పునర్ముద్రణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పునర్ముద్రణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2015, గురువారం

చిన్నప్పటి నుండి వాడు తేడాయే !

ఒక చక్కని దత్త పది ...




పాలు, పెరుగు, నేయి, నూనె ... ఈ పదాలు వచ్చేలా పద్యం చెప్పాలి. కవి గారి కమ్మని పద్యం.
ఈ చక్కని దత్తపది చూడండి ... 

  పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగు చున్నది వానిలో దురితము గన
నేయిలను గల్గ దిట్టియహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !


భావం: రారాజు దుర్యోధనుడు పాండవులకు పాలు పంచడు. ( రాజ్య భాగం ఇవ్వడు.)
వాడిలో దుర్మార్గం నానాటికీ పెరిగి పోతోంది.
ఏ లోకం లోనూ యిలాంటి అహితం ( చెడ్డతనం) లేదు.
వానిలో మూర్ఖత్వం చోటు చేసుకొంది.
ఇక భారత యుద్ధం తప్పదు !

వివరణ : పద్యంలో అన్వయ క్రమం ఇలా ఉంటుంది :
రారాజు పాండవులకు పాలు పంచడు. వానిలో దురితము పెరుగు చున్నది. ఇట్టి అహితము ఏ యిలను   కననే ? మూర్ఖత వానిని  ఊనెను

కనన్, ఏ + ఇలన్   =  ఏ లోకంలో నయినా ఉందా ?
వానిన్ + ఊనెన్.    =  వానిని మూర్ఖత్వం  పట్టుకుంది. వాడో మూర్ఖుడు.
వాడసలు చన్నప్పటి నుండీ తేడాయే!
  

తగునా యిది నీకూ ... ?! ( పెద్దలకు మాత్రమే)




యుక్తం కిం తవ శర్వరీశ ముఖ  మద్వేణీసమాకర్షణమ్ ?
వధ్యాయా  వంహరత్తవ కుచ ద్వంద్వం మదేయం మన:
వ్యత్యస్తం నను శిక్షితం జహి జహి స్వామిన్ వచ: సాధు తే ?
ఆశోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు.

భావం:
‘‘ఓ అందగాడా  నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’
‘‘ నీ ఉన్నతమైన వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’
‘‘చిత్రం ! తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’



7, జనవరి 2015, బుధవారం

భలే వాడివయ్యా !

పారావారము నందు న
నారని పెను చిచ్చు వోలె హాలాహలమే
పారఁగ నద్దానిని మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై



భావం : పాల సముద్రంలో మహా అగ్ని లాగున విషం పుట్టింది. అది ఎంతకీ ఆరేది కాదు. లోకాలను కాపాడడం కోసం శివుడు దానిని మనసారా మ్రింగాడు.

పరమేశ్వరుడు లోకసంరక్షణార్థం   మద్యం పుచ్చు కొన్నాడని సమస్య. దానిని  అవధాని గారు  మనసారా అనే విరుపుతో చక్కగా పూర్తి చేసాడు.
అమృతం కోసం దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని మధించారు. వాసుకిని తాడుగా చేసుకున్నారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొన్నారు. పాల కడలిని చిలకడం మొదలు పెట్టారు. అందు లోనుండి కామ ధేనువు, కల్ప వృక్షమూ, ఐరావతమూ, శ్రీమహా లక్ష్మీ, కౌస్తుభమూ, అప్సరోంగనలూ వెలువడ్డారు. చివరగా కాలకూటం వెలువడింది. దానిని ఏం చేయాలో దేవ దానవులకు తెలిసింది కాదు. చివరకు ఆ విషాన్ని స్వీకరించమని శివుడిని ప్రార్ధించారు. లోక రక్షణ కోసం  శివుడు దానికి సిద్ధ పడ్డాడు.

ఆ సందర్భంలో పోతన గారు చాలా గొప్ప పద్యాలు రాసారు. వాటిని కూడా ఒకింత గుర్తు చేసు కుందాం. మంచి కవిత్వాన్ని మననం చేసు కోడానికి ముహూర్తం అక్కర లేదు కదా.

