22, ఏప్రిల్ 2014, మంగళవారం

మా తెల్లావు కథ ...... కథా మంజరి 400 వ టపా ...



ఇది కథా మంజరి 400వ టపా.

ముందుగా , ఈ కథా మంజరి బ్లాగును డిజైన్ చేసి. ఓపికగా చాలా సూచనలు చేసి, సాంకేతికాంశాలను తెలియజేసిన జ్యోతి వలభోజు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.

అలాగే, నాకు కంప్యూటరు ఉపయోగంలోని మరి కొంత సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందించిన మా సుధారాణి కి  కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

ఇప్పుడీ కథా మంజరి 400వ టపాగా మా తెల్లావు కథ రాస్తున్నందుకు

నాకు చాలా సంతోషంగా ఉంది... అదే సమయంలో ఎంతో విచారంగానూ ఉంది ...

కథా మంజరి మీద ఒట్టేసి చెబుతున్నాను. అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను.

అప్పటి శ్రీకాకుళం జిల్లా, ఇప్పటి విజయ నగరం జిల్లా లో ఉన్న పార్వతీపురం మా ఊరు. పార్వతీపురం కుట్ర కేసుతో మా ఊరి పేరు దేశమంతా తెలిసిపోయింది.

ఇరుకిరుకు సందులూ, చెత్తా చెదరాం, రోడ్ల మీద పొర్లే మురికి కాలువలూ, ఏలిన వారి దయ వల్ల , ఇవాళకీ దాదాపు మా ఊరు అలాగే ఉంది.

ఊర్లో మావీధి పేరు కంచరి వీధి. కంచర్లు ఎక్కువ కుటుంబాలు ఉండడంతో ఆ పేరొచ్చింది.. ఇత్తడి బిందెలూ, కంచాలూ, గిన్నెలూ, గ్లాసులూ మొదలయినవి తయారు చేస్తూ ఉంటారు కంచర్లు. ఇప్పటికీ దేవుడి సింహాసనాల తయారీకి మా పార్వతీపురం కంచర్లే ప్రసిద్ధి. ఎక్క డెక్కడి నుండో జనాలు వచ్చి ఇక్కడ దేవుడి సింహాసనాలు ఆర్డరు మీద చేయించుకుని పట్టు కెళుతూ ఉంటారు.

కంచరి వీధిలో మాది పెద్ద లోగిలి. తాత గారు జోగయ్య పంతులు. మా వీధిలో మా ఇంటికి చాలా పేరుంది. నవ్య సంపాదకులు జగన్నాథ శర్మ గారు అగ్రహారం కథల్లో రాసిన‘‘ జోగారావు గారి మేడ ’’ మా లోగిలి గురించే.

వీధికి ఈ కొస నుండి ఆ చివర కూ కూరాకుల మడుల వరకూ వ్యాపించిన ఇల్లు మాది.

ఆ చివర ఉండేది. పశువు శాల. బాల్యంలోచాలా రోజులు , ముఖ్యంగా వేసవి శలవులలో నేను అక్కడే గడిపే వాడిని. శాల అటక మీద నెలా రెండు నెలలకి పరిపడా ఎండుగడ్డి ఉండేది. ఆ వాసన నాకిష్టంగా ఉండేది. ఊర్లోకి టీకాలు వేసే వాళ్ళొచ్చి నప్పుడు భయపడి దాక్కోడానికీ, ఇంట్లో అలిగి నప్పుడు నిరసన తెలియ జేయడానికీ అదే నాకు అనువైన చోటు. సురక్షిత ప్రదేశం !

మా పశువుల శాలలో మా తెల్లావు రావడానికి ముందు ఒకటి రెండు గేదెలు ఉండేవని అంటారు. నాకు తెలియదు. నా చిన్నప్పుడు నేను శాలలో చూసినది మా తెల్లావునీ, దాని దూడనీ ... తెల్లావు పెయ్యి మాత్రం ముదురు గోధుమ రంగులో ఉండేది.

‘‘ నువ్వేంటే, మీ అమ్మలాగా తెల్లగా లేవూ ? ’’ అనడిగే వాడిని దాని చెవిలో. ఓ సారి మా చిన్నాన్న దాని చెవిలో నేనిలా అనడం చూసి, తెగ నవ్వుకుని ఇంట్లో అందరికీ చెప్పి నా పరువు తీసాడు.

తెల్లావు అంటే, తెల్లావే ! ఎక్కడా ఒంటి మీద ఒక్క మచ్చ కనిపించేది కాదు.‘‘ మచ్చ లేని మంచావు మా తెల్లావు ! ’’ అంటూ నా చిన్నప్పుడు గర్వంగా కవిత్వం అల్లే వాడిని కూడా.

మా తెల్లావు ఎంత మంచి దంటే, ఏనాడూ ఏ ఒక్కరి మీది కొమ్ములు ఎగరేసి ఎరుగదు.

ఉదయాన్నే మేతకి వెళ్ళి, సాయంత్రానికి ఇల్లు చేరేది. వీధి గుమ్మం దగ్గర రెండు కాళ్ళూ వీధి గుమ్మం మొదటి మెట్టు మీద ఆన్చి నిలబడి ‘‘ నేనొచ్చా !’’ అన్నట్టుగా ‘‘ అంబా ’’ అని అరచేది. అప్పుడు దాని నల్లని కాటుక కళ్ళు చూడడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ వెంటనే

‘‘ మా లచ్చిమి వొచ్చినట్టుందర్రా ... పెరటి సందు తులుపు తెరవండి ..’’ అని మా నాయనమ్మ అచ్చమ్మ గారు ,, నాయి అనే వాళ్ళం, ఆవిడ కేక ఏ వంటింట్లోంచో వినబడేది. ఆసమయంలో మా పిల్లల్లో ఎవరుంటే వాళ్ళం వీధి గుమ్మం దగ్గరకి పరిగెట్టే వాళ్ళం. వీధి మొదటి మెట్టు మీద ముంగాళ్ళతో నిలుచున్న మా తెల్లావు గంగడోలుని ప్రేమగా నిమిరి,

‘‘ పద, పద ... పెరట్టోకి రా !’’ అని మూపు మీద మెల్లగా చరిచే వాళ్ళం. వెంటనే తెల్లావు మెట్టు దిగి, ఇంటి ప్రక్క నున్న పెరటి సందు వేపు తలూపుతూ వెళ్ళేది. మేం పరుగు పరుగున పెరట్లోకి వెళ్ళి గోర్జీ తలుపు తీసి ఉంచేవాళ్ళం. మా ఇంటికీ, మా పక్కింటి గుమ్మా వారింటికీ మధ్య ఉండే గోర్జీ లోంచి అది వేగంగా వచ్చేది.వస్తూనే ఆత్రంగా అప్పటికే సిద్ధం చేసి ఉంచిన కుడితి గోళెంలో మూతి పెట్టి కుడితి తాగేది. పెయ్యి దాని పొదుగు కుమ్ముతూ పాలు తాగేది. ఆ దృశ్యం నా కంటికి అపురూపంగా తోచేది.

మా ఇంట్లో పెద్ద వాళ్ళు రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే కళ్ళు నులుము కుంటూనే పెరట్లో ఆవుల శాల దగ్గరకి వెళ్ళి మా తెల్లావుని నిమురుతూ దానికి దండం పెట్టు కుంటూ ఉండే వారు. నాకూ అదే అలవాటు వొచ్చింది. ఇక ప్రతి శుక్ర వారం, మరింకా పండుగలూ పబ్బాలూ వొచ్చి నప్పుడు మా నాయినమ్మ తెల్లావు కొమ్ములకీ, మెడకీ పసుపు రాసి, కొమ్ముల మధ్య మందార పువ్వులు పెట్టేది.

తెల్లావు ఎన్ని పాలిచ్చేదో నాకచయితే తెలీదు ... కానీ మా ఇంటి వెనుక చావిడీలో పాల గది అని ప్రత్యేకంగా వో గది ఉండేది. ఆ గదిలో ఆగ్నేయ మూల మట్టితో నలుచదరంగా చేసిన పెద్ద పొయ్యి ఉండేది. దాని మీద రోజంతా పెద్ద పాత్రలో పాలు సలసలా కాగుతూనే ఉండేవి. ఆ పాల వాసన కమ్మగా ఇల్లంతా వ్యాపించి గమ్మత్తుగా ఉండేది. సాల గది ముందు పెద్ద వసారా ఉంది. రోజు వారీ వంటలు అక్కడ చేయక పోయినా, ప్రత్యేకంగా పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం ఆ వసారాలోనే చేసే వారు. పెళ్ళి వంటల వసారా అనే వాళ్ళం దానిని.

మా తెల్లావు ఙ్ఞాపకాలలో ఇవి కొన్ని తీపి గుర్తులయితే ...

ఇక మా తెల్లావు మిగిల్చి పోయిన విషాదం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు ..

అరవై ప్రాంతాలవి. అక్కయ్య పెళ్ళి. వీధి లోనూ, వాకిలి లోనూ పదింళ్ళు వేసారు. మధ్య వాకిలిలో పెద్ద రంగు రంగుల చాందినీలు కట్టారు. ఇల్లంతా చుట్టాలో నిండి పోయింది. అప్పటికి నాకు పదేళ్ళ వయసు. సందడంతా మా పిల్లలదే. పెళ్ళికి వారం ముందుగానే చుట్టాలంతా వచ్చేరు. వంటల వసారాలో మా సూరీడత్త పర్యవేక్షనలో అరిసెల వంటకం గుమ గుమలాడి పోతోంది. నిజం చెప్పాలంటే, అక్కయ్య పెళ్ళిలో నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న అంశాలు రెండే.

ఒకటి, - పెళ్ళిలో పెళ్ళి వారికి వడ్డనలో వేసేందుకుగాను మా తోట నుండి వచ్చిన మామిడి కాయలని మా ఇంటి ఎదురుగా ఉండే స్థలంలో

( అదీ మాదే ) ఉండే కొట్టు గదిలో మగ్గ పెట్టడం. పెళ్ళి రోజు నాటికి మామిడి పళ్ళు బాగా మగ్గి , వీధి వీధంతా మామిడి పళ్ళ వాసనతో నిండి పోయేది. ఆ కొట్టు గదిలో పెళ్ళి కోసం వందలాది కాయలని మగ్గ పెట్టేరేమో, మా పెద్దలు ఎవరయినా ఆ గది తలుపులు తెరిచి నప్పుడల్లా, మా పిల్లలం గబాలున లోపలికి చొరబడి తెచ్చుకో గలిగినన్ని పళ్ళని దోసిలి నిండా తెచ్చుకుని పీల్చుకు తినే వాళ్ళం. పెద్దల అభ్యంతరం ఉండేది కాదు.

ఇక, రెండవ ఙ్ఞాపకం ... మా తెల్లావు గురించి. ...

పెళ్ళికి రెణ్ణెళ్ళ ముందే, .మా తెల్లావుని, చూలుకి వచ్చిందని మా రైతులతో పొలానికి పంపించి వేసారు. చూడి పశువులకి మంచి మేత పెట్టి రైతులు అవి ఈనే వరకూ అక్కడే ఉంచి , ఈనేక దూడతోపాటూ తిరిగి మా ఇంటికి తెచ్చి అప్పగించే వారు.

మా అక్క పెళ్ళికి రెండు నెలలకి ముందే రైతులు తెల్లావుని పొలానికి పెయ్యితో పాటూ తోలుకు పోయారు.

మా పొలాలు మా ఇంటికి దాదాపు పది పన్నెండు మైళ్ళ దూరంలో ఉండేవి. అలా వెళ్ళిన ఆవు తిరిగి ఈనేక మాత్రమే ఇంటికి వచ్చేది.

మధ్యలో రావడం అంటూ జరగదు.

ముందే చెప్పాను, అంతా నిజమే రాస్తాను, అబద్ధం రాయనని ...

అక్కయ్య పెళ్ళి రోజున మా ఇంటి వీధి గుమ్మం నుండి తెల్లావు అంబారావం వినబడింది. ఇంట్లో అందరం ఇశ్చర్య పోయేం. పెళ్ళి పనుల కోసం రైతులు రెండు రోజులు ముందే వచ్చేరు.

ఇంత దూరం వెతుక్కుంటూ తెల్లావు ఒక్కటీ ఎలా వచ్చిందో తెలియదు !

మా పెద్దల ఆనందానికి అవధి లేకుండా పోయింది ...

‘‘ సందులూ గొందులూ వెతుక్కుంటూ ఇంత దూరం ఎలా వచ్చిందర్రా ఒక్కర్తీ !’’ అంటూ అంతా ఆశచ్చర్య పోవడమే !

‘‘ పిలవక పోయినా మా మనవరాలి పెళ్ళి చూడాలని వచ్చిందర్రా తల్లి !’’ అంటూ మా నాయనమ్మ తెగ ముచ్చటపడిపోయింది.

వెంటనే తెల్లావుని గోర్జీ లోంచి ఇంటి వెనుక శాలోకి తీసికెళ్ళి, పసుపూ కుంకుమలతో, పూలతో పూజలు చేసారు.

ఇక ఆ రోజంతా పెళ్ళింట్లో తెల్లావు రాక గురించిన కబుర్లే ...

ఆ ఆనందం మాకు ఎన్నో రోజులు మిగల్లేదు ..

అక్కయ్య పెళ్ళయిన రెండో రోజో, మూడో రోజో ... ఏం జరిగిందో కానీ, మా తెల్లావు ఓ ఉదయం వెళ్ళి చూసేసరికి కుప్పగా కూలి పడిపోయి ఉంది.

పెద్దలు గుండె నిబ్బరం చేసుకుని కొంత గుంభనగా ఉన్నా, మా పిల్లలంతా గోలు గోలున ఏడిచాం. మమ్మల్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు ...

