24, సెప్టెంబర్ 2014, బుధవారం

మా వెటకారపు వెంకటేశ్వర్లు మీకు తెలుసా ? !


మా వెటకారపు వెంకటేశ్వర్లుని మీకు పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందు కంటే, వాడికి మామ్మూలుగా మాట్లాడడం తెలీదు. మాట మాటకీ ఏదో వెటకారం దొర్లాల్సిందే.

వాడి ఆహార్యం లోనూ, అహారపు టలవాట్ల లోనూ కూ డా వెటకారమే.
గొట్టాం ఫేంట్ల ఫేషను పోయేక , వాడు గొట్టాం పేంట్ల ట్టించుకుని మరీ తిరుగుతాడు.
ఏనుగు చెవుల కాలర్లు పోయేక , వాడు ఏనుగు చెవుల కాలర్లున్న పర్టులు కుట్టించుకుని తిరుగుతాడు.
అలా కుట్టడానికి  నసుగుతూ ఏ టైలరయినా, ‘‘ ఇప్పుడవి ఫేషను కాదండీ! ’’ అంటే, ‘‘నీకు చేత కాక పోతే చెప్పు, మరొకడితో కుట్టించు కుంటాను ’’అని దబాయిస్తాడు.
ఇక భోజనం చేసే విషయంలో కూడా, పంక్తిలో కూచుంటాడా. ముందుగాపెరుగు తే, కలుపు కుంటానంటాడు. ఆ తరువాతే కూరా, పులుసూ. పప్పూనూ.
అప్పడాలో డజను వేయించుకుని, అరచేత్తో వాటిని  ముక్కలయ్యేలా చిదిపి. నవ్వుతూ ‘‘ ఈ చప్పుడు విన్నారూ ? ’’ అంటాడు.
వాడి  వెటకారాల సెగ వాడి పెళ్ళానికి కూడా బాగా తగిలింది.
కాళ్ళకి రెండు రకాల చెప్పు లేసుకోమని సలహా ఇస్తాడు. ఒకటి హైహీల్సూ, మరొకటి మామూలుదీ. అలాగయితే ఎత్తు పల్లాలున్న చోట బ్యాలెన్సు సరిపోతుందంటాడు !
కుడి పైట వేసుకుని తిరగమంటాడు. పువ్వులు కొప్పులో కాదు, చెవిలో పెట్టుకుంటేనే ఆడవాళ్ళకి అందం అంటాడు.
ఈ తిక్క మనిషితో వేగ లేక ఆవిడ కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి పోయింది కూడానూ.
అలాగని వాడికి పిచ్చేమీ కాదు.  లోకంలో అందరూ నడిచే దారిలో నడిస్తే మన విలువేంటని వాడి వాదన. ( దీనికే మారు పేరు పిచ్చి కాబోలు )

ఇక వాడి మాట తీరు ఎలా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చెబుతాను :
 ‘‘ ఏఁవండీ ఈ నెల జీతాలు అందేయా ? ’’ అని సమోద్యోగి ఎవడయినా అడగడం పాపం, ‘‘నా జీతమే అందింది. నీజీతమే నాకు అంద లేదింకా ’’అంటాడు.
‘‘ మీ పిల్లలేం చదువుతున్నారండీ ’’ అని ఎవరయినా అమాయక చక్రవర్తి అడిగితే, టక్కున ‘‘ పుస్తకాలు’’ అని ముక్త సరిగా జవాబిస్తాడు.
‘‘అది కాదు ! .. ... ఏం చదువుతున్నారూ ? ’’ అని రెట్టించి అడిగితే, ‘‘ క్లాసు పుస్తకాలు .. అప్పుడప్పుడు  నవలలూ, వార పత్రికలూనూ ’’ అని వాడి నుండి జవాబొస్తుంది.
‘‘ఏఁవండీ .. ఫలానా సినిమా చూసారా ? ఎలా ఉంది ?’’ అనడిగితే, ‘‘ తెలుగులోనే ఉంది ’’ అని జవాబు చెబుతాడు
‘‘ ఇవాళ మీ ఇంట్లో కూరేం చేసారూ ’’ అని ముచ్చట పడి అడిగితే ‘‘ తిన్నాం !’’ అంటాడు ముక్తసరిగా.

కూరల కోసం, కిరాణా సామాన్ల కోసం బజారు కెళ్తూ, ‘‘ ఏమేవ్ ! అలా ఆకాశానికెళ్తా కానీ, వో బస్తాడు డబ్బులు నాముఖాన తగలెయ్యి ! ’’ అని పెళ్ళాన్ని కేకేస్తాడు.
అదేఁవిటండీ చోద్యం ! అని ఆవిడ విస్తుపోతే ..
‘‘ అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయిట కదే ... అందుకే మరి బజారంతా అక్కడే ఉంటుంది కాబోలునే ’’ అంటాడు.
బయటికి వెళ్ళేటప్పుడు కూడా, ‘‘ ఏఁవే, అలా తిరిగొస్తాను కానీ, తలుపు తీసుకుని ఏడువ్ .. ఏదొంగ వెధవయినా చొరబడాలి కదా ’’ అంటాడే తప్ప, తలుపు వేసు కొమ్మని జాగ్రత్తలు  మాత్రం  తిన్నగా చెప్పడు !
పెళ్ళాం ఎప్పుడయినా వాడితో  ‘‘ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమాటండీ ! వెళ్దాం ! ’’ అని ముచ్చట పడి  అడిగితే,  వెళ్దాం కానీ,  పక్కకింటి ముస్లిం స్నేహితురాలి నడిగి బురఖా తెమ్మంటాడు.
ఎందుకండీ అంటే ‘‘ కుటుంబ సమేతంగా చూడతగిన తెలుగు సినిమాకెళ్తున్నాం కదా, ,, హాల్లో ఎవరయినా గుర్తు పడితే బావుండదు !’’ అని వెటకారాలు పోతాడు.
‘‘ పిచ్చాసుపత్రి నంబరు డైరీలో ఉందో లేదో చూసుకోవే, పనికొచ్చేలా ఉంది ’’  అంటాడోసారి.
‘‘ఎందుకండీ ?’’ సందేహంగా అడుగుతుంది భార్య.
‘‘ యువ కవి వొహడు ఉదయాన్నే తన కవితల పుస్తకంతెచ్చి చదవమని ఒకటే నస ...చదవాలి ..  తరవాత నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఏఁవిటో’’ అని నిట్టూరుస్తాడు.
‘‘ నా రచనలు కాస్త చదివి పెడతారూ ?’’ అని ఏ అర్భకుడయినా అడిగితే,
‘‘ చదవను ! కానీ  ( ప్రక్కన ) పెడతాను.’’ అంటాడు దురుసుగా.