కంటే జగముల దు:ఖము
వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షీ

శివుడు పార్వతితో ఇలా అన్నాడు : లోకాల ఆర్తిని చూసేవు కదా ? పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. దాని వలన మంచి కీర్తి లభిస్తుంది.
పార్వతి తన పెనిమిటి లోక రక్షణార్ధం కాలకూటాన్ని భుజించడానికి సిద్ధ పడితే పంతోషంగా అంగీకరించింది.
శుకుడు అందుకే అంటాడు :

మ్రింగెడు వాడు విభుండని
మ్రింగుడిది గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వ మంగళ,
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !

ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగు తుంది అని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి సరే విషాన్ని తినమని భర్తతో పలికిందిట. ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా.
పరమ శివుడు హాలాహలాన్ని భక్షించే టప్పటి దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టేలా చిత్రించారో చూడండి ...

కదలం బారవు పాఁప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు పు
ట్టదు,నేత్రంబులు నెఱ్ఱగావు, నిజజూటార్ధేందుఁడున్ గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో, డాయుచోఁ
బదిలుండై కడి సేయుచోఁదిగుచుచో, భక్షింపుచో, మ్రింగుచోన్.
పరమ శివుడు హాలాహలాన్ని రారమ్మని కవ్వించి పిలిచాడు. తనూ ఓ అడుగు ముందుకు వేసి సమీపించేడు. ఆ విషాన్ని చక్కగా ఒక ముద్దలాగా చేసాడు.కిందకి లాగాడు. నోట పెట్టుకుని మ్రింగాడు.
అలా శివుడు విషాన్ని భక్షిస్తూ ఉంటే, వొంటి మీద హారాలలా వేలాడుతున్న పాములు బెదరడం లేదు. కదలడం లేదు. ఆ మహా తాపానికి పరమ శివుని ఒంటి మీద ఒక్క చుక్క చెమట పుట్టడం లేదు. కనులు ఎఱ్ఱ బడడం లేదు. జటాజూటంలో ఉన్న చంద్రుడు ఆ వేడిమికి కంది పోలేదు. శివుని పద్మంలాంటి ముఖం వాడి పోలేదు.

భలే వాడివయ్యా, భోలా శంకరా !




3, జనవరి 2015, శనివారం

నీకంత సీన్ లేదు !!

‘‘ తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు
దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?

ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !


మరో పద్యం చూడండి:


స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట ! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చిన మాత్రనె యింత గర్వమా !
మానవతీ శిరోమణుల మాలికలయందును గూర్ప వత్తువో ?
కానుకలియ్య వత్తువో, వికాసము నిత్తువొ , విల్వ దెత్తువో ?!

ఈ పద్యం ముక్కు తిమ్మన గారిదని చెబుతారు.

స్థాన విశేష మాత్రం చేత మాత్రమే కొందరకి, లేదా కొన్నింటికి గొప్పతనం చేకూరుతూ ఉంటుంది. తామరపాకు మీద నీటి బొట్టు ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. అంత మాత్రం చేత అది మంచి ముత్యం ఎన్నటికీ కానేరదు కదా !
కవి అదే చెబుతున్నాడు : ఓ తామరపాకు మీద నీటి బొట్టూ ! నువ్వు తామరపాకు మీద నిలచి ఉండడం చేత నిన్ను ముత్యంతో పోలుస్తూ ఉంటారు. అది స్థానవిశేషం వల్ల వచ్చిన గొప్పతనం. అంత మాత్రం చేత నీకు ఇంత గర్వం తగదు సుమా ! నువ్వేమయినా లలనల శిరోరత్నాలలో కూర్చడానికి పనికి వస్తావా ? ఎవరికయినా కానుకగా ఇవ్వడానికి తగుదువా ? నీకు వికాసమూ లేదు, విలువా లేదు!

అంతే కదా, నీటి బొట్టు తామరపాకు మీద ఉన్నంత సేపే ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. స్థానభ్రంశం చెందిందా, యిక దాని పని అంతే. వొట్టి నీటి బొట్టే. కదా.

