24, డిసెంబర్ 2014, బుధవారం

అన్నదాతా సుఖీ భవ !



వస్తూనే అన్నాడు కోనేటి రావు: ‘‘ హబ్బ! ఘుమఘుమలాడి పోతోంది, అక్కయ్య గారు పకోడీలు వేయిస్తున్నట్టున్నారు ..’’ అని. సరిగ్గా సమయానికే వస్తాడు కోనేటి రావు.
‘‘ పకోడీలు కావయ్యా, బజ్జీలు ...’’ అన్నాను.
‘‘ ఏవో ఒకటి, అక్కయ్య గారూ, వేగిరం తెండి , నోరూరి పోతోంది’’ వంట గది లోకి చూస్తూ కేకేసాడు.
అతను మా యింట్లో ఉన్నప్పుడు నేను వేరే ఎవరి యింట్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఆహార ప్రియుల తీరు ఇలాగే ఉంటుంది. ఇవాళ మన కథామంజరిలో అంతా తిండి గోలే. ఇక చదవండి:
పంక్తిభేదే పృథక్పాకే, పాకభేదే తథా2కృతే,
నిత్యం చ గేహకలహే, భవితా వసతి స్తవ.
ఒకే పంక్తిలో కూర్చున్న వారికి భేదంగా వడ్డించే చోట లక్ష్మీ దేవి నిలువదట ! అంటే, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోనూ అనే సామెత ఉంది చూసారూ ? అలాగన్న మాట.
వడ్డించే వాడు మన వాడయితే, కడ పంక్తిని కూర్చున్నా ఫరవా లేదంటారు. అయితే, ఒకే వరసలో కూర్చున్న వారికి వడ్డన విషయంలో భేదం చూప కూడదు. అందరకీ ఒకేలా వడ్డించాలి. ఒకరికి కొంచెం ఎక్కువా, కొందరకి కొంచెం తక్కువా, కొందరకి కొసరి కొసరి, కొందరకి విదిలించి నట్టుగానూ వడ్డించ కూడదన్న మాట. అలా చేస్తే ఇంట లక్ష్మి ఉండదంటున్నాడు శ్లోక కర్త.
అలాగే, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కునే చోట కూడా ధనం ఉండదు. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే పొయ్యి మీద వండుకుని తినాలి. వేరు పడి పోయి, ఒకే ఇంట వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కోవడం మొదలెడితే ఆ యింట లచ్చి తల్లి ఉండదు.
అసలే వండు కోని ఇంట కూడా ఆ తల్లి ఉండదుట.
అలాగే, నిత్యం కలహాలతో నిండి ఉండే ఇంట కూడా లక్ష్మీ దేవి ఉండదు.
అంటే, పంక్తి వడ్డనలో భేదం పాటించే వారింట, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని ఒకే ఇంట వండుకునే వారింట, అసలే వండు కోని వారింట, నిత్యం కలహాలతో కాపురం చేసే వారింట పెద్దమ్మ (దరిద్ర దేవత) తిష్ఠ వేస్తుంది. చిన్నమ్మ లక్ష్మి అక్కడి నుండి తొలగి పోతుంది అని దీని భావం.
లక్షాధికారైన లవణమన్నమె కాని, మెఱుగు బంగారమ్ము మ్రింగ బోడు.
అయితే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.
ఆదరాబాదరాగా తిన కూడదు. నోట్లో కుక్కుకుంటూ ఏదో ఇవేళ్టికి భోజనం అయిందనిపించ కూడదు.
నింపాదిగా, శ్రద్ధగా భోజనం చేయాలి.
భుంజానో న బహు భ్రూయాత్, న నిందేదపి కంచన
జుగుప్పసితకథాం నైవ, శ్రుణుయాదపి వా వదేత్.
భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడ కూడదు. ఇతరులను తిడుతూ నిందా ప్రసంగాలు చేయ కూడదు. అసహ్య కరమయిన కథనాలు చేయ కూడదు. విననూ కూడదు.
చరక సంహిత ఏమి చెబుతున్నదో చూడండి:
ఉష్ణ మశ్నీయాత్, స్నిగ్ధ మశ్నీయాత్, మాత్రావ
దశ్నీయాత్, జీర్ణే2శ్నీయాత్, వీర్యా2విరుద్ధ మశ్నీయాత్
ఇష్టే దేశే2శ్నీయాత్, నాతిద్రుత మశ్నీయాత్, నా2తి
విలంబిత మశ్నీయాత్, అజల్పన్నహసన్ తన్మనా భుంజీత,
ఆత్మానమభిసమీక్ష్య భుంజీత.
వేడి పదార్ధాలనే తినాలి.
చమురు గల ఆహారాన్ని తినాలి. ( అలాగని ఎక్కువ నూనె పదార్ధాలూ పనికి రావు సుమా )
మితంగా భుజించాలి.
ముందు తిన్నది జీర్ణమయిన తరువాతనే తిరిగి ఆహారం తీసు కోవాలి.
ఒకదానికొకటి పొసగని పదార్ధాలు ఏక కాలంతో తినరాదు.
మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే చోట, శుచిగా ఉండే చోట తినాలి. తినే చోట గలీజుగా ఉండ కూడదు.
త్వర త్వరగా మ్రింగ కూడదు. మెక్కడం చేయ కూడదు.
అలాగని అతి నెమ్మదిగా కూడా తిన వద్దు.
అతిగా మాటలాడుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ భోజనం చేయ కూడదు.
ఏకాగ్ర చిత్తంతో తినాలి.
ఏ పదార్ధం ఎంత అవసరమో, హితమో తెలుసుకుని అంతే తినాలి.
ఇలా తింటే నూరేళ్ళు బ్రతకొచ్చని శ్లోకంలో కవి భరోసా ఇస్తున్నాడు.
అలాగే ఒంటిపిల్లి రాకాసిలా ఒక్కరే కూచుని తినడం మంచిది కాదు.
ఏకఏవ నభుంజీత, యదిచ్ఛేత్సిద్ధి మాత్మన:
ద్విత్రిభి ర్బహుభి స్సార్ధం, భోజనం తు దివానిశమ్,
పగలు కానీ రాత్రి కానీ, ఒంటరిగా తిన కూడదు. ఇద్దరో, ముగ్గురో సహ పంక్తిని కూర్చుని భుజిస్తూ ఉండగా తినాలి. అలా చేస్తే ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.
ఇప్పుడంటే గేదె బోయినాలు ( బఫేలు) వచ్చేయి కానీ వెనుకటి రోజులలో నేల మీద అరిటాకులో, విస్తళ్ళో వేసి వడ్డంచే వారు. వడ్డిస్తున్నాం, కాళ్ళు కడుక్కుని రండి. అనడం అలవాటు.
విందు భోజనాలకు పిలుస్తూ దేవతార్చనకు మా యింటికి దయ చేయండి అనే వారు. మా ఊళ్ళో అయితే, శుభాశుభ కార్యాలకు భోజనాలకి వెళ్తూ , శుభ కార్యాలకయితే పట్టు పంచెలు, దినకర్మలలాంటి వాటికయితే నూలు పంచెలు కట్టుకుని, చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలు దేరే వారు.
ఇక, పెళ్ళిళ్ళలో భోజనాల తంతు సంగతి చెప్పే పని లేదు. మడి కట్టు కోండి అని ఊళ్ళో అతిథులందరకీ మరో మారు గుర్తు చేయాలి. ( ఊళ్ళో సగోత్రీతకులనే భోజనాలకు పిలిచే వారు మరి) ఇదిగో వస్తున్నాం అంటూ ఎంతకీ వచ్చే వారు కారు. వాళ్ళ కోసం విస్తళ్ళ ముందు మిగతా బంధువులు పడిగాపులు పడే వారు. అంతా వచ్చేరనుకుంటే ఒక పెద్దమనిషి నదికో, ఏటికో స్నానానికని వెళ్ళి, ఎంతకీ వచ్చే వాడు కాడు. ఏం అనడానికి లేదు. మగ పెళ్ళి వారంతా భోజనాలు ముగిప్తే కానీ, ఆడ పెళ్ళి వారు బోయినాలకు కూచోడానికి లేదు. అలకలూ, దెప్పి పొడవడాలూ కూడా ఒక్కోసారి విందు భోజనాలలో చోటు చేసుకునేవి.
కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం నాటకంలో విందు భోజనాలకు పిలిస్తే బెట్టు చేసి బాధించే వారి గురించి ఒక చక్కని పద్యం ఉంది. చూడండి:

పిలిచిన పలుకక బిగదన్ను కొని లోన
ముసుఁగు పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకడు
ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని
చుట్ట ముట్టించెడు శుంఠ యొకడు
ఒగిఁదనకై వేచి యుంద్రో లేదో చూత
మని జాగు సల్పెడి యల్పుఁడొకడు
ముందు వచ్చినఁబర్వు ముక్కలౌననుకొని
కడను రాఁజూచు ముష్కరుఁడొకండు
కుడి యింటను హాయిగా కూరుచుండి
వత్తు, రానని చెప్పని వాచి యొకఁడు
వచ్చి, కోపించి పోవు నిర్భాగ్యుఁడొకడు
ఆరు వేల్వారి విందుల తీరు లివ్వి.
పిలిస్తే పలుకడు. బిగదన్నుకొని ముసుగు పెట్టుకుని పడుకునే మూర్ఖుడు ఒకడు.
ఇదిగిదిగో, వచ్చేస్తున్నా, మీ వెనకే వస్తున్నా, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు తీరిగ్గా చుట్ట ముట్టించే శుంఠ మరొకడు.
తన రాక కోసం విందుకు పిలిచిన వారు వేచి చూస్తారో, చూడరో చూద్దాం అని కావాలని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు.
ముందుగా వచ్చేస్తే ఎక్కడ తమ పరవు ముక్కలై పోతుందో అని అందరి కంటె చివరగా రావాలని అనుకునే దుష్టుడొకడు.
హాయిగా నట్టింట కూర్చుని, వస్తాననీ, రాననీ కూడా చెప్ప కుండా తాత్సారం చేసే వాడొకడు.

ఒహ వేళ వచ్చినా, ఏదో విషయంలో అలక వహించి, కోపం తెచ్చుకుని అగ్గిరాముడై పోయి చిందులు తొక్కుతూ తిరిగి వెళ్ళి పోయే నిర్భాగ్యుడు మరొకడు.
ఆరు వేల నియ్యోగుల యింట విందు భోజనాల తంతు ఇలా ఏడుస్తుంది.
( వర విక్రయం - కాళ్ళ కూరి నారాయణ రావు)
పెళ్ళిళ్ళలో ఈ బ్యాచ్ ఉంది చూసారూ, వీళ్ళు కూడా ఎంతకీ భోజనాలకి లేవరు.
వడ్డన కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆకులో ఎక్కడ కూరలు వడ్డించాలి, ఎక్కడ పచ్చళ్ళు వెయ్యాలి, అన్నది తెలిసిన వారే వడ్డనకు పూను కోవాలి. ఆ రోజు వండిన వాటి నన్నింటినీ కొంచెం కొంచెంగానయినా విస్తట్లో ముందుగా వడ్డించాలి. పులుసు, నెయ్యి, పెరుగు కూడా అభిగారం చెయ్యాలి. ( ఇవి ఉన్నాయి సుమండీ అని తెలియ జెప్పే లాగున కొంచెం కొంచెం వడ్డించాలి.) ఓ మూల ఉప్పుతో సహా అన్నీ విస్తట్లో పడ్డాయని ధృవీకరించుకున్నాక, గృహ యజమాని ఇహ ఔపోసన పట్టండి అంటూ వేడుకునే వాడు. భోజనాలు పూర్తయాక, అన్న దాతా సుఖీ భవ అని దీవిస్తూ కొందరు గొంతెత్తి చక్కని పద్యాలు రాగ యుక్తంగా చదివే వారు. పద్యం చదవడం పూర్తయేక, అంతా ఒక్క సారిగా గోవిందా ! గోవింద! అని , గోవింద నామస్మరణ చేసి, లేచే వారు. అయితే,అందరి భోజనాలు పూర్తయి లేస్తే తప్ప పంక్తి లోనుండి లేవ కూడదు. అది అమర్యాద అలా ఉండేవి వెనుకటి రోజుల్లో పెళ్ళి భోజనాలు.
ఇప్పటి గేదె బోయినాలకి ఆ బాధ లేదు. కానీ, ఒకర్నొకరు రాసుకుంటూ, చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో మన వంతు వచ్చే వరకూ నిరీక్షించడం కొంత ఇబ్బందికరం. ఏదో వడ్డించుకుని తింటున్నామంటే, ఎవడు అజాగ్రత్తగా చేయి తగిలిస్తాడో, బట్టలు ఖరాబవుతాయో అనే టెన్షను లోలోపల పట్టి పీడిస్తూ ఉంటే తినడం మొదలెడతాం. మధ్యలో ఏ పదార్ధమో కావాలంటే, మళ్ళీ ఆ ఎంగిలి ప్లేటుతో క్యూ మధ్య చొరబడ వలసిందే.
ఎవరు తింటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. అసలు తింటున్న వాళ్ళంతా బంధువులో కారో కూడా తెలియదు. అంతా దొమ్మీ లాగున తిండి సంత. కాలానుగుణమయిన మార్పులను ఇష్టం ఉన్నా , లేక పోయినా ఆమోదించక తప్పదు.
ఈ సందర్భంగా మందు బాబులకు ఓ శుభ వార్త. ఓ అశుభ వార్త.
కిం తు మద్యం స్వభావేన, యథైవా2న్నం తథా స్మృతమ్
ఆయుక్తియుక్తం రోగాయ, యుక్తాయుక్తం యథామృతమ్
మద్యం కూడా మంచిదే (మరక మంచిదే కదా?)
స్వభావరీత్యా మద్యం దోషభూయిష్ఠం కాదు.
తగినంత మోతాదులో తీసుకుంటే అది అమృతంలా పని చేస్తుంది.
మోతాదు మించితే మాత్రం అదే విషతుల్యమవుతుంది సుమా ! అంటున్నాడు శ్లోక కర్త.
తిండి కలిగితె కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్ !!
అంటాడు గురజాడ.
ఈ తిండి టపాసందర్భంగా బరంపురంలో సహపంక్తి భోజనాల గురించి తలచు కుందాం.
అలాగే, నాయక రాజుల కాలం నాటి తంజావూరు భోజన సత్రం వైభవ ప్రాభవాల గురించి స్మరించు కుందాం.
దేవాలయాల్లో జరిగే ఉచితాన్నదానాల గురించి చెప్పుకుందాం.
మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి వివాహ భోజనంబు ... గుర్తుకు తెచ్చుకుందాం
ఇక,.
భోజ రాజుని కవిత్వంతో మెప్పించి బహుమానం పొందాలనుకున్న ఒక అల్ప కవి -
భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్
అని తొలి పాదం రాసేక , ఇహ దానిని ఎలా పూర్తి చేయాలో తెలీక జుట్టు పీక్కుంటూ ఉండగా కాళిదాసు పోనీ పాపం, అని రెండో పాదం ఇలా పూర్తి చేసి ఇచ్చాడుట.
మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి:
ఓ రాజా, నెయ్యీ, పప్పూ కూడిన భోజనం ఇయ్యవయ్యా అని మొదటి పాదానికి కవితా రసం లేని రసహీనమయిన అర్ధమయితే,
నిండు కవిత్వం తొణికిసలాడే కాళిదాసు పూరణ రెండో పాదం.
నిండు వెన్నెల వంటి తెల్లనయిన గేదె పెరుగుతో అన్నం పెట్టవయ్యా.
వెనుకటి రోజులలో ఓ దొర గారికీ ఓ ఛాందస పండితునికి భలే దోస్తీ ఉండేది.
ఒక సారి, పండితుని ఇంట ఏదో శుభ కార్యానికి దొర గారు ఫుల్ సూటూ, టై, హేటూ, బూటూతో వెళ్ళాడు. పండితుని ఇంట పెట్టిన బూరెల రుచి చూసి వాటిని ఓ పట్టు పట్టాడు. కానీ అతడిని ఓ సందేహం పీడించ సాగింది . ఇక ఊరుకో లేక. పండితుడిని అడిగాడు: ఇవి చాలా రుచిగా ఉన్నాయి సుమా. ఇంతకీ ఈ (పూర్ణం) ముద్ద దీని లో ఎలా పెట్టారో చెప్పండి. అని.
పండితుడు నవ్వి, అది సరే కానీ, ముందు నువ్వీ సూట్ లోరి ఎలా దూరేవో కాస్త చెబుదూ అని అమాయకంగా అడిగేడుట.
ఓ ఆసామీ డాక్టరు దగ్గరకి చ్చేడు.
‘‘ నవ్వింక సిగరెట్లు తాగడం తగ్గించాలోయ్. లేక పోతే ఛస్తావ్ ! పోనీ, భోజనం ముందొకటీ, తర్వాత ఒకటీ చొప్పున లిమిట్ చేసుకో ’’ అని డాక్టరు సలహా ఇచ్చేడు.
కొన్నాళ్ళు పోయేక ఆ ఆసామీ పిప్పళ్ళ బస్తాలా తయారై ఆప సోపాలు పడుతూ డాక్టరు దగ్గరకి మళ్ళీ వచ్చేడు.
‘‘నా సలహా పాటించావా ? ఇప్పుడెలా ఉంది ?’’ అడిగేడు డాక్టరు.
‘‘ ఏం చెప్పమంటారు డాక్టరు గారూ, రోజుకి ఇరవైసార్లు తిండి తిన లేక ఛస్తున్నననుకోండి’’ అన్నాడుట ఆ ఆసామీ.
ఇదిలా ఉంచితే, తిండితో లింక్ ఉన్న మరికొన్నింటిని కూడా చూదాం
తిండికి తిమ్మ రాజు. పనికి పోతరాజు.
తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.
తినగ తినగ వేము తీయనుండు.
అన్నమో రామచంద్రా !
అమ్మ పెట్టా పెట్టదు. అడుక్కుని తినానివ్వదు.
వండుకునే వాడికి ఒకటే కూరయితే అడుక్కునే వాడికి చెప్పలేనన్ని.
ఇక,
తిండి అంటే అన్నం తినడమే కాదు.
లంచాలు తినడం, బుర్ర తినడం, సమయం తినడం, క్రికెట్ లో ఓవర్లు తినడం, దేశాన్ని తినెయ్యడం...కాల్చుకు తినడం, వేధించుకు తినడం, చూపులతో కొరుక్కు తినడం ... ... ఓ, ఇలా చాలా తినడాలు ఉన్నాయి లెండి.
మా ఆవిడ పెట్టిన బజ్జీలు కడుపారా తిని, కాఫీ ఊదుకుంటూ సేవించి, లేచాడు కోనేటి రావు.
‘‘ ఇహ వెళ్తానయ్యా, అక్కయ్యగారివాళ భలే రుచికరమయిన టిఫిను పెట్టారు. అన్నదాతా సుఖీ భవ ! ... కాదు కాదు ... టిఫిన్ దాతా సుఖీ భవ అనాలి కాబోలు ...’’ అంటూ వెళ్ళి పోయాడు.
మళ్ళీ రేపు ఉదయం మా ఆవిడ స్టవ్ వెలిగించిన శబ్దం చెవిని పడి కానీ రాడు.
తిండి గురించి కొంత చెప్పుకున్నాం. ఈ సారి పస్తుల గురించి చెప్పుకుందాం.
స్వస్తి.

9, డిసెంబర్ 2014, మంగళవారం

శతమానం భవతి


ఒకటి నుండి వంద వరకూ ఉన్న అంకెలలో వందదే అగ్రస్థానం. వంద ఒక పూర్ణత్వానికి నికషగా మనం భావిస్తూ ఉండడం కద్దు.

ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే సినీ జీవులు దానిని ఒక గొప్ప కితాబుగా భావిస్తూ ఉంటారు. తమ చిత్ర రాజం వంద రోజులు ఆడడం కోసం ఎన్ని పుర్రాకులయినా పడుతూ ఉంటారు. వంద రోజుల ఆటలూ ఎలాగో ఒక లాగ పడే లాగున నానా తంటాలూ పడుతూ ఉంటారు. ఆడక పోయినా, ఆడిస్తారు.చివరకి వంద రోజులూ పూర్తి కాగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చు కుంటారు. భుజాలు చరుచు కుంటారు.

అలాగే, మన పెద్దలు ఆశీర్వదించేటప్పుడు ‘ శతమానం భవతి’ అంటూ ఆశీర్వదిస్తారు. నూరేళ్ళు బ్రతకమని కోరు కుంటారు. ( కాకిలా కలకాలం బ్రతకడం వేష్టుగా భావించే నిరాశా వాదులూ ఉంటారు. అది విషయాంతరం)

మహానుభావుల శత జయంతులు ఘనంగా జరుపు కుంటూ ఉంటాం. వందేళ్ళ నాటికి కూడా వారి పేరు స్మరించు కోవడం వారి ఘనతకు నిదర్శనం.

వంద సంఖ్యను తలుచు కుంటూ ఉంటే వంద మంది కౌరవులు గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు. వంద సంఖ్య ప్రత్యేకతను మంట గలిపిన వారు కౌరవులు

కవి ఆరుద్రకి కూడా వంద సంఖ్య మీద ఏమంత ప్రత్యేక మైన మోజు ఉన్నట్టుగా తోచదు.


తరాని కో వంద కవులు
తయారవుతా రెప్పుడూ
వంద లోనూ మంద లోనూ
మిగల గలిగే దొక్కడు !

అని తేల్చి చెప్పీసేడు.


సరే, ఈ శ్లోకం చూడండి ...

శతనిష్కో ధనాఢ్యశ్చ, శతగ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా, శత శ్లోకేన పండిత:

వంద నిష్కలు కల వాడు ధనికుడు. వంద గ్రామాలు కల వాడు భూకామందు. వంద గుఱ్ఱాలు కల క్షత్రియుడే రాజు. వంద శ్లోకాలు ఎవడి కయితే వచ్చో, వాడు పండితుడు అని దీని అర్ధం.

ఈ లెక్కలో నిష్కము అంటే, మాడ, టంకము, నూట యెనిమిది మాడలు, పతకము, బంగారము, వెండి అనే అర్ధాలు ఉన్నాయని శబ్ద రత్నాకరం చెబుతోంది.

మాడ అంటే బంగారం అని నిఘంటువు. ఒక ప్రత్యేక మైన విలువ కలిగిన బంగారు నాణెము మాడ.

టంకము అనే దానికి పదహారు డబ్బుల బంగారు నాణెము అని నిఘంటువు. దీనికే దీనారము అని మరో పేరు.

మరి, డబ్బు అంటేనో ? రెండు దుగ్గానుల రాగి నాణెము అని అర్ధం.

దుగ్గాని అంటేనో ?

దుగ + కాని = దుగ్గాని. అంటే రెండు దమ్మిడీల విలువ కలది. ఈ పాత కాలపు నాణేల గురించి తెలుసు కోవడం తమాషాగా ఉంటుంది. ఒక టంకానికి పదహారు డబ్బులు కనుక ఈ లెక్క ప్రకారం ఇక్కడ కాని అంటే దమ్మిడి అని శబ్ద రత్నాకరం చెబుతోంది.

అయిదు కాసుల నాణెమును దమ్మిడి అంటారుట. కొందరయితే, రెండు కాసుల నాణెమును దమ్మిడి అంటారని నిఘంటువు వివరిస్తోంది.

ఇక, కాసు అనే పదానికి నిఘంటువు ఏం చెబుతోందో సరదాగా చూదాం ...

కాసు అంటే,దుగ్గానిలో నాలుగవ భాగమని కొందరు, కాదు కాదు ... దుగ్గానిలో పదవ భాగమని కొందరు అంటారుట.

కాసు వీసం కలిగి ఉంటే ... అని ఒక గేయంలో గురజాడ ప్రయోగించాడు. వీసం అంటే ఒక రూకలో పదహారవ భాగం.



నిఘంటువు రూక అనే పదానికి ధనము అనే అర్ధంతో పాటు, చిన్న మెత్తు వెండి బంగారముల నాణెము అని కూడాఅర్ధాన్ని  ఇచ్చింది.

ఇప్పుడోసారి మళ్ళీ వెనక్కి డబ్బు దగ్గరకి వెళదాం.

డబ్బు అంటే రెండు దుగ్గానుల నాణెం అని తెలుసు కున్నాం కదా?

డబ్బు అనే దానికి బొంకు, బొంకు పలకడం అనే వేరే అర్ధాలు కూడా ఉన్నాయి !

వాడొక డబ్బు డబ్బేడు అంటే, వాడొక అబద్ధం చెప్పేడు అని అర్ధం. ( ఈ ఉదాహరణ నిఘంటు కారుడు ఇచ్చినదే)
ఈ అర్ధాలే కాక, డబ్బు అనే దానికి డంబము అనే అర్ధం కూడా ఉంది. డంబము అంటే, స్థితికి మంచిన వేషము అని అర్ధం.


ఏతావాతా ఇంతలా కొండను తవ్వి నేను పట్టిన ఎలుక ఏమిటయ్యా అంటే,

డబ్బు అంటే వొట్టి అబద్ధం అని మనం గ్రహించాలి. డబ్బు అనే పదార్థం వొట్టి మిథ్య. వచ్చి నట్టే ఉంటుంది. రాదు. ఉన్నట్టే ఉంటుంది, ఉండదు. వస్తూనే పోతూ ఉంటుంది. పోతూ వస్తూ ఉంటుంది. నానా రగడా చేస్తుంది. దానికి అల్లరీ ఆగమూ హెచ్చు. ఉన్నప్పటికీ తృప్తి నివ్వదు. లేక పోతే బతక నివ్వదు. లక్ష్మి చంచలమైనదని ఊరికే అన్నారా?

అందు చేత ‘డబ్బుకు లోకం దాసోహం’ కదా అనుకుంటూ, ఈ డబ్బు మాయలో పడి కొట్టుకు పోకుండా జీవితం వేరే విధంగా సార్ధకం చేసుకోడానికి మార్గాలు ఏమైనా వెతుక్కోవాలి. తప్పదు.

ఎందు కంటే,

ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే, నారీ గృహ ద్వారి, జన:శ్మశానే
దేహాశ్చితాయాం పర లోక మార్గే, కర్మా2నుగో గచ్ఛతి జీవ యేక:

అని పెద్దలు చెబుతున్నారు.

మనం సంపాదించు కున్న ధనం ( డబ్బు) మన వెంట రాదు. భూమి మీదే ఉండి పోతుంది.
మనం పోషించిన పశువులు పశుశాల విడిచి మన పార్ధివ దేహం వరకూ కూడా రావు.భార్య ద్వారం దాటి ఇవతలికి అడుగు పెట్టదు (పెట్టరాదని నియతి కాబోలు) బంధువులు పరేత నిలయ ప్రాంతం వరకూ వస్తారు. దేహం చితి వరకూ మాత్రమే వస్తుంది.

మరి, పర లోక ప్రయాణంలో మన వెంట వచ్చేది ఏమిటయ్యా అంటే, మన పుణ్య పాప కర్మలు మాత్రమే అని దీని భావం.

అదండీ సంగతి.

అయితే, డబ్బే వద్దా, అంటే కావాలి.‘‘ డబ్బు తేలే నట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయి ’’ అని కవి చెప్పాడు
‘‘వ్యర్ధం నిర్ధనికస్య జీవన మహోదారైరపి త్యజ్యతే’’ అన్నారు. అంటే ధనం లేని వ్యర్ధుడిని జీవన సహచరి కూడా ఫో, ఫోవోయ్ అంటుందిట.
‘‘ డాడీ ! అమ్మ గేస్ స్టవ్ ఉన్న అంకుల్తో వెళ్ళి పోయింది !’’ అనే కాప్షన్తో బాపూ గారి కార్టూన్ ఆంతర్యం ఇదే !
‘పైసా మే పరమాత్మా హై ! ’ అని హిందీ వాడో, హిందీ నేర్చిన తెలుగు వాడో అన్నాడు. 
అయితే ...

మనిషికి జబ్బు చేయడం కన్నా, ‘డబ్బు చేస్తే ’ చాలా ప్రమాదమని హెచ్చరించిన వాడూ బాపూనే కదా !అలాగని నల్ల కుబేరుల మయి పోతే చర్ల పల్లి లాంటి జైళ్ళ తలుపులు రా, రమ్మంటాయి, ఏదో ఒక నాడు. లేదూ, నీ జీవిత కాలమంతా నీకేం కాకుండా చల్లగా వెళ్ళి పోయే వనుకో ... ఆ దెబ్బ నీ వంశంలో ఏదో  వో తరం వాడికి కొట్టేస్తుంది ! ( నువ్వు చల్లగా వెళ్ళి పోయినా, అక్కడ నీకెలాంటి సత్కారం దొరికిందో  చెప్పడానికి నీకూ కుదరదు. మాకూ కుదరదు .అంచేత జాగర్తరోయ్)

ఎందుకంటే,
‘‘ అత్యుత్కటై: పుణ్య పాపై రిహైవ ఫలముచ్యతే’ అంటాడు శాస్త్రకారుడు. మనం చేసే పాప పుణ్యాలకు ఇక్కడే ఫలితం అనుభవిస్తాం అని అర్ధం. దానికి గడువు మూడు రోజులు కావొచ్చు, మూడు నెలలు కావొచ్చు, మూడేళ్ళు కావొచ్చు .. అని కూడా చెప్పేడు.  వేదాంతం దీనిని ఏడు తరాల వరకూ పొడిగించింది. కనుక, మన ఏడు తరాల వారిలో ఎవడో ఒకడు ఘోరంగా దెబ్బ తినీడం ఖాయం !

అంచేత, మన గుండె లబ్ డబ్  లబ్ డబ్ మని కొట్టుకుంటున్నంత వరకూ డబ్బు కావాలి. కాని అది మన నిజమైన అవసరాలకి మించి అక్కర లేదని తాత్పర్యం. మన సంపాదనకి మనం ట్రష్టీలం మాత్రమే అని అంటారుబాపూ  ( ఈ బాపూ ఇందాక చెప్పిన బాపూ కాదు. జాతి పిత బాపూ ).

అదండీ డబ్బు జాలం ( నెట్) కథ !


28, నవంబర్ 2014, శుక్రవారం

లక్ష చీపుళ్ళనోము ...


‘‘ అన్నయ్య గారూ ! మీరు వెంటనే వొక సారి మా ఇంటికి రాగలరా ? !
 ప్లీజ్ ...’’ఉదయాన్నే మా తింగరి బుచ్చి భార్య నుండి ఫోను. వీడు మళ్ళీ ఏం పీకల మీదకి తెచ్చాడో తెలియదు. ఆలస్యం చేయకుండా వెంటనే స్కూటరు తీసుకుని బయలుదేరి వెళ్ళాను.  వీధి గుమ్మం గేటు దగ్గరే నా కోసం నిరీక్షిస్తూ ఆత్రుతగా నిలబడి ఉంది తింగరి బుచ్చి భార్య. స్కూటరు ఆపి, స్టాండు వేసి
‘‘ ఏమయిందమ్మా !’’ డిగేను.
‘‘ అన్నీ చెబుతాను ... ఇదిగో, ఈ వీధరుగు మీదే కూర్చుని మాట్టాడు కుందాం.. ఇక్కడే కుర్చీ వేస్తాను. ఇంట్లో ఎక్కడా అంగుళం ఖాళీ లేదు ...’’ అంటూ నా జవాబు కోసం ఎదురు డకుండా ఇంట్లోకి వెళ్ళి ఓ కుర్చీ తెచ్చి వీధి గుమ్మంలోనే వేసింది.
ఇంట్లో ఖాళీ లేక పోవడమేఁవిటి ! నాకేం అర్ధం కాలేదు. సరే ఎలాగూ ఆవిడే చెబుతుంది కదా అని ఊరుకుని విన సాగాను. ఆవిడ మధ్య మధ్య  పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ గద్గద కంఠంతో చెప్ప సాగింది.
‘‘ ఏం చెప్పమంటా రన్నయ్యా ! ఈయనికి రాను రాను తిక్క ముదిరి పోతోంది. అదేదో లక్ష చీపుళ్ళ నోము చేస్తానంటూ తయారయి పోయేరు !  ...మగాళ్ళకి నోము లేఁవిటండీ ...
 చోద్యం ! అదీ కాక, ఈ చీపుళ్ళ నోమేఁవిటని అడిగితే, ఈ లక్ష చీపుళ్ళ నోముని ఆడవాళ్ళూ మగవాళ్ళూ పిల్లా పెద్దా ముసలీ ముతకా అనే తేడా లేకుండా అందరూ చేయ వచ్చునంటూ ఏదేదో చెబుతున్నారు ’’
    ఆవిడ ఇలా చెబుతూ ఉండగానే మా తింగర బుచ్చి వచ్చేడు. వస్తూనే నన్ను చూసి, ‘‘వచ్చేరా ! అసలు నేనే మిమ్మల్ని కలవాలను కుంటున్నాను ..’’ అంటూ ఇంట్లోకి దారి తీసాడు. నేనూ అతని వెనుకే వెళ్ళాను. ఆవిడ చెప్పింది నిజమే ! ఎక్కడా మసలడానికి జాగా లేదు. ఇల్లంతా చీపుళ్ళ గుట్టలు.
‘‘ ఇవేమిటి! ’’ అడిగేను తెల్ల బోయి.
‘‘ ఏముందండీ ... లక్ష చీపుళ్ళ నోము తల పెట్టాను. వాటి కోసమే ఇవి ! ’’ అన్నాడు గర్వంగా.
తింగరి బుచ్చి భార్య కల్పించుకుని అంది : ‘‘ ఏడిసినట్టుంది. నిన్న ఉదయం మా చిన్నవాడు ‘‘ అమ్మా ! వేగిరం రా ! నాన్న ఏం తెచ్చారో చూడు ’’ అనివీధిలోంచి అరిస్తే, ఎంగిలి కంచాలు కడుగుతున్న దానిని  వాటిని అలానే వదిలేసి చేతులు కడుక్కుని సంతోషంగా బయటి కొచ్చి చూసేను. ఏం తెచ్చారూ ! నా తలకాయ్ ! ఏ నాలుగు బర్నర్ల గ్యాస్ స్టవ్వో, ఎల్.సీ.డీ టీవీయో నా ముచ్చట తీర్చడానికి వేయించు కొచ్చేరు కాబోలని గంపెడాశతో చూస్తే, ఇవిగో ! ఈ చీపుళ్ళ కట్టలు తెచ్చి పడేసారు. వీటిని కొనడానికి, లక్ష చీపుళ్ళ నోము చెయ్యడానికీ ఆఫీసులో లోను కూడా పెట్టారుట ! నా ఖర్మ కాక పోతే ఈయనకీ తింగరి పనులేఁవిటి చెప్పండన్నయ్యా! ’’ అంటూ కళ్ళొత్తుకుంది. భార్య మీద అగ్గి రాముడై పోయేడు తింగరి బుచ్చి. ‘‘ నోర్మయ్ ! పరమ పవిత్ర మయిన చీపుర్లనేమయినా అంటే కళ్ళు పోతాయ్. అసలు చీపురంటే ఏఁవనుకున్నావ్ ? లోకంలో చీపురంత పరమ పవిత్ర మయిన వస్తువు మరొకటి లేదు. ప్రతి కొంప లోనూ ఈశాన్య మూల దేవుడి మందిరం, తలుపు వార చీపురు కట్టా ఉండి తీర వలసిందే. చీపురు, చీపురు కట్ట, చీకిలి,ఘాటము, తిరు కట్టె, సొరక, మార్జని, శతముఖి, శోధని, సమూహని, సమ్మార్జకము, సమ్మార్జని ... ఇన్ని పేర్లున్నాయి చీపురికి. చీపురు పట్టి ఊడ్చే వాడిని ఖలపువు, బహుకరుడు, సమ్మార్జకుడు అంటారు తెలుసా ! చీపురు పట్టి ఊడ్చే చెత్తను అవకరము, చెదారము, తుక్కు, తక్కుడు, పెంట అని కూడా పిలుస్తారు. చీపురుకి చేదోడు వాదోడుగా ఉండే నేస్తం - చేట ! చేటని ప్రస్ఫోటనము, పలిక, మొరము, శూర్పము,సూర్పము అంటారు. అదే చిన్న చేటయితే, మొంటె, మొరిటె అని పిలుస్తారు.ఇప్పుడీ పదాలన్నీ నిఘంటువుల్లో చచ్చి పడున్నాయి కానీ, చీపురు, చేట అనే పదాలు తెలియని వారుండరు. చీపుళ్ళలో చాలా రకాలు ఉన్నాయి. రెల్లు  పుల్లల  చీపురు , కొండ చీపురు, ప్లాస్టిక్ పుల్లల చీపురు లాంటివన్నమాట ...
      ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణ దేవరాయలంతటి వాడు ‘‘గృహ సమ్మార్జనమో ... ’’అనే  పద్యంలో సమ్మార్జని పదం వాడేడే. దేవాలయం ఊడవడం, కడగడం మొదలయిన పనులు భక్తులు చేయాలి.  ఇక, ‘‘ ఊరెయ్యది ? ’’ అనడిగితే
‘‘ చీపురు పలి ..’’ అని చెబుతాడు అడిదం సూర కవి. చూసేవా ! చీపురు అనే పేరుతో  వో పల్లె కూడా ఉత్తరాంధ్రలో ఉందన్నమాట ! అసలు నన్నడిగితే,  ఈ చీపురు పల్లిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏలిన వారు తక్షణం తీర్చి దిద్దాలని ప్రతిపాదిస్తున్నాను. కన్యా శుల్కంలో గిరీశాన్ని వాయించడానికి పూట కూళ్ళమ్మ మధుర వాణి ఇంట్లోకి  చీపురు కట్ట పట్టుకుని దూకుడుగా రావడం గుర్తు లేదూ ! ఆకతాయీల పని పట్టడానికి ఆడంగులకి చీపురు కట్ట వంటి మహత్తరమయిన ఆయుధంమరొకటి లేదు ...’’
   మా తింగరి బుచ్చి ఇచ్చిన ఉపన్యాసం విన్నాక, నాకు నోట రాలేదు. కాంచెం తేరుకుని, ‘‘ సరే ఈ లక్ష చీపుళ్ళ నోమేఁవిటి !’’ అడిగేను అసహనంగా.
    వాడు చెప్పే లోగానే వాళ్ళావిడ కలగ జేసుకుని అంది : ‘‘ ఈ లక్ష చీపుళ్ళ నోము నోచి, అందరికీ తలో చీపురూ వాయినంగా ఇస్తారుట ! దేశభక్తి చాటుకోడానికి అదో విధానమట. అసలు చీపురు పట్టని చేయంటూ ఉండ కూడదుట !  చీపురు పట్టని చేతులను నరికి పారెయ్యాలంటూ వీరంగం ఎత్తు తున్నారు కూడా. ఈ తిక్క రోజుకో గొడవ తెచ్చి పెడుతోంది. ఉదయాన్నే లక్ష చీపుళ్ళ నోములో తొలి వాయనం కాస్త తీసుకోండని కాలనీలో వో పెద్దాయనకి ఇవ్వ బోతే తీసుకో లేదుట. పైపెచ్చు, ‘‘ నేను చీపురు పార్టీ కాదూ, నాది కాంగ్రెసూ. కాడెద్దుల కాలం నుండి మాది ఆ పార్టీయే .. పొమ్మని కసురు కున్నాట్ట. ఇది ఆ చీపురు కాదయ్యా అని ఎంత చెప్పినా వినిపించుకో లేదుట. దాంతో అతనితో ఈయన నానా గొడవా పడి దెబ్బలాడి వచ్చేరు. అలాగే వో కాలనీ ఆయన నాకు వక్ఖ చీపురయితే చాలదూ, వో ఫది పంపించండి అంటూ కబురెట్టాడు. నిన్నటి నుండీ ఈ చీపుర్ల తగూలే. ఏం చేయాలో తోచక ఛస్తున్నాను అన్నయ్యా !  మరో సంగతి. నిన్నరాత్రి పొద్దోయే వరకూ మేలుకుని ఇంట్లో చిత్తు కాగితాలూ, చెత్తా చెదారం  పోగు చేసి, వీధిలో మాఇంటి ముందే వెదజల్లారు. ‘‘ ఏఁవిటీ ఈ ఓఘాయిత్యం  పనీ ! ’’ అని నేనడగితే ‘‘ రేప్పొద్దున్నే నేను చీపురు పట్టి ఊడవాలంటే ఈ చెత్త ఉండక పోతే ఎలా ? అని నామీద నోరు చేసుకున్నారు. ‘‘ అదేదో తెల్లారికట్టే లేచి అఘోరించండి.  ఇంటి ముందు ఇలా చెత్త ఎవరయినా చూస్తే బాగోదు’’ అని చెప్పాను. ఉదయాన్నే మా పెద్దాడి చేతికి డిజటల్ కెమేరా ఇచ్చి ఫొటోలు తియ్యమని ఆర్డరేసి వీధిలోకి వెళ్ళే సరికి, అప్పటికే ఎవరో దాన్నంతా ఊడ్చి తగలడ్డారుట. దాంతో ‘‘నా చెత్త ఊడవడానికి మీరెవరంటూ చిందులేసి అందరినీ నానా కూతలూ కూస్తూ తిట్టి పోసారు ...నా చెత్త నా ఇంటి ముందు తిరిగి తెచ్చి పోస్తారా ? ఛస్తారా ? !’’ అంటూ ఒకటే చిందు లేసారు.
   ఆవిడ చెప్పినదంతా  వింటూ ఉంటే, నాకు మతి పోతోంది. ఇక లాభం లేదని చెప్పి,
 మా తింగరి బుచ్చికి వో క్లాసు పీకాలని నిశ్చయించుకుని ఇలా అన్నాను :
 ‘‘ బావుందయ్యా ! నీ నోమూ  బాగుంది. నీ ఆశయమూ బాగుంది .. కానీ నా అభిప్రాయం కూడా చెబుతాను విను .. చెత్తా చెదారం ఊడవడానికి పారి శుధ్య పనివారల  ఉద్యోగాలంటూ ఉండి ఏడిశాయి కదా. వాళ్ళు తమ విధులు సక్రమంగా చేస్తున్నారో లేదో పట్టించు కోకుండా   సూటూ బూటూ వేసుకుని, రంగు రంగుల చీరలు కట్టుకుని, వయ్యారాలు వొలకబోస్తూ,నాజూగ్గా చీపుర్లు పట్టుకుని ఫొటోలకు ఫోజులిస్తూ చెత్తను ఊడుస్తున్నట్టు ఫొటోలు దిగడం,  పత్రికల్లో ఫొటోలు చూసి మురియడం ఏం బాగుంది చెప్పు.  పారిశుద్యానికి పెద్ద పీట వేస్తూ, చాలినంత గా పని  వాళ్ళను   నియమించి,  వారికి మంచి వేతనాలూ. పారితోషికాలూ  నాగా లేకుండా ఇస్తూ చక్కని  పర్యవేక్షణతో వారి చేత కొరడా ఝుళిపించి మరీ పని చేయించాలి. మనింటి చెత్తను ఎవరూ చూడకుండా పక్కింటి వేపు పడేసే అల్ప బుద్ధులను అదమాయించాలి. వీలయితే  భారీగా  ఫైన్లు వేసి శిక్షించాలి.  అంతే కాదు చెత్తా చెదారాన్ని రీ సైక్లింగ్ చేసే యంత్రాలను ఎంత డబ్బు ఖర్చయినా వెనుకాడకుండా గ్రామ గ్రామానికీ బడ్జెట్ లోనే నిధులు కేటాయించి, అందించాలి. ఈ పనితో పాటూ రాజకీయ నాయకులనూ, ప్రజలనూ ఉత్తేజ పరచి, సంఘటితం చేసి స్ఫూర్తి దాయక మయిన ప్రబోధాలతో ఈ పనిలో భాస్వాములయ్యే లాగున చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏదో మొక్కుబడిగా వో రోజో, రెండ్రోజులో చేస్తే మనమూ, మన చెత్తా చెదారం అంతా క్షేమం. ... ఉదాత్తమయిన ఆశయాలకి చిత్త శుద్ధీ, ఉన్నతమయిన కార్యాచరణా అవసరం ! ...’’ అన్నాను.
   నా ఉపన్యాసమంతా సరిగా విన్నాడో లేదో తెలియదు.  ‘‘ సరే, నా నోములో తొలి వాయినం చీపురు మీరు పుచ్చు కోవాలి ..’’ అంటూ నా చేతిలో వో చీపురు పెట్టి, నా కాళ్ళకి దండం పెట్టాడు. మరింక  చేసేదేమీ లేక,  చీపురు అందుకున్న చేత్తోనే మా తింగరి బుచ్చిని దీవించి, ఇంటికి బయలు రేరాను ...

తా.క :  సరదాగా అనే లేబిల్ క్రింద ఇదంతా రాసేను కానీ నిజానికి ఇదంతా సరదాగా వ్రాసినది మాత్రం కాదు !


13, నవంబర్ 2014, గురువారం

విజీనగరం నుండి వెలువడిన పత్రికలు


విజయ నగరం నుండి వెలువడిన పత్రికలు ! 

రాజ యోగి               మాస పత్రిక            
 సంపాదకులు: గురజాడ శ్రీరామ మూర్తి 1885

తెలుగు హార్స్          ఆంగ్ల వార పత్రిక      
  సంపాదకుడు : కిళాంబి రామానుజాచార్యులు 1895

ఇండియన్ హెరాల్డ్                                  
సంపాదకుడు : సి.వై.చింతామణి 1899

భారత మాత            మాస పత్రిక            
  సంపాదకులు : బి.వి.నాథ్ 1906

కామేశ్వరి               సారస్వత మాస పత్రిక
సంపాదకులు : పురాణం సూర్య నారాయణ తీర్థులు

కళలు                   సాహిత్య మాస పత్రిక  
  సంపాదకులు : బుర్రా శేషగిరిరావు 1920

ఙ్ఞాన దీపిక             పక్ష పత్రిక                  
 సంపాదకులు : మేడూరి శ్రీరామ మూర్తి 1923

నాటక కళ             మాస పత్రిక              
  సంపాదకులు : మల్లాది విశ్వనాథ శర్మ 1923

కమ్మ                  మాస పత్రిక                
 సంపాదకులు : బాబు కె.ఆర్. రాయ్ చౌదరి 1923

ఆర్య ప్రభ              ద్వివార సారస్వత పత్రిక  
సంపాదకులు : దువ్వూరి జగన్నాథ శర్మ 1925

లలిత                  సారస్వత మాస పత్రిక    
 యువ జన సంఘం నిర్వహణ 1927

గంధర్వ               మాస పత్రిక                  
 సంపాదకుడు :  దువ్వూరి జగన్నాథ శర్మ 1929

కల్యాణి               సారస్వత మాస పత్రిక    
 సంపాదకుడు : గంటి సూర్య నారాయణ `932

మాతృ సేవ          వార పత్రిక                    
 సంపాదకుడు : పసుమర్తి వీర భద్ర స్వామి 1936

అడ్వైజర్              మాస పత్రిక                  
  సంపాదకుడు :కెరండాల్ శ్రీనివాస రావు 1937

విజయ               మాస పత్రిక                  
  సంపాదకుడు : కాకు పాటి కృష్ణ మూర్తి 1938

ఆంధ్ర మాత         మాస పత్రిక                  
సంపాదకులు :ఆనవిల్లి ప్రకాశ రావు 1938

వందే మాతరం     వార పత్రిక
సంపాదకులు :  కిళాంబి రంగాచార్యులు మరియు లంక సుందరం 1946

విజయి                వార పత్రిక                  
  సంపాదకుడు : గురజాడ సూర్య నారాయణ మూర్తి 1947

వాణి                   వార పత్రిక                  
  సంపాదకుడు : గురజాడ సూర్య నారాయణ మూర్తి 1948

విజయ వాణి        వార పత్రిక                  
  సంపాదకులు : శ్రీరంగం నారాయణ బాబు 1950

ప్రజా రథం            వార పత్రిక                
   సంపాదకులు : భాట్టం శ్రీరామ మూర్తి 1965

ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్ర ప్రభ ల జిల్లా కార్యాలయం. 1984

ధర్మ బాణం          దిన పత్రి క                    
 సంపాదకులు ? 1989

విజయ నగరం టైమ్స్  దిన పత్రిక            
 సంపాదకులు :ఇ.వి.సురేష్ కుమార్ మరియు గెద్ద వర ప్రసాద్. 2002

శ్రీకళ                  ఆధ్యాత్మిక పక్ష పత్రిక  
  ప్రచురణ : సనాతన గురు కులం 2002

(వీటిలో ధర్మ బాణం, విజయ వాణి వంటి ఒకటో రెండో పత్రికలు నేడు వెలువడుతున్నాయి.)


                         (సేకరణ : శ్రీ పున్నమరాజు నాగేశ్వర రావు) 


సందేహమ్  :  ఈ టపాకీ, మీద ఉంచిన చిత్రానికీ సంబంధం ఏమిటయ్యా   బ్లాగరూ ? నీకిది వాడుకా ?

జవాబు :       ఏం లేదు ,  ఊరికే ! నవ్వు కుంటూ చదివితే తల నెప్పి రాదని !





27, అక్టోబర్ 2014, సోమవారం

అనుకోని అతిథితో అర క్షణం సేపు !

ఇవాళ మా ఇంటికి వో అనుకోని అపురూప మయిన అతిథి రావడం జరిగింది. ఆ అతిథితో  కాస్సేపు జనాంతికంగా సాగిన సంభాషణ సారం మీ ముందు ఉంచుతున్నాను.
అతిథి :  ‘‘ బావున్నారా ? ! ’’
నేను : ‘‘ ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ! నన్ను నేనే నమ్మ లేక పోతున్నా ననుకో !
నా కళ్ళు నిజమే చెబుతున్నాయా ! ఎప్పుడో, చిన్నప్పుడు  పల్లెటూర్లో మా యింటి నడి వాకిలిలో  మీరంతా పిల్లా పీచూతో సమావేశ మవుతూ ఉండే వారు కదూ !  అప్పుడు మురిపెంగా మిమ్మల్ని చూసే వాళ్ళం ! తరువాత చూడ్డమే అరుదయి పోయింది ... ఎలా ఉన్నారు ? ’’
అతిథి : ‘‘ ఎందుకులే, చెప్పు కుంటే కడుపు తరుక్కు పోతుంది. ఎందుకో తెలీదు కానీ,  మేం పిట్టల్లా రాలి పోతున్నాం ! మా కుటుంబాలకు  కుటుంబాలే కూలి పోతున్నాయి. ఆ దేవుడికి మా మీద దయ లేదు ! అక్కడా అక్కడా ఒకటీ అరా మిగిలేం.’’
నేను: ( బాధగా ) అవును .. నేనూ విన్నాను,  అంతర్జాలంలో ఆ వివరాలు చదివేను కూడా
అతిథి : ‘‘  ఏం రాసేరేం ? ’’
నేను: అంతర్జాలం నుండి నేను సేకరించిన కథనం ఇలా ఉంది చూడు ...

‘‘పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేను, ఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులో, కిటికీ తలుపులపైనా, స్కూలు గది గోడలపైనా, చెట్ల కొమ్మల చివర్లలో, బట్టలు ఆరేసుకునే దండేలపైనా, పొట్ట పోసుకున్న వరి చేలల్లో, బిళ్లంగోడు ఆడే తుమ్మ తోపుల్లో, ఎండాకాలపు సీతమ్మ చెట్లపైనా, గుళ్ళు గోపురాలపైనా ఎక్కడికెళ్ళినా పలకరిస్తుండేవి.
పరిశీలనా పరులకి పిచ్చుకల జీవనం ఆసక్తిగా ఉండేది. స్నేహం చేయడం, జంట కట్టడం, సందర్భానికి తగినట్లు కిచ కిచచప్పుళ్లు మార్చడం, ఆడ మగ పిచుకలు ఊసులాడుకోవడం, చిన్న చిన్న పురుగుల్ని ముక్కున పట్టి పిల్ల పిచ్చుకల నోట్లోకి నెట్టడం, నిపుణులైన ఆర్కిటెక్చర్ ఇంజనీర్లలా ఒక్కో పుల్లా, పీచూ తెచ్చి గూళ్లు అల్లడంఎన్నని? పరిసరాల్ని మర్చిపోయేలా చేసేవి. ఒక్కో మనిషీ పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ సందర్భాల్లో పిచ్చుకలతో అనుభవం కొండ గుర్తులుగా ఉండేవి.
ఇప్పుడు పిచ్చుకలు దాదాపు కనుమరుగైనాయి. ప్రకృతినంతటినీ అదుపులోకి తెచ్చుకున్న మనిషి అవసరాలకు మించి ప్రకృతి వనరుల్ని ఖర్చు చేసేస్తున్నాడు. ఇతర పశు, పక్షు జాతులకి ప్రకృతిని దూరం చేస్తున్నాడు. భూ వాతావరణాన్ని తోటి జీవజాలానికి పనికి రాకుండా చేస్తున్నాడు. పరిమితికి మించి వనరుల్ని తవ్వి తీస్తూ వాతావరణ వ్యవస్ధని అస్తవ్యస్తం చేయడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి పిచ్చుకలకి మరణ శాసనంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన సెల్ టవర్లు పిచ్చుకలు అంతరించిపోవడానికి కారనమని పరిశోధనలు చెబుతున్నాయి. టవర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల ధాటికి సున్నిత ప్రాణులైన పిచ్చుకలు చనిపోతున్నాయని ఆ పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచం మొత్తం మీద పిచ్చుకల సంఖ్య ఎనభై శాతం పడిపోయిందని ఆర్నితాలిజిస్టులు సర్వే చేసి లెక్కతేల్చారు. పిచ్చుకల దైన్యానికి ఇక్కడ మనిషికారణంగా జనరలైజ్ చెయ్యడం కూడా సరికాదేమో. ఎందుకంటే మనుషుల్లో తొంభై శాతం మంది పశు పక్ష్యాదులకు స్నేహ శీలురే. భూములూ, కంపెనీలు అదుపులో పెట్టుకున్న కొద్ది మందే భూ వినాశనానికీ, వాతావరణ విధ్వంసానికీ కారణం అవుతున్నారు. వీరి లాభాపేక్ష మెజారిటీ ప్రజలతో పాటు ఇతర జీవ జాలానికి కూడా ప్రాణాంతకంగా మారింది.
ఈ నేపధ్యంలోనే 2012, మార్చి 20 తేదీని ప్రపంచ పిచ్చుకల రోజుగా ప్రకటించారు. ఎన్ని రోజులుప్రకటించినా పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఆర్ధిక దోపిడీ విధానాలు అంతం అయ్యేవరకూ ఈ పరిస్ధితి కొనసాగుతూనె ఉంటుంది. మనిషి సుఖ జీవనానికి పశు, పక్ష్యాదులు కూడా దోహదం చేస్తున్నాయన్న స్పృహ లాభాపేక్ష కు ఉండదు. ఏం చేసయినా, శ్రామికుల సుఖ సంతోషాల్నీ ప్రాణాల్నీ కబళించయినా, పశు పక్ష్యాదుల వాటాని లాక్కునయినా లాభ శాతం పెంచుకోవాలని చూసే పెట్టుబడిదారీ వ్యవస్ధకు తనకు తాను మరణ శాసనం లిఖించుకుంటోదన్న సృహ కూడా ఉండదు. మేల్కోవలసిందే శ్రామికులే. ’’

అతిథి: ‘‘ ఇంత  చక్కని సమాచారాన్ని అందించిన వారికి నీతో పాటూ మేము కూడా ఋణ పడి ఉంటాము. సరే ... మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకునేందుకు వచ్చేను. ఇక్కడ మీ జనావాసాల మధ్య ఈ మధ్య వో సెల్ టవరు కట్టేరు. పూర్తయిన ఆ టవరుని ఏమయిందో, ఏమో నాలుగు రోజులకే  తొలిగించి వేసారు కదూ ... ఇక్కడి వాళ్ళంతా అంగీకరించక పోవడంతోనే దానిని తొలగించారని చెబుతున్నారు.  అందుకే మీకు ధన్యవాదాలు చెప్పు కుందామని ఇలా వచ్చేను. మరి వెళ్తాను ...’’
నేను : ‘‘ అదేం, వచ్చి అర క్షణం కాలేదు ..కాస్సేపు ఉండ రాదూ ; ...’’
నా మాటలు ఇంకా పూర్తి కానే లేదు, మా  ఇంటి కొచ్చిన అపురూప అతిథి తుర్రున ఎగిరి పోయింది !
మా చిన్నప్పుడు మా పల్లెలో మా ఇంటి నడి వాకిలిలో మా నాయనమ్మ కట్టిన వరి కంకుల మీద గుంపులు గుంపులుగా వచ్చి సందడి చేసేవి. మా రైతులు బళ్ళతో ధాన్యాన్ని తోలు కొచ్చి, మా వీధిలో మా ఇంటి ముందు  నిల బెట్టే వారు. మా ఇంట్లో ముత్తయిదువులు ఎద్దులకి పసుపు కుంకుమలు పూసి, హారతి ఒచ్చి పూజలు చేసాక, ధాన్యం బస్తాలను ఇంట్లోకి తెచ్చి, గాదె గదిలో కుమ్మరించే వారు . ధాన్యం బస్తాలతో పాటు ఆనప కాయలూ, బీర కాయలూ వంటి కూరలు కూడా  తెచ్చే వారు. ధాన్యం బస్తాలన్నీ ఇంట్లో చేరాక, పెరట్లో నుయ్యి దగ్గరకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కునే వారు రైతులు . నలుగు రయిదుగురు ఉండే వారనుకుంటాను. ఒక ప్రక్క ధాన్యం బస్తాలు ఇంట్లోకి పెరుగుతూ ఉండగానే ఇంట్లో మా నాయనమ్మా , వాళ్ళూ రైతుల కోసం వేడి వేడి అన్నం, సాంబారూ  ( పప్పు పులుసునీ ) వండి సిద్ధం చేసే వారు. పెరటి వాకిలి గచ్చు మీద విస్తరాకులు వేసి వడ్డించే వారు. ఆ వంటని మా రైతులు ఎంత ఇష్టంగా తినే వారో ! ‘ బుగతమ్మ చేతి వంట అమృతం ! ’ అంటూ మెచ్చుకునే వారు. మా నాయ నమ్మ పోయాక, మా మురళీ పిన్నీ, తర్వాత, మా ఆవిడా, కటి రెండేళ్ళు ఆ బాధ్యత కొత్తగా కాపురాని కొచ్చిన మా ఆవిడ తీసు కుని చేసేరు


ఇదంతా చెప్పడం దేనికంటే, ఇంటికి ధాన్యం బస్తాలు వచ్చిన రోజునే, పొలం నుండి రైతులు తెచ్చిన వరి కంకుల గుత్తులను మా వాళ్ళు మా ఇంటి నడి వాకిట్లో కట్టే వారు. అది మొదలు ! ఆ రోజు నుండీ పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి.  అలా,  అప్పుడు మా ఇళ్ళలోనూ. పెరళ్ళలోనూ విరివిగా కనబడే పిచ్చుకలు ఇప్పుడు  చాలా ఏళ్ళుగా  కనబడడమే మానేసాయి. పొలాలు అమ్ము కున్నాక, మా నడి వాకిలిలో రైతులూ లేరు, ధాన్యం బస్తాలూ లేవు, వరి కంకులూ లేవు. పిచ్చుకలూ లేవు !. 
చాలా ఏళ్ళకి మా కంట పడిన అపురూప అతిథిని మీకూ చూపించాలని ముచ్చట కొద్దీ ఇంత వివరంగా రాసేను.

ఇదిగో  ! మా ఇంటి కొచ్చిన అపురూప అతిథి ఫొటో ... చూడండి ....




నిర్మాణం పూర్తయి, తిరిగి నాలుగు రోజులలోనే తొలగించిన సెల్ టవర్ అవశేషాలు యివే ... ( దీనిని తొలగించిన మరు నాడే అతిథి రావడం  జరిగింది. యాదృచ్ఛికమే కావచ్చు కానీ అదొక అందమయిన భావనకు బీజం వేసింది ) చిత్రం  చూడండి.











5, అక్టోబర్ 2014, ఆదివారం

ఏ గట్టు మీద చూసినా , ఒట్లే !!


జీవితంలో ఒక్క సారయినా ఒట్టు పెట్టు కోని మనిషంటూ ఉంటాడని అనుకోను. అలాగే, ఒట్టు పెట్టు కున్నంత తేలిగ్గానే ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసే వాళ్ళకీ కొదవు లేదు.
ఒట్టు గురించి చెప్పు కునేటప్పుడు మొదటిగా చెప్పుకో వలసిన దేవుడు కాణిపాక వినాయకుడు .స్వామి సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధుడు కదా ! స్వామి ఎదుట ఆడిన మాట తప్పడానికి ఎవరూ సాహసించరని భక్తుల విశ్వాసం.
ఒట్టు అనే పదానికి నిఘంటువులు కలుగు,ఉంచు,రగుల్చు,కాల్చు,పెట్టు ,త్రాగు అనే అర్ధాలతో పాటు ఆన, శపథము,మొత్తము అనే అర్ధాలను ఇచ్చాయి. ఒట్టు పెట్టడమంటే శపించడం అనే అర్ధంతో పాటు నిషేధించడం అనే అర్ధం కూడా ఉంది.
ఘోర మైన ఒట్టు పెట్టుకుని, జీవితాంతం తను  పెట్టుకున్న ఒట్టుకి కట్టు బడిన వారిలో మొదట చెప్పుకో తగిన వాడు భారతంలో భీష్ముడు. శంతన మహారాజు దాశరాజు కుమార్తె సత్యవతిని చూసి, ఆమెను వివాహమాడాలను కున్నాడు. తన బిడ్డకు పుట్టబోయే వారికి సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత ఉండదు కనుక శంతనుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేయడానికి దాశరాజు ససేమిరా కుదరదన్నాడు.  తండ్రి మనో గతం తెలుసుకున్న భీష్ముడు  ( అప్పటికతని పేరు దేవ వ్రతుడు ) శంతనుని పెద్ద కొడుకైన తాను రాజ్యాన్ని ఆశించననీ, సత్యవతి పుత్రులే రాజ్యాన్ని పాలిస్తారనీ శపథం చేసాడు.
అప్పటికీ దాశరాజు  తన కుమార్తెను శంతనుడికివ్వడానికి ఒప్పు కోలేదు. దేవ వ్రతుడు రాజ్యం వొదులు కున్నా అతనికి పుట్టబోయే వాళ్ళు రాజ్యం వొదులు కోరని నమ్మక మేమిటని అతని సందేహం. దానితో దేవవ్రతుడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పోతానని భీషణమైన ప్రతిన చేసాడు. ఘోరమయిన ఒట్టు పెట్టాడు. అప్పటి నుండీ అతడు భీష్ముడయ్యేడు !
భీష్ముడు పెట్టిన ఒట్టు ఇలా ఉంది :
వినుఁడు ప్రసిద్ధులైన పృధివీపతు లిందఱు నే గురుప్రయో
జనమునఁజేసితిన్ సమయసంస్థితి యీ లలితాంగి కుద్భవిం
చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు వాఁడ మాకు నె
ల్లను బతి , వాఁడ కౌరవకులస్థితికారుఁడుదార సంపదన్ !

‘‘ఇక్కడ సమావేశమయిన రాజు లందరూ వినండి ! నేను మా తండ్రిగారి కోరిక నెరవేర్చడం కోసం స్థిరమైన ప్రతిఙ్ఞ చేస్తున్నాను.ఈ దాశరాజు కుమార్తె సత్యవతికి మా తండ్రి గారి వలన పుట్టబోయే వాడేరాజ్యాధికారం పొందుతాడు. అతడే మాకందరికీ ప్రభువు. అతడే కురువంశ ఉద్ధారకుడవుతాడు ! ’’
ఇదీ భీష్ముడి ఒట్టు ...

అలాగే మహా భారత కథలో ఇలాంటి భీషణమైన ఒట్లు పెట్టిన వారిలో భీము
డొకడు ! భీముడు పెట్టిన ఒట్లు (శపథాలు) లో రెండు చాలా ప్రసిద్ధమైనవి.
వాటిని చూదాం :
కురువృద్ధుల్ గురు వృద్ధ బాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో
ద్ధుకుఁడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి,  తద్విపుల వక్షశ్శైలరక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి సూచు చుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్ !

‘‘ఈ కురు వంశపు పెద్దలు, గురువులు, వృద్దులు , బంధువులు చాల మంది చూస్తూ ఉండగానే ఈ దుష్ట దుశ్శాసనుడు మదంతో, కండ కావరంతో ద్రౌపదిని ఇలా అవమానించాడు ... దుర్యోధనుడు చూస్తూ ఉండగానే రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో వీడిని లోక భీకరమైన రీతిలో వధిస్తాను ! వీడి వక్ష స్థలం అనే పర్వతం లోని రక్త ప్రవాహం అనే సెలయేటిని భయంకరాకారంతో త్రాగుతాను ! ’’
అంటూ ఒట్టు పెట్టుకున్నాడు భీముడు, అంతే కాక, తరువాతి వచనంలో ‘‘ నేనలా చేయక పోతే, నేను తండ్రి తాత మార్గానికి తప్పిన వాడినే అవుతాను ! ’’ అని కూడా మరో ఒట్టు పెట్టు కున్నాడు !
భీముడు చేసిన  మరో శపథం ( పెట్టిన ఒట్టు ) :
ద్రౌపది తనకి కీచకుడి చేతిలో జరిగిన భంగపాటుని ఒంటరిగా భీముడిని కలుసుకుని విలపిస్తూ చెప్పుకుంది. భీముడు భార్యను ఓదారుస్తూ, కీచకుడినీ అతని కుమారులనూ కూడా వధిస్తానని ఒట్టు పెట్టాడు. విరాట సర్వం లోని ఈ పద్యం కూడా చాలా ప్రసిద్ధం !
చూడండి :
అవనీ చక్రము సంచలింపఁగ, దివం బల్లాడ, నాశాచయం
బవధూతంబుగ గోత్రశైల నికరం బాకంపముం బొంద, న
ర్ణవముల్ ఘూర్జన మొందఁ గ్రోధము గృతార్ధత్వంబు నొందించి, చి
త్రవధ ప్రౌఢి వహించి సూతునకు రౌద్రంబేర్పడం జూపుదున్ !

