18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కప్పల కథ !



ఎన్నికల వేళ దేశంలో, మరీ ముఖ్యంగా మన   రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉంటే, కప్పల కథ రాయాలనిపించడం యాదృచ్ఛికమేమీ కాదని మనవి చేస్తున్నాను.
లోగడ కథా మంజరిలో చెప్పుల కథ రాశానా ? ఇప్పుడు కప్పల కథ రాస్తే తప్పేఁవిటని అనిపించి రాస్తున్నాను. 
ముందుగా మన ఆనవాయితీ ప్రకారం కప్ప అనే అర్ధాన్నిచ్చే పదాలు ఇంకా ఏమేం ఉన్నాయో చూదాం ...
అజంభము, అజిరము, అజిహ్వము,అనిమకము,అనూపము, అలిమకము,కృతాలయము,
చలికాపు, సూచకము, దుర్దురలము,దాటరి. ప్లవము, భుకము,మండూకము లాంటి చాలా ఉన్నాయి కానీ అంత ఆయాసం మనకొద్దు.  అన్నట్టు హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధంతో పాటూ కప్ప  అనే అర్ధం కూడా ఉందండోయి !
కప్పల్లో బావురు కప్ప, బాండ్రు కప్పచిరు కప్ప అని   చాలా రకాలు  కనిపిస్తాయి.
తెలుగు సాహిత్యంలో కప్పల గురించిన ప్రస్తావన వచ్చిన తావులు ఒకటి రెండు విన్నవిస్తాను ...
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తు రది ఎట్లన్నన్
తెప్పలుగ చెఱువు నిండిన
కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ !
అంటాడు సుమతీ శతకకారుడు బద్దెన. మరంతే ... మన దగ్గర సొమ్ముంటే ఎక్కడెక్కడి వాళ్ళూ బంధువుల మంటూ వచ్చి చేరుతారు. చెఱువు నీటితో కళకళలాడుతూ ఉంటే వేలాదిగా కప్పలు వచ్చి చేరుతాయి కదా, అలాగన్నమాట.

మరో పద్యం చూడండి ...
సరసుని మానసంబు సరస ఙ్ఞుఁడెఱుంగును, ముష్కరాధముం
డెరిఁగి గ్రహించు వాఁడె ? కొలనేక నివాసముగాఁగ దుర్దురం
బరయఁగ నేర్చు నెట్లు వికజాబ్జమరంద సౌరభో
త్కరము మిళింద మొందు క్రియ దాశరథీ ! కరుణాపయోనిథీ !

ఈ పద్యం కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకం లోనిది.   దుర్దురము (కప్ప ) ఉండేదీ, కమలం ఉండేదీ కూడా కొలను లోనే ! కానీ, ఆ కమలంలో ఉండే తేనెని  తుమ్మెద మాత్రమే ఆస్వాదిస్తుంది కానీ ప్రక్కనే ఉండే కప్పకి దాని మాధుర్యం తెలయదు కదా !అలాగే సరసుని మనసు పరసుడే తెలిసికో గలుగుతాడు అని దీని భావం. ఇందులో కప్ప ప్రస్తావన వచ్చి నప్పటికీ ఆ ప్రస్తావన దాని గౌరవం ఇనుమడించేలా మాత్రం లేదు పాపం ...

వెనుకటికి ఓ అవధాని గారికి  ‘‘ కప్పని చూచి పాము గడగడ వణికెన్ !’’ అని వో సమస్య నిచ్చేరుట. దానిని అవధాని   తెలివిగా, కిర్రు చెప్పులు వేసుకుని,  కర్ర పట్టుకుని, పొలం కాపునకు వచ్చిన రైతు     వెంకప్ప  (వెం –కప్ప) ను చూచి అక్కడ  వో పాము గడగడా వణికిందని  సమస్యాపూరణం చేసారు. మేకల్ని చూసి పులులూ , కప్పల్ని చూసి పాములూ ఎక్కడయినా భయ పడతాయా, మన వెర్రి గానీ !

నిజఁవే ... కప్పని చూస్తే జాలేస్తుంది. పరిశోధనల పేరిటా, పరీక్షల పేరిటా రోజూ కళాశాలల్లో ఎన్ని కప్పలు దారుణంగా చంపి వేయ బడుతున్నాయో కదా ... ఇలా కప్పలకి మనుష్య జాతి వలన పీడ  ఉండగా సర్ప జాతి వలన ప్రాణగండం ఎలానూ ఉంది. పాములు కప్పలు దొరికితే మహదానందంగా చప్పసరించేస్తాయి మరి ... కడుపు నిండి కప్పలు తిన్న పాము కదలకుండా నిబ్బరంగా పడుంటుందిట. కప్ప తిన్న పాములా కదలకుండా   ఎలా ఉన్నాడో చూడూ అనడం  లోకంలో వొక వాడుక.

శ్రీ.శ్రీ గారు వో గేయంలో ఘూకం కేకా ,,, భేకం బాకా అన్నారు. ఈ విధంగా ఆధునిక కవిత్వం లో కూడా కప్ప ప్రస్తావన వొచ్చిందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

ఆత్రేయ గారయితే ఏకంగా కప్పలు అనే వొక ప్రసిద్ధమయిన నాటికనే రాసి పడీసేరు.
నూతి లోని కప్పలు అనే దానికి లోకం తెలియని మూర్ఖులు అని అర్ధం,
కప్పదాట్లు అంటే  తెలుసు కదా ?  నడకలోనో, పరుగులోనో మధ్యలో ఓ దాటు వదిలేసి అడుగులెయ్యడం. కొంత మంది తమ ప్రసంగంలో ఎంతకీ అవసరమయిన విషయాన్ని చెప్పకుండా  తప్పించు కోడానికి ప్రసంగంలో కప్పదాట్లు వేయడం కద్దు.  సమయం వచ్చి నప్పుడు వాడి బండారమంతా బయట పెడతాను ! అని అప్పటికా ప్రస్తావనని దాట వేసే కప్ప దాట్ల రాజకీయ నాయకులని చూసేం కదా ... కప్ప గెంతులు అనే ఆట ఆడపిల్లలకి చాలా ఇష్టమయిన ఆట వెనుకటి రోజుల్లో. ఇవాళ మన చిన్నారి పాపలకి ఈ ఆట ఆడుకోడానికి కంప్యూటర్ లో కప్పగెంతులు ఆట ఉందో లేదో నాకు తెలియదు.

కప్పదాట్లనే సంస్కృతీకరిస్తే మండూక ప్లుతి న్యాయం  అవుతుంది.

సంగీత రాగాలలో కూడా దాటు గతి   అని వొకటుందని చెబుతారు. ఇలాంటిదే కాబోలు. కానయితే దానికి మంచి గౌరవస్థానం ఉంది.

ఉపనిషత్తులలో మండూకోపనషత్తు ఉంది. దాని వివరాలు తెలిసిన పెద్దలు చెప్పాలి. నా లాంటి అల్పఙ్ఞుడికేం తెలుస్తుంది చెప్పండి ?

కప్పల తక్కెడ అని ఓ జాతీయం. తక్కెడలో కప్పలని ఉంచి తూకం వేయడం ఎవరి తరమూ కాదు. అవి వొక చోట స్థిరంగా ఉంటే కదా ?  ( మన రాజకీయ పార్టీ నాయకుల్లాగ ! )

అప్పాలు కప్పలుగా మారిన వైనం వెనుటి రోజులలో ఓ తెలుగు సినిమాలో చూసి తెగ నవ్వుకున్నాం గుర్తుందాండీ ?
‘‘కరవమంటే   కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం ’’అనే మాట విన్నారు కదూ ? కప్ప కరవడమేఁవిటి పాపం ... అందుకే కదా, ‘‘కప్ప కాటు లేదు, బాపన పోటు లేదు ’’అనే సామెత పుట్టిందీ ?
‘‘కప్పలు అరుస్తూనే ఉంటాయి, దరులు ( గట్లు) పడుతూనే ఉంటాయి ’’అనేది మరో సామెత.
‘‘కప్పలు ఎఱుగునా కడలి లోతు’’ అని కూడా మరో సామెత ఉంది.

వీటి మాటకేంగానీ,‘‘ కప్పలు అరిస్తే కుప్పలుగా వాన పడతుంది’’ అని వో సామెత ఉంది.
కప్పల పెళ్ళి చేస్తే జోరుగా వానలు పడతాయని మన వారిలో వో నమ్మకం ఉంది.
కప్పల బెక బెకలు పుష్కలమైన నీటి తావులకి చక్కని సంకేతాలు.  ( ట ! )
తాళం కప్పలో కప్పకీ మనం చెప్పు కుంటున్న కప్పకీ ఏఁవయినా సమ్మంధం ఉందో, లేదో ఆలోచించాలి ...

బాల సాహిత్యం లోనూ. జానపద సాహిత్యం లోనూ చాలా కప్పల కథలు కనిపిస్తూ ఉంటాయి.  కప్పలు అందమైన రాజకుమారిగా మారి పోవడమో, లేదా యువరాణి ముని శాపం చేత కప్పగా మారి పోవడమో  ... ....ఇలాంటి కల్పిత కథలు  చాలానే కనిపిస్తాయి.
ఇంతటితో కప్పల కథకి స్వస్తి !

బెక !  బెక !!  బెక !!!

16, సెప్టెంబర్ 2015, బుధవారం

వినాయక చవితి శుభాకాంక్షలు !



వినాయక చవితి శుభాకాంక్షలు.
ఉదయాన్నే వొచ్చేడు నా కాషాయ మిత్రుడొకడు. ఇదేం పిచ్చిరా బాబూ ! ఇదేం గోల! ఊరంతా ఎక్కడ చూసినా వినాయక ఉత్సవాలేదారి పొడుగునా వినాయక పెండాల్ లే కనిపిస్తున్నాయి. ఒక దానిని మించిన ఎత్తులో ఒకటి ఉంటున్నాయి వినాయక విగ్రహాలు. మైకులు చెవులు చిల్లులు పడేటట్టుగా హోరెత్తించేస్తున్నాయి. ఆ రంగులు పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగిస్తుందని మొత్తుకుంటున్నా వీరికి చెవి కెక్కదు. వీళ్ళ దుంప తెగ !
అవేం విగ్రహాలు ! ఒక్కో చోట ఒక్కో రకం వినాయక ప్రతిమ కనిపిస్తోంది. ఎవడికి తోచినట్టు వాడు చేయిస్తున్నాడు. ఆధునిక వినాయకుడట ! ఆల్ట్రా మోడరన్ వినాయకుడట. వీళ్ళకి మతులు కానీ పోతున్నాయాఅని ఆవేశ పడి పోయాడు.


మైకుల హోరు తగ్గించి, శబ్ద కాలుష్యం అరికట్టాలనీవినాయక ప్రతిమల తయారీలో పర్యావరణానికి హాని కలిగించే రంగుల వాడకం కూడదనీ చెబుతున్న దానిలో విప్రతిపత్తి లేదు. కానిరకరకాల ఫోజులలో వినాయక ప్రతిమలు చేయిస్తూ గణపతి దైవాన్ని అపహాస్యంపాలు చేసేస్తున్నారనే విషయంలో నా అభిప్రాయం వేరుగా ఉంది.
విఘ్నాలు పోగొట్టి మనందరకీ సకల శుభాలూ కలిగిచే వినాయకుడంటే మనందరకీ చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే,
ఆ తొండంఆ బాన పొట్ట, ఆ కుబ్జ రూపు ... ఇవేవీ మనకి తోచవు. ఒక దేవతా మూర్తిగా భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూనే వినాయకుడిని మనం ఒక ఆత్మీయ మిత్రునిగామనలో ఒకడిగా భావిస్తాం కాబోలు. అందుకే ఏ దేవుడికీ లేని విధంగా వినాయకుడికి పూజలు చేసే వేళ వినాయక రూపాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా రూపొందించుకుంటున్నాం.
ఒక్కో చోట ఒక్కో ఆకారంలో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఈ ఉత్సవ సమయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కపు విందు చేస్తూ ఉంటాయి. అపరిమితమైన వినోదాన్ని అందిస్తూ ఉంటాయి.
వినాయకుడు ఫేంటూ చొక్కా వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ల్యాప్ టాప్ ముందు కూచున్న తీరు చూసి మురిసి పోతాం
.
మోటారు బైకు నడిపే వినాయకుడూజైజవాన్ లా ముస్తాబయిన వినాయకుడూ, రకరకాల పండ్లతో చేసిన వినాయకుడూ, క్రికెట్ లాంటి ఆటలు ఆడే వినాయకుడూ, రక్షక భటుని వేషంలో ఉండే వినాయకుడూ, ఇలా ఒకటేమిటిఎన్ని రకాల ఫోజులలోనో వినాయక విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి,
వినాయకుడి విషయంలో ఇదేదో తీరని అపచారం జరిగి పోతున్నదని ఊరకే గుండెలు బాదుకోనవసరం లేదని
నా అభిప్రాయం.
వినాయకుడంటే జనాలకి భక్తితో పాటు ఒక దగ్గరితనం కూడా ఉంది.తమనీతమ వృత్తులనీ, తమ జీవితాన్నీ ,జీవితావసరాలనీ, తమ ఆలోచనలనీ, తమ ఆనందాలనీ, తమ నైమిత్తిక సమమస్యలనీ, తమ అభిరుచులనీ, అభీష్టాలనూ. తమకు చెందిన సమస్త వస్తు సముదాయాన్నీ తమతో పాటు తమ ఇష్ట దైవం వినాయకుడివిగా భావించి తమను తాము ఆ గణపతితో అన్ని విషయాలలో ఐడింటిఫై చేసుకోవడం వల్ల గణపతిని ఒక దేవుడి కన్నాఒక ఆత్మీ బంధువుగానోచెలికానిగానో చూస్తూ ఉండడం వలన ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వినాయక ప్రతిమలు చేయిస్తున్నారు అని నా భావన. కనుక, ఇదేమంత తీవ్రంగా ఆక్షేపించ వలసిన విషయం కాదనుకుంటాను
సరే,  వినాయక చవితి సందర్భంగా వినాయకుని స్తుతించే ఒక చక్కని పద్యం చూదాం ....

అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధము లాను వేళ బా
ల్యాంక విచేష్టఁదొండమున నవ్వలిచన్ గబళింపఁబోయి యా
వంకఁగుచంబుఁగాన కహి వల్లభ హారముఁగాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యునిఁగొల్తు నభీష్ట సిద్ధికిన్
అల్లసాని పెద్దన. మను చరిత్రము)
బాల గణపతి తల్లి పార్వతమ్మ ఒడిలో చేరాడు. చనుబాలు త్రాగుతున్నాడు.పసితనపు చెయిదము చేత తొండంతో అవతలి కుచాన్ని పట్టు కోవాలని చూసాడు. అర్ధ నారీశ్వరత్వం వల్ల అటు వేపు తల్లి స్తనం వానికి దొరక లేదు.
సరి కదాపాముల హారాన్ని చూసిదానిని తామర తూడు అనుకుని పట్టుకో బోయాడు ! గజాస్యుడు కదా మరి ! తామర తూడు పట్ల ఆకర్షితుడు కావడం సహజమే మరి ! అట్టి వినాయకుడిని నా కోరికలు నెరవేరాలని సేవిస్తాను
అని పెద్దన గణపతి స్తవం కమనీయంగా చేసాడు, తన మను చరిత్రములో.
అందుకే,
పెద్దన గారి మను చరిత్ర కల్పాంతముల దనుక మను చరిత్ర !!.
అవిఘ్నమస్తు..
స్వస్తి.



12, సెప్టెంబర్ 2015, శనివారం

గుడ్డి రాజుకి నిద్ర పట్టడం లేదు !



సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. అక్కడి విషయాలు తెలుసు కోవాలని ధృతరాష్ట్రుడికి మహా తొందరగా ఉంది. ఐతే , తిరిగి వచ్చిన సంజయుడు అతనికి ఏమీ అప్పుడు చెప్ప లేదు. బడలికగా ఉందన్నాడు. మరు నాడు ఉదయమే అందరూ సభదీరే వేళ అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతానని తన నివాసానికి వెళ్ళి పోయాడు.

అంతే !

మరింక కురు మహారాజుకి కంటి మీద కునుకు పట్ట లేదు. అశాంతితో అటూ ఇటూ దొర్లు తున్నాడే కానీ నిద్ర
 వస్తేనా ?
విదురుడిని తన దగ్గరకి పిలిపించు కున్నాడు. నాలుగు మంచి మాటలు చెప్పి తన అశాంతిని దూరం చేయమన్నాడు.

విదురుడు రాజుకి చాలా నీతులు బోధించాడు. అక్కడక్కడా చురకలు కూడా వేసాడు.

బలవంతుఁడు పై నెత్తిన
బలహీనుఁడు ధనము గోలు పడిన యతఁడు మ్రు
చ్చిల వేచు వాఁడు, గామా
కుల చిత్తుఁడు నిద్ర లేక కుందుదు రధిపా !


బలవంతుడు మీద పడిన బలహీనుడూ, డబ్బు పోగొట్టు కొన్న వాడూ, ఎప్పుడు ఎవడి సొమ్ము కాజేదామా అని కాచుకుని కూర్చునే వాడూ, కామం చేత మనస్సు కలత చెందిన వాడూ నిద్ర పట్టక అవస్థ పడతారు సుమీ ! అని
హిత బోధ చేసాడు విదురుడు.

నిద్రకు వెలియై

నే నొంటరినై

నా గది లోపడ చీకటిలో

చీకటి లోపల నాగదిలో ...  అంటాడు శ్రీశ్రీ.

నిద్ర మంచిదే కానీఅతి నిద్ర అనర్ధదాయకం !

జీవితమున సగ భాగం
నిద్దురకే పరి పోవు
మిగిలిన ఆ సగ భాం
చిత్త శుద్ధి లేక పోవు ..
అందుకే, మత్తు వదలరా ! అంటూ హెచ్చరిస్తాడు వో సినీ కవి.

సరే, ఎలాగూ నిద్ర పట్టడం లేదు కనుక తిక్కన భారతం తీసాను. చిన్న పద్యం వొకటి కనిపించింది. పద్యం చిన్నదే కానీ భావం అగాధం.  మీరూ చూద్దురూ ...


 గొప్ప తాత్త్వికార్ధాలతో కూడిన తిక్కన గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోని  ఈ  చిన్న పద్యం చూడండి:

ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించు వాఁడు వివేక ధనుడు !

అధికారాన్ని చేపట్టి, మంత్రమూ ఉత్సాహమూ అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా జత చేయాలి, మిత్రులూ, అమిత్రులూ , తటస్థులూ అనే మూడు వర్గాల వారినీ, సామ, దాన, భేద, దండములు అనే నాలుగు ఉపాయాల చేతా పూర్తిగా వశ పరచు కోవాలి. త్వక్కు ( చర్మం) ,చక్షువు ( కన్ను ) , శ్రోత్రము ( చెవి ), జిహ్వ ( నాలుక), ఘ్రాణం
( వాసన) అనే సంచేంద్రియానూ జయించాలి. సంధి , విగ్రహం, యానం , ఆసనం, ద్వైదీభావాలు(2) అనే ఆరింటినీ తెలుసు కోవాలి. వేట ,జూదం, పానం, స్ర్తీ , వాక్పారుష్యం ( కఠినంగా మాటలాడడం, ) దండపారుష్యం ( హింప చేయడం), అర్ధ దూషణం ( దుబారా చేయడం) అనే సప్త ( 7) వ్యసనాలనూ విడిచి పెట్టి ఎవడయితే ఉంటాడో వాడే వివేకవంతుడు.


స్థూలంగా ఈ పద్యానికి ఇదీ భావం. కానీ పెద్దలు ఈ చిన్న పద్యానికి వేరే తాత్త్విక పరమయిన అర్ధాలు చెబుతారు. వాటిని కూడా చూదామా ?

ఒకటి బుద్ధి. దీనికి వాక్కు , క్రియ, అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా చేర్చాలి. అంటే ఏది చెబుతాడో అదే చేయాలి.
ఇక, ధర్మార్థ కామాలను మూడింటినీ బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆవ్రమవిధులతో వశం చేసు కోవాలి. కర్మేంద్రియాలు ( వాక్కు, పాణి, పాదం, వాయువు, గుహ్యం ) ఐదింటినీ గెలవాలి. యజన, యాజన, ఆద్యయన, దాన, ప్రతిగ్రహాలు అనే స్మార్త కర్మలను తెలుసుకొని, ఆవరణం ( పంచభూతాలు పృధ్వి, అప్,తేజస్సు, వాయువు, ఆకాశం) బుద్ధి, అహంకారం ఈ మొత్తం ఏటింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.

పెద్దలు చెప్పే మరో తాత్త్వికార్ధం:

ఒకటి - సత్త్వం , రెండు -రజస్తమస్సులూ , మూడు -ధన, దార ( భార్య) పుత్రుల పట్ల మమకారం, నాలుగు - ధ్యానం, ధారణ, యోగం, సమాధి. తక్కినవి మీద చెప్పినవే.

మూల భారతంలో దీని శ్లోకం ఇలా ఉంది:

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శ్చతుర్భి ర్వశే కురు
పంచ జిత్వా విదాత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ !


ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు  ఏఁవిటి రాస్తున్నావని ఆరా తీసాడు.

అంతా చదివి వినిపించేను. నా ఖర్మ కాలి,

 ఏ కొంచెమైనా అర్ధమయిందా అనడిగేను.

భలే వాడివే , అర్ధం కాక పోవడమేం ! గుడ్డి రాజుకి పాపం నిద్ర పట్ట లేదు. అంతే కదా ! అన్నాడు. నా బుర్ర తిరిగి పోయింది.

ఓ నిద్ర మాత్ర వేసుకుంటే పోలా ! అని ముక్తాయించేడు.

ఇలాంటి సందర్భాల లోనే కదా, జీవితం మీద చెప్పలేనంత విరక్తి కలిగేది ?!







చెట్లు కూలుతున్న దృశ్యాలు !



కుమారుడు, తటాకము,కావ్యము,నిధానము,ఆలయము,వనము,భూదేవ స్థాపనము ఈ ఎనిమిదింటినీ మన పూర్వీకులు సప్త సంతానాలుగా పేర్కొన్నారు.

వీటిలో కొందరు కుమారునికి బదులుగా సత్ర ప్రతిష్ఠ ను సప్త సంతానాలలో ఒకటిగా భావిస్తూ ఉంటారు. అదలా ఉంచితే, వీటిలో వనము అంటే తోట అని అర్ధం. తోటలు పెంచడంలో మన పూర్వీకులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అందులో ధార్మిక దృక్పథమూ, లోక కల్యాణ సంకల్పమూ తప్ప, వ్యాపార దృక్పథం ఇసుమంతయినా ఉండేది కాదు.

ఆర్ధిక ప్రయోజనం లేదనుకుంటే, ఎలాంటి చెట్లనయినా, అనాలోచితంగా మొదలంటా నరికి వేయడానికి సందేహించని ప్రవృత్తిని పెంపొందించుకున్నాం. ఎంత దురదృష్టమో కదూ?

ఈ సందర్భంగా మాకూ ఉన్నాయి స్వగతాలు పేరిట గోపీచంద్ వ్రాసిన తుమ్మ చెట్టు గుర్తుకు వస్తున్నది. అందులో భూకామందు తన పొలంలో పెంచుకున్న తుమ్మ చెట్టుని ఎంతో ప్రీతి పాత్రంగా చూసుకుంటాడు. కాని, అతను గతించాక, కాని కాలం దాపురించి, అతని అల్లుడు పొలం గట్టున ఆ తుమ్మ చెట్టు అసహ్యంగా ఉండడమే కాక, వ్యర్ధంగా ఉందని భావించి, నిర్దయగా దానిని కొట్టి వేయిస్తాడు. ఇందులో తుమ్మ చెట్టు ఆత్మగతం ఎంతో విఙ్ఞాన దాయకంగానూ, చాలా హృదయంగమంగానూ ఉంటుంది. తుమ్మ ముళ్ళు కాళ్ళలో దిగబడుతున్నా, దాని ఉపయోగం తెలిసిన రైతులు తుమ్మ చెట్టును ఎంతో ఆదరంగా చూసుకుంటూ ఉంటారు. దాని విశిష్టత తెలియని వ్యక్తుల దృష్టిలో తుమ్మ చెట్టు ఒక పనికి రాని చెట్టు. ఈ రచన చదివితే, ఒక్క తుమ్మ చెట్టే కాదు, ప్రతి చెట్టూ మానవాళికి ఎంతో ఉపయోగకారి అని గ్రహిస్తాం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే ...

మన పెద్దలు వన దేవతలను కొలిచారు. చెట్లనూ, పుట్లనూ సేవించడం మన హైందవ సంస్కృతిలో ఒక ప్రథానభాగం.

మా చిన్నప్పుడు సోషలు పాఠంలో అశోకుడు రహదారికి ఇరు ప్రక్కలా చెట్లు నాటించెను. అనే అంశాన్ని ఎంతో ఇష్టంగా చదువుకునే వాళ్ళం. అశోకుడు రోడ్డుకి రెండు ప్రక్కలా చెట్లు ఎందుకు నాటించాడో తెలుసునా? అనడిగితే, దారి మధ్యలో అయితే ఇబ్బంది కదండీ అనే కొంటె కోణంగుల కాలమిది.

చెట్లను ప్రేమించడమంటే, ప్రకృతిని ఆరాధించడం.

ఎప్పుడో, ఏడాదికోసారి వన మహోత్సవాల తంతు తూతూ మంత్రంగా జరిపించి, చేతులు దులుపుకోవడం అనే ప్రహసనం మనకు తెలిసిందే.

కాని , మన పూర్వీకుల అలా కాదు. వృక్ష జాతిని దేవతాగణంగా తలపోసి ఆరాధించే వారు.
వాపీకూప తటాకాలు ప్రతిష్ఠించి, వనాలను అభివృద్ధి చేసే వారు. అటవీ సంపదకూ, వర్షాలకూ, భూసార పరి రక్షణకూ, సుఖతరమైన ప్రజా జీవితానికీ, చెట్లు ఆధారం అని ఏనాడో గ్రహించారు. అలాంటి వనాలను అభివృద్ధి చేసి ఆదర్శప్రాయులయ్యారు.

వృక్షో రక్షతి రక్షిత: అన్నారు.

ఈ శ్లోకం ఆ విషయాన్నే ఎలుగెత్తి చాటుతోంది. చూడండి:

దశకూప సమా వాపీ. దశ వాపి సమో హ్రద:
దశ హ్రద సమ: పుత్రో దశ పుత్ర సమో ద్రుమ:

పది నూతులతో ఒక దిగుడు బావి సమానం. నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె
సూనృత వ్రత యొక బావి మేలు .... అని నన్నయ గారు శకుంతలోపాఖ్యానంలో శకుంతల చేత చెప్పించిన పద్యం ఇదే విషయాన్ని వివరించింది.

ఇక, పది దిగుడు బావులతో ఒక చెఱువు సమానం. ఒక కుమారుడు పది చెఱువులతో సాటి రాగలడు.
పదిమంది పుత్రులతో సమాన మైనది ఒక మహా వృక్షం !!

అని, చెట్టు ప్రాముఖ్యం ఎలాంటిదో వివరించారు.

అంతే కాదు, ఏయే చెట్లు నాటి పోషిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందో కూడా వివరించారు.

చూడండి:

అశ్వత్థ మేకం పిచుమన్ద మేకం, న్యగ్రోథ మేకం దశతిన్త్రిణీకం
కపిత్థ బిల్వా2మలక త్రయంచ, పంచామ్రవాపీ నరకం న పశ్యేత్.

ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షం ( అంటే, వేప చెట్టు. దీనినే నింబతరువు అని కూడా పిలుస్తారు), ఒక మ్రరి చెట్టు, పది చింత చెట్లు, మూడు వెలగ చెట్లు, మూడు మారేడు చెట్లు, మూడు ఉసిరిక చెట్లు, అయిదు మామిడి చెట్లు కలిగిన తోటను పెంచాలని ఈ శ్లోకంలో చెప్పబడింది. దానిలో ఒక దిగుడు బావిని తవ్వించమని కూడా చెప్పారు. అలా చేసిన వారు నరకం చూడరని దీని భావం ! అంటే, వారికి స్వర్ట ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు.

స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని శ్లోకంలో చెప్పిన లెక్క ప్రకారం అవే చెట్లను అదే లెక్కతో నాటి, అక్కడ ఓ దిగుడు బావి తవ్విస్తే సరి పోతుంది కాబోలు అనుకో వద్దు. లెక్క కేం కానీ, వీలయినన్ని చెట్లను పెంచి తగిన నీటి వసతి ఏర్పరచ మని చెప్పడమే ప్రధానోద్దేశం.

చెట్లు కూలుతున్న దృశ్యాలు మనకింక కనిపించ కూడదు. కదూ?

స్వస్తి.

11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

ముఠా కవులు .. లేదా ... కవుల ముఠాలు !



స్వాధీనో రసనాంచల: పరిచితా: శబ్ధా: కియంత: క్వచిత్
క్షోణీంద్రో న నియామక: పరషదశ్శాంతా: స్వతంత్రం జగత్
తద్యూనం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతిం
స్వచ్ఛందం ప్రతిసద్మ గర్జత వయం మౌనవ్రతావలంబిన:

(సాహిత్య శేఖరం)

నోటికి తలుపుల లేవు. ఏమైనా వాగ వచ్చును. ఏవో కొద్ది మాటల పరిచయం ఉంది.వద్దనే వాళ్ళు లేరు. శాసించే ప్రభువు లేడు. పండిత పరిషత్తులూ మూలన పడ్డాయ్. అంచేత పండితులైన వారు ఎదురు చెప్ప లేక నోరుమూసుకుని ఉండి పోతున్నారు. ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండడానికి యిష్ట పడతారు కదా. అందు చేత మీరంతా మేం కవులం ! మేమే కవులం!!
అంటూ, అడ్డూ ఆపూ లేకుండా నోటికి వచ్చినట్టుగా ఇల్లిల్లూ మారు మ్రోగి పోయేలాగ అరుస్తున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులలో మా వంటి వారు ఇక మౌనవ్రతం అవలంబించడం కన్నా వేరే దారి ఏముంది ?



కవి ముఠాలు, లేదా, ముఠా కవులు అన్ని కాలాలలోనూ ఉండేవి / ఉన్నారు కాబోలు. ఈ శ్లోకం చూస్తే అదే అనిపిస్తున్నది. కావు కావుమని కాకులు అరచి ఊదరగొడుతూ ఉంటే, కోకిలలు బిక్కచచ్చిపోయి ఉండి పోక తప్పదేమో.

15, ఆగస్టు 2015, శనివారం

అనంత పద్మనాభుని సాక్షిగా గజపతుల ఆత్మ బలిదానాలు !



అనంత పద్మనాభుని సాక్షిగా అభిమానధనుల ఆత్మ బలిదానాలు !

పద్మనాభ యుద్ధం ! అదే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అని కొందరు చరిత్రకారులు భావిస్తారు. విభేదించే వారూ లేక పోలేదు. కాని, విభేధించే వారు కూడా ప్రాణాలను పణంగా పెట్టి, అభిమాన ధనులైన గజపతులు చేసిన ఈ యుద్ధం ప్రభువుల శౌర్యానికీ, ఆత్మాభిమానానికీ జయకేతన మెత్తిందని ముక్త కంఠంతో కీర్తిసారు !
మానధనులైన విజయ నగర ప్రభువుల  వలె యుద్ధభూమిలో మృత్యువును చేజేతులా ఆహ్వానించి వీర స్వర్గమలంకరించిన క్షాత్రం చరిత్రలో అరుదుగా కనబడుతుంది !

కేవలం గంట వ్యవధి లోపల ముగిసిన ఈ పద్మనాభ యుద్ధ సన్నదధానికి ముందు చిన విజయ రామరాజు గారు చేసిన ఉత్తేజపూరిత మయిన మహోపన్యాసం వొక వీర చారిత్రక ఘట్టం !  ఆ గజపతి ప్రభువు చేసిన ఉపన్యాసం నుండి కొన్ని భాగాలు చూదాం !
అంతకు ముందు  పద్మనాభ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను క్లుప్తంగా .. ...
విజయ నగరం సంస్థానం వారు కంపెనీ వారికి  బాకీ పడిన ఆరు లక్షల ఏభై వేలు వెంటనే చెల్లించాలనీ, లేక పోతే చిన విజయరామరాజు రాజ్యం విడిచి విశాఖ వెళ్ళాలనీ మద్రాసు నుండి కంపెనీ దొరవారు తెలియ జేసారు. పాత లెక్కలన్నీ సవివరంగా చూపుతూ కంపెనీయే తమకు 3,50,000 బాకీ అని పేర్కొంటూ , ఆ మొత్తాన్ని తీసి వేస్తే తాము చెల్లించ వలసినది స్వల్పమే నంటూ, అది కూడా మూడు వాయిదాలలో కట్టడానికి సిద్ధమేనంటూ విజయరామరాజు లెక్కల పత్రం కంపెనీకి పంపించేరు !  ఆ వివరణని అంగీకరించని కంపెనీ వారు 13-06-1794న విజయ నగరం కోటను ఆక్రమించు కున్నారు. చిన విజయ రామరాజు విశాఖ తరలి పోయారు.
పూసపాటి ప్రభువల పట్ల స్వామి భక్తి చాటుకుంటూ సంస్థానంలో యావన్మంది రైతులూ శిస్తులు కట్టకుండా కంపెనీ వారికి నిరసన తెలియజేస్తూ తిరుగుబాటు చేసారు !  విదేశీయుల పెత్తనం మీద రైతువారీ తిరుగుబాటు కంపెనీ వారిని నివ్వెర పరచింది.
చిన విజయ రామరాజును విశాఖలో ఉండనివ్వడం కూడా తమకు క్షేమకరం కాదని భావించి, కంపెనీ వారు  కుట్ర పూరితమయిన ఆలోచనతో రాజుని విశాఖ విడిచి మచిలీ పట్నం వెంటనే వెళ్ళి పోవాలని ఆదేశించారు.
కంపెనీ వారి దురహంకారం సహించ లేక రామరాజు వారితో యుద్ధానికి సిద్ధ పడ్డారు.
రాజ బంధువులనూ, సర్దారులనూ, హితులనూ పద్మనాభంలో సమావేశ పరచి వారిని యుద్ధోన్మఖులుగా చేస్తూ ఉత్తేజ పూరిత మయినప్రసంగం చేసారు

అపజయం అనివార్యమనీ, వీర మరణం తథ్యమనీ తెలిసి కూడా దొరల వంచనకు ప్రతీకారంగా ఆత్మాభి మానాన్ని నిలుపుకుంటూ వారంతా యుద్ధ సన్నద్ధులు కావడానికి ఆ ప్రసంగం  ఎంతగానో దోహద పడింది !

ఒక యోద్ధ, ఒక ఆత్మాభిమాన దురంధరుడు తన వారిని ఎలా తన ఆశయానికి అనుకూలురుగా చేసికో గలడో చెప్పడానికి ఈ మహోపన్యాసం ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది
నాడు పద్మనాభంలో చిన విజయ రామరాజు చేసిన ఉత్తేజ భరిత  సుదీర్ఘమయిన ఉపన్యాసం నుండి కొన్ని భాగాలు :
( శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం నుండి )

‘‘శ్రీ విజయ నగర సంస్థాన గౌరవ పరిపాలనా తత్పరులగు యోధాగ్రేసరులారా ! మన మిప్పుడు విజయ నగర గౌరవ సంరక్షణార్ధమై కంపెనీ వారితో యుద్ధం చేయ వలసి వచ్చింది ’’

‘‘మనచే పునరుద్ధరింప బడిన ఒకానొక పాశ్చాత్య వర్తక సంఘములో అడుగులకు మడుగులొత్తి చేతులార మన సామ్రాజ్య లక్ష్మిని వారి కప్పగించిన రాబోవు చరిత్రకారులు మనలను గురించి ఏమని వ్రాయుదురో యూహింపుడు.’’

‘‘ చతుర్మండల  మండలేంద్ర కోటీర  స్థగిత  రత్నా ప్రభా విభాసిత  పాద పీఠమగు  విజయ నగర సామ్రాజ్య లక్ష్మిని పాశ్చాత్య వర్తకులకప్ప చెప్పి,  దీనులమై బందరు లంకలలో   ‘‘ నీచపు చావు చచ్చుట మేలో ’’  లేక, బహు సామంత రాజ విరాజమానయగు శ్రీ విజయ నగర రాజ్య లక్ష్మి గౌరవ సంరక్షణార్ధమై ఆత్మ ప్రాణ పరిత్యాగ మొనరించి నిమిషములో వీర స్వర్గము చూరగొని అఖండాఖండల రాజ్య లక్ష్మీ కృపావీక్షణముల కర్హుల మగుట మేలో  ? బాగుగా యోజింపుడు !’’

‘‘ ఆలోచించిన మనకీ యుద్ధమున జయము సిద్ధించుట దుర్లభము.ఏలయన మొదట మన స్వకుటుంబము నందే ద్రోహులు బయలుదేరిరి.  ... ... ఏది ఎట్లున్నను హీనపు చావు చచ్చుట కంటె స్వకుల మర్యాలను నిలువ బెట్టి రాచ కులము వారికి విహిత మయిన మరణమును రణ రంగమున బొందెదము గాక !
పద్మనాభ యుద్ధము చిరస్మరణీయమై యుండక పోదు ! యోధాగ్రేసరు
లారా !  ఇప్పుడు మనము చేయ వలసిన పని ఇంతకు మించి వేరొండు గోచరించుట లేదు. కావున మీ యభిప్రాయములను తెలియ జేసి వెంటనే విజయ నగర రాజ్య లక్ష్మీ గౌరవము నిలుపుటకు పూనుకొనుడు !’’

రాజ బంధువులు, సరదారులనూ ఈ ప్రసంగం కదిల్చి వేసింది. అనంత పద్మనాభ స్వామికి నివేదించ బడిన మహా ప్రసాదాన్ని చేతిలో పట్టుకుని ‘‘ విజయమో, వీర స్వర్గమో తేల్చు కోడానికి  అంతా నడుం కట్టారు.

పద్మనాభ యుద్ధంలో విజయ రామ రాజు పక్షాన  శ్రీయుతులు పూసపాటి విజయ గోపాల రాజు గారు, వత్సవాయి నరస రాజు గారు, నడిపిల్లి రామ భద్ర రాజు గారు, చింతలపాటి నీలాద్రి రాజు గారు, దాట్ల అప్పల రాజు గారు, దాట్ల చిన వెంకటపతి రాజు గారు, తిరుమల రాజు, కొండ్రాజు గారలు, సాగి గోపాల నరస రాజు గారు, జంపన వెంకట రామ రాజు గారు, దంతులూరి అప్పల రాజు గారు, దంతులూరి రాఘవ రాజు గారు, భూపతి పద్మనాభ రాజు గారు  నిలిచారు ! ఇంకా, వేజర్ల వారు, గొట్టి ముక్కుల వారు, పెనుమత్స వారు  మొదలయిన క్షత్రియ వీరులు పాల్గొని వీర మరణం చెందారు.

మృత్యువును ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు ! ఆత్మాభిమానం ముందు ఆత్మార్పణ తృణ ప్రాయంగా భావించారు !

పద్మనాభ యుద్ధంలో అద్భుతాలేమీ జరుగ లేదు.
అనుకున్నట్టే అయింది.  ఫిరంగులు పేలాయి !  యుద్ధం అంతా కేవలం 45 నిమిషాలలో ముగిసి పోయింది.
అభిమాన ధనులు నేలకొరిగారు. చిన విజయరామరాజు ‘‘ రంగ రంగా ’’ అని ఇష్ట దైవాన్ని  స్మరిస్తూ వీర స్వర్గం పొందారు.

విజయ నగరానికి కూతవేటు దూరంలో  వెలసి న్నఅనంత పద్మనాభ స్వామి నాటి గజపతులు ఆత్మబలిదానాలకు సాక్షీభూతంగా నిలిచాడు.

భావి  స్వాతంత్ర్య సమరాగ్ని జాజ్వల్యమానమై రగులుకోడానికి ఈ పద్మనాభ యుద్ధం వొక చిన్న పాటి నిప్పు రవ్వ కాకుండా పోలేదు .

14, ఆగస్టు 2015, శుక్రవారం

ఆరు ముఖాలూ ... ఆరు ముద్దులూనూ !



బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మనకి తెలుసు. ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలియదు.

మనమయితే, ‘‘ ఎలా ఉందయ్యా ? ’’ అనడిగితే, నచ్చక పోతే , ‘‘ నాముఖంలా ఉంది ’’ అని చెబుతాం. కాని మీద పేర్కొన్న మహానుభావులు మాత్రం అలా అనడానికి వీలు లేదు. బ్రహ్మ ‘‘ ఏడిచినట్టుంది. నాముఖంలా ఉంది ’’ అని నాలుగు సార్లు , కుమార స్వామి ఆరు సార్లు , పంచ ముఖి శివుడు ఐదు సార్లూ , రావణబ్రహ్మ అయితే ఏకంగా పది సార్లూ అనాలి కదూ ? అన్ని ముఖాల వాళ్ళు ఆ పాటి ఆయాస పడక తప్పదు లెండి.

ఈ పరిస్థితిని గమనించి, మన కవులు చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పారు.

చూడండి ...

అంబా కుప్యతి తాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్ సృజ్యతాం ,
విద్వన్ షణ్ముఖ కా గతి: మయి చిరా దస్యా: స్థితాయా వద,
కోపావేశ వశౌ దశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్ ,
అంబోధి: జలధి: పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధి:

షణ్ముఖుడు తండ్రి శివుడితో ఇలా అన్నాడు: ‘‘ తండ్రీ ! అమ్మ కోపంగా ఉంది. నీ తల మీద ఉన్న ఆ గంగను విడిచి పెట్టు.’’

శివుడు: ‘‘కుమారా ! చిర కాలంగా నన్నే ఆశ్రయించి ఉన్న గంగను ఎలా విడిచి పెట్టేదిరా. నేను కాదు పొమ్మంటే, పాపం ఆవిడకి ఏదిరా గతి ?’’

చిన్నింటిని విడువడం కుదరదని తండ్రి చెప్పే సరికి కుమార స్వామికి కోపం ముంచు కొచ్చింది.

అతనికి ఆరు ముఖాలు కదూ ? అందు చేత ఆరు ముఖాలతోనూ ఇలా అన్నాడు:
‘‘అంబోధి. జలధి , పయోధి , ఉదధి , వారాంనిధి , వారిధి.‘‘

పై పదాలు ఆరింటికీ సముద్రమనే అర్ధం !!

అంటే , ‘ పోయి , సముద్రంలో పడమను !’ అని దీని అర్ధం.

‘వెళ్ళి గంగలో దూకు ’ అంటాం కదా, కోపంలో. అలాంటిదే ఇదీనూ.

నదీనాం సాగరో గతి: అని, నదులు చివరకు చేరేది సాగరం లోనే కదా ?

గంగకు సాగరమే గతి అని కవి ఈ విధంగా చమత్కరించాడు.

మరో పద్యం , ఆరు ముఖాల వాడి మీదే . చూడండి ...

ఓ కవి గారికి ( జంద్యాల పాపయ్య శాస్త్రి గారని గుర్తు ) అష్టావధానంలో ఇచ్చిన సమస్య ఇది:

‘‘నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !’’

ఇదీ సమస్య. ఇందులో ఆరు నీవులు ఉన్నాయి. కవి గారు కుమార స్వామి పరంగా ఇలా పూరించారు.

నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తు కోవు ,నీ
కా వెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచును పల్కు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట గదించి ముఖంబున ముద్దిడున్ యనున్
నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !!

ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి ( షణ్ముఖుడు ) తల్లి పార్వతీ దేవితో ఇలా అంటున్నాడు:

‘‘ అమ్మా ! నీవు గజాస్యుని ( వినాయకుడిని ) చంక దిగ నీయవు. నన్ను అసలు ఎత్తుకోవు. నీకు ఆ వెనకయ్యే ( వినాయకుడే ) ముద్దు కొడుకయ్యేడు కదమ్మా ...’’
అంటూ ఏడుస్తున్న షణ్ముఖుని దేవి భవాని ( పార్వతీ దేవి) కౌగిలిలో ప్రేమతో బంధించి, ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఇలా అంది: ‘‘ లేదయ్యా !! నువ్వన్నా నాకు మద్దేనురా కన్నా ..!’’

ఇక్కడ చమత్కారం ఏమిటంటే, పార్వతి కుమార స్వామిని లాలిస్తూ , అతని ఆరు ముఖాలనీ ముద్దు పెట్టుకుంటూ నువ్వన్నా నాకు ముద్దేనురా అంది. అందుకే, నువ్వు , నువ్వు ... అంటూ ఆరు సార్లు అంది.! అదీ కవి చమత్కారం.

మన చిన్నారులకి ఏదయినా తినిపించాలన్నా, త్రాగించాలన్నా, పాపం, మన తల్లులు ఎంత అవస్థ పడతారో మనకి తెలిసినదే కదా ? ఈ ఆరు ముఖాల వాడికీ , ఆ తొండం గల వాడికీ - వాళ్ళ చిన్నప్పుడు ఏదేనా తినిపించడానికీ, త్రాగించడానికీ జగన్మాత ఎన్ని తంటాలు పడిందో కదూ ?



12, ఆగస్టు 2015, బుధవారం

అలమండయినా, అమలాపురం అయినా అదే సీన్ ! సెబాసో పతంజలీ !



కోనసీమలో 1996 లో పెద్ద గాలి ... వెర్రిగాలి వీచి లక్షలాది కొబ్బరి చెట్లు నేల కూలి, రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయిన విషయం తెలుసు కదా ? అప్పటి వరకూ డబ్బుకు చింత లేకుండా హాయిగా గడిపిన వాళ్ళెందరో ఒక్క రోజులోకుదేలయి పోయేరు. అక్కడి వాళ్ళు అన్న పానాదులకు కూ డా విలవిలలాడి పోయేరు. ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాల నుండి ఎందరో వారిని ఆదుకోడానికి వచ్చేరు..

ఆ రోజులలో నేను విజయ నగరం జిల్లా సాలూరు ప్రభుత్వ కళాశాలలో అనుబంధంగా ఉండే ఉన్నత పాఠశాలలో పని చేస్తూ ఉండే వాడిని. మా సోదర ఉపాధ్యాయు లిద్దరితోనూ, మా సాలూరులో ఉన్న బాలికల పాఠశాలలో పని చేస్తున్న మరి ఒకరిద్దరు ఉపాధ్యాయులతొ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి మొత్తం ఆరుగురం అక్కడికి సహాయ కార్యక్రమాలలో మా వంతు సాయం చేయడానికి బయలు దేరాం.

ఊర్లో చందాలు వసూలు చేసి మొత్తం ఇరవై వేల వరకూ పోగు చేసాం. మూడు బస్తాల పాత బట్టలు సేకరించాం. సాలూరు R.T.C డిపో మేనేజరు గారు మాకు వెళ్ళి రావడానికి ఉచితంగా బస్ పాస్ ఇచ్చి తన వంతు సాయం చేసారు.

సేకరించిన డబ్బూ, బట్టల మూటలతో తే 24 -11 -1996 దీన అమలాపురం బయలు దేరాం. ఆరు గంటల ప్రయాణంతో అక్కడికి చేరాం. దిగుతూనే పెను గాలి బీభత్సం మిగిల్చిన విషాదం చూసాం. మేం భోజనాల కోసం వెళ్ళిన హొటల్ లో సీలింగ్ ఫేన్లన్నీ రెక్కలు జడలు అల్లి నట్టుగా మెలి తిరిగి పోయి ఉన్నాయి. కిటికీ, తలుపుల రెక్కలు విరిగి పోయి ఉన్నాయి. వీధులన్నీ నానా బీభత్సంగానూ ఉన్నాయి.

మేం తెచ్చిన బట్టల మూటలు హొటల్ వారికి చూస్తూ ఉండమని అప్పగించి, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేం వచ్చిన పని చెప్పాం.

‘‘ మంచి దండీ ... రోజూ యిలా చాలా టీమ్ లు వస్తున్నాయి. వాళ్ళు తెచ్చిన బట్టలనూ, దుప్పట్లనూ మీద పడి జనాలు లాక్కు పోతున్నారు. అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు పాపం. ఒకప్పుడు నాకేమిటని బతికిన వాళ్ళు ... ఇప్పుడు తిండికీ గుడ్డకీ వాచి పోతున్నారు. మీరు ఈ మూటలని ఆటోలోనో, బస్ లోనే వేసుకుని వెళ్తారు ... మీరు పంచే లోపునే జనాలు కలియబడి పోయి ఎవరికి దొరికినవి వాళ్ళు తీసుకు పోతారు.. ఒక్కో సారయితే, ఎక్క డెక్కడి నుండో వారికి ఇద్దామని తెచ్చిన బట్టల మూటలని విధి లేక సక్రమంగా పంచే పరిస్థితి లేక మూటలు అక్కడే  విసిరేసి వెనక్కి వచ్చేస్తున్నారు.కొందరు ... ఎలా చేస్తారో ... జాగ్రత్త.

మరో విషయం లోతట్టు గ్రామాలకు ఎవరూ చేరు కోవడం లేదు. సహాయమంతా ఎంత సేపూ ఈ చుట్టు పట్ల గ్రామాల వారికే అందుతోంది.

ఎదుర్లంక లాంటి గ్రామాలకి అసలు సాయమే అందడం లేదు. అక్కడి వాళ్ళు లబోదిబో మంటున్నారు ...’’ అని ఎస్.ఐ చెప్పారు.

ఎలాగయినా ఆ ఎదుర్లంక గ్రామానికి చేరుకుని అక్కడి వారికే మేం తెచ్చిన సాయం అందించాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం.



‘‘ సరే, అక్కడికి వెళ్ళగానే రాజు గారుంటారు ... వారిని కలుసుకుని మాట్లాడండి ... మీకు ఆయన సహకరిస్తారు ... ’’ అని చెప్పారు పోలీసు వారు.

ఎలా వెళ్ళాలో భోగట్టా చేసాం. అమలా పురానికి పెద్ద దూరమేం కాదు.

ఓ ప్రక్క అఖండ గోదావరి, ఓ ప్రక్క పొలాలూ .ఊళ్ళూ ఉండే సన్నని గట్టు మీద ప్రయాణం. ఎదురుగా వచ్చే వాహనాలకు దారివ్వడమే కష్టం.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గోదారి పాలవుతాం. లేదా, ఇటు వేపు దొర్లి పడతాం. వాళ్ళకా దారంట ప్రయాణం అలవాటే. మాకు మాత్రం ఏక కాలంలో బీభత్స, అద్భుత, భయానక రసాలు అనుభవంలోకి వచ్చేయి.

బస్ లో ఎరుర్లంక చేరుకున్నాం. ఊరు చిన్నదే, కానీ అక్కడ నుండి గోదావరి నదిలో పంట్ మీద  యానాం చేరుకునే వీలుంది. ఇంకా  అక్కడ వంతెన రాని రోజులవి. మేం తెచ్చిన బట్టల మూటలకు మేమే గట్టి బందోబస్తుగా నిలిచేం.

ఇక పోలీసు వారు చెప్పిన రాజు గారిని కలవాలి. వారి సాయం తీసు కోవాలి. మేం సేకరించి తెచ్చిన బట్టలూ, డబ్బూ నిజమైన బాధితులకి చేరాలి. ఇదీ మా సంకల్పం,

రాజు గారి గురించి ఆరా తీసాం. అక్కడ పంచె. ధోవతి ధరించి, గుబురు మీసాలతో , కొన దేరిన ముక్కుతో కనిపించిన వ్యక్తిని చూసి రాజు గారి గురించి వాకబు చేయాలనుకున్నాం. పోలీసు వారు రాజు గారిని కలవమన్నారే కానీ, వారి పేరు చెప్ప లేదు. మేమూ అడగ లేదు. ఎంత తెలివి తక్కువ పని చేసామో తెలిసొచ్చింది.

‘‘ ఎవరండీ తమరు ? ’’ దర్పంగా అడిగేరతను.

‘‘ రాజు గారిని కలవాలండీ ’’ అన్నాం ఏక కంఠంతో.

ఆయన భళ్ళున నవ్వేరు,

‘‘ ఏ రాజు గారు కావాలండీ ? ఇక్కడ చాలా మంది రాజు లున్నారు. ఎలక్ట్రిక్ రాజున్నారు. వాటర్ రాజున్నారు. రోడ్ల రాజు గారున్నారు.గుడిసెల రాజున్నారు. బోయినాల రాజున్నారు. మందుల రాజున్నారు. క్రమశిక్షణ రాజున్నారు. రిపేర్ల రాజున్నారు . పంపిణీ రాజు గారున్నారు. ... ఇందరిలో మీకు ఏ రాజు గారు కావాలండీ ?... ’’ అనడిగేరు.

మేం తెల్లబోయి , నోట మాట రాకుండా ఉండి పోయేం.

ఏం చెప్పాలో తెలియక తలలు గోక్కున్నాం.

మా అవస్థకి జాలి పడి ఆయనే ఇలా వివరించేరు ...

‘‘ మరేం లేదు .. పెద్ద గాలికి  ఇక్కడి జనాల జీవితాలు ఎలా ఛిన్నా భిన్న మై పోయాయో కళ్ళారా చూస్తున్నారు కదా ? ఎక్క డెక్కడి నుండో వీళ్ళని ఆదుకోడానికి వస్తున్నారు. స్థానికంగా ఇక్కడి రాజులం మేం. మా వంతు సాయం అందించడం మాకు  విధాయకం కదా ? అందుకే రాజులందరం కలిసి మాకు మేమే రకరకాల కమీటీలు వేసుకుని వారం రోజుల నుండీ సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నాం.

ఇక్కడి రోడ్లు ధ్వంస మయ్యాయి. అధికారుల చేత వాటిని యుద్ధ ప్రతిపదిక మీద బాగు చేయించే పనులను ఓ రాజు గారు తన బృందంతో పర్యవేక్షిస్తున్నారు. అంచేత ఆ రాజుగారు రోడ్ల రాజుగారన్నమాట ... అలాగే, తాగు నీటి అవసరాలు సత్వరం చూసే వాటర్ రాజుగారూ, పడి పోయిన ఎలక్ట్రిక్ స్తంభాలను నిలబెట్టించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులను చూసే ఎలక్ట్రిక్ రాజు గారూ, ఆకలితో హాహాకారాలు చేసే జనాలకి బోయినాల ఏర్పాట్లు చూసే బోయినాల రాజు గారూ, అల్లర్లు జరక్కుండా చూసే క్రమశిక్షణ రాజు గారూ ... చిన్నా చితకా రోగాలకు వైద్య సాయం అందేలా చూసే మందుల రాజు గారూ, పడిపోయిన పాకలను లేవనెత్తించే పనులు చూసే గుడిసెల రాజు గారూ ... ఇతర చిన్న చిన్న రిపేర్లను దగ్గరుండి చూసుకునే రిపేర్ల రాజుగారూ ... సహాయ కార్యక్రమాలను సజావుగా జరిగేలా చూసే పంపిణీ రాజు గారూ ... ఇలా ఇక్కడ రకరకాల రాజులున్నాం. మీకు కావలసిన రాజుగారెవరో చెప్పండి ...’’



ఇదంతా వింటూ ఉంటే, పతంజలి గారి రాజు గోరు నవలలో ఓ సన్నివేశం చప్పున గుర్తుకు రావడం లేదూ ? !

క్లుస్తంగా మరో సారి దాన్ని నెమరు వేసుకుందామా ?

కొత్త వలస సంత నాడు కనబడి. అత్త జబ్బుకి మందిస్తాను దివాణానికి వచ్చీ .. అని చెప్పిన రాజు గారిని వెతుక్కుంటూ వచ్చేడు కలగాడ చిన అప్పల నాయుడు.

తీరా వచ్చేక, ఆ మందు లిచ్చీ రాజు గారిని, తెల్లగా పొడుగ్గా ఉండే రాజు గారిని . ఎల్ల గుబ్బ గొడుగులా ఉండే రాజు గారిని, మీసాలుండే రాజు గారిని, మూరెడు ముక్కుండే రాజు గారిని అక్కడ పోల్చుకో లేక తికమక పడి పోతూ ఉంటాడు.

పల్చటి. తెల్లటి గ్లాస్కో జుబ్బా,నీరు కావి లుంగీ వేసుకుని.పావుకోళ్ళు తొడుక్కుని, వెడల్పాటి నుదురు మీద అగరు బొట్టు పెట్టుకుని చెవులకు ఎర్రపొళ్ళ తమ్మెట్లు కలిగి ఉన్న పెదప్పల రాజు కనిపిస్తే, నాయుడు ఇబ్బంది పడుతూ. తల గోక్కుని, ‘‘ రాజు గోరి ఇల్లెక్కడండీ ? ’’ అనడిగేడు.

అప్పుడు పెదప్పలరాజు హుక్కా గుడ గుడ పీల్చి, నవ్వుతూ ఇలా అన్నారు :

‘‘ సంతకి చీటి లచ్చికి గాజులు లాగుందోయి నీ ప్రశ్న. రాజు గారంటే ఏ రాజు గారు ?మా కుటుంబంలో గోపాల రాజు లున్నారు ...విజయ గోపాల రాజు లున్నారు ..వేంకట విజయ గోపాల రాజు లున్నారు ...సన్యాసి వేంకట విజయ గోపాల రాజు లున్నారు ...రంగ రాజు లున్నారు.పెద రాజు గారి చంటి బాబు గారి చిన రాజు లున్నారు ..చిన రాజు గారి తాత బాబు గారి చిట్టి రాజు లున్నారు ... పెద రాజు గారి పెద బాబుగారి పెద్ద అప్పల రాజంటే, నేను ... ఇందరు రాజుల్లో నీ కెవరు కావాలోయ్ నాయుడూ ! ’’

ఇక మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం !

ఆ తర్వాత ఎలాగో వారి సాయం తోనూ. ఊరి పెద్దల సాయంతోనూ మేం తెచ్చిన బట్టలను కావలసిన వారికి అందించాం. ఇంటికో రెండు వేలు చొప్పున వారు సూచించిన బాధితులకు అందించే మనుకోండి ...

లోగడ ఈ టపాకి కష్టే ఫలే గారు తమ అనుభవంలోని విషయం చెబుతూ ఇలా కామెంట్ పెట్టారు :

‘‘ పతంజలి గొప్ప రచయిత. కధ చెప్పే తీరు అంత గొప్పగా ఉంటుంది. మా ఊరొచ్చి రెడ్డి గారు కావాలంటే పదిమంది లో తొమ్మిది తలలు తిరుగుతాయి, మచ్చుకి ఆది రెడ్డి గారు కావాలంటే ఐదు తలలు తిరుగుతాయి, ఒకే ఇంటి పేరుతో తేతలి ఆది రెడ్డి గారంటే మూడు తిరుగుతాయి. తండ్రి పేరు కూడా చెబితే రెండు తిరుగుతాయి. మీకు కావలసిన వ్యక్తిని పట్టుకోవడం కష్టమే, ఇది నిజం. మరొక ఊరుంది వ్యాఘ్రేశ్వరం అక్కడ కూడా ఒకటే పేరు ఇంటి పేరు, తండ్రి పేరుతో సహా ఒకటే ఉన్నవూరు. ఆకెళ్ళ వ్యాఘ్రేశ్వరుడు కావాలంటే ఊరు మొత్తంలో సగం పైగా వస్తారు. మొత్తం వర్గ త్రయం చెప్పాలిసిందే! ’’


అదండీ సంగతి.

అలమండయినా, అమలా పురం అయినా రాజుల మాట తీరూ, ధోరణీ, , పెంకె తనాలూ .. అన్నీ ఒక్కలాగే ఉంటాయి కాబోలు ?

సెబాసో పతంజలీ ! .. భేష్ భేష్ ... ఏం రాసే వయ్యా దివాణాల జీవితాలని !

అందుకే నువ్వు వన్ అండ్ ఓన్లీ పతంజలివి !






9, ఆగస్టు 2015, ఆదివారం

నా నరక లోక యాత్ర !



నా నరక లోక యాత్ర !

ఓపిక లేని వారు దీనిని దాట వేయ వచ్చును.!

ముందుగానే విన్నవించు కుంటున్నాను. ఇది ఏ వర్గాన్నీ కించ పరచడానికి వ్రాస్తున్నది కాదు. పంచతంత్రంలో ఒక శ్లోకం ఉంది. అందులో పురోహితులూ, సన్యాసులూ తప్పకుండా నరకానికి పోయే అవకాశం గురించిన ప్రస్తావన ఉంది.

చూడండి:

నరకాయ తే మతి శ్చేత్,
పౌరోహిత్యం సమాచర
వర్షం యావత్ కిమన్యేన
మఠచింతాం దినత్రయమ్.

ఈ శ్లోకంలో కచ్చితంగా ఎవరు నరకానికి పోతారో బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు శ్లోక కర్త.

వారెవయ్యా, అంటే,

నీకు నరకానికి పోవాలని కోరిక ఉంటే ఒక యేడాది పాటు పౌరోహిత్యం చెయ్యి !

అంతకాలం ఓపిక లేదనుకుంటే దానికీ ఓ మార్గం ఉంది.

ఒక మూడు రోజులు మఠం గురించి ఆలోచించు. మూడు రోజుల పాటు మఠ ప్రవేశం చేసి చూడు. అంతే, నీకు నరకం తథ్యం !

పౌరోహిత్యం చేసే వాళ్ళూ, సన్యాసులూ తప్పులు చేసే అవకాశం పుష్కలంగా ఉంది కనుక, వారు తప్పకుండా నరకానికి పోవలసిన వారే అని దీని భావం.

నాకున్న ఒకటి రెండు అనుభవాలు ఆలోచిస్తే, కనీసం, నాకు అది నిజమే అనిస్తుంది.
నేను ఉద్యోగ రీత్యా పని చేసే ఒక ఊరిలో ఒక పురోహితుడు ఉదయాన్నే, నాతో పాటు గంగయ్య హొటల్ లో పెసరట్టూ ఉప్మా లు తృప్తిగా తిని, వేడి వేడి కాఫీ కులాసాగా సేవించి, ఆతర్వాత, అవి అరిగే వరకూ వీధరుగుల మీద చీట్ల పేకలో తరించి, ప్రొద్దు తిరిగి, మధ్యాహ్నంఏ మూడింటికో తద్దినం పెట్టడానికి తీరికగా బయలు దేరే వాడు. అంత వరకూ, తద్దినం పెట్ట వలసిన ఇంటి యజమాని, వారి బంధుగణం ఉదయం నుండీ అభోజనంతో ఆకలితో నకనకలాడి పోతూ. నీరసాలు ముంచు కొచ్చి, ఇతని కోసం ఎదురు చూపులు చూస్తూ శోష వచ్చి పడి పోయే స్థితికి చేరు కునే వారు...

ఓ సారి మా మామ గారి ఇంట్లో ఒక భోక్త తీరా భోజనానికి కూర్చున్నాక, తిన లేక తిన లేక నాలుగు ముద్దలు నోట పెట్టుకని భళ్ళున అక్కడే వమనం చేసుకున్నాడుట. కారణం మరేమీ కాదు, డబ్బు కక్కుర్తితో అప్పటికే వేరొక చోట ఆ వ్యక్తి భోక్తగా వెళ్ళి కడుపు నిండా తిని రావడమేనని తెలిసింది.

నేను ఓ కుగ్రామంలో పని చేసే రోజులలో ఒక బ్రాహ్మణ కుటుంబీకులు ఇంట్లో పితృకార్యం చేస్తూ సాయంత్రం ఐదయినా, పిలిచిన భోక్తలు ప్రక్క ఊరి నుండి ఎంతకీ రాక పోవడంతోదిగాలు పడి పోయి, చివరకి పెళ్ళయిన బ్రహ్మచారిగా ఆ ఊళ్ళో ఒంటరిగా ఒక గది తీసుకుని ఉంటున్న నన్ను భోక్తగా రమ్మని బ్రతిమాలేరు. అప్పటికే నేను మధ్యాహ్న భోజనం కానిచ్చి, ఏదో పుస్తకం చదువుతూ ఓ కునుకు తీస్తున్నాను. నా భోజనం అయిపోయింది కదా, నేనెలా పనికి వస్తాను ? అనడిగేను. ఆ కుగ్రామంలో మరొక బ్రాహ్మణ నలుసు లేక పోవడం చేత, పాపమో,పుణ్యమో తమ ఇంటికి వచ్చి భోక్తగా తమ తల్లి గారి ప్రసాదం తిని వెళ్ళమని కన్నీళ్ళతో వేడుకున్నారు. నాకిక తప్పింది కాదు.ఆ రోజు నేను వారింటి పితృకార్యంలో నిష్ఠగా పాల్లొన లేదు. వారి బలవంతం చేతనే కావచ్చు, తిండి తినీసి, వారింటికి భోక్తగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆచారం మంట కలపేను. ఆ కారణం చేత నాకు నరకం తప్పదని నేను ఇప్పటికే నిర్ణయానికొచ్చీసేను.

ఇప్పుడు చెప్పండి, నిష్ఠగా, శుచిగా, చిత్త శుద్ధితో చేయాల్సిన పురోహిత కార్యాలు మొక్కుబడిగా, అశ్రద్ధగా,తూతూ మంత్రంగా, పిండి కొద్దీ రొట్టె, యావత్ తైలం, తావద్వాఖ్యానమ్ లాగా , ఇచ్చే డబ్బు కొద్దీ చేయించే వారూ నరకానికి పోతారంటే, పోరూ మరి !

అలాగే, నిత్యానంద స్వాముల వంటి వారు మన వెర్రిభారతంలో వేలూ, లక్షలూనూ. వాళ్ళందరూ నరకానికి కాక పోతే, స్వర్గానికి పోతారా ! ఆలోచించండి.

అందుకే, శ్లోక కర్త అథమపక్షం ఓ ఏడాది పాటు పౌరోహిత్యం చేసిన వారూ, కనీసం ఓ మూడు రోజుల పాటు సన్యాసిగా ఉండే వారు సైతం నరకానికి పోవసిందే అని ఢంకా బజాయించి చెబుతున్నాడు ...

తప్పులు చేసే పురోహితులూ, సన్యాసులే కాదు, తాము స్వీకరించిన వృత్తిని ప్రేమించని వారూ, త్రికరణ శుద్ధిగా మెలగని వారూ,తమ వృత్తిని ద్వేషించే వారూ,వృత్తికి న్యాయం చేయని వారూ,న్యాయ మార్గంలో వృత్తి బాధ్యతలు నిర్వహించని వారూ .... వీళ్ళంతా వెళ్ళేది నరకానికే కదా ?!

సరే, అదలా ఉంచితే, నాకు నరక లోకపు బెర్తు ఖాయం అని తేలి పోయింది.

ఏం చేస్తాం చెప్పండి. అయితే, నాకు తోడుగా అక్కడ నాకంటె ముందుగానో, కాస్తంత అటూ యిటూ గానో, మిత్రుడు భీమ్ పాపాల శర్మ , కవితా కరవాలాలతో చెండాడే కుకవులూ, భార్యలను ఏడిపించుకుని తినే భర్తలూ, భర్తలను కాల్చుకు తినే భార్యలూ, రేగింగు వీరులూ, కల్తీ మందులూ వస్తువులూ విక్రయించే వ్యాపారులూ, అధిక వడ్డీలు గుంజే అధమాధములూ, ప్రజా సేవ పేరిట ప్రజా కంటకులైన నాయకమ్మన్యులూ ( రాజ్యాంతే నరకం ధృవమ్ కదా ) , పసి పిల్లలను గొడ్డుల్లా బాది పైశాచికానందం పొందే టీచర్లూ, క్షుద్ర సాహితీ సమరాంగణ సార్వ భౌములూ, నాలాగా చేతికొచ్చిన బ్లాగులు పెట్టి బాధించే బ్లాగు పిశాచులూ, హత్యలూ, దోపిడీలూ చేసే వాళ్ళూ, రాంగ్ కాల్స్ చేస్తూ విసిగించే ఫోనాసురులూ ... ... మరింక చెప్ప లేను ... ఇలా చాలా మంది వచ్చి చేరుతారనే నిబ్బరంతో నరక లోక యాత్రకు రెడీ అయి పోతున్నాను, మరి ... నరక లోకపు జాగిలమ్ములు మబ్బు చాటున ఖణేళ్ మన్నాయ్ !!

. మనకి స్వర్గమో, నరకమో ఇతమిత్థంగా ఇంకా తేలని స్థితిలో, ఎదుటి వాడికి నరకం ఖాయమని తేలి పోయేక , మనకి ఆనందం వెయ్యదూ?!


* * * * * * * * *

కళ్ళు తెరిచి చూద్దును కదా, నాకు తెలీని వేరే ఏదో లోకంలో ఉన్నాను. అక్కడంతా గలీజుగా ఉంది. నానా కంగాళీగానూ ఉంది. ఆర్తుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. వికటాట్ట హాసాలు కర్ణభేరి బ్రద్దలయ్యే లాగున ప్రతిధ్వనిస్తున్నాయి.సలసల క్రాగే నూనె బాణళుల నుండి వచ్చే ధూమం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొత్తానికి అక్కడ నానా బీభత్సంగానూ ఉంది. (ఐతే, ఒకటి, అదెంత భీకరంగా ఉన్నప్పటికీ హైదరాబాదంత గలీజుగా మాత్రం లేదనిపించడం విషయాంతరం)

కాస్త తమాయించుకుని, ‘‘ నేనిప్పుడెక్కడ ఉన్నాను?‘‘ అనడిగేను.
ప్రక్కనున్న రాక్షసాకారి వికటంగా నవ్వి, ’’ నరకంలో నయ్యా.‘‘ అని బదులిచ్చేడు.

’’ నరకం లోనా ! నన్నిక్కడి కెందుకు తెచ్చేరు? నేనేం పాపం చేసానని?‘‘ అనడిగేను గాభరాగా.

నాప్రశ్నకి వాడు జవాబు చెప్పే లోగానే, మరో ప్రక్క నుండి,’’ నరకానికి రాకేం చేస్తావురా,త్రాష్ఠుడా ! ‘‘ అనే మాటలు వినిపించేయి.

ఉలిక్కిపడి, అటు చూసేను. అక్కడ నా కథ లోని ప్రథాన పాత్రలలో ఒకడైన సర్వేశ్వర శాస్త్రులు కనిపించేడు. మనిషి కొంచె వడిలేడు. పూర్వపు నిగారింపు లేదు. దబ్బ పండులా ఎలా ఉండే వాడు ! పప్పూ. ఆవు నెయ్యీ, గోంగూర, ఆవకాయ పచ్చడీ, కంది గుండా, నువ్వుల నూనె, అప్పడాలూ, ఒడియాలూ, నాలుగు రకాల కూరలూ, పచ్చళ్ళూ, గారెలూ, నూలు పచ్చడీ, నువ్వులుండలూ, ముక్కల పులుసూ ....ఇవేవీ భోజనంలో అమరడం లేదు కాబోలు. కొంచెం జాలేసింది.

‘‘ మహానుభావా! మీరేమిటి ఇక్కడ ? క్రమాంతస్వాధ్యాయులూ, జటా,ఘనా,పనస తిరగేసీ మరగేసీ కూడా ఒప్ప చెప్పగల సమర్ధులూ,నిప్పును నీళ్ళతో కడిగే వంశీయులూ, ఇక్కడకి దయ చేసారేం?’’ అనడిగేను.

శాస్త్రుల వారి ముఖం మరింత దీనంగా తయారయింది.‘‘ నుదుటి రాత నాయనా ! నుదుటి రాత. ఆ వెంకన్న పంతులుగాడూ, వాడి మనుషులూ లేరూ, వాళ్ళ వల్ల వొచ్చింది నాకీ అరిష్టం. వాడు పెట్టిన పేచీయే కదా, నాచేత పాపం చేయించింది? అందుకే నన్నిక్కడికి లాక్కొచ్చేరు ...’’

‘‘ మరి ఆయనో ? ... ఆయనా ఇక్కడే ఉన్నారా? ...’’ అడిగేను, సంశయంగా.

‘‘ వాడి శ్రాద్ధం, ఉండకేం చేస్తాడూ ! అదిగో, ఆమూల అఘోరిస్తున్నాడు , మాష చక్రాలు (గారెలు) ఇక్కడ దొరక్క విలవిలలాడి పోతున్నాడు.’’

‘‘ఇంకా ఎవరెవరొచ్చేరో ...?’’

‘‘అంతా వచ్చేం నాయనా. బుచ్చి వెంకూ, చయనులూ, సొట్ట జగ్గడూ. బుచ్చబ్బాయీ, సూరిపంతులూ .. ఒహరనేమిటి? అంతా ఇక్కడే ఉన్నాం.’’

‘‘ గౌరీపతి రాలేదో? ...’’

‘‘ నీ పిండం కాకులకు పెట్టా. ఇలాంటి సందేహాలొస్తున్నాయేఁవిటయ్యా, నీకూ ..... గౌరీపతి గాడు రాకేం? మహా రాజు మొగుడిలా వచ్చేడు ... అడిగో ఆ ప్రక్కన జంద్యాలు వొడుకుతూ కూచున్నాడు, చూడు ...’’ అటు చూసేను. నిజఁవే. ఇంద్రుడూ వగైరాలు వెండివో, బంగారానివో జంద్యాలు వేసుకుంటారు కానీ , నూలు జంద్యాలు వేసుకోరు కదా? ఈ గౌరీపతి ఇక్కడ కూడా తాళం బిళ్ళ త్రిప్పుతూ నూలు జంద్యాలు వొడకడం ఎందుకో? నంగిరితనం. జడ్డితనం కాక పోతే, అనిపించింది.

నేనింకా ఏదో అడగబోయే లోగా శాస్త్రి గారే ఖంగున అడిగేరు: ‘‘ ఇక్కడి కొచ్చేటప్పుడు, చేతులూపుకుంటూ రాక పోతే, కాసిన్ని మాష చక్రాలు పట్టుకుని రాక పోయూఁవూ? నీ మొహం యీడ్చ. నోరు ఝలాయించి పోతోంది. ...’’ అన్నారు బాధగా.

‘‘ నాకో బీడీ కట్టయినా తెచ్చి ఉండాల్సింది ..’’ మరో ప్రక్క నుండి వెంకన్న పంతులు గొంతు పీలగా వినిపించింది.

మాట మార్చడానికి, ‘‘ అయితే, అంతా ఇక్కడకే చేరారన్న మాట ! ...’’ అన్నాను.

‘‘అఘోరిచావులే. యేళ్ళు ఎత్తికెట్టి కాల్చ. నీ పుట్టువు బూజు కాను. మేఁవే కాదు, అదిగో ఆ ప్రక్కన చూడు, మీ గురజాడా, వాడెవడూ? తల చెడిన ముండలకి మళ్ళీ పెళ్ళిళ్ళని , అదనీ ఇదనీ మన ఆచారాలని మంట కలిపేడు, వాడు, వీరేశలింగం కాబోలు వాడి పేరు ...వాడూ చాలా కాలమై ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే అనేఁవిటి ? మీ కార్లమాక్స్ గాడూ, మావో గాడూ , వాళ్ళంతా ఆ సలసల మరిగే నూనెలో ఎలా వేగుతున్నారో చూడు !’’ అన్నారు అంతా ఉక్రోషంగా ముక్త కంఠంతో.

గాభరాగా అటు చూసేను. అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళెవరూ లేరు. వీరప్పన్ లాంటి వాళ్ళెవరో కనిపిస్తున్నారు.

నన్నిక్కడికి తీసుకొచ్చిన యమ దూతలలో ఒకడు నా ప్రక్కలో పొడిచి, గుసగుసగా అన్నాడు: ‘‘ వాళ్ళెవరూ ఇక్కడ లేరు. అంతా హాయిగా స్వర్గంలో ఉన్నారు. ఈ ముసిలాయనకి తద్దినం బోయినాలు లేక, మతి భ్రమించి అలా మాట్లాడుతున్నాడు ....’’ అని.

రెండో భటుడు దానికి కొనసాగింపుగా చెప్పేడు: ’’ శాస్త్రి గారి భార్యా, రమణా, పరమేశూ కూడా అక్కడే ఉన్నారు ... నువ్వీయన మాటలు పట్టించు కోకు ... పద,నీ ఎంట్రీ ఇక్కడ రికార్డు చేయించాలి ...’’ అని.

‘‘మరి, మా తెల్లావో?’’ అడిగేను ఆత్రతగా.

ఈ సారి ఇద్దరు భటులూ ఏక కంఠంతో చెప్పారు: ‘‘ దానికేం ! అది కూడా అక్కడే నిక్షేపంగా ఉంది. ఇప్పుడు అసలక్కడ స్వర్గ లోకపు కేంటిన్ లో ఆ తల్లి క్షీరంతోనే కదా, అక్కడ ఇంద్రాదులకు కాఫీలూ గట్రా కాచేది !’’

నేను హమ్మయ్య ! అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో అక్కడికి వచ్చిన పురోహిత వర్గమంతా అక్కసు వెళ్ళ గ్రక్కుతూ గబగబా తలో మాటా అనడం మొదలెట్టేరు.

‘‘ మా మీద కథ రాస్తాడూ? అప్రాచ్యపు వెధవ. సలసలా మరిగే నూనె బాణలిలో పడెయ్యండి.‘‘

‘‘ వొళ్ళంతా శూలాలు గుచ్చండి’’

‘‘ కక్కకట్టుకి కొరత వెయ్యండి, తిక్క కుదురుతుంది’’

‘‘ వైతరణి నీళ్ళు బిందెల కొద్దీ త్రాగించండి.’’

‘‘ తెలుగు టీవీ ఛానెళ్ళు రాత్రీ పగలూ విడవకుండా చూపించండి.త్రాష్ఠుడు, కళ్ళు పేలిపోయి ఛస్తాడు.’’

‘‘ దిన పత్రికలలో నానా చెత్తా ఆచివరి నుండి, ఈ చివరి వరకూ అక్షరం విడవకుండా చదివించండి.’’

‘‘ కథా మంజరి బ్లాగు టపాలన్నీ కంఠోపాఠం చెయ్యమనండి.’’

నాకు నరక లోకంలో అమలు కావలసిన శిక్షలను వాళ్ళంతా అలా ఖరారు చేస్తూ ఉంటే నాకు వొళ్ళు కంపరమెత్తి పోయింది. వజవజ వణికి పోయేను.

యమభటులిద్దరూ నా భుజం మీద చరిచి, నాకు ధైర్యం చెబుతూ వాళ్ళతో ఇలా అన్నారు.’’ అబ్బే, అంత సీన్ లేదు లెండి. వీరిని ఆ కథ రాసినందుకు కాక, వేరే కారణం చేత ఇక్కడికి తీసుకుని వచ్చేం. ఇక్కడ అట్టే సేపు ఉంచం. ఇక్కడి రికార్డులలో వీరి పేరూ వివరాలూ మరో తూరి నమోదు చేసి, ఒక పేము బెత్తం దెబ్బ శిక్షతో సరి పుచ్చి, నేరుగా స్వర్గానికి బదిలీ చేస్తాం. అక్కడ కొలువు తీరి ఉన్న గురజాడ, చా.సో, విశ్వనాథ సత్యనారాయణ, దేవుల పల్లి , నండూరి, కవిత్రయం వారూ , పోతన ... ఓ ... ఇలా కోట్ల సంఖ్యలో ఉన్న మహానుభావులను చూసి తరిస్తూ, వారిని సేవించుకుంటూ , వారి దీవెనలు అందుకుంటూ అక్కడే ఉంటారు .......’’

‘‘ మరి మేఁవో ?!’’ ఏడుపు గొంతులతో ఒకేసారి అరిచినట్టుగా అన్నారంతా.

‘‘ మీరిక్కడే ఉండాలి. మీరిందాక చెప్పిన శిక్షలతో పాటు, అలాంటివే కొన్ని వేల వేల శిక్షలు మీకింకా అమలు పరచ వలసి ఉంది. వాటిలో మొదటి శిక్ష కథా మంజరి బ్లాగు టపాలన్నీ అక్షరం పొ్ల్లు పోకుండా కంఠోపాఠం చేసి గడగడా వొప్పగించడం!‘‘

‘‘ ఆఁ!!!‘‘ అంటూ, అంతా నోళ్ళు వెళ్ళ బెట్టీసేరు.

* * * * * * * * * *


గమనిక: :  ఇందులోనివన్నీ నా కథలోని పాత్రలు ! ఆ కథ రాసినందుకు కినిసిన కొందరు   అప్పట్లో నన్ను  ‘‘ నరకానికి పోతావ్  రా! నా కొడకా ! ‘‘ అని ప్రేమగా శపించేరు. అంచేత నా నరక లోక యాత్ర ఖాయమై పోయింది.

మరిన్నీ, ఇంత లేసి టపాలు పెట్టి విసిగించే వ్యక్తికి నరక లోకం లో తప్ప స్వర్గంలో బెర్తు దొరుకుతుందా చెప్పండి ?!

6, ఆగస్టు 2015, గురువారం

భగవాన్ ! హేఁవిటి మాకీ పరీక్ష ?!




‘‘ ఎప్పుడూ శ్లోకాలూ , పద్యాలూ, కవితలూ కథలేనా ? నీ కథా మంజరిలో మామూలు విషయాలేవీ పెట్టవ్
కదా ! ’’ అని విసుక్కున్నాడు మా తింగరి బుచ్చి.

‘‘ ఏం పెట్టమంటావ్ ? ’’ అడిగేను కొంచెం నీరసంగా.

‘‘ పోనీ నా జీవిత చరిత్ర రాసి పెట్టెయ్ ’’ అని సలహా ఇచ్చేడు. ‘‘తింగరి బుచ్చి జీవిత ప్రస్థానం’’అని దానికి వాడే ఓ పేరు కూడా పెట్టీసేడు.

తన జీవిత చరిత్ర రాయక పోతే కథా మంజరి జన్మ చరితార్థం కానేరదని దబాయించేడు కూడానూ.

నా పుణ్యం పుచ్చి పోయి, నా పాపం పండి, నా మెదడు మొద్దుబారి పోయి, ఏం రాయడానికీ తోచక ఆలోచన గడ్డకట్టి నప్పుడు - అప్పుడు రాస్తాను కాబోలు , మా తింగరి బుచ్చి గాడి జీవిత చరిత్ర.

సరే, వాడి దాడి నుండి తాత్కాలికంగా నయినా తప్పించు కోడానికి ఈ పరీక్షా సమయమ్ -  పెడు తున్నాను.

ఇప్పు డంటే బ్లూ టూత్ లూ, సెల్ ఫోన్లూ లాంటి అత్యాధునిక పరికరాలేవో ( నాకు తెలీనివి) వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో పరీక్షలు రాసే పిలకాయలకి పాపం ఇవేమీ అందు బాటులో ఉండేవి కావు.

చిన్న చిన్న కాగితాలు చింపుకొని వాటి మీద జవాబులు ఓపిగ్గా రాసుకొచ్చే వారు. వాటిని స్లిప్పులనీ, చిట్టీలనీ అంటారు.

రహస్యంగా వాటిని తమ శరీరాల మీద బట్టల్లోనో, చెప్పుల్లోనో, చొక్కా మడతల్లోనో - వివిధ రహస్య స్థావరాలలో దాచుకొచ్చే వారు. సంప్రదాయానికి విలువ నిచ్చే విద్యార్ధులు ఇప్పటికీ ఈ ప్రాచీన పద్ధతులనే అవలంబిస్తున్నారనుకోండి ! అలా తెచ్చిన చిట్టీలని దొంగ చాటుగాతీయడం ఓ కళ. పట్టుబడితే కాళ్ళా వ్రేళ్ళా బ్రతిమాలడం . జాలీ దయా లేని దుర్మార్గులైన వాచర్లయితే డిబారయి పోవడం.

చిట్టీలు రాసే విద్యార్ధి కళా కారుల హక్కులను కాపాడడం కోసం ఉద్యమించాలని ఉందని మా తింగరి బుచ్చి గాడు లోగడ ఓ సారి ఎప్పుడో అన్నట్టు గుర్తు.

విద్యార్ధులకు ఈ చిట్టీలు అందించే పనిలో చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. పరిగెత్తడం, గోడలు దూకడం, అటెండర్లను మంచి చేసు కోవడం లాంటి చాలా నైఫుణ్యాలు వీరికి ఉండాలి.

ఇక, పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారంటూ మనం పాపం పిలకాయలనే ఆడి పోసుకుంటూ ఉంటాం కానీ, ఈ విషయంలో కాపీయింగ్ చేయించడానికి అత్యుత్సాహం ప్రదర్శించే టీచర్లూ ఎక్కువే.

పరీక్షల్లో విద్యార్ధులకు జవాబులు అందిస్తూ వారికి మంచి మార్కులు వచ్చేలా చూసి, వారి నుండి మంచి మార్కులు కొట్టెయ్యాలనే యావ కొంతమంది టీచర్ల లో ఉంటుంది. వారు పరోపకార పరాయణుల గానూ, మంచి సారు వారుగానూ, పిల్లలంటే దయాపరులుగానూ మన్ననలు అటు విద్యార్ధులనండీ, వారి తల్లి దండ్రలు నుండీ తరుచుగా పొందుతూ ఉంటారు ( అడపా దడపా క్వార్టరో, హాఫో బాటిల్స్ , చిరుకానుకలతోసహా)

ఇలాంటి పరోపకారి పాపన్నలాంటి ఓ టీచరు పరీక్ష హాల్లో ఇంగ్లీషు పరీక్ష నాడు ఇన్విజిలేషను చేస్తున్నాడు.
తన ఉదారతనూ, వివేకాన్నీ, ఇంగ్లీషు భాషా ప్రావీణ్యాన్నీ పరీక్ష గదిలో పిలకాయల ముందు ప్రదర్శించాలని మనసు ఒకటే తొందర పడుతోంది. నోరు మహా దురద పెడుతోంది.

‘‘ ఒరేయ్ ! బిట్ పేపరు ఇచ్చే వేళవుతోంది. రెడీగా ఉండండి. జవాబులు చెబుతాను. మళ్ళీ చెప్పమని అడగకుండా గబగబా రాసెయ్యాలి. ’’ అని హెచ్చరించాడు.

బిట్ పేపరు అందరికీ పంచేడు. గుసగుసల స్వరంతో జవాబులు చకచకా చెబుతున్నాడు. ఆ ఇంగ్లీషు బిట్ పేపరులో ఓ నాలుగు ఖాళీలలో ప్రిపోజిషన్స్ ( Prepositions ) నింపాలి. టీచరు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ ఖాళీల్లో వరుసగా
In,TO,IN,TO లు రాయండ్రా అని చెప్పాడు. ఇంకే ముంది, విధేయులైన పిలకాయలు గబగబా రాసి పారేసారు.
చూస్తే అందరి పేపర్ల లోనూ ఆ ఖాళీలలో నాలుగింటి లోనూ X గుర్తులే వేసి ఉన్నాయి !

మరో సారి మరో వాచరు గారు పిల్లలకి మామ్మూలుగా చెప్పే హెచ్చరికలతో పాటూ ఇంకా ఇలా చెప్పాడు.

‘‘ ఒరేయ్ ! బిట్ పేపరు జవాబులు చెబుతాను గానీ బొత్తిగా అందరకీ ఒకేలా 20 కి 20 వస్తే బాగోదు. అంచేత కావాలనే రెండో, మూడో నేను చెప్పినవి కాకుండా తప్పు జవాబులు రాసెయ్యండి. ఏం ?’’ అని చెప్పి అలా చెయ్యని వాళ్ళ తాట వలిచేస్తానని ప్రతి ఙ్ఞ కూడా చేసాడు.

ఆరోజు సోషలు పేపరు. ఖాళీలు పూర్తి చేయవలసిన వాటిలో ఒక ప్రశ్న ఇలా ఉంది : ‘‘ ఒరిస్సాలో ప్రసిద్ధమైన జగన్నాథ స్వామి వారి ఆలయం ----- లో ఉంది.’’

ఆ ఖాళీలో ‘‘ పూరీ’’ అని రాయమని మన మంచి సారు వారు చెప్పడంతో అంతా మహదానందంతో అలాగే రాసేసారు.

కొంత మంది పిల్లలు మాత్రం , టీచరుగారి హెచ్చరికల మీద, మాట మీద గౌరవంతోనో, వారి గుస గుసల స్వరం వినిపించక పోవడంచేతనో, తెలీక పోవడం చేతనో, టీచరు ముందుగా చెప్పిన విధంగా పూరీ అని కాక, దానికి బదులుగా చపాతీ అని రాసేరు.

పేపర్లు దిద్దే స్పాట్ వేల్యుయేషన్ లో వాటిని దిద్దుతున్న టీచరు గారు పూరీ అనే ఆన్సరున్న వాటికి వరసగా రైట్ టిక్కు పెట్టి మార్కులు వేస్తున్నాడు. ఆ పనిలో అతను చాలా బిజీగా ఉన్నాడు. యంత్రంలా పని చేసుకు పోతున్నాడు. కొన్ని పేపర్లో ఆ బిట్ కి కొందరు పూరీ అనీ కొందరు చపాతి అని రాయడంతో జెట్ వేగంతో కదులుతున్న అతని ఎర్ర ఇంకు కలానికి బ్రేకు పడింది. చికాగ్గా దిద్దడం ఆపి, ఛీఫ్ ఎగ్జామినర్ ని అడిగాడు : ‘‘ సారూ ! ఈ బిట్ కి కొందరు పూరీ అనీ, కొందరు చపాతీ అని జవాబులు రాస్తున్నారు. దేనికి మార్కులు వేయమంటారు ?’’ అని.

పరాగ్గానో, చిరాగ్గానో ఉన్న ఆ ఛీఫ్ సారు :

‘‘ రెండూ తయార్యేది ఒకే పిండితో కదా. ఎలా రాసినా మార్కు ఇచ్చెయ్యండీ ’’ అని జవాబిచ్చేరు.

చిట్టీలు చూసి కూడా రాయ లేని మగానుభాగులూ ఉంటారు ! హిందీ  పరీక్ష నాడు హితైషులు ( ? ) అందించిన టిట్టీలను మక్కీకి మక్కీ ఎక్కించీసినా పాసు కాని  కుర్రాడు వొకడుండే వాడుట. ఏరా, చిట్టీలన్నీ అందేయా ? అనడిగితే ఔననే వాడుట.  పేపర్లో అన్నీ రాసేవా ? అనడిగితే బుద్ధిగా తలూపే వాడుట. మరి వీడు హిందీ పరీక్ష ఎప్పటికీ గట్టెక్కడేం ! అని ఆరా తీస్తే అసలు విషయం బోధ నడిందిట ! వాడు తనకి అందిన చిట్టీ లో మేటరు యధాతధంగానే పేపర్లో ఎక్కిస్తూనే ఉన్నాడు. కానయితే చిట్టీలు   తిరగేసి అందు కోవడంలో పొరపాటు వలన ఆ హిందీ అక్షరాలను క్రింద గీతలు పెట్టి  తిరగేసి రాస్తున్నాడుట !


అయ్యా ఇదీ సంగతి.

చివరిగా ఒక కొంటె కవిత:

ముందు వాడు రాసిందంతా
మక్కీకి మక్కీ కాపీ కొట్టేడు పుల్లారావు
అయినా జీరో మార్కుల కన్నా ఎక్కువ రానే రావు !
ఎందుకబ్బా ! అని ఆశ్చర్య పోకండి.
ముందు వాడు రాసిందంతా క్వశ్చెన్ పేపరే కదండి !

3, ఆగస్టు 2015, సోమవారం

రూాపాయి తప్పి పోయింది ! వెతికి పెట్టరూ ?!



రూపాయి .. ... పాయె !

 ఏమయి పోయింది చెప్మా ?!

మా చిన్న తనంలో మా నరసింహం బాబాయి ఈ లెక్క చెప్పి, మమ్మల్ని జవాబు చెప్పమని అడిగాడు. మేం బిక్క ముఖాలు వేసేం.

 మీరు కూడా మీ పిల్లకాయలకి ఈ లెక్క చెప్పి, జవాబు చెప్పమని అడగండి.
ఏం చెబుతారో చూడండి:

ఇదిగో ఆ లెక్క:

రాముడు, భీముడు ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు తమ బెస్ట్ ఫ్రెండ్ సోముడి పుట్టిన రోజు కానుకగా ఏదేనా మంచి కానుక కొని ఇద్దామని బజారుకి వెళ్ళారు.

షాపులో ఒక మంచి బొమ్మని చూసి అదెంత అని, అడిగారు. అప్పుడు షాపు యజమాని లేడు. పని కుర్రాడు ఏభై రూసాయలు అని చెప్పాడు.

సరే అని రాముడు , భీముడు చెరో పాతిక రూపాయలూ ఇచ్చి, బొమ్మను కొన్నారు. వాళ్ళు ఆ బొమ్మను కొని ఇంటికి వెళ్ళాక, ఆ షాపు పని కుర్రాడు వచ్చి, వారికి మూడు రూపాయలు తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా అన్నాడు : ‘‘ ఈ బొమ్మ నేను మీకు ఏభై రూపాయలకు అమ్మేను కదా. కానీ, మా యజమాని వచ్చి, దీని ధర ఏభై కాదని, నలభై అయిదు రూపాయలే ననీ, తిరిగి అయిదు రూపాయలు మీకు ఇచ్చి రమ్మన్నాడనీ చెప్పాడు. అయితే వచ్చే దారిలో తను ఆ అయిదు రూపాయలలో రెండు రూపాయి ఎక్కడో పారేసానని, అందు వల్ల వారికి మూడు రూపాయలే ఇస్తున్నాననీ అన్నాడు. అంతే కాక, తాను రెండు రూపాయలు పారేసిన సంగతీ, మూడు రూపాయలు మాత్రమే వారికి ఇచ్చిన సంగతి యజమానికి చెప్ప వద్దని కూడా బ్రతిమాలు కొన్నాడు.

రాముడు, భీముడు భలే, భలే అనుకుంటూ, వచ్చిందే చాలుననుకుని ఆ మూడు రూపాయలూ తీసు కున్నారు. షాపులో బొమ్మ కొనడానికి చెరో పాతికా ఇచ్చేరు కనుక, తిరిగి ముదరాగా వచ్చిన మూడు రూపాయలని కూడా వారిద్దరూ సమానంగా చెరి రూపాయిన్నర చొప్పునా పంచు కున్నారు.

ఇదీ కథ. ఇప్పుడు అసలు ప్రశ్ప ఏమిటంటే,

రాముడు భీముడు కలిసి షాపు పని వాడికి ఇచ్చిన మొత్తం చెరొక పాతిక - అంటే ఏభై రూపాయలు.

బొమ్మ అసలు ఖరీదు నలభై అయిదు.

పని వాడు తెచ్చినది ఐదు రూపాయలు.

వాడు పారేసానని చెప్పినది రెండు రూపాయలు.

రాముడు , భీముడు పంచు కున్నది - చెరొక రూపాయన్నర. మొత్తం మూడు రూపాయలు.

ఇప్పుడు చెప్పండి:

బొమ్మ అసలు ధర నలభై అయిదు . పంచు కొన్నది మూడు. పని వాడు పోగొట్టు కున్నది రెండు . మొత్తం ఏభై.

లెక్క సరి పోయిందే !

ఇప్పుడు ఇదే లెక్కని ఇలా చూడండి:

బొమ్మ కోసం మొదట రాముడు తన వాటాగా ఇచ్చినది : 25 రూపాయలు.
భీముడు తన వాటాగా ఇచ్చినది: 25 రూపాయలు
మొత్తం: 50 రూపాయలు. అయితే వారికి తిరగి పని వాడు తెచ్చి ఇచ్చినది మూడు రూపాయలు.

పని వాడు తెచ్చి ఇచ్చిన దానిలో రాముడి వాటాగా వచ్చినది రూపాయిన్నర. అంటే, రాముడి జేబు లోనుండి తీసి ఖర్చు చేసిన మొత్తం ఎంతన్నమాట ? ఇరవై మూడు న్నర రూపాయలు. అంతే కదా !

అలాగే, భీముడికి తన వాటాగా వచ్చిన రూపాయిన్నర కలిపితే వాడి వాటాగా ఖర్చయినది ఎంతన్నమాటా ?

ఇరవై మూడున్నర రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడు తమ జేబుల లోనుండి ఖర్చు చేసిన డబ్బు మొత్తం కూడితే ఎంతవుతోందీ ?

ఇరవై మూడున్నర + ఇరవై మూడున్నర = 47 రూపాయలు. కదా !

పని వాడు పారేసినది ఎంతా ? రెండు రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడుల అసలు నిఖర ఖర్చు 47 రూపాయలు + పని వాడు పారేసిన 2 రూపాయలు = 49 రూపాయలు.

అరే ! ఒక రూపాయి తక్కుఃవ వస్తోందే ? ఏమయి పోయింది చెప్మా ?!

టాఠ్ ! రాముడు ; భీముడుల నిఖర ఖర్చు 47 , పని వాడు పారేసినది 2 మరి వాడు ఇచ్చినది మూడు రూపాయలు కదా. దానిని కలపొద్దూ అంటారా ? సరే, మీ ఇష్టం. నాదేం పోయింది ? అలాగే కలపండి. కానీ అప్పుడు మొత్తం 52 అయి పోవడం లేదూ ? అదనంగా ఈ రెండు రూపాయలూ ఎక్కడి నుండి వచ్చేయి
 చెప్మా ?


31, జులై 2015, శుక్రవారం

ఛూ ! మంత్ర కాళీ !



పేక ముక్కలతో రకరకాల గమ్మత్తులు చేయడం మనలో కొందరకి కొట్టిన పిండి.
మా చిన్నప్పుడు మా సింహం బాబాయి పేక ముక్కలతో ఒక మేజిక్కు తరుచుగా మా దగ్గర చేసి చూపెడుతూ ఉండే వాడు. నాకు సరిగా గుర్తు లేదు కానీ, పేక ముక్కలను మూడో, నాలుగో వరసలుగా పేర్చే వాడు. ఏదో ఒక ముక్కను మనసులో తలుచుకో మనే వాడు. తర్వాత, నువ్వు తలుచుకున్న ముక్క ఈ వరసలో ఉందా? అంటూ వరసల వారీగా అడిగే వాడు. మేం ఉందనో, లేదనో చెప్పాక, ఛూమ్ మంత్రకాళీ అంటూ ఒక వికటాట్టహాసం చేసి, మేం తలుచుకున్న ముక్క ఏదో కరెక్టుగా చెప్పీసే వాడు. మేం నిబిడాశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టీసే వాళ్ళం. తనకిలాంటి మంత్రాలూ, తంత్రాలూ చాలా చేతనవుననీ, సరిగా చదవక పోతే మమ్మల్ని పాషాణాలుగా ( అంటే, బండ రాళ్ళుగా నన్న మాట.ఆ అర్ధం కూడా మా సింహం బాబాయే చెప్పాడు) మార్చేస్తాననీ బెదిరించే వాడు.నిజమే కాబోలుననుకుని, మేం బెదరి పోయి బుద్ధిగా పుస్తకాలు తీసే వాళ్ళం. ఆ ట్రిక్కు కాస్త పెద్దయాక మాకూ తెలిసి పోయిందనుకోండి !

అలాంటి ట్రిక్కునే ఉపయోగిస్తూ అక్షర ప్రశ్న పేరిట మన వాళ్ళు ఒక పద్యం చెప్పారు.ఆ సీస పద్యంలో ఏ అక్షరాన్ని తలుచుకున్నా మనం కనిపెట్టెయ్య వచ్చును. ఈ అక్షర ప్రశ్న ట్రిక్కు కోసం ఆ కవిగారు మన కోసం ఒక సీస పద్యాన్నీ, ఒక కీ బోర్డునీ (అదీ పద్య రూపం లోనే) తయారు చేసి సిద్ధంగా ఉంచేరండోయ్ ! ఆ వైనాన్ని చూడండి మరి:

(1)
అరి భయంకర చక్ర కరి రక్ష సాగర
శాయి శ్రీ కర్పుర సాటి యుగళ
(2)
నాళీక సన్నిభ నయన యండజవాహ
వాణీశ జనక వైభవబిడౌజ
(4)
రాజీవమందిరా రమణ బుధా భీష్ట
వరజటిస్తుత శైరి వాసు దేవ
(8)
భూరి కృపాకర బొబ్బిలి పురపాల
పాప భుజంగమ పరమగరుడ
(16)
దోష శైలేశ శచి దక్ష ద్రుహిణ హేళి.

ఈ పద్యంలో మీరు ఏదో ఒక అక్షరాన్ని కోరుకోవచ్చును.
అయితే, ఆ కోరు కోవడంలో మాత్రం కొన్ని నిబంధనలు పాటించి తీరాలి.
అవేమిటంటే,
1.అచ్చులలో అకారం మాత్రమే తలుచు కోవాలి.
2.హల్లులలో అనునాసికాక్షరాలయిన క వర్గ, చవర్గ పంచమాక్షరాలు తలుచుకో కూడదు.
తలుచుకోకూడదు.
3. గుణింతంతో పని లేదు.
4.న,ణ లకూ ర,ఱ లకూ అభేదం పాటించాలి.

ఈ నిబంధనలకు లోబడి మీరు మీది పద్య పాదాలలో ఏదో ఒక అక్షరాన్ని తలుచుకో వచ్చును.

ఉదాహరణకి మీరు ళ అనే అక్షరం తలుచుకున్నారనుకోండి( కాసేపు మీరు తలచుకున్న అక్షరం ళ అని నాకు చెప్పలేదు అని కూడా అనుకోండి. అబ్బ ! కాసేపు అనుకుందురూ !) ఇప్పుడు నేనడిగే ప్రశ్నలకి మీరు జవాబులు చెప్పాలి. నా ప్రశ్పలూ, మీ జవాబులూ ఇలా ఉంటాయి:
నేను: మీరు తలుచుకున్న అక్షరం (1) వ నంబరు వేసి ఉన్న పాదంలో ఉందా?
మీరు: ఉంది.
నేను: రెండవ పాదంలో ఉందా?
మీరు: ఉంది.
నేను: మరి, మూడవ పాదంలో ఉందా?
మీరు: లేదండీ బాబూ !
నేను: నాలుగవ పాదం లోనో?
మీరు: అబ్బ ! గొప్ప నసగాడిలా ఉన్నావే? నేను తలుచుకున్న అక్షరం అందులో కూడా లేదయ్యా, మగడా అంటే వినవేం!
నేను: కోప్పడకు. శపించీ గల్ను. పోనీ, చివరి ప్రశ్న. అయిదో పాదంలో ఉందా? కాస్త చెబుదూ !
మీరు: ఆ! ఉంది. ఉంది ...

మన అడగడాలూ, చెప్పడాలూ పూర్తయాయి. నేను ఆ అక్షరం ఏదో చెప్పడమే మిగిలి ఉంది.

దానికి నేను అవలంబించే పద్ధతి చూడండి:

మీరు తలచిన అక్షరం తొలి రెండు పాదాలలోనూ, ఐదవ పాదంలోనూ ఉందని అన్నారు. కదూ?
ఆ పాదాల ముందు వేసి ఉన్న అంకెలు చూడండి. 1 , 2, 16 ఈ మూడు అంకెలనీ కలపండి.
19 వచ్చింది. కదా ! ఈ మొత్తం 19 రాగానే ఈ క్రింది కీ సాయంతో మీరు తలుచుకున్న అక్షరం ళ అని నాకు సులభంగా తెలిసి పోతుంది.

కీ చూడండి:

అన్నయ్యతోటి విస్సాప్రగడ కామ
రాజు భాషించు హేళి దాక్షిణ్య శాలి.

ఇదీ కీ పద్యచరణాలు. మొదటి చరణంలో 12 అక్షరాలు, రెండవ చరణంలో 12 అక్షరాలు ఉండడం గమనించండి.

ఒక్కో అక్షరానికీ ఒక్కో విలువ ఉందని గుర్తుంచు కోండి. తొలి చరణంలోని 12 అక్షరాలకీ వరుసగా 1,2,3,4,5,6,7,8,9,10,11,12

అలాగే రెండవ చరణంలోని అక్షరాలకి వరుసగా 13,14,15,16,17,18,19,20,21,22,23,24 విలువలు అని గుర్తుంచుకోండి.

(ఉదాహరణకి: బ అనే అక్షరానికి విలువ 15, అలాగే ద అనే అక్షరానికి విలువ 20)

సరే, ఇందాక మీరు ళ అనే అక్షరాన్ని తలుచుకున్నారు. నాకు మీరు తలుచుకున్న అక్షరం ఏదో చెప్ప లేదు కదా?. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నల ప్రకారం మీరు తలుచుకున్న అక్షరం తొలి రెండు పాదాలలోనూ, చివరి అయిదో పాదం లోనూ మాత్రమే ఉంది అని మీరు కించిదసహనంగా చెప్పగా, నేను గ్రహించాను కదా? ఆ రెండు పాదాల ముందూ నేను వేసుకున్న అంకెలను కూడితే 19 వచ్చింది కదూ?

ఇప్పుడు ఈ పంతొమ్మిది (19) విలువ కలిగిన అక్షరం ఏదో కీ వాక్యంలో చూడండి.

కీ వాక్యంలో 19 వ అక్షరం ళ. కనుక మీరు తలచిన అక్షరం ళ అండోచ్ !


అదీ తమాషా ! ఈ గణితం పద్య రూపంలో ఉండడమే దీని ప్రత్యేకత! ఈ తమాషా పద్యం చెప్పిన కవి విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామ వాస్తవ్యుడని పద్యంలో ఉండే ఆకరం బట్టే తెలుస్తోంది.

25, జులై 2015, శనివారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా ఏమి రుచి !

కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.





అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లు

చాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా హొటల్ డేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాష్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.



చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ,,, ,,, మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.