప్పటికీ ఈ ప్రాచీన పద్ధతులనే అవలంబిస్తున్నారనుకోండి ! అలా తెచ్చిన చిట్టీలని దొంగ చాటుగాతీయడం ఓ కళ. పట్టుబడితే కాళ్ళా వ్రేళ్ళా బ్రతిమాలడం . జాలీ దయా లేని దుర్మార్గులైన వాచర్లయితే డిబారయి పోవడం.

చిట్టీలు రాసే విద్యార్ధి కళా కారుల హక్కులను కాపాడడం కోసం ఉద్యమించాలని ఉందని మా తింగరి బుచ్చి గాడు లోగడ ఓ సారి ఎప్పుడో అన్నట్టు గుర్తు.

విద్యార్ధులకు ఈ చిట్టీలు అందించే పనిలో చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. పరిగెత్తడం, గోడలు దూకడం, అటెండర్లను మంచి చేసు కోవడం లాంటి చాలా నైఫుణ్యాలు వీరికి ఉండాలి.

ఇక, పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారంటూ మనం పాపం పిలకాయలనే ఆడి పోసుకుంటూ ఉంటాం కానీ, ఈ విషయంలో కాపీయింగ్ చేయించడానికి అత్యుత్సాహం ప్రదర్శించే టీచర్లూ ఎక్కువే.

పరీక్షల్లో విద్యార్ధులకు జవాబులు అందిస్తూ వారికి మంచి మార్కులు వచ్చేలా చూసి, వారి నుండి మంచి మార్కులు కొట్టెయ్యాలనే యావ కొంతమంది టీచర్ల లో ఉంటుంది. వారు పరోపకార పరాయణుల గానూ, మంచి సారు వారుగానూ, పిల్లలంటే దయాపరులుగానూ మన్ననలు అటు విద్యార్ధులనండీ, వారి తల్లి దండ్రలు నుండీ తరుచుగా పొందుతూ ఉంటారు ( అడపా దడపా క్వార్టరో, హాఫో బాటిల్స్ , చిరుకానుకలతోసహా)

ఇలాంటి పరోపకారి పాపన్నలాంటి ఓ టీచరు పరీక్ష హాల్లో ఇంగ్లీషు పరీక్ష నాడు ఇన్విజిలేషను చేస్తున్నాడు.
తన ఉదారతనూ, వివేకాన్నీ, ఇంగ్లీషు భాషా ప్రావీణ్యాన్నీ పరీక్ష గదిలో పిలకాయల ముందు ప్రదర్శించాలని మనసు ఒకటే తొందర పడుతోంది. నోరు మహా దురద పెడుతోంది.

‘‘ ఒరేయ్ ! బిట్ పేపరు ఇచ్చే వేళవుతోంది. రెడీగా ఉండండి. జవాబులు చెబుతాను. మళ్ళీ చెప్పమని అడగకుండా గబగబా రాసెయ్యాలి. ’’ అని హెచ్చరించాడు.

బిట్ పేపరు అందరికీ పంచేడు. గుసగుసల స్వరంతో జవాబులు చకచకా చెబుతున్నాడు. ఆ ఇంగ్లీషు బిట్ పేపరులో ఓ నాలుగు ఖాళీలలో ప్రిపోజిషన్స్ ( Prepositions ) నింపాలి. టీచరు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ ఖాళీల్లో వరుసగా
In,TO,IN,TO లు రాయండ్రా అని చెప్పాడు. ఇంకే ముంది, విధేయులైన పిలకాయలు గబగబా రాసి పారేసారు.
చూస్తే అందరి పేపర్ల లోనూ ఆ ఖాళీలలో నాలుగింటి లోనూ X గుర్తులే వేసి ఉన్నాయి !

మరో సారి మరో వాచరు గారు పిల్లలకి మామ్మూలుగా చెప్పే హెచ్చరికలతో పాటూ ఇంకా ఇలా చెప్పాడు.

‘‘ ఒరేయ్ ! బిట్ పేపరు జవాబులు చెబుతాను గానీ బొత్తిగా అందరకీ ఒకేలా 20 కి 20 వస్తే బాగోదు. అంచేత కావాలనే రెండో, మూడో నేను చెప్పినవి కాకుండా తప్పు జవాబులు రాసెయ్యండి. ఏం ?’’ అని చెప్పి అలా చెయ్యని వాళ్ళ తాట వలిచేస్తానని ప్రతి ఙ్ఞ కూడా చేసాడు.

ఆరోజు సోషలు పేపరు. ఖాళీలు పూర్తి చేయవలసిన వాటిలో ఒక ప్రశ్న ఇలా ఉంది : ‘‘ ఒరిస్సాలో ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి వారి ఆలయం ----- లో ఉంది.’’

ఆ ఖాళీలో ‘‘ పూరీ’’ అని రాయమని మన మంచి సారు వారు చెప్పడంతో అంతా మహదానందంతో అలాగే రాసేసారు.

కొంత మంది పిల్లలు మాత్రం , టీచరుగారి హెచ్చరికల మీద, మాట మీద గౌరవంతోనో, వారి గుస గుసల స్వరం వినిపించక పోవడంచేతనో, తెలీక పోవడం చేతనో, టీచరు ముందుగా చెప్పిన విధంగా పూరీ అని కాక, దానికి బదులుగా చపాతీ అని రాసేరు.

