28, జనవరి 2015, బుధవారం

ఎంత కష్టం ? ఎంత కష్టం ?


‘‘ హాయిగా ఇంత వండి పడేసి, మొగుడు ఆఫీసుకి వెళ్ళాక, తిరిగి యింటికి తగలడే వరకూ నీకు పనేం ఉంటుంది చెప్పు? ఏ పత్రికో పట్టుకుని ఆ వెర్రి మొర్రి సీరియల్సూ గట్రా చదవుతూ పడుకోవడమో, లేదంటే, పిచ్చి పిచ్చి టీ.వీ జీళ్ళ పాకం సీరియళ్ళు చూస్తూ గడపడమో తప్పితే ?’’
ఈ రకమయిన మాటలు ఇదే మోతాదులో కాక పోయినా, కొంత మాటల మేకప్ వేసుకుని దాదాపు ప్రతి యింటా విన బడుతూనే ఉంటాయి.
మీరేం చేస్తున్నారని ఎవరయినా అడిగితే ఎందుకో తెలీదు కానీ , కొంచెం అనవసరంగా మొహమాట పడి పోతూ జాబేమీ చేయడం లేదండీ, హౌసు వైఫునిఅని జవాబిచ్చే సగటు ఆడవాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం.
జాబ్ చేసే ఆడవారికి తామేదో తీసి పోయి నట్టుగా పాపం , కించ పడుతూ మాట్లాడుతూ ఉండే వారూ కనిపిస్తారు. ఈ వేగవంతమయిన రోజులలో ఉద్యోగం ఆడవాళ్ళకి కొంత వెసులు బాటుని కలిగించేదే కానీ అదనపు సదుపాయం మాత్రం కాదని నాకనిపిస్తూ ఉంటుంది. ఆర్ధిక స్వేచ్ఛ వలన ఆడవాళ్ళకి అదనపు గౌరవంతో పాటు అదనపు సమస్యలూ తెచ్చి పెడుతూ ఉండడం కూడా కొన్ని ఇళ్ళలో కనిపించే విషాదం.
సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, ఇళ్ళలో ఆడవాళ్ళు చేసే అవధానం ఎలాంటిదో శ్రీమాన్ గరిక పాటి నరసింహా రావు అవధాని గారు చెప్పిన ఒక ప్రసిద్ధ మైన ఆశు పద్యం తెలియని వారి కోసం చెప్పుకుందాం.
అష్టావధానం లో సమస్యా పూరణం, నిషేధాక్షరి, దత్తపది, వర్ణన, ఆశువు, ఘంటానాదం ,పురాణ పఠనం,అప్రస్తుత ప్రసంగం మొదలయిన ఎనిమిది అంశాలు ఉంటాయి కదా. ఈ అంశాల ఎన్నికలో అవధాని అభిరుచిని బట్టి కొన్నిటి స్థానంలో వేరే అంశాలూ చేర్చబడుతూ ఉంటాయి. ఏమైనా అంశాల సంఖ్య ఎనిమిదికి మించదు. ఘంటా నాదం బదులు పుష్ప గణనం, కానీ చదరంగ క్రీడ కానీ ఉండవచ్చును. కొందరు అవధానులు ఈ ఎనిమిది అంశాలలో న్యస్తాక్షరిని చేర్చి అవధానం చేస్తూ ఉంటారు.
పృచ్చకులు నిర్వహించే సమస్య మొదలగు వాటి గురించి క్లుప్తంగా చెప్పు కుందాం,
1. సమస్యా పూరణం: పృచ్ఛకుడు ఏదో ఒక ఛందస్సులో ఒక పద్యం యొక్క నాలుగవ పాదం చెబుతాడు.అతను ఇచ్చిన పాదం కొంత అసంబద్ధంగానో, అసంగతంగానో, అశ్లీలార్ధ ద్యోతకంగానో కనిపించ వచ్చును.హేతు బద్ధంగా అనిపించక పోవచ్చును. కానీ, అవధాని పద్యం యొక్క మీది మూడు పాదాలు చెప్పడంతో ఆ అసంగత్వం ఏదేనా ఉంటే, తొలిగి పోయి చక్కని భావ యుక్తమయిన పద్యం తయారవుతుంది. ఇది సమస్య.
ఉదాహరణకి : ఒక పృచ్ఛకుడు ‘‘ ఈతాకుల గుడిసె లోన ఇనుడు దయించెన్’’ అనే సమస్య ఇచ్చాడు. ఇది పద్యంలోని నాలుగో పాదం. తూర్పు కొండల్లో ఉదయించాల్సిన సూర్యుడు ఈతాకుల గుడిసెలో ఉదయించడ మేమిటి ? అవధాని గారి పూరణతో పద్యంలో ఆ సందిగ్ధత తొలిగి పోతుంది. చూడండి:
సీతా పతి పూదోటకు
ఏతా మెత్తంగ వలయు వేకువ జామున్
తాతా ! తొంగున్నావా ?
ఈతాకుల గుడిసె లోన ఇనుడుదయించెన్.
శ్రీరాముల వారి పూల తోటను చూసు కుంటూ ఉండే తోట మాలి తన ఈతాకుల గుడిసెలో పడుకుని ఉన్నాడు. తెల్ల వారింది. తాతను నిద్ర లేపుతూ మనుమరాలు కాబోలు, అంటోంది:
‘‘ తాతా, సూర్యుడు ఉదయించాడు. రాముల వారి పూల తోటకు ఏతాం ఎత్తి నీళ్ళు పట్టాలి. ఇంకా నవ్వు నీ ఈతాకుల గుడిపెలో పడుకుని లేవ లేదా?’’ అని అవధాని గారి చక్కని పూరణతో పృచ్ఛకుడు సమస్య ఇచ్చి నప్పటి అసంబద్ధత తొలిగి పోయింది కదూ?
2. నిషేధాక్షరి: పృచ్ఛకుడు ఏదో ఒక అంశం యిచ్చి కోరిన ఛందస్సులో అవధాని పద్యం చెప్పడం మొదలు పెడుతూ పాదం తొలి పదంలో తొలి అక్షరాన్ని పలుకుతాడు. వెంటనే పృచ్ఛకుడు తర్వాతి పదాన్ని నిషేధిస్తాడు. అంటే అవధాని ఇక ఆ అక్షరాన్ని ఉపయోగించ కూడదన్న మాట. దానికి బదులు మరో అక్షరాన్ని వేసు కోవాలి. ఉదాహరణకి అవధాని శ్రీరాముని మీద పద్యం చెప్పడానికి సిద్ధ పడి శ్రీ అని అన్నాడను కోండి, పృచ్ఛకుడు అనే అక్షరాన్ని నిషేధిస్తాడు. దానితో అవధాని ర అనే అక్షరానికి బదులుగా మరో అక్షరం వాడాలి. ఇలా పృచ్ఛకుడు ప్రత్యక్షర నిషేధం కానీ, తాను కోరిన చోట నిషేధం కానీ విధిస్తూ ఉంటాడు. నిషేధించిన అక్షరాన్ని వదిలి అవధాని వేరే అక్షరాన్ని ప్రయోగిస్తూ , మొత్తానికి అర్ధవంతమయిన పద్యం చెప్పాలి. అవధానంలో అవధాని ప్రతిభకు నిషేధాక్షరి ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి.
3. దత్త పదిలో పృచ్ఛకుడు తనకు తోచిన నాలుగు పదాలు చెబుతాడు. వాటిని వరుసగా ఒక్కో పాదంలో ఉపయోగిస్తూ, అర్ధవంతమయిన చక్కని పద్యం అవధాని చెప్పాలి.
చూడండి, ఒక దత్తపది. ఒక పృచ్ఛకుడు పాలు, పెరుగు, నేయి, నూనె అనే పదాలు ఇచ్చి, వాటిని ఉపయోగిస్తూ భారతార్ధం వచ్చే లాగున ఒక పద్యం చెప్పమన్నాడు.
అవధాని గారి పూరణ చూడండి:
పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగు చున్నది వానిలో దురితము గన
నే యిలను గల్గ దిట్టి యహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధ మింక.
నాలుగు పాదాల లో పృచ్ఛకుడు ఇచ్చిన నాలుగు పదాలూ వచ్చేయి కదా. ఇక భావం చూడండి:
దుర్యోధనుడు పాండవులకు రాజ్య భాగం ఇవ్వడు. దుర్మార్గం వాడిలో మరీ పెచ్చు పెరిగి పోతోంది. ఇలాంటి మూర్ఖత్వం ఎక్కడా చూడం .వాడిలో మూర్ఖత్వం ప్రబలి పోయింది. ఇక యుద్ధం తప్పదు.
4. వర్ణన: పృచ్ఛకుడు కోరిన అంశం గురించి, కోరిన ఛందస్సులో కోరిన వర్ణన చేస్తూ అవధాని పద్యం చెప్పాలి.
ఇవి సాధారణంగా దేవతా వర్ణనలో, ప్రకృతి వర్ణనలో అయి ఉంటాయి.
5. .ఆశువు: అవధాని పృచ్ఛకుడు అడిగిన విషయం మీద చక్కని పద్యం చెప్పాలి. అడిగే వాడు పకోడీ మీద పద్యం కావాలన వచ్చు. కంప్యూటరు గురించి కావాలన వచ్చు దేని గురించయినా పద్యం చెప్పమన వచ్చు. అతనిష్టం. అవధాని ఆశువుగా, ధారాశుద్ధితో మొత్తం పద్యం చెప్పాలి.
