‘‘జై సమైక్యాంధ్రా ! ’’ అంటూ రాత్రి పడుకున్న భర్త, అర్ధ రాత్రి వేళ ‘‘ జై తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ ఉలిక్కిపడి లేచాడు. ‘‘కలొచ్చిందా ?’’ అడిగింది భార్య ఆవలిస్తూ, బద్ధకంగా .. ‘‘అవునే, మన అబ్బాయి దగ్గరకి హైదరాబాద్ వెళ్ళినట్టు కలొచ్చిందే .. ’’చెప్పాడు భర్త. ‘‘చాల్లెండి సంబడం. అర్ధ రాత్రి వేళ అంకమ్మ శివాలనీ, ఏఁవిటా నినాదాలూ మీరూనూ ... కళ్ళు మూసుకుని పడుకోండి ’’అంది భార్య. ‘సరే ’అని పడుకున్నాడు భర్త. మరో గంట గడిచేక ‘‘జై రాయల తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ నిద్ర లేచి కూర్చున్నాడు, ‘‘బావుంది వరస ... ఏఁవిటా కలవరింతలు ; మరో కలేఁవైనా వొచ్చిందేఁవిటి ? ’’ అడిగింది భార్య కాస్త కోపంగా. ‘‘అవునే ఈ సారి అమ్మాయి యింటికి అనంతపురం వెళ్ళినట్టు కలొచ్చిందే ...’’ చెప్పాడు భర్త నీరసంగా. ‘‘సరి..సరి.. ఎవరైనా వింటే నవ్వి పోతారు ..ఈ గొడవలన్నీ ఆలోచించకండి కళ్ళు మూసుకుని పడుకోండి ... ’’అంది భార్య. కాస్త కునుకు పట్టిందో లేదో, భర్త మళ్ళీ ఏదో కలవరిస్తున్నట్టుగా అనిపించి చటుక్కున లేచి కూర్చుంది భార్య. భర్త నిద్రలో ‘ చొ..చొ..చ్చొ..చ్చొ ..’ అంటూ కలవరిస్తున్నాడు. ‘‘ ఏఁవయిందండీ .. ఆ చొచ్చొచ్చో లేఁవిటి ? ’’ అనడిగింది భర్తను తట్టి లేపుతూ .. తుళ్ళి పడి లేచాడు భర్త. ముఖం పీక్కు పోయి ఉంది. దెయ్యం పట్టిన వాడిలా ఉన్నాడు. ‘‘ఈసారి పేకాట రమ్మీ ఆడుతున్నట్టుగా కలొచ్చిందే ’’అన్నాడు నీరసంగా .. ‘‘ఖర్మ ! అయితే ఏఁవిటంటా ? ’’ అడిగింది భార్య. కాస్సేపు నసిగి చెప్పాడు భర్త దిగులుగా : ‘‘రాంగ్ షో డీల్ చూపించీసినట్టు కలొచ్చిందే .. ’’ అన్నాడు. అంతే. ఆ మొగుడూ పెళ్ళాలకి మరింక నిద్ర పట్ట లేదు.
28, ఆగస్టు 2013, బుధవారం
చొ ... చొ ... చ్చొ ...చ్చొ చ్చొ .. అను .. ఒక రాంగ్ షో కథ !
‘‘జై సమైక్యాంధ్రా ! ’’ అంటూ రాత్రి పడుకున్న భర్త, అర్ధ రాత్రి వేళ ‘‘ జై తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ ఉలిక్కిపడి లేచాడు. ‘‘కలొచ్చిందా ?’’ అడిగింది భార్య ఆవలిస్తూ, బద్ధకంగా .. ‘‘అవునే, మన అబ్బాయి దగ్గరకి హైదరాబాద్ వెళ్ళినట్టు కలొచ్చిందే .. ’’చెప్పాడు భర్త. ‘‘చాల్లెండి సంబడం. అర్ధ రాత్రి వేళ అంకమ్మ శివాలనీ, ఏఁవిటా నినాదాలూ మీరూనూ ... కళ్ళు మూసుకుని పడుకోండి ’’అంది భార్య. ‘సరే ’అని పడుకున్నాడు భర్త. మరో గంట గడిచేక ‘‘జై రాయల తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ నిద్ర లేచి కూర్చున్నాడు, ‘‘బావుంది వరస ... ఏఁవిటా కలవరింతలు ; మరో కలేఁవైనా వొచ్చిందేఁవిటి ? ’’ అడిగింది భార్య కాస్త కోపంగా. ‘‘అవునే ఈ సారి అమ్మాయి యింటికి అనంతపురం వెళ్ళినట్టు కలొచ్చిందే ...’’ చెప్పాడు భర్త నీరసంగా. ‘‘సరి..సరి.. ఎవరైనా వింటే నవ్వి పోతారు ..ఈ గొడవలన్నీ ఆలోచించకండి కళ్ళు మూసుకుని పడుకోండి ... ’’అంది భార్య. కాస్త కునుకు పట్టిందో లేదో, భర్త మళ్ళీ ఏదో కలవరిస్తున్నట్టుగా అనిపించి చటుక్కున లేచి కూర్చుంది భార్య. భర్త నిద్రలో ‘ చొ..చొ..చ్చొ..చ్చొ ..’ అంటూ కలవరిస్తున్నాడు. ‘‘ ఏఁవయిందండీ .. ఆ చొచ్చొచ్చో లేఁవిటి ? ’’ అనడిగింది భర్తను తట్టి లేపుతూ .. తుళ్ళి పడి లేచాడు భర్త. ముఖం పీక్కు పోయి ఉంది. దెయ్యం పట్టిన వాడిలా ఉన్నాడు. ‘‘ఈసారి పేకాట రమ్మీ ఆడుతున్నట్టుగా కలొచ్చిందే ’’అన్నాడు నీరసంగా .. ‘‘ఖర్మ ! అయితే ఏఁవిటంటా ? ’’ అడిగింది భార్య. కాస్సేపు నసిగి చెప్పాడు భర్త దిగులుగా : ‘‘రాంగ్ షో డీల్ చూపించీసినట్టు కలొచ్చిందే .. ’’ అన్నాడు. అంతే. ఆ మొగుడూ పెళ్ళాలకి మరింక నిద్ర పట్ట లేదు.
18, ఆగస్టు 2013, ఆదివారం
చాప చుట్టెయ్య కూడదూ ? !
15, ఆగస్టు 2013, గురువారం
హే, భగవన్ !
హన్నా అయ్యారే అను నొక మహనీయుడు దేశమును రిపేరు చేయ దలచి, చాలా తీవ్రముగా ప్రయత్నించి సాధ్యము కాక ఉస్సురని ఉండి పోయెను. ఇక మానవ ప్రయత్నము వలన ఇది సాధ్యము కాదని తలచి, హిమాలయములకు పోయి ఘోరమైన తపస్సు చేసెను, అన్ సీజను కాబోలునేమో, దేవుడు త్వరగానే ప్రత్యక్ష మయ్యెను.
అయ్యారే కనుల ఆనంద బాష్పములు రాలుచుండ ‘‘ హే భగవన్ !నా జన్మ ధన్యమైనది. నాకొక్క వరము ప్రసాదింపుము ’’ అని వేడుకొనెను,
‘‘ భక్తా ! ఏమి నీ కోరిక ’’ అని భగవంతుడడిగెను.
‘‘ మా దేశమున అవినీతిపరుల యొక్కయు, అసత్యములాడు వారి యొక్కయు తలల తక్షణమే వేయి వ్రక్క లగునట్లు వరము నిమ్ము ’’ అని అయ్యారే అడిగెను.
అది విని భగవానుడు మిక్కిలి ఖిన్నుడయ్యెను.
‘‘ నాయనా ! నీవడిగిన వరములో రెండు క్లాజులున్నవి. అవినీతి పరులను దండింప వలెనన్న చేతులు రాకున్నవి.అన్ని కోట్ల మందిని నేనే సృజించితిని. నాచేతులతో నాశనము చేయుట ఎట్లో తెలియకున్నది.అట్లయిన ఈ జంబూ ద్వీపమున ఒకరో ఇద్దరో మాత్రమే మిగులుదురు కాబోలు. ఇక నీ వరము లోని రెండవ క్లాజు అసత్యపరులని దండించు మనుట. పొద్దున లేచినది మొదలు మీ ఖండము నంలి దురద దర్శనములందును, చిత్రికలందును ప్రతి వాడును తానే సత్యవాదినని, తాను చెప్పినదే నిజమని చెప్పు చున్పాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటిని. అందు చేత ఇవి కాక వేరొక వరము వేడి కొనుము. ప్రసాదించెదను.’’ అనెను.
ఇట్టిది కదా నా భాగ్యము అని నిట్టూర్చి, ఏమి చేయుదనని చింతించి తుదకు అయ్యారే వేరొక వరమును వేడెను.
‘‘ హే భగవన్ ! ఈ వరము తప్పక ప్రసాదింపుము. ఏమనిన, స్విస్ బ్యాంకులలో ఉన్న మా వారి నల్ల ధనమంతయు తృటి కాలములో మా దేశ ఖజానాలో పడునట్లు చేయుము. దానితో మా దేశ ప్రజల దరిద్రము తీరి పోయి నీతి నియమములతో, ప్రశాంతముగా బ్రతికెదరు ’’ అని కనులు మూసుకుని వేడుకొనెను.
భగవంతుడు ‘‘ తథాస్తు ! ’’ అని పలికి వరము నిచ్చి అంతర్ధానమొందెను.
అయ్యారే కనులు తెరచి చూచెను. దేవుడు కనిపించ లేదు. అంతియ కాదు. దేశ ఖజానా కూడా ఖాళీగా ఉన్నది.
దేవుడు తనని మోసగించెనని అయ్యారే భావించి, ఆగ్రహంచెను. తిరిగి ఘోరమయిన తపము చేయ బోయెను.
,
మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమయ్యెను.
‘‘ నాయనా ! తిరిగి ఏవరము కోరి తపము చేయు చున్నావు అను క్షణము నన్నిట్లు డిస్టర్బు చేయుట నీకు తగునా ? ! ? ’’ అని అడిగెను.
అయ్యారే కోపము దిగమ్రింగుకొని, ‘‘ దేవా ! నన్ను వంచించితివి. నల్లధనమంతయు దేశ ఖజానాలోకి వచ్చు నట్లు చేసెద నంటివి, కనులు తెరచి చూచు నంతలో మాయమైతివి. ఖజానా ఖాళీగా ఉన్నది, ’’ అనెను,
అందుకు దేవుడు నవ్వి ఇట్లనెను. ‘‘ నాయనా ! నీవెంత అమాయకుడవు ? నేను వరమ నిచ్చుట జరిగినది. మీ దేశ ఖజానా ఇబ్బడి ముబ్బిడిగా నిండుట కూడా జరిగినది.’’
మరి ... అడిగేడు అయ్యారే, సందేహంగా ..
‘‘ నీవు కనులు మూసి తెరచు నంత లోన మీ నాయకుల్దానిని క్షణకాలములో హోంఫట్ ! చేసినారు. నేనేమి చేయుదును ? నల్లధనమును రప్పించమనియే వరమడిగితివి. మీవాండ్లు దానిని వెంటనే చప్పరించి వేసినచో నేనేమి చేయుదును ? ఈ పాటికి అదంతయు వారలకు అరగి పోయే యుండును ... అదిగో ! ఆవురావురుమను గావు కేకలు నీ చెవిని బడుట లేదా ?’’ అని దేవుడు తన నిస్సహాయతను వెల్లడించెను.
ఫలశృతి : దేవుని నిస్సహాయత అను నామాంతరము గల హే, భగవన్ ! అను ఈ కథను చదివిన వారికి ఉన్న రోగములు అధికమగునేమో కానీ కొత్త రోగములు రావు. కుటుంబ నియంత్రణ వలన ఒక్క పుత్రుడు ఉదయించిన ఉదయించ వచ్చును. ఈతి బాధలు తగ్గక పోయిననూ వాటికి అలవాటు పడి పోయెదరు.మీ వంశమున వంద తరముల వారికి సరి పోవునట్లుగా ధన కనక వస్తు వాహన సౌభాగ్యములు అక్రమ మార్గమున యత్నించిన దక్క వచ్చును. కానీ ముందుగా చర్లపల్లి జైలులోను , మరియు తీహార్ జైలులోనూ వేకెన్సీ పొజిషను వాకబు చేయ వలెను.
స్వస్తి.
14, ఆగస్టు 2013, బుధవారం
మా ముద్దుల ముసిలోడా ...
విజయ నగరం పెద్దలందరూ కలిసి ‘‘ మూడు యాభైల మన గురజాడ ’’ కార్యక్రమాన్ని జరిపించాలని తలపెట్టి, 2011 సెప్టెంబరు 21 నాడు శ్రీకారం చుట్టేరు. సాలు పొడుగునా వేడుకలూ సభలూ రాజాంలో జరిగేయి. తరవాత్తరువాత, 2012 సె్టంబరు 19, 20 తేదీలలో ముగింపు సభలు ఘనంగా నిర్వహించుకొన్నారు.
తర్వాత, విశాఖ పట్నం కళాభారతి ఆడిటోరియంలో కన్యాశుల్కం
యథాతధ పూర్తి నిడివి ప్రదర్శన జరిగింది. దానితో ఆ సంబరాలు ముగిసాయి.
సరే, ఆ సందర్భానికి కొనసాగింపుగా వెలుగు మిత్రులంతా కలిసి ‘‘మూడు యాభయిల మన గురజాడ’’ అనే 400 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు.ఇందులో ప్రముఖులు గురజాడ గురించి రాసిన 50 వ్యాసాలున్నాయి. శిసాగర్, సీరపాణి, రజనిలు రాసిన మూడు కవితలూ,ఆయా సభలకు చెందిన ఫొటోలూ ఉన్నాయి.
‘‘మూడు యాభయిల మన గురజాడ’’ పుస్తకాన్ని ప్రచురించి న వెలుగు మిత్రులు గురజాడకి అంకితం చేస్తూ రాసిన గేయం ఇది ...
ఇక చదవండి ....
మా ముద్దుల ముసిలోడా
ఇప్పుడంటే మురిగ్గుంటై
డెంగూ ఫీవరుగా
వూరిని ఝడిపిస్తోంది గానీ
మా అయ్య కోనేరు
ఆరడుగుల లోతుల్లోకి
విసిరేసిన అణాకాసుని
నీటి మడుగున చందమామగా చెరిపించేది
కారణాలడక్కూడదు.
