13, నవంబర్ 2015, శుక్రవారం

అదీ, అలా ఉండాలి !



కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలంటారు.
ఆధునిక కవి కూడా కొడితే కొట్టాలిరా, సిక్సు కొట్టాలీ ... అని తెగేసి చెప్పాడు.

ఈ శ్లోకం చూడండి:

దధతో యుధ్యమానస్య, పఠత: పులకో2థ చేత్
ఆత్మనశ్చ పరేషాం చ , తద్దానం సౌరుషమ్ స్మృతమ్ .

దానమంటూ చేస్తే ఎలా చేయాలయ్యా, అంటే, ఇచ్చే వాడికీ, పుచ్చుకునే వాడికీ, ఇతరులకీ కూడా ఆ దాన వైభోగం చూసి గగుర్పాటు కలగాలి ! ఇంకోలా చెప్పాలంటే తల దిమ్మెత్తి పోవాలి దానం చేడమంటే ఇలాగుండాలి అని ఒక మేలు బంతిలాగ ఉండాలంతే. కుర్రకారు భాషలో చెప్పాలంటే కెవ్వున కేక పెట్టించాలన్న మాట.

అలాగే, యుద్ధం చేస్తే ఆ రణనైపుణ్యం తనకీ, శత్రువుకీ, చూసే వారికీ కూడా ఆశ్చరానందాలను కలిగించేలా ఉండాలి.

అలాగే, దేనినయినా చదివితే చదువరులకు మైమరుపు కలిగించాలి.

అలా ఉండని ఆ దానమూ, ఆ పౌరుషమూ, ఆ పఠనమూ ఒట్టి దండగ మాలి పనులు.

ముందుగా ఒళ్ళు జలదరించే దాన విశేషం గురించి చూదాం ...

వామనుడు రాక్షస రాజు బలి చక్రవర్తిని కేవలం మూడడుగు నేల దానమడిగాడు. సరే ఇస్తానని ఇవ్వడానికి సిద్ధ పడ్డాడు బలి. రాక్షస గురువు శుక్రాచార్యుడు అడ్డు తగిలాడు. అడిగింది ఎవరను కున్నావ్? అడిగింది ఏమిటనుకున్నావ్? అంటూ హెచ్చరించాడు.

మహా దాత బలి వెనక్కి తగ్గ లేదు. ఇలా అన్నాడు. భాగవతంలో పోతన వ్రాసిన గొప్ప పద్యాలలో ఇదొకటి.

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జములపైఁగపోల తటిపైఁబాలిండ్ల పై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట, మీదై నాకరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే ? కాయంబు నాపాయమే !?

ప్రియ సతి లక్ష్మీ దేవి శరీర భాగాలను నూతన మర్యాదతో తాకిన ఆ చేయి ఇప్పుడు దానం స్వీకరించడానికి క్రింద ఉంది. దానమిచ్చే నా చేయి ఇప్పుడు మీద ఉంది. ఇంత కంటె భాగ్యం వేరే ఏముంది? ఈ రాజ్యాలూ గీజ్యాలూ ఎల్ల కాలం ఉండి పోతాయా ? దేహం నశించ కుండా శాశ్వతంగా నిలిచి పోతుందా?

ఎంత గొప్ప దానశీలత్వమో కదూ ! దానం అంటే అలా ఉండాలి.

వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసినా , సహజ కవచ కుండలాలను ఇచ్చిన కర్ణుడూ. తన శరీర భాగాన్నే కోసి ఇచ్చిన శిబి, తన వెన్నెముకను ఒక మహత్తర దేవ కార్యం కోసం అర్పించిన దధీచి, చాలా దినాలు క్షుద్బాధను అనుభవించి, తరువాత క్షుధార్తుడయిన తనకు లభించిన ఓగిరాన్ని కూడా అర్ధికి ఇచ్చి వేసిన రంతి దేవుడూ .... వీళ్ళూ దాతలంటే. దానం చేయడమంటే అలాగుండాలి.

ఇక యుద్ధం సంగతి చూదాం.

శ్రీనాథుడు చెప్ప లేదూ?

ఎవ్వనితో నెచ్చోటన్
చివ్వకు చేసాచ వలదు. చే సాచినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగ పగ సనన్ తీర్పదగున్

ఎవరితోనూ ఎక్కడా కూడా యుద్ధానికి తలపడనే వద్దు. ఒక వేళ యుద్ధం చేయవలసిన అక్కర పడితే మాత్రం పగ వాడి అంతు చూడనిదే వదల వద్దు సుమా ! చుట్టు ప్రక్కల ఎవరికీ పరిహాస పాత్రమయ్యే లాగున మాత్రం రణం చేయ వద్దు.
యుద్ధ రంగంలో పగవారికి వెన్ను చూపడం కన్నా హీనం మరొకటి లేదు.

ఉత్తర కుమారుని యుద్ధ ప్రాగల్భ్యం తెలిసినదే కదా ?

యుద్ధం చేయకుండా మగిడి వచ్చిన ఖడ్గ తిక్కనను చూసి, రోసి, అతని తల్లి, భార్య వానికి పౌరుషం కలిగించేలాగున ప్రవర్తించారుట. తానమాడడానికి మరుగు, పసుపు ముద్ద సిద్ధం చేసి అవమానించారుట. భోనాల వేళ విరిగిన పాలు పోసారుట. ఎన్నడూ లేని ఈ అనాదరణకి విస్తు పోయి ఖిన్నుడయిన తిక్కనకు తల్లి సమాధానం చూడండి:
పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్?
ముగురాడవార మైతిమి !
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్ ?!

అసదృశముగ నరివీరుల
మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్
గసవున్ మేయగఁబోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్.

యుద్ధంలో పగ వారితో పోరాడ కుండా వారికి వెన్ను చూపి పారి వచ్చిన వాడికి మగతనం ఉండదు కదా నాయనా ! వీరత్వం ఉన్న వారు అలాంటి పందలను మెచ్చుకోరు. ఇప్పుడు ఇంట్లో నీతో కలిపి ముగ్గురం ఆడువారమైనాము కదా ?
ఆడుదానివలె తడికె చాటున ఆ పసుపు రాసుకుని తానమాడి రావయ్యా అని వెటకారం.

పగ వారిని వీరోచితంగా ఉక్కడగించి రానట్టి పిరికి పందని చూసి, పశువుల మనసులు విరిగి పోయాయి. అవి ఇచ్చిన పాలు కూడా విరిగి పోయాయి. ఈవేళకి విరిగిన పాలతో భోజనం కానిద్దూ ! అని అవహేళన.

ఇక, పఠనయోగ్యాలయిన గ్రంథాల గురించి.

మంచి పుస్తకం చదివితే, చదవడం పూర్తయాక కూడా అది మనల్ని వెంటాడి వేధించాలి. ఆలోచింప చేయాలి. అలజడి కలిగించాలి. ఆహా !అనిపించాలి. కానప్పుడు కాల హరణం తప్ప ప్రయోజనం ఉండదు.

అదండీ సంగతి !

స్వస్తి.

12, నవంబర్ 2015, గురువారం

ప్రయత్నించి చూస్తే పోయే దేముంది చెప్పండి ?!



విజయ విలాసం లో చేమకూర వేంకట కవి ధర్మ రాజు సుగుణాలను ఎలా వర్ణించాడో చూడండి.

దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి
ద్యా వైదుష్యము దిక్కు, ధర్మమునకున్ దార్కాణ, మర్యాదకున్
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ, హితశిష్ట వ్రాత సంతోషణ
శ్రీ వజ్రాంగి, యజాత శత్రుడు మహీభృన్మాత్రుడే చూడగన్.

దేవ బ్రాహ్మణుల పట్ల అమిత భక్తి శ్రద్ధలు కలవాడు. ప్రియమైన మాటలు పలుకుతాడు. విద్యా వైదుష్యాలకు గతి. ధర్మానికి అతడే ఉదాహరణ ప్రాయుడు. మర్యాద ,ఔచిత్యాలు ఎరిగిన వాడు. మంచి వారినీ, సజ్జనులనూ కాపాడే వాడు, శత్రువులంటూ ఎవరూ లేని వాడు. లోకంలో సాధారణ రాజులలాంటి వాడు కాదు.

ఆవలబోయిన వెన్క నాడుటెన్నడు లేదు
మొగము ముందఱ నంట మొదలె లేదు

మనవి చెప్పిన చేయ కునికి యెన్నడు లేదు
కొదవగా నడుపుట మొదలె లేదు

చనవిచ్చి చౌక చేసినది యెన్నడు లేదు
పదరి హెచ్చించుట మొదలె లేదు

మెచ్చినచో కొంచె మిచ్చుటెన్నడు లేదు
మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు.

మఱియుఁ దొల్లిటి రాజుల మహిమ లెన్ని
యితఁడె పో సార్వ భౌముఁడత్ప్రతిముఁడనఁగ
బ్రజలఁబాలించె సకల దిగ్భాసమాన
కీర్తి విసరుండు, పాండ వాగ్రేసరుండు

ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట అనే దుర్లక్షణం లేదు. కాస్త ముఖం చాటు కాగానే ఆడిపోసుకోడం లేదు. అలాగని ముఖం మీదనే ఫెడీల్మనేలా కటువుగా పలకడం కూడా లేదు.
మనవి చేసుకుంటే, సహాయం చేయక పోవడం ఎప్పుడూ లేదు. అలాగని ఎంతో కొంత ఇచ్చి, చేతులు దులుపు కోవడం కూడ లేదు. ఇచ్చెనా, ఏనుగు పాడి అన్నట్టుగా, ఇవ్వడంలో ఎప్పుడూ తక్కువ చేయడు.

ముందు బాగా చనువు ఇవ్వడం. ఆతరువాత చులకనగా చూడడం ఎన్నడూ లేదు. అలాగే, ఊరికే పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేయడు.

మెచ్చు కుంటే ఏదో కొంచెం ఇచ్చి పొమ్మనే రకం కాదు. అలాగని ముఖ ప్రీతి మాటలాడడం, ఇచ్చకాలు పలకడం అసలే లేదు.

వెనుకటి రాజుల గొప్పతనాలు ఎటువంటివో ఆలోచిస్తే, ధర్మ రాజు మాత్రమే చక్రవర్తి అని అర్ధమౌతుంది.