పేపర్లు దిద్దే స్పాట్ వేల్యుయేషన్ లో వాటిని దిద్దుతున్న టీచరు గారు పూరీ అనే ఆన్సరున్న వాటికి వరసగా రైట్ టిక్కు పెట్టి మార్కులు వేస్తున్నాడు. ఆ పనిలో అతను చాలా బిజీగా ఉన్నాడు. యంత్రంలా పని చేసుకు పోతున్నాడు. కొన్ని పేపర్లో ఆ బిట్ కి కొందరు పూరీ అనీ కొందరు చపాతి అని రాయడంతో జెట్ వేగంతో కదులుతున్న అతని ఎర్ర ఇంకు కలానికి బ్రేకు పడింది. చికాగ్గా దిద్దడం ఆపి, ఛీఫ్ ఎగ్జామినర్ ని అడిగాడు : ‘‘ సారూ ! ఈ బిట్ కి కొందరు పూరీ అనీ, కొందరు చపాతీ అని జవాబులు రాస్తున్నారు. దేనికి మార్కులు వేయమంటారు ?’’ అని.

పరాగ్గానో, చిరాగ్గానో ఉన్న ఆ ఛీఫ్ సారు :

‘‘ రెండూ తయార్యేది ఒకే పిండితో కదా. ఎలా రాసినా మార్కు ఇచ్చెయ్యండీ ’’ అని జవాబిచ్చేరు.

అయ్యా ఇదీ సంగతి.

చివరిగా ఒక కొంటె కవిత:

ముందు వాడు రాసిందంతా
మక్కీకి మక్కీ కాపీ కొట్టేడు పుల్లారావు
అయినా జీరో మార్కుల కన్నా ఎక్కువ రానే రావు !
ఎందుకబ్బా ! అని ఆశ్చర్య పోకండి.
ముందు వాడు రాసిందంతా క్వశ్చెన్ పేపరే కదండి !

మరిన్ని ముచ్చట్టు పరీక్షా సమయమ్ - 2 లో.


5, అక్టోబర్ 2011, బుధవారం

! దడిగాడువానసిరా

కుక్కలు విశ్వాసానికీ, గాడిదలు సహనానికీ పెట్టింది పేరు.

కాకుల గురించి కాకి గోల ( ఇక్కడ నొక్కి ఆ కాకి గోల భరించండి) అనే టపా రాస్తూ త్వరలో గాడిదల గురించి కూడా
ఓ టపా పెడతానని చెప్పాను కదా.
ఇప్పుడు గాడిదల గురించి రాయడం మానుకుంటే ‘ మాట తప్పేడురా గాడిద కొడుకు ! ’ అని ఎవరు తిడతారో అనే భయంతో ఇది పెడుతున్నాను.

‘ ఖర’ నామ సంవత్సరంలో గాడిద గురించి రాస్తున్నందుకు కథా మంజరి తెగ గర్విస్తోంది.

గాడిదకు చాలా పేర్లుఉన్నాయి. చక్రీవంతం,బాలేయం, రాసభం,గర్ధబం, గార్ధభం,గాడ్ద, ఖరం, గాలిగాడు ... ఇలా.
ఏ పేరుతో పిలిచినా ఓండ్ర పెడుతూ పలుకుతుంది కనుక అందరకీ తెలిసిన గాడిద అని పిలుచుకుంటేనే సుఖంగా ఉంటుంది.

రామాయణంలో ఖర దూషణలు అనే ఇద్దరు రాక్షసులు కనిపిస్తారు. ఇద్దరూ అన్న దమ్ములు. రావణుని చెల్లెలు శూర్ఫణఖ దండకారణ్యంలో ఉన్న శ్రీరాముని మీద మనసు రాక్షసంగా పారేసుకుంది. లక్ష్మణుడు దాని ముక్కు చెవులూ కోసి తరిమేసాడు. అది వెళ్ళి ఈ అన్నదమ్ములిద్దరికీ తన గోడు చెప్పుకుంది. ఈ అడ్డగాడిద లిద్దరూ రామునిపైకి దండెత్తి, అతని చేతిలో చచ్చారు.

భాగవతంలో గార్ధభాసురుడు అనే వాడు కనిపిస్తాడు. వీడూ రాక్షసుడే. వీడు బలరాముని చేతిలో హతుడయ్యాడు.

ఇక, దేవకీ వసు దేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు పుడితే , కసంసుడిపాల బడకుండా వసు దేవుడు ఆ పసివాడిని గంపలో పెట్టుకొని యమునానది దాటి వ్రేపల్లెకు చేరి యశోదమ్మ ప్రక్కన ఉంచి ఆమె కన్న ఆడశిశువును తనతో నిరాటంకంగా తెచ్చుకొన్నాడు. విష్ణుమాయ చేత ఆ పనిలో అతనికి ఎలాంటి ఆటంకాలూ ఎదురు కాలేదు. కానీ
దారిలో ఒక గాడిద మాత్రం రహస్య భేదనం జరిగేలా ఓండ్ర పెట్టింది. ఓండ్ర శబ్దంలో ఓం కారం ఉంది కనుక తన అరుపు
ఓంకారనాదం అనుకుందేమో పిచ్చి ముండ ! శాంతం పాపం ! శాంతం పాపం!

