మంచి మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంచి మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మసి బొగ్గులు


దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపి న కారయేత్
ఉష్ణో దహతి చాంగార: శీత: కృష్ణాయతే కరమ్

ఈ చిన్న శ్లోకంలో ఎంత గొప్ప విషయం కవి చెప్పాడో చూడండి ...

చెడ్డ వాళ్ళు బొగ్గుల లాంటి వారుట ! వాళ్ళు శత్రుత్వంలో ( వేడిగా ఉన్నప్పుడు) మన చేతులు కాలుస్తారుట.

స్నేహంలో ఉన్నప్పుడు ( అంటే చల్లగా ఉన్నప్పుడు) మన చేతులని మసి చేస్తారుట !

మైత్రిలోనూ, వైరం లోనూ వాళ్ళు మనతో ఒక్కలాగే ప్రవర్తిస్తారన్న మాట.

అంచేత చెడ్డ వారితో స్నేహం వద్దు సుమా.

31, మార్చి 2010, బుధవారం

ఆశ ... దోశ ... అప్పడం ... వడ ....


అశ అనేది ఉండడం ఎవరికయినా సహజమే. కాని, అత్యాశ మాత్రం పనికి రాదు.
దురాశ దుఃఖానికి చేటు అని మన పెద్దలు చెప్పనే చెప్పారు

ఇచ్ఛతి శతీ సహస్రం సహస్రీ లక్షమీహతే
లక్షాధిపస్తథా రాజ్యం రాజ్యస్థ: స్వర్గమీహతే

వంద కలవాడు వేయి కావాలని కోరుకుంటాడు. వేయి కలవాడు లక్ష కావాలని అభిలషిస్తాడు. లక్షాధికారి
రాజ్యం (అధికారం) కావాలని ఉవ్విళ్ళూరుతాడు. పోనీ, అంతటితో ఊరుకుంటాడా అంటే, ఉహూఁ .... ప్రభుత్వం సిద్ధించిన పిమ్మట స్వర్గం ప్రాప్తించాలని కలలు కంటాడు. ఆశకి అంతు లేదు కదా ?

భాగవతంలో వామన చరిత్రలో పోతన గారి పద్యం ఒకటి చూడండి ...


ఆశాపాశము దాఁగడున్నిడుపు , లేదంతంబు రాజేంద్ర! వా
రాశి ప్రావృ త మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసింబొందిరి గాక వైన్య గయ భూకాంతాదులున్నర్ధ కా
మాశన్ బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులంజూచిరే ?

మహా సామ్రాజ్యం చేకూరినప్పటికీ వైన్యుడు, గయుడు మొదలయిన పూర్వ రాజులు ఖేద పడ లేదా ?అర్ధకామాశను విడువ గలిగారా?

పసిడి కంకణం మీద పేరాశతో పులి నోటికి చిక్కిన బాపడి కథ చిన్నప్పుడు చదువుకో లేదూ ?

రాజ్య కాంక్షతో అయిన వారినే చంపిన దుర్మార్గులు చరిత్రలో ఎందరు లేరు? అశ ఎంత చెడ్డది ?

అలాంటి వారి గురించి ధూర్జటి చెప్పిన పద్యం కూడా చూడండి ...

ఒకరింజంపి సదస్థులై బ్రతుక తా మొక్కొక్కరూహింతురే
లొకొ ? తామెన్నడుఁజావరో ? తమకు బోవో సంపదల్ ? పుత్ర మి
త్ర కళత్రాదుల తోడ నిత్య సుఖమందంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నడుం కట కటా ! శ్రీ కాళ హస్తీశ్వరా !

బంగరు లేడి లోకంలో ఉండడం దుర్లభం అని తెలిసి కూడా సీతా దేవి దానిని కోరడం , రాముడు ఆమెను విడిచి తెస్తానని వెళ్ళడం ఏం చోద్యం !

కనకమృగము భువిని కద్దు , లేదనకయె , తరుణి విడిచి చనియె దాశరధియు
తెలివి లేని వాడు దేవుడెట్లాయెరా , విశ్వదాభి రామ వినుర వేమ.

వేమన పద్యమే మరొకటి ...