ఎంత లెస్సగ నున్న నంత వేడుక కాని,
ప్రజలకల్మి కసూయ పడుట లేదు

తనుఁగొల్వ వలె నందఱను ప్రియంబె కాని
మానిసి వెగటించుకైనను లేదు

నిచ్చ వేడిన నర్ధి కిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుట లేదు

రేవగల్ ధర్మ మార్జించు దృష్టియె కాని,
న్యాయంబు దప్పిన నడక లేదు

కలడె యిటువంటి రాజు లోకమున నెందు !
జలధి వలయిత వసుమతీ చక్రమెల్ల
యేల వలె శాశ్వతముగాఁగ నీఘనుండె
యేల వలె నన్యు లన నృపాలుఁడలరె

తన పాలనలో ఉన్న ప్రజలు ఎంత సంపన్నులయితే, ధర్మ రాజు అంతగా సంతోషించే వాడు. అంతే కాని, తన ఏలుబడిలో ఉండే వారికి ఇంత సంపదా ? అని అసూయ పడే వాడు కాదు. అందరూ తన పాలనలో తనని సేవిస్తూ ఉండాలనే రాచరికపు వేడుకే తప్ప, మనుషులంటే ద్వేషం ఎప్పుడూ లేదు. అడిగిన వాడికి అడిగింది ఇవ్వడమే కాని, లోగడ ఇంత ఇచ్చేను కదా, మళ్ళీ అడుగుతావేం !అంటూ కసురు కోవడం లేదు. రాత్రీ పగలూ ధర్మ బద్ధంగా ఉండాలనే ఆలోచనే తప్ప ఎన్నడూ న్యాయ మార్గాన్ని తప్పి ఎఱుగడు.

లోకంలో ఎక్కడయినా ఇంత గొప్ప రాజు ఉన్నాడా? సముద్ర వేలా సర్యంత మయిన ఈ భూమండలాన్ని ఈ ఘనుడైన ధర్మ రాజే శాశ్వతంగా పాలించాలి. వేఱొక ప్రభువు మన కేల? అని ప్రజలు అనుకునే లాగున ధర్మజుడు ఒప్పుతున్నాడు.

కోపమొకింత లేదు, బుధ కోటికిఁగొంగు పసిండి, సత్య మా
రూపము, తారతమ్యము లెఱుంగు స్వతంత్రుడు, నూతన ప్రియా
టోపము లేని నిశ్చలుఁడిటుల్ కృత లక్షణుఁడై చెలంగగా
ద్వాపర లక్షణుండనఁగ వచ్చునొకో యల ధర్మ నందనున్

కోపం ఇసుమంతయినా లేదు. పండిత వర్గానికి కొంగు బంగారం. సత్యమే ఆకారంగా రూపు దాల్చిన వాడు. మంచి చెడ్డలు, బాగోగులు బాగా తెలిసిన వాడు. ఎవరో చెబితే చెప్పుడు మాటలు తలకెక్కించు కోకుండా స్వతంత్రమైన భావాలు కలవాడు.నూతన ప్రయాడంబరాలు లేని వాడు.రాజానో బహు వల్లభా: కదా? కొత్త రుచుల కోసం వెంపర్లాడే వాడు కాదు.ధృడ చిత్తం కలవాడు. ఇన్ని కృత లక్షణాలు కల ధర్మ రాజుని ద్వాపర లక్షణాలు కల వాడని అనడం ఏమి సబవు? కృత యుగంలో వ్యక్తులకు ఉండే లక్షణాలు అన్నీ సంతరించుకున్న వాడని చమత్కారం.

చూడండి. ధర్మ రాజు ఎన్ని గొప్ప సల్లక్షణాలు కల వాడో ! అందులో అన్నో, కొన్నో మంచి లక్షణాలు మనమూ అలవరుచు కోడానికి ప్రయత్నించి చూస్తే పోయేదేముంది చెప్పండి?

2, నవంబర్ 2015, సోమవారం

పూల బాసలు !


తెల తెలవారుతూ ఉంటే, నిద్ర లేచి, కళ్ళు నులుముకుంటూ, బద్ధకంగా బాల్కనీ లోకో, పెరట్లోకో వెళ్ళి చూస్తే .... నిన్న మొగ్గ తొడిగిన కొమ్మకి అందమైన పువ్వొకటి కనిపించిందనుకోండి ! ఓహ్! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నవ జాత శిశువుని చూసి, పరవశించి పోయే తల్లి మనసు ఎలా ప్రఫుల్లమవుతుందో, అలా , పరవశించి పోతాం కదూ? ... ఆ పూల చెట్టు మీ చేత్తో నాటి, దోహదం చేసినదయితే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది.
ఆ వికసిత పుష్పానికి అన్ని రంగులు అద్ది, అన్ని సొగసులు దిద్ది, అన్ని నయగారాలు కూర్చి, అంత సౌకుమార్యాన్ని చేర్చి, అందాలు పేర్చి అందించిన ఆ అదృశ్య హస్తం ఎవ్వరిదా అని విస్తు పోతాం!
పూలు పలకరిస్తాయి. పూలు ఊసులు చెబుతాయి. కొన గోటితో త్రుంచ బోతే విలపిస్తాయి. తల్లి కొమ్మనుండి, తండ్రి రెమ్మ నుండి , నిర్దయగా వేరు చేయ బోతే, వద్దని వేడుకుంటాయి. దీనంగా అర్ధిస్తాయి.

అలాంటి పువ్వులను గురించి కొన్ని కబుర్లు ఇవాళ చెప్పుకుందామా?

అలరు, కుసుమము, నన, విరి, పుష్పము, పూవు, ప్రసవము, ప్రసూనము, ఫల్యము, లతాంతము, సుమము, సూనము, సౌమనస్యము ...వీటన్నింటికీ పువ్వు అనే అర్ధం

( ఇంకా ఉన్నాయి లెండి !)

పూలలో ఉండే మకరందాన్ని తుమ్మెదలు స్వీకరిస్తాయి. అందుకే కవి ‘ పూల కంచాలలో రోలంబులకు, రేపటి భోజనము సిద్ధ పరచి పరచి ... ’ ఆ దేవ దేవుడు ఎంత అలసి పోయాడో అని బెంగ పడతాడు.

విరహతాపాన్ని పెంచి, స్త్రీపురుషులను ఏకశయ్యానువర్తులుగా చేసే మన్మథుడికి కుసుమాయుధుడు, పుష్పబాణుడు, అలరు విల్తుడు ... ఇలాంటి పేర్లు ఉన్నాయి. పూల బాణాలు ధరించిన వాడు అని వాటి అర్ధం,

మదనుడు పంచ బాణుడు. ఐదు రకాల పూలను బాణాలుగా ఉపయోగించే వాడు. ఆ అయిదు రకాలూ ఏమిటో తెలుసా?

అరవిందము, అశోకము , చూతము , నవ మల్లిక, నీలోత్పలం.
సరే, పూలు పలకరిస్తాయి అనుకున్నాం కదూ? ... చూడండి :

పూల బాసలు తెలుసు యెంకికీ, తోట
పూల మనసు తెలుసు యెంకికీ!
పూల మొక్కల నీటి జాలుగని నిలుసు
పూలన్ని నీ పాటె
ఆలించె నంటాది !

పూల బాసలు తెలుసు యెంకికీ ...అని, నండూరి వెంకట సుబ్బారావు గారు ఎంకి పాటల (కొత్త పాటల) లో పూల బాసల గురించి చెప్పారు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో తనని త్రుంచబోయిన వాని గుండె కరిగి పోయేలా విలపిస్తూ తన గోడు చెప్పుకున్నది. మా ప్రాణము తీతువా ! అని బావురుమన్నాయి. తల్లి ఒడిలో చిగురుటాకుల శయ్య మీద హాయిగా నిదురించే మమ్ము చిదిమి, అమ్ముకుంటావా? మనసు లేని నీ పూజ లెందుకోయి ? అని అడిగాయిట, పూలు...
మా ఆయువు నాలుగు గడియలే కదా, ఆయువు కలిగినంత దాక మా తీవ తల్లి చేతులలో హాయిగా ఊయలలూగుతూ మురిసి పోతూ ఉంటాము. ఆయువు తీరాక ఆ తల్లి పాదాల చెంతనే రాలి పోతాము

మా పూల సువాసనలతో గాలి పరిమళిస్తుంది. తుమ్మెదలకు తేనెల విందు చేస్తాము. మీ వంటి వారి కన్నులకు కనువిందు చేసి హాయిని కలిగిస్తాము. అలాంటి మమ్మలని చిదిమి వేయడం తగునా ? తల్లీ బిడ్డలని వేరు చేస్తావా ?

మమ్ములను త్రుంచడం వల్ల నీ చేతులు మా రక్తధారలతో తడిసి పోతాయి. అలాంటి నెత్తురు పూజని పరమేశ్వరుడు స్వీకరించడు సుమా!

నువ్వే కాదయ్యా, మీ ఆడువారూ మాకు హాని చేయడంలో ఏమీ తక్కువ తిన లేదు ...

ఊలు దారాలతో గొంతుకురిబిగించి,
గుండె లోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి,
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట ! దయ లేని వారు మీ ఆడువారు !

మా నెత్తురులతో చేసిన అత్తరులను మీ కంపు గొట్టు దేహాల మీద అలము కుని శయ్యల మీద వెద జల్లు కుని రాత్రంతా దొర్లుతారు. సిగ్గు లేదూ?

మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి, నశించి పోయె , మా
యౌవన మెల్ల కొల్ల గొని ఆ పయి చీపురు తోడ చిమ్మి, మ
మ్మావల పార బోతురు గదా ! నరజాతికి నీతి యున్నదా?

అని పూలు చీవాట్లు పెట్టాయి ....

గౌతమీ కోకిల బిరుదాంకితులు వేదుల సత్య నారాయణ శాస్త్రి గారి కాంక్ష కవితా ఖండికలో పూల మనోభావాలు ఎలా ప్రతి ఫలించాయో, చూడండి ... మచ్చుకి ఒకటి రెండు పద్యాలు ...

పేదల రక్త మాంసములఁబెంపు వహించి, దయా సుధా రసా
స్వాద దరిద్రు లైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం
దూదర వోవు పాడు బ్రతుకొక్క నిమేషము సైప నాయెదన్

పేదల రక్తమాంసాలతో బలిసి, దయ ఒక్కింత కూడ లేకుండా, మతోన్మాదాన్ని ఎక్కువ చేస్తూ, దేవుడి పేరుతో నిలబెట్టిన రాతి బొమ్మల మెడలలో పూజకై నిలిచి, వాడి పోయే ఆ పాడు బ్రతుకు నాకు వద్దు.