6. ఘంటా నాదం (లేదా) చదరంగం (లేదా) పుష్ప గణన (లేదా) తేదీ, వారాల లెక్క :
(a) ఘంటానాదం: అవధానం జరుగు తున్నంత సేపూ ఒక వ్యక్తి ఠంగ్ మని ఒక్కో గంట కొడుతూ ఉంటాడు. అవధానం చివరలో అతడు ఎన్ని గంటలు కొట్టేడో అవధాని లెక్క తప్ప కుండా సరిగ్గా చెప్పాలి.
(b) చదరంగం: ఒక ప్రక్క ఇతర పృచ్ఛకులకు పద్య పాదాలు అవీ చెబుతూనే అవధాని ఒక వ్యక్తితో చదరంగం ఆడాలి. గెలవక పోయినా ఫరవా లేదు కానీ, ఓడిపో కూడదు.
(c) పుష్ప గణన: ఇది కూడా ఘంటా నాదం లాంటిదే. గంటలకు బదులు ఇక్కడ పూల లెక్క ఉంటుంది.
ఒక వ్యక్తి పూల రాశి లోనుండి ఒక్కో పువ్వునూ తీసి ప్రక్కన పెడుతూ ఉంటాడు. అవధాని ఆ పూల సంఖ్య సరిగ్గా చెప్పాలి.
(d) తేదీ వారాల లెక్క: పృచ్ఛకుడు ఏడాది, నెల, తేదీ చెప్పి, ఆ రోజు ఏ వారమో చెప్ప గలరా ? అనడిగితే తడుము కోకుండా అవధాని ఆ వారం పేరు సరిగ్గా చెబుతాడు.
7. పురాణపఠనం: పృచ్ఛకుడు కోరిన గ్రంధం లోనుండి కోరిన భాగం లోని పద్యాలు చదివి,పురాణం చెప్పడం.
8. అప్రస్తుత ప్రసంగం: అవధానం జరుగుతున్నంత సేపూ, అవధాని గారి ఏకాగ్రతను చెడ గొడుతూ ఒక పృచ్ఛకుడు చమత్కారవంతమైన సంభాషణ తనకు తోచిన రీతిని చేస్తూ ఉంటాడు. అవధాని అతనికి తగు రీతిలో , అతనడిగిన దానికి దీటుగా బదులు చెబుతూ ఉండాలి.
అష్టావధానంలో చోటు చేసుకుంటూ ఉండే మరో అంశం వ్యస్తాక్షరి అని చెప్పు కున్నాం కదూ. ఇదెలా చేస్తారంటే, పృచ్ఛకుడు అనుష్టుప్ శ్లోకంలో ఉండే సంఖ్యానుగుణంగా గడులు గీసుకుని సిద్ధంగా ఉంటాడు. అవధానం మొదలయ్యేక, పృచ్ఛకుడు తనకు నచ్చిన అంశం మీద ఒక శ్లోకం చెప్పమంటాడు. సాధారణంగా ఇది కూడా ఏ దేవతా ప్రార్ధనో అవుతుంది. అయితే, శ్లోకమంతా ఒకే సారి కాకుండా, తనకు నచ్చిన గడి సంఖ్య చెప్పి, ఆ గడిలో ఉండ తగిన అక్షరం చెప్పమని అవధానిని అడిగి, అతను చెప్పిన అక్షరాన్ని ఆ గడిలో వ్రాసుకుంటాడు.అవధానం పూర్తయే లోగా మొత్తం అన్ని గడులూ అవధాని అప్పుడూ అప్పుడూ చెప్పిన అక్షరాలతో నిండి పోతాయి. అవధానం చివరలో ఆ అక్షరాలన్నీ కలిసి ఒక పూర్తి అర్ధవంతమయిన శ్లోకం అవుతుంది..
అవధానం లోని అంశాల గురించి ఇక్కడ నేను వ్రాసినది సర్వ సమగ్రం కాక పోవచ్చును. కొంత అస్పష్టత ఉండ వచ్చును. నా తెలియమి కూడా కారణం కావచ్చును. కానీ నాకు తెలిసినంతలో అవధానం లోని అంశాలను వివరించాను. పెద్దలు సరి చేస్తే సరి దిద్దుకుంటాను.
అవధాని పృచ్ఛకులకు ఒకే సారి నాలుగు పాదాలూ చెప్పనవసరం లేదు. చెప్పడు కూడా. ఆవృత్తికి ఒక పాదం చొప్పున చెబుతాడు, అవధానం ముగిసే సమయానికి పద్యం నాలుగు పాదాలూ పూర్తవుతాయి.
ఆ తరువాత అంశం, ధారణ. అవధాని ఒక్కో పాదం చొప్పున అన్ని ఆవృత్తాలలో చెప్పిన మొత్తం పద్యాలు తిరిగి ఆయా అడిగిన వారికి (పృచ్ఛకులకు) ధారగా అప్ప చెబుతాడు. ఎక్కడా తడుము కోరాదు. ఏం చెప్పానని అడుగ రాదు. మొదట చెప్పిన దానికి భిన్నంగా చెప్ప రాదు. ధారణ విజయవంతంగా చేస్తే అవధానం విజయవంతంగా పూర్తయినట్టు లెక్క ! మరో విషయం, మొత్తం అవధాన సమయం నాతి దీర్ఘంగా ఉండ కుండా చూడడం కూడా అవధాని ప్రతిభకు పట్టం కట్టేదే.
ఇంత కష్టసాధ్యమైన అవధానం మన ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా చేస్తూ ఉంటారో ఈ పద్యంలో చూడండి:
అడుగడుగున నిషేధాఙ్ఞ జారీ చేయు
భర్త నిషేధాక్షరార్తిఁదోప
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వల తోడ
మాసమ్ము గడప సమస్య కాగ
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు
దత్తుండు దత్త పదమ్ము కాగ
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి
వర్ణనీయాంశమై వరలు చుండ
పాలు కూరలు పళ్ళ బండ్ల వారల రాక
ఆశు ధారా కవిత్వార్ధ మనఁగ
అత్తయ్య వేసెడి అక్షింత లవి యన్ని
పాత పురాణంపు పఠన మనఁగ
చీటి మాటికి వచ్చు సెల్లు సందేశాలు
వ్యస్తాక్కరమ్ముల వరుస గాగ
విసుగు తెప్పించెడి వీర ధారా వాహి
అధిక ప్రసంగమై అడ్డు పడఁగ
దినము దినమిట్లు వనితలు తిప్పలు పడి
పూట పూటకు అవధాన పూర్ణ బుద్ధి
తనరు చుండంగ పురుషావధాను లేల?
వర సహస్రావధానులీ పడతు లెల్ల !
.ఆడ వాళ్ళు అవధానంలో అవధాని గారు చేసే పనులన్నీ తమ నిత్య జీవితమనే అవధానంలో ఎలా చేస్తున్నారో చూడండి.
మొగుడు ప్రతీ దానికీ అడ్డు పడుతూ అది వద్దు, ఇది వద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యకు అంటూ తల తినేస్తూ ఉంటాడుట. దీనిని నెట్టుకు రావడమే ఆడ వారు చేసే నిషేధాక్షరి .
చాలీ చాలని జీతం రాళ్ళతో, లేదా బొటా బొటీ డబ్బులతో నెల గడపడమే వారికి సమస్య.
అదీ ఇదీ సర్దవే అమ్మా, అంటూ వెంట పడే కాన్వెంటు పిల్లలను ముస్తాబు చేసి, బడికి పంపడమే దత్తపది.
ఇంట్లో బుజ్జి పాపాయిలు ఉంటే నిత్యం వారిని ముద్దాడుతూ, వారికి సేవలు చేయడంతోనే సరి పోతుంది. అదే వర్ణన.
పాలబ్బాయ్, కూరలబ్బాయ్ సండ్ల బళ్ళ వాళ్ళతో చేసే సంభాషణే ఆశువు
ఇక ఇంట్లో అత్త గారు కనుక ఉంటే ఆవిడ గారు వేసే అక్షింతలు, వినిపించే పాత పురాణం అంతా యింతా కాదుట. అదే పురాణపఠనం
ఈ మధ్యలో సెల్ ఫోను రింగవుతూ ఉంటుంది. ఆ బాధ మరీ వర్ణనాతీతం ఇల్లాలికి. అది వ్యస్తాక్షరి.
విసుగు తెప్పించే బుల్లి తెర ధారావాహికలు అధిక స్రసంగాలు.
ఇలా రోజూ తిప్పలు పడే వనితలు గొప్ప అవధాన విద్య ప్రదర్శిస్తున్నారు. సహస్రావధానులైన పడతులుండగా, ఇక పురుషావధాను లెందుకండీ ...
నిత్యావధానులైన ఆడవారికి నమోవాకాలు .
తల్లుల కష్టం వెల కట్ట లేనిది. వెల కట్ట రానిదీనూ.
వారికి ఆది వారమూ లేదు, శలవు దినమూ ఉండదు. కదూ?
రిటైర్మెంటు అసలే లేదు.

21, జనవరి 2015, బుధవారం

సరసం విరసం కానంత వరకూ మానసోల్లాసమే కదా !


మొగుడూ పెళ్ళాలన్నాక, ఆ పాటి మాటా మాటా అనుకోరా యేమిటి ?
మీ వాళ్ళు ఇలాగంటే, మహ చెప్పొచ్చారు లెండి, మీ వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా ? అని ఒకరి నొకరు దెప్పి పొడుచు కోవడం, మూతులు ముడుచు కోవడం, అలకలు, ముక్కులు చీదు కోవడాలూ, మాటలు మానెయ్యడాలూ, కూరలు తగలెయ్యడాలూ, ఉపాహారం తిన కుండానే వీధిలోకో, ఆఫీసుకో వెళ్ళి పోవడాలూ. ఆ తరువాత అయ్యో అనుకోడాలూ, తప్పంతా నాదే, నేనే ఊరికే రెచ్చ గొట్టేను, పాపిష్ఠి దాన్ని ( లేదా ) మూర్ఖపు వెధవని అనుకోడాలూ, సాయంత్రానికి వేడి వేడి పకోడీలు చేయడాలూ, కమ్మని కాఫీలు పెట్టడాలూ, మూరల లెక్కన మల్లెలో, సన్నజాజులో బేరమాడడాలూ, క్షమాపణలూ వగైరాలయేక, కరిగి పోవడాలూ ... ఇదీ సాంసారిక మాధుర్యం.
ఆది దంపతుల సరస సల్లాపాలు గమనిస్తే, అమృతోపమానమైన సరస సంభాషణతో భార్యా భర్తలు తమ దాంపత్యాన్ని ఎంత ప్రఫుల్లంగా, మధుర కావ్యంలాగున, తేనె వాక లాగున, ఇంద్ర ధనుస్సుల్లాగ మలచు కో వచ్చునో అవగత మవుతుంది.
చూడండి మరి :
క్వతిష్ట తస్తే పితరౌ మమేతి
అపర్ణ యోక్తే పరిహాస పూర్వం
క్వవా మమేవ శ్వసురౌ తవేతి
తామీరయన్ సస్మిత మీశ్వరోవ్యాత్
( శ్రీ కృష్ణకర్ణామృతమ్ )

దీనికి తెలుగు సేత:
‘నాకున్న తల్లి దండ్రులు
మీ కేరీ ’ యని యపర్ణ మేలము లాడన్
‘నాకున్న యత్త మామలు
నీ కేరీ’ యనుచు నగు త్రి నేత్రుని గొలుతున్ !
‘‘నాథా, నాకున్న మాతాపితరుల వంటి వారు నీకు లేరు. మా తలిదండ్రులు అంత గొప్ప వారు’’ అంటూ పార్వతి శివుడిని మేలమాడింది.
‘‘ పోదూ, మీ వాళ్ళ గొప్పలు నువ్వే చెప్పాలి. చాలు. చాలు. నాకున్న అత్త మామలు నీకు లేరులే !’’ అని బదులు చెప్పాడుట పరమ శివుడు. శివ పార్వతుల సల్లాపం ఎంత మనోహరంగా ఉన్నదో చూసారా ?
అర్ధనారీశ్వరత్వానికి అర్ధం, పరమార్ధం అదే.

స్వస్తి.

20, జనవరి 2015, మంగళవారం

అమ్మకి నచ్చిన అందమైన పాట !

ధన్యవాదాలు You tube


ఆ తోటలో నొకటి ...అనే ఈ పాట నేను చాలా చిన్నప్పుడు విన్నాను. అనంతపురం జిల్లా ఉరవ కొండలో మా మాతామహులు ( ముసిలి డాక్టరు గారు) ఉండే రోజులలో మా అమ్మ ( కీ.శే. పార్వతమ్మ) తో పాటు ఉరవ కొండ వెళ్ళే వాడిని. వెళ్ళి నప్పుడల్లా నాలుగయిదు నెలలకు తక్కువ ( అంత కంటె ఎక్కువ రోజులేనేమో ?) కాకుండా అక్కడ ఉండే వాళ్ళం.










మా తాత గారింట్లో ఒక గ్రాం ఫోను ఉండేది. దాని మీద కుక్క కూర్చున్న బొమ్మ నాకెంతో ఇష్టంగా ఉండేది.
అందులో మా అమ్మ తరుచుగా ... తరచుగా ఏమిటి, ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ కూడా ఈ ఆ తోటలో నొకటి ...
అనే పాట ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. అమ్మకి ఆ పాటంటే ఎంత ఇష్టమో చెప్ప లేను. అమ్మంటే ఇష్టం కనుక నాకూ ఆ పాటంటే ఇష్టంగా ఉండేది. చాలా రోజుల పాటు ఆ పాటంతా నాకు కంఠతా ఉండేది. కాని, క్రమేపీ మరిచి పోయాను.
అమ్మ పోయాక, ఆ పాట కూడా, ఒక్క - ఆ తోటలో నొకటి ... అనే ముక్క తప్ప, నా స్మృతి పథం లోనుండి జారి పోయింది. చాలా కాలం విచార పడ్డాను. అయితే, ఆ పాట బాల సరస్వతి పాడినట్టుగా గుర్తుంది. మళ్ళీ చాలా ఏళ్ళకి అంతర్జాలం వారి ధర్మమా అని, అమ్మకి నచ్చిన ఈ పాట విన గలిగేను. ఈ పాట నాకు అందించడానికి  నాలుగేళ్ళ క్రితం మిత్రులు చాలా మంది సహకరించారు కూడా ! వారందరికీ అప్పుడే ధన్యవాదాలు తెల్పు కున్నాను. ఈ పాట  నా బ్లాగు గాడ్జెట్ లో అమ్మకి నచ్చిన పాట అని, లింకు కూడా ఇచ్చాను, చూడండి. దాని కథా కమామీషూ మరోసారి మీతో పంచు కోవాలని ఇదంతా రాస్తున్నాను. అందరికీ తెలిసిన రామాయణమే మళ్ళీ చెప్పాలా అని అడిగితే విశ్వనాథ వారు అన్నట్టు, రోజూ తిన్న అన్నమే తినడం లేదూ ! ఎవరి రుచులు వారివి. రుచికర మయిన పాయసాన్ని జీవిత కాలంలో ఏ ఒక్క సారో  వో గ్లాసుడు తాగి ఊరు కోం కదా ! దొరికి నప్పుడల్లా  తాగాలనే ఉంటుంది. అలాగే, యిదీనూ ! మంచి పుస్తకాలు పున్ముద్రణలు వేయడం లేదూ ... అలాగే నచ్చిన బ్లాగు టపాలను మళ్ళీ మళ్ళీ పెట్టడంలో తప్పేమీ లేదనుకుంటాను ...
ఈ పాట సాహిత్యాన్ని చూస్తున్నా, పాట వింటున్నా, నాకు మా అమ్మను చూస్తున్నట్టే ఉంది.
దాదాపు ఏభై ఏళ్ళ క్రిందట, తడికెల ప్రహరీతో, ఆ మిద్దె ఇంటి మీదకి ఏపుగా అల్లుకున్న
సన్న జాజి పూ పొదలతో ఒక వింత గుబాళింపుతో కలగలిసిన నా బాల్యపు ఆనవాళ్ళు పోల్చుకో గలుగుతున్నాను. చిన్న చిన్న గ్రామ ఫోను ముల్లులు మారుస్తూ, పదే పదే దాని కీ త్రిప్పుతూ, పరవశంగా ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, దానితో గొంతు కలిపి , సన్నగా మా అమ్మ పాడిన పాట నాకు వినిపిస్తున్నట్టే ఉంది.
సాహిత్యం ఇది:
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే,
అందగాడెవరే, అందగాడెవరే!
మన్మథుండనీ చెలియా
మనసు ఘోషించేనే
మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే
మరపు రాకున్నాడే II ఆ తోటలో నొకటి II

చంద్రబింబపు ముఖమూ
గండుకోకిల స్వరమూ
పండూ వెన్నెలలోlన
పవ్వాళించేనమ్మా...చెలియా
చుక్కల్లా రేడమ్మా ...సఖియా
చుక్కల్ల రేడమ్మా ... సఖియా
మరుని శరముల చేత మనసు నిలువక నేను
మల్లె మొల్ల మొగలి మాలతి మందార
మాలికను వాని మెడలోన వైచి నానే
మధురామూర్తి మేల్కొని మందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే , చెలియ
మది వెన్న చిల్కినదే , సఖియా
మెరపూ లోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--
పేరేమిటని వాని ప్రశ్నించినానే
మాయాదేవీ సుతునని మధురామూర్తీ పలికె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!
మది కోర్కె నెరవేరె, సఖియా!
ఆ తోటలో నొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడితడే...
(ఈ పాట రచయిత 'సాలూరి సన్యాసిరాజు)




ఈ విడ మా అమ్మ , పార్వతమ్మ

నాకు తెలుసులే, నీకిష్టమైన ఈ పాట వింటూ నీలో నువ్వే కమ్మని కంఠంతో పాడుకుంటున్నావు కదూ అమ్మా ?!

* * * *


19, జనవరి 2015, సోమవారం

జై బోలో .. చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ...


చప్పట్ల బాబా నాకో బంపర్ ఆఫర్ ఇచ్చేడు. అదివిని దభీమని నేలమీద దఢాలున స్పృహ తప్పి పడి పోయాను. వంట గదిలో మా ఆవిడ పరిస్థితీ దాదాపు అలాగే ఉన్నట్టుంది. కథా మంజరీ ... ఏఁవండీ కథామంజరీ అంటూ బాబా చప్పట్లు చరిచేరు. చప్పట్ల మహిమ చేత నేను స్పృహ లోకి వచ్చేను.
‘‘నేను విన్నది నిజఁవేనా ? ’’ అడిగేను బేలగా.
‘‘ ఇందులో అబద్ధానికేఁవుంది ? ... తిట్ల బాబాలూ, బెత్తం దెబ్బల బాబాలూ, కాలి తాపుల బాబాలూ లేరూ ? అలాగన్న మాట ! మనం కేవలం చప్పట్ల బాబాలం, మహా అయితే భక్తుల అరచేతులు నొప్పెట్టడం తప్పితే అంతకన్నా అధికంగా హింస ఉండదు. కాలి తాపులూ, బెత్తం దెబ్బలూ వగైరాలు వికటిస్తే, ఆ తన్నులూ. దెబ్బలూ ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. మనకెందుకా బాధ ? మన భక్తవర్యులు చక్కగా, తనివితీరా ఊగిపోతూ చప్పట్లు చరుస్తూ ఉంటారంతే. ఆవిధంగా మనం ముందుకు పోతాం. ఆధ్యాత్మిక సేవ చేస్తాం. మనకెలాగూ ప్రభుత్వోద్యోగాలు వచ్చే సావకాశం లేదు. ప్రైవేటు జాబులూ మన చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఇవ్వడానికి సాహసించరు. వ్యాపారాలనికీ మనకీ చుక్కెదురు. ఒక్కటీ కలిసి రావడం లేదు. అంచేత సుదీర్ఘంగా ఆలోచించేక చప్పట్ల బాబాగా అవతరించి ఆధ్యాత్మిక సేవ చేసి నాలుగు రాళ్ళు వెనకేసు కోవడమే మంచిదని నిర్ణయానికొచ్చేను. ఉదరపోషణార్ధం బహుకృత వేషమ్ అని పెద్దలు శెలవిచ్చేరు కదా. తప్పు లేదు. ప్రజలు పిచ్చి ముండా కొడుకులవడం మన తప్పు కాదు కదా ? ఎవరి ఖర్మ వాడిది. ఎవడు చేసిన తప్పుకి ఫలితం వాడనుభవిస్తాడు...’’
‘‘ మరి .. బూడిదలూ గట్రా ఇవ్వడం లాంటిది ఏఁవన్నా ఉందా ? ...’’ అడిగేను నంగిగా.
‘‘ అవన్నీ ఓల్డు ఫేషన్ కథామంజరీ ... మనం ఆల్ట్రా మోడ్రన్. అంచేత మనం అలాంటివేవీ ఇవ్వం. వయసులో ఉన్నవారికి అబ్బాయిలయితే సినీతారల ఫోటోలూ, అమ్మాయిలయితే యువ హీరోల ఫోటోలూ ఇస్తాం. పెద్దవాళ్ళకి రాజకీయ నాయకుల ఫొటోలూ, వృద్ధులయితే దేవుళ్ళ ఫొటోలూ ప్రసాదిస్తాం. దీనివలన బహుముఖమైన లాభాలు ఉన్నాయి. యువతరం సంతోషిస్తుంది. రాజకీయ నాయకులూ, సినిమాతారలూ మనపట్ల వ్యతిరేక భావంతో ఉండరు. పాపం, బాబా అభిమానాన్ని మనం ఎందుకు కాదను కోవాలీ అని సమాధాన పడతారు. మన జోలికి రారు. పైపెచ్చు చప్పట్ల భక్త బృందంలో చేరినా చేరే అవకాశమూ ఉంది. దానితో మన పాప్యులారటీ పెరుగుతుంది. మన చుట్టూ ఓ రక్షణ కవచం దానంతట అదే ఏర్పడుతుది. అన్నట్టు దానివలన పోలీసులు కూడా మనపట్ల ఉదాసీనభావంతో ఉంటారు.
ఇక పోతే, ఈ తొక్కలో జర్నలిస్టులు ... టీవీల వాళ్ళూ ... పేపర్ల వాళ్ళూ ... వీళ్ళ వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇన్విష్టిగేటివ్ జర్నలిజమూ వాళ్ళ పిండాకూడూనూ. అందు చేత మనఁవే ముందుగానే వాళ్ళని చప్పట్లు కొట్టి పిలిచి
మన చప్పట్ల ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకూ తావు లేదనీ వివరిస్తాం. ఏదో మమ్మల్నిలా బతకనివ్వండని కన్నీళ్ళ పర్యంతమై ఆఫ్ ద రికార్డుగా వేడుకుంటాం. వాళ్ళు కనికరించేరో సరేసరి. లేదూ మన గురించి అవాకులూ చవాకులూ ప్రచారం చేస్తే మనకొచ్చే బాధ ఏమీ లేదు. వ్యతిరేక ప్రచారాన్ని మించిన ప్రచారం మరొకటి లేదనే సంగతి తెలిసినదే కదా.
అదలా ఉంచితే, ఈ సినిమా తారల ఫొటోలూ, రాజకీయ నాయకుల ఫోటోలూ పందేరం చేయడమేఁవిటి హన్నా ! అని ఎవరయినా చిందు లేసారనుకుందాం. ఏమీ, భగవంతుడు సర్వాంతర్యామి, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. శ్రీ దేవిలో ఉన్నాడు. చిరంజీవిలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్లో ఉన్నాడు. నారా చంద్రబాబు నాయుడిలోనూ. సానుభూతి సామ్రాట్టు జగన్ లోనూ ఉన్నాడు. అలాంటి దేవుడు రాజకీయ నాయకులలోనూ. పినిమా తారల లోనూ  ఉండడనుకోవడం దైవ దూషణ కాదా ? మహా పాపం కాదా ? కళ్ళు పోవా ? అని ఎదురుదాడి చేస్తాం. అప్పటికీ మన పప్పులుడక్క పోతే దుకాణం మూసేస్తాం.
అంతే. ’’
ఇంతకీ ఈ చప్పట్ల బాబా ఎవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? లోగడ కథామంజరిలో సరదాకి అనే లేబిల్ క్రింద మా తింగరి బుచ్చి అనే వాడి గురించి చాలా చెప్పడం జరిగింది. ఆ తింగరి బుచ్చే ఈ చప్పట్ల బాబా. అసలింతకీ బాబాల గత చరిత్ర గురించి కూపీ తియ్యబోవడమంత పాపం మరొకటి లేదు. ఏరుల జన్మంబు, శూరుల జన్మంబు లాగే బాబాల జన్మంబు ఎవరికీ తెలియదు. తెలీడానికి వీల్లేదు.గాలికీధూళికీ పుట్టి పెరిగినా, అక్షరం ముక్క నేర్చుకోక పోయినా అమాంతంతగా రాత్రికి రాత్రి వాడో బాబా అయిపో వచ్చును.పిచ్చ నాకొడుకులు ఆశ్రమాలు కట్టి, భజనలు చేసి స్వయం ఉపాధి పథకం కింద దర్జాగా బతికెయ్యొచ్చును.
ఇక, మన చప్పట్ల బా నాకిచ్చిన బంపరు ఆఫరు గురించి ఇంకా చెప్పవలసే ఉంది కదూ ?
‘‘ ఓయి కథామంజరీ, అంచేత నేను చప్పట్ల బాబాగా అవతరించిన తరువాత నువ్వు చప్పట్ల బాబా ప్రవచనాలు అంటూ ఓ నాలుగయిదు చిన్న చిన్న పుస్తకాలు రాసి పెట్టాలి. ఒక్కోటీ పది ఇరవై పేజీలకు మించ నక్కర లేదు. అలాగే చప్పట్ల బాబా మహిమలు అంటూ మరో మూడు నాలుగు పుస్తకాలు రాసి పెట్టాలి. ఆ మహిమల గురించి చదివేక నేనే ఆశ్చర్య పోవాలన్నమాట. ఆ కల్పనా శక్తి నీకుంది నాకు తెలుసు. ప్రవచనాలూ. మహిమలూ అన్నీ నీ ఊహాజనితాలే కావాలి. కొత్తవే రాస్తావో, ఎక్కడినుండయినా ఏరుకొస్తావో అది నీ ఇష్టం. పుస్తకాల ప్రచురణ వ్యయం గురించి నీకేమీ దిగులక్కర లేదు. అదంతా మా చప్పట్ల ఆశ్రమం చూసుకొంటుంది. నీకు రాయల్ట్రీ గట్రా దొరుకుతుంది. మిగతా వాటి సంగతికేం గానీ ఇలాంటి పుస్తకాలు వేడి పకోడీల్లా అమ్ముడయి పోతాయి. నాది గ్యారంటీ. చెప్పు ఈ డీల్ నీకు సమ్మతమేనా ? ఈ ఒప్పనందం ఖరారయితే నీకు మరో బంపర్ ఆఫర్ ఉంది. అదేఁవిటంటే ..మా చప్పట్ల ఆశ్రమానికి చెందే ట్రష్టు బాధ్యతలు నీకే అప్పగిస్తాను. ఆలోచించుకో ...’’
ఆలోచించడానికేమీ లేదు. నా వల్ల కాదు అనీసేను నిక్కచ్చిగా. మరో సారి చెప్పి చూసి నీఖర్మం అని పెదవి విరిచేసాడు ( కాబోయే ) చప్పట్ల బాబా.
చప్పట్ల బాబా భవిష్య ప్రణాళిక వింటూ ఉంటే నాకు చప్పున ఓ పద్యం గుర్తుకు వచ్చింది. అవధరించండి ...

ఎక్కడి మంత్ర తంత్రములవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషమ్ములవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక పూర్వకృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్టకూటికిది వేషమయా శరభాంక లింగమా !
అని సరిపుచ్చుకొని. ‘‘ సరే కానీ, బాబా అన్నాక భక్తులకు రవంతయినా ఆధ్యాత్మిక బోధనల చేయాలి కదా ? ... మనకి చూసొచ్చిన సినిమా కథలు చెప్పడఁవే సరిగా రాదు ... ఎలా మేనేజ్ చేస్తావ్ ’’ అనడిగేను.
‘‘ అవును. ఆ విషయమూ ఆలోచించేను. అందు కొంత హోమ్ వర్క్ చేసాను.

సత్యాన్ని మించిన అసత్యం లేదు,
హింసను మించిన అహింస లేదు.
ఙ్ఞానాన్ని మించిన అఙ్ఞానం లేదు.
దరిద్రాన్ని మించిన ధనం లేదు.
దు:ఖాన్ని మించిన సుఖం లేదు.

ఇలాంటి కొత్త భావజాలంతో ఉసన్యసిప్తాం. అర్ధం కావడం లేదు గురూజీ అనే మొండి భక్తుల నోళ్ళు
‘‘అర్ధం కాక పోవడమే అర్ధమవడంరా మూఢ భక్తుడా !’’ అని మూయిస్తాం.
మరో విషయం ... ఎవరికీ చెప్పనంటే చప్పట్ల రహస్యం నీకు చెబుతాను ... విను ...
మన భక్తులు ఊగిపోతూ, తన్మయత్వంతో, ఒకరిని మించి ఒకరు పెద్దగా చప్పుడు చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారా ?! ... అప్పుడు ప్రారంభిస్తామన్నమాట.. మన తాత్విక బోధనలు! మనం ఉపన్యాసం యిస్తున్నామో, ఊరికే పెదవులు కదిలిస్తున్నామో, చెక్క పొడినవుల్తున్నామో, ఎవరూ పోల్చుకో లేని విధంగా ఉంటుందన్నమాట. దాంతో మన అఙ్ఞానం పదిలంగా ,భద్రంగా, గూఢంగా ఉండి పోతుంది. చప్పట్ల హోరులో ఏఁవీ వినిపించి చావక పోయినా, బాబా ఏదో చెప్పి ఉంటారనే భావనతో భక్తులు పట్టించు కోరు. అదీ మన చప్పట్ల రహస్యం...’’ అని ముగించేడు చప్పట్ల బాబా.
నేను నివ్వెర పోయాను. నా ఙ్ఞానాంధకారం నశించింది . అఙ్ఞాన కిరణాలు అంతటా ప్రసరించేయి. నా తల వెనుక ఓ తేజో చక్రం కాస్సేపన్నా తిరిగి ఉంటుంది.
 ధన్యోస్మి.
జై ... బోలో ... చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ! ... అంటూ చప్పట్లు కొడుతూ అరిచేను.
చప్పట్ల బాబా తన తొలి భక్తుడినయిన నన్ను చూస్తూ చిరు నవ్వులు చిందించారు.































18, జనవరి 2015, ఆదివారం

మరయితే అసలు సమస్య ఏమిటయ్యా !


ఈ క్రింది శ్లోకం చూడండి:
కా శంభు కాన్తా ? కిము చంద్ర కాంతం ?
కాన్తా ముఖం కిం కురతే భుజంగం
క: శ్రీపతి: కా విషమ సమస్యా ?
‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’

ఇందులో మొత్తం నాలుగు ప్రశ్నలూ, నాలుగు సమాధానాలూ ఉన్నాయి. చూడండి:
కా శంభు కాన్తా ? = ఎవరు ఈశుని భార్య ? = గౌరి
కిము చంద్ర కాన్తం ? = ఏది చంద్ర బింబం ? = ముఖం
కాన్తా ముఖం కిం కురుతే = అమ్మాయి ముఖాన్ని ఏం చేస్తున్నాడు? = చుంబతి ( ముద్దు పెట్టు కుంటున్నాడు)
భుజంగం క: = పాము ఎవరు ? = వాసుకి.
ఈ విధంగా తొలి నాలుగు ప్రశ్నలకీ వరుసగా నాలుగో పాదం లోని ’’ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని
కవి నాలుగు జవాబులూ తనే ఇచ్చేడు.
మరయితే అసలు సమస్య ఏమిటయ్యా ?

ఒక కవి ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని ఒక సంస్కృత సమస్య ఇచ్చాడు. శ్లోకం లోని మీద మూడు పాదాలూ పూరణ.
కా విషమ సమస్యా ? = ఏది జటిలమైన సమస్య ? దీనికి నాలుగో పాదం లోని ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’ అనేదే జవాబు.
గౌరీ దేవి ముఖాన్ని వాసు దేవుడు ముద్దు పెట్టు కోవడ మేమిటీ , ఓఘాయిత్యం కాక పోతేనూ !!
మరదే , అందుకే కవికి మండుతుంది. ఏ అనౌచిత్యమూ లేకుండా ఈ సమస్య లోని ప్రతి పదానికి అర్ధవంత మయిన జవాబు వచ్చేలా ముందే ప్రశ్నలు వేశాడు కదండీ.
ఇలాంటి కిత కితలంటే మన పూర్వ కవులకి చాలా సరదా సుమండీ . మనలా ఎప్పుడూ ఆందోళనలతో ఏడుపుగొట్టు ముఖాలతో ఉండకుండా గొప్ప కులాసాగా, కుంచెం శృంగారం ఒలికించే పద్యాలూ శ్లోకాలూ చెప్పుకుంటూ ఉండే వారు కాబోలు.
ఆ రోజుల్లో వాళ్ళకి ఏ నవ్వుల క్లబ్బులూ ఉండేవి కాదని , వాటి అవసరం వాళ్ళకి పడ లేదని మా కథా మంజరి దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది.
శలవ్.



ఒకటి కొంటే ఒకటి ఉచితం ! రామాయణ గ్రంథం కొంటే, భారతం ఉచితం !


మన ప్రాచీన కవులు గొప్ప సాండిత్య ప్రకర్షతో రెండర్ధాల కావ్యాలూ, మూడర్ధాల కావ్యాలూ రాసారు. వాటినే ద్వ్యర్ధి, త్ర్యర్ధి కావ్యాలంటారు..

పింగళి సూరన రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యం రాశాడు. రామాయణ పరంగానూ, భారత పరంగానూ అర్ధాలు వచ్చేలా మొత్తం కావ్యం లోని పద్యాలన్నీ ఉంటాయి ! రెండర్ధాలు కలిగిన పద్యం ఒకటి వ్రాయడమే కష్టం. ఆ విధంగా మొత్తం కావ్యమంతా ఉంటే, ఆపాండిత్యం ఓహో ! అనిపించదా ! అందులోకీ తెలుగు కావ్యం అద్భుతం అంటారు. ఈ లోకంలో రామ భారత కథలు జోడించి కావ్యం చెప్ప గల దక్షుడు ఎవడున్నాడయ్యా ! .... అన్నాడు సూరన.

మరో మాట ... ఎందుకేనా మంచిదని చెప్పి చదువరులను ముందే హెచ్చరించాడు.
ఒక కథ వినేటప్పుడు మఱొక కథ మీద దృష్టి నిలిపితే, మొత్తం మొదటి అర్ధం గోచరించకుండా పోతుంది. అందు చేత ఈ రాఘవ పాండవీయం చదివేటప్పుడు ఒకే అర్ధం కలిగిన మామూలు కావ్యాన్ని ఎలా చదువుతారో అలాగే చదవండి. అంటే, ముందుగా రామాయణార్థాన్ని చదువుదామనుకుంటే, మనసు లోకి మరింక భారతార్థం ఏమిటా అని ఆలోచించకండి. అలాగే భారతార్ధం వచ్చేలా చదివేటప్పుడు రామాయణార్ధ ఏమిటా అని ఆలోచించకండి. ఏకార్ధ కావ్యం ఎలా చదువుతారో అలాగే చదువు కోండి. అని వివరణ ఇచ్చాడు.

రాఘవ పాండవీయం లోని రామాయణార్థంలో నూ భారతార్ధం లోనూ అర్ధాలు వచ్చే ఒక పద్యం ఉదాహరణకు చూద్దామా !

వెలయునఖిల భువనములలోన వారణ
నగరిపురమ తల్లి నాదనర్చి
రాజ్య లక్ష్మి మిగుల బ్రబల నయోధ్యనా
రాజ వినుతి గనిన రాజధాని.

ఈ పద్యం రామాయణ పరంగా అయోధ్యా నగరాన్ని వర్ణించే పద్యం. ఇదే పద్యం భారతార్ధంలో అయితే, హస్తినాపురాన్ని వర్ణిస్తున్న పద్యం !
ఇందులో సంస్కృతాంధ్ర శబ్ద సభంగ శ్లేష కవి వాడాడు.

ముందుగా రామాయణ పరంగా అర్ధం ఎలాగంటే,
రామాయణ పరంగా పద్యంలోని పదాలు ఇలా విరిచి చదువు కోవాలి.

అఖిల భువనముల లోన్, = అన్ని లోకాలలోనూ

అవారణ, నగరిపు, రమ, తల్లి = అడ్డు లేని ఇంద్రుని యొక్క సంపదయైన అమరావతికి తల్లి అన్నట్లుగా రాజ వినుతి గనిన = గొప్ప పేరు గాంచిన

రాజధాని అయోధ్యనాన్ = అయోధ్య అనే పేరుతో ప్రబలున్ = వెలయు చున్నది.
అంటే,
ఇంద్రుని రాజధాని అమరావతి. . దానికి తల్లి లాంటి నగరం అయోధ్య అన్నమాట.!

ఇక, భారతార్థంలో అన్వయం చూదామా !

న + యోధ్య = అయోధ్య ( యుద్ధం చేసినా జయింప బడనిది )
వారణ నగరి = వారణం అంటే ఏనుగు, వారణ నగరి అంటే హస్తినా పురం !
పురమ తల్లి = పుర శ్రేష్ట్రం. ( శ్రేష్ఠమైన నగరం )
అన్వయం ఇలా చూడాలి.

అఖిల భువనములలోన + వారన నగరి + పురమ తల్లి..
అంటే, అన్ని లోకాలలోనూ, హస్తినా పురం చాలా గొప్పది అని అర్ధం అన్నమాట !
తక్కిన అర్ధమంతా సుబోధకమే కదా !
వార్నాయనో ! ఒక్క పద్యానికి రెండు రకాల ( రామాయణ, భారతార్ధాలు ) అర్ధాలు గ్రహించడానికే ఇంత పీకులాట అయింది. ఇక మొత్తం కావ్యం అంతా చదవాలంటే మాటలా ?
 అనుకుంటున్నారా ?

తప్పదండీ, బాబూ, కష్టే ఫలీ ! అన్నారు. కావ్య రసం గ్రోలాలంటే ఆ మాత్రం కష్టపడొద్దూ ?

పనిలో పని, పింగళి సూరన కళా పూర్ణోదయం చదవండి..ఒక మిష్టరీ నవల చదువుతున్నట్టగా ఉంటుంది. తెలుగు కవుల గొప్ప తనమేమిటో తెలుస్తుంది. ! మన కావ్య సంపదను మనం ఎంత పదిలంగా కాపాడు కోవాలో తెలుస్తుంది !

స్వస్తి.




17, జనవరి 2015, శనివారం

నవ్వితే నవ్వండి ... ( నాకేం అభ్యంతరం లేదు)



కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.
ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.
అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !
అలాంటివాటిని కొన్నింటిని చూదాం !
వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:
ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.
‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.
మరొకటి -
కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !
మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!
భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:
ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.
ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:
గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:
అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:
కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:
పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:
అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం
తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .
మరొకటి చూడండి:
తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి
కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !
చివరగా ఇంకొకటి ...
క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:
ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.
లోగడ కథా మంజరిలో తెలుగు, ఇంగ్లీషు పదాలు కలగాపులగం చేస్తూ కవులు రాసిన కొన్ని పద్యాలను ఉంచాను.
చూడాలనిపిస్తే ఆ టపా ఇక్కడ నొక్కి చూడండి. ఓ పనైపోతుంది.






16, జనవరి 2015, శుక్రవారం

చాసో కథల్లో వెంటాడే వాక్యాలు !





తెలుగు కథకి తూర్పు దిక్కు చాసో ( చాగంటి సోమయాజులు) శత జయంతి వేడుకల సందర్భంగా... వారి కథల నుండి వెంటాడే వాక్యాలు  ....
 ‘పిల్లల హృదయాలు నిష్కల్మషంగా ఉంటాయి.స్వభావ సిద్ధంగా సంగీతం సమ్మోహన పరుస్తుంది. చిన్న వయసు నుంచి కాస్తంత రాగ తాళ ఙ్ఞానం కలిగిస్తే జీవితంలో సంగీతం ప్రవేశించి ఆజన్మాంతం ఆనంద హేతువు అవుతుంది.’

 ‘ కాని  ( పెళ్ళి చూపులకు  )వచ్చిన పెద్దలు పాటకు సెబాస్ అన్నారు. తెలుగు పెద్దలకి శృతీ, అపశృతీ తెలియవని,  రాగ తాళ ఙ్ఞానం వాళ్ళకుండదని, వాళ్ళ జీవితాలలో సంగీతం లేనే లేదని, అమాయకపు పెళ్ళి కూతుళ్ళకి ఏమి తెలుసు !’

‘నిత్య జీవితంలో ఆనందానికి, ఆరోగ్యానికి సంగీతం అవసమే. తాను పాడ లేక పోయినా అర్ధం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని చేస్తుంది.’

‘వాతావరణంలో సంగీతం ఉంటే వాసాలు కూడా పాడతాయి.’

‘సరస్వతీ కటాక్షం నాకంతే ఉంది.   (ఫిడేలు) తల్లి వెళ్ళి పోయింది. వెళ్ళి పోతూ తల్లి గుణాన్ని చూపించు కుంది. నాకు ప్రాణం పోసింది. వెళ్ళి పోతూ నాకో చీరా రవికెల గుడ్డా పెట్టింది.’

                                                                                                        (వాయులీనం)
‘నాదారులు చిన్న దొంగ తనం చేస్తేపెద్ద నేరాలవుతాయి. ఉన్న వాళ్ళుచేస్తే కమ్ముకు పోతాయి. ’(కుంకుడాకు)

‘పెళ్ళాం మంచం మీద కళ్థళు మూసుకుని పరిమళిస్తూ పడుకున్నాది .దాని గుండెల మీంచి కిందకి వేళ్ళాడుతూ పడి వుంది మూడు మూళ్ళ జడ. ఏ పురుఫషుణ్ణయినా ఉరిపొయ్యడానికది చాలు. ’
( లేడీకరుణాకరం)

‘ఆరుగురు పిల్లలను పరాయి దేవతలకు కన్న తుంతీ దేవి పతివ్రతే అన్నారు.భర్త అనుమతిస్తే తప్పు లేదన్నారు శాస్త్రఙ్ఞులు. కుంతి పతివ్రత అయితే శారదా పతివ్రతే ’        ( లేడీ కరుణాకరం)

‘పాండిత్యం ఎక్కువయితే బుద్ధికి పడిశం పడుతుంది. ఎందుకొచ్చిన పాండిత్యాలు ?కూటికొస్తాయా ? గుడ్డకొస్తాయా ?’    ( (పరబ్రహ్మము)

‘అన్నం పరభ్రహ్మ స్వరూపం. అందుకు అన్వేషణ తప్పదు ! పరబ్రభ్మాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యమని అన్ని మతాలూ అంగీకరిస్తాయి.’    (పరబ్రహ్మము)
‘పదండి భడవ్లారా ! నేనే దొంగ మార్కెట్టులో  ( బియ్యం) అమ్ముకుని మేడలు కడుతున్నాను. నాకు ఉరిశిక్షకు తక్కువ వెయ్యకండి. నా పొగ కుక్కుటేశ్వరుడికి ధూపం వెయ్యండి’.     ( కుక్కుటేశ్వరము)

‘ఆనాటి దుమ్మలగొండె అనుభవం జీవితంలో ఘనమైన భ్రాంతిమదలంకారం.’   (దుమ్మలగొండె)

‘కూకుంటే ఎలతాదా?బూమిని బద్దలు సేసుకు బతకమన్నాడురా నిన్నూ నన్నూ బెమ్మ దేవుడు.’