‘‘ పెళ్ళి కెళ్ళొచ్చేరుగా ! ఎలా జరిగిందేఁవిటి ’’
‘‘సవ్యంగానే జరిగిందనుకుంటున్నాను .... ఎందుకంటే, పెళ్ళి కొడుకు  పెళ్ళి కూతురు మెడలోనే మంగళ సూత్రం కట్టేడు ’’
వీడి వెటకారాలు మామ్మూలుగా తెలిసిన వాళ్ళతోనే కాదు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా అందరితోనూ ఇలాగే మాట్లాడుతాడు !
ఓ సారి  తెలిసిన డాక్టరు దగ్గరి కెళ్ళాడు. ఆయనతో మన వాడికి కొంచెం ఎక్కువ చనువు కూడా ఉంది లెండి
‘‘ఏఁవయ్యా డాక్టరూ !  వారం నుండీ వొకటే జలుబు !  నువ్వే వైద్యం చెయ్యలి ... చెప్పు, పీ.ఎఫ్ లోను పెట్టమంటావా ? పొలం అమ్మమంటావా ’’ అనడిగేడు.
 ( దానితో తిక్క రేగిన ఆ డాక్టరు వాడి జబ్బ అందుకుని నెల్లాళ్ళ వరకూ తగ్గకుండా ఉండేలా వో ఇంజక్షను పొడిచీసేడనుకోండి ! )

ఇదీ మనవాడి వెటకారపు గోల.

కొస మెరుపు :
‘‘ నీ పద్దతి మార్చుకోవయ్యా ... యిదేం బాలేదు .. ఇంతకీ ఇలా వెటకారంగానూ, పిచ్చ పిచ్చగానూ మాట్లాడడం నీకు చిన్నప్పటి నుండీ ఉందా ? ఈ మధ్య మొదలయిందా ? ’’ అనడిగేను, జాలిగా, వాడిని సంప్కరించే సదుద్ధేశంతో.

 వాడు దీనంగా ముఖం పెట్టి అన్నాడు :  ‘‘ మొదటి నుండీ లేదండీ ! ... మీ కథా మంజరి బ్లాగు టపాలు చదివిన తరువాత నుండీ నండీ ... ’’ అన్నాడు వినయంగా.

ఈ సందర్భంగా నాకు మన కవుల  చమక్కు సంభాషణలు కొన్ని గుర్తుకొస్తున్నాయి.
పనిలో పనిగా అవి కూడా చూదాం !
‘‘ ఏఁవండీ ఎక్కడికి బయలు దేరారూ ... ఊరికా ! ’’
‘‘ అవును. ఊరికే.’’
***       *****     ****    ****   ****   *****   ****   ****
‘‘ ఈ రోడ్డెక్కడికి పోతుందీ ? ’’
‘‘ ఎక్కడికీ పోదు ! నాచిన్నప్పటి నుండీ చూస్తున్నాను . ఇక్కడే ఉంది !‘’
***   ****     *****     *****     *****    *****   ****
రామయ్య గారిల్లెక్కడండీ ?’’
‘‘ ఆయనకేం పనీ ! పైగా పెద్ద మనిషి కూడానూ !’’
****                 ******                      *****                       *****
సర్వరూ! ఈ కాఫీలో బొద్దింక పడి నట్టుంది చూడూ ... కాఫీకే డబ్బులిస్తాను. బొద్దింకకు ఇవ్వను సుమీ.’’

*******              *******                      *******                  ******
‘‘నా కవిత్వంలో మరి కొిన్ని నిప్పులు కక్కమంటారా  టారా ? ’’ యువ కవి అడిగేడు.
‘‘ వద్దు. నీ కవిత్వాన్నే నిప్పుల్లో కుక్కు’’ మహా కవి సలహా.





21, సెప్టెంబర్ 2014, ఆదివారం

పొటిగరాప్పంతులు ( జూ)తో ... మాటా మంతీ..



ఇవాళ గురజాడ 151వ జయంతి. మహా కవిని స్మరిస్తూ  లోగడ రాసిన టపాయే  మరొక్కమారు ..
సాన్దీ తనూ తీయించు కున్న పొటిగరాపుల ఖరీదు   గిరీశం ఇచ్చే వరకూ ఈ టపా ఇలా పుర్ముద్రణలు  జరుపు కుంటూనే ఉంటుందని మనవి చేస్తున్నాను.  అంచేత, దీనికి చర్విత చర్వణ దోషమూ లేదు. కాల దోషమూ లేదు.
పాతబడి పోవడమూ లేదు !
ఇక చదవండి ...
***   ****    ****    ****    *****   ****    ****    ****    ****    ****    ****    ****    ****   ****   ****  ***