కానుకనై ధరాధిపుల కాళ్ళ కడం బొరలాడి వాడి పో
లేను, ధరా పరాగపటలీ మలినమ్మగు ద్వార తోరణా
స్థానము నందురింబడఁగ జాలను, దోసిట పేరి ఘోర కా
రా నరకమ్ము నందుసురు రాల్పగ లేను నిమేష రక్తికై

మీ క్షణికానందం కోసం - రాజుల కాళ్ళ దగ్గర కానకనై పొర్లి వాడి పోవడం నాకు సమ్మతం కాదు.
ధూళి ధూసరితమైన ద్వారాలకు తోరణాన్నయి ఉరి వేసు కోవడం నాకు నచ్చదు.
మీ చేతుల కారాగారంలో మ్రగ్గి పోలేను.

మరి పువ్వు ఏమి కోరుకుంటున్నది? ... చూడండి ...

నీచపు దాస్య వృత్తి మన నేరని శూరత మాతృ దేశ సే
వా చరణమ్ము నందసువు లర్పణఁజేసిన పార్ధివ
శ్రీ చెలువారు చోటఁ దదసృగృచులన్ వికసించి, వాసనల్
వీచుచు, రాలి పోవగ వలెం దదుదాత్త సమాధి మృత్తికన్

దేశం దాస్యంలో మ్రగ్గి పోవడం సహించ లేక, ధేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారి పార్ధివ శరీరాలు ఉండే సమాధుల మీద వాసనలు వెదజల్లుతూ వికసించి, అక్కడే, ఆ పవిత్రమైన మట్టి లోనే వాడి వత్తలై పోవడం నాకు చాలా ఇష్టం ...

ఎంత గొప్ప భావనో కదూ , యిది?

మరి కొన్ని పూల ముచ్చట్లు చూడండి ...

పూల కయ్యాలు:

అరణపు కవి నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లో పారిజాతపుష్పం కోసం ఎంత రచ్చ అయి పోయిందో మీకు తెలిసినదే కదా!

తగవుల మారి నారదుడు ఒకే ఒక్క పారిజాతం తెచ్చి ,శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. దానినతడు దేవేరి రుక్మిణికి ఇచ్చాడు. ఆ సంగతి సత్యభామకి తెలిసి పోయింది. ఇంకేముంది ! ఆవిడ అలగడం, పతి నుదుటున తన్నడం, అతడామెను బుజ్జగించి, దేవేంద్రుని ఎదిరించి మొత్తం పారిజాతవృక్షాన్నే దేవ లోకం నుండి పెకలించుకుని వచ్చి సత్య ఇంటిలో పెరటి చెట్టుగా నాటడం ... చక చకా జరిగి పోయాయ్ ...

ఆ పారిజాతం మహిమ ( నారదుని మాటల్లోనే ) ఎలాంటిదంటే,

పరిమళము సెడదు, వాడదు
పరువము దప్పదు పరాగభర భరితంబై
నిరతము జగదేక మనో
హరమగు నీకుసుమ రాజమంబుజ వదనా.

ఆ పువ్వుని తనకివ్వక తన సవతి రుక్మిణికి యిచ్చినందుకు కోపించి, ఒళ్ళూ మీదా కానక అలక పానుపు మీద పరుండి, అనునయించ బోయిన మగని కాలితో తన్నిందిట సత్య.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం
దొలగంద్రోచె లతాంగి; యట్లయగు ; నాధల్నేరముల్సేయఁబే
రలుకం జెందిన  కాంత లుచిత వ్యాపారమల్నేర్తురే ?

తన తప్పు సైరింపుమని ఆమె పాదాల కడ తల పెట్టిన నాధుని తలని సత్య ఎడమ పాదంతో తన్నిందిట ! ప్రియ నాధులు తప్పులు చేస్తే, అలక చెందిన ఆడువారు ఉచితానుచితాలు చూడరు కదా ? ... అని, కవి సమర్ధన.

ఈ పద్యం చూడండి:

నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబుఁదెచ్చె, నో
మల్లియ లార ! మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే ?

భాగవతంలో పోతన గారి పద్యం ఎంత మనోహరమైనదో చూడండి.

నల్లని వాడు. పద్మాల వంటి కళ్ళు కల వాడు. దయా పూరితములైన చూపుల వాడు, తల మీద నెమలి పింఛం ధరించిన వాడు, నవ్వులు చిందించే ముఖంకలిగిన వాడు, చెలుల మాన ధనాన్ని దోచుకుని పోయాడు. ఓ మల్లియలారా ! ఆ తుంటరి మీ పొదల మాటున కాని ఉన్నాడా, చెప్పరూ ? ... ... అని గోపికలు పూలతో చేసే సంభాషణ ప్రసిద్ధమే కదా.

పూలు కూడా ఊసులాడుతాయని దీని వలన తెలుస్తోంది కదూ?

మహా భారతంలో మరో పూల కయ్యం మీకు తెలిసినదే కదా?

ద్రౌపది ముచ్చట పడిందని, భీముడు సౌగంధికాపహరణం చేయడం, ఆ క్రమంలో హనుమతో చిన్న పాటి కయ్యం, తర్వాత ఆ పువ్వుల కోసం కాపలాదారులతో చేసిన యుద్ధం ... అదో పెద్ద కథ. పూల కధ.

మరొకటి రెండు పూల ముచ్చట్లు .....

పూల చెండుతో ఫ్రియుడొకటంటే, పేము కర్రతో తా రెండనే గడుగ్గాయలూ ...

రాచరికపు రోజులలో గడసరి విటులతో పుష్ప లావికల సరసోక్తులూ ...

చెప్పాలంటే చాలా ఉన్నాయి ....

చెవిలో పువ్వు పెట్టడం ... వంటి నానుడులూ ...

పువ్వులమ్మిన చోటనే కట్టెలమ్మడం వంటి సామెతలూ ...

ఇలా చెప్పుకుంటే పూల బాసలు అనంతం కదూ!

పువ్వులనీ, పసి బిడ్డల బోసి నవ్వులనీ, ఇంద్రధనుస్సులనీ, పురి విప్పిన నెమలి పింఛాలనీ,
చిగురించిన కొమ్మలనీ, రెమ్మలనీ, తలిరాకు తల్పాన మెరిసి పోయే తుహినకణాలనీ, చంద్ర కిరణాలనీ , కోకిలల గొంతులనీ, పిట్టల కువకువలనీ, అందమైన వేకువలనీ, చల్లని సాయంత్రాలనీ, జలపాతాలనీ, ... ఇలా ఎన్నో అందాలని ప్రసాదించిన ఆ దయామయుడికి నమోవాకములతో ..

ఇప్పటికి స్వస్తి.

`

10, అక్టోబర్ 2015, శనివారం

మనం మేకలం కాదు కదా ?



ఈ శ్లోకం చూడండి:

ఏకస్య కర్మ సంవీక్ష్య, కరోత్యన్యో2పి గర్హితమ్
గతాను గతికో లోక: నలోక: పారమార్ధిక:

ఎవడయినా ఒక పని చేస్తే, వాణ్ణి చూసి, అది గర్హించ తగినిదే అయినా, మరొకడున్నూ అదే పని చేస్తాడు !

లోకం గతానుగతికమైనది. అంతే తప్ప పరమార్ధం ఏమిటా అని, ఆలోచించేది కాదు. ఇదీ శ్లోకార్ధం.

మనలో చాలా మంది ( నాకేమీ మినహాయింపు నిచ్చు కోవడం లేదు) చాలా తరుచుగా తలకాయని ఇంట్లో ఏ చిలక్కొయ్యకో తగిలించి కానీ బయటకి రాం కదా.

అసలు దానితో పని పడుతుందని కూడా ఎంచేతో అనుకోం కూడా. మరీ విరివిగా వాడేస్తే పదును తగ్గి పోతుందని మనకి లోలోపల భయం కాబోలు !

ఒకడు చేసే దానిలో ఔచిత్యం ఉందో లేదో ఆలోచించే తీరికా మనకి ఉండదు. భేషుగ్గా వాడు నడచిన దారిలోనే నడిస్తే ఓ పనై పోతుందని నమ్ముతాం. కొత్తదీ, సమస్యాత్మక మయినదీ, క్లిష్ట మయినదీ, శ్రమతో కూడు కున్నదీ అయిన త్రోవన వెళ్ళడానికి సుతరామూ మనం చాలా వరకు ఇష్ట పడం.
చక్కని రాజ మార్గ ముండగా ... అనుకుంటూ ఆ త్రోవనే గుడ్డిగా పోవడానికే యిష్ట పడతాం.

అనుసరణ తప్పేమీ కాదు. మేలు బంతి లాంటి ఒరవడిని అనుసరిస్తూ పోవడం అభిలషణీయమే.
పెద్దలు చూపిప బాటలో పయనించడం సముచితమే. కాని, అంధానుకరణ, అంధానుసరణ తప్పేమొ కాస్త ఆలోచించాలి.

ఒక మేక పోయి గోతిలో పడితే మిగతా మేకలు కూడా దానినే అనుసరిస్తూ పోయి అదే గోతిలో పడతాయంటారు.

మనం మేకలం కాదు కదా ?

లోకం గతాను గతికం అనడానికి ఎన్నో ఉదాహరణలు చూపించ వచ్చును.

నా వరకు, ఒక ప్రాక్టికల్ జోక్ చెబుతాను.

ఒక పుణ్య క్షేత్రానికి మేము వెళ్ళి నప్పుడు, అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. చిన్నవీ, పెద్దవీనూ.

నాకెందుకో చప్పున మీది శ్లోకం గుర్తుకు వచ్చింది. సరే, ప్రాక్టికల్ గా ఆ శ్లోకం లో ఎంత వాస్తవం ఉందో చూదామన్న చిలిపి ఊహ వచ్చింది, (అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి లెండి.)

వెంటనే కిందకి వంగి, ఒక చిన్న పాటి రాయిని ఎంచి, మరీ తీసి, కళ్ళకి అచ్చం మూడు సార్లు అద్దు కున్నాను. తర్వాత, దాన్ని మూడు పర్యాయాలు ముద్దు కూడా పెట్టు కున్నాను. ఆ పిమ్మట దానిని భద్రంగా, భక్తిగా, నా చేతి సంచీలో ఉంచి, ముందుకు సాగేను.

కొంత దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చూసేను.

అంత వరకూ ఆ దారమ్మట మామూలుగా నడుస్తున్న వాళ్ళలో చాలా మంది నాలాగే కిందకి వంగడం, ఓ రాయిని తీయడం, దానిని మూడు సార్లు కళ్ళకి అద్దు కోవడం, మూడు సార్లు ముద్దు
పెట్టు కోవడం, తర్వాత, దానిని వారి జేబులోనో, బేగ్ లోనో, భద్రంగా ఉంచి ముందుకి కదలడం !