‘మా గనమైన ఆలోశన తట్టింది. దెబ్బతో బుద్ధి మారి పోయింది.ఎళ్ళండ్రా అంతా ఎళ్ళండి.కూర్మిగాణ్ణి నానే పట్నం అంపుతన్నాను.మరి జట్టీ నేదు.’      ( వెలం వెంకడు)

‘కళ్ళు లేనివాడికి కడియాల రవలూ. గాజుల మోతలే కాబోలు కామాన్ని కదుపుతాయి’     ( ఎంపు)

‘కూడెట్టింది కాదు.  డబ్బు  సెడ్డ పాపిస్టి. తల్లీ పిల్లల ఆశలు సంపుతాది. రేత్రి జీతమంతా  (కూతురి) సేతిలెట్టినాను. పట్టెడన్నం పెట్టింది.ఇంక దినం తుతాది.’     ( బొండు మల్లెలు)

‘లేమి ఎంతటి వాళ్ళలోనయినా మానవత్వాన్ని చంపి అమానుషత్వాన్ని పెంచుతుంది. వృద్ధులకి పెన్షనులైనా ప్రభుత్వం ఇస్తే బావుణ్ణు. జీవిత భీమా ఉన్నా బావుణ్ణు.’      (బొండు మల్లెలు)

‘రాకరాక చిన్నాజీ వొచ్చింది.కథా వొద్దు. కావ్యం వొద్దు. చిన్నాజీతో ఐదు నిమిషాలు షేక్స్పియర్ కామిడీలో రసవంతమయిన ఐదంకాలపాటి చెయ్యవూ ? ’       (చిన్నాజీ)

‘ప..ప్స..పారెయ్య లేదు ఎందుకు పారేస్తాను నాన్నా.’        (ఎందుకు పారేస్తాను నాన్నా)

ఉపసంహారం :


చాసో కథల్లో వెంటాడే వాక్యాలంటూ ఏ కొన్నింటినో ఎత్తి రాయడ మేఁవిటి, వెర్రి కాక పోతే !

చాసో కథలన్నీ వెంటాడి వేధించేవే కదా ...


15, జనవరి 2015, గురువారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా, ఏమి రుచి !

కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.





అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా, నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లుచాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా  హొటల్ ఉండేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాస్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.



చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లుళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ( ఆ ప్రక్కనే ఉపాధ్యయ భవన్ కదా ! దాని ప్రభావం కాబోలు ! ) ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ..... మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.

13, జనవరి 2015, మంగళవారం

నే చదివినవి రెండు ముక్కలు ! ... ‘‘ బంగారు తెలంగాణ’’, ‘‘సింగపూర్’’


ప్రహ్లాదుడిని చండామార్కుల వద్ద చదివిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని తలచి హిరణ్య కశిపుడు కొడుకును వారి వద్ద చేర్చాడు.
గురువులు చదివించారు. హోమ్ సిక్ లేకుండా చేదామని కొడుకుని ఒక సారి ఇంటికి రప్పించు కున్నాడు హిరణ్యకశిపుడు.
‘‘ ఎలా ఉందిరా అబ్బీ, నీ చదువు ? ’’ అనడిగేడు.
‘‘ బావుంది నాన్నా ’’ జవాబిచ్చేడు కొడుకు.
‘‘ సరే గానీ గురువులు చదివించిన దానిలో ఓ రెండు ముక్కలు చెప్పు చూదాం ’’ అనడిగేడు.
కొడుకు తడుము కోకుండా అన్నాడు : ‘‘ బంగారు తెలంగాణ,    సింగపూర్ ’’
రాజు గారితో పాటూ, గురువులకీ, అక్కడున్న తతిమ్మా వారికీ మతులు పోయాయి.

‘‘ఏఁవిటేఁవిటీ ? ’’ అనడిగేడు రాజు
కొడుకు మళ్ళీ అవే మాటలు  చెప్పాడు.
ఎవరు ఎన్ని సార్లు అడిగినా ఆ రెండు మాటలూ తప్ప వాడు మరో మాట మాట్లాడడం లేదు. తండ్రికి ఎక్కడో కాలింది.
‘‘అన్ని టెర్ముల ఫీజులూ దొబ్బి ఇదా మీరు నేర్పించింది ? ’’ అని రాజు గురువుల మీద మండి పడ్డాడు
‘‘చండా మార్కుల వారూ, మీ నిర్వాకం ఇంత ఛండాలంగా ఉందేఁవిటండీ ’’  అని రెచ్చి పోయాడు  ఓ మంత్రి. చాలా రోజులనండీ గురువుల మీద ఎంచేతో ఉన్న అక్కసుని వెలిగ్రక్కుతూ ...
గురువులు గజగజ వణికి పోయారు.
‘‘ ప్రభూ ! మా తప్పేమీ లేదు. నీ కుమారుడికి మేము మంచి విద్యలే నేర్పించాము. బిట్ బ్యాంకులు కంఠోపాటం పట్టించాము. గైడ్లు నూరి పోసాము. పాత క్వశ్చన్ పేపర్లని వందేసి సార్లు వేళ్ళు తిమ్మెర్లు ఎక్కేలా ఆన్సరు చేయించాము. డైలీ పరీక్షలు కాదు ... పూట పూటకీ పరీక్షలు పెట్టి వాడి తాట తీసాము. రాత్రీ పగలూ నిద్ర లేకుండా చేసి చదివించాము. మరి ఈ రెండు ముక్కలే ఎలా పట్టుబడ్డాయో తెలియడం లేదు. ...’’ అన్నాడు వణికి పోతూ ...

ఇంతలో అక్కడున్న  మరో  మంత్రి కలుగ జేసుకుని ‘‘ మీ స్కూల్లో, అదే, మీ గురుకులంలో తెలుగు డైలీ పేపర్లూ అవీ తెప్పిస్తూ ఉంటారా ? ’’ అనడిగేడు.
‘‘ ఓ ! అన్ని తెలుగు పేపర్లూ వస్తాయి సార్ ... పిల్లకాయలకి జనరల్ నాలెడ్జీ వద్దూ ? లోకం పోకడ తెలీ వొద్దూ ? ’’ అన్నారు గురువులు.
‘‘ టీ. వీ. ఉందా ? తెలుగు న్యూస్ చానెల్లు వస్తాయా ?’’ మంత్రి అడిగేడు.
‘‘ అన్నీ వస్తాయి సార్ ! వాటిలో చర్చల పేరిట ఒకరి మాట ఒకరికి వినబడకుండా తిట్టు కోవడం చూసి మా విద్యార్ధులు తెగ సరదాపడి పోతూ ఉంటారు. ’’ అన్నాడు గురువు.
మంత్రి అన్నాడు : ‘‘ అదీ సంగతి ! రోజూ ఆ పత్రికలను చదివి ... చానెల్లు చూసి వీడికి ఆ రెండు మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. వీడి తలలో ఆ రెండు పదాలే కోట్లాదిగా ఆక్రమంచుకుని, మరో వాటికి చోటు లేకుండా పోయింది. అందు చేత తక్షణం గురుకులంలో తెలుగు దిన పత్రికలను తెప్పించడం కొన్నాళ్ళు ఆపెయ్యండి.టీ.వీ. కనెక్షను తీయించెయ్యండి ’’ అన్నాడు.

‘‘అలా చెయ్యండి .. పొండి ’’ అన్నాడు హిరణ్యకశిపుడు.
‘బతుకుజీవుడా ! ’ అని గురువులు అక్కడి నుండి బయటకు నడిచారు.

నీతి : తినగ తినగ బెల్లం చేదుగా నుండు.ముఖం మొత్తును.