ఈ మధ్య విజయ నగరం వెళ్ళినప్పుడు అలా మూడు లాంతర్ల వరకూ వెళ్తే పొటిగరాప్పంతులు కలిసేడు.
కన్యాశుల్కం మొదటి అంకంలో వచ్చే పొటిగరాప్పంతులు పని వాడుగుర్తున్నాడా?
సాన్దీ గిరీశమూ కలిసి తీయించుకున్న ఫొటోల డబ్బులు వసూలు చేసుకుని రమ్మని వాడిని పంతులు పంపిస్తాడు.
నేను కలిసింది ఆ పొటిగరాప్పంతులు గారి మనవడిని. పొటిగరాప్పంతులు, జూనియర్ నన్న మాట.
‘‘పొటిగరాప్పంతులూ ఎలా ఉన్నావెలా ఉన్నావ్’’ అనడిగేను.
‘‘ ఏం ఉండడంలే, ఏదో, యిలా ...’’ అన్నాడు.
‘‘ అదేం ? ’’
‘‘ మా తాత గారు కాలం చేసే వరకూ గిరీశం గారి బాకీ కోసం మనుషులని పంపించీ, తను కాళ్ళరిగేలా తిరిగీ కూడా ఆ బాకీ రాబట్టుకో లేక పోయేరు. వారి తదనంతరం మా తండ్రి గారూ . తర్వాత నేనూ, కనీసం గరీశం గారి మనవళ్ళెవరయినా కనిపించక పోతారా, వారి తాత గారివ్వాలిసిన బాకీ తీర్చక పోతారా అనే ఆశతో ఇలా విజనగరం వీధులంట తెగ తిరుగుతున్నాను..‘‘
‘‘ ఎవరూ కనిపించ లేదూ?’’
‘‘ కనిపించకేం. కానీ అందరూ ఆ తాత గారి చందమే‘‘
‘‘అదేమిటి?’’
‘‘ అందరూ దాదాపు గిరీశం గార్లాంటి వాళ్ళే తయారయేరు. సానుల్తో ఫొటోలు దిగడం, డబ్బుల కోసం మనిషిని పంపిస్తే ఏవో మాయ మాటలు చెప్పి తప్పించు కోవడం ... పైగా గాయత్రి మీద ప్రమాణాలు చెయ్యడమొకటీ ... బిజినెస్సు దివాళా తీసిందనుకో’’ అన్నాడు విచారంగా.
పాపం. అనుకున్నాను. పొటిగరాప్పంతులు పంపిన మనిషికి టోకరా ఇచ్చి, గిరీశం , శిఫ్యడు వేంకటేశంతో ఆ బడుద్ధాయికి చదువు చెప్పే నెపంతో ఉడాయించడం ..... క్రిష్ణరాయపురం అగ్రహారం వెళ్ళిఅగ్ని హోత్రావధాన్లు ఇంట తిష్ఠ వేయడం..... అన్నీ గుర్తొచ్చాయి,
‘‘ సరే కానీ, విజయ నగరం అందాలు చూపించే ఫొటోలు ఏవయినా ఉంటే ఇద్దూ, మా బ్లాగు మిత్రులకి చూపిస్తాను’’ అనడిగేను.
‘‘ బ్లాగా ? అంటే ...? ’’ అనడిగేడు అనుమానంగా.
‘‘ దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ, ముందు ఫొటోలుంటే ఇవ్వు’’
‘‘సరేలే, నీ ఏడుపేదో నువ్వుఏడువ్. ఏవో కొన్ని ఫొటోలున్నట్టున్నాయి. ఇస్తాను తీసికెళ్ళి ఎలా తగలడతావో నీ ఇష్టం.
ముందు నాకో మాంఛి చుట్ట పీక ఉంటే ఇలా పారెయ్‘‘
‘‘ చుట్ట లేదు కానీ, కింగ్ సైజు ఫిల్టరు సిగరెట్టుంది, కాల్చు’’ అంటూ ఓ సిగరెట్టూ, అగ్గి పెట్టె అందించాను.
చీదరగా ముఖం పెట్టాడు పంతులు.
‘‘ చుట్ట లేదూ? గురజాడ వారు మా గిరీశం నోటంట చుట్ట మాహాత్మ్యం గురించి ఎంత గొప్పగా చెప్పారో అప్పుడే మరిచి పోయేరా వెధవ కక్కకట్టల్లారా.... ’’ అంటూ అయిష్టంగానే సిగరెట్టు వెలిగించి, ఓ దమ్ము లాగి వదిలేడు.
‘‘ మరి నేనడిగిన ఫొటోలో?’’
‘‘ నీ అమ్మ కడుపు కాల. వదలేలా లేవురా. సరే నా దగ్గర కొన్ని ఫొటోలేవో ఉన్నట్టున్నాయి. ఇస్తాను. అప్పటి విజయనగరం కాదురా తండ్రీ. చాలా మారి పోయింది. పండు ముత్తయిదువులా ఎంత బాగుండేదని ... ఇప్పటి రూపంలో మన విజయ నగరాన్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కు పోతుందిరా బాబూ ....నువ్వే చూడు ...’’ అంటూ కొన్ని ఫోటోలు అందించేడు.
ఆత్రంగా వాటినందుకుని, గబగబా చూసేను. ‘‘ అవునూ, ఇంకా చాలా స్థలాలకి చెందిన ఫొటోలు ఉండాలే , ఏవీ,
చా.సో గారి హవేలీ , మచ్చ కొండా, కొట లోని రౌండ్ మహల్, మోతీ మహల్, పెద్ద చెరువు గట్టు మీద రాజుల విగ్రహాలూ, ఏనుగుల తోటా, నారాయణ దాసు గారూ, ద్వారం వారూ, కోడి రామ్మూర్తి గారూ నివసించిన ఇళ్ళూ, వ్యాయామశాల, పూల్ బాగ్, , బాబా మెట్ట , దివాన్ గారి మేడ, రాజారావు మేడ, అంబటి సత్రం, అయ్య కోనేరు గట్టున వెలసిన వేంకటేశ్వర స్వామి వారి చిన్న గుడీ. చిన్న ఆంజనేయ స్వామి వారి కోవెలా, లంక వీధి, కానుకుర్తి వారి సత్రం, అయోధ్యా మైదానం,, రాజు గారి సాని సింహాచలం మేడ ... ఇవన్నీ ఏవీ ? ’’ అడిగేను.
‘‘ నీ ముఖం తగలెయ్య. పైసా విదల్చకుండా ఫొటోలన్నీ దొబ్బుకు పోతూ, మళ్ళీ అవి లేవు, ఇవి లేవు అంటూ సణుగుడొకటా.? ఇప్పటికి ఉన్నవి తీసికెళ్ళు. ఈ సారి మిగతావి దొరికితే ఇస్తానులే. సరే కానీ, ఈ సారి వచ్చి నప్పుడు మంచి చుట్టల కట్ట తేవడం మాత్రం మరిచి పోవద్దు సుమీ....ఇక వెళ్ళు ఆ గిరీశం ఎలానూ ఇక దొరకడు. కనీసం వాడి మనవలో, మునిమనవలో కనిపిస్తారేమో చూడాలి. మా తాత గారు తీసిన పుటిగరాపుల బాకీ వసూలు చేసుకోవద్దూ? అసలప్పుడే మా తాత గారు సౌజన్యారావు పంతులు గారిని కలిసి ఆ గిరీశం మీద దావా పడేద్దామనుకున్నారట కానీ, విశాఖ పట్నం వెళ్ళి రావడానికి ఛార్జీలు లేక ఉండి పోయార్ట. .. సరేలే, వెళ్ళిరా ...’’ అంటూ జనంలో కలిసి పోయేడు.
ప్రవాహంలా సాగి పోతున్న అ జన వాహినిలో ఈ జూనియర్ పుటిగరాప్పంతులుకి వందలాది, వేలాది గిరీశంలాటి వాళ్ళు కనిపిస్తారు.
గిరీశం నేర్పించి పోయిన టక్కరి విద్యలు ఉపయోగించి పంతులుని లాఘవంగా బురిడీ కొట్టించి చక్కా పోతారు.
పంచె కట్టు మానీసి, ఫేంటూ చొక్కాలతో లుబ్ధావధాన్లూ, కరటక శాస్త్రీ , అగ్ని హోత్రావధాన్లూ వగైరాలు కాని ,
వాళ్ళ లాంటి వారు కానీ, కూడా కనిపించ వొచ్చును.
సౌజన్యారావు పంతులు కనిపించడు. కనీసం అలాంటి మహానుభావులూ కనిపించరు.
ఇక మధుర వాణి సంగతంటారా? అక్కడే కాదు యావద్దేశంలోనూ, ఆ మాట కొప్తే యావత్ ప్రపంచం లోనూ పొటిగరాప్పంతులకే కాదు, అసలు ఎవరికీ మరి కనిపించదు. ఎందుకంటే ఆవిడ గురజాడ వారి కాళ్ళొత్తుతూ
ఏ స్వర్గంలోనో అంత గొప్ప పాత్రగా తనని తీర్చి దిద్దిన ఆ మహా రచయిత ఋణం తీర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ....
మరింక పుటిగరాప్పంతులు (జూ) ఇచ్చిన ఫొటోలు చూడండి .......
మహా రాజా వారి కోట. ఇందులోనే రౌండ్ మహల్, మోతీ మహల్ వగైరా భవనాలు ఉన్నాయి. ఇప్పుడీ కోట లోని భవనాలన్నీ రాజుల వితరణ త తో విద్యాసంస్థలకు నెలవులయి విలిసిల్లుతున్నాయి.

ఈ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అని అంటారు. గురజాడ వారి కన్యాశుల్కం నాటకం మొదటి అంకం లోని మొదటి స్థలం ఇదే. బొంకుల రాయడు గరీశం బొంకుల దిబ్బ దగ్గరే నాటకంలో తొలి సారిగా కనిపిస్తాడు..ఇప్పుడీ ఖాళీ జాగాలో కూరగాయల మార్కెట్టు ఉంది.