ఇహ లాభం లేదని, వసు దేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకో వలసి వచ్చింది.

గాడిద ముఖం కలిగిన దేవుళ్ళూ, దేవగణాల వాళ్ళూ ఉన్నారంటే ఈ చతుష్పాది ఎంత మహిమ కలదో వేరే చెప్ప నక్కర లేదు.

ఇవి గాడిదల ప్రస్తావన ఉన్న పురాణ కథలు కాగా, గాడిదల గురించిన నీతి కథలు అనేకం ఉన్నాయి.

అందరికీ తెలిసిన ప్రముఖమైన కథ ఇది:

ఒక చాకలి ఇంట కుక్క గాడిద ఉండేవి. కుక్క అతని ఇంటిని కాపలా కాస్తూ ఉంటే, గాడిద బరువులు మోసేది. తనెంత విశ్వాసంగా ఉన్నా ఇంటి యజమాని తనని సరిగా చూడడం లేదని కుక్కకి కోపం వచ్చింది. ఇక వాడి పట్ల విశ్వాసంగా ఉండ కూడదని భౌ భౌ తీర్మానం ఒకటి ఆత్మగతంగా చేసుకొంది. ఓ రాత్రి యజమాని ఇంట దొంగలు పడ్డారు. సహాయ నిరాకరణకు పూనుకొన్న కుక్క దొంగను చూసి కూడా మొరగడంమానేసింది. గాడిద కంగారు పడి కుక్కను హెచ్చరించింది. కుక్క ససేమిరా అని మొరగడానికి నిరాకరించింది. అయ్యో యజమాని, పాపం, అనుకుంటూ దొంగలొచ్చారని యజమానికి తెలియ జేయడం కోసం గాడిద ఓండ్ర పెట్టింది. చాకలి లేచాడు. నిద్రాభంగమయినందుకు కోపంతో దుడ్డు కర్రతో గాడిదను చావ మోదాడు ! ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకో కూడదని చెప్పే నీతి కథ ఇది.

గాడిదల గురించి కొన్ని జాతీయాలూ, సామెతలూ కూడా చూదాం:

గాడిద గత్తర

గాడిద పిల్ల కోమలం

గాడిద పుండుకి బూడిద మందు

గాడిద కేం తెలుసు గంధం వాసన

కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట.

పనీ పాటా లేని అడ్డ గాడిద

యజమానికి ఎదుటా, గాడిదకు వెనుకా ఉండ రాదు.

గాడిద గుడ్డు

గాడిద గుడ్డూ గరుడ స్తంభం

గాడిదతో చెలిమి కాలి తాపులకే

గాడిదల మోత, గుర్రాల మేత

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్య పడితే, ఒంటె అందం చూసి గాడిద మూర్ఛ పోయిందిట !

పూర్వం యుద్ధాలలో గజ సైన్యం, ఆశ్విక సేన వగైరాలు ఉండేవి. గాడిదల సేనలు ఉండేవో లేదో తెలియదు. రాజ్య కాంక్షతో యుద్ధాలు చేసే రాజులే ఎలాగూ గాడిదలు కనుక వేరే గాడిదల సేన ఉండే అవసరం లేక పోయి ఉండ వచ్చును.

కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులూ, లుబ్ధావధానులూ పరస్పరం త్వం శుంఠా అంటే త్వం శుంఠా ! అనీ,

గాడిదా ! అంటే అడ్డగాడిదా !అనీ ఒకరినొకరు ముచ్చటగా తిట్టుకునే వారు.

మరి గాడిద ప్రస్తావన గల కొన్ని పద్యాలు కూడా చూదామా ?

గాడిదల గురించిన చక్కని చాటువు చూడండి:

రేరే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిమ్ ?
రాజా శ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్ !
సర్వా పుచ్ఛవతో హయమితి వదంత్య త్రాధికారే ప్థితౌ
రాజా తై రుపదిష్టమేవ మనుతేన్ సత్యం తటస్థాపరే:

దీని అర్ధం : ఓ గాడిదా ! బట్టలు మోస్తూ గ్రామాలు తిరుగుతూ శ్రమ పడతావెందుకు ? హాయిగా రాజు గారి గుర్రాల శాలకు పోయి అక్కడ గుర్రాలతో పాటు గుగ్గిళ్ళు తింటూ గడుపు. తోక లున్నవన్నీ గుర్రాలే నని అక్కడి అధికారు లంటారులే. రాజు కూడా గుడ్డిగా ఆ మాట నమ్ముతాడు !

చవట గాడిదలన తగిన రాజుల గురించీ, అధికారుల గురించీ ఈ సంస్కృత చాటువు వివరిస్తే, శ్రీనాథుని తెలుగు చాటువు కూడా చూడండి మరి:

బూడిద బంగలై యొడలు పోడిమి దప్పి మొగంబు వెల్ల నై
వాడల వాడలం దిరిగి వచ్చెడు వారల ’’ చొచ్చొచో ‘‘ యనన్
గోడల గొందులం దొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో
గాడిద ! నీవునుం దొదిగి కవివి కావు కదా ! యనుమాన మయ్యెడున్ !