మరో పద్యం చూడండి:



తక్కక నేల ముట్టెగొని త్రవ్వగ నేర్తునటంచుఁదాకుతా
వొక్కటి జాతియందు మదమెక్కకు బుద్ధిని వెఱ్ఱిపంది ! నీ
వెక్కడ ! యాది ఘోణియన నెక్కడ ! యద్రి సముద్రదుర్గ భూ
ర్భాక్కు తలంబు నొక్క యరపంటినె మింటికినెత్త నేర్తువే ? !

ఓ వెఱ్ఱి వరాహమా ! నేలను ముట్టెతో త్రవ్వడంలో నాకు నేనే సాటి అంటూ గొప్పలు పోతూ గర్విస్తున్నావు.
నువ్వెక్కడ ? ఆదివరాహ మెక్కడ ? సముద్ర గర్భంలోని భూమిని ఒక కోరతో అవలీలగా ఆ తొలి కిటి మీదికి ఎత్తలేదూ ! ఆ ఆది వరాహం ముందు నువ్వెక్కడ, నీ ప్రతాపమెక్కడ !


ఈ పద్యం భట్టు మూర్తిదిగా చెబుతారు.

తమకు లేని పోని గొప్ప తనాన్ని ఆపాదించు కుంటూ. అహంకరించే అల్పులను అభిశంసిస్తూ కవులు చెప్పిన పద్యాలు చూసాం కదా.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.


గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఇలాంటిదే శ్రీనాథుని మరో చాటువు చూడండి:


ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !

ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

ఇదీ, నీకంత సీన్ లేదు ! అని కుండ బద్దలు కొట్టిన పద్యాల కథ .





1, జనవరి 2015, గురువారం

కొత్త ఏడాది ... కొన్ని మంచి కబుర్లు ...


పదవీ లాలస, పెదవీ లాలస పట్టు కుంటే వొక పట్టాన వొదిలేవి కావు.లోకంలో ప్రతి మనిషికీ ఆహార నిద్రా భయ మైధునాలతో పాటూ అమిత జీవితేచ్ఛగా ఉండేది ఏదో ఒక ఉన్నతమైన పదవి పొందాలని ఉంటుంది. ఎదుటి వాడి కంటె వొక మెట్టు అధికంగా ఉండాలని ఉంటుంది. ఏదో వొక పదవి కాలవాలని తాపత్రయ పడతాడు. అందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు కానీ, ఆ కోరిక దురాశగా మారి పోతేనే ప్రమాదం. అదే అన్ని అనర్ధాలకూ హేతువవుతుంది.
ఈ దురాశ ఎలాంటిదంటే ..
ఇచ్ఛతి శతీ సహస్రం, సహస్రీ లక్షమీమతే
లక్షాథిపస్తథా రాజ్యం. రాజ్యస్థ: స్వర్గ మీహతే

అంటే ... వంద ఉన్న వాడు వెయ్యి కావాలను కుంటాడు. వెయ్యి ఉన్న వాడు లక్ష కోరు కుంటాడు. లక్షాథికారి
 ( ఇప్పుడు ఎన్ని లక్షలూ చాలవను కోండి, అది వేరే మాట) ప్రభుత్వం, పదవి కావాలను కుంటాడు. రాజు స్వర్గాన్నీ, స్వర్గ సుఖాలనూ ఆశిస్తాడు ...

కానీ, కవి ... కారే రాజులు రాజ్యముల్ కలుగవే ... అంటూ గర్వించిన వారంతా సిరి మూట కట్టుకుని పోగలిగేరా ? అని నిలదీసాడు.... కానీ ఆశాపాశము కడున్ నిడుపు .. లేదంతంబు రాజేంద్ర !

ఎప్పటికయినా సుకవి ప్రజల నాలుకల మీద నిలిస్తే, రాజు శిలా ప్రతిమలా ఉండాల్సందే కదా ...


ధూర్జటి  పదవీ కాంక్ష ఎలాంటిదో చెప్పాడు కదా ... .

ఒకరిం జంపి పదస్థులై బ్రదుక  తా మొక్కొక్కరూహింతు రే
లకొ ? తామెన్నడు జావరో ? తమకుఁబోవో సంపదల్ ? పుత్ర మి
త్ర ళత్రాదుల తోడ నిత్య సుఖముంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నఁడుం కటకటా శ్రీకాళ హస్తీశ్వరా !