(అచ్చం, నేను చేసినట్టుగానే !) ... ఇదీ వరస !

అక్కడ ఆ రోజున నేను తప్ప నా ముందు నడిచిన వారెవరూ అలా చేయ లేదు.

నా తరవాత వచ్చిన వారిలో చాలా మంది మాత్రం నాలాగే చేసారు !

ఇప్పుడు చెప్పండి, గతాను గతికో లోక: కదూ ?




స్వస్తి.

8, అక్టోబర్ 2015, గురువారం

మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?! హన్నా !





నీ ముఖ పుస్తకం తగలెయ్యా, మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?! హన్నా !


ఒక శ్లోకం చూడండి:


అసంభావ్యం న వక్తవ్యం, ప్రత్యక్ష మపి దృశ్యతే

శాలి తరతి పానీయం, గీతం గాయతి వానర:


నువ్వు ప్రత్యక్షంగా చూసినదే అయినా, అది అసంభవమైన విషయం అయితే మట్టుకు దాని రించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్ప వద్దు సుమీ !


ఎందుకంటే, ‘ నీటి మీద రాయి తేలింది. కోతి పాటలు పాడింది’ అని చెబుతే ఎవరయినా నవ్వుతారే కాని నీ మాటలు నమ్మరు సుమా ! అని, ఈ శ్లోక భావం.


అసత్యం వ్యాప్తి చెందేంత త్వరగా సత్యం వ్యాప్తి చెందదు మరి. అసత్యానికి వెయ్యి కాళ్ళు, వినడానికి లక్ష చెవులు. తిరిగి వ్యాపింప చేయడానికి కోటి నోళ్ళు ఉంటాయి.


పాపం సత్యానికి అంత సీను లేదు. అలాగని సత్యం పలక వద్దని కాదు సుమా.


సత్యం వద. సత్యమే పలకాలి. ధర్మం చర . ధర్మాన్ని ఆచరించాలి.


వానర ఉవాచ :


బావుందిరా నాయనా, బావుంది. ఏవో శ్లోకాలూ గట్రా పెట్టుకుని పిచ్చి రాతలేవో రాసుకుంటూ ఉంటే సరే లెమ్మని ఊరు కున్నాను.


ఏం చేస్తాంలే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం.


కొందరికి సెల్ఫీల పిచ్చి


కొందరికి సింగపూర్ పిచ్చి


కొందరికి ర్యాంకుల పిచ్చి


కొందరికి బ్యాంకుల పిచ్చి


కొందరికి కవితల పిచ్చి


కొందరికి కోకల పిచ్చి


కొందరికి బైకుల పిచ్చి


కొందరికి లైకుల పిచ్చి


కొందరికి తాగుడు పిచ్చి


కొందరికి వాగుడు పిచ్చి


అందు చేత నీ రాతలేవో నువ్వు రాసుకుంటూ, నీ ఏడుపేదో నువ్వుడువ్


కానీ,


మధ్యలో నన్నెందుకు లాగుతావూ !?


హన్నా !

3, అక్టోబర్ 2015, శనివారం

శేషం కోపేన పూరయేత్ !



ఫ్రశ్నించడం మానవ నైజం, అది నైజమే కాదు; హక్కు కూడా. నిలబెట్టి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది? ప్రశ్నించడం లోనుండే కదా, ప్రగతి ప్రభాత కిరణాలు పొడసూపేది?

కాదంటే ఎలా ? కోపగిస్తే ఎలా ? ఎందుకు? అనడిగే వారుంటేనే కదా, ఎందుకో తెలిసేది ?

అలా అడిగిన సందర్భాలు కొన్నింటిని ఇక్కడ చూదాం ...

అన్నమయములైన వన్ని జీవమ్ములు
కూడు లేక జీవ కోటి లేదు
కూడు తినెడి కాడ కుల భేద మేలకో?
కాళికాంబ ! హంస ! కాళికాంబ !

(కాళికాంబ శతకం - పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి)

లోకాన జీవ రాసులన్నీ తిండి తిని బతికేవే. తిండి లేక పోతే జీవ కోటి ఉనికే లేదు. మరి, మన మానవులలో తిండి తినేటప్పుడు కుల భేదం ఎందుకు చూపుతారో, తెలియదు.

ఎక్కడి మంత్రతంత్రము లవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషంబులవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక, పూర్వ కృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్ట కూటికిది వేషమయా శరభాంక లింగమా !

మంత్రాలంటావు , తంత్రాలంటావు ! అన్నీ ఒట్టి అబద్ధాలు. చక్రాలు వేస్తావు.భవితవ్యాన్ని చెబుతానంటావు. పాచికలతో పరమార్ధం తెలిసి పోతుందంటావు. జ్యోతిషం చెబుతావు, జరిగినదీ, జరగబోయేదీ .. అంతా ట్రాష్. హేతువులంటావు, ప్రశ్నలు అడిగితే కనులు అరమోడ్చి, ఎక్కడికో వెళ్ళి పోయినట్టు అభినయించి, ఠక్కున భూత భవిష్యద్వర్తమానాలకు చెందిన వాటి గురించి జవాబులు చెబుతానంటావు. ఇదంతా మోసం. దగా. కుట్ర. మనం చేసుకున్న ధర్మాల పుణ్యమే సత్యం (?) ఈ మంత్రాలూ, తంత్రాలూ, చక్రాలూ, పాచికలూ, ప్రశ్నలు వేయడాలూ, జ్యోతిషాలు చెప్పడాలూ, అన్నీ కొంత మంది పొట్ట పోసుకోవడం కోసం వేసే వేషాలు తప్ప మరొకటి కాదు. అది నిజం. అంటాడు శరభాంకుడు.

ధూమ కేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు
కేతువా యది ? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా !

అరుదుగా మిను చప్పరంబున
చొప్పు తెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుద్ధులు
బెదిరి యెంచిరి కీడుగా ...

అంటూ తోక చుక్క కనిపించడం అనర్ధదాయకంగా భావించడాన్ని గురజాడ నిరసించాడు.
అదంతా కవుల కల్పన అన్నాడు. తోక చుక్క భూమికి దూరపు చుట్టం అని చెప్పాడు. దారిన పోతూ చుట్టపు చూపుగా చూసి పోయే తోక చుక్క గురించి ఆందోళన ఎందుకని అడిగేడు.

తుదకు, వర్ణ భేదాలు చెరిగి పోయి, మతము లన్నీ మాసి పోయి,తెలివి ఒక్కటే నిలిచి వెలుగుతుందనీ, ఎల్ల లోకం ఒక్క ఇల్లవుతుందనీ ఆశించేడు. కవి కామన ఇంకా సుదూర తీరం లోనే ఉన్నట్టుంది. అదలా ఉంచండి ...
ప్రశ్నించే సోక్రటీస్ ను, కందుకూరిని, రాజారామ మోహనుడిని, త్రిపురనేనిని ... ఇలా చాలా మందిని ఒక్క సారి స్మరించుకుని, మరి రెండు మూడు సంధించిన ప్రశ్నాస్త్రాలను కూడా చూదాం,

పశుశ్చే న్నిహిత: స్వర్గం , జ్యోతిష్ఠోమే గమిష్యతి,
స్వపితా యజమానేన, తత్ర కస్మా న్న హింస్యతే

స్వర్గం లభించాలని, యాగ పశువులను బలి చేస్తున్నావు. అవి నేరుగా స్వర్గానికే పోతాయని దబాయిస్తున్నావు. మరయితే, నోరు లేని ఆ జీవాలను బలి పేరిట చంపడం కన్నా, యాగంలో స్వయంగా నీ తండ్రి గారినే బలి ఇవ్వరాదూ ? చక్కా, సరాసరి స్వర్గానికి పోతాడు కదా ? అలా ఎందుకు చేయవయ్యా ?

స్వర్గ: క ర్తృ క్రియా ద్రవ్య , వినాశో యజ్వనాం,
తతో దావాగ్ని దగ్ధానాం , ఫలం స్యాద్భూరి భూరుహామ్

యఙ్ఞం లో సమిధలు, ఆజ్యం లాంటి హోమ ద్రవ్యాలను ఎన్నింటినో వ్రేల్చుతావు. అవి హుతమై, మీది కెగిసి, నీకు స్వర్గాన్ని ఇస్తాయంటావు ? తెలిక అడుగుతానూ , అలా చేయడం వల్ల నీకే స్వర్గం వస్తే, అడవిలో కార్చిచ్చు
చెల రేగినపుడు ఎన్నో చెట్లు అగ్నికి ఆహుతయి పోతూ ఉంటాయి. వాటన్నింటికీ అదే స్వర్గ ఫలం వస్తుందంటావా?

మృతానామపి జంతూనాం , శ్రాద్ధం చే తృప్తి కారణమ్
నిర్వాణస్య ప్రదీపస్య, స్నేహ: సంవర్ధయేచ్ఛిఖామ్

చచ్చిన వారికి పిండాలు పెట్టి, శ్రాద్ధ కర్మలు చేస్తే ఆ మృతులకు తృప్తి కలుగుతుందంటావు. మరయితే, ఆరి పోయిన దీపం నూనె పోయగానే వెలిగించకుండానే వెలగాలి కదా ?

(మీది మూడు శ్లోకాల కర్త కృష్ణ మిశ్రుడు - ప్రబోధ చంద్రోదయం)

ఇది చార్వాకం. వీటికి మన వాళ్ళు ఘూటుగానే జవాబులు చెప్పారనుకోండి ... ఏమయినా, నిలదీసి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది?

జవాబులు చెప్పలేని చిక్కు ప్రశ్నలే అడిగాడనుకో, ఈ సూత్రం ఎలానూ ఉంది:
శేషం కోపేన పూరయేత్ ! ... ... ...





29, సెప్టెంబర్ 2015, మంగళవారం

మనం రూపాయి బిళ్ళలం కాదు కదా ?!



మనం తరుచుగా అతిథి, అభ్యాగతుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా.
అతిథి అంటే తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అభ్యాగతుడు అంటే పర్వ దినాలలోను, భోజన కాలం లోను వచ్చే వాడు.
సరే, భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం యిచ్చారు. అతిథి సేవను నిష్ఠతో పాటించే వారు.

అతిథి సేవకు చెందిన కొన్ని మంచి మాటలు ఇక్కడ చూదామా?

అతిథిర్బాలక: పత్నీ, జననీ జనకస్తథా,
పంచైతే గృహిణ: పోష్యా , ఇతరే చ స్వశక్తిత:

అతిథులను, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను - ఈ ఐదుగురినీ గృహస్థు తప్పకుండా సేవించు కోవాలి. వీరిని నిష్ఠగా పోషించాల్సిన కర్తవ్యం ఇంటి యజమానిదే. ఇక తక్కిన వారినంటారా, యథా శక్తి పోషించ వచ్చును.