బూడిద రంగులో ఒళ్ళంతా కళావిహీనమై, పాలి పోయిన ముఖంతో, వీధీ వీధీ తిరుగుతూ, వచ్చీ పోయే వారు అదిలిస్తూ ఉంటే గోడల వెనుకా. సందుగొందలలోనూ ఒదిగి పోతూ ఓండ్ర పెడుతూ ఉంటావు. ఓ గాడిదా ! నాకు అనుమానం కలుగుతోంది. ఈ కొండవీటిలో నువ్వు కూడా ఒక కవివి కాదు కదా !

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివిడైనను నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ !

గంగి గోవు పాలు చిన్న గరిటెడు చాలు. కడివెడు గాడిద పాలు ఎందుకని వేమన సభక్తికంగా పెట్టే అన్నం ఏ కొద్దిపాటి అయినా చాలును అని చెప్పడానికి మధ్యన పాపం గాడిదను లాక్కుని వచ్చాడు.

కవి చౌడప్ప గాడిదనూ వదల లేదు. అతడివే మూడు పద్యాలు చూడండి:

వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా కుందవరపు కవి చౌడప్పా.

కవిత్వాన్ని మెచ్చు కుంటూ ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ అవహేళన చేస్తూ, అవమాన పరిచే తుంటరి వాడు గాడిద.

ఆడిన మాటలు తప్పిన
గాడిద కొడు కంచు తిట్టగా విని మదిలో
వీడా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవి చౌడప్పా.

పలికిన మాటను మరిచే అబద్ధాలకోరును గాడిదా అని ఒక తండ్రి ఎవడో తిడితే, ఇలాంటి వాడా నా కొడుకు ! ఛీ ! అని గాడిద కూడా ఏడిచిందిట.

గాడీపాలకి గలగిన
వాడయితేనేమి కవుల వంచించిన యా
గాడిద కొడుకును దిట్టగ
గాదా మరి కుంద వరపు కవి చౌడప్పా.

పెద్ద పెద్ద వాహనాలు, పల్లకీలు ఉంటే మాత్రం ఏం ? కవులను మోసగించే వాడు గాడిద కొడుకు ! వాడిని తిడితే ఏం తప్పు కనుక ? పిరదౌసిని మోసగించిన సుల్తాను ప్రభువు గాడిదే కదా ?

వెనుకటి రోజులలో సార్ధవాహులు తమ ప్రయాణాలలో ఎడ్లబళ్ళూ, గుర్రాలూ , మూటలూ అవీ మోయడానికి గాడిదలనూ వినియోగించే వారన్నది తెలిసిన విషయమే కదా.

అవునూ, కవులకు కవి వృషభులు అని బిరుదులూ అవీ ఇస్తూ ఉంటారు కదా. కవి గార్ధభ బిరుదులు ఇవ్వరు.

కవి సమ్మేళనాలలో పాత మాటల మూటలతో నానా చెత్తా మోసుకొని వచ్చి ఆహూతులను చచ్చినట్టు వినేలా చేసే కవులూ , ప్రజానీకాన్ని అడ్డగాడిదల్లా అడ్డంగా మోసగించి, దొరికినంతా దోచుకు తినే రాజకీయ ఖరనాయకులూ, వారికి కొమ్ము కాచే కొన్ని పత్రికల వాళ్ళూ, , టీవీల వాళ్ళూ , కుక్కలనీ, పిల్లులనీ, గాడిదలనీ నానా చెత్తా కుమ్మరించే కథా మంజరి బ్లాగరూ, తన చుట్టూ జరిగే అన్న్యాయాన్ని ఎదిరించే సత్తా లేని వాళ్ళూ, ఆడవాళ్ళను కాల్చుకు తినే వాళ్ళూ ... వీళ్ళంతా గాడిదలు ... కాదేమో, అడ్డ గాడిదలు. కదా మరి.

ఈ టపా తమ మీద పెట్టిన కథా మంజరి బ్లాగరుకి గాడిదలు అంతర్జాతీయ గార్ధభ మహా సభ పెట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానించి ’’ దడిగాడువానసిరా ’ అనే బిరుదు ప్రదానం చేయ బోతున్నాయని ఒక (అ) విశ్వసనీయమైన సమాచారం వల్ల తెలుస్తోంది.

పిల్లుల గురించి మరోసారి. ఇక శలవు.







20, సెప్టెంబర్ 2011, మంగళవారం

కాకి గోల


అవి చేసుకున్న పాపం ఏమిటో కానీ, పక్షులలో కాకులనూ, జంతువులలో గాడిదలనూ మనుషులు తెగ ఈసడించు కుంటూ ఉంటారు. నిజానికి ఏదో రూపంలో వాటి అవసరాన్ని ఈ మనుషులు పొందుతూనే ఉంటారు. గాడిదల సంగతి మరో మారు చూదాం కానీ, ముందు కాకుల గురించి చూదాం.