భావం: ఎవడినో ఒకడిని తుదముట్టించి, తాము వాడి పదవిని దక్కించు కోవాలని కొందరు చూస్తూ ఉంటారు. ఏమీ, తాము మాత్రం ఎప్పుడూ చావరా ? తమకు సంపదలు పోవా ? భార్యా పిల్లలూ, స్నేహితులతో ఎల్లకాలం సుఖంగా ఉంటారా ? బతికి ఉన్న వారికి  చావు రాదా ?

కానీ వారికి అదేమీ పట్టదు, ఒక్క రోజు రాజు చెయ్యి గణనాథా ! అంటూ తహతహలాడి పోతూ ఉంటారు.

రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు ... అనికూడా కవి చెప్పాడు. అంతే కాదు. ఒక సారి . పదవి అంటూ లభించేక వాడెలా మారి పోతోడా కూడా విపులంగానే వివరించాడు:

చూడండి:
రాజన్నంతనె బోవునా కృపయు, ధర్మం బాభిజాత్యంబు,వి
ద్యాజాత క్షమ, సత్యభాషణము, విద్వన్మిత్ర సంరక్షయున్
సౌజన్యంబు, కృతం బెఱుంగుటయు,విశ్వాసంబుగాకున్న దు
ర్భీత శ్రేష్ఠులు గాఁ కతంబు కలదే శ్రీకాళ హస్తీశ్వరా !

రాజు అయ్యాడంటే చాలు, దయావిహీనుడైపోతాడు. ధర్మం మరచి పోతాడు. ఆభిజాత్యం పెరిగి పోతుంది, పండితులంటే లెక్క చేయడు. సత్యం పలుకడు, మంచి వారిని కాపాడడు, మంచి తనం అసలే ఉండదు, చేసిన మేలు మరచి పోతాడు, విశ్వాసహీనుడవుతాడు. ఏం కారణమో కదా ...

నిజమే ఓ సారి పదవి లభించేక చాలా మందిలో లేని కొమ్ములు మొలుస్తాయి. తామేదో దైవాంశ సంభూతుల మనుకుంటారు. కన్నూ మిన్నూ కానరు. యుక్తా యుక్త విచక్షణా ఙ్ఞానం నశించి పోతుంది. లభించిన పదవిని నిలుపు  కోడానికి ఎంత కయినా తెగిస్తారు. లోకంలో చూడ్డం లేదూ ?
రాజ్యపాలన అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
.
కాళిదాస మహా కవి అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో రాజ్యం గురించి చెబుతూ ...

నాతి శ్రమాపనయనాయ, నచ శ్రమాయ
రాజ్యం స్వ హస్త ధృత దండ మివాతపత్రమ్.  ... అంటాడు.

రాజ్య సుఖం ఎలాంటి దంటే, తన చేత్తో స్వయంగా పట్టుకున్న గొడుగులాంటిది. అంతగా శ్రమను పోగోట్టదు, అలాగని శ్రమని కలిగించదు.

అయితే, రాజుకి నిజమైన ప్రజాభి మానం అంటూ ఉంటే, అది చేతి గొడుగు లాంటిదని మరో కవి చెబుతున్నాడు చూడండి:

ప్రజాగుప్త శరీరస్య కిం కరిష్యతి సంహతా:
హస్త న్యస్తాతపత్రస్య వారిధారాఇవారయా.

ప్రజాభిమానం చేతి గొడుగులాంటిది. వర్షం ఏం చేయ గలదు ?

అందు చేత రాజైన వాడు ప్రజాభిమానం సత్య మార్గంలో పొందాలి. అలాంటి నాయకులను ప్రజలు ఎన్నటికీ మరచి పోరు. అలాంటి ప్రభువులే   ప్రాత: స్మరణీయులు.

పాలకుడైన రాజు పూలు కోసి, దండలు కట్టే తోటమాలిలా ఉండాలి. కానీ, చెట్లు నరికి బొగ్గులు చేసే వాడిలా ఉండ కూడదని శ్లోక కారుడు చెబుతున్నాడు. చూడండి:

పుష్పమాత్రంవిచినియాత్
మూలచ్ఛేదం నకారయేత్
మాలాకారయివారామే
న యథాంగార కారక:.

