18, జనవరి 2020, శనివారం

పలుకే బంగారం 08


                                                   
                                               

 పలుకే బంగారం  08

నీతులకేమి యొకించుక
బూతాడక నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుంద వరపు కవి చౌడప్పా !

నీతి మాటలు  చెప్పడాని కేముందిలే... బూతు మాట్లాడక పోతే సభాసదులు నవ్వరు. నీతులూ, బూతలూ లోక ఖ్యాతులు అంటాడు చౌడప్ప.  జానపదుల కన్నా, మన రాజకీయ సన్నాసులు ఈ మాటను బాగా ఒంటబట్టించు కున్నట్టుది కదూ?

17, జనవరి 2020, శుక్రవారం

పలుకే బంగారం 07


                                                                   


పలుకే  బంగారం  07 

సభలో సభారంజకంగా మాట్లాడలంటే ఎలాంటివి మాట్లాడాలో కవి చౌడప్ప తన మార్కు పద్యంలో చెప్పాడు. గమనించండి...

పది నీతులు పది బూతులు
పది శృంగారములు కల్గు పద్యములు సభన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుంద వరపు కవి చౌడప్పా !

సభారంజకగా మాట్లాడాలంటే   ఓ పది నీతులూ, ఓ పది బూతులూ ప్రసంగంలో ఉండాలని చెబుతున్నాడు.

సభలలో అలాంటి మాటలు గౌరవ ప్రదాలే కాబోలు.

16, జనవరి 2020, గురువారం

పలుకే బంగారం 06



                                            

పలుకే బంగారం  06

ప్రియ భాషణల గురించి పోతన గారి పద్యం చూడండి...

అనుదిన సంతోషణములు,
జనిత శ్రమ తాప దు:ఖ సంశోషణముల్
తనయులు సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్

పోతన గారు భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెప్పిన పద్యమిది.

కొడుకుల ముద్దు మాటలు జనకులకు నిత్యం ఆనందాన్ని కలిగిస్తూ. విచారాలని పోగొడుతూ ఉంటాయి. పిల్లకాయల పలుకులు వారి చెవులకి మంచి అలంకారాలు ...

13, జనవరి 2020, సోమవారం

పలుకే బంగారం o5


                                                     


పలుకే బంగారం  05

తనకి తెలిసిన మంచిని చెప్పక పోవడం కూడ పాపహేతువేనని నన్నయ గారు ...

తనయెఱిఁగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును, సత్యము సె
ప్పని వాడును ఘోర నరక కంపమునఁబడున్.

తనకి తెలిసిన విషయాన్ని, నాకది చెప్పవయ్యా, అని ఎవరయినా కోరితే, తనెరిగిన దానిని చెప్పని వాడూ, సత్యము పలుకని వాడూ పెను నరకంలో పడతాడని నన్నయ్య గారు మహా భారతంలో చక్కగా హెచ్చరించారు ...

12, జనవరి 2020, ఆదివారం

పలుకే బంగారం 04




పలుకే బంగారం  04
 సనాతన ధర్మం చూడండి ...

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మస్సనాతన:

సత్యాన్నే పలకాలి.ప్రియ వచనలాలే పలకాలి. సత్యమయినా, అప్రియాన్ని పలకవద్దు. ప్రియమైన దయినప్పటికీ అసత్యం పలక వద్దు. ఇది సనాతన ధర్మం.

11, జనవరి 2020, శనివారం

పలుకే బంగారం 03


పలుకే బంగారం  03



భర్తృహరి ఎలా వాపోయాడో చూడండి ...

బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవ: స్మయ దూషితా:
అబోధో పహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితమ్

బాగా తెలిసిన వారికి మదం, మాత్సర్యం జాస్తి.
చెబితే వినరు.
 ప్రభువులా - వారసలే గర్విష్ఠులు. వారికి చెప్ప లేం.
ఇక ఇతరులంటారా, వారికి చెప్పినా అర్ధం కాదు.
అందుల్ల నాలుగు మంచి మాటలు చెబుదామన్నా నోరు దాటి బయటకి రావడం లేదు.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం కూడా చూడండి ...

బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజులబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.

10, జనవరి 2020, శుక్రవారం

పలుకే బంగారం 02



                                            

పలుకే బంగారం  02

బద్దె భూపాలుడు సుమతీ శతకంలో ఇతరుల మనసు బాధించకుండా మాటలాడ దగునని చెప్పాడు
.

ఎప్పటి కెయ్యది ప్రస్తుత,
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపకఁదానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

ఎప్పుడేది మాట్లాడాలో అప్పుడది మాట్లాడాలి. ఇతరులు మనసులు బాధించ కూడదు. అలా లౌక్యంగా వ్యవహరించే వాడు ధన్యుడయ్యా అంటాడు కవి.

అలా అని ఇతరుల మెప్పు కోసం వారికి నచ్చుతుందని చెప్పి నానా చెత్తా పలకమని కాదు ...
పరుషంగా కాక, కాస్త సౌమ్యంగా మాట్లాడమని కవి బోధిస్తున్నాడు...

9, జనవరి 2020, గురువారం

పలుకే బంగారం 01




పలుకే బంగారం  01

సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణం. మంచిగా మాట్లాడితే అందరూ మిత్రులే. కఠినోక్తుల వల్ల మనకి అంతా శత్రువులవడం తథ్యం.

ఈ చిన్న కంద పద్యంలో కవి ఆ విషయాన్ని ఎంత చక్కగా వివరించాడో చూడండి ...

కాకేమి తన్నుఁదిట్టెనె ?
కోకిల ధనమేమి తన్నుఁగో కొమ్మనెనే !
లోకము పగయగు బరుసని
వాకున ,జుట్టమగు మధుర వాక్యము కలిమిన్ !

పాపం, కాకి నిన్నేమీ తిట్ట లేదు కదా ? అదంటే అసహ్యించుకుంటావేం ? ఊరికే కాకి గోల ! అంటూ విసుక్కుంటావు. మరి, కాకిలాగా నల్లగానే ఉంటుంది కదా, కోకిల - అది నీకేమీ పెట్టుపోతలు జరిపించడం లేదు కదా ? దాని గొంతువిని మెచ్చుకుంటావు ?

మధురంగా పలకడం చేతనే కదా కోకిలని యిష్ట పడుతున్నావు ?

అందు చేత, మంచిగా మాట్లాడడం వల్ల అందరి ప్రేమనూ పొందవచ్చును. రుస రుసలాడుతూ ఉంటే ఎవరూ హర్షించరు. సరి కదా, చీదరించుకుని, దూరంగా జరిగి పోతారు ....

8, జనవరి 2020, బుధవారం

వేమన ఏమని చెప్పాడూ ?


                                     

                 పట్టు విడువ రాదు 11.

నిరాశతో ఏ పనీ చేయకుండా ఉండడం తగదు.
 వేమన ఏమని చెప్పాడూ ?

పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు
పట్టెనేని బిగియ పట్ట వలెను
పట్టి విడుచుకన్నఁబడి చచ్చుటయె మేలు
విశ్వదాభిరామ వినుర వేమ.

పట్టు విడువ రాదు శీర్షకన ఇది పదకొండోది. ఇది. మరో శీర్షికతో రేపు కలుద్దాం.

7, జనవరి 2020, మంగళవారం

దేనికయినా ప్రాప్తం ఉండాలి


                                   

పట్టు విడువ రాదు 10


ఎట్టుగఁబాటు పడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు, నిబద్ధి; సురావళిఁగూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁగవ్వము సేసి మధించిరంతయున్
వెట్టియెఁగాక యే మనుభవించిరి వారమృతంబు భాస్కరా !