నల్లని రూపం. కర్ణ కఠోరమైన గొంతు. ఉచ్చిష్ఠాలను తినే స్వభావం. వెధవ కాకి గోల ! అని విసుక్కుపోతూ ఉంటాం.

ముందుగా కాకి గల వేరే పేర్లు చూదాం.

అన్యభృత్తు, అరిష్టం, ఆత్మఘోషం, ఏకదృష్టి, ఏకాక్షం, కంటకం, కిరవం, గుమికాడు, పిశునం, యమదూత, బలిభృక్కు, మహానేమి, వాయసం, ద్వికం, దీర్ఘాయువు, చిరంజీవి , కృష్ణం, ప్రత్యలూకం,దివాటనం ...ఇలా చాలా పేర్లు ఉన్నాయి
లెండి !

కాకిని గురించిన కొన్ని ప్రస్తావనలు చూడండి:

వసంత కాలే సంప్రాప్తే కాక: కాక: పిక: పిక:

కాకులూ కోకిలలూ చూడ్డానికి దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వసంతకాలం వస్తే మాత్రం ఏది కాకో, ఏది కోకిలో ఇట్టే తెలిసి పోతుంది.

కాటికి కట్టెలు చేరెను
యేటీవల పక్షులన్ని యేడువ సాగెన్
కూటికి కాకులు చేరెను
వేటవరపు పోతురాజు లేడా ? రాడా ?

(భీమకవి తిట్టు కవిత్వం )

వయం కాకం వయం కాక:
ఇతి జల్పంతి వాయస:
తిమిరారి తమోహంతి
అస్మాత్ హంతి యితి శంక:

సూర్యుడు ఉదయించేడు. చీకట్లను తరిమి కొడుతున్నాడు. కాకులు గోల చేస్తున్నాయి. మేం కాకులం. మేం కాకులం అంటూ. లేక పోతే, సూర్యుడు చీకట్లతో పాటూ తమను కూడా ఎక్కడ తరిమి కొడతాడో అని వాటి భయం !

కాకులు చీకట్ల లాగా అంత కారు నలుపన్న మాట.

రామాయణంలో కాకాసురుడు అనే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. వాడు మందాకినీ తీరంలో సీతా దేవి నిద్రిస్తూ ఉంటే, ఆమె పయ్యెద తొలగించాడు. ఆమె స్తనాలను గోళ్ళతో గీరాడు. అది చూసి రాముడు కోపించి బాణంతో దానిని కొట్టాడు. అప్పుడా కాకి రాముడిని తప్పు మన్నించమని శరణు కోరింది. రామ బాణం అమోఘం కనుక కనీసం ఒక్క అవయవమైనా ఇమ్మన్నాడు రాముడు. కాకి తన కన్ను ఒకటి ఇచ్చివేసింది. అప్పటి నుండీ కాకులకు ఒక కన్ను లేదు.
అందుకు కాకికి ఏకాక్షి అని కూడా పేరు వచ్చింది.

కాకి గూట్లో కోకిల పిల్ల అనే సామెత ఎందుకు వచ్చిందంటే, కోకిల గ్రుడ్లను పెడతాయే కానీ వాటిని పొదగ లేవుట. అందు చేత అవి పిల్లలయే వరకూ వాటిని కాకి గూట్లో కాకి గ్రుడ్లతో పాటూ ఉంచుతాయిట.

కాకి గూడు పెడితే కడపటి వర్షం అనే సామెత కాకి గూడు కట్టడం మొదలెడితే ఇక వానలు కురియవు అనిచెబుతారు

కాకి పిల్ల కాకికి ముద్దు.

కాకిని తెచ్చి బంగారు పంజరంలో ఉంచినా చిలుకపలుకులు పలుకుతుందా ?

కాకి ముక్కుకు దొండపండు అనే సామెత ఒకరు నలుపూ, ఒకరు తెలుపూ అయిన మొగుడూ పెళ్ళాల గురించి.

కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు. బలహీనులను దోచి బలవంతులకు ఇచ్చినట్టుగా అన్నమాట.

పిల్ల కాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ.

ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు .

లోకులు పలుగాకులు.

కాకులను ప్రస్తావిస్తూ గల కొన్ని సంస్కృత న్యాయాలు చూడండి:

కాక దంత పరీక్ష ... అనవసరమైన చర్చ అన్నమాట.

కాకతాళీయం ... కాకి తాటి చెట్టు మీద వాలడం, తాటి పండు రాలి తటాలున నేలన పడడం ఒకే సారి జరిగితే అది కేవలం కాకి వాలడం వల్లనే జరిగిందని అపోహ చెంద రాదు.

కాకరుత బీరు న్యాయం ... పగలు కాకి కూత విని భయపడి పోయి భర్తను ఆలింగనం చేసుకున్న ముద్దరాలు రాత్రి పూట నదిని దాటుకుంటూ విటుడి దగ్గరకి ఒక్కర్తీ వెళ్ళిందిట. అదీ ఎలాగూ, నదిలో ఉన్న మొసళ్ళకు ఆహారంగా మాంసం ముద్దలు వేసుకుంటూ , వాటి బారిన పడకుండా.

కాకాధికరణ న్యాయం ... పలానా వాడి ఇల్లు ఏదని అడిగితే, కాకి వాలి ఉంటుంది చూడూ అదే వాడి ఇల్లు ! అని తిక్క సమాధానం ఇవ్వడం.