అయితే, కవి ఇక్కడ మరో విషయం కూడా హెచ్చరిస్తున్నాడు.

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా
ఏతే విత్తం న జానంతి, జామాతా చైవ పంచమ:

అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు ! అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా , లేక పోయినా తమకి సేవలు చేయించు కుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ , వేధిస్తూ ఉంటారుట.

అయినా, ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం.

అతిథిర్యస్య భగ్నాశో, గృహాత్ ప్రతి నివర్తతే
స తస్మై దుష్కృతం దత్వా, పుణ్య మాదాయ గచ్ఛతి.

అతిథి సేవను సక్రమంగా చేయని వాడికి ఎలాంటి ఫలితం ఉంటుందో కవి చెబుతున్నాడు.

ఎవరి ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో, ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు, తన యొక్క చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళి పోతాడు. అంటే, అతిథి సేవ చేయని వాడు మునుపు చేసికొన్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాక, కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టు కుంటాడని అర్ధం.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంసభక్షణమ్.

అతిథి వాకిట ఉండగా వానిని విడిచి పెట్టి గృహస్థు తాను ఒక్కడే భుజించడం మహా దోషం సుమా.
అలాంటి వారు అన్నం తినడానికి కూర్చుంటూ పట్టే ఔపోశనం సురాపానంతో సమానం. వాళ్ళు తినే అన్నం గోమాంసంతో సమానం.

మను చరిత్రలో పెద్దన గారి ప్రవరుని అతిథి సేవాతత్పరత ఎలాంటిదో చూడండి:

తీర్ధ సంవాసులే తెంచి నారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన

నేఁగి, తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు

నిచ్చి, యిష్టాన్న సంతృప్తులుగాఁజేయు
చేసి, కూర్చున్నచో చేర వచ్చు

వచ్చి, యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి
త్తీర్ధ మాహాత్మ్యముల్ తెలియ నడుగు

అడిగి యోజన పరిమాణ మరయు, నరసి,
పోవలయుఁజూడఁగా ననుచు నూర్పులు నిగుడ్చు
నను దినము తీర్ధ సందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరు ణాగ్ని హోత్రి

తీర్ధ యాత్రలకు పోతూ ఎవరయినా వస్తున్నారని వింటే చాలు, నిత్యాగ్ని హోత్రడైన ప్రవరుడు ఎంత దూరమైనా సరే , వారికి ఎదురుగా వెళ్ళి, పాదాభివందనం చేసి తన యింటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని వేడు కుంటాడు. వారిని తన యింటికి తోడ్చుకుని పోయి భక్తియుతంగా ఆతిథ్యం యిస్తాడు.ఇష్గ మృష్ఠన్నాలతో వారిని తృస్తి పరుస్తాడు. ఆతర్వాత వారి చెంత చేరి దేశ దేశాలలో ఉండే వింతలూ విశేషాలూ, పుణ్యతీర్ధాలూ వగైరాల గురించి అడిగి, తెలుసుకుని , ఓ సారి చూసి రావాలి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తాడు. అలా ఉండాలి , అతిథి సేవ అంటే.

భాగవతంలో రంతి దేవుని అతిథి సేవ ఎట్టిదో తెలిసినదే కదా

రంతి దేవుడు తన సంపదలన్నీ దాన ధర్మాదులకి సమర్పించి, నిరు పేదయై, భార్యా పిల్లలతోఎనిమిది దినాలు పస్తులు ఉన్నాడు. ఒక నాడు అతనికి దైవవశాన నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. భుజిద్దామని కూర్చున్నాడో, లేదో, ఒక అతిథి వచ్చేడు.

అతిథి భూసురుఁడొక్క డాహార మడగిన గడపక ప్రియముతో గారవించి

హరి సమర్పణ మంచు నన్నంబులో సగమిచ్చిన భుజియించి యేగె నాతఁ

డంతలో నొక శూద్రుఁడశనార్ధియై వచ్చి, పొడసూప లేదనబోక తనకు

నున్న యన్నము లోన నొక భాగ మిచ్చిన సంతుష్టఁడై వాడు సనిన వెనుక

కుక్క గమియు దాను నొక్కక డేతేర నా
యన్న శేష మిచ్చి, సన్నయమున
వాని మ్రొక్కి పంప వరుసతోఁజండాలుఁ
డొక్కఁడరుగు దెంచి, చక్క నిలిచి ...

రంతి దేవుడు అన్నదానాన్ని హరి సమర్పణంగా భావించి, తనకు లభించిన దానిలో కొంత అన్నమును వానికిచ్చి, వానిని సంతుష్టుని చేసి సాగనంపేడు. ఆ తరువాత శూద్రుడొకడు ఆకలితో వస్తే మిగిలిన దానిలో సగ భాగం యిచ్చి వేసి గారవించి పంపించాడు. తరువాత కుక్కల గుంపును వెంట నిడు కొనిన వాడొకడు రాగా, వానికి మిగిలినదంతా యిచ్చి వేసి భక్తితో నమస్కరించి పంపించాడు.

తరువాత క్షుద్బాధతో వచ్చిన నాలవ జాతి వానికి దండమిడి,

అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావు మన్న ! రావన్న ! ... అంటూ వానిని సగౌరవంగా పిలిచి తియ్యని నీళ్ళు సమర్పించుకున్నాడు.

మన వారికి అతిథి మర్యాదలంటే ఇంత నిష్ఠ.

హర విలాసంలో చిరుతొండ నంబి భక్తికి ఆది దంపతులు పరీక్ష పెడితే, ఆ నంబి తన శివ భక్త్యాచార సంపత్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలిసినదే కదా.

పదకొండు రోజుల పాటు ఎడ తెగని వర్షాలు శివ మహిమ చేత కురిస్తే, అతిథి సమర్పణకు వంటలు చేయడమే కష్టమై పోయింది. యింట ఎండిన వంట చెఱకు లేకుండా పోయింది. అయినా తైలంలో ముంచిన గుడ్డలకు నిప్పు అంటించి , పొయ్యలు వెలిగించి, వంటలు చేయించాడు.

అతిథులు భుజిచనిదే తాను ఔపోసన పట్టని వ్రతం కలవాడు. అష్టకష్టాలూ పడి వంటలు ముగించినా, ఒక అతిథీ
( జంగముడూ) కనిపించక ఆశ్చర్య పోతాడు.

ముసురు పట్టిన వేళ, తమ యింటి అరుగులు మీద, పంచల క్రిందా, భస్మం పూసుకున్న వాళ్ళూ, పరమ పావన మూర్తులు, మహా శివ భక్తులూ అయిన వారు అనేకులు ఉండే వారు. ఆ రోజు ఒక్కరూ కనబడక పోవడం చూసి నంబి ఆశ్చర్యచకితుడయ్యాడు. తర్వాత అతను భక్తి పరీక్షలో నెగ్గిన తీరు ఒళ్ళు జలదరింప చేస్తుంది.

భోజరాజీయంలో ఇంటికి పోయి, బిడ్డనికి పాలిచ్చి మగిడి వత్తునని శపథాలు చేస్తూ పులితో ఆవు పలికినది:
అపరాహ్ణ వేళ యందతిథి యాకొని వచ్చి
యడిగినఁ బెట్టక కడపు వాని
గతికి ... ... ... ...

బోవు దాన, నింటికి నేఁబోయి మరల
రాక తక్కితి నేఁబుండరీక వర్య !

ఓ పులి రాజా, నేనింటికి పోయి తిరిగి నీ వద్దకు రాక పోతే, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే వాడు ఏ దుర్గతి పాలవుతాడో నాకూ ఆ చెడ్డ గతే నాకూ పడుతుంది. అని ఆవు ఒట్టు పెట్టు కుంది. అతిథులంటే అంత శ్రద్ధాభక్తులు మరి.


ఇదంతా అలా ఉంచితే, ఈ కాలంలో అతిథి సేవలు చేయాలంటే మరీ అంత వీజీ కాదు.

గేస్ ఎప్పుడు అయి పోతుందో తెలీదు. నల్లాలో నీళ్ళు వస్తాయో రావో తెలీదు. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలీదు. నగరంలో కర్ష్యూ ఎప్పుడు పెడతారో అసలే తెలీదు. కూరల ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి....

చుట్టాల చిచ్చర పిడుగులు బంతాట ఆడుతూ ఏ టీవీ అద్దాన్నో ఎప్పడు బద్దలు కొట్టేస్తారో తెలీదు.
ముచ్చట పడి చేయించుకున్న కొత్త ఫర్నీచరు ఎంతలా నాశనం కానున్నదో తెలీదు

ఇలాంటి భయాలు ఎన్నో ! అందుకే అతిథి సేవా వద్దు, గాడిద గుడ్డూ వద్దు.

మన యింటి తలుపులు మనకే తెరుచు కోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాం.

నిజానికి మీద చెప్పిన భయాలన్నీ కేవలం మన ఊహాపోహలు. కల్పనా కథలు. ముందు తరాల వారు ఇంత కంటె గడ్డు కాలం లో కూడా నిండు మనసుతో అతిథులను గౌరవించే వారు. మనుషులను ప్రేమించే వారు.

ఇప్పుడా సద్భావన ఎందుకు మృగ్య మౌతున్నదంటే,

కాలం మరి పోయి కాదు. కాని కాలం దాపురించీ కాదు.

మనలో ఉండాల్సిన దేదో మనం కోల్పోవడం చేత.



గుండెలో తగినంత తేమ లేక పోవడం చేత. మనం మనుషుల కంటె కూడా రూపాయి నోట్ల లాగానో, రూపాయి బిళ్ళల లాగానో బతకడానికి తెగ యిష్ట పడి పోతూ ఉండడం చేత. అంతేనంటారా?

26, సెప్టెంబర్ 2015, శనివారం

పొగడ దండలు రెండవ భాగం లేదా గోకుళ్ళ భాగోతం ఇంకా కాదంటే భజంత్రీలు పార్టు టూ !


లోకంలో పొగడ్తకి లొంగని వాడు లేడు. బయటకి ’అబ్బే, మీరు మరీనూ ...‘ అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, లోపల లోపల ఆ పొగడ్తలకి పొంగి పోతూనే ఉంటాడు. మరి కాస్సేపు పొగిడితే బావుండునని అనుకుంటూ ఉంటాడు.తనని పొగిడే వాడి కోసం ఏం చేయడానికయినా సిద్ధ పడి పోతాడు.పొగడ్తల మహిమ అలాంటిది మరి !

