అల్లసాని పెద్దన గారి ప్రవరుడు ఏ చెప్పులూ ధరించకుండానే వొట్టి కాళ్ళతో హిమాలయాలకి వెళ్ళి ఉంటాడని మా తింగరి బుచ్చి పరిశోధనలో తేల్చాడు. సిద్ధుడు కాలికి పూసిన పాద లేపనం కరిగి పోయిందంటే ప్రవరుడు ఏ చెప్పులూ వేసుకుని ఉండడని తింగరి బుచ్చి సూత్రీకరించేడు. దీని నెవరయినా పూర్వపక్షం చేస్తే నాకు అభ్యంతరం లేదు.
ఇక చెప్పుల పద్యాలు ఒకటి రెండు చూద్దాం ...
అల్ప బుద్ధి వానికి అధికార మిస్తే దొడ్డ బుద్ధి వారిని తన్ని తరిమేస్తాడని చెబుతూ వేమన గారు ‘‘చెప్పు తినెడు కుక్క చెఱకు తీపెరుగునా ?’’ అంటాడు.
ఇలాగే వేమన పద్యాలలో చెప్పుల ప్రస్తావన మరో చోట ఉంది. చెప్పు లోని రాయి, చెవి లోని జోరీగ, కంటి లోని నలుసు, కాలి ముల్లు, ఇంటి లోని పోరు ఇంతింత కాదయా ! అంటాడు. వెల్ సెడ్ కదూ ? వాటి బాధ అనుభవించే వాడికే తప్ప మరొకడికి తెలియదు మరి ! ఈ పద్యానికి లోని రాయి గురించి చెప్పు ( ఆత్మ వివేచన చేసుకో !) లాంటి వేదాంత పరమైన అర్ధాలు కూడా మన పెద్దలు చెప్పారు కానీ, అంత సీను మనకి లేదు. దాని సంగతి వదిలేద్దాం.
వెనుకటికో అవధానిగారికి ఓ పృచ్ఛకుడు ‘‘ కప్పను గని ఫణివ వరుండు గడగడ
వణికెన్ ’’ అని సమస్య ఇచ్చేడు. దానిని అవధాని పూరించిన పద్యంలో చెప్పుల ప్రస్తావన ఉంది కనుక అదీ చెప్పుకుందాం.
కుప్పలు కావలి కాయఁగ
చెప్పులు కఱ్ఱయును బూని శీఘ్ర గతిం దా
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణి వరుండు గడగడ వనికెన్ !
ఇదీ పూరణ. పొలంలో వరి కుప్పలు కాపాలా కాయడానికి వెంకప్ప అనే రైతుచేతిలో కర్ర, కాలికి కిర్రు చెప్పులూ వేసుకుని వచ్చేడుట. వాటి చప్పుడుకి పాము బెదిరి పోయి గడగడా వణికి పోయిందిట.
అల్పుల గురించి ఓ కవి చెబుతూ ..
నక్కలు బొక్కలు వెతుకును
అక్కరతో నూరపంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్.
అన్నాడు. నిజఁవే కుక్కలు చెప్పులను ఉండనివ్వవు. చింపి పోగులు పెడతాయి. ఇళ్ళలో కుక్కలను పెంచే వారికి ఇది అనుభవైక వేద్యమే. ఇలా మన చెప్పులు కుక్కల పాలిబడటం కుక్కల చరిత్రకే తీరని అవమానంగానూ.నష్టదాయకంగానూ. తీరని ద్రోహంగానూ ... యింకా చాలాగానూ మా తింగరి బుచ్చి వాపోతున్నాడు.
సాముల్ని కర్రతోనూ. చెప్పుతో తేళ్ళనీ , జెర్రెలనీ కొట్టి చంనడం మనుషుల అలవాటు. ఈ విధంగా చెప్పులు తేళ్ళ వంటి విషజంతువుల వధలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నమాట. విష జంతువులే కాదు, అలాంటి వెధవల పాలిట కూడా చెప్పులే సరైన ఆయుధాలు. రోమియోగాళ్ళనీ, బేవర్సుగాళ్ళనీ చెప్పు దెబ్బడలతో సత్కరించడం అమ్మాయిలకు అవసరం.చేత్తో కొట్టడం కన్నా, చెప్పుతో కొడితే మరీ అవమానించి నట్టవుతుంది.
సభల్లో నచ్చని వక్తల మీద, రాజకీయ నాయకుల మీద చెప్పులు విసరడం తెలిసినదే. అయితే కోడి గుడ్లు, టమాటాల కంటె ఇది కాస్త ఖరీదయిన వ్యవహారం అనుకుంటాను.హోళీనాడు రంగులు పూస్తారని చెప్పి పాత గుడ్డలు వేసుకు వెళ్ళి నట్టుగా వీటి కోసం ఏ చిరిగిన చెప్పులో ప్రత్యేకించడం మంచిది. లాభదాయకం. మీ ఇష్టం. ఆలోచించండి.
కుక్కలే కాదు, కొత్త చెప్పులూ కరుస్తాయి సుమండీ. ఆ బాధ వర్ణనాతీతం. అలవాటు పడే వరకూ నరకం చూపిస్తాయి. అందుకే పరైన చెప్పులూ, సరిజోడు పెళ్ళామూ లభించడం అదృష్టమనే చెప్పాలి. చెప్పులయితే కనికరించి కొన్ని రోజులకి కరవడం మానేస్తాయి కానీ, మొండి పెళ్ళాలు జీవితపర్యంతం కరుస్తూనే ఉండే ప్రమాదం ఉంది.
ఇక, ఉచితంగా చెప్పులు దొరికే చోటు ఏదంటే ఖచ్చితంగా దేవాలయాలే ! అని ఎవరయినా ఠక్కున చెప్పగలరు. కాక పోతే ఒక్కోసారి పెళ్ళి పందిళ్ళలో కూడా మనకి కావలసిన అనువైన, అందమైన కొత్త చెప్పులు ఉచితంగా దొరికే వీలుంది. ఏదో సినిమాలో నా షోలాపూర్ చెప్పులు పోయాయని గోల పాట ఒకటుంది కదూ ? ఇలాంటి చోట్ల పోయిన చెప్పులన్నీ ఉద్దేశ పూర్వకంగానే ఎవరో ఎత్తుకెళ్ళారనీ అనుకో నక్కర లేదండీ. ఒక్కో సారి హడావిడిలో మనవి కానీ చెప్పులు వేసు కోవడం, కుడి ఎడమల చెప్పులు తారుమారయి అవస్థలు పడడం కూడా జరుగుతూనే ఉంటుంది.
అందుకే ఆలయంలో దేవుడి ఎదుట నిలుచున్నా, చిత్తం చెప్పుల మీదనే ఉంచే భక్తులుంటారు. ఇప్పుడయితే రూసాయో, రెండో తీసుకుని టోకెన్లు ఇచ్చి, మనం వచ్చే వరకూ మన చెప్పులు భద్ర పరుస్తున్నారు కానీ లోగడ ఆ సదుపాయం ఉండేది కాదు. ఇప్పటికీ ఆ సదుపాయం లేని దేవాలయాలు చాలానే ఉన్నాయి. అవి కొత చెప్పులు ఉచితంగా కావాలనుకునే వారి పాలిట చెప్పుల కల్ప తరువులు. అయితే మనకి నచ్చిన , మనకి సరిపోయిన మంచి చెప్పులు కనిపిస్తే మన పాత చింకి చెప్పులు అక్కడ విడిచేసి దర్జాగా ఉడాయించ వచ్చు. కానీ కొన్ని మెళకువలు పాటించక పోతే దొరికి పోతాం. ముఖ్యంగా మనం వేసుకు పోదామనుకున్న చెప్పులాయన, లేదా, ఆమె ఆ చెప్పులు విడిచి ఎంత సేపయిందీ, తిరిగి వెంటనే వచ్చే ప్రమాదమేదయినా ఉందా , చుట్టు ప్రక్కల ఎవరినా నిఘా వేస్తున్నారా ? మొదలయిన విషయాల గురించి ముందుగా రెక్కీ నిర్వహించి తెలుసు కోవడం మంచిది. లేదా దెబ్బ తినేస్తాం అని మా తింగరి బుచ్చి థియరీ.
మరో విషయ మేమిటంటే, మనం శివాలయం ముందు నుంచి చెప్పుల జత ఎత్తు కొచ్చామనుకోండి ... వెంటనే మరి కొన్నాళ్ళ పాటయినా మతంమార్చెయ్యాలి. పరమ విష్ణు భక్తుల మయి పోవాలి. ఆ శివాలయం వేపు కొన్నాళ్ళు వెళ్ళడం వొంటికి మంచిది కాదు.
మా తింగరి బుచ్చిలాంటి ప్రబుద్ధులు చెప్పులు మార్చాలనిపిస్తే ఏదో దేవాలయ దర్శనం చేస్తూ ఉంటారు. సురక్షితమైన ఆలయం ఎన్ను కోవడంలో వారి మెళకువ అంతా ఇంతా కాదు. ఎప్పుడో చెప్పు దెబ్బలు తినే వరకూ వారి తీరు మారదు.
’’ఈ మేలు చేసావంటే నీ రుణం ఉంచు కోను, నాచర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తా ’’ అని ఎవరయినా అంటే మరీ వాచ్యార్ధాన్ని సీరియస్ గా తీసుకో కూడదు. చర్మం వొలిచి చెప్పులు కుట్టించడమంటే జీవితాంతం చేసిన మేలు గుర్తుంచు కుంటాననడమే కానీ నిజంగా అలాంటి చెప్పుల జత వొస్తుందనుకో కూడదు.
చెప్పుల్లో చెప్ప లేనన్ని రకాలు. బాత్ రూమ్ చెప్పులూ. ఇంట్లో తిరగడానికి వాడే చెప్పులూ, వర్షాకాలంలో వాడేవీ, ఎండా కాలంలో సౌకర్యంగా ఉండేవీ, ఫంక్షన్లలో డాబుగా కనిపించేవీ ... చాలా రకాలుంటాయి. సాదా చెప్పులూ. రబ్బరు చెప్పులూ, తోలు చెప్పులూ, బూట్లూ, హాఫ్ బూట్లూ ... చెప్పడం నాతరం కాదు. కొంత మంది రాజకీయ కాయకులకూ, ముఖ్యంగా అమ్మణ్ణులకూ, సినీతారలకూ చెప్పుల పిచ్చి జాప్తీయే. ఎన్ని రకాల చెప్పులు కొన్నా వారికి తనవి తీరదు. ఓ ముఖ్యమంత్రిణి ఇంట చెప్పుల జతలు వందల సంఖ్యలో ఉంటాయని చెప్పుకుంటారు.
చెప్పుల కథలో మరచి పోకూడని చెప్పులు చార్లీచాప్లిన్ వి.అతను వేసుకునే బూట్లు వదులుగా తమాషాగా ఉంటాయి.
ఆఫీసు కెళ్ళే భర్తల చెప్పులు, లేదా బూట్లూ, మేజోళ్ళూ తుడిచి శుభ్రం చేసి సిద్ధం చేయడం ఓ తలనొప్పి వ్యవహారం. బడి నుంచి ఇంటికి వస్తూనే కాలి చెప్పులు ఓ మూలకి విసిరేసే పిల్లలూ, బూట్లు విప్పి ఏ మూలనో గిరాటు వేసే పిల్లల తోనూ తల్లులకి నిత్యం సతమతమే.
చివరగా చెప్పుల సామెతలు కూడా చూద్దాం ...
1. చెప్పు కాలు నెత్తిన పెట్టి, వఠకోపమంటాడు.
2. చెప్పు కింద తేలు లాగా
3. చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా ?
4. పట్టు గుడ్డలో చెప్పును చుట్టి కొట్టినట్టు !
5. చెప్పుల వానికి చేనంతా తోలుతో కప్పినట్టుగా ఉంటుంది.
6. చెప్పులున్న వాడితోనూ, అప్పులున్న వాడితోనూ జాగ్రత్తగా ఉండాలి.
7. చెప్పులు సరిపో లేదని కాలు తెగ కోసుకుంటారా ?
8. చెప్పులు తెగినా చుట్టరికం తెగదు.
9. చెప్పు లోని రాయి చెవి లోని జోరీగ, ఇంటి లోని పోరు ఇంతింత కాదు
చెప్పులు అరిగేలా తిరగడ మంటే, పట్టు వదలకుండా కృషి చేయడమన్నమాట.
చెప్పుల కథలో చివరిగా ఒక స్వీయానుభవం కూడా చెప్పి ముగిస్తాను.
అదేదో సబ్బుల కంపెనీ ప్రకటన ... మరక మంచిదే ! లాగా , కాలికి చెప్పులు లేక పోవడం కూడా ఒక్కో సారి మంచిదే అని నా స్వీయానుభవం. చెబుతా వినండి.
అవి నేను ఓ మారు మూల కుగ్రామంలో పరిషత్ పాఠశాలలో టీచరుగా చేరిన రోజులు. రెండేళ్ళు ఆ కుగ్రామంలో నానా అవస్థలూ పడ్డాను. ఉద్యోగ మంటేనే విరక్తి కలిగింది. అక్కడి నుండి బదిలీ ఎప్పుడవుతుందా అని ఎదురు చూసాను. ఆరోజు రానే వచ్చింది. రెండేళ్ళు గడిచాక జిల్లా పరిషత్ వారు టీచర్ల బదిలీలు చేపట్టారు. మా మునిసిపల్ ఛైర్మన్ గారు తమకి అనుయాయులూ, తెలిసిన వారూ అయిన టీచర్ల బదిలీలు వారు కోరిన చోట్లకి చేయించే పనిలో జిల్లా కేంద్రానికి మరుచటి దినమే వెళ్తున్నారని తెలిసింది. వెంటనే మా ఊరికొచ్చి, ఆఘ మేఘాల మీద, అప్పటికే హెడ్మాష్టరు చేత అండార్సు చేయించిన బదిలీ దరఖాస్తు కాపీని ఛైర్మన్ గారి కి అంద చేయాలని తలపెట్టాను. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. మర్నాడు ఛైర్మను గారి కారు బయలు దేరే లోపు నా అప్లికేషను వారి చేతిలో పెట్టాలి. లేక పోతే పని జరగదు మరి. నిద్ర లేమితో మర్నాడు ఆలస్యంగా లేచాను. తుళ్ళి పడ్డాను. మాసిన బట్టలు మార్చు కో లేదు. చెప్పులు తొడుక్కుని బయలుదేరే వేళకి ఓ చెప్పు తెగి పోయి నడవడానికి సహకరించడం లేదు. టైం లేదు. ఆ చెప్పులను అలాగే వదిలేసి, మా ఇంటికి ప్రక్క వీధిలోనే ఉండే ఛైర్మను గారింటికి వట్టి కాళ్ళతోనే హడావిడిగా బయలు దేరాను. వారు నా అవతారం చూసి. చెప్పులు లేని నా కళ్ళ వేపు ఓ సారి జాలిగా చూసి, గాఢంగా నిట్టూర్చి, నా చేతి లోనుండి దరఖాస్తు అందు కున్నారు. కాలికి ( తెగి పోవడం వ్లనే అనుకోండి ) చెప్పులయినా లేని నా రూపం వారిలో ఏ పేగు కదిలించిందో మరి, వారు చేపట్టిన బదిలీ లో మొదటిది నాదే ! చక్కగా మా ఊరికి దగ్గరగా చక్కని రవాణా సౌకర్యం ఉండే చోటుకి పట్టుబట్టి నాకు బదిలీ చేయించారు. ఇప్పుడు చెప్పండి ... అర్ధాంతరంగా చెప్పు తెగి పోవడం కూడా మంచిదే కదూ ?!
ఇదండీ నేను చెప్ప గలిగినంత చెప్పుల కథ ...
శలవా మరి ....