కాకోలూకనిశాన్యాయం ... అంటే, కాకికి పగలయితే గూబకు రాత్రి. దానికి రాత్రయితే, దీనికి పగలు.

రావణుడికి భయపడి యముడు కాకి రూపం ధరించాడుట. జనం తమ పితృదేవతలకు తద్దినాలు పెట్టి కాకి పిడచను కాకులుకు పెట్టాలని, పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి ఆ పిండాలను తిని వెళ్తారుట. అప్పుడే వారికి తృప్తి కలుగుతుందిట. కాకులకు రావణుడు ఇచ్చిన వరంగా దీనిని చెబుతారు.

కాకులలో మాల కాకుల పరిస్థితి మరీ అధ్వాన్నం.

కవి యను నామంబు నీటి కాకికి లేదా ? అని అడిగే కవి ఒకడు.

పిండం తినే కాకి పితరుడెలా అవుతాడని తెగేసి చెప్పే కవి మరొకరు.



కాకేమి తన్ను తిట్టెనె?
కోకిల ధనమేమి తన్ను గో కొమ్మనెనే ?
లోకము పగయగు బరుసని
వాకున, చుట్టమగు మధుర వాక్యము కలిమిన్.

కాకి నిన్ను తిట్టిందా ఏమిటి ? కోకిల నీ కేమయినా డబ్బులిచ్చిందా? కాకిని అసహ్యిం కుంటావు. కోకిలను మెచ్చుకుంటావు. అంటే, లోకం కఠినంగా మాటలాడే వారికి దూరంగా ఉంటారు. సరుషంగా మాటలాడే వారు అందరకీ శత్రువులవుతారు. మధురంగా పలికితే మిత్రులవుతారు.

ఒక వృత్యనుప్రాసం సరదాగా చూడండి. ఇదీ కాకుల గురించే.

కాకీక కాకికి కోక. కుక్కీక కుక్కకి కోక. కాకీక కాకికి కాక, కుక్కకా ? కుక్కీక కుక్కకి కాక కాకికా ? కాకీక కాకికే కోక.
కుక్కీక కుక్కకే కోక...


ఇదీ కాకి గోల. గాడిదల గురించి మరోసారి.











27, జూన్ 2011, సోమవారం

తిరుగలి గురించి మా తింగరి బుచ్చి గాడి ఉపన్యాసంబెట్టి దనిన ...


ఇప్పుడంటే మిక్సీలూ , గ్రైండర్లూ వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో ఆడవాళ్ళు జబ్బలు పీకే లాగున పిండి రుబ్బాలంటే రుబ్బు రోలునీ, దంచాలంటే రోళ్ళూ రోకళ్ళనీ, విసరాలంటే తిరుగళ్ళనీ ఆశ్రయించే వారు.

ప్రస్తుతం మనం తిరుగలికి చెందిన కబుర్లు చెప్పు కుందాం.

మీదో రాయీ, కిందో రాయీ ఉండే విసురు సాధనం తిరుగలి. కింద రాయి స్థిరంగా ఉంటే, మీద రాయి చేత్తో త్రిప్పడానికి అనువుగా ఉంటుంది. మీద రాతిని చేత్తో త్రిప్పడానికి అనువుగా ఒక కర్రతో చేసిన పిడి ఉంటుంది. విసర వలసిన గింజలను మీద రాయి మధ్యలో ఉండే ఖాళీ లోంచి పోసి, ఇంక త్రిప్పడం ( అంటే విసరడం) మొదలు పెట్టే వారు. విసరగా విసరగా మెత్తని పిండి రెండు రాళ్ళ మధ్యా ఉండే ఖాళీ ప్రదేశం నుండి కింద పడేది. ఇదీ తిరుగలి పని చేసే తీరు.

ఈ తిరుగలికే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి !

అంజి, అనఘట్టము,కణలాభము, ఘరట్టము,జిక్కి,యంత్రపేషిణి,యంత్రము, రాగల్రాయి, విసుర్రాయి ... ఇవండీ తిరుగలికి ఉన్న మరో పేర్లు !

ఇంత ఆయాసపడి పోవడం ఎందుకు కానీ, హాయిగా మనం తిరుగలి అనో, విసుర్రాయి అనో తెలిసిన పేర్లతో ప్రస్తుతానికి ముద్దుగా పిలుచు కుందాం ! ప్రాణానికి సుఖంగా ఉంటుంది.

తిరుగలి ఊసెత్తితే సాయి భక్తులకి సాయి బాబా షిర్దీలో తిరుగలి విసరడం గుర్తుకు వస్తుంది. కదూ !

ఆ కథ ఇక్కడ మరొక్క సారి గుర్తుకు తెచ్చు కుందాం.