మహా భారతంలో రాజనీతి ధర్మాలు విదురుడూ, ధౌమ్యుడూ , నారదుడూ,  భీష్ముడూ వంటి  పెద్దలు చాలానే చెప్పారు
.రాజు నడచిన బాటలోనే ప్రజలూ నడుస్తారని యథా రాజా తథా ప్రజా: అనే నీతి వాక్యం కూడా  బోధిస్తోంది.

పదవి కాస్త ఊడిపోయేక ప్రభువు పని ఏమవుతుందో తెలుసా ?

పద్యం చూడండి:

విధి సంకల్పముచే నొకానొకఁడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ, చూపు తక్కువ, సదాభాషల్ దురుక్తుల్ మనో
వ్యథతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధికారాంతము నందు చూడ వలెగదా నయగారి భాగ్యముల్ !

అదృష్ట వశావ్న అధికారం లభించి, రాజ్య పాలన చేయడం మొదలెడితే, చెవిటి వాడవుతాడు. అంటే మంచి మాటలు చెవికెక్కవు, కన్నూమిన్నూ కానడు. మదం పెరిగి పోతుంది. అన్ని వ్యసనాలూ అలవడతాయి. మాట్లాడితే అన్నీ చెడ్డ మాటలే. పదవి ఊడేక వాడి సౌభాగ్యం చూడాలి మరి ...


మరి, ఇప్పుడున్న వారిలో పలువురు ప్రజా సేవకులా ? ప్రజా కంటకులా ?

కాలమే నిర్ణయిస్తుంది కదూ ...

నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే ...

స్వస్తి.





30, డిసెంబర్ 2014, మంగళవారం

అయ్యా, చల్ది వణ్ణం తింఛారా?