‘‘ వీడికి వెఱ్ఱికాబోలు’’ అనుకుంటారు,
కడుపికింత తిండి పెట్ట లేక పోయినా
అడుక్కున్నోడికి సైతం
చేతికి సెల్ ఫోనిచ్చాం
ఇదీ అడుగు నుండి మా అభివృద్ధి
కడుపుమండా ఏలుబడి అలా సాగుతోంది
నిలుచున్న చోటే దిక్కులు వెతుక్కుంటూ
చట్ట సభల్లో పొక్కుల చిక్కుకుంటూ
ఎవడితరం పులి మీద సవారీ !’’
అదీ మా ప్రయోజకత్వం
సిగ్గిడిసి అడిగేస్తున్నా
మైడియర్ ఓల్డు అప్పారావు
అన్నావన్నావు
‘‘ మంచి గతమున కొంచెమునోయి’’
మేమేమో గతం గొప్పలే
దుదదపత్తింగా గోక్కుంటున్నాం
అందని ఎత్తులో నిలిచిన నీ మనసు
‘‘పట్టుబడాలని నిదానిస్తున్నాం.’’
‘‘ మందగించక ముందు అడుగేయి’’
కదా నువ్వన్నది
‘‘ చిత్రం చిత్రం మహా చిత్రం’’
ఎన్నిమార్లు కన్నిమార్లు
నిన్ను చూస్తున్న కొద్దీ
కొత్త చిగుర్లేసి నిగారిస్తుంటావు
‘‘ వీర్య మెరుగక విద్య నేర్వక’’
కూడా అన్నావు కదా !
అమ్మ ముసిలోడా
అయితే ఇక చూడు మా తడాఖా
‘‘ అరె ఝాఁ , ఝాఁఝటక్ .. ఫటక్ ...’’
అదుగో నవ్వుతున్నావు
‘‘మనవాళ్ళు వొట్టి వెధవాయిలోయ్’’
నీ నోట్లో నోరెట్టలేం తండ్రీ
నీకో నమస్కారం
అందుకే నీకోసం ఈ పుస్తకం ...
---- వెలుగు మిత్రులం.
లేబుళ్లు:
మంచి పుస్తకాలు
10, ఆగస్టు 2013, శనివారం
భలే వాడి వయ్యా !
పారావారము నందు న
నారని పెను చిచ్చు వోలె హాలాహలమే
పారఁగ నద్దానిని మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై

భావం : పాల సముద్రంలో మహా అగ్ని లాగున విషం పుట్టింది. అది ఎంతకీ ఆరేది కాదు. లోకాలను కాపాడడం కోసం శివుడు దానిని మనసారా మ్రింగాడు.
పరమేశ్వరుడు లోకసంరక్షణార్థం మద్యం పుచ్చు కొన్నాడని సమస్య. దానిని అవధాని గారు మనసారా అనే విరుపుతో చక్కగా పూర్తి చేసాడు.
అమృతం కోసం దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని మధించారు. వాసుకిని తాడుగా చేసుకున్నారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొన్నారు. పాల కడలిని చిలకడం మొదలు పెట్టారు. అందు లోనుండి కామ ధేనువు, కల్ప వృక్షమూ, ఐరావతమూ, శ్రీమహా లక్ష్మీ, కౌస్తుభమూ, అప్సరోంగనలూ వెలువడ్డారు. చివరగా కాలకూటం వెలువడింది. దానిని ఏం చేయాలో దేవ దానవులకు తెలిసింది కాదు. చివరకు ఆ విషాన్ని స్వీకరించమని శివుడిని ప్రార్ధించారు. లోక రక్షణ కోసం శివుడు దానికి సిద్ధ పడ్డాడు.
ఆ సందర్భంలో పోతన గారు చాలా గొప్ప పద్యాలు రాసారు. వాటిని కూడా ఒకింత గుర్తు చేసు కుందాం. మంచి కవిత్వాన్ని మననం చేసు కోడానికి ముహూర్తం అక్కర లేదు కదా.
కంటే జగముల దు:ఖము
వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షీ
శివుడు పార్వతితో ఇలా అన్నాడు : లోకాల ఆర్తిని చూసేవు కదా ? పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. దాని వలన మంచి కీర్తి లభిస్తుంది.
పార్వతి తన పెనిమిటి లోక రక్షణార్ధం కాలకూటాన్ని భుజించడానికి సిద్ధ పడితే పంతోషంగా అంగీకరించింది.
శుకుడు అందుకే అంటాడు :
మ్రింగెడు వాడు విభుండని
మ్రింగుడిది గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వ మంగళ,
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !
ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగు తుంది అని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి సరే విషాన్ని తినమని భర్తతో పలికిందిట. ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా.
పరమ శివుడు హాలాహలాన్ని భక్షించే టప్పటి దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టేలా చిత్రించారో చూడండి ...
కదలం బారవు పాఁప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు పు
ట్టదు,నేత్రంబులు నెఱ్ఱగావు, నిజజూటార్ధేందుఁడున్ గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో, డాయుచోఁ
బదిలుండై కడి సేయుచోఁదిగుచుచో, భక్షింపుచో, మ్రింగుచోన్.
పరమ శివుడు హాలాహలాన్ని రారమ్మని కవ్వించి పిలిచాడు. తనూ ఓ అడుగు ముందుకు వేసి సమీపించేడు. ఆ విషాన్ని చక్కగా ఒక ముద్దలాగా చేసాడు.కిందకి లాగాడు. నోట పెట్టుకుని మ్రింగాడు.
అలా శివుడు విషాన్ని భక్షిస్తూ ఉంటే, వొంటి మీద హారాలలా వేలాడుతున్న పాములు బెదరడం లేదు. కదలడం లేదు. ఆ మహా తాపానికి పరమ శివుని ఒంటి మీద ఒక్క చుక్క చెమట పుట్టడం లేదు. కనులు ఎఱ్ఱ బడడం లేదు. జటాజూటంలో ఉన్న చంద్రుడు ఆ వేడిమికి కంది పోలేదు. శివుని పద్మంలాంటి ముఖం వాడి పోలేదు.,
భలే వాడివయ్యా, భోలా శంకరా !
లేబుళ్లు:
మన సాహితీ సంపద
3, ఆగస్టు 2013, శనివారం
కళ్ళున్న కబోదులూ ... చెవులున్న బధిరులూ ...
ఈ దురాశ ఎలాంటిదంటే ..
ఇచ్ఛతి శతీ సహస్రం, సహస్రీ లక్షమీమతే
లక్షాథిపస్తథా రాజ్యం. రాజ్యస్థ: స్వర్గ మీహతే
అంటే ... వంద ఉన్న వాడు వెయ్యి కావాలను కుంటాడు. వెయ్యి ఉన్న వాడు లక్ష కోరు కుంటాడు. లక్షాథికారి
( ఇప్పుడు ఎన్ని లక్షలూ చాలవను కోండి, అది వేరే మాట) ప్రభుత్వం, పదవి కావాలను కుంటాడు. రాజు స్వర్గాన్నీ, స్వర్గ సుఖాలనూ ఆశిస్తాడు ...
కానీ, కవి ... కారే రాజులు రాజ్యముల్ కలుగవే ... అంటూ గర్వించిన వారంతా సిరి మూట కట్టుకుని పోగలిగేరా ? అని నిలదీసాడు.... కానీ ఆశాపాశము కడున్ నిడుపు .. లేదంతంబు రాజేంద్ర !
ఎప్పటికయినా సుకవి ప్రజల నాలుకల మీద నిలిస్తే, రాజు శిలా ప్రతిమలా ఉండాల్సందే కదా ...
ధూర్జటి పదవీ కాంక్ష ఎలాంటిదో చెప్పాడు కదా ... .
ఒకరిం జంపి పదస్థులై బ్రదుక తా మొక్కొక్కరూహింతు రే
లకొ ? తామెన్నడు జావరో ? తమకుఁబోవో సంపదల్ ? పుత్ర మి
త్ర ళత్రాదుల తోడ నిత్య సుఖముంగందురో ? ఉన్న వా
రికి లేదో మృతి ? యెన్నఁడుం కటకటా శ్రీకాళ హస్తీశ్వరా !
భావం: ఎవడినో ఒకడిని తుదముట్టించి, తాము వాడి పదవిని దక్కించు కోవాలని కొందరు చూస్తూ ఉంటారు. ఏమీ, తాము మాత్రం ఎప్పుడూ చావరా ? తమకు సంపదలు పోవా ? భార్యా పిల్లలూ, స్నేహితులతో ఎల్లకాలం సుఖంగా ఉంటారా ? బతికి ఉన్న వారికి చావు రాదా ?
కానీ వారికి అదేమీ పట్టదు, ఒక్క రోజు రాజు చెయ్యి గణనాథా ! అంటూ తహతహలాడి పోతూ ఉంటారు.
రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు ... అనికూడా కవి చెప్పాడు. అంతే కాదు. ఒక సారి . పదవి అంటూ లభించేక వాడెలా మారి పోతోడా కూడా విపులంగానే వివరించాడు:
చూడండి:
రాజన్నంతనె బోవునా కృపయు, ధర్మం బాభిజాత్యంబు,వి
ద్యాజాత క్షమ, సత్యభాషణము, విద్వన్మిత్ర సంరక్షయున్
సౌజన్యంబు, కృతం బెఱుంగుటయు,విశ్వాసంబుగాకున్న దు
ర్భీత శ్రేష్ఠులు గాఁ కతంబు కలదే శ్రీకాళ హస్తీశ్వరా !
రాజు అయ్యాడంటే చాలు, దయావిహీనుడైపోతాడు. ధర్మం మరచి పోతాడు. ఆభిజాత్యం పెరిగి పోతుంది, పండితులంటే లెక్క చేయడు. సత్యం పలుకడు, మంచి వారిని కాపాడడు, మంచి తనం అసలే ఉండదు, చేసిన మేలు మరచి పోతాడు, విశ్వాసహీనుడవుతాడు. ఏం కారణమో కదా ...
నిజమే ఓ సారి పదవి లభించేక చాలా మందిలో లేని కొమ్ములు మొలుస్తాయి. తామేదో దైవాంశ సంభూతుల మనుకుంటారు. కన్నూ మిన్నూ కానరు. యుక్తా యుక్త విచక్షణా ఙ్ఞానం నశించి పోతుంది. లభించిన పదవిని నిలుపు కోడానికి ఎంత కయినా తెగిస్తారు. లోకంలో చూడ్డం లేదూ ?
రాజ్యపాలన అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
.
కాళిదాస మహా కవి అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో రాజ్యం గురించి చెబుతూ ...
నాతి శ్రమాపనయనాయ, నచ శ్రమాయ
రాజ్యం స్వ హస్త ధృత దండ మివాతపత్రమ్. ... అంటాడు.
రాజ్య సుఖం ఎలాంటి దంటే, తన చేత్తో స్వయంగా పట్టుకున్న గొడుగులాంటిది. అంతగా శ్రమను పోగోట్టదు, అలాగని శ్రమని కలిగించదు.
అయితే, రాజుకి నిజమైన ప్రజాభి మానం అంటూ ఉంటే, అది చేతి గొడుగు లాంటిదని మరో కవి చెబుతున్నాడు చూడండి:
ప్రజాగుప్త శరీరస్య కిం కరిష్యతి సంహతా:
హస్త న్యస్తాతపత్రస్య వారిధారాఇవారయా.
ప్రజాభిమానం చేతి గొడుగులాంటిది. వర్షం ఏం చేయ గలదు ?
అందు చేత రాజైన వాడు ప్రజాభిమానం సత్య మార్గంలో పొందాలి. అలాంటి నాయకులను ప్రజలు ఎన్నటికీ మరచి పోరు. అలాంటి ప్రభువులే ప్రాత: స్మరణీయులు.
పాలకుడైన రాజు పూలు కోసి, దండలు కట్టే తోటమాలిలా ఉండాలి. కానీ, చెట్లు నరికి బొగ్గులు చేసే వాడిలా ఉండ కూడదని శ్లోక కారుడు చెబుతున్నాడు. చూడండి:
పుష్పమాత్రంవిచినియాత్
మూలచ్ఛేదం నకారయేత్
మాలాకారయివారామే
న యథాంగార కారక:.
మహా భారతంలో రాజనీతి ధర్మాలు విదురుడూ, ధౌమ్యుడూ , నారదుడూ, భీష్ముడూ వంటి పెద్దలు చాలానే చెప్పారు
.
ధౌమ్యుడు పాండవులకు చెప్పిన సేవా ధర్మాలు ఇక్కడ నొక్కి చదవొచ్చును.
నారదుడు చెప్పిన రాజధర్మాలు ఇక్కడ నొక్కి చదవొచ్చును.
భీష్ముడు ధర్మ రాజుకి చెప్పిన మంచి మాటలు కొన్ని ఇక్కడ నొక్కి చదవొచ్చును.
రాజు నడచిన బాటలోనే ప్రజలూ నడుస్తారని యథా రాజా తథా ప్రజా: అనే నీతి వాక్యం కూడా బోధిస్తోంది.
పదవి కాస్త ఊడిపోయేక ప్రభువు పని ఏమవుతుందో తెలుసా ?
పద్యం చూడండి:
విధి సంకల్పముచే నొకానొకఁడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ, చూపు తక్కువ, సదాభాషల్ దురుక్తుల్ మనో
వ్యథతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధికారాంతము నందు చూడ వలెగదా నయగారి భాగ్యముల్ !
అదృష్ట వశావ్న అధికారం లభించి, రాజ్య పాలన చేయడం మొదలెడితే, చెవిటి వాడవుతాడు. అంటే మంచి మాటలు చెవికెక్కవు, కన్నూమిన్నూ కానడు. మదం పెరిగి పోతుంది. అన్ని వ్యసనాలూ అలవడతాయి. మాట్లాడితే అన్నీ చెడ్డ మాటలే. పదవి ఊడేక వాడి సౌభాగ్యం చూడాలి మరి ...
మరి, ఇప్పుడున్న వారిలో పలువురు ప్రజా సేవకులా ? ప్రజా కంటకులా ?
కాలమే నిర్ణయిస్తుంది కదూ ...
నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే ...
స్వస్తి.
లేబుళ్లు:
హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్
1, ఆగస్టు 2013, గురువారం
చిన్నప్పటి నుండీ వాడు తేడాయే !
ఒక చక్కని దత్త పది ...
పాలు, పెరుగు, నేయి, నూనె ... ఈ పదాలు వచ్చేలా పద్యం చెప్పాలి. కవి గారి కమ్మని పద్యం లోగడ చూస్తే సరే. లేదా వినండి ...
పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగు చున్నది వానిలో దురితము గన
నేయిలను గల్గ దిట్టియహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !
భావం: రారాజు దుర్యోధనుడు పాండవులకు పాలు పంచడు. ( రాజ్య భాగం ఇవ్వడు.)
వాడిలో దుర్మార్గం నానాటికీ పెరిగి పోతోంది.
ఏ లోకం లోనూ యిలాంటి అహితం ( చెడ్డతనం) లేదు.
వానిలో మూర్ఖత్వం చోటు చేసుకొంది.
ఇక భారత యుద్ధం తప్పదు !
వివరణ : పద్యంలో అన్వయ క్రమం ఇలా ఉంటుంది :
రారాజు పాండవులకు పాలు పంచడు. వానిలో దురితము పెరుగు చున్నది. ఇట్టి అహితము ఏ యిలను కననే ? మూర్ఖత వానిని ఊనెను
కనన్, ఏ + ఇలన్ = ఏ లోకంలో నయినా ఉందా ?
వానిన్ + ఊనెన్. = వానిని మూర్ఖత్వం పట్టుకుంది. వాడో మూర్ఖుడు.
పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగు చున్నది వానిలో దురితము గన
నేయిలను గల్గ దిట్టియహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !
భావం: రారాజు దుర్యోధనుడు పాండవులకు పాలు పంచడు. ( రాజ్య భాగం ఇవ్వడు.)
వాడిలో దుర్మార్గం నానాటికీ పెరిగి పోతోంది.
ఏ లోకం లోనూ యిలాంటి అహితం ( చెడ్డతనం) లేదు.
వానిలో మూర్ఖత్వం చోటు చేసుకొంది.
ఇక భారత యుద్ధం తప్పదు !
వివరణ : పద్యంలో అన్వయ క్రమం ఇలా ఉంటుంది :
రారాజు పాండవులకు పాలు పంచడు. వానిలో దురితము పెరుగు చున్నది. ఇట్టి అహితము ఏ యిలను కననే ? మూర్ఖత వానిని ఊనెను
కనన్, ఏ + ఇలన్ = ఏ లోకంలో నయినా ఉందా ?
వానిన్ + ఊనెన్. = వానిని మూర్ఖత్వం పట్టుకుంది. వాడో మూర్ఖుడు.
లేబుళ్లు:
మన సాహితీ సంపద
26, జులై 2013, శుక్రవారం
తెలుగు పద్యం చిరంజీవి
కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే అంటూ లోగడ ఓ బ్లాగు టపా రాసేను. దానిని ఇక్కడ నొక్కి చదవొచ్చును. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ పద్యం మీద ఓ రెండు పద్యాలు చూడండి ...
పద్యమ్ము నెవడురా పాతి పెట్టెదనంచు
నున్మాదియై ప్రేలుచున్నవాడు ?
పద్యమ్ము నెవడురా ప్రాతవడ్డది యంచు
వెఱ్ఱివాడై విఱ్ఱవీగు వాడు ?
పద్యమ్ము ఫలమురా ! పాతిబెట్టిన పెద్ద
వృక్షమై పండ్ల వేవేల నొసఁగు !
పద్యమ్ము నెప్పుడో పాతి పెట్టితి మేము
లోకుల హృదయాల లోతులందు !
ఇప్పుడద్దానిఁబెకలింప నెవరి తరము ?
వెలికి తీసి పాతుట యెంతటి వెఱ్ఱితనము ?
నిన్నటికి మున్ను మొన్ననే కన్నుఁదెఱచు
బాల్య చాపల్యమున కెంత వదఱుతనము !?
( కడిమెళ్ళ వర ప్రసాద్ )
పద్యం మీద మరో పద్యం చూడండి ...
పద్యము భారతీసతికి పాదయుగంబునఁబెట్టినట్టి నై
వేద్యము శ్రోత్రతాజన వివేకము, నవ్య మనోహరమ్ముగా
చోద్యముఁగొల్పు చుండు, కవిసూరి జనాళికి, పూర్ణ భావ సం
హృద్యము, పూర్వరాడ్జన వరిష్ఠ విశిష్ఠ వరప్రసాదమున్.
( వద్దిపర్తి పద్మాకర్ )
తెలుగు పద్యం చిరంజీవి..
లేబుళ్లు:
తెలుగు పద్యం
20, జులై 2013, శనివారం
చప్పట్ల బాబా ...
చప్పట్ల బాబా నాకో బంపర్ ఆఫర్ ఇచ్చేడు. అదివిని దభీమని నేలమీద దఢాలున స్పృహ తప్పి పడి పోయాను. వంట గదిలో మా ఆవిడ పరిస్థితీ దాదాపు అలాగే ఉన్నట్టుంది. కథా మంజరీ ... ఏఁవండీ కథామంజరీ అంటూ బాబా చప్పట్లు చరిచేరు. చప్పట్ల మహిమ చేత నేను స్పృహ లోకి వచ్చేను.
‘‘నేను విన్నది నిజఁవేనా ? ’’ అడిగేను బేలగా.
‘‘ ఇందులో అబద్ధానికేఁవుంది ? ... తిట్ల బాబాలూ, బెత్తం దెబ్బల బాబాలూ, కాలి తాపుల బాబాలూ లేరూ ? అలాగన్న మాట ! మనం కేవలం చప్పట్ల బాబాలం, మహా అయితే భక్తుల అరచేతులు నొప్పెట్టడం తప్పితే అంతకన్నా అధికంగా హింస ఉండదు. కాలి తాపులూ, బెత్తం దెబ్బలూ వగైరాలు వికటిస్తే, ఆ తన్నులూ. దెబ్బలూ ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. మనకెందుకా బాధ ? మన భక్తవర్యులు చక్కగా, తనివితీరా ఊగిపోతూ చప్పట్లు చరుస్తూ ఉంటారంతే. ఆవిధంగా మనం ముందుకు పోతాం. ఆధ్యాత్మిక సేవ చేస్తాం. మనకెలాగూ ప్రభుత్వోద్యోగాలు వచ్చే సావకాశం లేదు. ప్రైవేటు జాబులూ మన చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఇవ్వడానికి సాహసించరు. వ్యాపారాలనికీ మనకీ చుక్కెదురు. ఒక్కటీ కలిసి రావడం లేదు. అంచేత సుదీర్ఘంగా ఆలోచించేక చప్పట్ల బాబాగా అవతరించి ఆధ్యాత్మిక సేవ చేసి నాలుగు రాళ్ళు వెనకేసు కోవడమే మంచిదని నిర్ణయానికొచ్చేను. ఉదరపోషణార్ధం బహుకృత వేషమ్ అని పెద్దలు శెలవిచ్చేరు కదా. తప్పు లేదు. ప్రజలు పిచ్చి ముండా కొడుకులవడం మన తప్ప కాదు కదా ? ఎవరి ఖర్మ వాడిది. ఎవడు చేసిన తప్పుకి ఫలితం వాడనుభవిస్తాడు...’’
‘‘ మరి .. బూడిదలూ గట్రా ఇవ్వడం లాంటిది ఏఁవన్నా ఉందా ? ...’’ అడిగేను నంగిగా.
‘‘ అవన్నీ ఓల్డు ఫేషన్ కథామంజరీ ... మనం ఆల్ట్రా మోడ్రన్. అంచేత మనం అలాంటివేవీ ఇవ్వం. వయసులో ఉన్నవారికి అబ్బాయిలయితే సినీతారల ఫోటోలూ, అమ్మాయిలయితే యువ హీరోల ఫోటోలూ ఇస్తాం. పెద్దవాళ్ళకి రాజకీయ నాయకుల ఫొటోలూ, వృద్ధులయితే దేవుళ్ళ ఫొటోలూ ప్రసాదిస్తాం. దీనివలన బహుముఖమైన లాభాలు ఉన్నాయి. యువతరం సంతోషిస్తుంది. రాజకీయ నాయకులూ, సినిమాతారలూ మనపట్ల వ్యతిరేక భావంతో ఉండరు. పాపం, బాబా అభిమానాన్ని మనం ఎందుకు కాదను కోవాలీ అని సమాధాన పడతారు. మన జోలికి రారు. పైపెచ్చు చప్పట్ల భక్త బృందంలో చేరినా చేరే అవకాశమూ ఉంది. దానితో మన పాప్యులారటీ పెరిగుతుంది. మన చుట్టూ ఓ రక్షణ కవచం దానంతట అదే ఏర్పడుతుది. అన్నట్టు దానివలన పోలీసులు కూడా మనపట్ల ఉదాసీనభావంతో ఉంటారు,
ఇక పోతే, ఈ తొక్కలో జర్నలిష్టులు ... టీవీల వాళ్ళూ ... పేపర్ల వాళ్ళూ ... వీళ్ళ వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇన్విష్టిగేటివ్ జర్నలిజమూ వాళ్ళ పిండాకూడూనూ. అందు చేత మనఁవే ముందుగానే వాళ్ళని చప్పట్లు కొట్టి పిలిచి
మన చప్పట్ల ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకూ తావు లేదనీ వివరిస్తాం. ఏదో మమ్మల్నిలా బతకనివ్వండని కన్నీళ్ళ పర్యంతమై ఆఫ్ ద రికార్డుగా వేడుకుంటాం. వాళ్ళు కనికరించేరో సరేసరి. లేదూ మన గురించి అవాకులూ చవాకులూ ప్రచారం చేస్తే మనకొచ్చే బాధ ఏమీ లేదు. వ్యతిరేక ప్రచారాన్ని మించిన ప్రచారం మరొకటి లేదనే సంగతి తెలిసినదే కదా.
అదలా ఉంచితే, ఈ సినిమా తారల ఫొటోలూ, రాజకీయ నాయకుల ఫోటోలూ పందేరం చేయడమేఁవిటి హన్నా ! అని ఎవరయినా చిందు లేసారనుకుందాం. ఏమీ, భగవంతుడు సర్వాంతర్యామి, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అలాంటి దేవుడు రాజకీయ నాయకులలోనూ. పినిమా తారల లోనూ ఉండడా ? ఉండడనుకోవడం దైవ దూషణ కాదా ? మహా పాపం కాదా ? కళ్ళు పోవా ? అని ఎదురుదాడి చేస్తాం. అప్పటికీ మన పప్పులుడక్క పోతే దుకాణం మూసేస్తాం. అంతే. ’’
ఇంతకీ ఈ చప్పట్ల బాబా ఎవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? లోగడ కథామంజరిలో సరదాకి అనే లేబిల్ క్రింద మా తింగరి బుచ్చి అనే వాడి గురించి చాలా చెప్పడం జరిగింది. ఆ తింగరి బుచ్చే ఈ చప్పట్ల బాబా. అసలింతకీ బాబాల గత చరిత్ర గురించి కూపీ తియ్యబోవడమంత పాపం మరొకటి లేదు. ఏరుల జన్మంబు, శూరుల జన్మంబు లాగే బాబాల జన్మంబు ఎవరికీ తెలియదు. తెలీడానికి వీల్లేదు.
ఇక, మన చప్పట్ల బా నాకిచ్చిన బంపరు ఆఫరు గురించి ఇంకా చెప్పవలసే ఉంది కదూ ?
‘‘ ఓయి కథామంజరీ, అంచేత నేను చప్పట్ల బాబాగా అవతరించిన తరువాత నువ్వు చప్పట్ల బాబా ప్రవచనాలు అంటూ ఓ నాలుగయిదు చిన్న చిన్న పుస్తకాలు రాసి పెట్టాలి. ఒక్కోటీ పది ఇరవై పేజీలకు మించ నక్కర లేదు. అలాగే చప్పట్ల బాబా మహిమలు అంటూ మరో మూడు నాలుగు పుస్తకాలు రాసి పెట్టాలి. ఆ మహిమల గురించి చదివేక నేనే ఆశ్చర్య పోవాలన్నమాట. ఆ కల్పనా శక్తి నీకుంది నాకు తెలుసు. ప్రవచనాలూ. మహిమలూ అన్నీ నీ ఊహాజనితాలే కావాలి. కొత్తవే రాస్తావో, ఎక్కడినుండయినా ఏరుకొస్తావో అది నీ ఇష్టం. పుస్తకాల ప్రచురణ వ్యయం గురించి నీకేమీ దిగులక్కర లేదు. అదంతా మా చప్పట్ల ఆశ్రమం చూసుకొంటుంది. నీకు రాయల్ట్రీ గట్రా దొరుకుతుంది. మిగతా వాటి సంగతికేం గానీ ఇలాంటి పుస్తకాలు వేడి పకోడీల్లా అమ్ముడయి పోతాయి. నాది గ్యారంటీ. చెప్పు ఈ డీల్ నీకు సమ్మతమేనా ? ఈ ఒప్పనందం ఖరారయితే నీకు మరో బంపర్ ఆఫర్ ఉంది. అదేఁవిటంటే ..మా చప్పట్ల ఆశ్రమానికి చెందే ట్రష్టు బాధ్యతలు నీకే అప్పగిస్తాను. ఆలోచించుకో ...’’
ఆలోచించడానికేమీ లేదు. నా వల్ల కాదు అనీపాను నిక్కచ్చిగా. మరో సారి చెప్పి చూసి నీఖర్మం అని పెదవి విరిచేసాడు ( కాబోయే ) చప్పట్ల బాబా.
చప్పట్ల బాబా భవిష్య ప్రణాళిక వింటూ ఉంటే నాకు చప్పున ఓ పద్యం గుర్తుకు వచ్చింది. అవధరించండి ...
ఎక్కడి మంత్ర తంత్రములవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషమ్ములవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక పూర్వకృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్టకూటికిది వేషమయా శరభాంక లింగమా !