అన్నా సాహెబ్ ధబోల్కర్ అనే ఒక పెద్ద మనిషి బాబా కీర్తి గురించి విని ఆయన దర్శనం కోసం షిరిడీ రావాలనుకున్నాడు. అతడు వచ్చిన రోజు ప్రొద్దున సాయి బాబా మసీదులో ఒక తిరగలి ముందర కూర్చుని గోధుమలు విసురుతున్నారు. బాబాకు ఇల్లు సంసారం లేవు. వారు భిక్షాటనంతో జీవిస్తారు గదా! మరి ఈ గోధుమ పిండి ఎందుకు? అని అతడు వచ్చి ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అంతలో నలుగురు ఆడవాళ్ళు బాబాను తిరగలి ముందు నుంచి లేపి, పాటలు పాడుతూ పిండి విసిరారు. తరువాత దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకు పోబోయారు. అపుడు బాబా వాళ్ళను కోప్పడి "ఈ పిండి మీకు కాదు. దిన్ని తీసుకువెళ్ళి ఊరి సరిహద్దులలో చల్లండి" అని ఆజ్ఞాపించారు. ఇదంతా చూస్తున్న అన్నా సాహెబ్ ఆ ఊరి వాళ్ళను అడిగాడు - అలా పిండి ఊరు చుట్టూ చల్లటం దేనికి? అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం: "షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. దాన్ని పోగొట్టడానికి బాబా యిలా చేసారు. ఆయన విసిరింది గోధుమలు కావు, వ్యాధినే" అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే మరునాటికి కలరా వ్యాధి తగ్గు ముఖం పట్టింది. అన్నా సాహెబ్ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. ఇక ఆయన దగ్గరే ఉంది పోయాడు. బాబా కూడా అంతర్నేత్రంతో ప్రేమగా చూచేవారు. అతని "హేమాడ్పంత్" అని పిలిచేవారు. అతని మనసులో ఏ సందేహం వచ్చినా, బాబా తీర్చే వారు
తిరుగలి గురించి ఇంత పవిత్రమూ, ప్రశస్తమూ, ప్రఖ్యాతమూ అయిన కథలూ, విశేషాలూ ఉండగా ఓ సారి మా తింగరి బుచ్చి గాడు ఒక మహిళామణుల సభలో తిరుగలి గురించి అవాకులూ చవాకులూ ఉపన్యసించి మెడ మీదకి ( పీక మీదకి అని ఎందుకు అన లేదో మొత్తం ఆ వృత్తాంతం చదివితే గానీ మీకు తెలియదు) తెచ్చు కున్నాడు.
ఇంతకీ, మా తింగరి బుచ్చి గాడి గురించి మీకు చెప్పనే లేదు కదూ ! సన్నగా రివట వలె గాలికి తూలి పోవు రీతిని ఒప్పు వాడు. అడపాదడపా సభలలో సందడి చేయు వాడు. పిలిచిననూ, పిలువక పోయిననూ సభా ప్రాంగణము నందు తిరుగాడు వాడు. వీలు చిక్కించు కుని వేదిక నెక్కి తన ధోరణిలో ఉపన్యాసము లిచ్చు వాడు. మిక్కిలి తరుచుగా ఉపన్యాసము పూర్తి చేయక ముందే బలవంతముగా వేదిక నుండి నిర్దాక్షిణ్యముగా దింపి వేయ బడు వాడు. అంతియ కాక, లోకములో ఏ విషయము తనకు తెలియదను మాట లేని వాడు. సమస్త విషయముల గూర్చిన సమగ్ర సమాచారము తన వద్ద మాత్రమే కలదని అహంకరించు వాడు ...
మా తింగరి బుచ్చిగాడి ఘనత గురించి చెబుతూ పోతే తరిగేది కాదు కానీ , ఇప్పుడు వాడిచ్చిన తిరుగలి గురించిన ఉపన్యాసం గురించి మాత్రం చెబుతాను వినండి:
‘‘ మన వాళ్ళుట్టి వెధవలోయ్‘‘ అని గురజాడ ఊరికే అన లేదు. గురజాడకి అసలు మన వారి గురించిన ఆ గ్రహింపు మా ముత్తాత బ్రహ్మశ్రీ తింగరి హనుమాన్లు శాస్త్రుల వారి వలన కలిగిందని మీలో ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చును. సరే ఈ విషయం కాస్సేపు ప్రక్కన పెడదాం ! మన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాక పోతే, ఆలు మగల సంసారాన్ని బండి చక్రాలతోనా పోలుస్తారూ ! చక్రాల సంగతి అలా ఉంచితే, బండిని లాగేవి ఎద్దులు కదా ? ఆ రెండున్నూ పుంలింగములు కదా ? మరి ఆలు మగలలో ఒకరు పురుషుడున్నూ, వేరొకరు స్త్రీయున్నూ అయి ఉన్నారు కదా !