నీళ్ళ లోన మీను నెరమాంసమాశించి . గాలమందు చిక్కు కరణి భువిని
ఆశ దగిలి నరుడు నీలాగు చెడి పోవు విశ్వదాభిరామ వినుర వేమ,

నీళ్ళలో చేప గాలానికి కట్టిన ఎరకి ఆశ పడి గాలానికి చిక్కి ఛస్తోంది. ఆశ కి తగిలిన మానవుడూ అలాగే నశిస్తాడు సుమా.

ఆశయా బద్ధతే లోకే ... అన్నారు పెద్దలు. అత్యాశ కూడదని చెప్పడమే లక్ష్యం.

30, మార్చి 2010, మంగళవారం

చెప్తే వినాలి ...

సంతస్తాయసి సంస్థితస్య పయసో నామాసి నశౄయతే
ముక్తాకారతయా తదేవ నలినీ పత్ర సితం దృశ్యతే
అంతస్సాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధం మధ్యమోత్తమ జుషా మేవం విధా వృత్తయ :

నీరము తప్త లోహమున నిల్చి యనామకత్వ మై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీ దళ సంస్థితమై తనర్చు , నా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభు
బౌరుష వృ త్తులిట్లధమ మధ్యమునుత్తముఁగొల్చు వారికిన్

బాగా కాలిన లోహం మీద పడి నీరు వెంటనే అనామకంగా ఆవిరయి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుమీద ముత్యంలా మెరుస్తుంది. అదే నీరు శుక్తిలో పడితే... మణిగా భాసిస్తుంది.

అలాగే, మనం అధములను సేవిస్తే నాశనమై పోతాం. మధ్యములని సేవిస్తే ఒకింత రాణిస్తాం. ఉత్తములని సేవించుకుంటే గొప్ప కీర్తిమంతులమౌతాము.

దుర్జనులు ఎప్పుడూ పరిహరించదగిన వారే. పడగ మీద మణి ఉంది కదా అని, నాగుపాముని ఆదరించం కదా ?

28, మార్చి 2010, ఆదివారం

అవును కదూ ?

ఆరంభ గుర్వీక్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృధ్ది ముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్నా, ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం


మొదల చూసిన కడు గొప్ప పిదప కుఱుచ
ఆది కొంచెము తర్వాత నధిక మగుచు
తనరు దిన పూర్వ పర భాగ జనిత మైన
ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి


కుజనుల మైత్రి మొదట ఎక్కువగా ఉండి తర్వాత తగ్గి పోతుంది .
మంచి వారితొ స్నేహం మొదట తక్కువగా ఉండి పిదప పెరుగుతుంది.

కుజనులతొ మైత్రి ఉదయకాలపు నీడ లాగున, సజ్జనులతొ మైత్రి సయంకాలపు నీడ లాగున ఉంటాయి .

10, మార్చి 2010, బుధవారం

ఇచ్చుటలో ఉన్న హాయీ ....

ప్రియ:ప్రజానాం దాతైవ న పునర్ద్రవిణేశ్వర:

అగచ్ఛన్ కాంక్ష్యతే లోకై ర్వారిదో నతు వారిధి :

మబ్బు ఎప్పుడూ నీటినే యిస్తుంది. సముద్రం నీటిని పుచ్చుకుంటుంది. దానికి యివ్వడం తెలియదు !

ఎంత మంచి శ్లోకమో చూసారు కదూ ?

ఇవ్వడంలోని గొప్పతనం అలాంటిది మరి...

ఇవ్వడంలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పే మంచి పద్యం ఒకటి పోతన గారి భాగవతంలో ఉంది. చూడండి ...

ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువు పై నంసోత్తరీయంబుపైఁ

బాదాబ్జంబులపై కపోల తటిపైఁబాలిండ్లపై నూత్న మ

ర్యాదం జెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే

ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !

వామన చరితంలోని ఈ పద్యం బలి చక్రవర్తి శుక్రాచార్యునితో పలికినది. . తెలుగు సాహిత్య చరిత్రలో మకుటాయమానమైన

పద్య రత్నాలలో యిదొకటి !

9, మార్చి 2010, మంగళవారం

అల్లుడా ! మజాకానా !!

సదా వక్ర: సదా క్రూర: సదా పూజామపేక్షతే

కన్యారాశి స్థితో నిత్యం జామాతా దశమ గ్రహ:

ఎప్పుడూ కుటిలంగానే ఆలోచిస్తూ ఉంటాడు. తనని అందరూ నిత్యం గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాడు.