చివరకి మా తాతగారు మమ్మల్ని ఊరుకోమని చెప్పి, ‘‘ మనవరాలి పెళ్ళి చూదామనే వొచ్చింది. చూసింది. వెళ్ళి పోయింది ...పెళ్ళింట ఏడుపు లొద్దు ...వెళ్ళి పోయినా మహాలక్ష్మి దీవెనలు మనకెప్పుడూ ఉంటాయి ...’’ అంటూ మందలించేరు. సరిగ్గా ఇవే కాక పోయినా ఇలాంటివే ఏవో ఓదార్పు మాటలు చెప్పినట్టు నాకు గుర్తు.


అంతే ....

తెల్లావు పోయిన తరువాత మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న పశుపోషణ ముగిసి పోయింది.

ఆ తరువాత మరెప్పుడూ ఇంట్లో ఆవుల్ని మేం చూడ లేదు ...

పశువుల శాల కూడా చాన్నాళ్ళు దిక్కు లేని అనాథలా ఉండి, క్రమేపీ ఒక్కో రాటా విరిగి పడగా , చివరకి ఎప్పుడో కూలి పోయింది.

ఇప్పుడా ల్లూ లేదు, ఎప్పుడో అమ్మేసాం ...

తెల్లావు ఙ్ఞాపకం మాత్రం నన్ను ఆబాల్యం వెంటాడుతూనే ఉంది ...

విరిగి పడిన మంచు కొండ చరియలా మా తెల్లావు గుర్తులు ఎప్పటికీ చెరిగిపోయేవి కావు ...


గోవు మా లచ్చిమికి కోటి దండాలు ....








18, ఏప్రిల్ 2014, శుక్రవారం

కుర్చీల కథ



కప్పల కథా, చెప్పుల కథా రాయగా లేనిది కుర్చీల కథ రాస్తేనేం ?

అందుకే ఇప్పుడీ కుర్చీల కథ రాయడం జరుగుతోంది ... అవధరించండి ...

పెద్దలు కురిచీ అనే పదం దేశ్య విశేష్యమని చెబుతారు. కూర్చోడానికి వీలుగా ఉండే ఎత్తయిన పీఠమని నైఘంటుకార్ధం. కుర్చీ అని దీనికి రూపాంతరం కూడా ఉంది. అసలు కంటే కొసరు ముద్దనీ, కురిచీ అనే పదం కంటే కుర్చీ అనేదే బాగా వాడుకలోకి వచ్చింది.



సరే, ఏదయితేనేం, డబ్బూ దస్కం, నీతి నియమాలూ, మనుషుల నడుమ ప్రేమాభిమానాలూ, ... ఇలా ఏవి లేక పోయినా, కనీసం కూర్చోడానికి వో కుర్చీ అంటూ లేని కొంప ఎక్కడా ఉంటుందనుకోను.

కుర్చీ మర్యాదకి చిహ్నం. ఆతిథ్యానికి ఆనవాలు. స్వాగత వచనానికి మారు పేరు. కాసేపు సేద దీరడానికి అనువైన ఉపకరణం. విశ్రమించడమే కాదు, కాలు మీద కాలు వేసుకుని కాస్త దర్పం ఒలకబోయడానికి కూడా తగినది కుర్చీయే కదా !

చెక్క బల్ల, పీట, స్టూలు మొదలయినవి కూడా కూర్చునేసాధనాలే. ఇలాంటివన్నీ కుర్చీలకి తమ్ముళ్ళు అనొచ్చు. చిన్న చిన్న కాకా హొటళ్ళలో కూర్చోడానికి కుర్చీలకు బదులు బల్లలే వేస్తారు. పోతే, సోఫాలూ అవీ మామూలు కుర్చీలకి పెద్దన్నలు. మహా రాజా కుర్చీలయితే మరీనూ, అవి కుర్చీల కుల పెద్దలు.

‘‘ కూర్చుండ మా యింట కురిచీలు లేవు ,,,’’ అంటారు కరుణ శ్రీ. మరీ చోద్యం కాక పోతే కనీసం వో పాత కాలపు ఇనప కుర్చీ అయినా ఉండి ఉండదా ?

వో సంగతి గర్తుకొచ్చింది. చెబుతా వినండి. కరుణశ్రీ గారు మా విజీనారం సంస్కృత కాలేజీకి వచ్చి నప్పటి సంగతి. వారు మాట్లాడుతూ వో సంగతి చెప్పారు. కొంత మంది కాలేజీ అమ్మాయిలు ఓ సారి వారింటికి వచ్చేరుట. అందులో వో గడుగ్గాయి కవి గారితో ‘‘ ఏఁవండీ ... మీ ఇంట్లో ఇన్ని కుర్చీ లున్నాయి కదా ... మరి

‘ కూర్చండ మా ఇంట కురిచీలు లేవు ! ’ అని రాసేరేఁవిటండీ అబద్ధం కాదూ ? ’’ అని అడిగిందిట. కవిగారు వెంటనే ‘‘ అమ్మాయీ, అది కవిత్వం. కుర్చీలు లేవంటే లేవని కాదు దానర్ధం. ఆ స్వామి కూచోడానికి తగిన చోటులు కురిచీలు కావు... అందుకే నా హృదయాంకమే సిద్ధ పరచ నుంటి అని చెప్పారుట.ఈ విరణ ఆ అమ్మాయికి  ఏమర్ధ మయిందో కానీ ‘‘సరే లెండి ఇంకెప్పుడూ అబద్ధాలు రాయకండి’’ అందిట. అంతే సభలో నవ్వులే నవ్వులు ! చప్పట్లే చప్పట్లు ! ...



‘‘ కుర్చీలు విరిగి పోతే కూర్చోడం మాన నట్లు ...’’ అంటూ శ్రీ .శ్రీ  వో గేయంలో  కుర్చీల  ప్రస్తావన తెచ్చాడు. అగ్గి పుల్లనీ. సబ్బు బిళ్ళనీ వదలని కవి కుర్చీల మాట ఎత్తాడంటే అబ్బుర మేముంది లెండి ?

మీకు తెలిసిన పద్యమే ...

కనకపు సింహాసనమున
శునకము కూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణ మేల మాను ? వినరా సుమతీ !

కుక్కని  బంగారు గద్దె మీద కూర్చో పెట్టినా, అది దాని ముందటి  నీచ గుణం మార్చుకోదు ...

థూర్జటి కవి ఒక పద్యంలో ‘‘ ఒకరిం జంపి పదస్థులై బ్రదుక నొక్కొక్కరూహింతు రేలకో ...’’ అంటూ ఆశ్చర్య పోయాడు. అంటే, ఒకడిని పదవి నుండి కిందకి లాగేసి, ఆ పదవి తాను దక్కించు కోవాలని ఒక్కొక్కడు ఎందుకో అనుకుంటాడు. అంటే, ఒకడిని వాడి కురిచీ మీద నుండి లాగీసి తాను ఆ కుర్చీ మీదకి ఎక్కడమే కదా ఎందుకో ఈ తాపత్రయం ... ‘‘తామెన్నడు చావరో ? తమకు లేదో మృతి ?’’ అని కూడా అడుగుతాడు కవి.

అదీ కుర్చీ మహిమ ! ప్రతి వాడికీ కుర్చీ కావాలి. అంటే పదవి కావాలి. నిన్నటి వరకూ టీ డబ్బులకి టికాణా లేని నిరుద్యోగి ఉద్యోగం రాగానే కుర్చీకి అతుక్కు పోయి దర్జా వెలిగిస్తాడు. రాజకీయ నాయకులూ అంతే. పదవి వచ్చే వరకూ కాళ్ళూ గడ్డమూ పట్టు కుంటారు. గద్దె నెక్కాక మరి పట్టించుకోరు.

భరతుడు శ్రీరామపాదుకలను సింహాసనం మీద ఉంచి రాజ్యపాలన చేసాడని రామాయణ గాథ. అంటే కుర్చీ మీదే కదా ? రామపాదుకలను వహించిన ఆ కుర్చీ భాగ్యమే భాగ్యం ...

తన కుర్చీని కాపాడు కోడానికే కదా ఇంద్రుడంతటి వాడు  తపోధనుల దగ్గరకి రంభా, మేనకా మొదలయిన దేవ వేశ్యలను పంపిస్తాడు ?



కుర్చీ కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంత మారణ హోమం జరిగిందో లెక్క లేదు. గతమంతా తడిసె రక్తమున. కాకుంటే కన్నీళులతో .  ఒకప్పుడు మనిళ్ళలో గాడ్రెజ్ కుర్చీలని ఇనుప కుర్చీలు తెగ కనిపించేవి. ప్టాస్టిక్ యుగం మొదలయ్యేక మరుగున పడి పోయేయి..

కూర్చునేందుకు వీలుగా వాడే వన్నీ కుర్చీలే అయినా, కుర్చీల పెద్దన్నలది మరో దారి. సోఫాల పేరుతో వ్యవహరించ బడే వారి దర్జాయే వేరు. వాటిలో మళ్ళీ కుషన్ సోఫాలు మరీ ప్రత్యేకం. సగం ఇంటిని అవే ఆక్ర మిస్తాయి. పెద్ద పెద్ద ఇళ్ళలో అయితే ఫరవా లేదు కానీ, చిన్న కొంపల్లో కూడా దర్జా వెలగ బెట్టడం కోసం పెద్ద పెద్ద సోఫాలు ఇరుగ్గా ఇరకాటంగా కనిపిస్తూ ఉండడం చూస్తుంటాం.. ఆధిక్య ప్రదర్శనకి అదో సద్ధతి మరి ...




సన్మాన సభల్లోనూ, వివాహ వేడుకల్లోనూ ప్రత్యేకంగా ఉపయోగించేవి మహారాజా కుర్చీలు. ఇవి వెనుకటి రోజుల్లో రాజుల సింహాసనాల్లా గొప్ప హోష్ గా ఉంటాయి.


కృష్ణ దేవరాయల వారి సభా భవనంలో ఎనిమిది కుర్చీలను ప్రత్యేకంగా వేసే వారు. అందులో అష్ట దిగ్గజకవులు ఆసీనులయేవారు. అందులో పెద్ద కుర్చీ పెద్దనది.

వెనుకటి రోజులలో సినిమా హాళ్ళలో నేల, బెంచీ, కుర్చీ, బాల్కనీ అనే తరగతులుండేవి. నేలంటే నేలే. కటిక నేల మీదో, ఇసక మీదో కూర్చుని తమ చుట్టూ మరొకరు చేరకుండా ఉమ్మి వేసి ఆ స్థలాన్ని వో దుర్గంగా మార్చీసుకుని మహా విలాసంగా సినిమా చూసే వాళ్ళు.. సోడాల వాళ్ళూ, జంతికలు, కరకజ్జాలూ. వంటి తినబండారాలమ్మే వారి అరుపుల తోనూ నేల తరగతి నానా గలీజుగా ఉండేది. ఈలలూ. చప్పట్లూ తెగ బీభత్సం చేసేవి. మరో అణావో, బేడో పెడితే బెంచీ క్లాసు. ఆపైది కుర్చీ క్లాసు. బాల్కనీ తరగతి మరీ ధనవంతుల తరగతిగా ఉండేది. మరీ టూరింగు హాళ్ళలో నయితే, కొన్ని కుర్చీలు ఊరి పెద్ద మనుసుల కోసం స్పెషల్ గా వేసేవారు. అసలు, వారొచ్చి, ఆ కుర్చీలను అలంకరిస్తే కానీ ఆట మొదలయేది కాదు. సినిమాకే కాదు, నాటకాలకీ, హరికథలకీ, ఇతర సభలకీ కూడా అంతే.

సభలలో అయితే కుర్చీలను ‘‘ఆసనం’’ అని గౌరవిస్తూ ఉంటారు. ఫలానా వారు వచ్చి తమ ఆసనాన్ని అలంకరించాలని కోరుతున్నాము అంటే వచ్చి కుర్చీలో  కూచుని ఏడవరా నాయనా అనే అర్ధం.

భోజనం బల్లలని ( డైనింగు టేబిళ్ళని ) కుర్చీల సంక్యతోనే చెప్పడం వొక రివాజు. గమనించేరా ? మా ఇంట్లో డైనింగు టేబిలు ఆరు కుర్చీలదండీ ... అంటే, మా ఇంట్లో నాలుగు కుర్చీలదే సుమండీ, అదయితేనే సౌకర్యంగా ఉంటుంది అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి ...

ఇంటర్య్యూలకి వెళ్ళే అభ్యర్ధులకి అధికారులకి ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలలో వెంటనే కూర్చోవాలా ? వాళ్ళు అనుమతిస్తేనే కూర్చోవాలా అనేది తెగని సమస్య. ఎంతకీ వాళ్ళు కనికరించకుండా కూర్చోమనక పోతే వాళ్ళడిగే చొప్పదంటు ప్రశ్నలకి కాళ్ళు పీకేలా నిలబడే జవాబులు చెప్పాలి.

టేకిట్ యువర్ ఛైర్ .. అంటే,  నీ కుర్చీ నువ్వుమోసుకొని ఫో అని అర్ధం ఎంత మాత్రమూ కాదు.

కుర్చీకుండే నాలుగు కాళ్ళూ సరిగా లేక పోతే దభాలున కింద పడడం తథ్యం. అందు వల్ల కొందరు బుద్ధిమంతులు ఎందుకయినా మంచిదని కూర్చునే ముందు కుర్చీని కొంచెం  లాగి, కదిపి మరీ చూసుకుని ఏ ప్రమాదమూ లేదని నిశ్చయించు కున్నాకే అందులో కూర్చుంటారు.

ఒకప్పుడు వీధి బడుల్లో తుంటరి పిల్లలు అయ్యవార్ల కుర్చీల కింద టపాసులు పెడుతూ అల్లరి చేసేవాళ్ళు.

కుర్చీలగురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది.



పడక కుర్చీ వైభోగమే వేరు. అందులో ఉంటే సగం కూర్చున్నట్టూ, సగం పడుకున్నట్టూ ఉంటుంది. వయసు మళ్ళిన వారికి ఇది మరీ అనువైనది. పడక కుర్చీ కబుర్లు అనీ ... ఏ పనీ పాటూ లేని కబుర్ల గురించి హేళన చేయడం కూడా ఉంది. ఇప్పుడయితే రాత్రి వేళ తిరిగే దూర ప్రయాణాల బస్సుల్లో ఈ రకం కుర్చీలు కొద్దిపాటి మార్పుతో ఉంటున్నాయి. రైళ్ళలోనూ, విమానాల్లోనూ ఈ తరహా కుర్చీలను హాయిగా రిలాక్సింగ్ గా ప్రయాణం  కోసం



అమరుస్తున్నారు ...అయితే వాటిని కుర్చీలు అనకుండా, సీట్లు అని అంటారు లెండి...

