28, డిసెంబర్ 2019, శనివారం





పట్టు విడువగ రాదు

మన పూర్వ కవులు మన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దు కోడానికి ఎన్ని గొప్ప విషయాలనో మంచి మంచి శ్లోకాలలో చెప్పారు.

సింహ: శిశురపి మదమలిన కపోల భిత్తిషు గజేషు
ప్రకృతిరియం సత్త్వవతాం న ఖలు వయస్తేజసాం హేతు:

విదిలింప వుఱుకు సింగపుఁ
గొదమయు మద మలిన గండ కుంజరములపై
నిది బలశాలికి నైజము
గద ! తేజోనిధికి వయసు కారణమగునే ?

సింహం పిల్ల కూడ రెచ్చ గొడితే ఊరు కోదు. మద గజం మీదనయినా పడి తన సత్తా చాటుతుంది. ఇది బలవంతునికి నైజ గుణం కదా ! తేజోవంతునికి వయసుతో పని లేదు.

ఇదే అంశం మీద వివిధ కవులు ఏమేమి చెప్పారో  రోజు కొకటి చొప్పున రేపటి నుండి చూదాం...


27, డిసెంబర్ 2019, శుక్రవారం

కదిలేదీ కదిలించేదీ...


                                              


కదిలేదీ కదిలించేదీ
 జ్వలతి చలితేన్ధనో2గ్ని:
విప్రకృత: పన్నగ: ఫణం కురుతే
ప్రాయ: స్వం మహిమానం
క్షోభాత్ ప్రతిపద్యతే హి జన:

 ఇది మహా కవి కాళి దాసు రచించిన అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో ఆరవ అంకం లోని శ్లోకం.
 దూర్వాస మహా ముని శాపం వలన దుష్యంతుడు శకుంతలను మరచి పోతాడు. తిరిగి అభిఙ్ఞాన దర్శనంతో శకుంతల గుర్తుకు వచ్చి ఖిన్నుడై ఉంటాడు. నిస్తేజుడై ఉంటాడు. పరిపాలనా విముఖుడై ఉంటాడు. అట్టి మహా రాజుని రాక్షస సంహారార్ధం ఇంద్రుని పనుపున ఇంద్రలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఇంద్ర రథ సారధి మాతలి వచ్చి, రాజునకు ఆగ్రహం తెప్పించడం కోసం అతని నర్మ సచివుడు మాఢవ్యుని బాధిస్తాడు.
దానితో రాజునకు ఆగ్రహం కలిగి తిరిగి కర్తవ్యోన్ముఖుడవుతాడు....ఆ సందర్భంలో కవి చెప్పిన శ్లోకం యిది ....

 చితుకులు కదిలిస్తే అగ్ని మరింతగా జ్వలిస్తుంది. అపకారం చేయబోతే పాము పడగ విప్పుతుంది. మనిషి కూడ క్షోభ కలిగినప్పుడే తన శక్తి సామర్ధ్యాలు ప్రదర్శిస్తాడు.

ప్రతి మనిషిలోను అంతర్గతమైన శక్తులు చాల ఉంటాయి. అయా ప్రత్యేక పరిస్థితులు కలిగినప్పుడు అవి వెలుగు చూస్తాయి. వ్యథ లోనుండే కదా కథలు ఉద్భవిస్తాయి. వాల్మీకి విషయంలో ఏం జరిగిందో తెలిసిందే కదా? శోకమే శ్లోకమై ఒక మహా కావ్య ప్రాదుర్భవానికి నాంది పలకలేదూ!


 కదిలేదీ కదలించేదీ కావాలోయ్ నవ కవనానికి ...అని శ్రీ.శ్రీ గారనడంలో కూడ అంతరార్ధం యిదే కదా?

 కాళి దాసు శ్లోకానికి కందుకూరి వీరేశ లింగం పంతులు గారు చేసిన పద్యానువాదం కూడ చూడండి మరి ....

చితుకులు కదల్చుటను చెలగి మండు
చెడఁగు చేయుటచేఁబాము పడగ విప్పు
మఱియు క్షోభంబు వలననె మానవుడును
దనదు మహిమంబు చూపును తథ్యముగను.
 స్వస్తి.