ప్రాప్తం అంటూ లేక పోతే, ఎంత చేసినా మనకి ప్రయోజనం సిద్ధించదు. అది నిజం. మంధర పర్వతాన్ని పెకలించి, కవ్వంగా చేసుకుని, వాసుకిని తాడుగా చేసుకుని, రాక్షసులు కూడా దేవతలతో పాటు అమృతం కోసం సాగర మథనం చేయ లేదూ !...పాపం, వారి చాకిరీ అంతా వెట్టి చాకిరీ అయిందే తప్ప వారికి అమృతం దక్క లేదు కదా ?

6, జనవరి 2020, సోమవారం

అసాధ్యం సుసాధ్యం అవుతుదా ?


                                             

పట్టు విడువ రాదు 09

దైవ  సంకల్పం మరొకలా ఉంటే, ఒక్కోసారి మన ప్రయత్నం ఫలించక పోవచ్చును  ...

యదశక్యం న తచ్ఛక్యం, యచ్ఛక్యం శక్యమేవతత్
నోదకే శకటం యాతి నచ నౌర్గచ్ఛతి స్థలే

ఏది చేయడానికి సాధ్య పడదో, అది జరగమన్నా జరగదు.
 జరిగేది జరుగకా మానదు.
నీటి మీద బండినీ, నేల మీద నౌకనీ నడప లేం కదా !!

5, జనవరి 2020, ఆదివారం

పడుకున్న సింహానికి పస్తే...


                                           


పట్టు విడువ రాదు 08

ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి, నమనో రధై:
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా :

కోరిక ఉంటే చాలదు. అది నెర వేర్చుకునే ప్రయత్నమూ చేయాలి. కేవలం మనోరధంతోటే పనులు చేకూరవు. నిద్రిస్తున్న సింహం నోటి లోకి ఆహారంగా జంతువులు వాటంతట అవి వచ్చి పడవు కదా? ఎంత మృగరాజయినా తన ఆహారసముపార్జనకు వేటాడి తీర వలసినదే కదా !

4, జనవరి 2020, శనివారం

దైవానుగ్రహం ఉండాలి...


                               


                   పట్టు విడువ రాదు 07

దైవం అనుకూలించక పోతే, మనం ఏమీ చేయ లేం ...

కాకతాళీయవత్ ప్రాప్తం దృష్ట్వాZపి నిథి మగ్రత:
న స్వయం దైవమాదత్తే పురుషార్ధ మపేక్షతే

దైవానుగ్రహం లేక పోతే, ఎదురుగా ఉన్న నిధి కూడా మన కంట పడదు.

అందు వలన దైవానుగ్రహాన్ని అపేక్షిస్తూ, మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేయనిదే ఏదీ మనలకు తనంతట తాను చేకూరదు.

3, జనవరి 2020, శుక్రవారం

దేవుడి సాయం




పట్టు విడువ రాదు 06


యథాహ్యేకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్
ఏవం పురుష కారేణ వినా దైవం నసిద్ధ్యతి

ఒకే ఒక చక్రంతో రథం నడవదు కదా ? అలాగే, దైవానుగ్రహం లేక పోతే, మానవ ప్రయత్నం సిద్ధించదు.

దైవం అనుకూలించక పోతే, మనం ఏమీ చేయ లేం ...


2, జనవరి 2020, గురువారం

ప్రయత్నం చేసే వాడిదే విజయం




పట్టు విడువ రాదు 05


ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ:
దైవేన దేయమితి కాపురుషా వదంతి
దైవం నిహత్య కురు పౌరుషమాత్మ శక్త్యా
యత్నే కృతే యది న సిద్ధ్యతి కోZత్ర దోష: ?

ప్రయత్నం చేసే వాడికే విజయం వరిస్తుంది. అన్నీ దేవుడే యిస్తాడు కదా అని, ఏ పనీ, ఏ ప్రయత్నమూ చేయకుండా ఉండండం నీచుల లక్షణం. ఒక వేళ నీ ప్రయత్నం నీవు చేసినా, విజయం లభించ లేదనుకో, దాని వలన నీ తప్పేమీ లేదు. దైవానుగ్రహం అంతే అనుకోవాలి.