అని సరిపుచ్చుకొని. ‘‘ సరే కానీ, బాబా అన్నాక భక్తులకు రవంతయినా ఆధ్యాత్మిక బోధనల చేయాలి కదా ? ... మనకి చూసొచ్చిన సినిమా కథలు చెప్పడఁవే సరిగా రాదు ... ఎలా మేనేజ్ చేస్తావ్ ’’ అనడిగేను.
‘‘ అవును. ఆ విషయమూ ఆలోచించేను. అందు కొంత హోమ్ వర్క్ చేసాను.
సత్యాన్ని మించిన అసత్యం లేదు,
హింసను మించిన అహింస లేదు.
ఙ్ఞానాన్ని మించిన అఙ్ఞానం లేదు,
ఇలాంటి కొత్త భావజాలంతో ఉసన్యసిప్తాం. అర్ధం కావడం లేదు గురూజీ అనే మొండి భక్తుల నోళ్ళు
అర్ధం కాక పోవడమే అర్ధమవడంరా మూఢ భక్తుడా ! అని మూయిస్తాం.
మరో విషయం ... ఎవరికీ చెప్పనంటే చప్పట్ల రహస్యం నీకు చెబుతాను ... విను ...
మన భక్తులు ఊగిపోతూ, తన్మయత్వంతో, ఒకరిని మంచి ఒకరు పెద్దగా చప్పుడు చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారా ! ... అప్పుడు ప్రారంభిస్తామన్నమాట మన తాత్విక బోధనలు. మనం ఉపన్యాసం యిస్తున్నామో, ఊరికే పెదవులు కదిలిస్తున్నామో ఎవరూ పోల్చుకో లేని విధంగా ఉంటుందన్నమాట. దాంతో మన అఙ్ఞానం పదిలంగా ,భద్రంగా, గూఢంగా ఉండి పోతుంది. చప్పట్ల హోరులో ఏఁవీ వినిపించి చావక పోయినా బాబా ఏదో చెప్పి ఉంటారనే భావనతో భక్తులు పట్టించు కోరు. అదీ మన చప్పట్ల రహస్యం...’’ అని ముగించేడు చప్పట్ల బాబా.
నేను నివ్వెర పోయాను. నా ఙ్ఞానాంధకారం నశించి . అఙ్ఞాన కిరణాలు అంతటా ప్రసరించేయి. నా తల వెనుక ఓ తేజో చక్రం కాస్సేపన్నా తిరిగి ఉంటుంది. ధన్యోస్మి.
జై ... బోలో ... చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ! ... అంటూ చప్పట్లు కొడుతూ అరిచేను.
చప్పట్ల బాబా తన తొలి భక్తుడిని చూస్తూ చిరు నవ్వులు చిందించారు.
1.
8, జులై 2013, సోమవారం
ఖర విలాపం ...
ఇదేమయినా బావుందా , చెప్పండి ..‘కట్నం తీసుకునే వాడు గాడిద ’ అని ఓ టీ.వీ ఛానెల్ అడపా దడపా హెచ్చరించడం మా గాడిదల దృష్టికి వచ్చింది. మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
ఏ గాడిదయినా నవ్వి పోతుంది. గాడిదలు కట్నం తీసు కోవడమేమిటి ! గాడిదలు కట్నం తీసుకున్న వైనం ఎక్కడయినా చరిత్రలో విన్నామా ? కన్నామా ? మరి కట్నం తీసుకునే వాడిని మాతో పోలిక తేవమేఁవిటి ? చోద్యం కాక పోతేనూ ! మధ్యలో మా వూసెందుకూ ఎత్తడం మేఁవంటే చులకన కాక పోతేనూ ? వెనుకటి కొక తండ్రి కూడా ఆడిన మాటను తప్పిన కొడుకుని గాడిదా ! అని తిట్టడం, వీడా కొడుకని గాడిద ఏడవటం జరిగింది. ఇలా ప్రతీ వాళ్ళకీ అలుసై పోవడం మాకు చాలా కష్టంగా ఉంది.
అందుకే త్వరలో జరగబోయే మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలో ఈ దారుణాన్ని నిరసిస్తూ ఓ తీర్మానం పెట్టబోతున్నాం. మానవ హక్కుల వారి దృష్టికి ఈ విషయం తీసికెళతాం. హన్నా ! గాడిద లంటే అంత చులకనా ; అంటే కొంత చులకన ఉండొచ్చని అర్ధం కాదు. గానానికి మేఁవూ, అందానికి లొటిపిటనూ చెప్పు కోవాలని మా మధురవాణి అక్కయ్య చెప్ప లేదూ ...ఏఁవిటీ ... వెక్కిరింతగా చెప్పిందంటారా ? ఎలా చెప్పిందని కాదు ... చెప్పిందా లేదా ? అంటే లోకంలో మా అందం గురించి ఎంతో కొంత చర్చ ఉండడం బట్టే కదా ? నిజానిజాలు పైవాడి కెరుక. చూసే అందం చూసే వాడి కళ్ళలో ఉంటుంది. గాడిద పిల్ల గాడిదకి ముద్దు. అలాగే గాడిదల అందం గాడిదలకే సొంతం. మా వినయ గుణమే మాకు అందం. గుర్రాన్నీ గాడిదనూ ఒక తాట కట్టొద్దని చెప్పడం గురించి అంటారూ ? దాని గురించి కూడా మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. గుర్రాల దేం అందం లెద్దురూ . గాడిద గుడ్డు అందం. అదిగో... ఈ ధూర్త మానవుల మాటలు చెవిని పడి పడీ మాకూ అనుకోకుండా అవే మాటలు వచ్చేస్తున్నాయి కదూ ? గాడిద గుడ్డేఁవిటి ? గాడిద గుడ్డు.
గాడ్ ద గుడ్ అనే దానికి వచ్చిన పాట్లు అవి. ఈ మాటని కూడా లోక వ్యవహారం లోనుండి తరిమేసేలా మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభ చర్యలు తీసుకుంటుంది.
గంగి గోవు పాలు గరిటడైనా చాలుట. కడివెడైనా ఖరము పాలు శుద్ధ దండగ అంటాడు ప్రజాకవి, గోవు మా లచ్చిమి అంటే మాకూ గౌరవమే కానీ మా పాల గురించి అలా అనడం ఏమన్నా బాగుందా చెప్పండి ? ఏమీ, మా బిడ్డలు మా పాలు తాగి ఏపుగా పెరగడం లేదా ? మమ్ములనూ, , మా పాలనూ హేళన చేస్తూ మా మనోభావాలను కించ పరచడం బాగుందా ?
వసుదేవుడంతటి వాడు మా జాతివాని కాళ్ళు పట్టు కొన్నాడే ! తెలుగు సంవత్సరాలలో ఖరనామ వంవత్సరంగా అజరామరంగా నిలిచేమే ? ఒక దేవజాతి ముఖాకృతిగా కలవారమే ! అట్టి మాకా ఈ దుర్గతి ... మా పట్లనా ఇంత చులకన భావం. ?
అధికారికి ముందూ, గాడిదకు వెనుకా ఉండ కూడదంటారు. అలా వాటంగా వెనక్కాళ్ళు రెండూ ఒకేసారి ఎత్తి తన్నగల మరో ప్రాణి లోకంలో ఉందా చెప్పండి ? అదీ మా ఘనత ! దానిని గుర్తించ రేమీ ?
మాలో కంచర గాడిదలూ, అడ్డ గాడిదలూ ఉన్నాయంటారు, సార్ధవాహుల సామాన్లు మోసే కంచర గాడిదల ఉన్నాయి కానీ నిజానికి అడ్డ గాడిదలంటూ మాలో వేరే జాతి గాడిదలంటూ ఏవీ లేవు. అట్టివి నరజాతిలో ఉన్నట్టు వినికిడి.
ఎందుకంటే, వెనుకటికి ఓ కవి సభలో ఓ సమస్యను పూరిస్తూ, ‘‘ కొందరు భైరవాశ్వములు ... అంటూ చెబుతూ .. కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు అని మమ్మల్ని కూడా పేర్కొన్నాడు. అంచేత నరజాతిలో అడ్డగాడిదలు ఉన్నట్టు రూఢి అయినట్టే కదా !
మునిమాణిక్యం నరసింహారావు గారు బడి పంతులు. ఓ రోజు పిల్లల కాంపోజిన్ పుస్తకాల కట్ట చంకన పెట్టుకుని వస్తున్నారు. ఓ కొంటె విద్యార్ధి వారిని అల్లరి పెడదామని, ‘‘ఏఁవిటి మాష్టారూ ? గాడిద బరువు మోస్తున్నారూ ?’’ అన అడిగేడు. దానికాయన వాడి మాడు పగిలేలా జవాబిచ్చేరు. ‘‘ అవున్నాయనా ! ఇది ఒక గాడిద బరువు కాదు నాయనా ! నలభై గాడిదల బరువు ! ’’ అని ...
అలాగే ఓసారి ముట్నూరు కృష్ణారావు గారి మనవరాలు చుట్టపు చూపుగా బందరు వచ్చి, తాతగారితో హాస్యమాడదామని, ‘‘ ఏఁవిటి తాతగారూ ! మీ ఊరినిండా గాడిదలే కనిపిస్తున్నాయి ! ’’ అంది. దానికాయన తాపీగా ‘‘ అవునమ్మా, ఉన్నవి చాలక ఈ మధ్య పై ఊళ్ళ నుండి కూడా వచ్చి చేరుతున్నాయి ... ’’అని జవాబిచ్చి మనవరాలి కోణంగి తనానికి ధీటైన జవాబిచ్చేరు.
చూసారా ? జోకులు బావున్నాయి కానీ, అవీ మాతోనే ముడిపడి ఉన్నాయి. మా బతుకు అలాంటిది మరి.
మేం మోసేవి పాత బట్టల మూటలే కావొచ్చు. కానీ పాత మాటల మూటలు మోసుకుంటూ గొప్ప కవులమని విర్రవీగుతూ తిరిగే కుకవుల కన్నా మేం గొప్పే కదా ?
మా బాధ్యత మేం చేస్తున్నామంతే. మనకి చెందని పనుల్లో జోక్యం చేసుకుంటే చావు దెబ్బలు తప్పవని మా జాతి వాడే లోగడ నిరూపించేడు కూడానూ.
గుర్తుందా ? ఒక మడివేలు ఇంట ఓ కుక్క గాడిద ఉండేవి. ఓ రోజు రాత్రి యజమాని ఇంట దొంగ పడ్డాడు. కుక్కా, గాడిదా కూడా దొంగ పడడం చూసేయి. చాకలి తనని బాగా చూడడం లేదనే ఉక్రోషంతో కుక్క తన కర్తవ్యం మరచి, అరవడం మానేసింది.గాడిద ఎంత చెప్పినా కుక్క అరవ లేదు. గాడిద తన యజమానికి మేలు చేయాలనే ఆలోచనతో తనకు మాలిన పనికి పూనుకొని గట్టిగా ఓండ్ర పెట్టింది. గాఢ నిద్రలో ఉన్న చాకలి దాని అరుపులకి మేల్కొని కోపంతో దుడ్డు కర్ర తీసుకుని దానిని చావమోదాడు. త్యాగశీలి అయిన ఆ గాడిద తాను చావు దెబ్బలు తిని కూడా లోకానికి ఎంత గొప్ప నీతిని తెలిపిందో కదా ! అలాంటి త్యాగధనుల జాతి మాది.
వెనుకటి రోజులలో ఇళ్ళలో ఆవకాయలు పెట్టేడప్పుడు అమ్మలూ. అత్తలూ. పిన్నమ్మలూ వగైరాలు మావిడి కాయలు ముక్కలుగా తరుగుతూ ఉంటే పిల్లలు వాటి జీళ్ళు పట్టుకు పోయి ఇంట్లో గోడల మీద కుడ్య చిత్రాలు వేసేవారు. గోడ పత్రికలతో గో డలన్నీ ఖరాబు చేసే వారు.
ఆరాతల్లో దడిగాడు వానసిరా అనే మాట తరచుగా కనిపిస్తూ ఉండేది. వాళ్ళ రాతల్లో మాప్రస్తావన రావడం కొంచెం నొచ్చుకునే అంశమే అయినా, పిల్ల చేష్టలు ఎంతో మురినెం కదా. ఇప్పుడా బాధ లేదు. ఇళ్ళకు
రంగులు వేద్దామన్న ఆలోచన రాగానే ముందుగా మీటింగ్ పెట్టి గోడల మీద పిచ్చి రాతలు రాసేరో. తాట ఒలిచేస్తాం గాడిదల్లారా ! అనే హెచ్చరిక మా పేరు సాక్షిగా వెలువడుతుంది.
కరభము, ఖరము, గార్ధభము, గాలిగాడు ... లాంటి చాలా పేర్లు మాకున్నాయి. వాటిలో గాడిద అనే పేరే ముచ్చటగా ఉంటుంది.
అదలా ఉంచితే ...
క్షుద్ర మానవ జాతి మా పేర ఎన్ని సామెతలు పుట్టించిందో కాస్త చూడండి ...
1.గాడిదకు గడ్డి వేసి, ఆవును పాలిమ్మన్నట్టు.
2.గాడిద కూత ( ఓంఢ్ర ) గాడిదకు కమ్మనిదే కదా
3.గాడిదకు పులి తోలు కప్పితే కఱవ గలదా ?
4.గాడిదకు మంగళ స్నానం చేయిస్తే, బూడిదలో పొర్లిందిట !
5.గాడిద కేమి తెలుసు గంధపు వాసన.
6.గాడిద కొడకా ! అంగే మీరు తండ్రులు, మేము బిడ్డలం అన్నాడట.
7.గాడిద గుడ్డు గరుడ స్తంభం.
8.గాడిదలతో వ్యవసాయం చేస్తూ, కాలి తాపులకు దడిస్తే ఎలా ?
9.గాడిదతో స్నేహం కాలి తాపులకే
10.గాడిద పుండుకు బూడిద మందు.
11.గాడిద మోయదా గంధను చెక్కలు ?
12.గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్
13. గాడిదల మోత, గుఱ్ఱాల మేత
14, గాడిదలు దున్నితే, దొమ్మరులు పంటకాపులు కారా ?
15. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందిట !
ఇహ చాలు. త్వరలో జరుగబోయే అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలకు స్వాగత గీతం రాసే పనిలో బిజీగా ఉన్నాను. శలవ్...
26, జూన్ 2013, బుధవారం
ఇల్లు కొంప ఎప్పు డవుతుంది గురూ ...