26, డిసెంబర్ 2019, గురువారం


                                                        


తొందరపాటు తగదుసుమా ..

సహసా విదధీత న క్రియా, మవివేక: పరమాపదాం పదం
వృణుతేహి విమృశ్యకారిణమ్ , గుణలుబ్ధా: స్వయమేవ సంపద:

ఈ శ్లోకం ఏం చెబుతోందంటే ,

ఏ పనీ తొందర పడి చేయ కూడదు. తొందర పాటు , అవివేకమే అన్ని అనర్ధాలకూ మూలం. చక్కగా ఆలోచించి చేసిన పనికి
ఏ ఆటంకాలూ రావు. అట్టి వానిని సంపదలు తమంతట తామే వచ్చి చేరుతాయి. లక్ష్మి గుణ లుబ్ధ కదా ? అంటే మంచి గుణాలపట్ల ప్రీతి కలది కదా !


25, డిసెంబర్ 2019, బుధవారం

అశా పావము కడున్నిడుపు.....


                                                     


మా ఇంటి కొస్తే ఏం తెస్తావ్ ?  మీ ఇంటి కొస్తే ఏం ఇస్తావ్?

పుణ్యస్య ఫల మిచ్ఛంతి , పుణ్యం నేచ్ఛంతి మానవా:
న పాపఫల మిచ్ఛంతి , పాపం కుర్వంతి యత్నత:

మనుషులెంత గడుసరి వారో చూడండి. పుణ్యం చేయడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయరు. కాని పుణ్యం వలన వచ్చే ఫలితం మాత్రం తమకి దక్కాలని తెగ ఆరాట పడి పోతూ ఉంటారు.
నిత్యం అనేక పాపాలు చేస్తూనే ఉంటారు కానీ, ఆ పాప ఫలితం మాత్రం తమకు రాకూడదని కోరుకుంటూ ఉంటారు ! ఎంత విపరీతమో చూడండి

దీనిని గడుసుదనం అనాలో, స్వార్ధం అనాలో మనమే నిర్ణయించుకోవాలి.

మా ఇంటి కొస్తే నాకేం తెస్తావ్ ? మీ ఇంటి కొస్తే నాకేం ఇస్తావ్ ? అనడం లాంటిదే
కదూ ఇది !

దేశం నాకేమిచ్చింది ? అనుకోడం మాని, దేశానికి నేనేమి ఇచ్చాను ? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని పెద్దలు ఘోషించేది ఇందుకేనండీ బాబూ ! ...


24, డిసెంబర్ 2019, మంగళవారం

ఇవి ఉంటే అవెందుకు ?



                                                              


నిన్నటి దినం ఏవి ఉంటే ఏవి శోభిస్తాయో చూపాం.  ఇవాళ ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఛూదాం...

అవి ఉంటే, ఇవి అక్కర లేదు

క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?

ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఒక కవి ఈ శ్లోకంలో చక్కగా వివరించాడు. చూడండి ...

ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.
( ఆ సహనమే అతనిని కాపాడుతుంది.)

కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.
( ఆ కోపమే అతడిని నాశనం చేస్తుంది.)

దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు.
 ( ఆదాయాదులే మన కొంపకి చిచ్చు పెడతారు.)

మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు( వారే మనని మంచి మార్గంలో నడిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆలోచనలు అందిస్తారు)

దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పనేముంది ?
( వాళ్ళే పాముల వంటి వారు)

మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు ఎందుకు ?
 ( విద్యా ధనమే తరగని సంపద కదా)

లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు ఎందుకు ?
 ( సిగ్గే కదా చక్కని సింగారం?)

కవితా శక్తి కల వారికి వేరే రాజ్యమెందుకు ?
 ( రాజ్యభోగం కన్నా కవితా శక్తి గొప్ప కీర్తిదాయకం కదా)

.


23, డిసెంబర్ 2019, సోమవారం

దేని వన ఏది శోభిస్తంది ?



                                                      

దేని వలన ఏది శోభిస్తుంది ?

ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమ:
ఙ్ఞానస్యోపశమ: శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయ:
అక్రోధ స్తపస: క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వస్యాపి హి సర్వ కారణ మిదం శీలం పరం భూషణమ్ .