‘‘ భూమండలం కంపించే విధంగా, ఆకాశం అల్లల్లాడి పోయే లాగా, దిక్కులు పిక్కటిల్లేలా, కుల పర్వతాలు వణికి పోయే తెరగున, సముద్రాలు కల్లోలమై పోయేటట్లు, నా క్రోధం సఫల మయచ్యే విధంగా చిత్రవధ చేసే నా నేర్పుని చూపిస్తూ ఆ కీచకుడిని అంతం చేస్తాను ! ’’

ఇక, గయోపాఖ్యానంలో అర్జుడు పెట్టిన ఒట్టు పద్యం కూడా జనాలకి చిర పరిచితమే ..

నదిలో అర్ఘ్య ప్రదానం చేస్తున్న శ్రీకృష్ణుని చేతిలో గయుని నిష్ఠీవనం ( ఉమ్మి ) పడింది! కృష్ణుడు ఆగ్రహంతో ఊగి పోయి, గయుని వధిస్తానని శపధం చేసాడు. గయుడు పరువెత్తి పోయ అర్జునుని శరణు వేడాడు. అప్పుడు అర్జునుడు ఒట్టు పెట్టి మరీ అతనికి అభయ మిచ్చాడు.
పద్యం చూడండి :
నిటలాక్షుండిపు డెత్తి వచ్చినను రానీ ! యన్నదమ్ముల్నను
న్విటతాటంబున బాసి పోయినను పోనీ ! కృష్ణఁడే వచ్చి,
ద్దిటు పార్ధా ! యననీ ! మఱేమయిన గానీ, లోకముల్బెగిలం
బటు దర్పంబున నిల్చి యీ గయుని ప్రాణంబేను రక్షించెదన్ !

‘‘ ఆశివుడే నామీద దండెత్తి రానీ ! అన్నదమ్ములు నా మీద కినుకతో నన్ను విడిచి పోతే పోనీ ! సాక్షాత్తు శ్రీకృష్ణడే వచ్చి, ‘‘అర్జునా ! వద్దు గయుని కాపాడ వద్దు ’’ అననీ !ఇంకేమయినా కానీ, లోకాలు అదిరిపోయేలాగున నిలబడతాను. ఈ గయుని కాపాడుతాను ! ’’

ఇక, మనందరికీ ‘‘ఆవు పులి ’’  కథ తెలిసిందే కదా ! అనంతామాత్యుడు భోజరాజీయంలో గోవ్యాఘ్ర సంవాదం అనే ఘట్టంలో ఈ కథ రసరమ్యంగా చెప్పాడు
తనని చంపి తినెయ్యడానికి సిద్ధపడిన పులిని ఆవుఎన్నో విధాలుగా బ్రతిమాలుకుంది. ఇంటి దగ్గర ఉన్న ఒక్కగా నొక్క చిన్నారి కొడుక్కి పాలిచ్చి వెంటనే వచ్చేస్తాను. అప్పుడు నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకో ! అని వేడుకుంది. ఎన్ని చెప్పినా పులి విన లేదు. అప్పుడు ఆవు చాలా ఒట్లు పెట్టి, పులికి నమ్మకం కలిగించింది.

ఆ ఒట్లు ఏమిటంటే ...
‘‘ ఓ పులి రాజా ! నేను నీకు మాట ఇస్తున్నాను. ఒట్టు పెడుతున్నాను. నేను ఇంటికి పోయి, తిరిగి నీ దగ్గరకి రాక పోతే ...
1. పరాయి ఆడదాని పొందు కోరిన యతి ఏ గతికి పోతాడో, నేనూ అదే గతికి పోతాను ! ఒట్టు !
2.మధ్యవర్తిగా ఉంటూ, పక్షపాత బుద్ధితో తగవు చెప్పే వాడు పోయే నరకానికే నేనూ పోతాను !
3.నమ్మి ఎవరయినా తన ధనం దాచుకుంటే తిరిగి ఇవ్వకుండా మోసం చేసే వాడు పోయే గతికి నేనూ పోతాను !
4.శుభ కార్యాలు జరిగే చోట వాటిని పాడు చేసే వాడు పోయే చోటికే నేనూ పోతాను
5. మిత్రుడిలా చేరి, శత్రువులా వ్యవహరించే వాడు పోయే దుర్గతికే నేనూ పోతాను
6.ఆవులకి గడ్డి వేయకుండా అవి మలమలమాడుతూ ఉంటే, తాను మాత్రం కడుపు నిండా తినే వాడు ఏ గతికి పోతాడో, నేనూ అదే గతికి పోతాను
7.పశువులను ఏ తప్పూ లేకుండా దండించే వాడు పోయే చోటుకే నేనూ పోతాను.
8.పరస్త్రీల పొందు ఆశించే వాడు పోయే గతికే నేనూ పోతాను.
9.జీతం తీసుకుంటూ ప్రభువుల పని చేయని పాతకుడు పోయే చోటికే నేనూ పోతాను.
10.దుర్భాషలు పలికి పెద్దలను బాధ పెట్టే పాతకుడు పోయే గతికే నేనూ పోతాను.
11.తల్లి దండ్రులను ఎదిరించే నీచుడు పోయే నరకానికే నేనూ పోతాను.
12.హా యిగా మేస్తున్న పశువులను అదిలించే వాడు పోయే చోటికే నేనూ పోతాను.
13.మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే నీచుడికి ఏ గతి పడుతుందో అది నాకూ  అదే పడుతుంది.
14.డబ్బు కోసం తన కన్న కూతురిని  ముసలాడికి ఇచ్చి  పెళ్ళి చేసే వాడు
ఏ నరకాన పడతాడో నేనూ అక్కడే పడతాను
15. ఏ తప్పూ చేయని భార్యని విడిచి పెట్టే వాడు పోయే నరకానికే నేనూ పోతాను.
16.తన వాళ్ళంతా తిండీ తిప్పలూ లేకుండా దరిద్రంతో బాధ పడుతూ ఉంటే, తాను దుబారా ఖర్చు చేసే వాడు ఏగతికి పోతాడో, నేనూ అక్కడికే పోతాను.
17.ఇస్తానన్న దానం ఇవ్వని వాడూ, అందు కోసం  చాలా సార్లు దాన గ్రహీతను త్రిప్పే వాడూ పోయే చోటికే నేనూ పోతాను. ’’
    ఇలా ఆవు ఎన్నో ఒట్లు పెట్టుకుంటే కానీ, పులి దానిని విడువ లేదు. ఇంటికి పోయిన ఆవు బిడ్డకి పాలిచ్చి మాట నాలుపు కుందే కానీ,  ఆ ఒట్లన్నీ తీసి గట్టు మీద పెట్టెయ్య లేదు ! ( గో మాతల నైజం ఇప్పటికీ ఇంతే కదా ! )
ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతూ పొంతూ ఉండదు.
కనుక, ఇక ప్రస్తుత కాలానికి వద్దాం ...
ఏలిన వారు పదవిని స్వీకరిస్తూనే చట్ట సభల సాక్షిగా ఎన్నో ఒట్లు పెడతారు. వాటిలో చాలా వాటిని మరునాడే మరచి పోయే వాళ్ళే ఎక్కువ !
నాతిచరామి ! అంటూ పెళ్ళిలో ఒట్లు పెట్టే మొగుళ్ళు ఎంత మంది ఆ ఒట్లు తరువాతి కాలంలో గుర్తుంచు కుంటున్నారో ఆలోచించాలి.
నాయకులు చట్ట సభల్లోనూ, వేదికల మీదా, పిల్లకాయలు బళ్ళలోనూ చాలా ఒట్లు పెడుతూనే ఉంటారు. వాటిలో సగం నిలుపుకున్నా బాగుండేది.
మామూలు జనం కూడా అయిన దానికీ కాని దానికీ కూడా ఒట్టు పెట్టి చెబుతూ ఉంటారు. నీ మీద ఒట్టు ! పిల్లల మీద ఒట్టు ! అంటూ ...కానీ సాయంత్రానికి పరగడుపే !
పండుగలకీ, పబ్బాలకీ, నూతన సంవత్సరారంభ దినాన ... ఇలా ప్రత్యేక దినాలలో ఒట్లు పెట్టుకునే వాళ్ళ సంఖ్య కి లెక్క లేదు ! ఏవేవో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ, స్వగతంగానో, బహిరంగంగారో ఒట్లు పెట్టు కుంటూ ఉంటారు !
అవన్నీ తూఛ్ ... అయి పోడానికి చాలా మందికి ఎక్కువ సమయం పట్టదు !
అమ్మ తోడు ! సరస్వతి తోడు ! అనేవి యాదాలాపం మాటలుగా మిగిలి పోతున్నాయి !
మన సినిమాల వాళ్ళు కూడా ఈ ఒట్లమీద చాలానే సనిమాలు తీసారు. పెళ్ళి నాటి ప్రమాణాలు ... వాగ్గానం ...  మంగమ్మ శపథం, చాణక్య శపథం ... ఇలా ... ఎన్నో !  చేతిలో చెయ్యేసి చెప్పు బావా ! అని కోరుకునే హీరోయిన్ కి చేతిలో చెయ్యేసి మరీ ఒట్టు పెట్టిన హీరో తరువాత ఏం చేస్తాడో వెండి తెర మీద చూడాలి. నాకయితే గుర్తు లేదు.
లోగడ అయితే ఒట్టు పెడితే జనాలు నమ్మే వారు. గుడిలో దీపం ఆర్పి ఒట్టు పెట్టి నిజం చెబితే నమ్మే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరూ ఎవరినీ, దేన్నీ నమ్మరు. అలా నమ్మ లేనంతగా దిగజారి పోయేం !

అందు చేతనే, ఏ గట్టు మీద చూడండి ... అసంఖ్యాకంగా ఒట్లు 
కనిపిస్తాయి !
 ఇప్పటికి స్వస్తి.