అందు చేత ఈ పోలిక శుద్ద చవటలు చేసిన పోలికగా నేను ఈ వేదిక మీద నుండి ధృవీకరిస్తున్నాను.... ’’ మా తింగరి బుచ్చి గాడి ఉపన్యసం ఈ వరకూ వచ్చే సరికి సభలో కొంత అలజడి బయలు దేరింది. అసహనం పురులు విప్పింది. హాహాకారాలు చెలరేగాయి. అదంతా తనఉపన్యాస ధోరణికి ప్రశంసారూపమయిన శబ్ద ఘోషగా ఎంచి, మా తింగరి బుచ్చి తన ఉపన్యాసాన్ని ఇంకా ఇలా కొన సాగించాడు:
‘‘ అందు చేత నా మట్టుకు నాకు భార్యా భర్తలను తిరుగలితో పోల్చడం సరైనదని పిస్తుంది. కింద ఉండే రాయి భార్య అయితే, పైనుండే రాయి భర్త. కింద రాయి అంగుళం కదలదు. అంటే, ఏమిటంటా, ఆడది గడప దాటకుండా ఇంట్లోనే పడి ఉండాలన్నమాట ! ఇక మగాడు పైన ఉండే రాయిలాగా సదా తిరుగుతూ డబ్బులు సంపాదించాలన్నమాట!అంతే కాకుండా మీది రాయి తిరుగుతూ ఉంటే, కింది రాయి ఆ రాపిడిని తట్టు కుంటూ ఉంటుంది. అంటఏ ఏమిటంటా ? భర్త పెట్టు నసను భార్య సదా భరిస్తూ ఉండడమే సృష్టి ధర్మం. అంతే కానీ నేటి ఆధునిక తుచ్ఛ వనిత వలె తిరుగబడుట అవివేకమూ, అనాగరికమూ ... ఇక, తిరుగలి తిరిగి నప్పుడే మెత్తని పిండి అనే సంసార సుఖాలు లభిస్తాయి. అయితే, సంసారం అనే ఈ తిరుగలి త్రిప్పేది ఎవరని మీకు ఆలోచన రావచ్చును. తిరుగలి పిడి అనే కాలం పట్టుకుని విధాత తిరుగలిని విసురుతూ ఉంటాడు....’’
ఇహ విన లేక సభలోని మహిళామణులంతా ఏక కంఠంతో దిగు ! దిగు !! ధ్వానాలు పలికి, మైకు లాక్కుని, చొక్కా గుంజుతూ, వేదిక మీద నుండి అర్ధాంతరంగా ఇవతలకి లాగి, సభాప్రాంగణం నుండి బయటకు ఎప్పటి వలె గెంటి వేసారట.
మా తింగరి బుచ్చి గాడు అందుకు నొచ్చు కోలేదు కానీ, తన గభీరమైన ఉపన్యాసం ఇంకా పూర్తి కాకుండానే అవాంతరం ఏర్పడింది కదా ! అని చింతించాడుట. ఆ రాత్రి అతనికి ఇంట అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా లభించ లేదని నమ్మకమైన సమాచారం కథామంజరి వద్ద ఉంది.
ఇదీ మా తింగరి బుచ్చిగాడి తిరుగలి మీద ఉపన్యాసం. వీలు చూసుకుని తింగిరోపన్యాసాలు అనే లేబిల్ క్రింద వాని ఉపన్యాసాలు మును ముందు మీముందు ఉంచగలను.
ఇక, తిరుగలి గురించి లోగడ కవిగారు ఒకరు చెప్పిన ఆశువు చూడండి
ఏడిచెదవేలనోయిక ఘరట్టమ ! త్రిప్పల బెట్టుచుందురే
చేడెలు నన్నటంచు కడు చిత్రముగా కడగంటి చూడ్కి చే
రేడులనైన ద్రిప్పెదరు రేలు పవళ్ళిక కేలుబట్ట నె
వ్వాడు పరిభ్రమింపడు సుమా ! సుదతీమణి త్రిప్పు చేతలన్ !!
దీని భావం:
ఓ తిరుగలీ ! ‘‘ఆడవాళ్ళు నన్ను స్థిరంగా ఉండనివ్వ కుండా అరిగి పోయేలాగున తెగ త్రిప్పుతూ ఉంటారు ’’
అని ఎందుకే ఏడుస్తావు ? స్త్రీలంటే ఏమిటను కున్నావ్ ! ఓర చూపులతో ప్రభువులనయినా గిర్రున తమ వెంట రేయింబవళ్ళు త్రిప్పుకో గలరు. ఒక తూరి చేయి అందుకుంటే, ఆ చేతిని వదలకుండా ఆవిడగారి కనుసన్నలలోతిరుగాడుతూ ఉండ వలసినదే కదా !
అన్నట్టు మాతింగిరి బుచ్చిగాడికి తెలుసో, లేదో, తిరుగలి మాహాత్మ్యం గురించిన ఓ విషయం వాడి చెవిని వెంటనే వేయాలి. అవపరమయితే ఏదో చోట తన ఉపన్యాసంలో ఉపయోగించుకుంటాడు కదా.
అదేమిటంటే, కోదాడ దగ్గర ఒక నరసింహస్వామి దేవాలయంలో ఒక తిరుగలి ఉంది. దానిని కౌగలించుకుని వేడుకుంటే ఎలాంటి కోరికలనయినా తీరుస్తుందని భక్త జనుల విశ్వాసం ! ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే తిరుగలి అదిట ! కావాలంటే ఈ క్రింది ఫొటో మీరే చూడండి: :
ఈ భక్తాగ్రేసరి ఇప్పట్లో లేవదు కానీ, ఇక శెలవ్.

ఇతి తిరుగలి ఉపాఖ్యానమ్ సర్వం ప్రస్తుతానికి సమాప్తమ్