అమ్మాయి కొంగు ఒక్క క్షణం సేపు కూడా వదలడు. ఎవరయ్యా ? దశమ గ్రహంగా పిలవబడే అల్లుడు !

అప్పొసింగిన వాడును, అల్లుడ, ద్దె

యింటి యజమానుడు, జీతమిచ్చు వాడు

కుల వినోదియు, పన్నులు కూర్చు వాడు

పుస్తె కట్టని మగడు పో పురుషులకు !

ఆడ పడుచు అర్ధ మొగుడని మనం విన్నదే కదా ? ఆ పద్యంలో మగాళ్ళకి మొగుళ్ళ గురించి చెబుతున్నాడు కవి.

వెలయాలు, శిశువు, అల్లుడు

నిలయేలిక, యాజకుండు, నేవురు ధరలో

కలిమియే లేమియు దలపరు

కలియుగమున కీర్తి కామ కాటయ వేమా !

ఉందా, లేదా అని చూడకుండా పీడించే వాళ్ళ జాబితా చూడండి ... మీది పద్యంలో చెప్పిన ఐదుగురూ వీర లెవెల్లో పీడించడమే పనిగా పెట్టుకునే వాళ్ళుట ...

మోడరన్ అల్లుళ్ళ గురించి పాత కాలపు కవి వాపోయిన విధంబెట్టిదనిన ...

నీటయిన యింగ్లీషు మోటారు సైకిలు

కొని పెట్ట వలెనను కూళ యొకడు

రిస్టు వాచియు, గోల్డు రింగును, బూట్సును

సూట్లు కావలెనను శుంఠ యొకడు

బియ్యే, బియల్ వరకయ్యెడు ఖర్చు

భరియింప వలెనను దరిధ్రుడొకడు

భార్యతోడను చెన్న పట్టణంబుననుంచి

చదివింప వలెనను చవట యొకడు

సీమ చదువులు చాల సింపిలు, నన్నట

కంప వలెననుచు నడుగు నొకడు

ఇట్లు కొసరు కింద నిష్టార్ధముల్ వరులు

దెలుపు చున్న వారు తెల్లముగను

మరో శ్లోకం చూడండి ...

జామాతరో, భాగినేయా, మాతులా దారబాంధవా

అగ్నాతా ఏవ మాతులాం భక్షయంత్యాఖువత్ సదా

దార బాంధవులు నిత్యం మన సంపాదనని ఎలుకల్లా తినేస్తారుటండీ ...

అలుని మంచితనంబును

గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్

పొల్లున దంచిన బియ్యము

తెల్లని కాకులును లేవు తెలియగ సుమతీ !

శ్వశుర మందిర నివాస: స్వర్గతుల్యో నరాణాం

యది భవతి వివేక: పంచభిషడ్దినైర్వా

దధి మధు క్షీర లోపో మాసమేకం నరాణాం

తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగ:

అత్తవారిల్లు అయిదారు రోజులు స్వర్గ తుల్యమే. పంచ భక్ష్య పరమాన్నాలూ అమరుస్తారు ... పాత బడితే పాద రక్ష ప్రయోగమే సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు.

8, మార్చి 2010, సోమవారం

తినడం మానెయ్యొద్దు

దోషభీతే రనారంభ: తత్కాపురుషస్య లక్షణం
కైర జీర్ణ భయాత్ భ్రాత: భోజనం పరిహీయతే ?
తప్పునకు భయపడి ఏ పనీ చేక పోవడం మంచిది కాదు. అరగదని చెప్పి , అన్నం తినడం మానేస్తామా చెప్పండి

15, ఫిబ్రవరి 2010, సోమవారం

పేరు చెబితే చాలదు ...

శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖా :
యస్తు క్రియవాన్ పురుష: స విద్వాన్
సు చింతితం ఔషధ మాతురాణాం
నా నామ మాత్రేణ కరోతి శాంతి :

బాగా ఆలో చించి నిర్ణయించిన ఔషధమే అయినా, దాని పేరు చెప్పినంత మాత్రాన రోగం పోదు కదా ? శాస్త్రాలు చదివినా, క్రియాశేలురు కాక పోతే మూర్ఖులుగానే మిగిలి పోతారు.

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

వాక్యం రసాత్మకం కావ్యం ...