సమ్యక్ భాషణం వ్యక్తికి భూషణం.
కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా:
నాన్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే2ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్.
ఎన్ని మణిమయ హారాలు ధరించినా అవి మనుషులకు అలంకారాలు కావు. ఎన్ని సుగంధాలు పూసుకొన్నా, ఎన్ని పూవులు ధరించినా, అవి మనిషికి అలంకారాలు కావు. చక్కని వాక్కుకి మించిన అలంకారం లేదు సుమా ! వాక్ భూషణమే భూషణం.
ఈ సంస్కృత శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదం :
భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ కలాభిషేకముల్
భూషలు కావు, పూరుషుని భూషితుఁ జేయు ( బవిత్రవాణి వా
గ్భూషణమే భూషణము భూషణముల్ నశియించు నన్నియున్.
అంచేత, మంచిగా మాట్లాడడమే మనిషికి అలంకారం. దేవుడు నోరిచ్చాడు. మాట యిచ్చేడు, ఆలోచన యిచ్చేడు ... కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడితే పోయేదేమీ లేదు కదా.
నోరు నొచ్చేలా శ్రీహరిని కీర్తించవయ్యా మగడా అని చెప్పేడు పోతన. మనం వింటామా. అంత సీన్ లేదు కానీ, రోజూ నాలుగు మంచి మాటలయినా పలుకుతున్నామా ? ఆలోచించాలి.
మృదువుగా మాట్లాడితే ఎవరయినా వింటారు. అలాగని పలుకులలో తేనె లొలుకుతూ, మదిలో విషాన్ని నింపుకొని ఉండడంకూడా సరికాదు.
అసలు మన మూడ్స్ బట్టి మనం మాట్లాడే ధోరణి కూడా ఉంటుందేమో ...
విసుగ్గా ఉన్నప్పుడు ఇల్లు కాస్తా కొంప అవుతుంది !
భోజనం కాప్తా పిండాకూడవుతుంది !
ఊరు కాప్తా వల్లకాడవుతుంది !
ఎదుటి వాళ్ళంతా ఎగస్పార్టీ వాళ్ళే అవుతారు !
అంచేత విసుగుని తగ్గించు కొని శాంతంగా అందరితో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.
భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ కలాభిషేకముల్
భూషలు కావు, పూరుషుని భూషితుఁ జేయు ( బవిత్రవాణి వా
గ్భూషణమే భూషణము భూషణముల్ నశియించు నన్నియున్.
అంచేత, మంచిగా మాట్లాడడమే మనిషికి అలంకారం. దేవుడు నోరిచ్చాడు. మాట యిచ్చేడు, ఆలోచన యిచ్చేడు ... కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడితే పోయేదేమీ లేదు కదా.
నోరు నొచ్చేలా శ్రీహరిని కీర్తించవయ్యా మగడా అని చెప్పేడు పోతన. మనం వింటామా. అంత సీన్ లేదు కానీ, రోజూ నాలుగు మంచి మాటలయినా పలుకుతున్నామా ? ఆలోచించాలి.
మృదువుగా మాట్లాడితే ఎవరయినా వింటారు. అలాగని పలుకులలో తేనె లొలుకుతూ, మదిలో విషాన్ని నింపుకొని ఉండడంకూడా సరికాదు.
అసలు మన మూడ్స్ బట్టి మనం మాట్లాడే ధోరణి కూడా ఉంటుందేమో ...
విసుగ్గా ఉన్నప్పుడు ఇల్లు కాస్తా కొంప అవుతుంది !
భోజనం కాప్తా పిండాకూడవుతుంది !
ఊరు కాప్తా వల్లకాడవుతుంది !
ఎదుటి వాళ్ళంతా ఎగస్పార్టీ వాళ్ళే అవుతారు !
అంచేత విసుగుని తగ్గించు కొని శాంతంగా అందరితో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.
22, జూన్ 2013, శనివారం
హిమవత్పర్వత సానువుల్లో మును పెన్నడూ ఎరుగని ఘోర విపత్తు సంభవించింది. వేలాది మందిని గంగమ్మ పొట్టన పెట్టు కుంది. ఆ విపత్తు వివరాలు అందించడంలో మన తెలుగు టి.వి లు అత్యుత్సాహంతో కొంత మదర్యాద కోల్పోతున్నాయి. వాటికి సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడో, చర్చా కార్యక్రమాలు నిర్వహించే టప్పుడో తమ పైత్యం ఒలకబోస్తూ పెడుతున్న పేర్లు అభ్యంతర కరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు నిన్న దానికి చెందిన ఒక కార్యక్రమానికి యమలోకం అని శీర్షిక ఉంచేరు. చర్చలో పాల్గొన్న ఒక పెద్దాయన అది దేవ లోకం కానీ యమ లోకం కాదనీ అసలే ఆ ప్రాంతమంతా అనుకోని ఘోర విపత్తుతో దయనీయంగా ఉంటే ఇలాంటి పేర్లు పెట్టడం తగదని హెచ్చరిండం జరిగింది. అలాగే వరద బీభత్సానికి బదరీనాథ్ అంతా బురద మయమై పోయిందని చెబుతూ ‘‘ బురదీనాథ్’’ అని శీర్షిక ఉంచి తన అతి తెలివిని మరో టీ.వీ. ప్రకటించుకుంది. ఈ జాడ్యం మన వాళ్ళకి వదిలేదెలా ? మీరూ ఆలోచించండి ...
18, జూన్ 2013, మంగళవారం
14, జూన్ 2013, శుక్రవారం
చూసే వాళ్ళు మంచి వాళ్ళయితే ఎన్ని వేషాలయినా వెయ్యొచ్చు
నిజమే నండీ ..ప్రేక్షకులు సహృదయులయితే ఎన్ని నాటకాలయినా ఆడొచ్చు ! అందుకు మేం మా సాలూరు కాలేజీలో వేసిన వేషాలే నిదర్శనం. చెబుతా వినండి ...
విజయ నగరం జిల్లా సాలూరులో నేను ఏకబిగిని 1980 నుండి 2003 దాకా 23 ఏళ్ళు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసాను. అక్కడే జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో హైస్కూలు ఉదయం పూటా, జూనియర్ కాలేజీ మధ్యాహ్నం పూటా నడిచేవి. రెండూ ఒక ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నడిచేవి. మా హైస్కూలు స్టాఫ్, కాలేజీ లెక్చరర్లు, ఆఫీసు సిబ్బంది , అటెండర్లు అంతా కలిపి 70 మంది దాకా ఉండే వాళ్ళం. ఒకే కుటుంబంలా ఉండేది. కలిసే పిక్నిక్ లూ, కలిసే స్కూలు ఫంక్షన్లూ చేసుకునే వాళ్ళం. చివర్లో మూడు నాలుగేళ్ళపాటు కాలేజీ, హైస్కూలూ విడి పోయినా, పని వేళలలో మాత్రం మార్పు లేదు.
సరే, దీనికేం గానీ, సాలూరి ప్రజలు మమ్మల్ని ఎంతగా ప్రేమించే వారంటే, మాలో చాలా మందిమి, ముఖ్యంగా హైస్కూలు టీచర్లం సాలూరు వచ్చేక మరి కదిలే వారం కాము. ఎవళం పది పన్నెండు ఏళ్ళకి తక్కువ అక్కడ పని చేయ లేదు, అందరిలోకీ నేను మరింత సుదీర్ఘ కాలం పని చేయడం వల్లనూ, కథలూ కాకర కాయలూ రాసే వాడిని కనుకనూ, సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వాడిని కావడం చేతనూ నన్ను మా సాలూరి వాళ్ళు మరింతగా అక్కున చేర్చు కున్నారు. అందుకే అక్కడి నుండి 24వ ఏట ట్రాన్సఫర్ అయి వెళ్ళి పోతూ ‘‘ మంచి గంధము సాలూరి మంచి తనము ’’ అన్నాను. ఇందులో రవంత అతిశయోక్తి లేదండీ.
ఆరుద్ర నవరసాలూరు సాలూరు ! అన్నారు. సాలూరి రాజేశ్వరరావూ , ఘంటసాల మాష్టారూ. సాలూరి చిన గురువు గారూ ఆ మట్టి వాసన పీల్చిన వారే కదా !
ఆ రోజుల్లో మా విద్యా సంస్థ ప్రతియేడూ ఠంచనుగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేది.
మా మినిష్టీరియల్ స్టాఫ్ లో చుక్కా దంతేశ్వర రావు అని ఒకాయన జూనియర్ అసిస్టెంట్ ఉండే వారు. అయనకు నాటకానుభవం మెండు. మంచి నటులు, పరిషత్ పోటీలలో కూడా చాలా బహుమతులు గెల్చకున్ననటులు. ఓ ఏడాది మా మేష్టర్లతో ఓ నాటిక కాలేజీ వార్షికోత్సవంలో వేసి తీరాలని పట్టు బట్టేరు. నాటిక పేరు ఇప్పుడు నాకు గుర్తు లేదు. కాలేజీ స్టాఫ్ నుండీ, హైస్కూలు సిబ్బంది నుండీ, ఆఫీసు సిబ్బంది నుండీ నటులను ఎన్నిక చేయడం జరిగింది. అంతా ఉత్సహంగా ముందు కొచ్చేరు.
‘‘ జోరా మేషారూ ! మీరూ ఓ వేషం వేసి తీరాలండీ ’’ అన్నాడు మా దంతేశ్వరరావు.
నా పేరు అసలే చాలా కురచ. నాలుగే అక్షరాలు . జో –గా – రా – వు. అంతే ! దానిని మా మేష్టర్లు మరింత కుదించి, జోరా మేషారూ అని పిలిచే వారు. నా పేరులో రెండక్షరాలు ఎలాగూ మింగేస్తున్నారాయె ! కనీసం మేష్టారులో ష కింద ట కూడా తినెయ్యాలా చెప్పండి అనేవాడిని.
ఎవరూ వినేవాళ్ళు కారు. నేను ఎప్పటికీ వాళ్ళకి జోరా మేషారినే.
‘‘ పోదూ, నేను వేషం వెయ్యడ మేఁవిటి ?’’ అన్నాను.
‘‘ మీరు వెయ్యందే మేమూ వెయ్యం, మీరు కాదంటే ప్రన్సిపాల్ గారితో చెప్పించి మరీ ఒప్పిస్తాం ’’ అని ముద్దుగా బెదిరించేరు.
‘‘ ఆ డైలాగులూ అవీ బట్టీ పట్టడం నా వల్ల కాదు. అదీ కాక మీకు తెలుసు కదా. నాకు మతి మరపు జాస్తి. ఏ డైలాగు తరువాత ఏది చెప్పాలో నాకు గుర్తుండి చావదు. నామానాన నన్నొదిలేద్దురూ ! ’’ అన్నాను.
అదేం కుదర్దు అన్నారంతా. ఏపుగా ఉంటారు కదా ఎస్ ఐ వేషం వెయ్య మన్నారు. నాటిక చూసేను. ఆ పాత్రకు డైలాగులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నా వల్ల కాదు పొమ్మన్నాను. ఓ బంట్రోతు పాత్ర చాలా తక్కువ డైలాగులతో ఉన్నట్టుంది. అదయితే చేస్తానన్నాను.
‘‘ అదా ! పెద్దవాళ్ళు ... మీకు బావోదేమో ’’ అన్నాడు.
‘‘‘‘ నటన ప్రథానం కానీ వేషంతో పనేమి ’’ టన్నాను ఏదో తెలిసినట్టు.
‘‘ఏదో, మీరూ మాతో పాటే స్టేజీ ఎక్కుతున్నారు. అదే చాలు ’’అని అంతా సరే అన్నారు.
అందులో నావి మొత్తం ఆరు డైలాగులు.
1. చిత్తం
2. చిత్తం బాబయ్యా
3. చిత్తం ..అలాగే నండయ్యా, అలాగే కానియ్యండి
4. చిత్తం ... చిత్తం
5. చిత్తం ..అలా అనకండయ్యా ...
6. చిత్తం .. దండాలయ్యా.
సరిగ్గా ఇవే కాక పోవచ్చును కానీ, దాదాపు ఇవే పొడిమాటలు.
మరో సౌలభ్యం ఏమిటంటే, ఇవన్నీ వేరు వేరు చోట్ల ఒకేనటుడితో, అదే ఇంటి యజమాని వేషం వేస్తున్న మా దంతేశ్వరరావుతో నేను అనాల్సిన డైలాగులు.
‘‘ మొత్తం ఆరు చిత్తాలున్నాయి. ఏవి ఎక్కడ అనాలో గుర్తుకు రాక పోతే నన్నేం అనకూడదు. ’’ అని ముందే చెప్పాను.
నాటకం మొదలయింది. మేష్టర్లు నాటిక వేస్తున్నారని చెప్పి సాలూరి జనం విరగబడి పోయేరు.
నాపని రంగస్థలం మీదున్న బల్లలనీ వాటినీ తుడుస్తూ ఉండడమే
‘‘ జోరా మేషారూ ! ... జోరా మేషారూ ! ’’ అంటూ మా పిల్లలూ, ప్రేక్షకులూ ఒకటే చప్పట్లు. నాలో నటుడు పెట్రేగి పోయేడు. గబగబా అన్నింటినీ తుడిచేస్తూ వీర లెవెల్లో నటించేస్తున్నాను.
నాటిక మేం ఎంత ఛండాలంగా వేసినా, ఇక్కడి జనాలు అల్లరి చెయ్యరనీ, పైపెచ్చు సరదాగా చూస్తారనీ తెలిసి పోయేక ఇక నాకు ధైర్యం వచ్చీసింది.
ఆరు చిత్తాలు కాస్త పదిహేను ఇరవై చిత్తాలు వరకూ పెరిగి పోయేయి. లెక్క చూసుకో లేదు. సరదా పుట్టి నప్పుడల్లా చిత్తం అనేస్తున్నాను. నాలోని నటుడ్ని ఎవరూ ఆప లేక పోయేరు.