దీనిని మూడు లాంతర్ల జంక్షన్ అంటారు. నిజానికిది నాలుగు రోడ్ల కూడలి కాదు. ఇక్కడ మూడు రోడ్ల కూడలి ఉంది. ఒకటి కస్పా బజారు మీదుగా కోట వేపు వెళ్ళే రోడ్డు కాగా, దానికి ఎదురుగా అంబటి సత్రం, పూల్ బాగ్లకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఇక, మూడులాంతర్లకి ఎదురుగా పోయే రోడ్డు లో మొదట్లోనే అమ్మ వారి గుడీ, అది దాటేక గంట స్థంభం వస్తాయి. ఆ దారి తిన్నగా రైల్వే స్టేషన్కి దారితీస్తుంది. గంటస్థంభం నుండి మధ్యలో ఎడమ వేపు తిరిగితే పెద్ద చెరువు, రాజుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఈ మూడు లాంతర్లు మూడు సింహం బొమ్మలు. వాటి మీద ఒకప్పుడు చవురు దీపాలను వెలిగించే వారుట. తర్వాత తర్వాత ఎలక్ట్రిక్ దీపాలూ ఉండేవి. ఇప్పుడా దీపాలూ లేవు. ఆ వెలుగులూ లేవు. ఒకప్పుడు  రోడ్డుకి ఎత్తుగా మూడు మెట్లతో ఉండే ఈ కట్టడం , రోడ్డు మందంగా బలియడం వల్ల కురచగా మారి పోయింది.
మహా కవి గురజాడ . ఈ విగ్రహం గురజాడ స్మారక గ్రంథాలయం ఆవరణలో ఉంది.
ఇదే అయ్య కోనేరు. కన్యాశుల్కం నాటకం మొదటి అంకంలో పొటిగరాప్పంతులు మనిషి గిరీశం నుండి అతనూ మధురవాణీ తీయించుకున్న ఫొటోల బాకీ డబ్బులు అడగాడానికి వస్తే, గరీశం వినబడనట్టు నటిస్తూ, ‘ అయ్యకోనేటికి తోవ ఇదే’ అంటాడు కదూ? ఆ అయ్య కోనేరు ఇదే.
విజయనగర ప్రభువులు పితృకర్మలు ఇక్కడ చేసే వారట. 1980 వరకూ అనుకుంటాను, దానికి చెందిన శిధిల కట్టడాలు ఇక్కడ కనిపించేవి.
ఈ కట్టడాన్ని గుమ్చీ అంటారు. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు ఇక్కడ హరి కథలు చెప్పే వారు.
గుమ్చీ ఈ ప్రక్కగా వెళ్తే శంకర మఠం వస్తుంది. కౌముదీ పరిషత్తు తొలి రోజుల కార్యక్రమాలు అక్కడే జరిగేవిట.
70 లలో కౌముదీ పరిషత్తు నునరుద్ధరించేక, భ.రా.గో మొదలయిన  ప్రరముఖ చయితలు  ఇక్కడ కథలు చదువుతూ సందడి చేసే వారు.

విజనగర రాజుల పరమత సహనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ దర్గా కోటకు అతి సమీపంలో కస్పా బజారుకి వెళ్ళే దారిలో ఉంది.
ఇది కోటకీ, బొంకుల దిబ్బకీ సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ముద్దుగా ప్యారిస్ కార్నర్ అని పిలుచుకుంటూ
రోజూ సాయంత్రాల వేళ కవులూ, రచయితలూ కబుర్లతో సందడి చేస్తూ ఉండే వారు.,  పతంజలి,  జగన్నాథ శర్మా, పంతుల జోగారావు, దాట్ల నారాయణ మూర్తి రాజు, కొడవంటి కాశీపతిరావు లాంటి రచయితలు.

ఈ మూడు కోవెళ్ళ లోనే దాసు గారు తరచుగా హరి కథలు చెప్పే వారు.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల. ఇక్కడ వేద పాఠశాల, భాషా ప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, వ్యాకరణ విద్యాప్రవీణ కోర్సలు నిర్వహించే ప్రాచ్య కళాశాల, ఉన్నత పాఠశాల, ఉన్నాయి. దేశం గర్వించే మహా పండితులు మెసలిన చోటు,
ఇది విజయనగర ప్రభువులు నిర్మించి అవిఘ్నంగా నిర్వహిస్తున్న విద్యార్ధి ఉచిత భోజన శాల.
సింహాచల దేవస్థానం చౌలటరీ అంటారు. ఏళ్ళ తరబడి రోజూ వందలాది విద్యార్ధులకి ఉచితంగా కమ్మని భోజనాన్ని సమకూరుస్తూ వారి విద్యాభ్యాసం కుంటు పడకుండా కాపాడుతున్న చల్లని తల్లి.

విజయగరం ప్రభుత్వ మహా రాజ సంగీత కళాశాల.
ద్వారం నాయుడు గారి లాంటి సంగీత దిగ్దంతులు నడయాడిన చోటు. ఘంటసాల సంగీత సాధన జరిగింది ఇక్కడే.

అయ్య కోనేరు తూర్పు గట్టున వెలసిన పెద్ద ఆంజనేయ స్వామి వారి కోవెల.

కోట వెనుక భాగం. కందకం

రాజా వారి డిగ్రీ కళాశాల. గురజాడ చదివినదీ, ఉద్యోగం చేసినదీ ఇక్కడే
గంటస్థంభం. విజనగరానికి ఇది తలమానికం.
పెద్ద చెరువు. వేలాది ఎకరాల నేలకు సాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఓ సారి తమ విజయనగర అనుభవాలను స్మరించుకుంటూ , విజయగరంలోని ఒక్కో ప్రదేశాన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు:
‘‘విజయనగరంలో నాకన్నీ ఇష్టం. చివరకి పెద్ద చెరువులో దోమలు కూడా. ’’ అని.
ఈ పెద్ద చెరువు దగ్గర దోమల మందిరం అని ఒకటుండేది. అక్కడ దోమలు ఎక్కవగా ఉండే రోజులలో దాదాపు ఒక నెల రోజుల పాటు పాఠశాలలకి ప్రత్యేకంగా సెలవులు ప్రకటించే వారుట.
శ్రీ పైడితల్లి అమ్మ వారి గుడి. విజయనగర రాజుల ఇల వేలుపు. ఏటా విధిగా జరిగే అమ్మ వారి పండుగలో సిరిమానోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణ.
అమ్మ వారికి చెందిన తొలి గుడి విజయ నగరం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంది. వనం గుడి అని ఆ గుడికి పేరు.
కన్యాశుల్కం, ముత్యాల సరాలు, తెలుగు తొలి కథ దిద్దుబాటు మొదలయిన గురజాడ రచనలు జాతి నోముల ఫలంగా వెలుగు చూసిన చోటు ఇదే.
విద్యార్ధి భోజనశాల





ఇవీ జూనియర్ పొటిగరాప్పంతులు నాకిచ్చిన ఫొటోలు. మరోసారి అతను మిగతా ప్రదేశాల ఫోటోలు ఇచ్చాక మీముందు పెడతాను.

ఈ లోగా అతని కోసం మంచి చుట్టలు ఎక్కడ దొరుకుతాయో వాకబు చేయాలి. మరి ఉంటాను.












20, సెప్టెంబర్ 2014, శనివారం

మా వారు బడుద్ధాయ్ ... కాదు !