1, జనవరి 2020, బుధవారం

మంచి మాటలు విందాం



                           


పట్టు విడువ రాదు 04

దైవానుగ్రహం లేనిదే మనం ఏదీ సాధించ లేం. అలాగే, దైవానుగ్రహం ఉన్నప్పటికీ మానవప్రయత్పం చేయక తప్పదు.

గజేంద్రోపాఖ్యానం కథలో కరి రాజు వేల యేండ్లు మొసలితో పోరాడిన పిదప కానీ హరి కరుణించ లేదు కదా ? మానవ ప్రయత్నం చేయ వలసిన ఆవశ్యకతని ఆ కథ మనకి తెలుపుతోంది ...

నదైవమేవ సంచిత్య త్యజేదుద్యోగమాత్మన:
అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి

దైవం మీద భారం వేసి. మన ప్రయత్నం మనం చేయకుండా ఉండడం తగదు. ప్రయత్నం చేయనిదే తిలలనుండి తైలం రాదు కదా?


31, డిసెంబర్ 2019, మంగళవారం

మానవ ప్రయత్నం అవసరం సుమా...



                                       

పట్టు విడువ రాదు 04

దైవానుగ్రహం లేనిదే మనం ఏదీ సాధించ లేం. అలాగే, దైవానుగ్రహం ఉన్నప్పటికీ మానవప్రయత్పం చేయక తప్పదు.

గజేంద్రోపాఖ్యానం కథలో కరి రాజు వేల యేండ్లు మొసలితో పోరాడిన పిదప కానీ హరి కరుణించ లేదు కదా ? మానవ ప్రయత్నం చేయ వలసిన ఆవశ్యకతని ఆ కథ మనకి తెలుపుతోంది ...

నదైవమేవ సంచిత్య త్యజేదుద్యోగమాత్మన:
అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి

దైవం మీద భారం వేసి. మన ప్రయత్నం మనం చేయకుండా ఉండడం తగదు. ప్రయత్నం చేయనిదే తిలలనుండి తైలం రాదు కదా?


30, డిసెంబర్ 2019, సోమవారం

పడి లేచే కడలి తరంగం




పట్టు విడువ రాదు 03

యథా కందుక పాతే నోత్పతత్యార్య: పతన్నపి
తథా త్వనార్య: పతతి మృత్పిండ పతనం యథా

కందుకము వోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ మీఁదికిన్నెగయుఁజుమీ !
మందుడు మృత్పిండము వలె
గ్రిందబడి యడగి యుండుఁగృపణత్వమునన్

బంతి నేలకేసి కొడితే ఎలా తిరిగి మీదికి లేస్తుందో, సజ్జనుడు కూడ ఒక వేళ ఓటమి పాలయినా, తిరిగి పుంజుకుని లేస్తాడు.

తెలివి తక్కు వాడు మాత్రం నేల కేసి కొట్టిన మట్టి ముద్ద లాగా మరింక పైకి లేవడు.


29, డిసెంబర్ 2019, ఆదివారం

పట్టు విడువ రాదు 02




                                    


పట్టు విడువ రాదు   02

ఛిన్నోZపి రోహతి తరు: క్షీణోప్యుపచీయతే పునశ్చంద్ర:
ఇతి విమృశన్తస్సన్త: సన్తప్యన్తే నవిప్లుతాలోకే

ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుఁడయ్యును నభివృద్ధిఁజెందు సోముఁ
డివ్విధమున విచారించి యొడలుఁదెగిన
జనములనుఁదాప మొందరు సాధు జనులు.

చెట్టుని చూడండి. నరికినా తిరిగి చిగురిస్తుంది. చంద్రుడూ అంతే కదా? కృష్ణ పక్షంలో కళలు క్షీణించినా, తిరిగి శుక్ల పక్షంలో పుంజుకుని, పూర్ణిమ నాటికి నిండు జాబిల్లిగా అవతరిస్తాడు. ఇలాగే సాధు జనులు ఓటమిని , ఆపదని, గాయాలను సరకుగొనరు. తిరిగి లేచి తమ ప్రతాపం చూపెడతారు.