ఒక చోట టేబిలు మీద ఉన్న టెలి ఫోన్ ని రిసీవర్ మీదకెత్తి తుండు గుడ్డతో తుడుస్తున్నాను. . ఆ సన్నివేసంలో ఇంటి యజమానికి ఒక ముఖ్యమైన పోన్ కాల్ రావాలి. ఆ ఫోన్ కాల్ కథని మలుపు తిప్పుతుంది. రిసీవర్ ని మీదకెత్తి తుడుస్తూ ఎంతకీ క్రెడిల్ చేయడం లేదు నేను. నౌకరు పాత్రలో జీవించేస్తున్నాను. మా దంతి ‘‘ ఫోను పెట్టండి జోరా మేషారూ ’’ అని సైగలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. చివరకి నేను రిసీవరు పెట్టకుండానే తెర వెనుక నుండి కాలింగ్ బెల్ మ్రోగడం, నా చేతిలోని రిసీవరుని మా దంతేశ్వర రావు అందు కోవడం జరిగి పోయేయి. అంతా ఒకటే నవ్వులే నవ్వులు !
‘‘ నేనింక ఈ బాధలు పడ లేనురా ... ఏ రైలు కిందో తల పెట్టీవాలనుందిరా ... ’’ అని ఇంటి యజమానిగా మా దంతి డైలాగుకి ... నేను మరో చోట చెప్పాల్సిన ‘‘ చిత్తం ... అలాగేనండయ్యా ... అలాగే కానియ్యండి ... ’’ అనీసేను.!
దాంతో మా దంతి తెల్ల బోవడం, జనాలు కేరింతలు కొట్టడం ... మరడక్కండి ...
మొత్తం మా మేష్టర్ల నాటిక రసాభాసగా ముగిసింది.
వెన్న పూసలాంటి మనసున్న మా సాలూరి జనాలకి అదేమీ పట్ట లేదు. మేం నాటిక వేయడమే చాలునన్నంతగా ముచ్చట పడి పోయేరు.
ఇలా జరిగింది నా నాటక రంగ ప్రవేశం. మరెప్పుడూ నటుడిగా స్టేజి ఎక్కింది లేదు. అందు వల్ల తెలుగు నాటక రంగం ఇప్పటిదాకా బతికి బట్ట కట్టిందను కుంటాను.
లేబుళ్లు:
తీపి గుర్తులు
6, జూన్ 2013, గురువారం
అలమండయినా ... అమలాపురం అయినా ... వాళ్ళంతే ! ... సెబాసో ..పతంజలీ !
కోనసీమలో 1996 లో పెద్ద గాలి ... వెర్రిగాలి వీచి లక్షలాది కొబ్బరి చెట్లు నేల కూలి, రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయిన విషయం తెలుసు కదా ? అప్పటి వరకూ డబ్బుకు చింత లేకుండా హాయిగా గడిపిన వాళ్ళెందరో ఒక్క రోజులోకుదేలయి పోయేరు. అక్కడి వాళ్ళు అన్న పానాదులకు కూ డా విలవిలలాడి పోయేరు. ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాల నుండి ఎందరో వారిని ఆదుకోడానికి వచ్చేరు..
ఆ రోజులలో నేను విజయ నగరం జిల్లా సాలూరు ప్రభుత్వ కళాశాలలో అనుబంధంగా ఉండే ఉన్నత పాఠశాలలో పని చేస్తూ ఉండే వాడిని. మా సోదర ఉపాధ్యాయు లిద్దరితోనూ, మా సాలూరులో ఉన్న బాలికల పాఠశాలలో పని చేస్తున్న మరి ఒకరిద్దరు ఉపాధ్యాయులతొ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి మొత్తం ఆరుగురం అక్కడికి సహాయ కార్యక్రమాలలో మా వంతు సాయం చేయడానికి బయలు దేరాం.
ఊర్లో చందాలు వసూలు చేసి మొత్తం ఇరవై వేల వరకూ పోగు చేసాం. మూడు బస్తాల పాత బట్టలు సేకరించాం. సాలూరు R.T.C డిపో మేనేజరు గారు మాకు వెళ్ళి రావడానికి ఉచితంగా బస్ పాస్ ఇచ్చి తన వంతు సాయం చేసారు.
సేకరించిన డబ్బూ, బట్టల మూటలతో తే 24 -11 -1996 దీన అమలాపురం బయలు దేరాం. ఆరు గంటల ప్రయాణంతో అక్కడికి చేరాం. దిగుతూనే పెను గాలి బీభత్సం మిగిల్చిన విషాదం చూసాం. మేం భోజనాల కోసం వెళ్ళిన హొటల్ లో సీలింగ్ ఫేన్లన్నీ రెక్కలు జడలు అల్లి నట్టుగా మెలి తిరిగి పోయి ఉన్నాయి. కిటికీ, తలుపుల రెక్కలు విరిగి పోయి ఉన్నాయి. వీధులన్నీ నానా బీభత్సంగానూ ఉన్నాయి.
మేం తెచ్చిన బట్టల మూటలు హొటల్ వారికి చూస్తూ ఉండమని అప్పగించి, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేం వచ్చిన పని చెప్పాం.
‘‘ మంచి దండీ ... రోజూ యిలా చాలా టీమ్ లు వస్తున్నాయి. వాళ్ళు తెచ్చిన బట్టలనూ, దుప్పట్లనూ మీద పడి జనాలు లాక్కు పోతున్నారు. అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు పాపం. ఒకప్పుడు నాకేమిటని బతికిన వాళ్ళు ... ఇప్పుడు తిండికీ గుడ్డకీ వాచి పోతున్నారు. మీరు ఈ మూటలని ఆటోలోనో, బస్ లోనే వేసుకుని వెళ్తారు ... మీరు పంచే లోపునే జనాలు కలియబడి పోయి ఎవరికి దొరికినవి వాళ్ళు తీసుకు పోతారు.. ఒక్కో సారయితే, ఎక్క డెక్కడి నుండో వారికి ఇద్దామని తెచ్చిన బట్టల మూటలని విధి లేక సక్రమంగా పంచే పరిస్థితి లేక మూటలు అక్కడే విసిరేసి వెనక్కి వచ్చేస్తున్నారు.కొందరు ... ఎలా చేస్తారో ... జాగ్రత్త.
మరో విషయం లోతట్టు గ్రామాలకు ఎవరూ చేరు కోవడం లేదు. సహాయమంతా ఎంత సేపూ ఈ చుట్టు పట్ల గ్రామాల వారికే అందుతోంది.
ఎదుర్లంక లాంటి గ్రామాలకి అసలు సాయమే అందడం లేదు. అక్కడి వాళ్ళు లబోదిబో మంటున్నారు ...’’ అని ఎస్.ఐ చెప్పారు.
ఎలాగయినా ఆ ఎదుర్లంక గ్రామానికి చేరుకుని అక్కడి వారికే మేం తెచ్చిన సాయం అందించాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం.
‘‘ సరే, అక్కడికి వెళ్ళగానే రాజు గారుంటారు ... వారిని కలుసుకుని మాట్లాడండి ... మీకు ఆయన సహకరిస్తారు ... ’’ అని చెప్పారు పోలీసు వారు.
ఎలా వెళ్ళాలో భోగట్టా చేసాం. అమలా పురానికి పెద్ద దూరమేం కాదు.
ఓ ప్రక్క అఖండ గోదావరి, ఓ ప్రక్క పొలాలూ .ఊళ్ళూ ఉండే సన్నని గట్టు మీద ప్రయాణం. ఎదురుగా వచ్చే వాహనాలకు దారివ్వడమే కష్టం.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గోదారి పాలవుతాం. లేదా, ఇటు వేపు దొర్లి పడతాం. వాళ్ళకా దారంట ప్రయాణం అలవాటే. మాకు మాత్రం ఏక కాలంలో బీభత్స, అద్భుత, భయానక రసాలు అనుభవంలోకి వచ్చేయి.
బస్ లో ఎరుర్లంక చేరుకున్నాం. ఊరు చిన్నదే, కానీ అక్కడ నుండి గోదావరి నదిలో పంట్ మీద యానాం చేరుకునే వీలుంది. ఇంకా అక్కడ వంతెన రాని రోజులవి. మేం తెచ్చిన బట్టల మూటలకు మేమే గట్టి బందోబస్తుగా నిలిచేం.
ఇక పోలీసు వారు చెప్పిన రాజు గారిని కలవాలి. వారి సాయం తీసు కోవాలి. మేం సేకరించి తెచ్చిన బట్టలూ, డబ్బూ నిజమైన బాధితులకి చేరాలి. ఇదీ మా సంకల్పం,
రాజు గారి గురించి ఆరా తీసాం. అక్కడ పంచె. ధోవతి ధరించి, గుబురు మీసాలతో , కొన దేరిన ముక్కుతో కనిపించిన వ్యక్తిని చూసి రాజు గారి గురించి వాకబు చేయాలనుకున్నాం. పోలీసు వారు రాజు గారిని కలవమన్నారే కానీ, వారి పేరు చెప్ప లేదు. మేమూ అడగ లేదు. ఎంత తెలివి తక్కువ పని చేసామో తెలిసొచ్చింది.
‘‘ ఎవరండీ తమరు ? ’’ దర్పంగా అడిగేరతను.
‘‘ రాజు గారిని కలవాలండీ ’’ అన్నాం ఏక కంఠంతో.
ఆయన భళ్ళున నవ్వేరు,
‘‘ ఏ రాజు గారు కావాలండీ ? ఇక్కడ చాలా మంది రాజు లున్నారు. ఎలక్ట్రిక్ రాజున్నారు. వాటర్ రాజున్నారు. రోడ్ల రాజు గారున్నారు.గుడిసెల రాజున్నారు. బోయినాల రాజున్నారు. మందుల రాజున్నారు. క్రమశిక్షణ రాజున్నారు. రిపేర్ల రాజున్నారు . పంపిణీ రాజు గారున్నారు. ... ఇందరిలో మీకు ఏ రాజు గారు కావాలండీ ?... ’’ అనడిగేరు.
మేం తెల్లబోయి , నోట మాట రాకుండా ఉండి పోయేం.
ఏం చెప్పాలో తెలియక తలలు గోక్కున్నాం.
మా అవస్థకి జాలి పడి ఆయనే ఇలా వివరించేరు ...
‘‘ మరేం లేదు .. పెద్ద గాలికి ఇక్కడి జనాల జీవితాలు ఎలా ఛిన్నా భిన్న మై పోయాయో కళ్ళారా చూస్తున్నారు కదా ? ఎక్క డెక్కడి నుండో వీళ్ళని ఆదుకోడానికి వస్తున్నారు. స్థానికంగా ఇక్కడి రాజులం మేం. మా వంతు సాయం అందించడం మాకు విధాయకం కదా ? అందుకే రాజులందరం కలిసి మాకు మేమే రకరకాల కమీటీలు వేసుకుని వారం రోజుల నుండీ సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నాం.
ఇక్కడి రోడ్లు ధ్వంస మయ్యాయి. అధికారుల చేత వాటిని యుద్ధ ప్రతిపదిక మీద బాగు చేయించే పనులను ఓ రాజు గారు తన బృందంతో పర్యవేక్షిస్తున్నారు. అంచేత ఆ రాజుగారు రోడ్ల రాజుగారన్నమాట ... అలాగే, తాగు నీటి అవసరాలు సత్వరం చూసే వాటర్ రాజుగారూ, పడి పోయిన ఎలక్ట్రిక్ స్తంభాలను నిలబెట్టించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులను చూసే ఎలక్ట్రిక్ రాజు గారూ, ఆకలితో హాహాకారాలు చేసే జనాలకి బోయినాల ఏర్పాట్లు చూసే బోయినాల రాజు గారూ, అల్లర్లు జరక్కుండా చూసే క్రమశిక్షణ రాజు గారూ ... చిన్నా చితకా రోగాలకు వైద్య సాయం అందేలా చూసే మందుల రాజు గారూ, పడిపోయిన పాకలను లేవనెత్తించే పనులు చూసే గుడిసెల రాజు గారూ ... ఇతర చిన్న చిన్న రిపేర్లను దగ్గరుండి చూసుకునే రిపేర్ల రాజుగారూ ... సహాయ కార్యక్రమాలను సజావుగా జరిగేలా చూసే పంపిణీ రాజు గారూ ... ఇలా ఇక్కడ రకరకాల రాజులున్నాం. మీకు కావలసిన రాజుగారెవరో చెప్పండి ...’’
ఇదంతా వింటూ ఉంటే, పతంజలి గారి రాజు గోరు నవలలో ఓ సన్నివేశం చప్పున గుర్తుకు రావడం లేదూ ? !
క్లుస్తంగా మరో సారి దాన్ని నెమరు వేసుకుందామా ?
కొత్త వలస సంత నాడు కనబడి. అత్త జబ్బుకి మందిస్తాను దివాణానికి వచ్చీ .. అని చెప్పిన రాజు గారిని వెతుక్కుంటూ వచ్చేడు కలగాడ చిన అప్పల నాయుడు.
తీరా వచ్చేక, ఆ మందు లిచ్చీ రాజు గారిని, తెల్లగా పొడుగ్గా ఉండే రాజు గారిని . ఎల్ల గుబ్బ గొడుగులా ఉండే రాజు గారిని, మీసాలుండే రాజు గారిని, మూరెడు ముక్కుండే రాజు గారిని అక్కడ పోల్చుకో లేక తికమక పడి పోతూ ఉంటాడు.
పల్చటి. తెల్లటి గ్లాస్కో జుబ్బా,నీరు కావి లుంగీ వేసుకుని.పావుకోళ్ళు తొడుక్కుని, వెడల్పాటి నుదురు మీద అగరు బొట్టు పెట్టుకుని చెవులకు ఎర్రపొళ్ళ తమ్మెట్లు కలిగి ఉన్న పెదప్పల రాజు కనిపిస్తే, నాయుడు ఇబ్బంది పడుతూ. తల గోక్కుని, ‘‘ రాజు గోరి ఇల్లెక్కడండీ ? ’’ అనడిగేడు.