కన్యా శుల్కం రెండో అంకం లో మొదటి సారిగా బుచ్చమ్మని చూస్తాడు గిరీశం. బచ్చమ్మ ప్రవేశిస్తూనే తమ్ముడు వెంకటేశంతో, ‘‘ తమ్ముడూ, అమ్మ కాళ్ళు కడుక్కోమంచూందిరా’’ అంటుంది. అదే మొదటి సారి గిరీశం బుచ్చమ్మని చూడడం.
ఆమెని చూస్తూనే గిరీశానికి మతి పోతుంది. తనలో ‘హౌ బ్యూటి ఫుల్ ! క్వైటనస్సెక్టెడ్ ! అనుకుంటాడు. బస్తీలో మధుర వాణిని విడిచి వచ్చేక ఇక్కడ కృష్ణా రాయ పురం అగ్రహారంలో ఇంత అందం ఉంటుందని అతను అనుకో లేదు. అందుకే, ‘‘ పల్లెటూర్లో వూసు పోదనుకున్నాను కానీ, పెద్ద కాంపేసుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం ’’ అనుకుంటాడు.
బుచ్చమ్మ గిరీశాన్ని ‘‘ అయ్యా, మీరు చల్ది వణ్ణం తించారా?’’ అనడుగుతుంది.గిరీశం తడుము కోకుండా ‘‘ నాట్ది స్లైటస్టబ్జక్షన్ ’’ అని తలూపుతాడు. అంతే కాదు, ‘‘ అనగా, యంత మాత్రం అభ్యంతరం లేదు.’’ అని అనువాదం కూడా వెలగ బెడతాడు. అంతటితో ఆగ కుండా  ‘‘ వడ్డించండిదిగో వస్తున్నాను.’’ అని చెప్పి,
‘‘ తోవలో యేటి దగ్గర సంధ్యావందనం అదీ చేసుకున్నాను’’ అని కూడా బుకాయిస్తాడు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజుల్లో పిల్లలూ, పెద్దలూ అనే తేడా లేకుండా ఇళ్ళలో అంతా ఉదయాన్నే చల్ది అన్నాలు తినేవారు. టిఫిన్లూ గిఫిన్లూ తెలియవు.
చల్ది , చల్లంది , చల్దన్నం ఈ పేర్లతో పిలిచే ఆ తరవాణీ అన్నం మహా రుచిగా ఉంటుంది. గ్రామీణులు సల్లంది అని అంటారు.
చలి + అది = చల్ది. చల్లనిది అని అర్ధం. చల్లని అన్నం అన్నమాట. ఇక్కడ చకారం తాలవ్య చకారం. దంత్య చకారం కాదు. ఈ చల్దన్నం కోసం ప్రతి ఇంట తరవాణి కుండలు ఉండేవి. తరవాణి అంటే పుల్లని నీళ్ళు అని నైఘంటికార్ధం. ఏతావాతా తేలిందేమిటంటే, చల్లంది అంటే, పులిసిన అన్నం అని అర్ధం !
మా ఇళ్ళలో పిల్లలందరకీ ఉదయాన్నే చల్దన్నాలు పెట్టే వారు. తెల్ల వారకుండానే లేచి స్నానాలు చేసి, మడి కోసం ప్రత్యేకంగా కుట్టించిన పట్టు లాగులు (చెడ్డీలు) తొడుక్కుని మరీ పిల్లలం ఒక పంక్తిని కూచుంటే కానీ మాకు చల్దన్నాలు వడ్డంచే వారు కాదు.
మా ఊర్లో ఉదయాన్నే వీధుల్లోకి తామరాకులు అమ్మకానికి వచ్చేవి. నూకలో, బియ్యమో యిచ్చి మా నాయనమ్మ ఆ తామరాకుల కట్టలని కొనేది. వాటిలో వడ్డించిన చల్దన్నం ఎంత రుచిగా ఉండేదో మాటల్లో వర్ణించడం కష్టం. ఆ తర్వాత రోజుల్లో అరిటాకులూ, తర్వాత తెల్లని పింగాణీ కంచాలూ వచ్చేయి. స్టీలు కంచాలు వచ్చే వేళకి ఇంట్లో చల్దన్నాల స్థానాన్ని టిఫిన్లు ఆక్రమించాయి.
ఉదయాన్నే ఆ తరవాణితో కూడిన చల్దన్నం తింటే ఎండ పొద్దెక్కాక ఎంత వేళకీ కానీ అసలు ఆకలనేదే తెలిసేది కాదు. ఆ రుచికరమయిన చల్దన్నం తినడానికి కమ్మగా ఉండడమే కాక, కడుపులో హాయిగా తేలిగ్గా ఉన్నట్టుండేది. అన్న సారం వొంట బట్టేక, కొంచెం మత్తుగా కూడా ఉండేది. నిద్ర ముంచు కొచ్చేది.
మా ఇంట్లో కాఫీల యుగం ప్రారంభ మయేక, అప్పుడప్పుడు ఆ కాఫీ రుచి మరిగి, మా పిల్లలం మాకూ కాఫీలు కావాలని గోల చేసే వాళ్ళం.
మా నరసింహం బాబాయి మాకు నడ్డి మీద ఒక్కటిచ్చుకుని, ‘‘ అన్నాలు తినే వాళ్ళకి కాఫీలు లేవర్రా !’’ అని ఓ తిరుగు లేని అలిఖిత శాసనం వినిపించే వాడు. నేను ఓ సారి అతనా మాట అనగానే ఉడుక్కుని, ‘‘ అక్కడికి, కాఫీలు త్రాగే వారంతా అన్నాలు మానేస్తున్నట్టు !’’ అని గొణిగాను. నా సణుగుడు వినిపించి మా నరసింహం బాబాయి నా నడ్డి ఫెడీల్మనిపించడం జరిగింది లెండి.
సరే, ఇంత రుచికరమయిన చల్ది అన్నం గురించి, అంతే రుచికరమయిన ఒక శ్లోకం మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. చూడండి:
వసంత నవ మల్లికా కుసుమపుంజవ న్మంజులం,
ససర్షపరసాలకం లికుచనీర వృగ్నార్ధకం,
వరాంగ్యుపరికేళిజ శ్రమ నివారణే కారణం,
జలోదన ముపాస్మహే జలజ బాంధవ ప్యోదయే.
వసంత కాలంలోని క్రొత్త మల్లి పువ్వు లాగ మంజులంగా ఉంటుంది. ఆవ తోడి మామిడి కాయ నంజుడుతో, అంటే, ఆవకాయ నంచుకుంటూ, లేదా, నిమ్మ రసంలో ఊరబెట్టిన అల్లపు ముక్కలతో, అంటే అల్లం పచ్చడితో నంచుకుంటూ చల్ది అన్నాన్ని ఉదయాన్నే తింటున్నాను. (మనోజ కేళి వలన కలిగిన) నా శ్రమ అంతా నివారించ బుడుతోంది కదా ! అని దీని భావం.ఆవకాయ, లేదా, అల్లం పచ్చడి మొదలయినవి నంచుకుంటూ తెలతెల వారుతూ ఉండే తరవాణి లోంచి తీసి పెట్టిన చల్దన్నం తినడం కన్న స్వర్గం మరొకటి లేదని తెలుసుకోవాలి.
చల్దన్నం గురించి చెప్పుకుంటూ శ్రీకృష్ణుడు బాల్యంలో గోపాలురతో కూడి చల్దులారగించిన మధుర ఘట్టాన్ని తలుచు కోకుండా ఉండ లేం కదా !
చూడండి, భాగవతంలో బమ్మెర పోతన శ్రీకృష్ణుని బాల్య చేష్టలు వర్ణిస్తూ, పశువులను మేపుకుంటూ, నెచ్చెలి కాండ్రతో చల్దులు ఆరగించే సన్నివేశాన్ని మనోహరంగా రచించాడు.
గోపాలురు బాల కృష్ణునితో పాటు ఊరి చివర పచ్చిక బయళ్ళలో పశువులను మేపుకుంటున్నారు. మిట్ట మధ్యాహ్నమయింది. ఎండ మాడ్చి వేస్తోంది. అందరకీ ఆకలి వేస్తోంది. ఇక రండర్రా, చల్దులు తిందాం, అని గోపాలుడు గోపాలురను కేకేసి ఎలా పిలుస్తున్నాడో చూడండి :
ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార ! చల్ది గుడువన్ రమ్య స్థలంబిక్కడీ
దండన్ తేగలు నీరు ద్రావి యిరువందం బచ్చికల్ మేయుచుం
దండబై విహరించు చుండగ నమంద ప్రీతి భక్షింతమే
ఎండలో మ్రగ్గి పోయారు. ఆకలితో ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయడమెందుకు? ఓ బాలకులారా, రండి ! మనం చల్దులు తినడానికి ఇక్కడ ఈ చోటు చాలా మనోహరంగా ఉంది. ఇక్కడ లేగ దూడలు నీళ్ళు త్రాగి, ఈ చుట్టు ప్రక్కల గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. ఈ అందమయిన స్థలంలో చల్దులు తిందామా?
గోపాలుని పిలుపుతో గోపాలురంతా బిలబిలా అక్కడికి చేరారు. కృష్ణుని చుట్టూ వలయంగా కూర్చుని చల్దులు ఎలా తిన్నారో చూడండి:
జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁగూర్చుండి వీక్షింపుచున్శిలలుం బల్లవముల్ దృణంబులు, లతల్ , చిక్కంబులున్, బువ్వు లాకులు కంచంబులుగాభుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా !
పద్మంలో ఉండే కర్ణిక (బొడ్డు) చుట్టూ ఉండే రేకుల లాగ, కృష్ణుని చుట్టూ వలయాకారంగా అతనినే చూస్తూ కూర్చున్నారు గోపాలురు. తర్వాత, ఇళ్ళ నుంచి తెచ్చుకున్న చిక్కాలు విప్పి, చల్దులు తినడం మొదలెట్టారు. శిలలు, చిగుళ్ళు, గడ్డి, లతలు, చిక్కాలు, పువ్వులు, ఆకులు మొదలయిన వాటిని కంచాలుగా చేసుకుని గోపార్భకులు చల్దులు ఆరగించారు.
ఇలా చల్దులు తినే ఆ పిలకాయల సరదాలూ, కోణంగితనాలూ పోతన ఎంత మనోఙ్ఞంగా వర్ణించాడో చూడండి:
మాటి మాటికి వ్రేలు మడచి యూరించుచు
నూరు గాయలు దినుచుండు నొక్క
డొకని కంచము లోని దొడిసి చయ్యన మ్రింగి
చూడు లేదని నోరు సూపు నొక్క
డేగురార్గుర చల్దు లెలమిఁబన్నిదమాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కొక
డిన్నియునుఁదగ బంచి యిడుట నెచ్చెలి
తనమనుచు బంతెన గుండు లాడు నొకడు
కృష్ణుఁజూడు మనుచుఁగికురించి పరు మోల
మేలి భక్ష్య రాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకడు
మాటి మాటికి వేలు ముడిచి ప్రక్క వారిని ఊరిస్తూ ఒకడు ఊరగాయలు తింటూ ఉంటాడు.ప్రక్క వాడి కంచం లోనుండి కొంత చల్ది లాక్కుని గుటుక్కున మ్రింగి వేసి, అబ్బే, నేను తిన లేదు కావాలంటే చూసుకో ! అని, నోరు చూపిస్తాడు ఒకడు.
పందెం కట్టి ఐదారుగురి చల్దులను కూరుకుని కూరుకుని మరొకడు తింటున్నాడు.ఇంకొక గోప బాలకుడు, ఒకరిదొకరం పంచుకుని తినడం స్నేహ లక్షణం అంటూ నచ్చ చెబుతూ తింటున్నాడు.అదిగో, చూడు ! కృష్ణుడు, అంటూ చూపు మరలించి, ప్రక్క వాని కంచం లోని చల్దులలో మేలైన భక్ష్య రాశిని వాడు చూడకుండా లాక్కుని తింటున్నాడు వేరొకడు .ఒకడు నవ్వుతాడు. మరొకడు నేస్తులను నవ్విస్తున్నాడు. ఇంకొకడు ఏవో ముచ్చటలు చెబుతున్నాడు. మరొకడు మురిసి పోతున్నాడు.
ఇలా నెచ్చెలి కాండ్రతో చల్దులు కుడిచే గోపాలుడు ఎలా ఉన్నాడంటే,
కడుపున దిండుగాఁగట్టిన వలువలో
లాలిత వంశ నాళంబుఁజొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద
డాపలి చేత మొనయ నునిచి.
చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు
వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి
సంగిడీల నడుమఁజక్కనఁగూర్చుండి నర్మ భాషణముల నగవు నెఱపి,
యాగ భోక్త కృష్ణుఁడమరులు వెఱగంద శైశవంబు మెఱసి చల్ది గుడిచె.

కృష్ణుడు నడుము చుట్టూ దట్టీ కట్టు కున్నాడు. దానిలో తన వేణువును ఏటవాలుగా దూర్చాడు. కొమ్ము బూరా, చేతి కర్ర - ఈ రెండింటినీ జారి పోకుండా ఎడమ చంకలో ఇరికించి పట్టు కున్నాడు. మీగడ పెరుగుతో కలిసిన చల్ది ముద్ద ఎడమ చేతిలో పట్టు కున్నాడు. ఇంటి దగ్గర అల్లరి చేసి కొసరి కొసరి కట్టించు కొని, వచ్చిన ఊరుగాయ ముక్కలను కుడి చేతి వ్రేళ్ళ సందులో ఇరికించి పట్టుకున్నాడు.సంగడీల నడుమ కూర్చున్నాడు. చక్కగా వారినందరినీ నవ్విస్తున్నాడు. అతడు యాగ భోక్త. అట్టి నల్లనయ్య బాల్య క్రీడలతో ఒప్పుతూ నెచ్చెలి కాండ్ర మధ్య కూర్చుని చల్దులు ఆరగిస్తూ ఉంటే, నింగిని దేవతలందరూ నివ్వెర పోయారు. ఆ దేవ దేవుని శైశవ క్రీడలను తన్మయులై చూస్తున్నారు.
ఇదీ చల్ది కథ. చల్దన్నం గురించి ఇంత ఉందా చెప్ప డానికి ?! అంటే, ఉంది మరి !
తవ్విన కొద్దీ తరగని నిధి కదా, మన సాహితీ సంపద !
స్వస్తి.