బయటికి అన కూడదు కానీ, మా వారొట్టి బడుద్ధాయ్. ఎవరితోనూ ఈ మాట అనబోకండి, కొంపలంటు కుంటాయ్, ఈ మాట నేను ఊరికే అనడం లేదు. దానికి మా సాంసారిక జీవితంలో చాలా తార్కాణాలున్నాయి. ( నిజానికి  ప్రతి బడుద్ధాయి మగ మహా రాజు విషయంలో నూ సరిగ్గా యివే కాక పోయినా, ఇలాంటివే కొన్ని ఉదాహరణలు  ఉంటాయని నా మనో నిఃశ్చయం. )

        సరదాగా వో చల్లని సాయంత్రం వేళ శ్రీ వారిని వెట బెట్టుకుని చీరల షాపుకి వెళ్తానా !  అక్కడ మొదలవుతుంది మా శ్రీ వారి నాగినీ డాన్సు. ఆ షాపంతా చక్కా ఏ. సీ హాలే అయినా ,మా వారు ఊరికే చెమట్లు పట్టి పోతూ ఉంటారు.
    నిముషానికోసారి అయిందా ? తొందరగా తెముల్చూ, యిక వెళ్దాం ... అంటూ ఒకటే నస. ( మనం ఖాతరు చెయ్యమనుకోండి )
    షాపు వాడు చూపించిన ప్రతి చీరా, ‘‘ ఇది చాలా బావుంది, కొనెయ్ ’’ అంటూ తెగ తొందర చేస్తూ ఉంటారు. ( మానవుడు పాపం, ఫీలవుతాడు కదా, అని ఓ చిరు నవ్వు పారేసి, ఆ చీరని చూపించిన వాడి ముఖాన కొడతాం.) 
‘‘ ఈ చీర చూసావూ, నీకిది బాగా నప్పుతుందే ... నువ్వు కడితే  దీనందం రెట్టింపవుతుంది ! ’’ అని మనల్ని ఉబ్బేయడానికి  ప్రయత్నిస్తారు.
వ   అలాంటి వాటికి పడతామా మనం !  పోయినేడు మా మరిది పెళ్ళికి ఏ రంగు చీరలు  మార్చి కట్టు కున్నానో టక్కున చెప్ప మనండి, చూదాం ! చెప్ప లేరు ! అలాంటిది  నన్ను ఉబ్బేసి షాపింగు త్వరగా తెమల్చడానికి కాక పోతే, చీరల సెలక్షను ఈయనకేం తెలుసూ !
         ‘‘మొత్తానికి ఉండేవి ఏడు రంగులే కదా, ఏ రంగు ఎంచు కోవాలో తేల్చు కోడానికి ఇంత సేపా ! ’’ అంటూ విసుక్కు పోతారు.
        ఏడిసినట్టుంది !  ఉన్న రంగులు ఏడే కానీ , వాటి కాంబి నేషను కోకొల్లలని ఈ పురుష సింహం ఎప్పుడు తెలుసు కుంటుందో  కదా !
     ‘‘ మా మగాళ్ళయితే క్షణంలో ఏం కావాలో ఇట్టే తేల్చేస్తాం. నా బట్టల సెలక్షనయితే అర నిముషం పట్టదు !’’ అంటారు, గర్వంగా
‘  ‘ అందుకే ఏడిసినట్టుంటాయి ’  స్వగతంలో అనుకుని, 
     ‘‘ మీ కోసం అయితే ఫేంటూ , చొక్కా మీరే కానక్కర లేదు ... మన బుజ్జి ముండ కూడా అర క్షణంలో ఎంచి పారేస్తుంది ... ఎప్పుడూ ఆ ముదురు నీలం రంగు ఫేంటూ, ఆ చారల  చొక్కా గుడ్డలే కదా ! ’’ అని నవ్వుతాం. 
     ‘‘ సరి సరి ...  తొందరగా కానీ ... చూడు, ఎన్ని చీరలు తీయించి ్ుప్ప వేయించావో ...’’ అని     విసుక్కుంటారు.

       ఏదీ ఇంకా చూపించాల్సిన చీరలు వాడి వెనకాల ఉన్న అరల్లో ఒకటీ రెండూ మిగిలి పోయేయి కదా, అవి కూడా చూడొద్దూ ! వచ్చి ఇంకా రెండు గంటలేగా అయిందీ ?!      ఈ పాయింటు అర్ధం చేసుకో లేక, సిగరెట్టు కంపు కొట్టే నోటిని నా చెవి దగ్గర ఉంచి,     ‘‘ అన్నీ తీయించి అక్కర లేదని పడేస్తున్నావు ! వాడేమయినా అనుకుంటాడేమోనే’’ అంటూ  తెగ ఫీలయి పోతూ ఉంటారు. జాలి గుండె మనిషి పాపం.
           మనం వారి ఎత్తులకీ , జిత్తులకీ లొంగక పోయే సరికి, ‘‘ చంటిది నిద్ర లేచి  అమ్మని ఏం ఇబ్బంది పెడుతోందో , ఏమో !’’ అని ఓ కొత్త  పల్లవి ఎత్తుకుని బెదిరింపులకు దిగుతారు !                    మనం ఏమన్నా తక్కువ తిన్నామా ! ‘‘ లేవదు గాక లేవదు! లేచినా ఇంతో టి మీ అమ్మ గారేమీ కంది పోరు లెండి. ఆపాటి మనవరాలిని చూసుకో లేరూ ! మరీ అంత సుకుమారి రాజ కుమారా  ఆవిడా?!’’  అంటూ, దీర్ఘాలు తీస్తూ హాశ్చర్యం నటిస్తాం. అంతే ! దాంతో వారి నోరు మరి పెగలదు.
                      ఇవ్విధంబున దశ విధాలా, కొండొకచో మరి కొన్ని విధాలా  మా బడుద్ధాయి గారిని నాన బెట్టి,      ఉతికి , ఆరవేసి, ఇస్త్రీ చేశాక  కనికరించి ఉన్న వాటిలో ఖరీదయిన చీరలు ఫదో , పాతికో 
   కొంటాం.                    అప్పటికే సగం కను గుడ్లు తేలేసిన శ్రీ వారు కిమ్మనకుండా బిల్లు పే ,స్తారు.

                      అప్పుడు మన కనిపిస్తుందీ,  అయ్యో ! ఇంత మంచి మనిషినా, పట్టుకుని బడుద్ధాయి అనీ అదనీ ఇదనీ వాగేను. కళ్ళు పోవూ !

                        మా ఆయనంత మంచాయన లోకంలో మళ్ళీ మా ఆయనే కదా !

ఇదండీ ...చీరల చిరు కథ.  చీర పద్యాలు పుస్తకానికి రెండో ముద్రణ జరిగేటప్పుడు  దీనిని నిరభ్యంతరంగా ముందు మాటగా కాక పోయినా, వెనుక మాటగా వేసుకోడానికి నాకు ఎలాంటి అభ్యంతరమున్నూ లేదు. ( మనకి లేక పోయిననూ వారికి ఉండే ఉండ వచ్చునని  ఎందుకో తోచు చున్నది.)


తాజా కలం :  భార్యల దృష్టిలో బడుద్ధాయి   కాని మగాడు ఉండేమో. !
‘‘ మీకేం తెలియదు ! మీరూరు కోండి !’’ అని  ఒక్ఖ సారయినా పెళ్ళాం చేత అనిపించు కోని వారికిది వర్తించదని వినయ పూర్వకంగా మనవి చేస్తున్నాను .
. ( అలాంటి వారెవరయినా ఉంటే గింటే )

 ( ఈ టపాలో ఉపయోగించుకున్న కార్టూనులు గీసిన  వ్యంగ్య చిత్రకారులకి ధన్యవాదాలు,)

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

మా ‘ వేలు విరిచిన మేన బాబాయి ’ కథ !