ఆడవాళ్ళయితే ఈ పొగడ్తలకి మరింత తేలికగా వశులై పోతారనే అభిప్రాయం కూడా లోకంలో ఉంది. మగరాయళ్ళు ఆ బలహీనతను బాగా ఉపయోగించు కుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

పూర్వ కాలంలో రాజులు ఈ పొగడ్తలు చెవిని పడనిదే శయ్య దిగే వారు కాదు. కనులు తెరిచే వారు కాదు. భట్రాజులు రకరకాలుగా పొగుడుతూ ఉంటే కాని వారి అడుగు ముందుకి పడేది కాదు.

రాజకీయ నాయకుల చుట్టూ చేరే అనుచర గణం ఆ నాయకుని ప్రతి మాటకీ చర్యకీ వత్తాసు పలుకుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. దానితో సదరు నాయకమ్మన్యుడు భూమికి ఓ అడుగు ఎత్తున విహరిస్తూ ఉంటాడు.

పొగడ దలచిన వాడెప్పుడూ స్వీయ ప్రయోజనం నెర వేరాలనే ఆలోచిస్తాడు. ఎవడిని పొగుడు తున్నాడో వాడిలో అతనికి ఏ లోపాలూ కనిపించవు. అన్నీ సుగుణాలే మిల మిలా మెరిసి పోతూ ఉంటాయి. ధగ ధగా వెలిగి పోతూ ఉంటాయి.

కూరిమి గల దినములలో నేరము లెన్నడూ కనిపించవు కదా ! ఆ కూరిమి విరసమై నప్పుడే కదా, అన్ని దోషాలూ కనిపిస్తూ ఉంటాయి.

అందు వలన ఇవాళ పొగిడిన వాడు రేపు పొగుడుతాడనే గ్యారంటీ లేదు. పొగిడినా, మునపటి స్థాయిలో పొగుడుతాడనే భరోసా లేదు.

నీ ప్రభ వెలుగుతున్నంత కాలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తిన వాడే రేపు నిన్ను నిర్ధాక్షిణ్యంగా తిట్టి
పోయడానికి వెనుదీయడు.

నువ్వు ఇంద్రుడివనీ, చంద్రుడివనీ, అదనీ ఇదనీ , తెగ పొగిడిన నోరే తెగనాడుతుంది.

నీ ముందు పాదాక్రాంతుడైన వాడే నీ ముఖాన ఛీత్కరించుకు పోతాడు.

సరే, ఇదంతా కాస్సేపు ప్రక్కన పెడితే.

ఎవరెవరిని పొగడాలో ఎవరిని అస్సలు పొగడ కూడదో కవి గారు ఒక శ్లోకంలో చెబుతున్నారు.

చూడండి:

ప్రత్యక్షే గురవ: స్తుత్యా:, పరోక్షే మిత్రబాంధవా:
కర్మాంతే దాసభృత్యాశ్చ, న కదాచన పుత్రకా:

గురువులను ఎదుట పొగడ వచ్చును.
బంధువులను, మిత్రులను వారి పరోక్షంలో మాత్రమే పొగడాలి.
సేవకులను, వారి విధి నిర్వహణ పూర్తయేక పొగడాలి.
పుత్రులను మాత్రము ఎన్నడూ పొగడ కూడదు సుమా !

గురువులు ఙ్ఞాన ప్రదాతలు. వారి గొప్పతనాన్ని వారి సముఖాన పొగిడితే దోషం కాదు. వారు స్థిత ప్రఙ్ఞులు కనుక మనం పొగిడినంత మాత్రాన పొంగి పోరు. పొగడక పోతే చిన్నబుచ్చు కోరు.

బంధువులు . స్నేహితులు ... వీరి గురించి ఎట్ట ఎదుట పొగడ కూడదు. మరీ అంత భజన పనికి రాదు. మరీ పొగుడుతూ ఉంటే వారి కళ్ళు స్థాన భ్రంశం చెందే అవకాశం కూడా ఉంది.

ఇక, పని వాళ్ళని ఎప్పుడు పొగడాలయ్యా, అంటే, వాళ్ళ పని, వాళ్ళు సక్రమంగా పూర్తి చేసిన తరువాత మాత్రమే పొగడాలి.

మా పనమ్మాయి అంత మంచిది, ఇంత మంచిది, అంత పనిమంతురాలు, ఇంత పనిమంతురాలు అంటూ ఆమె పని చేయక ముందే పొగిడితే ఉబ్బి తబ్బిబ్బయి పోయి మనతో పాటు టీ.వీ చూస్తూ కూర్చుంటుంది, కమ్మని కాఫీ ఇస్తే చప్పరిస్తూ ...

చివరిగా ఎవరిని ఎప్పుడూ పొగడ కూడదో కూడా చెబుతున్నాడు కవి, పుత్రులను అసలు ఎప్పుడూ పొగడనే కూడదట.

అలా పొగడడం వారికి ఆయుక్షీణం అని మన వారి నమ్మకం కూడానూ.

పుత్రులను పొగడరాదని చెప్పడానికి ప్రచారంలో ఉన్న ఓ కథని చూదాం ...

కిరాతార్జునీయమ్ వ్రాసిన భారవి గురించిన ఈ కథ లోకంలో ప్రచారంలో ఉంది.

యువకుడైన భారవి కవిత్వాన్ని, గొప్పతనాన్ని మెచ్చు కుంటూ అందరూ తెగ పొగుడుతూ ఉంటే, భారవి తండ్రి మాత్రం కొడుకు గురించి ఒక్క మెచ్చుకోలు మాటా అన లేదుట.

దానితో భారవికి విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. తండ్రి బుర్ర బ్రద్దల కొట్టేద్దామా అన్నంత ఆగ్రహం కలిగింది.

అదే పని మీద ఓ రాత్రి ఒక పెద్ద బండ రాయిని పట్టుకుని అటక ఎక్కి కూర్చున్నాడు. రాత్రి పూట తండ్రి గారి బుర్ర మీద దానిని గిరాటు వేసి, తనని పొగడని తండ్రి గారి మీద తన కసి తీర్చు కోవాలని అనుకున్నాడు.

సరే, రాత్రయింది. భారవి తల్లిదండ్రులు అక్కడకి చేరి మాట్లాడుకుంటున్నారు. అదను కోసం చూస్తున్న భారవి చెవిని ఆ మాటలు పడుతున్నాయి.

‘‘లోకమంతా మన భారవి కవిత్వాన్ని ఇంతలా మెచ్చు కుంటూ ఉంటే, మీరేమిటండీ వాడి గొప్పతనాన్ని గురించి ఒక్క మాటా అనరు ? వాడిని పొగిడితే మీ నోటి ముత్యాలేమయినా రాలి పోతాయా ? ’’ అని నిష్ఠూరంగా పలికింది తల్లి.

దానికాయన, ‘‘ పిచ్చి ముఖఁవా ! ( పెళ్ళాల వెప్పుడూ పిచ్చి ముఖా లే కదా, హత విధీ !!) భారవి గొప్ప తనం నాకు తెలియదుటే? వాడు ఎంత గొప్ప కవిత్వం వ్రాస్తున్నాడో చూస్తున్నాను. వాడి గొప్ప తనం చూసి ఎంతగా పొంగి పోతున్నానో, నీకేం తెలుసు? అయితే, మన బిడ్డని మనం పొగడ కూడదు. అది వాడికి శ్రేయస్కరం కాదు. అంచేత వాడిని పొగడడం లేదు కానీ , వాడంటే ఇష్టం లేక కాదు సుమీ ! ’’ అన్నాడు.

అంతే !

భారవి కవి ఆగ్రహమంతా మంచులా కరిగి పోయింది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి తను చేయ దలచిన ఘోరకృత్యం గురించి చెప్పి, తన పాపానికి తగిన శిక్ష విధించ మని కోరాడు.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. శిక్ష విధించి తీరాలని పట్టు పట్టేడు.

‘‘సరే, ఓ యేడాది పాటు మీ అత్తారింట గడిపి రా ! ’’ అని తండ్రి శిక్ష విధించాడు.‘ ఇదేం శిక్ష! ’ అనుకుని భారవి ఎగిరి గంతేసి, భార్యతో పాటు అత్తారింటికి వెళ్ళాడు.

కొన్ని రోజు పాటు అత్త వారింట సకల మర్యాదలూ జరిగేయి. తర్వాత మొదలయ్యేయి, విసుక్కోవడాలూ, సణుక్కోవడాలూ, పిల్లి మీదా కుక్క మీదా పెట్టి వ్యంగ్యాస్ర్తాలూ, సూటీపోటీ మాటలూ ...

కవి గారు ఏం చేస్తారు; భరించక తప్పదు, శిక్షా కాలం యేడాదీ ముగిసే వరకూ.

ఇలా ఉండగా భార్య ఏదో నోము చేయాలనుకుంది. చేతిలో ఎర్ర ఏగానీ లేదు. భార్య కోరిక ఎలా తీర్చడం ?

భారవి అప్పుడు తను వ్రాస్తున్న కిరాతార్జునీయమ్ కావ్యం లోనుండి ఓ శ్లోకం ఉన్న తాటాకు తీసి, ఆమెకి ఇచ్చి, ఎవరిదగ్గరయినా దానిని కుదవ పెట్టి ధనం తెచ్చుకుని నోము చేసుకొమ్మన్నాడు.

ఆమె దానిని ఊర్లో ఓ ధనవంతుడయిన ఒక వ్యాపారి వద్ద కుదవ పెట్టింది. అతడు ఆ శ్లోకం చూసి, భారవి కవిత్వం గొప్ప తనం తెలిసినవాడు కనుక, ఆమెకు చాలా ధనం ఇచ్చి పంపించాడు.

తరువాత, అతడు ఆ తాళ పత్రాన్ని ఒక కత్తి ఒర లో ఉంచి, గూట్లో పెట్టాడు. ఆ పిమ్మట ఆ వణిజుడు వర్తకం కోసం చాలా ఏళ్ళపాటు దూర దేశాలకు వెళ్ళాడు.

అలా దేశాలు పట్టి తిరిగి, చాలా ఏళ్ళకి ఇంటి కొచ్చిన అతనికి తమ పడక గదిలో ఎవరో పరాయి మగాడు ఉండడం గమనించి ఆగ్రహం కలిగింది. మరో ఆలోచన లేకుండా గూట్లో ఉన్న ఓర లోనుండి కత్తిని బయటకి లాగేడు. దానితో పాటు, ఎప్పుడో తాను అందులో పెట్టిన తాళపత్రం కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా, అని చదివాడు.

అందులో భారవి వ్రాసిన ఈ శ్లోకం ఉంది:

సహసా విధధీత నక్రియామ్
అవివేక: పరమాపదాం పదాం
వృణుతేహి విమృశ్య కారిణామ్
గుణ లుబ్ధా: స్వయమేవ సంపద:

వేయి విధాలుగా ఆలోచించి కాని ఏ పనీ చేయ కూడదు. చక్కగా ఆలోచించి పని చేసిన వానికి సంపదలు తమంతట తామే సమ కూడతాయి. అని దీని భావం.

ఈ శ్లోకం చదివేక, అతని కోప తీవ్రత కొంత తగ్గింది. కాస్త చల్ల బడ్డాడు. ఈ లోగా భార్య లేచి, అతని రాకను చూసి అమితానందం చెంది, ఆ పురుషుని తమ బిడ్డగా పరిచయం చేసింది.చాలా ఏళ్ళ క్రింట తాను విదేశ గమనానికి సిద్ధ పడిన రోజులలో భార్య గర్భవతి అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చిందతని.

తొందర పడి కత్తి వేటుకి చేజేతులా భార్యనీ కొడుకునీ కడ తేర్చే వాడిని కదా అని అతడు పశ్చాత్తాపం చెందాడు. తనని తొందర పాటు నుండీ, ఒక మహా విపత్తు నుండీ కాపాడిన ఆ శ్లోక కర్త భారవికి అతడు భూరి కానుకలిచ్చి సత్కరించేడు.


ఇక, పొగడడంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్దతి అనే రకాలు కూడా ఉన్నాయండోయ్. అంటే, పొగుడు తున్నట్టుగా తిట్టడం, తిడుతున్నట్టుగా పొగడడం. వీటినే మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అంటారు. 



స్వస్తి.

21, సెప్టెంబర్ 2015, సోమవారం

సాహసం శాయరా డింభకా !



సాహసం శాయరా, డింభకా ! అన్నాడు కదా, భేతాళ మాంత్రికుడు.


పిరికి గొడ్డులా ఉంటే లోకం తరిమి కొడుతుంది. అదే, బోర విరుచుకుని తిరిగేవనుకో లోకం సాగిల పడుతుంది. వెనుక బడితేను వెనకేనోయ్ అన్నాడు కవి. సాహసం చేయ లేక పోతే ఏదీ సాధించ లేం.‘ చెట్టు లెక్క గలవా ? పుట్ట లెక్క
గలవా ?..’’ అంటూ చెంచు లక్ష్మి కూడా ఓ క్వశ్చనీర్ హీరో గారి ముఖాన కొట్టడం తెలిసిందే కదా.

మా చిన్నప్పుడు ఊళ్ళోకి సర్కస్ కంపెనీ వచ్చిందంటే పండుగే, పండుగ ! పొద్దస్తమానం ఆ డేరాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండే వాళ్ళం. సర్కసు చూసొచ్చిన కుర్రాళ్ళు ఇంటి వెనుక పెరళ్ళలో ఏవో ఫీట్లు ప్రాక్టీసు చేయబోవడం రివాజు. అలా, మా వీధి పిలగాయలు నలుగురైదుగురు కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకున్న వాళ్ళూ లేక పోలేదు. సింహాలూ. పెద్ద పులులూ దొరికే ఛాన్సు ఎలాగూ లేదు కనుక,సీమ పందికి తర్ఫీదు ఇవ్వ బోయి అది భీకరంగా నిరాకరించడంతోను, తొడ కండ పీకేలాగున తన అసమ్మతి చూపడంతోను మంచాన పడిన కుర్రాళ్ళూ ఉండే వారు.

అలాగని సాహసాలు చెయ్యకుండా ఎలా ఉంటాం చెప్పండి?

సాహసాలంటే మంటల్లో దూకడాలూ, ఎత్తుల మీంచి దూకడాలూ మాత్రమే కానక్కర లేదు.

మా డింగరి బుచ్చబ్బాయ్ తనకి సున్నా మార్కులు వేసిన లెక్కల మాష్టారి మీదకి చాటుగా గురి చూసి మెట్లంగి రాయొకటి విసర లేదూ ? అప్పుడు వాడి సాహసానికి మేఁవంతా నోళ్ళు వెళ్ళబెట్టేం కదా. సాహసం కోసం మరీ ఇంతలేసి అకృత్యాలు చెయ్యమనడం లేదు కానీ, మీ పరిధిలో మీరు ఏవో ఒకటి రెండు సాహసాలయినా చేయక తప్పదు,జీవిత కాలంలో.

తెలుగు వర్ణమాల తెలిసిందే కదా, మరింకేం - ఏ కవితో రాసి పారెయ్యండి. ధైర్యంగా ఏ తలమాసిన పత్రికకో పంపించెయ్యండి. అచ్చోసిన వాడూ, చదివిన వాడూ వాళ్ళ ఖర్మానికి వాళ్ళు పోతారు. ఇలాంటి సాహసాలు చేయడం వల్ల ఇతరులకే కానీ మనకి ప్రమాదమేమీ లేదని ఢంకాభజాయించి చెబుతున్నాను.

ఇంటావిడ ధాం ధూమ్ లాడుతూ ఉంటే , పిరికి వాడిలా ముంగిముషాణంలా కూచో వద్దు. ఒక సారయినా సాహసోపేతంగా నోరు విప్పండి. మా సత్రాయిగాడు ఓ సారి ఇలాగే ధైర్యం చేసి వాళ్ళావిడ కన్నా పెద్ద నోరు పెట్టి ’’ నవ్వన్నది నిజమేనే ...‘‘ అని గాఠిగా అరిచేడు. వాడి ధైర్యానికి ఆవిడ మ్రాన్పడి పోయింది తెలుసా?

ఓ సారి మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారి చిత్రరాజాలను గుర్తుకు తెచ్చు కోండి.



మన ఎన్టీవోడినీ,





కాంతారావునీ,


రాజనాలనీ




వీళ్ళందరినీ ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ( దేశ వాళీ వీరులనే కాక విదేశీ వీరులని కూడా స్మరించడం మీ యిష్టం)

సాహస వీరుడు, సాగర కన్య లాంటి సినిమాలు చూసి పిరికి తనం ఏ మూలనయినా ఉంటే పోగొట్టుకోండి అని నా ఉచిత సలహా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరింత వివరంగా చెబుతూ మీ సహనాన్ని పరీక్షించే సాహసం చేయ లేను.

నా బ్లాగే కదా అని ఇలా నానా చెత్తా రాసే సాహసం చేస్తున్నానని మీరనుకుంటున్నారు కదూ.అవున్నిజమే. ఇంతకీ సాహసం చెయ్యమని ఒక కవి శ్లోకంలో చెప్పిన విషయమే మీముందు ఇవాళ ప్రస్తావించ బోతున్నాను. చూడండి:

న సాహస మనారుహ్య, నరో భద్రాణి పశ్యతి
సాహసం పున రారుహ్య, యది జీవతి పశ్యతి.

ప్రమాదాలు ఎదుర్కోనిదే మానవులు కార్య సాఫల్యాన్ని పొంద లేరు .విజయాన్ని అందు కోలేరు.అందు చేత, సాహసం చేసి, జయించి, బ్రతికి ఉంటే శుభాలు పొంద గలరు అని దీని భావం.

బ్రతికి యుండిన శుభములు బడయ వచ్చు ... అనుకుంటూ ఏ సాహస కృత్యమూ చేయకుండా పిరికి తనంతో బతకొద్దని కవి ఉవాచ. సహసం చెయ్. శుభాలు పొందు. ఆ సాహసం చేయడంలో ఛస్తే పాయె. బతికి ఉంటే శుభాలు పొంద గలవు అని కవి గారు హామీ యిస్తున్నారు.

వెన్ను చూపడం, మడమ త్రిప్పడం ... వంటి జాతీయాలు కదన రంగంలో సాహసోపేతంగా ముందుకు పొమ్మని ప్రోత్సహించేవే కదా.

బ్రేవో. గో ఎ హెడ్.

సాహసాల పేరిట సొమ్ము చేసుకునే టక్కరి తనమూ సాహసమేనా? ఏమో, 1979 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో నేను రాసిన ఈ సాహసాల కథ చదివే సాహసం చేస్తే మీకే తెలుస్తుంది. చదివేక, ధైర్యం ఉంటే సాహసంతో కామెంటండి.

నా కథ చూడండి:






అక్షరాలను జూమ్ చేసుకోవడానికీ పేజీని మనకు అనువుగా తిప్పుకోవడానికీ పేజీ పైన ఉన్న గుర్తులను పాటించగలరు

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

పొగడ దండలు ! లేదా భజంత్రీలు ! లేదూ, గోకుళ్ళ వ్యవహారం



 పొగడ్తలలో రకాల గురించి చెప్పు కుందాం.

తప్పని పరి పొగడ్తలుమొహ మాటపు పొగడ్తలుబలవంతపు పొగడ్తలుబరి తెగించిన పొగడ్తలు,ముక్తసరి పొగడ్తలు యిలా చాలా రకాలు ఉన్నాయి లెండి. ఇవి పొగిడే వాడి లెవెలుని బట్టీ,పొగిడించు కునే వాడి అర్హతానర్హతలను బట్టీ కూడా మారుతూ ఉంటాయి.

ఇవన్నీ అంతర భేదాలు. పొగడ్తలన్నీ కేవలం పొగడ్తలే కాక పోవచ్చు. అవి తెగడ్తలు కూడా కావచ్చును.

మందీ మార్బలాన్ని వెంట బెట్టుకుని ఓ పత్రిక ఆఫీసులో చెల్లికి ( మళ్ళీ) పెళ్ళి అనిసొంత కవిత్వం వినిపించిన తణికెళ్ళ భరణి గుర్తున్నాడా ? అతను కవిత శీర్షిక చెప్తాడోలేదోచుట్టూ ఉన్న వాళ్ళు వహ్వావహ్వా అంటూ భజంత్రీలు వాయించేస్తారు. భరణి గారు ష్ ! నేనింకా కవిత్వం షురూ చెయ్ నే లేంటూ విసుక్కుంటారు కూడానూ.
ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు ప్రక్కన సొంత డబ్బాకి భంజంత్రీలు వాయించే మేళం మీకు గుర్తుండే ఉంటుంది.

ఎవడు కాయిన్ చేసాడోకానీసొంత డబ్బా అనే మాట చాలా విలువైనది.
డబ్బా మనదైనప్పుడు ఎంత సేపయినాఎలాగయినా వాయించు కో వచ్చును కదా.
సొంత డబ్బా సంగతి ఇలా ఉంటేఒకరి జబ్బ ఒకరు చరుచు కోవడం కూడా ఉంటుంది. నువ్వు నా జబ్బ చరిస్తేనీ జబ్బ నేను చరుస్తాను. అదీ మన మధ్య ఒప్పందం.
నువ్వు నా వీపు గోకితేనేను నీ వీపు గోకుతాను. ( నా టపాకి నువ్వు కామెంట్లు పెడితేనే నీ టపాకి నేను కామెంట్లు పెడతాను )

ఈ సూత్రం అనుసరించి భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. డబ్బాలు వాగుతూ ఉంటాయి. వీపులు గోక బడుతూ ఉంటాయి.

సరేఈ విషయం కాస్త ప్రక్కన పెట్టిపొగడ్తల రకాలు చూదాం.

మన వాళ్ళు వ్యాజ స్తుతివ్యాజ నింద అని రెండు రకాలు చెబుతూ ఉంటారు.

బయటకి పొగుడు తున్నట్టే ఉంటుంది. లోపలి అర్ధం తిట్టడమే.

బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని నిజానికి అది పొగడడమే.

వ్యాజ స్తుతి అంటేస్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.

వ్యాజ నింద అంటేనిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.

ముందుగా వ్యాజస్తుతికి ఉదాహరణలు చూదాం:
పెద్దా పురం ప్రభువు తిమ్మ రాజు వొట్టి లోభి. ఎంగిలి చేత్తో కాకికిని తోలడు. దాన దరిద్రుడు. ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి:

అద్దిర శ్రీ భూ నీళలు
ముద్దియలా హరికి గలరు ముగురందరిలో
పెద్దమ్మ నాట్య మాడును
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

శ్రీహరికి ముద్దు సతులు మువ్వురు. శ్రీభూనీళలు. వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని ఇక్కడ కవి భావం.
తెనాలి రామ కృష్ణ కవి పేర వినిపించే ఈ చాటువు చూడండి:

అన్నాతి గూడ హరుడగు
నన్నాతిని గూడ కున్న నసుర గురుండౌ
నన్నా తిరుమల రాయుడు
కన్నొక్కటి లేదు కాని కంతుడు గాడే.

కవి ప్రభువును సాక్షాత్తు శివుని తోనుశుక్రాచార్యునితోనుమన్మధుని తోను సరి పోలుస్తున్నాడు.

అయితేఈ పొగడ్తలు కండిషనల్డ్ పొగడ్తలు. ఎలాగంటే,
రాజు గారు తమ రాణీ గారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే. ఎందు కంటే, పాపంరాజు గారు ఏకాక్షి. ఒంటి కన్ను వాడు. రాణి గారి తో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివీ కలిపి మూడు కన్నులవుతాయి కనుకప్రభువులవారు ముక్కంటితో సమానం.
రాణి తో కలసి ఉండ నప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడయిన శుక్రాచార్యడితో సమానం.

శుక్రాచార్యుని వలె రాజు గారికి కూడా ఒకే కన్ను కనుక ఈ పోలిక అన్వర్ధం అంటాడు కవి.

అంతే కాదుఒక కన్ను లేదు కానీప్రభువు సాక్షాత్తు మదనుడేనట.

నగపతి పగతు పగతుని
పగతుండగు మగధ రాజుఁబరి మార్చిన యా
జగ జట్టి యన్న తండ్రికి
దగు వాహన మైన యట్టి ధన్యుండితడే.

ఈ పద్యంలో బాదరాయణ సంబంధం చిక్కు విడ దీస్తే వచ్చే అర్ధం - దున్న పోతు
అని !

నగపతి - ఇంద్రుడు
అతని పగతుడు (శత్రువు) - నరకుడు
అతని పగతుడు - శ్రీ కృష్ణుడు
అతని పగతుడు - జరాసంధుడు ( మగధ రాజు)
అతని పగతుడు - భీముడు
అతని అన్న - ధర్మ రాజు
అతని తండ్రి - యముడు
అతని వాహనం - దున్న పోతు !
ఈ పద్యంలో కవి సభలోని వారిని కసి తీరా ఎలా పొగడ్త రూపంలో తిడుతున్నాడో చూడండి:

కొందరు భైరవాశ్వములుకొందరు పార్ధుని తేరి టెక్కెముల్
కొందరు ప్రాక్కిటీశ్వరులుకొందరు కాలుని యెక్కిరింతలున్
కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు నీ సదస్సులో
నందరు నందరే మఱియునందరు నందరు నందరందరే.

సభలోని వారందరినీ కుక్కలుకోతులు,పందులుదున్న పోతులుగాడిదలు అని కవి వెక్కిరిస్తున్నాడు.

ఈ పద్యం చూడండి:

ఎఱుగుదువు సకల విద్యలు
నెఱుఁగని విఁవ రెండు కలవ వేవే వన్నన్
పిఱికి తనంబును లోభము
గుఱుతెఱుఁగవు జగతి నెన్న గువ్వల చెన్నా

కవి గారు రాజుని పొగుడుతూఇలా అన్నాడు: ఈ ప్రభువుకి అన్నీ తెలుసు. సకల విద్యలూ వచ్చును. మహా వివేకి. కాని రెండే తెలియవు . అవి ఏమంటేపిఱికి తనం అంటే తెలియదు. లోభత్వం అంటే తెలియదు. పొగడ్త అంటే శీతాకాలంలో గోరు వెచ్చని నీటి స్నానం లాగ ఇలా ఉండాలి!

చివరిగా ఓ పద్యం. ( బూతు అని వార్యం)

జూపల్లి ధర్మా రాయుడు అనే రాజు మహా పిసినారి. అర్ధులకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటాడు. ఈరప రాజు అనే బట్టు కవి అతనిని యాచించ డానికి అతని సభకి వెళ్ళి వచ్చేడు. ఆ కవికి సూరప రాజు అనే కవి మిత్రుడు ఒకడు ఉన్నాడు. రాజ దర్శనానికి వెళ్ళి వచ్చిన తన మిత్రుడైన ఈరప రాజుని చూడగానే ఆత్రతతో ప్రభువులు ఏమిచ్చారుఏమిచ్చారు అని అడిగేడు.

సూరప రాజు:

‘‘ జూపల్లె ధరాయం
డేపాటి ధనం బొసంగె నీరప రాజా ?’’
దానికి ఈరప రాజు ఇచ్చిన సమాధానం ఇదీ !
‘‘పాపాత్ముండెవ్వరికిని
చూపనిదే చూపెనయ్యసూరప రాజా !’’

ఆ పాపాత్ముడు ఎవరికీ చూపించనిది కవిగారికి చూపించేడుట.


ఇప్పుడు నిందా రూప స్తుతి చూదాం

బయటకి నిందిస్తున్నట్టే ఉంటుంది. అంతరార్ధం మట్టుకు పొగడడమే. దీనికి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం గొప్ప ఉదాహరణ. మచ్చునకు ఒక్క పద్యం చూదాం:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై
యఖిల భారకు డన్న నాఖ్యఁదెచ్చె
నిష్ట సంపన్నురాలిందిర భార్య యై
కామితార్ధదుఁడన్న ఘనత తెచ్చె
కమల గర్భుఁడు సృష్టి కర్త తనూజుఁడై
బహు కుటుంబికుఁడన్న బలిమి తెచ్చె
కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుఁడన్న ప్రతిభ తెచ్చె
అండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుఁడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ 1
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !!

శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుకి అఖిల భారకుడు, కామితార్ధదుడుబహు కుటుంబీకుడుపతిత పావనుడు అనే బిరుద నామాలు ఉన్నాయి. వాటికి వరుసగా సమస్త లోకాల భారాన్ని వహించే వాడుకోరిన కోరికలను తీర్చే వాడుపెద్ద కుటుంబం కల వాడుఅన్ని పాపాలు పోగొట్టే వాడు అని అర్ధాలు. అయితేవిష్ణు దేవునికి ఈ బిరుద నామాలు అన్నీ అతని ఇరువురి భార్యలుకుమారుడుకుమార్తెల వలన వచ్చినవే కాని అతని గొప్ప ఏమీ లేదనిఅతను తొలి నుంచి దరిద్ర దామోదరుడనీ కవి ఇందులో హేళన చేస్తున్నాడు.

నిజానికి ఇదినిందా రూపమైన స్తుతి .

సమస్త భారాన్నీ వహించే భూదేవి అతని భార్య. భర్త అంటేభరించే వాడు. అంటే సమస్త భారాన్నీ వహించే భూ దేవిని భార్యగా పొందిన హరి ఎంత ఘనుడో కదా సర్వ సంపదలనూ ప్రసాదించే లక్ష్మీ దేవినే భార్యగా పొందిన విష్ణువు ఘనత ఎన్నతరమా ?
అదే విధంగాఅన్ని ప్రాణులను సృష్టించే వానిని పుట్టించిన వాడుపాపాలు హరించే గంగను కుమార్తెగా పొందిన వాడు ఎంతటి ఘనుడో కదా.
దామోదరుడు అంటేదామము ( పద్మము) ఉదరము నందు కల వాడు అని అర్ధం.పద్మ గర్భుడు .
చిత్ర విచిత్రమయిన ప్రభావాలు కల వాడుదయా గుణము కల వాడుశత్రువులనే వారిని రూపుమాపిన వాడు శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడు.

ఇవీ నిందా రూప స్తుతిస్తుతి రూప నిందలకు కొద్ది పాటి ఉదాహరణలు.
ఇస్తే పొగడడం లేక పోతే నోటి కొచ్చినట్టు తిట్టడం కూడా ఒక కళగా మన కవులు నిర్వహించేరు.

చూడండి. వీర మల్లుడు అనే రాజు ఒక కవికి కొన్ని మాన్యాలు ఇచ్చేడు. తిరిగి ఎందుకో వాటిని లాగేసు కున్నాడు దాంతో కవి గారికి తిక్క రేగి రాజుని ఇలా తిట్టేడు:

తెగి తాఁ బొడువని పోటును
తగ నర్ధుల కీయ నట్టి త్యాగముసభలోఁ
బొగిడించు కొనుచుఁ దిరిగెడి
మగ లంజల మగడు వీర మల్లుడు ధాత్రిన్

వీర మల్లుడు వట్టి పిరికి పంద. దాన గుణం ఇసుమంత లేదు. ఎప్పుడూ చుట్టూరా తనని పొగిడే వాళ్ళని ఉంచుకుని తనివి తీరా పొగడించు కుంటూ ఉంటాడు. ఈ వీర మల్లుడు మొడుడికి మొగుడు.

ఇవీ పొగడ దండలు. స్వస్తి.