అప్పుడు పెదప్పలరాజు హుక్కా గుడ గుడ పీల్చి, నవ్వుతూ ఇలా అన్నారు :
‘‘ సంతకి చీటి లచ్చికి గాజులు లాగుందోయి నీ ప్రశ్న. రాజు గారంటే ఏ రాజు గారు ?మా కుటుంబంలో గోపాల రాజు లున్నారు ...విజయ గోపాల రాజు లున్నారు ..వేంకట విజయ గోపాల రాజు లున్నారు ...సన్యాసి వేంకట విజయ గోపాల రాజు లున్నారు ...రంగ రాజు లున్నారు.పెద రాజు గారి చంటి బాబు గారి చిన రాజు లున్నారు ..చిన రాజు గారి తాత బాబు గారి చిట్టి రాజు లున్నారు ... పెద రాజు గారి పెద బాబుగారి పెద్ద అప్పల రాజంటే, నేను ... ఇందరు రాజుల్లో నీ కెవరు కావాలోయ్ నాయుడూ ! ’’
ఆ తర్వాత ఎలాగో వారి సాయం తోనూ. ఊరి పెద్దల సాయంతోనూ మేం తెచ్చిన బట్టలను కావలసిన వారికి అందించాం. ఇంటికో రెండు వేలు చొప్పున వారు సూచించిన బాధితులకు అందించే మనుకోండి ...
అదండీ సంగతి.
అలమండయినా, అమలా పురం అయినా రాజుల మాట తీరూ, ధోరణీ, , పెంకె తనాలూ .. అన్నీ ఒక్కలాగే ఉంటాయి కాబోలు ?
సెబాసో పతంజలీ ! .. భేష్ భేష్ ... ఏం రాసే వయ్యా దివాణాల జీవితాలని !
అందుకే నువ్వు వన్ అండ్ ఓన్లీ పతంజలివి !
లేబుళ్లు:
తీపి గుర్తులు
4, జూన్ 2013, మంగళవారం
26, మే 2013, ఆదివారం
మా తింగరి బుచ్చి తింగిరి ఉపన్యాసమ్ : : .‘‘ గొప్పవాళ్ళ అసంపూర్ణ రచనలు ...’’: :
ముందుగా మీకు మా తింగరి బుచ్చిని పరిచయం చేయాలి.
ఉబుసు పోకనో, యదాలాపంగానో, ఖర్మ కాలో కథా మంజరి బ్లాగు చూసే వారికి ఈ తింగరి బుచ్చి పరిచిత పూర్వుడే ! కొత్త బిచ్చగాళ్ళ కోసం ... మన్నించాలి ! కొత్త పాఠకుల కోసం వాడిని గురించి పునశ్చరణ చేయక తప్పడం లేదు.
ఈ తింగరి బుచ్చి మా ఆవిడకి దూరపు బంధువు. పుట్టింటి వారి తరఫు బంధువనీ, అన్నయ్య వరస అనీ మా ఆవిడ తెగ మురిసి పోతూ ఉంటుంది. పుట్టింటి తరఫు బంధువు అనే మాట ఎలా ఉన్నా, వాడు అతి త్వరలోనే, మా వంటింటి బంధువయి పోయేడు.
పరిచయ మయిన తొలి రోజులలో ‘‘ మరో ఇడ్లీ వెయ్య మంటారా అన్నయ్య గారూ ? ! ’’ అని మా ఆవిడ అడిగితే సిగ్గు , మొహమాటం వగైరా వగైరాలని తెగ అభినయిస్తూ, ‘‘ఒ క్ఖటి ... ఒక్కటంటే ఒఖ్ఖటి ... ’’ అని ఇదై పోయే వాడు. ( ఏదయి పోయే వాడని మీరు నన్ను నిలదీస్తే చెప్పడం కష్టం. )
అలాంటిది, కొంత పరిచయం పెరిగాక ( అంటే వాడే మాతో పెంచు కున్నాక, ) ‘‘ చెల్లాయ్ ! ఇవాళ టిఫి నేమిటో ? ’’ అని ఆరా తీసే స్థాయికి ఎదిగాడు. తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి పోయి, తనకి ఏ టిఫిను కావాలో అడిగి ( హొటల్లో మాదిరి ) ఆర్డరు వేసి చేయించుకునే స్థాయికి చేరి సోయేడు.
నిజం చెప్పొద్దూ ?! మా తింగరి బుచ్చి గాడు మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు, నేను వేరే ఎవరో పరాయి కొంపలో ఉన్నట్టుగా ఉంటుంది !
అంత చనువు సంపాదించేసాడు మాయింట్లో.
వాడి వాలకం నచ్చక మాఆవిడకు నచ్చ చెప్పబోతే, నా మాట వినడం మానేసింది. అందుకు వాడు వేసిన మంత్రం ఏమిటంటే, ‘మా చెల్లాయి చేతి వంట అమృతమే ! ’ అంటూ ఆమెను ఉబ్బేయడమే. అన్నీ అబద్ధాలే ... ఆకాడికి అమృతం వాడేదో రుచి చూసినట్టు అని లాజిక్కు వినిపించాను. ‘‘ ఊరుకోండి ! మీకంతా కుళ్ళు ... మీరు తప్ప నా చేతి వంట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెచ్చు కుంటారు ... మీరే ఎంపుళ్ళు పెడతారు ’’ అని మూతి మూడు వంకర్లుతిప్పింది. నాలో పురుషాహంకారం విజృంభించి, ‘‘ ఆకాడికి నీ చేతి వంటని లోకం లోని ప్రజానీకమంతా తిన్నట్టు ! బిల్ గేట్స్ తిన్నాడా ? బిల్ క్లింటన్ తిన్నాడా ?
అక్కినేని నాగేశ్వర రావు తిన్నాడా ? అమితాబ్ బచ్చన్ రుచి చూసాడా ?... ఘంటసాల తిన్నాడా ? పెంటగాన్ ప్రజలు చవి చూసేరా !... చైనా వాడు తిన్నాడా ? నానీ పాట్కర్ తిన్నాడా ! ...’’ అంటూ వర్లించేను. ఆ దెబ్బకి మా ఆవిడ వారం రోజులపాటు నాతో మాట్లాడడం మానీసింది. అప్పటి నుండి మా తింగరి బుచ్చి గాడొస్తే, వొళ్ళు మండి పోతున్నా సరే, ఓర్చుకుని మౌనంగా ఉండడం మొదలెట్టాను. కన్యా శుల్కంలో చెప్పినట్టు పేషెన్ప్ ఉంటే కానీ లోకంలో బతకలేం ! ( పూర్ రిచర్డ్ ఉవాచ. గిరీశం నోటంట)
సరే, అదలా ఉంచితే , తింగరి బుచ్చి గాడి బలహీనతా, బలమూ కూడా ఒక్కటే. ! అది ... వేదికను చూస్తే వెర్రెత్తి పోవడం ! మైకుని చూస్తే మైమరచి పోవడం ! ప్రజా సమూహాన్ని చూస్తే పరవశించి పోవడం !
ఎవరెంత వెనక్కి లాగినా కించ పడకుండా అనర్గళంగా ఉపన్యాసం దంచడం ...
చాలా సార్లు వాడిని జనాలు బలవంతంగా వాడి చేతి లోని మైకుని లాక్కుని, వేదికి మీద నుండి లాగి పడేసారు. దాని కతడు ఏమాత్రమూ అవమాన పడి నట్టు లేదు. పైగా, ‘ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బ లన్నట్టు ’ అనే ఉదాత్త మయిన ఉపమానంతోనూ. ‘ మొరిగే కుక్కకే కాలి దెబ్బ లన్నట్టూ ’ అనే నీచోపమానంతోనూ సమర్ధించు కునేవాడు.
‘‘ నువ్వు గిరీశానికి తక్కువా, గణపతికి ఎక్కువా నయ్యా ’ అన్నాను ఓసారి నేరక పోయి. దాని కతడు సంతోషించేడు. గిరీశం వంటి మహాను భావుడి సంగతి ప్రక్కన పెడితే గణపతితో సమానం చేసి మన్నించడం నాకు చాలా సంతోషంగా ఉంది కథా మంజరీ !’’ అని ఆనందాశ్రువులు రాల్చేడు. ముద్దొచ్చి నప్పుడల్లా వాడు నన్నలాగే సంబోధిస్తాడు. అప్పటికి గానీ నేనెంత తప్పు చేసానో నాకు స్ఫురించ లేదు. సాహితీ ప్రియుల మనోభావాలు ఎంతగా దెబ్బ తింటాయో కదా ! అని మనసు విలవిల లాడి పోయింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా అన్నట్టు ‘‘ అంతే కాదు ... నువ్వు జంఘాల శాస్త్రికి తక్కువా, జన్ని వలస కన్నయ్యకి ఎక్కువానోయీ !’’ అనేసాను. ఈ సారి కూడా వాడు అమందానంద కందళిత హృదయారవిందు డయ్యేడు ....‘‘‘
‘‘ఎంత మాట !
జంఘాల శాస్త్రి గారితోనా పోలిక ! .. అపరాధం ! కానీ, ఆ జన్ని వలస కన్నయ్యగా రెవరోయీ ’’ అన్నాడు తన్మయంగా ... వీడికి వాడి గురించి తెలియక పోవడం నా అదృష్టం.
( వాడో పిచ్చోడు . తనలో తనే ఎప్పుడూ ఏదో వదరుతూ తిరుగుతూ ఉంటాడనే సత్యం నేను తింగరి బుచ్చికి చెప్ప దల్చుకోలేదు. )
అయిందా ?
అలాంటి తింగరి బుచ్చి అనే శాల్తీ నా ప్రారబ్ధం కొద్దీ ఈ ఉదయం మా ఇంటికి ఊడి పడి ... ‘‘ బావా ! ఎలాగయినా నువ్వో అసంపూర్ణ రచన ఒకటి వేగిరం రాసి పడెయ్యాలి !’’ అని భీష్మించుకు కూర్చున్నాడు. నేను అవాక్కయ్యాను. ( కొందరు కొన్ని విపత్కర పరిస్థితులందు ఇట్లు అవాక్కగు చుందురు కదా )
‘‘ అసంపూర్ణ రచనలంటూ ఎవరూ చెయ్యరోయి ! వివిధ కారణాల చేత వారి రచనలలో ఒకటో రెండో అలా అసంపూర్ణంగా మిగిలి పోతూ ఉంటాయంతే ...’’ అని ఙ్ఞాన బోధ చేయ బోయాను.
వాడు నవ్వి, ‘‘ నువ్వెంత అమాయకుడివి బావా ! అవి నిజంగా అసంపూర్ణ రచనలనుకుంటున్నావా ? కాదు ... కాదు ... కమ్మన్నా కాదు ! కొందరు ప్రముఖ రచయితలు మొదట్లో ఎడా పెడా రచనలు చేసి పారేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించీసుకుని, వాటిని కలకాలం పదిలంగా నిలబెట్టు కోవడం కోసం ఓ అసమగ్ర రచన రాసి పారేసి, లోకం మీద పడేస్తారు. కావాలనే ఆ రచనను అసంపూర్ణంగా రచిస్తారు. ఆ లోగుట్టు తెలీక మనం వెర్రి వెంగళప్పల్లాగా, ఫలానా ప్రముఖ రచయిత గారి అసంపూర్ణ రచన యిదీ ! అంటూ లొట్ట లేసుకుంటూ పదే పదే చదువుతాం! తెలుసా !అసలు కంటే కొసరు ముద్దనీ ... ఈ అసంపూర్ణ రచనలే వారు ముందు సంపాయించుకున్న కీర్తి ప్రతిష్ఠలను కలకాలం నిలబెడతాయ్ ఆ రహస్యం తెలియక నీబోటి వాళ్ళు ఆహా, ఓహో ! అంటూ వాటిని చదువుకుంటూ ఊఁ ... ఇదై పోతూ ఉంటారు ! ’’ అని తేల్చేసాడు.
‘‘ గోపీ చంద్ యమపాశం, రావి శాస్త్రి రత్తాలూ రాంబాబూ. అంతెందుకూ, మన అలమండ గాంధీ బాబు, అదే మన పతంజలి రాజుల లోగిళ్ళూ అలా రాసిన అసంపూర్ణ రచనలే ! కాక పోతే వాళ్ళు వాటిని పూర్తి చెయ్ లేకనా ! ’’ అని తీర్మానించీసేడు.
నా నోట్లో తడారి పోయింది. నిలువు గుడ్లేసుకుని ఉండి పోయేను.
ఈ తింగరోడి మాటలకి బదులు చెప్పే సాహసం చెయ్య లేను కదా !
’‘‘ అంతెందుకూ, నీకో పరమ రహస్యం యెబుతాను విను ! అసలు ఆనాడు నన్నయ్యగారూ. పోతన గారూ కూడా ఈ ట్రిక్కు ఉపయోగించే అసంపూర్ణ రచనలు చేసి వదిలారు తెలుసా ? ’’
ఈ వదరుబోతు మాటలకి నా జవజీవాలూ కృశించి పోయేలా ఉన్నాయి.
నా పరిస్థితిని పట్టించు కోకుండా తింగరి బుచ్చి తన ఉపన్యాసం కొనసాగించేడు.
ఆ విధంబెట్టి దనిన ...
‘‘ నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతా మణితోనే అఖండ మయిన కీర్తి ప్రతిష్ఠలను మూట కట్టుకుని కూడా దానిని పదిలంగా నిలుపు కోవడం కోసం భారతం అనే అసంపూర్ణ రచన చేసాడు. రెండో, రెండున్నర పర్వాలో రాసి ఊరు కున్నాడు. అలాగే పోతన గారు కూడా ముందుగా రాసిన భోగినీ దండకంతోనే కీర్తి కాంతను స్వంతం చేసుకుని దానిని నిలుపు కోవడం కోసం భాగవతం అనే అసంపూర్ణ రచన చేసాడు ! అయితే, వారి రచనలకు మూల రచనలంటూ ఉండబట్టి ఆతర్వాత భారతాన్ని తిక్కన, ఎర్రనలూ. భాగవతాన్ని పోతన గారి కుమార రత్నమూ, శిష్య రత్నమూ పూర్తి చేసి పారేసారు ! ఆ విధంగా అసపూర్ణ రచనలుగా ఉంచేద్దామనుకున్న వారి ఆశలు కల్ల లయ్యాయి, ఆ విషయం బతికుండగా వారికి తెలియ దనుకో ... గతించేక తెలిసే అవకాశం ఎలానూ లేదు ! ...
అసంపూర్ణ రచనల వల్లనే కిర్తి ప్రతిష్ఠలు చిరకాలం ఎలా నిబెడతాయని నీ సందేహం. అవునా ? !
చెబుతా విను ! ఓ చిన్న ఉదాహరణ చెబుతాను ... విను ...
’’ అని గుక్క తీసు కోడానికి కాస్సేపు ఆగేడు.
ఆసరికి చేతిలో అట్లకాడతో సహా మా ఆవిడ బిగ్గరగా సాగుతున్న వాడి ఉసన్యాస ధోరణికి ముగ్ధురాలై యాంత్రికంగా నడుచుకుంటూ అక్కడకి వచ్చి నిలుచుంది.
వాడు తిరిగి తింగర్యోపన్యాసం మొదలెట్టాడు :
‘‘ నువ్వంతకు ముందెన్నడూ చూడని ఓ ఊరికి వెళ్ళా వనుకో ... అక్కడ అంద మయిన ఓ పదో ఇరవయ్యో ఇళ్ళ వరస కనిపించి. సంతోష పడతావు. ఆ భవన నిర్మాణ కౌశలాన్ని మెచ్చు కుంటావు. సరే వాటి మధ్య ఖర్మ కాలి ఓ అసంపూర్ణ కట్టడం కనిపించిందనుకో. నివ్వెర పోతావు. అయ్యో అనుకుంటావు. సరే, మళ్ళీ ఆఊరెళ్ళే పని నీకు పడక పోయినా ... తర్వాతి రోజులలో ఎప్పటికీ నీకా ఊరు గుర్తుకు వచ్చి నప్పుడల్లా ముందుగా ఆ అసంపూర్ణ కట్టడమే మదిలో మెదులుతూ ఉంటుంది. ఇందులో గొప్ప సైకాలజీ ఉంది. దానికి జర్మన్ లోనో, లాటిన్ లోనో, అధవా ఇంగ్లీషులోనో బారెడు పేరొకటి ఉండే ఉంటుంది. మనకికంకా తెలీదనుకో ! ఙ్ఞానం అసంపూర్ణంగా ఉండడం కూడా మనకి ఓ చక్కని అలంకారమే అనుకో ! ...
అసంపూర్ణ రచనలు చేసి లోకం మీద వదిలేసిన మహా రచయితలంతా ఈ సైకలాజికల్ పాయింట్ మాబాగా పట్టు కొన్నారు.
అందుచేతనే, గొప్ప వాళ్ళంతా అధమ పక్షం ఒకటయినా అసంపూర్ణ రచన చేస్తున్నారు. చెయ్యాలి కూడా. మరంచేత, నువ్వూ వెంఠనే ఓ అసంపూర్ణ రచన రాయాలి బావా ! ’’ అని ముగించాడు. ఆ వాగ్ధోరణికి మా ఆవిడ పరవశించి పోయి చప్పట్టు కొట్టింది. దాంతో రెచ్చి పోయి తింగరి బుచ్చి మరి కొంత సేపు ఇలా ప్రసంగించాడు :
‘‘ ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి రోజూ రుచి కరమైన వంటలు చేసి పెడుతున్నా, ఖర్మ కాలి ఓ రోజు ఉడకని అన్నమో, ఉడికీ ఉడకని కూరో చేసి, ఆ అసంపూర్ణ వంటకాన్ని మన ముఖాన తగ లేసారనుకో ! అదే మనకు చిరకాలం గుర్తుండి పోతుంది !
అసలా బ్రహ్మ దేవుడు కూడా కొన్ని అసంపూర్ణ రచనలు చెయ్య బట్టే, లోకంలో అర్ధాంతర చావులూ ... అల్పాయుష్క మరణాలూ సంభవిస్తున్నాయి. అందరికీ నూరేళ్ళే నుదుటన రచిస్తే, ఇక ఆ వెర్రి బ్రహ్మని తలుచు కునే దెవరు చెప్పు ? ...’’ అని ముగించాడు.
అప్పటికి నా ప్రాణాలు కడతేర్చుకు పోతున్నాయి.
సిగపాయ తీసి తందును కదా ! అనిపించింది కానీ మనకంత ధైర్యమేదీ ?!
అదీ కాక మా అమాయకపు శ్రీమతి వాళ్ళ అన్న గారి దివ్యమైన సలహాకి పొంగి పోయి : ‘‘ అవునండీ ... మీరు కూడా ఓ అసంపూర్ణ రచన చేద్దురూ ! ’’ అని ముందు గోముగానూ , తర్వాత శాసిస్తూనూ నిలదీసేప్రమాదం ఎలానూ పొంచి ఉంది. హతోస్మి !
ఇంతలో ... ... మా ఆవిడకు తటాలున ఏదో గుర్తుకొచ్చి. కెవ్వున అరచినంత పని చేసి చేతిలో అట్లకాడతో వంటింట్లోకి పరిగెత్తింది.
వెనుక మేమూ గాభరాగా పరిగెత్తాం.
అక్కడ ... ... పెనం మీద ఆవిడ రచించిన ఓ అసంపూర్ణ రచన --- మాడి పోయిన అట్టు రూపంలో పొగలు కక్కుతోంది. !
21, మే 2013, మంగళవారం
నీ మతం మండా ... పతంజలి కవిత ...
నీ మతం మండా
కత్తి పెట్టి దేవుడ్ని
ఒక పోటు పొడిస్తే గానీ
పొడిచి, వాడి నెత్తురు
కళ్ళారా చూస్తే గానీ
నీ మతం నిలబడదు
నీ మొగం మండా
నీ మతం మండా
అప్పటిగ్గానీ నీ మతం నిలబడదు
నీ కాళ్ళు లేని మతం
నీ కళ్ళు లేని మతం
ముక్కూ మొగమూ లేని నీ
కదల్లేని మతం
( నీ పొగ మూజూడా)
అసియ్యకరమైన
నీ మతం ప్రాకటానికి
భగవంతుడి కళేబరం కావాలి
అది బలిసి పుర్రెల పూలు పూయడానికి
నరమాంసపు టెరువు కావాలి
ఛీ !
నువ్వూ నీ మతమూ
నీ మతమూ నువ్వూనూ
ఛీ ! ఛీ !
25, ఏప్రిల్ 2013, గురువారం
కథా మంజరి బ్లాగు పేరు త్వరలో మార బోతోందా ?! ....
బ్లాగు టపా ఏదో రాసుకుంటూ ఉంటే, ఎప్పు డొచ్చేడో తెలియదు. వచ్చి, నా వెనకాల నిలబడి నేను టైపు చేయడం పూర్తి చేసే లోగా అంతా చదివేసాడు. రాయడం, అదే, టైపు చేయడం ముగించాక , వాడి శ్వాస వెచ్చగా తగలడంతో తుళ్ళి పడి వెనక్కి తిరిగి చూసాను, పళ్ళికిలిస్తూ కనబడ్డాడు. వెనకాల నుంచి మనకి తెలియ కుండా అంతా క్షణంలో చదివెయ్య గల వాడి ప్రావీణ్యం అంతా యింతా కాదు ! అసలు ఆ విద్య తోనే వాడు పరీక్షలన్నీ గట్టెక్కాడు. ఖర్మకాలి ముందు వాడు శుంఠ అయితే పాపం వీడూ పరీక్ష తప్పాల్సి రావడం కూడా అప్పుడప్పుడూ జరిగేదనుకోండి ! అది విషయాంతరం.
‘‘నువ్వెప్పు డొచ్చావు ? ’’ అన్నాను ఆశ్చర్యంగా,
‘‘నువ్వు రాయడం మొదలు పెట్టడం నేను రావడం ఒకే సారి జరిగేయి . అంతా చదివేసాను.’’
‘‘ఎలా ఉంది ? ’’ అడిగేను, మానవ సహజమయిన చాపల్యంతోనూ, కుతూహలంతోనూ, ఇంకా చెప్పాలంటే కుతి తోనూ.
చాక్లెట్ చప్పరించీసి నట్టు చప్పరించీసేడు.
గాలంతా తీసీసేడు. ఇంతకీ ఈ వచ్చిందెవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? గుర్తు లేదూ ?! మా తింగరి బుచ్చి గాడు. వాడి గురించి ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే ఇక్కడ నొక్కి చదవండి ,,,
సరే , ప్రస్తుతానికి వద్దాం. ..
‘‘ఐతే ఏమీ బాగు లేదంటావ్ ? ’’ అన్నాను నీరసంగా.
‘‘బాగుండడం, బావు లేక పోవడం నీ చేతిలో లేదు. అందుకే మార్చెయ్ ! వెంటనే మార్చెయ్ ! ’’ అన్నాడు.
‘‘ ఏమిటి మార్చేది ? నీ తలకాయ్ ’’
‘‘ మార్చ వలసి వస్తే అదీ మార్చాలి. ముందు నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు ధృఢంగా.
‘‘ ఎందుకూ ? ’’ అన్నాను కోపంగా.
‘‘ న్యూమరాలజీ ప్రకారం. కథా మంజరి పేరులో అక్షరాలు సరిగా లేవు. కొంచెం మార్చాలి. అందుకే సరైన టపాలు పెట్ట లేక పోతున్నావు. ఆ పెట్టిన వాటిని కూడా ఎవరూ చదవడం లేదు. కంటి తుడుపు కోసం అన్నట్టుగా ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ కామెంట్ లు పెట్టడం లేదు ... అవునా ? ’’అడిగాడు.
నా ఇగో మీద వాడలా దెబ్బ తీసాక, కొంచెం నీరసం వచ్చి, ‘‘ అయితే ఇప్పుడేం చేయాలంటావ్ ’’ అనడిగేను.
‘‘వెంఠనే మార్చెయ్ ! కథా మంజరి పేరు మార్చెయ్ ! ‘‘
‘‘ మార్చడం ఎందుకూ ? ’’
‘‘ ఎందుకంటే, న్యూమరాలజీ ప్రకారం నీ కథా మంజరి బ్లాగు పేరు ఏమీ బాగా లేదు. అందుకే నీ దశ అలా తగలడింది. అందుకే దాని పేరు నేను చెప్పి నట్టుగా మార్చి పారెయ్. అప్పుడు చూసుకో ! నీ బ్లాగు దశ వెలుగుతుందీ ... హిట్టులే హిట్టులు ! కామెంట్ లే కామెంటులు ! వాటిని ప్రచురించ లేక నీ చేతి వేళ్ళు నొప్పి పుడతాయనుకో ! ఒక్క రోజు కొత్త టపా వెయ్యక పోయినా మొత్తం తెలుగు బ్లాగు ప్రియులందరూ నీమీదకి దండెత్తి వచ్చే ప్రమాదమూ ఉంది ! అందు చేత వెంటనే నేను సూచించే విధంగా నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు.
‘‘ ... .. ...’
‘‘ అప్పుడిక తెలుగు బ్లాగర్లు నీ ధాటికి తట్టుకో లేక బ్లాగులు రాయడం మానుకుంటారు. బ్లాగు లోకంలో నువ్వొక్కడివే మహా రాజులా వెలిగి పోతావ్ ’’
‘‘ బ్లాగులే లేక పోతే ఇక సంకలిను లెందుకూ వాళ్ళూ మూసేస్తారు కాబోలు’’
‘‘ హ్హ ! హ్హ! హ్హ! ... అంచేత, నేను చెప్పినట్టు చెయ్. ముందో కాగితమూ పెన్నూ తీసుకుని కథా మంజరి అని ఇంగ్లీషులో రాయ్ ...’’
ప్రయత్నించి చూస్తే పోలా ? అనే బలహీనత ఆవరించి కలం కాగితం తెచ్చు కున్నాను. వాడు చెప్పి నట్టుగా రాసేను.
Katha manjari
‘‘ బావుంది. ఇప్పుడు ఆ పేరులో నేను చెప్పిన ఇంగ్లీషు అక్షరాలు చేర్చు. నేను తీసెయ్య మన్నవి తీసెయ్ ...‘‘ అంటూ నా బ్లాగు పేరుకి శస్త్ర చికిత్స మొదలెట్టాడు.
ఇంగ్లీషు పేరులో వాడు చెప్పిన చోటల్లా కొత్త అక్షరాలు ఉంచేను. పాత అక్షరాలు కొన్ని తొలగించేను.
‘‘ ఇప్పుడీ ఇంగ్లీషు పేరుని తెలుగులో ఎలా ఉచ్చరిస్తావో ఒక్క సారి చదువు ’’ అని ఆదేశించాడు
కూడ బలుక్కుని చదివాను తెలుగు పేరు.
‘‘ ఖ్ఖదా మంఝరి ’’ ... అని తయారయింది.
‘‘ వెరీ గుడ్ ! ఇక నుండీ నీ బ్లాగు పేరు ఇదే ! ఇక చూస్తో ! నీకింక తిరుగు లేదు .. ... ...అన్నట్టు ...’’
‘‘ ఇంకా ఏఁవిటి ; ’’ అడిగేను నీళ్ళు నములుతూ ...
అబ్బే, చిన్న విషయమే ... ఈ కంప్యూటర్ ఉంచిన చోటు కూడా వాస్తు ప్రకారం సరిగ్గా లేదు. అంచేత ఈ గోడ కొట్టించీసి, కంప్యూటర్ని ఆ మూలకి ఉండేలా పెట్టుకో ! అప్పుడింక నీ ‘‘ ఖ్ఖదా మంఝరి ’’ వెలిగి పోతుందీ ...’’
నా కళ్ళు బైర్లు కమ్ము కొస్తున్నాయి. నేనేదో అనబోయే లోగా ...
‘‘ చెల్లెమ్మా ! పెసరట్టు రెడీయేనా ?!’’ అనరిచేడు వంట గది వేపు తొంగి చూస్తూ.
లోపలి నుంచి వాడి ప్రసంగ మంతా వింటున్నట్టే ఉంది ... ‘‘ఆఁ ! వచ్చె ... వచ్చె ... ఒక్క నిముషం అన్నయ్య గారూ ! ’’ అంటూ వినిపించింది మా ఆవిడ గొంతు.
అనతి కాలంలో తన భర్త ప్రపంచ ప్రఖ్యాత ఏకైక తెలుగు బ్లాగరు కాబోతున్నాడని ఏవేవో ఊహించు కుంటూ కలలు కంటోందేమో , ఖర్మ !నా వెర్రి బాగుల శ్రీమతి
( సంఖ్యా శాస్త్రం పేరుతో మూఢనమ్మకాల విషాన్ని జన బాహుళ్యం లోకి వెద జల్లుతున్న ఓ తెలుగు ఛానెల్ వారికి స ‘ భక్తి ’ కంగా ఈ టపా అంకితమ్. )


