వేలు విడిచిన మేన మాఁవ లున్నట్టే, వేలు విడిచిన మేన బాబాయి లుంటారా ?అనేది ఇటీవల ఒకరి సందేహం. ఎందు కుండరూ ,ఉంటారు. ఈ వేలు విడవడం అంటే  మరేం కాదు. వేటినయినా లెక్కించే టప్పుడు చిటికెన వేలు మొదలుకుని వరుసగా ఉంగరపు వేలూ, తర్వాత మధ్య వేలూ, ఆపైన చూపుడు వేలూ ముడుస్తూనో , మన బొటన వేలితో వాటిని తడుముతూనో చెప్పడం వొక ఆన వాయితీ. ఈ లెక్కింపులో వొక వేలు దాట వేయ వలసి వస్తే, అదే వేలు విడిచిన లెక్క అవుతుందన్న మాట. ఏతావాతా తేలిందేమిటంటే, మన అమ్మా నాన్నల అన్నదమ్ములూ, అక్క చెల్లెళ్ళూ -మనకు సొంత మేన మామలూ , మేనత్తలూ, మేన  బావలూ అవుతారు కదా ..... అమ్మా నాన్నల పింతల్లి . పెత్తల్లి బిడ్డలు మనకి వేలు విడిచిన మేన మామలూ, మేనత్తలూ, వేలు విడిచిన మేన బాబాయిలూ అవుతారు.  అంటే, మరీ సొంతం కాకుండా , మన వారే అయినా , కొంచెం ఎడం వారే వేలు విడిచిన వారు !

   ఏమయినా, ఆ తేడా బంధుత్వాన్ని స్పష్టం చేయడం కోసం మన వాళ్ళు ‘‘వేలు విడిచిన’’ అనే ఎంత చక్కని పబంధం కల్పించారో చూడండి ! ముచ్చట వేయడం లేదూ ! అదీ, మన తెలుగు  భాష కమ్మ దనం అంటే !
     వేలు విడిచిన మేన మామలూ, బాబాయిల సంగతి కాస్సేపు పక్కన పెడితే, నేనిప్పుడు మీకు మా ‘‘వేలు విరిచిన   మేన బాబాయి ’’గురించి చెబుతాను ..
వా ట్ ! వేలు విడిచిన బాబాయిల్లాగానే, వేలు  విరిచిన బాబాయిలూ ఉంటారా ? అని ఊరికే తెగ ఆశ్చర్య పోకండి. ఉంటారుంటారు. మా నరసింహం బాబాయే మా వేలు విరిచిన బాబాయి. నా చిన్నప్పటి ఆ ముచ్చటే ఙ్ఞాపక మొచ్చి , మీకు చెబుదామని మొదలు పెట్టాను.
పార్తీ పురం లో మాది లంకంత కొంప . పెరడంతా పెద్ద అడవిలా ఉండేది. ఉండే దేమిటి, దాదాపు ఇప్పటికీ అలాగే ఉంటేనూ ! ఇటు గుమ్మా వారు దడి కట్టి మా పెరట్లోంచి వాళ్ళ పెరడు లోకి పిల్ల కాయల రాక పోకలు లేకుండా కట్టడి చేసారు కానీ, కుడి వేపు పెరళ్ళన్నీ కలిసే ఉంటాయి. అక్కడ వొకటో రెండో బాదం చెట్లు. వేసవి కాలం ఎండ వేళ ,బాదం కాయలు ఏరుకుని రాళ్ళతో బద్దలు కొట్టుకుని తినే వాళ్ళం. అక్కడే చెడుగుడూ, కర్రా బిళ్ళా లాంటి ఆటలు ఆడుకునే వాళ్ళం.

సరి ...సరి .. వీటికీ మీ వేలువిరిచిన బాబాయికీ సంబంధం ఏవిటయ్యా ! అని కోప్పడు తున్నారా ?  అక్కడికే వస్తున్నాను.
వేసవి కాలం ఎండలో మధ్యాహ్నం వేళ చొక్కా నిక్కరుతో, కొండొకచో వొంటి మీద చొక్కా కూడా లేకుండా ,అలా మా పెరళ్ళలో చక్కా ఆడుకుంటూ ఉండే వాళ్ళమా ? ... మా వేలు విరిచిన  మేన బాబాయి - నరసింహం బాబాయి అక్కడికి ఊడి పడే వాడు. చింత రివట పట్టుకుని, పిల్లల నందరినీ వొక వరుసలో నిల బడే మనే వాడు. ఎండలో చక్కా చదూ కోకుండా ఈ ఆట లేమిటని హుంకరించే వాడు. ఏదీ, ఎక్కాలు వొప్ప చెప్పమని నిలదీసే వాడు. మాకు నిక్కర్లు తడిసి పోయేవి.
పన్నెండో ఎక్కం వరకూ ఎలాగో నెట్టు కొచ్చినా, పదమూడో ఎక్కం దగ్గర బెక్కీసీ వాళ్ళం కదా ? ... అదిగో, అప్పుడు మా నరసింహం బాబాయి మొట్టి కాయలూ, తొడ పాశాలూ లాంటి శిక్షలు మామీద అమలు చేసే వాడు. ఆ క్రమంలోనే మా నరసింహం బాబాయి కనిపెట్టిన శిక్ష వొకటుంది. మన కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నిమురుతూ, ‘‘ బాగా చదవాలమ్మా ! చదవక పోతే ఎలా పని కొస్తావు చెప్పూ ..’’ అంటూ, మెత్తగా మాట్లాడుతూనే,  ఒక్క సారిగా చిటికెన వేలు పట్టుకుని దానిని వెనక్కి వంచే వాడు. మా ప్రాణాలు గిల గిల లాడి పోయేవి. లబలబలాడి పోయే వాళ్ళం.
ఇలా వో సారి మా నరసింహం బాబాయి నా చిటికెన వేలు వెనక్కి వంచి నన్ను సన్మార్గంలో పెట్టి సంస్కరించ బోతే నొప్పి భరించ లేక ‘‘ చచ్చేన్రా నాయనోయ్ !చంపేస్తున్నాడ్రా బాబోయ్ !’’ అని పెద్ద పెట్టున కేకలు వేసాను.
 ఇంకే ముందీ, ఇంట్లో పెద్దలు ఏమయిందేమయిందటూ వచ్చేరు.
పసి వాడికి పద మూడో ఎక్కం రానంత మాత్రాన వాడిని చంపేస్తావా ఏమిటిరా ! అని బాబాయిని కూక లేసారు.
అదే అదునుగా తెలివిగా  నేను ఏడుపు రెట్టింపు చేసాను.
‘‘వేలు కానీ విరిగి పో లేదు కదా ! ఆది నారాయణ డాక్టరు దగ్గరకి తీసి
కెడితేనో ..’’అని  ఎవరో అన్నారు.
‘‘ నాకు విండీసనొద్దు బాబోయ్ ’’ అని మరింత ఏడుపు రెట్టింపు చేసాను.
‘‘ సరేలే ... కాస్త వోర్చుకో ... వేలు విరిగితే వాచి ఉండేది. వాపూ అదీ ఏమీ లేదు కదా ... వేలు విరిగి ఉండదులే ..’’ అని సముదాయించేరు.
ఇలా వో ప్రక్క నన్ను బుజ్జగిస్తూనే , మరో పక్క నరసింహం బాబాయిని ముక్త కంఠంతో అంతా దులిపేసారు. ( మనం లోలోన ముసి ముసి నవ్వులు  నవ్వు కున్నాం ! )
అదిగో ... అలా ... అవేల్టి నుండీ మా నరసింహం బాబాయి మా వేలు విరిచిన మేన బాబాయి అయ్యేడన్న మాట ! బెత్తం బాబాయి, మొట్టి కాయల బాబాయి అనేవి వారి ఉపనామాలు లెండి.