ఐశ్వర్యం వల్ల ఏది శోభిస్తుంది ?
మంచితనం. ( సంపదకు మంచి తనమే అలంకారం. )

పరాక్రమం దేని వలన శోభిస్తుంది ?
మాట మంచితనం ( ఎంత పరాక్రమం ఉన్నా, మాట కరుకుదనం వల్ల వ్యక్తి శోభించడు.)

ఙ్ఞానం దేని వలన శోభిస్తుంది?
 శాంతం వలన ( శాంతం లేని వివేకం వృథాయే కదా)

పాండిత్యానికి అలంకారం ఏది ?
 వినయం

ధనం ఉన్నందుకు ఏది చేయడం వల్ల శోభ కలుగుతుంది ?
 పాత్రత నెరిగిన దానం

తపస్సునకు ఏది అలంకారంగా భాసిస్తుంది ?
సహనం. కోపం లేక పోవడం (క్రోధిగా తపస్వికిఁజన్నే? అని భారతం చెబుతోంది.)

సమర్ధునకి శోభనిచ్చే ముఖ్య లక్షణం ఏది ?
క్షమా గుణం


ధర్మమునకు శోభని కలిగించేది ఏది ?
నిర్మోహత్వం ( దేనిమీద ఎక్కువ మమకారం లేక పోవడం)

సమత వలన ఏమి కలుగుతుంది ?
 తేజస్సు.

తక్కిన ఏ గుణాలు ఉండనీ, లేక పోనీ, మంచి నడవడిక మాత్రం సమస్త జనులకూ శోభని ఇస్తుంది.

ఈ విధంగా పెద్దలు శీల వర్తనకి పెద్ద పీట వేసారు.

ఆధారం :   ఆంధ్ర మహా భారతం. కవిత్రయ రచన.

22, డిసెంబర్ 2019, ఆదివారం

మంచి చెడ్డలు


                                                                               
    
నిన్నా మొన్నా విడి విడిగా  సుజన  దుర్జనుల వైఖరి చూసాం కదా? ఇప్పుడు జమిలిగా చూదాం ...
తమ కార్యంబుఁబరిత్యజించియుఁబరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్ధ వ్యాపృతుల్ మధ్యముల్
దమకై యన్య హితార్ధఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్ధ భం
గము గావించెడి వార లెవ్వరొ యెఱుంటన్ శక్యమే యేరికిన్ ?
తమ పని మానుకుని ఇతరుల పనులు చక్కబెట్టే వారు సజ్జనులు
తమ పని చూసుకుంటూనే, ఇతరులకు ఉపకారం చేసే వారు మధ్యములు.
తమ స్వార్ధం కోసం ఇతరుల పనులను చెడగొట్టే వారు రాక్షసులు.
మరి, ఏ ప్రయోజనమూలేక పోయినా, ఊరకనే ఇతరుల పనులు చెడగొట్టే వారు ఎవరో చెప్పడం ఎవరి తరమూ కాదు.

21, డిసెంబర్ 2019, శనివారం

చెప్తే వినాలి

           
             



చెప్తే వినాలి

సంతస్తాయసి సంస్థితస్య పయసో నామాసి నశౄయతే
ముక్తాకారతయా తదేవ నలినీ పత్ర సితం దృశ్యతే
అంతస్సాగర శుక్తి మధ్య పతితం తన్మౌక్తికం జాయతే
ప్రాయేణాధం మధ్యమోత్తమ జుషా మేవం విధా వృత్తయ :

నీరము తప్త లోహమున నిల్చి యనామకత్వ మై నశించు,నా
నీరమె ముత్యమట్లు నళినీ దళ సంస్థితమై తనర్చు , నా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభు
బౌరుష వృ త్తులిట్లధమ మధ్యమునుత్తముఁగొల్చు వారికిన్

బాగా కాలిన లోహం మీద పడి నీరు వెంటనే అనామకంగా ఆవిరయి పోతుంది. ఆ నీటి బిందువే తామరాకుమీద ముత్యంలా మెరుస్తుంది. అదే నీరు శుక్తిలో పడితే... మణిగా భాసిస్తుంది.

అలాగే, మనం అధములను సేవిస్తే నాశనమై పోతాం. మధ్యములని సేవిస్తే ఒకింత రాణిస్తాం. ఉత్తములని సేవించుకుంటే గొప్ప కీర్తిమంతులమౌతాము.

దుర్జనులు ఎప్పుడూ పరిహరించదగిన వారే. పడగ మీద మణి ఉంది కదా అని, నాగుపాముని ఆదరించం కదా ?

19, డిసెంబర్ 2019, గురువారం

మంచి మనసు


                                                             


                                                   మంచి మనసు

సంత స్తృణోత్పారణ ముత్తమాంగాత్,
సువర్ణకోట్యర్పణ మామనంతి
ప్రాణ వ్యయేనా2పి కృతోపకారా:
ఖలా: పరే వైర మివోద్వహంతి

మంచి చెడుల తారతమ్యం ఎప్పుడూ ఉండేదే. మంచి వారికీ, చెడ్డ వారికీ ప్రవర్తనలో భేదం స్పష్టంగా కనిపించి పోతూనే ఉంటుంది.

తల మీద ఉన్న గడ్డి పోచను తొలిగించినంత మాత్రాన , వాళ్ళేదో మనకి మహోపకారం చేసినట్టుగా సత్పురుషులు భావిస్తూ ఉంటారు. అంటే, మనం వారికి ఏ చిన్న ఉపకారం చేసినా అది మహోపకారం చేసినట్టుగా కృతఙ్ఞత కనబరుస్తారు. చేసిన మేలు ఎప్పటికీ మరిచి పోరు.

అదే, చెడ్డ వారయితేనా, మన ప్రాణాలు పణంగా పెట్టి గొప్ప ఉపకారం చేసినా, కృతఘ్నులై చేసిన మేలు మరిచి పోవడమే కాక, అకారణంగా మన మీద పగ సాధిస్తూ ఉంటారని మీది శ్లోకం చెబుతోంది.

18, డిసెంబర్ 2019, బుధవారం

కలగా పులగం




నవ్వితే నవ్వడి ..నాకేం అభ్యంతరంయలేదు..

కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.
ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.
అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !
అలాంటివాటిని కొన్నింటిని చూదాం !
వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:
ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.
‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.
మరొకటి -
కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !
మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!
భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:
ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.
ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:
గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:
అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:
కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:
పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:
అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం
తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .
మరొకటి చూడండి:
తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి
కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !
చివరగా ఇంకొకటి ...
క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:
ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.


17, డిసెంబర్ 2019, మంగళవారం

గోరంత మేలు


                           
    



గోరంత మేలు

ప్రథమవయసి పీతం తోయ మల్పం స్మరంత:
శిరసి నిహితభారా నారికేళా నరాణాం,
సలిల మమృతకల్పం దద్యు రాజీవితాతం
నహి కృత ముపకారం సాధవో విస్మరంతి.

మంచి వారికి ఎంత చిన్న ఉపకారం చేసినా వారు దానిని తమ జీవితాంతం మరిచి పోరు.
కొబ్బరి చెట్టుని చూడండి, ఎప్పుడో చిఱుత ప్రాయంలో మనం పోసే కొద్దిపాటి నీటిని త్రాగి, ఆ మేలు మరి ఎప్పటకీ మరిచి పోదు. బరువైన కాయలను గుత్తులు గుత్తులుగా మోస్తూ, కలకాలం మనుషులకు తీయని నీటిని ఇస్తున్నది కదా !


15, డిసెంబర్ 2019, ఆదివారం

మంచి పలుకు


                                                       



అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్ల గాను
కంచు మ్రోగు నట్లు కనకంబు మ్రోగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ.

సుప్రసిద్ధ మయిన ఈ వేమన పద్యం వివరించే అర్ధమే కలిగిన ఒక సంస్కృత శ్లోకం చూదామా ?

నిస్సారస్య పదార్ధస్య, ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ధ్వని స్తాదృక్ , యాదృ క్కాంస్యే ప్రజాయతే.

నిస్సారములయిన అల్ప వస్తువులకు ఆడంబరం ఎక్కువగా ఉంటుంది.
కంచు మ్రోగినట్లు బంగారం మ్రోగదు కదా !