నిరవద్యాని పద్యాని యద్యనాధస్య కా క్షతి:
భిక్షుణా కక్ష నిక్షిప్త కిమిక్షుర్నీరసో భవేత్ ?


కవి దరిద్రుడయినా, ధనికుడయినా, కవిత్వం రసవంతంగా ఉంటే చాలు. బిచ్చగాని చేతి చంకనున్నంత మాత్రాన చెఱకు గడకు తీపి తరిగి పోదో దు కదా !

8, ఫిబ్రవరి 2010, సోమవారం

పులి జూదం







అశ్వం నైవ గజం నైవ
వ్యాఘ్రం నైవచ నైవచ
అజా పుత్రం బలిం దద్యాత్
దైవో దుర్బల ఘాతక:


గుఱ్ఱాన్నీ, ఏనుగునీ బలి యివ్వరు. బలం లేని మేకనే బలి యిస్తారు. దేవుడు దుర్బలులనే శిక్షిస్తాడు కదా !
చరిత్ర గతిని పరిశీలిస్తే , యిది నిజమే అనిపిస్తుంది కదూ ! ఈ పర పీడన పరాయణత్వం అంతటా కనిపిస్తూనే ఉంటుంటుంది.

‘‘ బలవంతులు దుర్బల జాతిని
బలహీనుల కావించారు
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం ?

నర జాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం ... ’’ అని శ్రీ.శ్రీ అన లేదూ ?


భాస్కర శతకంలోని పద్యం అదే చెబుతోంది కదూ !

తగిలి మదంబుచే నెదిరిఁదన్ను నెఱుంగక దొడ్డ వారితోఁ
బగఁగొని పోరుటెల్ల నతి పామరుడై చెడు ; టింతెఁగాక, తా
నెగడి జయింప నేరడిది నిక్కము ; తప్పదు ; ధాత్రి లోపలన్
దెగి యొక కొండతోఁదగరు ఢీ కొని తాకిన నేమి భాస్కరా !


తన బలమేమిటో గ్రమించుకో లేక, ఎదిరి బలాన్ని ( శత్రువు బలాన్ని) అంచనా వేసుకోకుండా, బలవంతుడితో ఢీకొట్టి పోరుకి సిద్ధ పడిన వాడు చెడి పోతాడనడంలో సందేహం లేదు...
లోకంలో కొండని మదంతో ఢీ కొట్టిన పొట్టేలు ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం కదా ! కొండ అలాగే ఉంటుంది. పొట్టేలు మాత్రం ఛస్తుంది.

ఈ చెప్పిన విషయాలు కొంత నిరాశా వాదాన్ని ప్రోది చేస్తున్న వేమో అనుకునే పని లేదు. వ్యష్టి శక్తి సమిష్టి శక్తిగా రూపు దాల్చడం జరుగని రోజులవి. అయినా, దోపిడీ వర్గ స్వభావాన్నీ, బలాన్నీ చక్కగానే అంచనా వేసాయనే చెప్పాలి.
చీమలు పెట్టిన పుట్టలు పాముల ఆక్రమణకి లోను కావడం ఈ దోపిడీనే తెలియ జేస్తుంది.

అయితే, మన బద్దెన కవి హెచ్చరిక చేయనే చేసాడు కదూ ! ...


బలవంతుఁడ నాకేమని
బలువురితో నిగ్రహించి పలుకుట మేలా ?
బలవంతమైన సర్పము
చలి చీమల చేతఁజిక్కి చావదె సుమతీ !

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

అధికారాంతమునందు చూడవలె ....







ఒక చక్కని శ్లోకం చూదామా?

ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే


ఈ శ్లోకంలో కవి అన్నిటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...

ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నవు కదా !

త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తవులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !


ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...

విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !


నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...

ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్

రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...

అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...

కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.
ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !

అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !


6, ఫిబ్రవరి 2010, శనివారం

చిలుకా పలకవే ....





సద్విద్యా యది కా చింతా
వరా కోదర పూరణే
శుకోప్యశన మాప్నోతి
రామ రామేతి చాబ్రువన్


ఎంత చక్కని శ్లోకమో చూడండి ...
రామ రామ అనే రెండు మాటలు నేర్చిన చిలుకే తన తిండిని తాను సంపాదంచుకో గలుగుతోంది. హాయిగా బ్రతుకుతోంది.
మరి, బాగా చదువుకున్న వారికి ఎందుకంత బెంగ ?

బాగుంది కదూ ! ఇలాంటి చక్కని శ్లోకాల నీ, మంచి పద్యాలనీ ఇక నుండీ ఈ టపాలో మీరు చూడ వచ్చును ...

4, జనవరి 2010, సోమవారం

ఆగండి, మీరూ కొంచెం ఆలోచించండి ...


మనం నిత్యం ఎదుర్కొనే ఒక యిబ్బంది గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా?
కిక్కిరిసిన సిటీ బస్ లో ప్రయాణం చేస్తున్నాం. ఒంటి కాలి మీద ఆపసోపాలు పడుతూ నిలబడి ఉన్నాం. బస్ ఎంతవరకూ వచ్చిందో తెలీదు. కండక్టరు అరచి చెప్పడు. చెప్పినా, గోలలో వినబడదు. అంతా కంగారు కంగారుగాఉంటుంది.బస్ లో బయటకి సందు చేసుకుని చూస్తాం. నగరం మీకు పాతదే అయినా, ఏరియా మీకు కొత్త. ఎంత వరకూ వచ్చారో తెలీదు. బోర్డూ ఉండదు. ఎంతకని పక్క వాళ్ళని అడిగి విసిగిస్తాం చెప్పండి.

పరిష్కారం : రోడ్డు ప్రక్క ఉన్న ప్రతి బోర్డు మీదా వాళ్ళ షాపుల పేర్లూ గట్రా రాసుకోవడంతో పాటు ... షాపున్నఏరియా పేరు విధిగా రాయాలని కట్టడి చేయడం. ఏరియా పేరు లేని బోర్డునీ ఉంచడానికి నగర పాలక సంస్థఅంగీకరించక పోవడం. నిర్బంధంగా, బోర్డుల సైజులని బట్టి, అక్షరాల సైజులు ఉండేలా తెలుగు, ఇంగ్లీషు భాషలలోరాసేలా నిబంధనలు పెట్టడం.
బస్ షెల్టర్ల మీద కూడా ఏవో ప్రకటనలే తప్ప ఏరియా పేరు కనిపించక పోడం ఘోరం కదూ?

ట్రాఫిక్ ఐలెండ్ దగ్గరుండే పోలీస్ సిగ్నల్ ఉండే చోట బంక్ ల మీద కూడా ఏరియా పేరు కనిపించదు. గమనించేరా?

నగరంలో అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రమే ఏ రియా పేరు ఏ కొందరో తమ సైన్ బోర్డుల మీద రాసేరు.( ఆ పుణ్యాత్ములకి శత కోటి వందనాలు)

బస్ లో వెళ్ళే వారికే కాదు, నడిచి వెళ్ళే వారికీ, ఇతర వాహనాల మీద వెళ్ళే వరికీ కూడా యిబ్బంది ఎప్పుడూఎదురవుతూనే ఉంటుంది... ఓ సారి ఓ స్కూటరిస్ట్ నా పక్కకి వచ్చి బండి ఆపి. ‘ ఫలానా ఏరియా ఏదండీ’ అనడిగేడు. ‘అయ్యో, మీరు దాన్ని దాటి చాలా దూరం వచ్చేసారే ! మళ్ళీ వెనక్కి వెళ్ళండి .. ఆరు కిలో మీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడ అడగండి.‘ అని చెప్పాను ... బిక్క ముఖం వేసుకుని,యీసురోమంటూ బండిని వెనక్కి తిప్పడం కోసం ముందుకి మరో అర కిలోమీటరు వెళ్ళి ... అతను పడ్డ అవస్థ గురించి యిప్పుడెందుకు లెండి ... ... వాహన చోదకులకి , వాహనాల మీద పయనించే వారికీ, పాద చారులకి, యీ యిబ్బంది తొలిగి పోవాలంటే మార్గమే లేదా?
తెలిసిన వాళ్ళకి ఫరవా లేదు. కొత్త వారికి మాత్రం నరక యాతనే కదూ?
చదువుకునీ, చదువు రాని వాళ్ళలా కొత్త చోట్ల వెర్రి మొహాలు వేయ వలసి రావడం ఎంత దారుణమో ఆలోచించండి ...
మీకు తోచిన మరిన్ని మంచి పరిష్కారాలని సూచించండి ...