చిన్నప్పటి ఈ ముచ్చట పక్కన పెట్టి,  ప్రస్తుతానికి వస్తే,  పిల్లల్ని దండించే విషయంలో మన పెద్దాళ్ళూ, స్కూలుమేష్టర్లూ ఎన్ని రకాల పద్ధతులు కనుక్కున్నారో గమనిస్తే ముచ్చటేస్తుంది.
1.    రెండు చెవులూ పట్టుకుని ఎత్తి కుదేయడం,
2.    గిద్దెడు (వొకప్పటి కొల పాత్ర) నూనె ఇంకేలా నెత్తి మీద మొట్టి కాయలు వేయడం
3.    నిక్కర్లోకి చెయ్యి లాఘవంగా పోనిచ్చి, తొడపాయశం పెట్టడం
4.    చెంప ఛెళ్ళు మనిపించడం
5.    జుత్తు పట్టుకుని వంచి నడ్డి మీద వీశె గుద్దులు గ్రుద్దడం
6.    రెండు బుగ్గలూ పట్టుకుని  సాగదీస్తూ నలిపెయ్యడం.
7.     చింత రివటతో వీపు చీరెయ్యడం.
8.    అరచెయ్యి చాపమని ఆర్డరేసి , చేతి మీద బెత్తంతో  దబదబా బాదడం
9.     గుంజీలు తీయించడం
10.                       గోడ కుర్చీ వేయించడం
11.                       మండే ఎండలో కాళ్ళు బొబ్బలెక్కేలా నించో పెట్టడం
12.                       కోదండం వేయించడం ( ఇది మరీ ప్రాచీన కళ లెండి)

ఇలా ఎవరికి తోచిన పద్ధతుల్లో వారు ఎంచక్కా పిల్లల్ని  తనివి తీరా సరదాగా
దండించే వారు.
తిట్ల పురాణం వీటికి అదనం !

ఇప్పుడవేం పనికి రావు. పిల్లల్ని  తిట్ట కూడదు . కొట్ట కూడదు. ఏడిసినట్టుంది !
ఇదేం చోద్యం ! పిల్లల్ని కొట్టా తిట్టకుండా ఉంటే మన పెద్దరికం ఏ గంగలో కలవాలి !
పెద్దలన్నాక, టీచర్లన్నాక, పిల్లల్నికొట్టొద్దూ ?
      మొగుళ్ళన్నాక పెళ్ళాలను  కాల్చుకు తినొద్దూ ?
      నాయకు లన్నాక ప్రజలను వేపుకు తినొదూ ?
        బాసులన్నాక, క్రింది  చిరుద్యోగులను సతాయించి ఏడిపించొద్దూ ??
చేతిలో  పిస్తోలు ఉంటే పేల్చమా మరి !
చేతిలో దుడ్డు కర్రుంటే ఎవడినో వొహడిని మోదఁవా మరి !
వొంటి బలుపు తీండ్ర పెడితే ఎవడి జుట్టో పట్టుకోమా మరి !
పెద్దరికాన్ని ప్రదర్శించు కోవాలంటే రకరకాలయిన హింసా పద్ధతులు తెలియాలా వొద్దా ? వాటిని వీలయి నప్పుడల్లా పాటించాలా వొద్దా ? మన ప్రఙ్ఞ నలుగురికీ చూపించాలా వొద్దా ?

మా చిన్నప్పుడు మా వేలు విరిచిన నరసింహం బాబాయి  చేసిందదే !
తెలియక అప్పట్లో   నానా యాగీ చేసాను. బాబాయిని అపార్ధం చేసు కున్నాను. అల్లరిపాలు చేసాను.
అందరి చేతా చీవాట్లు పెట్టించేను. గాఠిగా కోప్పడేలా చేసాను.
 అందరి ముందూ అవమానాలపాలు చేసాను.
ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనే డైలాగు చిన్నప్పుడు నలుపు తెలుపు తెలుగు సినిమాల్లో చాలా సార్లు విన్నాను. మరంచేత ఇప్పుడు బాధ పడుతున్నాను. పిల్లల్ని హింసించే కొత్త పద్ధతుల మీద ప్రయోగాలు చేస్తూ, డాక్టరేట్ చేయాలనుకుంటున్నాను. ఆశీర్వదించండి.

ఇదండీ, మా వేలు విరిచిన మేన బాబాయి కథ



1, సెప్టెంబర్ 2014, సోమవారం

నా ముచ్చట ముమ్మారు తీర్చిన శ్రీ బాపు గారికి అశ్రు నివాళి ...


శ్రీ బాపు ఇక లేరు ... అనుకోడానికే  చాలా బాధగా ఉంది. తెలుగుదనం అంటే పిసరంత  అభిమానం ఉన్న వాళ్ళెవరికయినా బాపు అంటే, కొండంత అభిమానం ...

అప్పుడు  ముళ్ళ పూడి వెళ్ళి పోయేక, ఇప్పుడు బాపూ కూడా వెళ్ళి పోయేరు.

మనకింక మిగిలిందేమిటి ?   బాపూ  గీసిన బొమ్మలూ, వారు తీసిన సినిమాలూనూ ...

తెలుగునాట కథలూ, నవలలూ రాసే రచయిత లందరికీ తమ రచనలకీ, పుస్తకాలకి ముఖ చిత్రాలుగానూ శ్రీ బాపూ గారు బొమ్మలు వేస్తే బావుణ్ణు అనేది ఒక  తీయని కోరిక ...  కొండొకచో దురదృష్టవశాన తీరని కోరికగా కూడా ఉండిపోతూ ఉంది ...

   రచన  కన్నా, ఎవరూ ఏమనుకోక పోతే,   వో మెట్టు  ఎక్కువగా అందమయిన బొమ్మ గీసే ఒడుపు బాపు గారికే చెల్లింది !

నా వరకూ ఆ కోరిక  ముచ్చటగా  ముమ్మారు తీరింది. ధన్యోస్మి !

ఆ మహా గీతకారునికి అశ్రు నివాళి అర్పిస్తూ ... ఆ మూడు ముచ్చట్లూ  మీతో పంచు కునీదా ?

చూడండి ...








29, ఆగస్టు 2014, శుక్రవారం

ఇనాయకుడు ...మంచోడు ... మనోడే కదా ? !