ఇక, మీకు కుర్చీలాట తెలుసు కదా ? అదేనండీ , మ్యూజికల్ ఛైర్ ఆట ! గుండ్రంగా కుర్చీలను అమర్చి, దాని చుట్టూ లయబద్ధంగా వినిపించే సంగీతానికో, పాటకో అనుగుణంగా తిరుగుతూ ఉండాలి. ధ్వని ఆగి పోగానే చప్పున దొరికిన కుర్చీలో కూర్చోవాలి. తిరిగే వారి సంఖ్య కంటె అక్కడ పెట్టే కుర్చీల సంఖ్య ఒకటి తక్కువగా ఉండేలా చూస్తారు కనుక, తప్పని సరిగా ఒకరికి కూచోడానికి కుర్చీ దొరకదు. అతడు ఔటయినట్టే లెక్క. ఇలా తడవ తడవకీ ఒక్కో కుర్చీ తీసేస్తూ ఉంటారు. చివరకి ఇద్దరు వ్యక్తులూ, ఒక్క కుర్చీ మాత్రమే మిగలడం జరుగుతుంది. మళ్ళీ వారిలో ఒక్కరే విజేతగగా నిలుస్తారు ...ఈ ఆటలో  కుర్చీలకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ! పాట ఆగిందా ! సీటు గోవిందా !! అనే పాటా, ఆ సన్నివేశం ఉన్న సినిమా గుర్తుందా ?

ఒకప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మాత్రమే వాడే రివాల్వింగు కుర్చీలు ఇప్పుడు చాలా మందికి అందుబాటు లోకి వచ్చేయి. డెస్క్టాప్ ముందు అవి మరీ అవసరమయ్యేయి.

గవర్నమెంటు ఆఫీసుల్లో గుమాస్తాల కుర్చీలు పని వేళల్లో ఖాళీగా ఉండడం ఆఫీసర్ల చేతగాని తనానికి లేదా ఉదార స్వభావానికీ నిదర్శనం.


ఇక, కుర్చీ కింద చెయ్యి గురించి మనందరికీ తెలిసినదే. కుర్చీ కింద చేతిని తడిపితే కానీ పనులు జరగవు.

కూర్చున్న కుర్చీకి ఎసరు అంటే, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని స్థితి. ప్రైవేటు ఉద్యోగాల్లో, ముఖ్యంగా మీడియా రంగంలో పని చేసే వారికి ఈ భయం జాస్తి అంటారు ...

ఇక, రకరకాల డిజైన్లలో కుర్చీలకి కొదవే లేదు ...మచ్చుకి వొకటి చూడండి ..




పూర్వపు రాజుల రత్న ఖచిత సింహాసనాల్లాగా ఇప్పటికీ విలాసవంతులూ, జనం ధనం తెగ కాజేసిన వాళ్ళూ ఇళ్ళలో బంగారంతో చేసిన కుర్చీలని వినియోగించిన వైనం ఇటీవలి కాలంలో చూసేం.

‘‘ నిన్న మావారి సన్మానానికి జనం బాగా వచ్చేరుట ... సగం హాలు నిండిందిట !‘‘ అందొకావిడ గొప్పగా.

‘‘ పోదూ బడాయి !.. సగం కుర్చీలు ఖాళీయేనట ! మావారు చెప్పారు ’’ అని మూతి మూడు వంకర్లు తిప్పిందిట పక్కింటావిడ.

మరో ముఖ్య విషయం ... పార్టీ టిక్కెట్టు రాని అభ్యర్ధుల అనుచరగణం తమ అక్కసంతా ముందుగా కుర్చీల మీదే చూపిస్తూ ఉంటారు. కుర్చీలను విరిచి పోగులు పెట్టే దృశ్యం తరచుగా చూస్తూ ఉంటాం.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు .. ఎవరి మీదనో కోపం కుర్చీల మీద చూపడం సబఁవా ? మీరే చెప్పండి ? అప్పుడే కాదు, సభల్లోనూ, ఆఫీసుల్లోనూ. ఆస్పత్రులలో, ఇక్కడా అక్కడా అనేమిటి లెండి, ఎవరికి కోపం వొచ్చినా విరిగేవి కుర్చీలే !



 రాబోయేదే   400వ కథా మంజరి టపా .   మళ్ళీ కలుద్దాం ... ఇప్పటికింక కుర్చీల కథ సమాప్తం. సెలవ్ ... ...





















13, ఏప్రిల్ 2014, ఆదివారం

కప్పల కథ !



ఎన్నికల వేళ దేశంలో, మరీ ముఖ్యంగా మన   రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉంటే, కప్పల కథ రాయాలనిపించడం యాదృచ్ఛికమేమీ కాదని మనవి చేస్తున్నాను.
లోగడ కథా మంజరిలో చెప్పుల కథ రాశానా ? ఇప్పుడు కప్పల కథ రాస్తే తప్పేఁవిటని అనిపించి రాస్తున్నాను. 
ముందుగా మన ఆనవాయితీ ప్రకారం కప్ప అనే అర్ధాన్నిచ్చే పదాలు ఇంకా ఏమేం ఉన్నాయో చూదాం ...
అజంభము, అజిరము, అజిహ్వము,అనిమకము,అనూపము, అలిమకము,కృతాలయము,
చలికాపు, సూచకము, దుర్దురలము,దాటరి. ప్లవము, భుకము,మండూకము లాంటి చాలా ఉన్నాయి కానీ అంత ఆయాసం మనకొద్దు.  అన్నట్టు హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధంతో పాటూ కప్ప  అనే అర్ధం కూడా ఉందండోయి !
కప్పల్లో బావురు కప్ప, బాండ్రు కప్ప, చిరు కప్ప అని   చాలా రకాలు  కనిపిస్తాయి.
తెలుగు సాహిత్యంలో కప్పల గురించిన ప్రస్తావన వచ్చిన తావులు ఒకటి రెండు విన్నవిస్తాను ...
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తు రది ఎట్లన్నన్
తెప్పలుగ చెఱువు నిండిన
కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ !
అంటాడు సుమతీ శతకకారుడు బద్దెన. మరంతే ... మన దగ్గర సొమ్ముంటే ఎక్కడెక్కడి వాళ్ళూ బంధువుల మంటూ వచ్చి చేరుతారు. చెఱువు నీటితో కళకళలాడుతూ ఉంటే వేలాదిగా కప్పలు వచ్చి చేరుతాయి కదా, అలాగన్నమాట.

మరో పద్యం చూడండి ...
సరసుని మానసంబు సరస ఙ్ఞుఁడెఱుంగును, ముష్కరాధముం
డెరిఁగి గ్రహించు వాఁడె ? కొలనేక నివాసముగాఁగ దుర్దురం
బరయఁగ నేర్చు నెట్లు వికజాబ్జమరంద సౌరభో
త్కరము మిళింద మొందు క్రియ దాశరథీ ! కరుణాపయోనిథీ !

ఈ పద్యం కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకం లోనిది.   దుర్దురము (కప్ప ) ఉండేదీ, కమలం ఉండేదీ కూడా కొలను లోనే ! కానీ, ఆ కమలంలో ఉండే తేనెని  తుమ్మెద మాత్రమే ఆస్వాదిస్తుంది కానీ ప్రక్కనే ఉండే కప్పకి దాని మాధుర్యం తెలయదు కదా !అలాగే సరసుని మనసు పరసుడే తెలిసికో గలుగుతాడు అని దీని భావం. ఇందులో కప్ప ప్రస్తావన వచ్చి నప్పటికీ ఆ ప్రస్తావన దాని గౌరవం ఇనుమడించేలా మాత్రం లేదు పాపం ...

వెనుకటికి ఓ అవధాని గారికి  ‘‘ కప్పని చూచి పాము గడగడ వణికెన్ !’’ అని వో సమస్య నిచ్చేరుట. దానిని అవధాని   తెలివిగా, కిర్రు చెప్పులు వేసుకుని,  కర్ర పట్టుకుని, పొలం కాపునకు వచ్చిన రైతు     వెంకప్ప  (వెం –కప్ప) ను చూచి అక్కడ  వో పాము గడగడా వణికిందని  సమస్యాపూరణం చేసారు. మేకల్ని చూసి పులులూ , కప్పల్ని చూసి పాములూ ఎక్కడయినా భయ పడతాయా, మన వెర్రి గానీ !

నిజఁవే ... కప్పని చూస్తే జాలేస్తుంది. పరిశోధనల పేరిటా, పరీక్షల పేరిటా రోజూ కళాశాలల్లో ఎన్ని కప్పలు దారుణంగా చంపి వేయ బడుతున్నాయో కదా ... ఇలా కప్పలకి మనుష్య జాతి వలన పీడ  ఉండగా సర్ప జాతి వలన ప్రాణగండం ఎలానూ ఉంది. పాములు కప్పలు దొరికితే మహదానందంగా చప్పసరించేస్తాయి మరి ... కడుపు నిండి కప్పలు తిన్న పాము కదలకుండా నిబ్బరంగా పడుంటుందిట. కప్ప తిన్న పాములా కదలకుండా   ఎలా ఉన్నాడో చూడూ అనడం  లోకంలో వొక వాడుక.

శ్రీ.శ్రీ గారు వో గేయంలో ఘూకం కేకా ,,, భేకం బాకా అన్నారు. ఈ విధంగా ఆధునిక కవిత్వం లో కూడా కప్ప ప్రస్తావన వొచ్చిందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

ఆత్రేయ గారయితే ఏకంగా కప్పలు అనే వొక ప్రసిద్ధమయిన నాటికనే రాసి పడీసేరు.
నూతి లోని కప్పలు అనే దానికి లోకం తెలియని మూర్ఖులు అని అర్ధం,
కప్పదాట్లు అంటే  తెలుసు కదా ?  నడకలోనో, పరుగులోనో మధ్యలో ఓ దాటు వదిలేసి అడుగులెయ్యడం. కొంత మంది తమ ప్రసంగంలో ఎంతకీ అవసరమయిన విషయాన్ని చెప్పకుండా  తప్పించు కోడానికి ప్రసంగంలో కప్పదాట్లు వేయడం కద్దు.  సమయం వచ్చి నప్పుడు వాడి బండారమంతా బయట పెడతాను ! అని అప్పటికా ప్రస్తావనని దాట వేసే కప్ప దాట్ల రాజకీయ నాయకులని చూసేం కదా ... కప్ప గెంతులు అనే ఆట ఆడపిల్లలకి చాలా ఇష్టమయిన ఆట వెనుకటి రోజుల్లో. ఇవాళ మన చిన్నారి పాపలకి ఈ ఆట ఆడుకోడానికి కంప్యూటర్ లో కప్పగెంతులు ఆట ఉందో లేదో నాకు తెలియదు.

కప్పదాట్లనే సంస్కృతీకరిస్తే మండూక ప్లుతి న్యాయం  అవుతుంది.

సంగీత రాగాలలో కూడా దాటు గతి   అని వొకటుందని చెబుతారు. ఇలాంటిదే కాబోలు. కానయితే దానికి మంచి గౌరవస్థానం ఉంది.

ఉపనిషత్తులలో మండూకోపనషత్తు ఉంది. దాని వివరాలు తెలిసిన పెద్దలు చెప్పాలి. నా లాంటి అల్పఙ్ఞుడికేం తెలుస్తుంది చెప్పండి ?

కప్పల తక్కెడ అని ఓ జాతీయం. తక్కెడలో కప్పలని ఉంచి తూకం వేయడం ఎవరి తరమూ కాదు. అవి వొక చోట స్థిరంగా ఉంటే కదా ?  ( మన రాజకీయ పార్టీ నాయకుల్లాగ ! )

అప్పాలు కప్పలుగా మారిన వైనం వెనుటి రోజులలో ఓ తెలుగు సినిమాలో చూసి తెగ నవ్వుకున్నాం గుర్తుందాండీ ?
‘‘కరవమంటే   కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం ’’అనే మాట విన్నారు కదూ ? కప్ప కరవడమేఁవిటి పాపం ... అందుకే కదా, ‘‘కప్ప కాటు లేదు, బాపన పోటు లేదు ’’అనే సామెత పుట్టిందీ ?
‘‘కప్పలు అరుస్తూనే ఉంటాయి, దరులు ( గట్లు) పడుతూనే ఉంటాయి ’’అనేది మరో సామెత.
‘‘కప్పలు ఎఱుగునా కడలి లోతు’’ అని కూడా మరో సామెత ఉంది.

వీటి మాటకేంగానీ,‘‘ కప్పలు అరిస్తే కుప్పలుగా వాన పడతుంది’’ అని వో సామెత ఉంది.
కప్పల పెళ్ళి చేస్తే జోరుగా వానలు పడతాయని మన వారిలో వో నమ్మకం ఉంది.
కప్పల బెక బెకలు పుష్కలమైన నీటి తావులకి చక్కని సంకేతాలు.  ( ట ! )
తాళం కప్పలో కప్పకీ మనం చెప్పు కుంటున్న కప్పకీ ఏఁవయినా సమ్మంధం ఉందో, లేదో ఆలోచించాలి ...

బాల సాహిత్యం లోనూ. జానపద సాహిత్యం లోనూ చాలా కప్పల కథలు కనిపిస్తూ ఉంటాయి.  కప్పలు అందమైన రాజకుమారిగా మారి పోవడమో, లేదా యువరాణి ముని శాపం చేత కప్పగా మారి పోవడమో  ... ....ఇలాంటి కల్పిత కథలు  చాలానే కనిపిస్తాయి.
ఇంతటితో కప్పల కథకి స్వస్తి !

బెక !  బెక !!  బెక !!!




9, ఏప్రిల్ 2014, బుధవారం

గాన గంధర్వుని గొంతులో జాషువా కవి గారి శిశువు ఖండ కావ్యం




శిశువు గురించి శ్రీ జాషువా కవి  పద్యాలు

గానమాలింపక కన్ను మూయని రాజు
అంబ కౌగిట పంజరంబు చిలుక
కొదమ కండలు తేరుకొను పిల్ల వస్తాదు
ఉయ్యేల దిగని భాగ్యోన్నతుండు
ఉ ఊలు నేర్చిన యొక వింత చదువరి
సతిని ముట్టని నాటి సాంబ మూర్తి
ప్రసవాబ్ధి తరియించి, వచ్చిన పర దేశి
తన యింటి క్రొత్త పెత్తనపుదారు

ఏమి పని మీద భూమికేతెంచి నాడొ !
నుడువ నేర్చిన పిమ్మట నడుగ వలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొ కాని
యిప్పటికి మాత్రమేపాప మెఱుగడితడు !

జాషువా పద్యాలకి వివరణ అక్కర లేదు. అయినా, కొద్దిపాటి వివరణ ...
పాట పాడితేనే కాని నిద్దుర పోడు. తల్లి కౌగిలి అనే పంజరంలో చిలుకలాగా ఒరిగి పోతాడు. ఆ లేత వయసులోనే కండలు తిరిగిన పిల్ల వస్తాదులా ముద్దొస్తాడు. ఎంత భాగ్యవంతుడో ! ఉయ్యేల దిగకుండానే అన్ని పనులూ జరిపించుకుంటాడు. ఉ ఊ అనే రెండక్షరాలు నేర్చిన వింత చదువరి. సతిని తాకని సాంబ శివుడిలా ఉంటాడు. కానుపు సముద్రాన్ని దాటి వచ్చిన పర దేశి. తన యింటికి కొత్త యజమాని. ఈ భూమి మీదకి ఏ రాచ కార్యం చేడానికి వచ్చేడో కదా ? కొంచెం నడక రానీ, అప్పుడు అడుగుదాం. ముందు ముందు వయసు వచ్చేక ఎలాగ ఉంటాడో తెలియదు కానీ, ఇప్పటికి మాత్రం ఈ చిన్నారి శిశువుకి ఏ పాపం తెలియదు !!

నవ మాసములు భోజనము నీర మెఱుఁగక
పయనించు పురుటింటి బాట సారి
చిక్కు చీకటి చిమ్ము జేనెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసి నవ్వుల లోన
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృ క్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకున్న యతిథి

బట్టఁగట్టడు బిడియాన పట్టువడడు
ధారుణీ పాఠ శాలలో చేరినాడు
వారమాయెనొ లేదొ? మా ప్రకృతి కాంత
కఱపి యున్నది వీనికాకలియు నిద్ర


తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో అన్నం , నీరు లేకుండా గడిపి, ప్రయాణం చేసి వచ్చిన బాట సారి. చిమ్మ చీకటిగా ఉండు జేనెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణ స్వరూపుడు. నునుపైన చెక్కిళ్ళలో బోసి నవ్వులలో ముద్దులు కురిపించే మోహనాకారుడు. తరగని తల్లి పాలు అనే మధు ధారలను తన అన్నంగా తచ్చుకున్న అతిథి.బట్ట కట్టుకోడు. సిగ్గు పడడు. నేల తల్లి అనే బడిలో చేరి ఇంకా వారం అయిందో, లేదో, మా ప్రకృతి కాంత వీడికి ఆకలీ నిద్రా నేర్పించింది.

ఊయేల తొట్టి యే ఉపదేశ మిచ్చునో
కొసరి యొంటరిగ ఊ కొట్టు కొనును
అంబతో తన కెంత సంబంధ మున్నదో
యేడ్చి యూడిగము సేయించు కొనును.
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా కేకిసల్గొట్టు కొనును
మూన్నాళ్ళ లోన నెప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చు కొనును

ముక్కు పచ్చలారి పోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నప్పుడు
‘ నాదు పసిడి కొండ నా రత్న’ మని తల్లి
పలుకు పలుకు లితడు నిలుపు కొనునె ?

పడుకున్న ఊయ్యేల తొట్టి వాడికి ఏం ఉపదేశం చేస్తందో కానీ, ఒంటరిగా ఊ కొడుతూ ఉంటాడు. తల్లితో ఏ జన్మల సంబంధమో కాని ఏడ్చి సేవలు చేయించుకుంటూ ఉంటాడు. ఆ దేవ దేవుడు అతనితో ఏ సల్లాపాలు చేస్తాడో తెలియదు భలే భలే అన్నట్టుగా చప్పట్లు కొడుతూ ఉంటాడు
ఈ మూడు రోజులలో ఎప్పుడు నేర్చుకున్నాడో వెర్రి తండ్రి ఛీ ఫో అని సరదాకి అంటే ముఖం చిన్న బుచ్చు కుంటాడు. ఆ బుగ్గల లేతదనం తగ్గి, చదువు సంధ్యలు నేర్చకున్నాక ‘ నా బంగారు కొండ , నా రతనాల కొండ ’ అని తల్లి ముద్దుగా అంటూ ఉండే మాటలు నిలుపుకుంటాడో లేదో , చూదాం !

తన చేతి గిలక పండునకు ముచ్చటలు సెప్పు
పలుక లేదని కోపంబు సేయు
పొరుగింటి యిల్లాలి సరస చీదర చెంది
పరులన్న భేద భావమునుఁజూపు
మకరందమునకు సమ్మతిఁజూపి నోరూరి
దరిఁజేరి రుచుల భేదములు తెలియు
ప్రతి శబ్దమీను నుగ్ర ధ్వానమాలించి
కంపించి తల్లిని కౌగిలించు
దాయలార్గురు నొకరు నిద్దరును తప్ప
చేరుకున్నారలీతని చిత్త వీధి
జగతి నీతని జాతక చక్రమందుఁ
బొంచి యుండునదప యశంబొ ? యశంబొ ?

తన చేతి గిలక పండుకి ముచ్చటలు చెబుతూ ఉంటాడు. అది తిరిగి పలక లేదని కోపం వచ్చి విసిరి కొడతాడు. పొరుగింటి ఆడవాళ్ళు చేర దీస్తే వెళ్ళడాని యిష్ట పడడు. తన పర భేద భావం వీడికి అప్పుడే తెలిసి పోయింది.  తేనె అంటే ఇష్టం రుచుల భేదం గ్రహించేస్తున్నాడు. పెద్ద చప్పుడుని వింటే చాలు భయంతో తల్లిని గట్టిగా కరుచుకు పోతాడు. ఇతనికి అరిషడ్వర్గాలు అనే ఆరుగురు శత్రువులలో ( కామం, క్రోధం, లోభం, మోహం, మదం , మాత్సర్యం) ఒకరో ఇద్దరో తప్ప మిగతా వారు అప్పుడే వీడి మనసులో చేరుకున్నారు కదా ? వీడి జాతకంలో గొప్ప కీర్తిమంతుడవుతాడని ఉందో, బొత్తిగా అప్రతిష్ఠ పాలవుతాడని రాసి ఉందో కదా !!



8, ఏప్రిల్ 2014, మంగళవారం

పా.సీ. కొ.సా ...




‘‘తాతయ్యా, కథ చెప్పవూ ? ’’
‘‘ఎందుకు చెప్పన్రా బాబూ, విను ...’’
‘‘ అనగనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులూ వో రోజు వేటకెళ్ళారు. వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు ... ... ...’’
‘‘ ఛీ ! ... తాతయ్యా, మళ్ళీ పాత కథేనా ? కొత్త కథ చెప్పూ ...’’
‘‘ అయితే విను. అనగనగా ఓ చక్రవర్తి. ఆ చక్రవర్తికి పది మంది కొడుకులు. పది మందీ ఓ రోజు సింగపూర్ వెళ్ళి పన్నెండు పీతల్ని తెచ్చారు. వాటిని ఎండ పెడితే వాటిలో ... ... ’’
‘‘ ఛీ ! తాతయ్యా, మళ్ళీ పాత కథే చెబుతున్నావు ...’’

‘‘ అదేంటిరా మనవడా అలాగంటావూ ! పాత కథలో రాజు ఈ కథలో చక్రవర్తి అయిపోయేడు కదూ ... వాడికి ఏడుగురు కొడుకులయితే, వీడికి పదిమంది ...వాళ్ళు వేటకి వెళితే, వీళ్ళు సింగపూర్ వెళ్ళారు కదా ? ... వాళ్ళు చేపలు తెస్తే, వీళ్ళు పీతలు తెచ్చారు ...అదీ కాక, పాత కథకి ఊరూ పేరూ లేదు ... కానీ ఈ కొత్త కథకి మాత్రం ఓ నేరుందిరా అబ్బీ ! ...’’

‘‘ ఈ కథ పేరేంటి తాతయ్యా ? ’’

‘‘ ఎన్నికల మేనిఫెష్టో ’’

7, ఏప్రిల్ 2014, సోమవారం

చుక్కల సమావేశం ! ... పిల్లల కథ



చుక్కల సమావేశం!



ఒకసారి ఆకాశంలో చిన్న చుక్కలన్నీ కలిసి ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో అవి చాలా దీర్ఘంగా తమ కష్టాల గురించి చర్చించాయి.మరీ కొన్ని చిన్న చుక్కలయితే, మరింత ఉద్రేకంగా ప్రసంగించాయి. యుగ యుగాల నుండీ అవి తమకు జరుగుతున్న అన్యాయాలను గురించి గొంతెత్తి సభలో ఘోషించాయి.

వాటి చర్చల సారాంశం ఏమిటంటే, గగన వీధిలో పెద్ద చుక్కలతో పాటు కోట్లాది సంఖ్యలో ఉన్న తమకి ఏ ప్రత్యేకతా లేక పోవడం అన్యాయం అని ... తమకు న్యాయం జరగాలని అవి గట్టిగా కోరుకుంటున్నాయి. పెద్ద చుక్కలు తమ ప్రియనాథుడు చంద్రుడికి దగ్గరగా ఉండడం, తాము మాత్రం దూరంగా ఎక్కడో విసిరివేయబడినట్టు కనీ కనిపించకుండా మిణుకు మిణుకుమంటూ కునారిల్లిపోతూ ఉండడం అవి సహించ లేక పోతున్నాయి. అంతే కాక, పెద్ద చుక్కల్లో కొన్నింటికి ఏవో మంచి పేర్లు కూడా ఉండడం, వాటిని గురించి పురాణాలలో కథలు ప్రసిద్ధిలో ఉండడం కూడా వాటికి అవమానకరంగా ఉంది. అందుకని చిన్న చుక్కలన్నీ కూడబలుక్కుని సమావేశమై తాము తీసుకున్న నిర్ణయాన్ని తమ రేడు చంద్రుడికి వినయంగా విన్నవించుకున్నాయి.

చంద్రుడు నవ్వి, అలాగే చూదాం ! అన్నాడు. ఇలాచాలాసార్లు జరిగింది. చిన్న చుక్కలకి న్యాయం జరుగ లేదు. అందుకు అవి తీవ్రంగా మనస్తాపం చెందాయి. కొన్ని చుక్కలయితే, ఏకంగా నేల మీదకి రాలి ఆత్మహత్యలు కూడా చేసుకున్నాయి.

చిన్న చుక్కలు తమ వారి బలిదానాలను భరించ లేక పోయాయి. వాటిఆందోళన నానాటికీ తీవ్రతరమవుతూ ఉండడంతో

చంద్రుడు వాటితో ఇలా అన్నాడు ‘‘ మీ అసంతృప్తిని గమనించాను. ప్రకృతికి కొన్ని నియమాలుంటాయి. వాటిని అధిగమించి ఉండడం ఎవరికీ సాధ్యం కాదు.అయినా, మీరంతా ఇంతలా కోరుకుంటున్నారు కనుక, మీ కోరిక నెరవేర్చాలనే నాకూ ఉంది. ముందుగా మీరు ఎంత మంది ఉన్నారో లెక్కగట్టి నాకు చెప్పండి. అప్పుడు మీ అందరికీ ఏయే పేర్లు పెట్టాలో, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నిర్ణయిస్తాను. ’’

చిన్న చుక్కలన్నీ సరే అంటే సరే అన్నాయి.

అప్పటి నుండీ ఆకాశంలో చిన్న చుక్కలన్నీ చుక్కల గణనలో తలమునకలయి పోయేయి.

యుగాలు గడుస్తున్నా వాటి లెక్క తేలడం లేదు.

మబ్బుల పరదా వెనుక ముసిముసి నవ్వులు చిందిస్తూ

చుక్కల రేడు వినోదం చూస్తూనే ఉన్నాడు !


29, మార్చి 2014, శనివారం

పద్యా లొక పన్నెండు ... ఉగాది శుభాకాంక్షలతో ...





సాహితీ మిత్రు లందరికీ ఉగాది శుభాకాంక్షలు ! ...

మీ ... కథా మంజరి.

ఉగాది సందర్భంగా ఒక కానుక. మీ కోసం రసవంత మయిన మంచి తెలుగు పద్యాలు వివరణలతో ఒకే చోట ...


వీటిలో కొన్ని లోగడ తెలుగు పద్యం వెలుగు జిలుగులు అనే శీర్షికన నవ్య వార పత్రికలో వెలువడ్డాయి.

ప్రస్తుతం ఇదే శీర్షిక తేనె లొలికే తెలుగు పద్యం పేరుతో ఆంధ్ర భూమి మాస పత్రికలో వెలువడుతోంది ...

వాటి లోనుండి ఓ డజన్ ఒకే చోట ... ( ఏ పద్యం చూడా లనుకుంటే దాని మీద నొక్కి చూడండి )

1.ఏమి తపంబు సేసెనొకొ ! ....
సోతన భాగవతం


2. శివుడిటు రమ్మటంచు ...
చేమకూర వేంకట కవి విజయ విలాసం


3. తగిలి మదంబుచే ...
మారద వెంకయ్య భాీస్కర శతకం

4. అంకముఁజేరి శైల తనయాస్తన ...
అ్లసాని పెద్దన మను చరిత్ర


5. కారే రాజులు రాజ్యముల్ కలుగవే ?
పోతన భాగవతం.

6. నానాసూన వితాన వాసనల ..
రామరాజ భూషణుడు వసు చరిత్ర


7. ఆతప భీతి నీడలు రయంబున ...
నన్నె చోడుడు కుమార సంభవం


8. కటకట లక్ష్మణా !
కంకంటి పాపరాజు  .. ఉత్తర రామాయణం

9. అజినాషాడ ధరుండు ...
శ్రీనాథుడు హర విలాసము

10. చింతా శల్యము వాసెనే ?
తిక్కన మహా భారతం

11. అదిగో ద్వారక !
తిరుపతి వేంకట కవులు పాండవోద్యోగం

12.నుతజల పూరితంులగు నూతులు ..
నన్నయ మహా భారతం.

24, మార్చి 2014, సోమవారం

ఒక వీరాభిమాని విచార గాథ ...



మా తింగరి బుచ్చి కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. మరో పార్టీ విషయం ఎత్తితే కయ్యిమంటాడు. అలాంటి మా తింగరి బుచ్చి నిన్నటి వరకూ కాంగ్రెష్ ఖాళీ అయి పోతోందనీ, కాంగ్రెస్ పని ఖతమై పోయిందనీ తెగ బోలెడు విచార పడి పోతూ కనిపించాడు. అన్న పానాదులు మానేశాడు. గడ్డం పెంచీసాడు. ముఖం పీక్కు పోయింది. లంఖణాలు చేసిన వాడిలా నీరసించి పోయేడు. ఉలకడు .పలకడు. వాడేమయి పోతాడో అని మేం భయ పెట్టీసు కున్నాం.
అయితే ఇవాళ వాడు తేటదేరిన ముఖంతో కనిపించాడు. తేరు కున్నాడు. . హమ్మయ్య ! అను కున్నాం.
కాంగ్రెస్ పరిస్థితి ఏమయినా మెరుగు పడిందేమిటి ? కాస్త కులాసాగా కనిపిస్తున్నావు ? అనడిగేను.
దానికి మా తింగరి బుచ్చి ఏమన్నాడంటే ... అదేం లేదు ... కానీ మా వాళ్ళు చాలామంది పైకిలెక్కేసారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అంతా మా వాళ్ళ తోనే కిట కిటలాడి పోతోంది ...
ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ పార్టీని తెలుగు కాంగ్రెస్ అనో, దేశ కాంగ్రెస్ అనో అనొచ్చని పిస్తోంది అదే నాకు కొంత ఊరట. అందుకే నా దిగులు కొంత తగ్గింది ...
ఒక వేళ ... జగన్ పార్టీ గెలుస్తేనో ? అన్నాను నంగిగా ..
ఆ పార్టీ పేరు లోనూ కాంగ్రెస్ అని ఉంది కదా . నాకది చాలును. అన్నాడు కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడూ, వీరాభిమానీ అయిన మా తింగరి బుచ్చి ...
మా తింగరి బుచ్చికి వేపకాయంత వెర్రి ఉంది లెండి. అది ఈ మధ్య గుమ్మెడు కాయంత అయిందని సమాచారం.
అందు వల్ల వాడి మాటలు మీరేమీ పట్టించు కోకండి..
లైట్ తీసుకోండి ..

21, మార్చి 2014, శుక్రవారం

అంతర్జాలమా !నీకు జోహార్లు ...



అంతర్జాలంలోో ఎందుకో వెతుకుతూ ఉంటే ఈ ఆడియో కంట పడింది. మనిషిని ఫొటో చూసి వెంటనే గుర్తు పట్ట లేక పోయేను. తంపెళ్ళ మహదేవ రావు అని పేరు చూసి తటాలున పోల్చు కున్నాను.

పార్వతీపురంలో  మా చిన్నప్పుడు మా ఇంటికి అతి సమీపంలోనే వీరి కుటుంబం ఉండేది. పెద్దాయనను తంపెళ్ళ మాష్టారు అనే వారు. సంగీతం టీచరు. నాకయితే వారు తెలీదు. నా చిన్నప్పటికే పోయేరను కుంటాను. నా చిన్నప్పటికే వారి కుటుంబం పార్వతీపురం విడిచి వెళ్ళి పోయినట్టు గుర్తు. కానీ ఈ తంపెళ్ళ మహదేవరావూ, వీరి తమ్ముడు తంపెళ్ళ సూర్య నారాయణ గారూ మా ఊరు తరుచుగా వస్తూ ఉండే వారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజులలో వచ్చే వారు.

అలా వచ్చి నప్పుడు తెలిసిన మా కుటుంబాలలో అందరినీ పలకరించడానికి ఇళ్ళకు వచ్చే వారు.

నాకు బాగా గుర్తు,  మహదేవరావు ఇలా ఓ సారి పండుగకు  మా ఊరు వచ్చి నప్పుడు మా మేనత్త గారి ఇంటి చావిడీలో మా కోసం, మా వీధి వారి కోసం  గాత్ర  కచేరీ  చేసేరు. అప్పటికే వారు ప్రసిద్ధులు. మా తాత గారి మాట కాదనలేక  ఆ కచేరీ చేసారు. వీరి తమ్ముడు సూర్య నారాయణ మూర్తి  మంచి వయొలనిష్టు. ఆ రోజుల లోనే రాష్ట్రపతి అవార్డు  గ్రహీత.

మహ దేవరావుని, సూర్య నారాయణనీ  చూసి  నలభై ఏళ్ళవుతోంది. ఇంకా ఎక్కువే నేమో.  వారి గురించిన వివరాలేమీ తెలియదు.

కాదు ... కాదు ... మహదేవరావుని   మాత్రం 72 లో   ఓసారి చూసాను. ఎందుకో మా ఊరు వచ్చేరు. పెద్ద భత్వోద్యోగి.ఇంటెలిజెన్స్ అనుకుంటాను ... ఏమో ... కానీ ఆ ఏడాది భోగీ నాటి రాత్రి మాతో ఆయన పేకాట కూడా ఆడేరు ...  అమ్మకి నచ్చిన మంచి పాట ఇక్కడ చూడండి..

సరే, ఇంతకీ నేను చెప్పే దేమిటంటే  అంతర్జాలం వల్ల గత కాలపు మధుర స్మృతులు ఎన్ని నెమరు వేసుకో వచ్చునో కదా ...అందుకే అంతర్జాలమా ! నీకు జోహోర్లు ...

13, మార్చి 2014, గురువారం

పార్వతీ పురంలో మా ఇంటి వీధరుగు ...


పల్లె తల్లి లాంటిది. పట్నం ప్రియురాలి లాంటిది ... అంటూ మొదలు పెట్టి దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు వీధి అరుగు అనే గొప్ప వ్యాసం వీధరుగు గురించి రాసేరు.

 వీధి అరుగు ఆహ్వానం లాంటిది. నవ్వుతూ రమ్మని పిలుస్తుంది. వచ్చి కాస్సేపు కూర్చుని సేద దీర మంటుంది. కబుర్లు చెబుతుంది. కలత తీరుస్తుంది.కుశలాలు అడుగుతుంది. మంచి నేస్తంలా కలగలిసి పోతుంది.ఇప్పుడు వీధులే తప్ప వీధరుగులు లేవు.

వీధరుగులు లేని కొంపలు ముటముటలాడిస్తూ ఉండే ముఖాలతో ఉంటాయి.చిర్రు బుర్రులాడే కోపిష్ఠి మనిషిలా ఉంటాయి.స్వార్థపు గూళ్ళలా ఉంటాయి. 

అరుగు లన్నిటి లోన
ఏ అరుగు మేలు ?
పండితులు కూర్చుండు
మా అరుగు మేలు !

ఈ బాల ల గేయం  విన్నారు కదూ ?

పార్వతీపురంలో మా ఇంటి వీధరుగు మీద మహా పండితులు కూర్చునే వారని డప్పాలు కొట్టను కానీ, రాబోయే రోజుల్లో కాబోయే  ( తెలుగు ) పండితుడొకడు  నిక్కరూ , చొక్కా వేసుకుని  కూర్చునే వాడని మాత్రం ఘంటాపథంగా చెప్ప గలను.

పార్వతీ పురంలో మా యింటి ముందుండే ఈ వీధి అరుగును చూడండి

 దీని మీదే కదా, మా బాల్యం గడిచింది.

 దీని మీదనే కదా ఎన్టీవోడి గురించీ ఏఎన్నార్ గురించీ తగువులాడు కున్నది ?

 ఈ అరుగు మీదనే కదా ఎక్కాలు చదువు కున్నది ? 

ఈ అరుగు మీదనే కదా హోం వర్కులతో కుస్తీలు పట్టినది ?

 ఈ అరుగు మీదనే కదా, మనిషి చంద్రుడి మీద కాలు పెట్టాడన్న వార్తను విని విస్తు పోయినది ?

 ఈ అరుగు మీదనే కదా సినిమా కబుర్లూ, గణపతి మేష్టారు పెట్టిన తొడపాయసాల గురించీ ఒకరికొకరం చెప్పు కున్నది ?

 ఈ అరుగు మీర కూర్చునే కదా ఇంటికి వచ్చే అతిథుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినది ?

 ఈ అరుగు మీద నిలబడే కదా అమ్మ వారి జాతరలో సిరిమాను సంబరాన్ని చూసి పులకించి పోయినది ?

 ఈ అరుగు మీదనే కదా అమ్మ చేసి ఇచ్చిన జంతికలు గుప్పెటలో ఉంచుకుని కొసరి కొసరి తిన్నది ?

 అయ్యో, ఇప్పుడెలా ఉందో చూసేరా .? చిన్నప్పటి ఆటబొమ్మ చివికి పోయి దొరికినట్టు ...

 మాసి పోయిన సామ్రాజ్యాలకు చిరిగి పోయిన జెండా చిహ్నం ...

\
 ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు ?



మా వీధి ..

28, జనవరి 2014, మంగళవారం

ఛత్ర చరితమ్ ... .. అను గొడుగు కథ


చెప్పుల కథ చెప్పు కున్నాక, ఇక గొడుగుల కథ కూడాచెప్పు కోవడం సబవు. ఎందు కంటే గొడుగూ, చెప్పులూ కవల పిల్లల్లాంటివి. ఒకప్పుడు వీధిలోకి వెళ్ళే జనాలు, ముఖ్యంగా మగాళ్ళు చెప్పులు వేసుకుని గొడుగు పట్టుకుని, లేదా చంకలో పెటుకుని మరీ వెళ్ళే వారు. అయితే, గొడుగు పట్టు కోవడం నామోషీగా తలచే రోజు లొచ్చాక వీధుల్లో మనుషుల చేతుల్లో గొడుగులు అంతగా కనబడడం లేదు. ఎండా వానల నుండి కాపాడు కోవడం కోసం వాడే గొడుగులు, ఒకప్పడు అమ్మాయిలకు ఫేషన్ సింబల్ గా కూడా ఉపయోగ పడేవి.


చెప్పులకి ఉన్నంత కాక పోయినా, గొడుగులకి ఉన్న గొప్ప తనం గొడుగులకి ఉంది.

ఎవరి గొప్ప వారిది. అంచేత మనం గొడుగుల కథ చెప్పుకుందాం ...

వెనుకటి రోజుల్లో మగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు విధిగా కాళ్ళకి చెప్పులూ, చంకలో గొడుగూ ఉండేవి. హాదాని బట్టీ చేసే ఉద్యోగాన్ని బట్టీ కండువా తలపాగాలు అదనం. రైతువారీ అయితే చేతిలో కర్ర తప్పనిసరిగా ఉండేది. ఈ రోజుల్లో రెయిన్ కోట్లు వచ్చేక గొడుగు అంతవిధాయకం కావడం లేదు, ఏ కాలం లోనయినా కాళ్ళకి చెప్పులు మాత్రం ఉండక తప్పదు. ఎండయినా. వానయినా గొడుగు పట్టు కెళ్ళడం కొంత అనాగరకంగా తలచే కాలమిది. కొంతకాలం క్రిందటి వరకూ సినిమాలలో హీరోయినూ. ఆవిడ వెనుక గ్రూపు డాన్సర్లూ రంగు  రంగుల గొడుగులు పట్టుకుని త్రిప్పుతూ హొయలు పోతూ విన్యాసాలు చేస్తూ ఉండే వారు. ఇప్పుడలా చూపించడం లేదు అనుకుంటాను.అన్నట్టు గొడుగుల్లో ఆడ గొడుగులూ, మగ గొడుగులూ అని జండర్ భేదం కూడా ఉందండోయ్. పువ్వుల గొడుగులు ఆడవారికే

తాటాకు గొడుగులూ ఉంటాయి. ఉత్తరాంధ్రలో వీటిని గిడుగులంటారు.  వీటినే ఏ ప్రాంతంలో అంటారో తెలియదు కానీ, జిడుగు అని కూడా అంటారని  తెలుస్తోంది. మామ్మూలు గొడుగులకి ఉండేలా పట్టు కోవడానికి కర్ర లేక పోవడం వీటి ప్రత్యేకత, తాటాకుతో చేసే గిడుగులు తల మీద పెట్టుకుని కదలకుండా తాడుని  బెల్టు లాగా మెడ క్రింద తగిలించు కుంటారు. పల్లెల్లో పొలాల్లో, తోటల్లో  పని చేసే వారికి దీని ఉపయోగం జాస్తి. పట్టుకో నక్కర లేదు కదా ! ఒకప్పుడు తాటాకుతో పల్లెల్లో మాత్రమే  వాడుకునే  ఈ గిడుగులు  విదేశీయులూ, వారిని అనుకరించాలని ఉబలాట పడే దేశీయులూ కూడా  నెత్తిని  పెట్టుకుని వీధుల్లో తిరగడం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి చింపిరి జుట్టూ, అతుకుల పంట్లామూ అదనపు ఆకర్షణ కాబోలు.  ఈ నవతరం గిడుగులు రంగు రంగుల్లో ఖరీదయిన గుడ్డలతో తయారవుతూ ఆకర్షణీయంగా కూడా ఉంటాయి.
ఇక పోతే చిన్న పిల్లలకి రంగుల పువ్వుల చిన్న గొడుగులు ప్రత్యేకం.  నల్ల రంగు గొడుగులు మగాళ్ళవి.ఇవి కాక పెద్ద పెద్ద నగరాల్లో పేద్ధ రంగుల గొడుగులు పెట్టుకుని దాని క్రింద తాత్కాలిక వ్యాపారాలు .. సెల్ ఫోన్ లూ, వగైరాలు అమ్మడం ఇటీవల చూస్తూ ఉన్నాం. ఫలితార్ధం ఏమిటంటే, ఎవరయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక గొడుగు క్రిందకు రావలసిందే ... దీనిని మరింత విపులంగా తరచి చూద్దాం.

దేవాలయాల్లో దేవుడి ఊరేగింపులో వాడే గొడుగులు జలతారు కుచ్చులతో, వెండి పొన్నుతో చాలా పెద్దవిగానూ అందంగానూ ఉంటాయి. వెల్ల గొడుగులవి. పూర్వం రాజులకీ అలాంటి గొడుగులే తప్పని సరిగా పట్టే వారు. ఛత్రదారులని ప్రత్యేకంగా ఉద్యోగులుండే వారు . దేవుడి సేవలోనూ, మహారాజులు సేవలోనూ ఛత్ర చామరాదుల ప్రత్యేకత ఇంతా అంతా కాదు. సినిమా చిత్రీకరణ వేళ హీరోలకి గొడుగు పడుతూ అతని వెనుకే నీడలా తచ్చాడే  వారుంటారు.  వినాయకుడి బొమ్మ వెనుక  మట్టి తోనో, రంగు కాగితాలతోనో చేసిన గొడుగు కొందరు భక్తులు పెడుతూ ఉంటారు. దేవుడికీ, పెద్ద వారికీ, నాయకులకూ గొడుగు పట్టడం ముక్తిదాయకం. లాభదాయకం.

రాజ్యం స్వహస్త ధృత దండ మివాత పత్రమ్ అంటాడు కాళిదాసు. అంటే రాజ్య పాలన సొంతంగా తాను పట్టుకున్న గొడుగు లాంటిదని అర్ధం. మనకి మరొకరు గొడుగు పట్టుకుంటే  గొప్స దిలాసాగా ఉంటుంది కానీ, మన గుబ్బ గొడుగు మనఁవే పట్టు కోవాల్సి వస్తే మాత్రం చచ్చే చిక్కే. హాయిగానే ఉంటుంది కానీ, జబ్బలు పీకఁవూ ! అదన్న మాట సంగతి. కాళిదాసు అందుకే రాజ్యాధికారాన్ని సొంత చేత్తో పట్టుకున్న గొడుగుతో పోల్చాడు.

గొడుగు అనే అర్ధాన్ని ఇచ్చే పదాలు చాలానే ఉన్నాయి. చూదాం ..

ఆత పత్రం, ఆతప వారణం,ఆలవట్టము, ఉత్కూటము,ఉష్ణ వారణమ, ఎల్లి, కావారి, ఛత్రము, జనత్ర, తొంగలి, .. లాంటి పర్యాయ పదాలు చాలానే ఉన్నాయి కానీ వాడుకలో కనిపించవు కనుక చెప్పు కోవడం కంఠశోష. వదిలేద్దాం,
గొడుగులో  ఒక్కో భాగానికీ ఒక  పేరుంది, గుడ్డ , కమాను, కమాను పుల్లలు లాంటి తెలుగు పదాల సంగతి తెలిసిందే    ఇంగ్లీషు వాళ్ళేమంటున్నారో  ఈ చిత్రం చూడండి ..


గొడుగు ప్రస్తావన వచ్చిన పద్యాలూ, శ్లోకాలూ కొన్ని చూదాం.


వెనుకటి రోజులలో అయ్య వారికి చాలు అయిదు వరహాలు, పిల్ల వాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ ఇంటికి వచ్చి, దసరా పద్యాలు చదివే పిల్లలు విధిగా చదివే పద్యం ఒకటుంది.

ధర సింహాసనమై నభంబు  గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై
సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై
వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా

భూమి సింహాసనం, ఆకాశం గొడుగూ, దేవతలు సేవకులూ, వేదాలు వందిమాగధులూ,బ్రహ్మాండమే ఆకారం,లక్ష్మీ దేవి భార్య, బ్రహ్మ కొడుకూ, గంగా దేవి కుమార్తె, అయి నరాయణుడు వర్ధిల్లు గాక అంటారు పిల్లలు.

శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని గొడుగులా ఎత్తి, గోగణాన్నీ, గోపాలురనూ కాపాడాడని పోతన భాగవతంలో చక్కని పద్యంలో వర్ణించాడు.



బాలుండాడుచు నాత పత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేలఁ దాల్చి, విపులచ్చత్రంబుగాఁ బట్టె నా
భీలాభ్రచ్చుత దుశ్శలా చకిత గోపీగోప గోపంక్తికిన్

అంటే, గోవర్ధన పర్వతాన్ని ఆడుతూ పాడుతూ పూల గుత్తిని గొడుగులా భావించి, బాలుడైన శ్రీకృష్ణుడు చిరు నవ్వుతో మీదకు ఎత్తాడు. దారుణ మైన ఆ జడివాన నుండి గోగణాన్నీ, గోపికలను, గోపాలకులనూ కాపాడడానికి ఆ కొండను ఒక పెద్ద గొడుగులా పట్టుకున్నాడు.

పోతన గారి పద్యమే, వామన చరిత్రలోనిది. వామనుడు బలిని అంతమొందించే పనిలో వటువుగా బలి వద్దకు వచ్చాడు.బలి ఆతిథ్య మిచ్చి ఏం కావాలని అడిగాడు. మూడడుగుల నేలనిమ్మని కోరాడు వామనుడు. ఓసింతేనా ! అని ఆశ్చర్య పోయాడు బలి చక్రవర్తి, అసలు కికిరీ తెలియక.

ఏమిటయ్యా, భూభాగాన్ని అడిగావా ? ఏనుగులూ గుర్రాలూ కావాలన్నావా ?జవరాండ్రను అడిగావా ?నువ్వు పసి వాడివి. అడగడం కూడా తెలియదు.నీ అదృష్టం అంతే కాబోలు అంటూ నవ్వేడు.

అప్పుడు వామనుడు  అవన్నీ నాకెందుకయ్యా రాజా అంటూ ఇలా పలికాడు ...

గొడుగో, జన్నిదమో,కమండులవొ,నాకున్ ముంజియో, దండమో,
వడుగే నెక్కడ ? భూము లెక్కడ ? కరుల్. వామాక్సు, లశ్వంబు లె
క్కడ ? నిత్యోచిత కర్మ మెక్కడ ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

నువ్వు చెప్పిన భూములూ, ఏనుగులూ, గుర్రాలూ, ఆడువారూ నాకుంకయ్యా, నును వటువును. నాకు గొడుగో. జంద్యమో, కమండలమో. మొలత్రాడో కర్రో చాలును. నాకు మూడడుగుల నేలను ఇస్తే అదే నా పాలిట బ్రహ్మాండం

నిజంగానే మూడడుగుల నేలను దానం తీసుకుని బ్రహ్మాండాలన్నీ ఆక్రమించి బలిని పాతాళానికి త్రొక్కేసాడు వామనుడు.

అంతర్జాలంలో లభించిన గొడుగుల కథ (వారికి ధన్యవాదాలతో )పెడుతున్నాను చూడండి ..

వర్షాకాలం మొదలవగానే గొడుగుల దుమ్ముదులుపుతాం. నిజానికి, ఇవి ఎండాకాలం ఉపయోగించటానికే తయారయ్యాయి. అసలు గొడుగును ఎవరు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. కానీ వీటిని 11వ శతాబ్దం నుంచే చైనాలో వాడిన దాఖలాలున్నాయి. ప్రాచీన ఈజిప్ట్, బాబిలోనియాల్లో గొడుగులు హోదాకు గుర్తుగా వాడేవాళ్లు.

ఐరోపాలో గ్రీకులు గొడుగును ఎండకు రక్షణగా ఉపయోగించేవాళ్లు. ఉన్నత వర్గాలు, రాజ కుటుంబీకులు మాత్రమే గొడుగులను నీడకోసం వాడేవాళ్లు. వీళ్లందరికీ విరుద్ధంగా గొడుగును వానకు తడకుండా ఉపయోగించే వాళ్లు.... ప్రాచీన రొమన్లు. 1680లో ఫ్రాన్స్‌లో, తర్వాత ఇంగ్లండ్‌లో గొడుగు వాడకం మొదలైంది. 18వ శతాబ్దం నుంచి ఐరోపా అంతటా వానకు రక్షగా గొడుగును వాడటం మొదలుపెట్టారు. ఇదీ గొడుగు కథ 

పాదచారులకు చెట్టు నీడే గొడుగు. ఖర్వాటుల ఖర్మకి మనం చెయ్యగలిగేదేమీ లేదు.



పుట్ట గొడుగులు గొడుగులు కావు. ఒక రకం మొక్కల జాతికి చెందినవి. 

వీటిలో కొన్ని రకాల పుట్ట గొడుగులను మహా ప్రీతిగా కూరొండుకు తింటారు కూడా. పతంజలి గారి రాజుగోరు నవలలో నాయురాలు అల్లుడు అప్పలనాయుడిని ఒక వంక తిడుతూనే, వాడికి పుట్ట గొడుగుల కూరంటే బెఁవత ... చేసి పెట్టమ్మా ! అని కూతురిని పురమాయిస్తుంది...

ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే సమయాను కూలంగా  జంప్ జిలానీల మై పోవడం. లేదా, అందరి దగ్గరా వారికి నచ్చిన విధంగా నడచు కోవడం.

అన్నీ ఒక గొడుగు కిందకే తేవడం అంటే సింగిల్ విండో పధకం లాంటిదన్నమాట.

అప్పుల వాళ్ళ నుండి ముఖం చాటేయడానికి  గొడుగు కన్నా సుఖమైన సాధనం మరొకటి లేదు.
దేనికదే చెప్తుపు కోవాలి. తుఫాను గాలిలో గొడుగులు విరిగి పోవడం తప్ప ఉపయోగ పడవు.
ప్రేమికు లిద్దరూ   వర్షంలో ఒకే గొడుగు క్రింద నడవడం మంచి అనుభవమంటారు ప్రేమ పండితులు.

‘‘ చూసావే ... ఎప్పుడూ తిడుతూ ఉంటావు ... గొడుగు మరిచి పోతున్నానంటూ ...చూడు ... ఇవాళ మరిచి పోకుండా ఆఫీసు నుండి వస్తూ గొడుగు తీసుకొచ్చేను ..’’ అన్నాడు భర్త తన మతి మరుపును వెక్కిరించే భార్య నోరు మూయిద్దామని.

‘‘ అయ్యో ! మీరివాళ అసలు గొడుగే పట్టు కెళ్ళ లేదండీ !’’ అని నెత్తి కొట్టుకుంది భార్య.

ఒకే గొడుగు కింద పదిమంది వెళ్తూంటే వారిలో ఎందరు తడిసే అవకాశం ఉందంటూ అడిగాడు ఒక ఆసామీ. తన మిత్రులని.

ఇద్దరనీ, ముగ్గురనీ, ఐదుగురనీ, ఇలా తలొక్కరూ తలో జవాబూ చెప్పేరు.

‘‘ అసలు వానే పడనప్పుడు ఎవరూ తడిసే అవకాశమే లేదు కదా ! అని భళ్ళున నవ్వుతూ వెళ్ళి పోయాడు ఆ ఆసామీ.


ఇదండీ గొడుగుల కథ.

శలవ్.





22, జనవరి 2014, బుధవారం

చెప్పుకుందాం ... చెప్పుల కథ ...


ఛెప్పు కోడానికేముందిలే, చెప్పుల కథ - అనుకుంటాం కానీ, చెప్పడానికి చాలానే ఉన్నట్టుగా ఉంది ...

వెనుకటి రోజుల్లో మగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు విధిగా కాళ్ళకి చెప్పులూ, చంకలో గొడుగూ ఉండేవి. హాదాని బట్టీ చేసే ఉద్యోగాన్ని బట్టీ కండువా తలపాగాలు అదనం. రైతువారీ అయితే చేతిలో కర్ర తప్పనిసరిగా ఉండేది. ఈ రోజుల్లో రెయిన్ కోట్లు వచ్చేక గొడుగు అంతవిధాయకం కావడం లేదు, ఏ కాలం లోనయినా కాళ్ళకి చెప్పులు మాత్రం ఉండక తప్పదు. ఎండయినా. వానయినా గొడుగు పట్టు కెళ్ళడం కొంత అనాగరకంగా తలచే కాలమిది. కొంతకాలం క్రిందటి వరకూ సినిమాలలో హీరోయినూ. ఆవిడ వెనుక గ్రూపు డాన్సర్లూ రంగు ర్గుల గొడుగులు పట్టుకుని త్రిప్పుతూ హొయలు పోతూ విన్యాసాలు చేస్తూ ఉండే వారు. ఇప్పుడలా చూపించడం లేదు అనుకుంటాను.అన్నట్టు గొడుగుల్లో ఆడ గొడుగులూ, మగ గొడుగులూ అని జండర్ భేదం కూడా ఉందండోయ్. పువ్వుల గొడుగులు ఆడవారికే . కాక పోతే చిన్న పిల్లలకి. నల్ల రంగు గొడుగులు మగాళ్ళవి.ఇవి కాక పెద్ద పెద్ద నగరాల్లో పేద్ధ రంగుల గొడుగులు పెట్టుకుని దాని క్రింద తాత్కాలిక వ్యాపారాలు .. సెల్ ఫోన్ లూ, వగైరాలు అమ్మడం ఇటీవల చూస్తూ ఉన్నాం. ఫలితార్ధం ఏమిటంటే, ఎవరయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక గొడుగు క్రిందకు రావలసిందే ... దీనిని మరింత విపులంగా తరచి చూద్దాం.

దేవాలయాల్లో దేవుడి ఊరేగింపులో వాడే గొడుగులు జలతారు కుచ్చులతో, వెండి పొన్నుతో చాలా పెద్దవిగానూ అందంగానూ ఉంటాయి. వెల్ల గొడుగులవి. పూర్వం రాజులకీ అలాంటి గొడుగులే తప్పని సరిగా పట్టే వారు. ఛత్రదారులని ప్రత్యేకంగా ఉద్యోగులుండే వారు . దేవుడి సేవలోనూ, మహారాజులు సేవలోనూ ఛత్ర చామరాదుల ప్రత్యేకత ఇంతా అంతా కాదు.

రాజ్యం స్వహస్త ధృత దండ మివాత పత్రమ్ అంటాడు కాళిదాసు. అంటే రాజ్య పాలన సొంతంగా తాను పట్టుకున్న గొడుగు లాంటిదని అర్ధం. మనకి మరొకరు గొడుగు పట్టుకుంటే దిలాసాగా ఉంటుంది కానీ, మన దిబ్బ గొడుగు మనఁవే పట్టు కోవాల్సి వస్తే మాత్రం చచ్చే చిక్కే. హాయిగానే ఉంటుంది కానీ, జబ్బలు పీకఁవూ ! అదన్న మాట సంగతి. కాళిదాసు అందుకే రాజ్యాధికారాన్ని సొంత చేత్తో పట్టుకున్న గొడుగుతో పోల్చాడు.

చెప్పుల కథ చెప్పుకుందామంటూ బయలుదేరి కొంత శాఖా చంక్రమణం చేసి గొడుగుల కథలోకి వెళ్ళినట్టున్నాం. గొడుగు చెప్పుకి అగ్రజుడు మరి. సరే, గొడుగుల కథ కాస్సేపు మడిచి ప్రక్కన పెట్టి మళ్ళీ చెప్పుల కథ లోకి వద్దాం !

చెప్పులకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అగనాళ్ళు, అడివొత్తులు, ఉద్దాలు, ఉపానము, ఊడుపు, పాదుకలు, జోళ్ళు, పాదరక్షలు, పాదుకలు, మలకడాలు, ముచ్చెలు, మెట్లు, వగైరా ఇంకా చాలా పదాలకి చెప్పులు అనే అర్ధం, వీటిలో పాదకలను మళ్ళీ అడిగఱ్ఱ, పావకోడు, యోగవాగలు, వాగెలు, వగైరా పేర్లతో పిలుస్తారు.

చెప్పులలో రకాలకీ మనవాళ్ళు పేర్లు పెట్టారు. ఓరట్టు చెప్పులు, కిర్రు చెప్పులు, ఓరచ్చులు,కిఱ్ఱు పావుకోళ్ళు, కిఱ్ఱు బాగాలు,పిడివారులు వగైరా పేర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ మనకు తెలియవు, కనీసం నాకు తెలియదు. కిర్రు చెప్పుల గురించి మాత్రం మనలో చాలా మంది వినే ఉంటారు. సాధారణంగా ఇవి తోలు చెప్పులు. నడుస్తూ ఉంటే కిర్రు కిర్రుమని చప్పుడు చేస్తూ ఉంటాయి. ఇక పావుకోళ్ళయితే కర్రతో చేస్తారు. పాంకోళ్ళు అనికూడా వ్యవహారం. మునులు వీటినే ధరించేవారు.


వెనుకటి రోజులలో పెళ్ళి వేడుకల్లో పెళ్ళి కొడుకు కాశీ ప్రయాణ ఘట్టంలో పాంకోళ్ళు ఇచ్చే వారు

. ఇప్పటికీ పెళ్ళి తంతులో కాశీయాత్ర ముచ్చట సజావుగానే ఉంది. నాకీ పెళ్ళొద్దని వరుడు కాశీ ప్రయాణం కట్టడం, బావమరిది బతిమాలి కాలికి చెప్పులూ, గొడుగూ, కర్రా, కొత్త బట్టలూ ఇచ్చి పటిక పంచదార ముక్క తినిపించి కాశీ ప్రయాణం మానుకుని తమ సోదరిని పెళ్ళి చేసుకొమ్మని అడగడం, వరుడు మనసు మార్చుకుని తిరిగి కళ్యాణమండపం మీదకి రావడం ... ఇదీ తంతు. పోతే పోవోయ్ అని ఊరుకుంటే ఏంజరుగుతుంది చెప్ప్మా ! అని నాకొక చిలిపి ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ వేడుక సమయంలో వరుడికి లోగడ పావుకోళ్ళు ఇచ్చే వారనుకున్నాం కదా ... తర్వాత వాటి స్థానంలో చాలా రోజుల వరకూ హవాయి చెప్పులు. లేదా మామూలు బాటా చెప్పులూ ఇవ్వడం మొదలెట్టారు. కొంతమందయితే వేడుక కోసం మామ్మూలు చెప్పులు పెట్టినా, వరుడికి ఖరీదయిన బూట్లు ఇస్తున్నారు. లేదా మగ పెళ్ళి వారే అడిగి మరీ కొనిపించు కుంటున్నారు.


నిన్నా మొన్నటి వరకూ అగ్రవర్ణాల వారుండే వీధిలోకి కాలి చెప్పులతో కడజాతి వాడు రావడం నిషిద్ధంగా ఉండేది. ఇప్పుడా మాటంటే చెప్పు తీసుకుని కొడతారు. కొట్టాలి కూడా.

చెప్పుల కథ చెప్పుకేనేటప్పుడు విధిగా పాదుకా పట్టాభిషేకంతో మొదలు పెట్టడం సబవు. రాముడు అరణ్య వాసంకి వెళ్ళాక, భరతుడు తల్లి చేసిన పని తెలిసి, బాధపడి, అడవికి వెళ్ళి అన్నగారిని తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యపాలన చేయమని బ్రతిమాలుకుంటాడు. సత్యవాక్పాలకుడు శ్రీరాముడు విన లేదు. చివరకి రాముడు లేని రాజ్యాన్ని తాను పాలించననీ, అందుకు అర్హత తనకి లేదనీ, రాముడి పాదుకలను అడిగి పుచ్చుకుని వాటిని సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం చేసి అన్న గారి పట్ల తన ప్రభు భక్తిని ప్రకటించు కున్నాడు భరతుడు. అయితే, అసలే అరణ్యవాసం తప్పని రాముడికి ఆ ఘోరారణ్యంలో కనీసం పాదుకలయినా లేకేండా చేసాడని ఒక తరహా మేధావులు గోల పెడుతూ ఉంటారు. ఇదీ పాదుకలకి ఉన్న మహిమ. చెప్పుల చరిత్రలో స్వర్ణయుగమది.

దేవుళ్ళ పేరిట దర్శనమిచ్చే పాదుకలను భక్తులు పరమ భక్తి శ్రద్ధలో కొలుస్తారు.







 కనకపు సింహాసనమున శునకం ఎక్కిందో లేదో కానీ పాదుకలు ఎక్కాయి. 

అల్లసాని పెద్దన గారి ప్రవరుడు ఏ చెప్పులూ ధరించకుండానే వొట్టి కాళ్ళతో హిమాలయాలకి వెళ్ళి ఉంటాడని మా తింగరి బుచ్చి పరిశోధనలో తేల్చాడు. సిద్ధుడు కాలికి పూసిన పాద లేపనం కరిగి పోయిందంటే ప్రవరుడు ఏ చెప్పులూ వేసుకుని ఉండడని తింగరి బుచ్చి సూత్రీకరించేడు. దీని నెవరయినా పూర్వపక్షం చేస్తే నాకు అభ్యంతరం లేదు.

ఇక చెప్పుల పద్యాలు ఒకటి రెండు చూద్దాం ...

అల్ప బుద్ధి వానికి అధికార మిస్తే దొడ్డ బుద్ధి వారిని తన్ని తరిమేస్తాడని చెబుతూ వేమన గారు ‘‘చెప్పు తినెడు కుక్క చెఱకు తీపెరుగునా ?’’ అంటాడు.

ఇలాగే వేమన పద్యాలలో చెప్పుల ప్రస్తావన మరో చోట ఉంది. చెప్పు లోని రాయి, చెవి లోని జోరీగ, కంటి లోని నలుసు, కాలి ముల్లు, ఇంటి లోని పోరు ఇంతింత కాదయా ! అంటాడు. వెల్ సెడ్ కదూ ? వాటి బాధ అనుభవించే వాడికే తప్ప మరొకడికి తెలియదు మరి ! ఈ పద్యానికి లోని రాయి గురించి చెప్పు ( ఆత్మ వివేచన చేసుకో !) లాంటి వేదాంత పరమైన అర్ధాలు  కూడా మన పెద్దలు చెప్పారు కానీ, అంత సీను మనకి లేదు. దాని సంగతి వదిలేద్దాం.

వెనుకటికో అవధానిగారికి ఓ పృచ్ఛకుడు ‘‘ కప్పను గని ఫణివ వరుండు గడగడ

వణికెన్ ’’ అని సమస్య ఇచ్చేడు. దానిని అవధాని పూరించిన పద్యంలో చెప్పుల ప్రస్తావన ఉంది కనుక అదీ చెప్పుకుందాం.
కుప్పలు కావలి కాయఁగ
చెప్పులు కఱ్ఱయును బూని శీఘ్ర గతిం దా
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణి వరుండు గడగడ వనికెన్ !

ఇదీ పూరణ. పొలంలో వరి కుప్పలు కాపాలా కాయడానికి వెంకప్ప అనే రైతుచేతిలో కర్ర, కాలికి కిర్రు చెప్పులూ వేసుకుని వచ్చేడుట. వాటి చప్పుడుకి పాము బెదిరి పోయి గడగడా వణికి పోయిందిట.

అల్పుల గురించి ఓ కవి చెబుతూ ..

నక్కలు బొక్కలు వెతుకును
అక్కరతో నూరపంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్.

అన్నాడు. నిజఁవే కుక్కలు చెప్పులను ఉండనివ్వవు. చింపి పోగులు పెడతాయి. ఇళ్ళలో కుక్కలను పెంచే వారికి ఇది అనుభవైక వేద్యమే. ఇలా మన చెప్పులు కుక్కల పాలిబడటం కుక్కల చరిత్రకే తీరని అవమానంగానూ.నష్టదాయకంగానూ. తీరని ద్రోహంగానూ ... యింకా చాలాగానూ మా తింగరి బుచ్చి వాపోతున్నాడు.

సాముల్ని కర్రతోనూ. చెప్పుతో తేళ్ళనీ , జెర్రెలనీ కొట్టి చంనడం మనుషుల అలవాటు. ఈ విధంగా చెప్పులు తేళ్ళ వంటి విషజంతువుల వధలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నమాట. విష జంతువులే కాదు, అలాంటి వెధవల పాలిట కూడా చెప్పులే సరైన ఆయుధాలు. రోమియోగాళ్ళనీ, బేవర్సుగాళ్ళనీ చెప్పు దెబ్బడలతో సత్కరించడం అమ్మాయిలకు అవసరం.చేత్తో కొట్టడం కన్నా, చెప్పుతో కొడితే మరీ అవమానించి నట్టవుతుంది.

సభల్లో నచ్చని వక్తల మీద, రాజకీయ నాయకుల మీద చెప్పులు విసరడం తెలిసినదే. అయితే కోడి గుడ్లు, టమాటాల కంటె ఇది కాస్త ఖరీదయిన వ్యవహారం అనుకుంటాను.హోళీనాడు రంగులు పూస్తారని చెప్పి పాత గుడ్డలు వేసుకు వెళ్ళి నట్టుగా వీటి కోసం ఏ చిరిగిన చెప్పులో ప్రత్యేకించడం మంచిది. లాభదాయకం. మీ ఇష్టం. ఆలోచించండి.

కుక్కలే కాదు, కొత్త చెప్పులూ కరుస్తాయి సుమండీ. ఆ బాధ వర్ణనాతీతం. అలవాటు పడే వరకూ నరకం చూపిస్తాయి. అందుకే పరైన చెప్పులూ, సరిజోడు పెళ్ళామూ లభించడం అదృష్టమనే చెప్పాలి. చెప్పులయితే కనికరించి కొన్ని రోజులకి కరవడం మానేస్తాయి కానీ, మొండి పెళ్ళాలు జీవితపర్యంతం కరుస్తూనే ఉండే ప్రమాదం ఉంది.
ఇక, ఉచితంగా చెప్పులు దొరికే చోటు ఏదంటే ఖచ్చితంగా దేవాలయాలే ! అని ఎవరయినా ఠక్కున చెప్పగలరు. కాక పోతే ఒక్కోసారి పెళ్ళి పందిళ్ళలో కూడా మనకి కావలసిన అనువైన, అందమైన కొత్త చెప్పులు ఉచితంగా దొరికే వీలుంది. ఏదో సినిమాలో నా షోలాపూర్ చెప్పులు పోయాయని గోల పాట ఒకటుంది కదూ ? ఇలాంటి చోట్ల పోయిన చెప్పులన్నీ ఉద్దేశ పూర్వకంగానే ఎవరో ఎత్తుకెళ్ళారనీ అనుకో నక్కర లేదండీ. ఒక్కో సారి హడావిడిలో మనవి కానీ చెప్పులు వేసు కోవడం, కుడి ఎడమల చెప్పులు తారుమారయి అవస్థలు పడడం కూడా జరుగుతూనే ఉంటుంది.

అందుకే ఆలయంలో దేవుడి ఎదుట నిలుచున్నా, చిత్తం చెప్పుల మీదనే ఉంచే భక్తులుంటారు. ఇప్పుడయితే రూసాయో, రెండో తీసుకుని టోకెన్లు ఇచ్చి, మనం వచ్చే వరకూ మన చెప్పులు భద్ర పరుస్తున్నారు కానీ లోగడ ఆ సదుపాయం ఉండేది కాదు. ఇప్పటికీ ఆ సదుపాయం లేని దేవాలయాలు చాలానే ఉన్నాయి. అవి కొత చెప్పులు ఉచితంగా కావాలనుకునే వారి పాలిట చెప్పుల కల్ప తరువులు. అయితే మనకి నచ్చిన , మనకి సరిపోయిన మంచి చెప్పులు కనిపిస్తే మన పాత చింకి చెప్పులు అక్కడ విడిచేసి దర్జాగా ఉడాయించ వచ్చు. కానీ కొన్ని మెళకువలు పాటించక పోతే దొరికి పోతాం. ముఖ్యంగా మనం వేసుకు పోదామనుకున్న చెప్పులాయన, లేదా, ఆమె ఆ చెప్పులు విడిచి ఎంత సేపయిందీ, తిరిగి వెంటనే వచ్చే ప్రమాదమేదయినా ఉందా , చుట్టు ప్రక్కల ఎవరినా నిఘా వేస్తున్నారా ? మొదలయిన విషయాల గురించి ముందుగా రెక్కీ నిర్వహించి తెలుసు కోవడం మంచిది. లేదా దెబ్బ తినేస్తాం అని మా తింగరి బుచ్చి థియరీ.
మరో విషయ మేమిటంటే, మనం శివాలయం ముందు నుంచి చెప్పుల జత ఎత్తు కొచ్చామనుకోండి ... వెంటనే మరి కొన్నాళ్ళ పాటయినా మతంమార్చెయ్యాలి. పరమ విష్ణు భక్తుల మయి పోవాలి. ఆ శివాలయం వేపు కొన్నాళ్ళు వెళ్ళడం వొంటికి మంచిది కాదు.

మా తింగరి బుచ్చిలాంటి ప్రబుద్ధులు చెప్పులు మార్చాలనిపిస్తే ఏదో దేవాలయ దర్శనం చేస్తూ ఉంటారు. సురక్షితమైన ఆలయం ఎన్ను కోవడంలో వారి మెళకువ అంతా ఇంతా కాదు. ఎప్పుడో చెప్పు దెబ్బలు తినే వరకూ వారి తీరు మారదు.

’’ఈ మేలు చేసావంటే నీ రుణం ఉంచు కోను, నాచర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తా ’’ అని ఎవరయినా అంటే మరీ వాచ్యార్ధాన్ని సీరియస్ గా తీసుకో కూడదు. చర్మం వొలిచి చెప్పులు కుట్టించడమంటే జీవితాంతం చేసిన మేలు గుర్తుంచు కుంటాననడమే కానీ నిజంగా అలాంటి చెప్పుల జత వొస్తుందనుకో కూడదు.

చెప్పుల్లో చెప్ప లేనన్ని రకాలు. బాత్ రూమ్ చెప్పులూ. ఇంట్లో తిరగడానికి వాడే చెప్పులూ, వర్షాకాలంలో వాడేవీ, ఎండా కాలంలో సౌకర్యంగా ఉండేవీ, ఫంక్షన్లలో డాబుగా కనిపించేవీ ... చాలా రకాలుంటాయి. సాదా చెప్పులూ. రబ్బరు చెప్పులూ, తోలు చెప్పులూ, బూట్లూ, హాఫ్ బూట్లూ ... చెప్పడం నాతరం కాదు. కొంత మంది రాజకీయ కాయకులకూ, ముఖ్యంగా అమ్మణ్ణులకూ, సినీతారలకూ చెప్పుల పిచ్చి జాప్తీయే. ఎన్ని రకాల చెప్పులు కొన్నా వారికి తనవి తీరదు. ఓ ముఖ్యమంత్రిణి ఇంట చెప్పుల జతలు వందల సంఖ్యలో ఉంటాయని చెప్పుకుంటారు.
చెప్పుల కథలో మరచి పోకూడని చెప్పులు చార్లీచాప్లిన్ వి.అతను వేసుకునే బూట్లు వదులుగా తమాషాగా ఉంటాయి.

ఆఫీసు కెళ్ళే భర్తల చెప్పులు, లేదా బూట్లూ, మేజోళ్ళూ తుడిచి శుభ్రం చేసి సిద్ధం చేయడం ఓ తలనొప్పి వ్యవహారం. బడి నుంచి ఇంటికి వస్తూనే కాలి చెప్పులు ఓ మూలకి విసిరేసే పిల్లలూ, బూట్లు విప్పి ఏ మూలనో గిరాటు వేసే పిల్లల తోనూ  తల్లులకి  నిత్యం సతమతమే.

చివరగా చెప్పుల సామెతలు కూడా చూద్దాం ...

1. చెప్పు కాలు నెత్తిన పెట్టి, వఠకోపమంటాడు.
2. చెప్పు కింద తేలు లాగా
3. చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా ?
4. పట్టు గుడ్డలో చెప్పును చుట్టి కొట్టినట్టు !
5. చెప్పుల వానికి చేనంతా తోలుతో కప్పినట్టుగా ఉంటుంది.
6. చెప్పులున్న వాడితోనూ, అప్పులున్న వాడితోనూ జాగ్రత్తగా ఉండాలి.
7. చెప్పులు సరిపో లేదని కాలు తెగ కోసుకుంటారా ?
8. చెప్పులు తెగినా చుట్టరికం తెగదు.
9. చెప్పు లోని రాయి చెవి లోని జోరీగ, ఇంటి లోని పోరు ఇంతింత కాదు

చెప్పులు అరిగేలా తిరగడ మంటే, పట్టు వదలకుండా కృషి చేయడమన్నమాట.

చెప్పుల కథలో చివరిగా ఒక స్వీయానుభవం కూడా చెప్పి ముగిస్తాను.

అదేదో సబ్బుల కంపెనీ ప్రకటన ... మరక   మంచిదే ! లాగా , కాలికి చెప్పులు లేక పోవడం కూడా ఒక్కో సారి   మంచిదే అని నా స్వీయానుభవం. చెబుతా వినండి.

అవి నేను ఓ మారు మూల కుగ్రామంలో పరిషత్ పాఠశాలలో టీచరుగా చేరిన రోజులు. రెండేళ్ళు ఆ కుగ్రామంలో నానా అవస్థలూ పడ్డాను. ఉద్యోగ మంటేనే విరక్తి కలిగింది. అక్కడి నుండి బదిలీ ఎప్పుడవుతుందా అని ఎదురు చూసాను. ఆరోజు రానే వచ్చింది. రెండేళ్ళు గడిచాక జిల్లా పరిషత్ వారు టీచర్ల బదిలీలు చేపట్టారు. మా మునిసిపల్ ఛైర్మన్ గారు తమకి అనుయాయులూ, తెలిసిన వారూ అయిన టీచర్ల బదిలీలు వారు కోరిన చోట్లకి చేయించే పనిలో జిల్లా కేంద్రానికి మరుచటి దినమే వెళ్తున్నారని తెలిసింది. వెంటనే మా ఊరికొచ్చి, ఆఘ మేఘాల మీద, అప్పటికే హెడ్మాష్టరు చేత అండార్సు చేయించిన బదిలీ దరఖాస్తు కాపీని ఛైర్మన్ గారి కి అంద చేయాలని తలపెట్టాను. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. మర్నాడు ఛైర్మను గారి కారు బయలు దేరే లోపు నా అప్లికేషను వారి చేతిలో పెట్టాలి. లేక పోతే పని జరగదు మరి. నిద్ర లేమితో మర్నాడు ఆలస్యంగా లేచాను. తుళ్ళి పడ్డాను. మాసిన బట్టలు మార్చు కో లేదు. చెప్పులు తొడుక్కుని బయలుదేరే వేళకి ఓ చెప్పు తెగి పోయి నడవడానికి సహకరించడం లేదు. టైం లేదు. ఆ చెప్పులను అలాగే వదిలేసి, మా ఇంటికి ప్రక్క వీధిలోనే ఉండే ఛైర్మను గారింటికి వట్టి కాళ్ళతోనే హడావిడిగా బయలు దేరాను. వారు నా అవతారం చూసి. చెప్పులు లేని నా కళ్ళ వేపు ఓ సారి జాలిగా చూసి, గాఢంగా నిట్టూర్చి, నా చేతి లోనుండి దరఖాస్తు అందు కున్నారు. కాలికి ( తెగి పోవడం వ్లనే అనుకోండి ) చెప్పులయినా లేని నా రూపం వారిలో ఏ పేగు కదిలించిందో మరి, వారు చేపట్టిన బదిలీ లో మొదటిది నాదే ! చక్కగా మా ఊరికి దగ్గరగా చక్కని రవాణా సౌకర్యం ఉండే చోటుకి పట్టుబట్టి నాకు బదిలీ చేయించారు. ఇప్పుడు చెప్పండి ... అర్ధాంతరంగా చెప్పు తెగి పోవడం కూడా మంచిదే కదూ ?!

ఇదండీ నేను చెప్ప గలిగినంత చెప్పుల కథ ...

శలవా మరి ....




















































15, జనవరి 2014, బుధవారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్య దోశె... ఆహా ! ఏమి రుచి !



కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.





అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లు

చాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా హొటల్ డేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాష్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.



చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ,,, ,,, మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.

10, డిసెంబర్ 2013, మంగళవారం

నే చదివినవి రెండు ముక్కలు ...






ప్రహ్లాదుడిని చండామార్కుల వద్ద చదివిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని తలచి హిరణ్య కశిపుడు కొడుకును వారి వద్ద చేర్చాడు.

గురువుల చదివించారు. హోమ్ సిక్ లేకుండా చేదామని కొడుకుని ఒక సారి ఇంటికి రప్పించు కున్నాడు హిరణ్యకశిపుడు.

‘‘ ఎలా ఉందిరా అబ్బీ, నీ చదువు ? ’’ అనడిగేడు.

‘‘ బావుంది నాన్నా ’’ జవాబిచ్చేడు కొడుకు.

‘‘ సరే గానీ గురువులు చదివించిన దానిలో ఓ రెండు ముక్కలు చెప్పు చూదాం ’’ అనడిగేడు.

కొడుకు తడుము కోకుండా అన్నాడు : ‘‘ తెలంగాణా ... సమైక్యాంధ్ర ’’

రాజు గారితో పాటూ, గురువులకీ, అక్కడున్న తతిమ్మా వారికీ మతులు పోయాయి.



‘‘ఏఁవిటేఁవిటీ ? ’’ అనడిగేడు రాజు

కొడుకు మళ్ళీ అవే మాటలు ,ప్పాడు.

ఎవరు ఎన్ని సార్లు అడిగినా ఆ రెండు మాటలూ తప్ప వాడు మరో మాట మాట్లాడడం లేదు. తండ్రికి ఎక్కడో కాలింది.

‘‘అన్ని టెర్ముల ఫీజులూ దొబ్బి ఇదా మీరు నేర్పించింది ? ’’ అని రాజు గురువుల మీద మండి పడ్డాడు

‘‘చండా మార్కుల వారూ, మీ నిర్వాకం ఇంత ఛండాలంగా ఉందేఁవిటండీ ;’’  అని రెచ్చి పోయాడు  ఓ మంత్రి. చాలా రోజులనండీ గురువుల మీద ఎంచేతో ఉన్న అక్కసుని వెలిగ్రక్కుతూ ...

గురువులు గజగజ వణికి పోయారు.

‘‘ ప్రభూ ! మా తప్పేమీ లేదు. నీ కుమారుడికి మేము మంచి విద్యలే నేర్పించాము. బిట్ బ్యాంకులు కంఠోపాటం పట్టించాము. గైడ్లు నూరి పోసాము. పాత క్వశ్చన్ పేపర్లని వందేసి సార్లు వేళ్ళు తిమ్మెర్లు ఎక్కేలా ఆన్సరు చేయించాము. డైలీ పరీక్షలు కాదు ... పూట పూటకీ పరీక్షలు పెట్టి వాడి తాట తీసాము. రాత్రీ పగలూ నిద్ర లేకుండా చేసి చదివించాము. మరి ఈ రెండు ముక్కలే ఎలా పట్టుబడ్డాయో తెలియడం లేదు. ...’’ అన్నాడు వణికి పోతూ ...

ఇంతలో అక్కడున్న  మరో  మంత్రి కలుగ జేసుకుని ‘‘ మీ స్కూల్లో, అదే, మీ గురుకులంలో తెలుగు డైలీ పేపర్లూ అవీ తెప్పిస్తూ ఉంటారా ? ’’ అనడిగేడు.

‘‘ ఓ ! అన్ని తెలుగు పేపర్లూ వస్తాయి సార్ ... పిల్లకాయలకి జనరల్ నాలెడ్జీ వద్దూ ? లోకం పోకడ తెలీ వొద్దూ ? ’’ అన్నారు గురువులు.

‘‘ టీ. వీ. ఉందా ? తెలుగు న్యూస్ చానెల్లు వస్తాయా ?’’ మంత్రి అడిగేడు.

‘‘ అన్నీ వస్తాయి సార్ ! వాటిలో చర్చల పేరిట ఒకరి మాట ఒకరికి వినబడకుండా తిట్టు కోవడం చూసి మా విద్యార్ధులు తెగ సరదాపడి పోతూ ఉంటారు. ’’ అన్నాడు గురువు.

మంత్రి అన్నాడు : ‘‘ అదీ సంగతి ! రోజూ ఆ పత్రికలను చదివి ... చానెల్లు చూసి వీడికి ఆ రెండు మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. వీడి తలలో ఆ రెండు పదాలే కోట్లాదిగా ఆక్రమంచుకుని, మరో వాటికి చోటు లేకుండా పోయింది. అందు చేత తక్షణం గురుకులంలో తెలుగు దిన పత్రికలను తెప్పించడం కొన్నాళ్ళు ఆపెయ్యండి.టీ.వీ. కనెక్షను తీయించెయ్యండి ’’ అన్నాడు.

‘‘అలా చెయ్యండి .. పొండి ’’ అన్నాడు హిరణ్యకశిపుడు.

‘బతుకుజీవుడా ! ’ అని గురువులు అక్కడి నుండి బయటకు నడిచారు.



నీతి : తినగ తినగ బెల్లం చేదుగా నుండు.