అందరికీ   వినాయక చవితి శుభాకాంక్షలు !
మీ, కథా మంజరి.
ఏటెస్. ఇనాయక పూజ సెయ్యాల .. అది సెయ్యాల. ఇది సెయ్యాల అంటూ తెగ పుర్రాకులు పడి పోతన్నావ్ ! ఏటి ? ఇనాయకుడు మనోడే కదా ? ఆ సామి కాడ మనకి బయమేల ?  మన జత గాడే కద? మిగతా బగమంతులయితే మన ఇనాయకుడంత ఆస్సెంగా ఉండరు.  మిగతా దేవుల్లందరికీ ఇనాయకుడి కున్నన్ని రకరకాల ఏసికాల్లో బొమ్మలుండవు. మంచోడు. మనవంటే సేన పేఁవ. మనకి ఏ కప్టమూ రాకుండా సూత్తాడు. ఆ బొజ్జ గణపయ్య ఉన్నాడంటే, మనకి  కొండంత బరవాసా. కాదేటి ?అసలాతని ఆకారమే సూడూ ... బలేగుంటాది కద ?  పెద్ద బొజ్జ. ఏనుగు తలకాయ. పొట్టోడే ..కానీ సేన గట్టోడు. ఆ ఆకారం సూసినాకే కదా మన సెందురుడు మాయ్య పగలబడి నవ్వీసినాడు ? తర్వాత ఏటయినదో తెలసిందే కదా ....
మిగతా దేవుల్లందరికంటె ఇనాయకుడి తోనే మనకి సావాస మెక్కువ. చనువెక్కువ. ఇనాయకుడిని  సొంత మనిసిగానే సూత్తాం కానీ పరాయోడినాగా .. ఎక్కడో దేవ నోకంలో ఉండే వోడిగా సూడం. ఎందుకంటే ఆ దేవుడు మనోడు. మన నేస్తం !
అందికే ఇనాయకుడంతే మనకి కొండంత బక్తి ఉంటాది కానీ, పిసరంత బయ్యం ఉండదు. మన బగమంతుడికి మనఁవేల బయపడాల ?
 అందికే మన సరదా కొద్దీ  ఇనాయక సామికి రకరకాల ఏసికాలేసి ముచ్చట పడుతుంటాం కద ?

సేతికి కత్తులూ కటార్లూ యిచ్చి, ఎదవల్ని బెదిరిస్తాం ...

కిరికెట్టు ఆడిస్తాం ..

కంపూటరు ల్యాప్ టాప్ తో ఐటెక్కు ఇనాయకుడిని సేస్తాం
పేంటూ షర్టూ తొడిగించి,  కళ్ళ జోడెట్టి, టిప్పు టాప్పుుగా సినేమా హీరో నాగా తయారు చేస్తాం ..


బలే బాగా ఏకసను సేయిస్తాం ... సోజులిప్పిత్తాం ..


ఇనాయకుడి మీద లెక్క లేనన్ని జోకులేస్తాం.. కార్టూను లేస్తాం ...దయ గల సామి ... ఎన్ని ఎకసెక్కాలాడినా  ఏటనుకోడు. బక్తుల  బత్తికి పడి పడి నవ్వీసి, వరాలిచ్చేత్తాడు




రాజ మవులీ మాయ్య ఈగ  సినిమా తీస్సి ఎండి తెరను బద్దలకొట్టీ తలికి మనం ఈగ ఇనాయకుడిని సేసుకోనేదా ?

ఇనాయకుడి సేత కారు నడిపిస్తాం, బైకు నడిపిస్తాం ..ఇమానాలెక్కిస్తాం ..సెల్ ఫోనులో మాట్టాడిస్తాం ...  ఇన్నేల ? మనోడు. మనసంగతికాడు. మనకి వరాలిచ్చే జతగాడు. ఎన్ని ఎకసెక్కాలాడినా ఏటనుకోడు.
ఇదేట్రా , ఈ కదా మంజరి బ్లాగరు గాడికి మతి కాని పోనాదేటి ? ఇనాయకుడి మీద  మనోడే నంటూ ఇలగిలాగ రాస్సి నాడు. కల్లు పోతయ్యి !!  అనుకుంతున్నారేటి ?
మా పంతులు గోరు సెస్సేరు, ఇదంతా  అదేదో యాజ నిందట (వ్యాజ నింద) లెండి . మరేటి పికర్నేదు. మరి చెలవా ? ఇనాయక పూజ సేసు కోవాల !

28, ఆగస్టు 2014, గురువారం

తెలుగు సినిమాలలో హాస్యం పండించడం చాలా సుళువు ! ప్రస్తుతానికో పది చిట్కాలు...



తెలుగు సినిమాల్లో ఆస్సెం ( హాస్యమే లెండి ) పుట్టించడం చాలా సుళువు.
ఏముందీ ఈ చిట్కాలు పాటిస్తే సరి ... జనాలు పిచ్చి ముఖాలేసుకుని పగలబడి నవవ్వుతారు ..
1.   టీచర్నో, లెక్చరర్ నో,  లేదా  ప్రిన్సిపాల్ నో  కారుకూతలు కూస్తూ, కొండొకచో  సరదాగా వారి మీద   చేయి చేసుకుంటూ, అల్లరి పాలు చేయిస్తే సరి ...
2.    పురోహిత వర్గాన్ని  ( వేరే కులాల వారిని, మతాల వారినీ అనే దమ్ముల్లేక ) వెర్రి వెంగళప్పల్లా చూపిస్తే పాయె !
3.    పోలీసు బాబాయిలను హీరో గారూ, వాడి తోక గాడూ చాక చక్యంగా బకరా చేస్తే చాలు ...
4.   బండ విలన్లను కూడా ఏదో పాయింట్ తో లొంగ దీసుకుని వాళ్ళ చేత గొడ్డు చాకిరీ చేయిస్తూ, కొరడాతో  హీరో గారు ఓ రేవు పెడితే చాలదూ !
5.   ద్వంద్వార్ధాల బూతు కూతలతో కాబోయే సినిమా పెళ్ళాలని
( హీరోయిన్లని )  అల్లరిపాలు చేస్తే భలే, భలే ..
6.   వికలాంగులనీ, వృద్ధులనీ, అసహాయులనీ  వెక్కిరించేలా తీస్తే చాలు.
7.    పాపం మన ఆస్సెగాళ్ళు ( అదే, కమేడియన్లు) హీరో చేతిలో ఎన్ని చెంప దెబ్బలు తింటే అంత ఆస్సెం పేలుతుంది కదా !
8.   ‘‘ ఒరేయ్ డాడీ ! ఓ కోటి రూపాయ లివ్వరా ! అలా బార్ కేసి వెళ్ళొస్తానూ ...’’ అనే గారాల కూచుల నంగి మాటలూ, తండ్రీ కొడుకుల బాంధవ్యాలూ ముచ్చట కొలిపే ఆస్సెం విరగ పండిస్తుంది చూస్కోండి ..
9.   మద్ది చెట్టుల్లా ఎదిగిన మన నలభై ఏళ్ళ హీరో గారు నిక్కరేసుకుని నోట్లో వేలు పెట్టుకుని స్కూలు కెళ్ళి పదో తరగతి చదువు కోవడం పొట్ట చెక్కలు చేస్తుంది కదా !
10.బికినీ సుందరుల బికినీ బటన్ ఊడి పోతున్నట్టుగానో, జాకెట్ హుక్, లేదా గౌను జిప్పు మన సంస్కారవంతమయిన సబ్బు ల్లాంటి జీరోలు ( హమ్మమ్మ ! హీరోలు)  ఊడ బెరకడమూ ఆస్సెమే సుమీ ...

థూ ! దీనమ్మ జీవితం. ఈ సినిమాలు నాశినమైపోనూ ...

( గమనిక : ఈ టపా అందరిని గురించీ, అన్ని సినిమాల గురించీ కాదు ... మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి )