8, మార్చి 2015, ఆదివారం

పోదూ, నీకంత సీన్ లేదు !

‘‘ తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు
దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?

ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !


మరో పద్యం చూడండి:


స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట ! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చిన మాత్రనె యింత గర్వమా !
మానవతీ శిరోమణుల మాలికలయందును గూర్ప వత్తువో ?
కానుకలియ్య వత్తువో, వికాసము నిత్తువొ , విల్వ దెత్తువో ?!

ఈ పద్యం ముక్కు తిమ్మన గారిదని చెబుతారు.

స్థాన విశేష మాత్రం చేత మాత్రమే కొందరకి, లేదా కొన్నింటికి గొప్పతనం చేకూరుతూ ఉంటుంది. తామరపాకు మీద నీటి బొట్టు ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. అంత మాత్రం చేత అది మంచి ముత్యం ఎన్నటికీ కానేరదు కదా !
కవి అదే చెబుతున్నాడు : ఓ తామరపాకు మీద నీటి బొట్టూ ! నువ్వు తామరపాకు మీద నిలచి ఉండడం చేత నిన్ను ముత్యంతో పోలుస్తూ ఉంటారు. అది స్థానవిశేషం వల్ల వచ్చిన గొప్పతనం. అంత మాత్రం చేత నీకు ఇంత గర్వం తగదు సుమా ! నువ్వేమయినా లలనల శిరోరత్నాలలో కూర్చడానికి పనికి వస్తావా ? ఎవరికయినా కానుకగా ఇవ్వడానికి తగుదువా ? నీకు వికాసమూ లేదు, విలువా లేదు!

అంతే కదా, నీటి బొట్టు తామరపాకు మీద ఉన్నంత సేపే ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. స్థానభ్రంశం చెందిందా, యిక దాని పని అంతే. వొట్టి నీటి బొట్టే. కదా.

మరో పద్యం చూడండి:



తక్కక నేల ముట్టెగొని త్రవ్వగ నేర్తునటంచుఁదాకుతా
వొక్కటి జాతియందు మదమెక్కకు బుద్ధిని వెఱ్ఱిపంది ! నీ
వెక్కడ ! యాది ఘోణియన నెక్కడ ! యద్రి సముద్రదుర్గ భూ
ర్భాక్కు తలంబు నొక్క యరపంటినె మింటికినెత్త నేర్తువే ? !

ఓ వెఱ్ఱి వరాహమా ! నేలను ముట్టెతో త్రవ్వడంలో నాకు నేనే సాటి అంటూ గొప్పలు పోతూ గర్విస్తున్నావు.
నువ్వెక్కడ ? ఆదివరాహ మెక్కడ ? సముద్ర గర్భంలోని భూమిని ఒక కోరతో అవలీలగా ఆ తొలి కిటి మీదికి ఎత్తలేదూ ! ఆ ఆది వరాహం ముందు నువ్వెక్కడ, నీ ప్రతాపమెక్కడ !


ఈ పద్యం భట్టు మూర్తిదిగా చెబుతారు.

తమకు లేని పోని గొప్ప తనాన్ని ఆపాదించు కుంటూ. అహంకరించే అల్పులను అభిశంసిస్తూ కవులు చెప్పిన పద్యాలు చూసాం కదా.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.


గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఇలాంటిదే శ్రీనాథుని మరో చాటువు చూడండి:


ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !

ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

ఇదీ, నీకంత సీన్ లేదు ! అని కుండ బద్దలు కొట్టిన పద్యాల కథ .





6, మార్చి 2015, శుక్రవారం

కోప మేల నోయీ !


ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్

ఈ శ్లోకంలో కవి కోపం గురించి చెబుతున్నాడు.కోపం అంటూ వచ్చేక, ఎవరెవరిలో ఆ కోపం ఎంత సేపు ఉంటుందో నిర్ధారిస్తున్నాడు.
ఎలాంటి వారికయినా, ఎప్పుడో ఒకప్పుడు కోపం రాకుండా పోదు. కానీ. ఉత్తములైన వారిలో ఆ కోపం కొంచెం సేపు మాత్రమే ఉండి తగ్గి పోతుంది. వారిలో ఆ కోపం క్షణం సేపు కన్నా ఎక్కువ సేపు ఉండదు.
అదే మథ్యములలో అయితే కోపం రెండు ఘడియల సేపు ఉండవచ్చును.
అధమ ప్రకృతి గల మనుషులలో, అంటే , నీచులలో వచ్చిన కోపం మొత్తం ఒక రోజంతాఉండవచ్చును.
దీని వల్ల ఎంత కోపం వచ్చినా, ఎంతో కొంత సేపటికి తగ్గి పోక తప్పదని తెలుస్తోంది.
కానీ ఓ రకం వాళ్ళలో మాత్రం కోపం వస్తే , బతికి ఉన్నంత కాలం ఆ కోపం పోదు. వాళ్ళు ఆ కోపాన్ని, కోపకారణాన్ని జీవితాంతం మనసులో పెట్టుకుంటారు.
వాళ్ళనే పాపిష్ఠి వాళ్ళు అని చెప్పాలి. వారిది ఆసురీతత్త్వం. అంటే రాక్షస ప్రకృతి అన్న మాట.
కోపం వేగంగా తగ్గి పోవాలన్నా, కోపం వల్ల వేరే దుష్ఫలితాలు కలగకుండా ఉండాలన్నా, మన వాళ్ళు ఒక చిట్కా చెప్పనే చెప్పారు కదా.
కోపం వచ్చి నప్పుడు పది వరకూ అంకెలు లెక్క పెట్టమన్నారు. అప్పటికి వచ్చిన కోపం తగ్గి పోతుంది.
ఒక వేళ తగ్గ లేదనుకోండి, కొంచెం డోసు పెంచండి. మరో పదో, ఇరవయ్యో అంకెలు ఎక్కువ లెక్క పెట్టండి అప్పటికీ తగ్గక పోతే, ఏనిమల్ డోసు వాడి చూడండి. ఇంకా ఈ చిట్కా పని చేయ లేదనుకోండి . మీ యిష్టం చ్చినంతగా కోపాన్ని ప్రదర్శించండి. అరచి అరచి అలసి సోయి మీరే శాంతిస్తారు.
గురజాడ వారి కన్యా శుల్కంలో కోపిష్ఠి పాత్రలు చాలానే ఉన్నాయి. ధామ్ ధూమ్ లాడుతూనే ఉంటాయి.
గురువు గిరీశాన్ని వెంట బెట్టుకుని కృష్ణారాయపురం అగ్రహారం వొచ్చిన కొడుకు వెంకటేశాన్ని‘ వెధవాయీ, ఈ మారైనా పాసయినావా ?’ అని ప్రేమతో కసురుతూ అడిగిన అగ్నిహోత్రావధాన్లు గిరీశాన్ని చూసి, ‘ యా తుర కెవడోయ్’ అని నిలదీస్తాడు. గిరీశం పట్నం డాబు వొలకబోస్తూ, ‘ టర్క్ ! డామిట్ ! , టెల్ మాన్ ’
అన్నాడో, లేదో, అగ్నిహోత్రావధాన్లు అగ్గిరాఁవుడై పోయాడు.
‘ మానా? మానులా వుంచా నంచావూ? గూబ్బగల గొడతాను ’ అని గయ్యిమంటాడు.
సుబ్బిని లుబ్ధావధాన్లుకి యిచ్చి కన్యా శుల్కం పద్దెనిమిది వందలు తీసుకుని పెళ్ళి మాటలు నిర్ణయమైపోయిన సంగతి విని , భార్య వెంకమ్మ అదే గనుక జరిగితే నూతిలో పడి ఛస్తానని గగ్గోలు పెడుతుంది. చెల్లి బాధ చూడ లేక కరటక శాస్త్రి బావ గారితో ఏదో నచ్చ చెప్ప బోతే, దాంతో మళ్ళీ మన అగ్గి రాముడికి చిర్రెత్తు కొచ్చి, ’ వీళ్ళమ్మా శిఖ తరగా, ప్రతీ గాడిద కొడుకూతిండి పోతుల్లాగా నాయింట చేరి నన్ననే వాళ్ళే.తాంబోలం యిచ్చేసాను తన్నుకు ఛావండి ’ అని ఇంతెత్తు ఎగురుతాడు
కోపం ఎప్పుడూ మంచిది కాదు.
తన కోపమె తన శత్రువు ,తన శాంతమె తనకు రక్ష అనే హిత వాక్యం ఎప్పుడూ మరచిపో కూడదు. భారతం కూడా, కోపము తపముంజెఱచును ... అని చెబుతోంది.
కోపం పేరు చెబుతే గుర్తొచ్చే మొదటి ముని దుర్వాస మహా ముని. తపశ్శక్తిని ఎప్పుడూ కోపతాపాలతో ధారపోస్తూ ఉండడమే. ఆ ముని కోపం వల్లనే కదా అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకం కీలకమైన మలుపు తిరుగుతంది.
కోపానికి పరాకాష్ఠ పరమ శివుని మూడో కన్ను. శివ కోపానలానికి మదనుడు దగ్ధమై పోయాడు. అనంగుడైనాడు.
కీచకవథ ఘట్టంలో ద్రౌపదికి విరటుని కొలువులో కీచకుని వలన జరిగిన అవమానానికి రగిలి పోయి భీమ సేనుడు కోపంతో ఊగి పోయాడు. ప్రక్కనే ఉన్న మహా వృక్షాన్ని పెకిలించి వేసి, కీచకుడిని అంతం చేయాలని ఉద్రేక పడి పోయాడు. కానీ, అప్పడు పాండవులు అఙ్ఞాత వాసంలో ఉండడం చేత, దానికి భంగకరం కాకుండా, ‘‘ వలలుండెక్కడ సూచె ... ’’ అంటూ నర్మ గర్భమైన వాక్యాలతో ధర్మజుడు వారించ బట్టి, సరి పోయింది.
లోకంలో మనుషులు కోపాన్ని ప్రదర్శించడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తారు. రకరకాల హావ భావాలుప్రదర్శిస్తారు.  కొందరు పళ్ళు నూరుతారు. కొందరు ముఖం చిట్లించు కుంటారు.
మరి కొందరేమో ధుమ ధుమలాడుతారు.కొందరు చెవులు చిల్లులు పడేలా అరుస్తారు. కోపంతో ఊగి పోతారు. వేరొక కొందరు మూతి ముడుచుకుని మాట్లాడకుండా హఠం చేస్తారు. పెళ్ళా మీద కోపం వచ్చిన మగాళ్ళు లోగడ తింటున్న అన్నం కంచం పెళ్ళాం నెత్తిని బోర్లించి సమ్మానించే వారు. ఆడాళ్ళకి కోపం వస్తే చీపురు తిరగేస్తారు. వంట గదిలో గిన్నెలని ధణ ధణా నేల కేసి కొడుతూ ఉంటారు.పిల్లలకి కోపం వస్తే భోరున ఇల్లెగిరి పోయేలా ఏడుస్తారు.టీచర్లకి  కోపం వస్తే తొడ సాయసాలు పెడతారు. బెత్తాంతో భజంత్రీలు వాయిస్తారు ( ఈ రోజుల్లో మీద చెప్పిన పద్ధతుల్లో కోపాన్ని ప్రదర్శించే వీలు అంతగా లేదను కోండి ...చట్టాలు ఊరు కోవు. కో్పంతో రెచ్చి పోయి,  మన తాట తీస్తాయి మరి ! )
కోపంతో తమను తాము హింసించుకుని, నిరశన చూపే వాళ్ళు కొందరయితే, ఎదుటి వాడిని మాటలతోనూ, చేతలతోనూ హింసించి బాధించే వాళ్ళు కొందరు. ఈ రెండు విభాగాల్లోనూ కూడా హింస ప్రథాన పాత్ర పోషిస్తోందని మనం గ్రహించాలి.
పోలీసు వాడి కోపం లాఠీ కర్రలో పరివర్తనం చెందుతుంది. మేష్టరి కోపం బెత్తంతో చిందులేస్తుంది. పెళ్ళాల కోపం కూరలో ఉప్పెక్కు వెయ్యడంతో ఉపశమనం పొందుతుంది. ఆఫీసరు కోపం ఇంక్రిమెంటు కట్ చెయ్యడంతో నిమ్మళిస్తుంది.  రాజకీయ నాయకుడి కోపం వ్యతిరేకులని జైళ్ళపాలు చెయ్యడంలో శాంతిస్తుంది.  సామాన్యుడి కోపం ఐదేళ్ళ నిరీక్షణ తరువాత ఓటు రూపంలో వ్యక్తమవుతుంది. కాంగ్రెసు వాళ్ళ మీద కోపం జనాలు మొన్న దేశ వ్యాప్తంగా అలాగే తీర్చు కున్నారు కదా !
కోపంతో భాష మరి పోతుంది. బూతులు ప్రవహిస్తాయి. మన చంద్ర బాబుకి కోపం వస్తే ‘‘ ఏం మాట్లాడు తున్నావ్ ? పిచ్చ పిచ్చగా ఉందా ?!’’ అని ఆరా తీస్తాడు.
జగనన్నకి కోపం వచ్చినా, రాక పోయినా చంద్ర బాబుని దించీసి కుర్చీలో తనని కూచో పెట్ట మంటాడు. అప్పుడు చూపిస్తాను నా తడాఖా అంటూ రంకెలేస్తాడు. మన కమ్యూనిష్టులకి కోపం రాని దంటూ ఎప్పుడూ ఉండదు. కోపంతో చారిత్రక తప్పిదాలు చెయ్యడం వారి కొక హాబీ.
కోపం గురిచి ఇంకా చెప్పడానికి చాలానే ఉన్నా, మరీ ఎక్కువగా చెప్తే మీకు విసుగు కలిగి, కోపం వస్తుందేమో. మరి ముగిస్తాను.

4, మార్చి 2015, బుధవారం

చింకి లెక్చరు ... అను ... ఈ కథా మంజరి బ్లాగును మీరింక చదవొద్దు !


ఉదయాన్నే ఫోనొచ్చింది. పానకాల రావు చేసాడు. బుధవారం మధ్యాహ్నం రెండింటికి కుటుంబంతో పాటు వస్తాడుట. సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. భోజనం చేసే వస్తాం కనుక ఆ ఏర్పాట్లేవీ చేయ నవసరం లేదని , కావాలంటే సాయంత్రం ఏ నాలుగింటికో చెల్లెమ్మ ఓపిక ఉంటే కరకరలాడేలా ఏ పకోడీలో, ఘుఘుమలాడే బజ్జీలో చేస్తే సరిపోతుందని భరోసా యిచ్చేడు. వాడు మాఇంటికి వచ్చేటప్పుడు మెనూ వాడే నిర్ణయిస్తాడు. నా గుండెలో రాయి పడింది. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా అదే సమయానికి ఇండియా పాకిస్తాన్ లు ఆడే కీలకమైన వన్ డే క్రికెట్ మేచ్ ఉంది. పానకాల రావుకీ, వాడి పెళ్ళానికీ కూడా క్రికెట్ మోజు లేదు. అసలు వాళ్ళకి క్రికెట్ గురించి తెలుసో లేదో కూడా అనుమానమే. వాడి పిల్లలకి మాత్రం క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం, ఈ కాలపు పిల్లలు కదా. అయితే వాళ్ళు ఇల్లు తీసి పందిరేస్తారు. టీ.వీలో క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పుడయితే మరీనూ. వాళ్ళ అల్లరీ ఆగమూ అంతా యింతా కాదు. సచిన్ అవుటయితే ఆ కోపం సోఫా కవర్ల మీదో, పుస్తకాల షెల్ఫు మీదో చూపిస్తారు. లేదా టీ కప్పులు, కాఫీ కప్పులు నేల కేసి కొడతారు. తర్వాత తీరిగ్గా సారీ ఆంటీ, సారీ అంకుల్ అంటూ పళ్ళు యికిలిస్తారు. అసలు ఇలాంటి ఉపద్రవాలేవీ వాళ్ళ ఇంట్లో జరుగకుండా తప్పించు కోవడం కోసమే బుధవారం నాడు పానకాల రావు మా యింటికి వచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు కాబోలు. ద్రోహి. ఎంత కపటి ? ఎంత దురాలోచన ?

‘‘ లేదురా, ఈ బుధ వారం మేం ఇంట్లో ఉండడం లేదు. జరూరు పని మీద మా సొంతూరు వెళుతున్నాం ...’’ అంటూ ఓ అబద్ధం చెప్పి తప్పించు కోవాలని పానకాలుకి ఫోను చేద్దామని వాడి నంబరుకి రింగ్ చేసాను. వాడి సెల్ ఆఫ్ చేసి ఉంది. వాళ్ళావిడ నెంబరు కూడా కలవడం లేదు. నానుంచి ఈ రిప్లయ్ ఊహించేడో యేమో, ముందుగానే జాగ్రత్త పడుతున్నారల్లే ఉంది.

జావకారిపోయేం, నేనూ, మా ఆవిడానూ. ఇహ మా బుధ వారం ప్రోగ్రాం సర్వ నాశనమైపోయినట్టే.

ఇలా పనిమాలి పోసుకోలు కబర్ల కోసం వచ్చే వాళ్ళని ఎలా అదపు చేయాలో తెలియక సతమతమై పోతూ ఉంటాం. ఇలాంటి వాళ్ళ రాకని ఎలా కట్టడి చేయాలో సరైన సలహా చెబుతాడు కదా అని కథా మంజరి బ్లాగు నిర్వాహకుడికి ఓ మెయిలు పెట్టాను. విషయం అంతా వివరిస్తూ నా గోడు వెళ్ళ బోసుకున్నాను.

ఆ చాదస్తపు బ్రామ్మడు సలహా యివ్వక పోగా, అలా ఇంటి కొచ్చే వారిని అడ్డుకో కూడదనీ, అతిథి సేవాతత్పరత, దిబ్బా దిశిగుండం అంటూ నాకే ఓ చింకి లెక్చరు యిచ్చేడు.పైగా తన మాటలకు ఉపబలకంగా ఏవో సంస్కృత శ్లోకాలూ గట్రా కోట్ చేయడమొకటీనూ. నాకు ఎక్కడో మండింది.

ఆ చింకి లెక్చరు మీరూ వినండి మరి:

నా2భ్యత్థానక్రియా యత్ర, నా22లాసా మధురాక్షరా:
న చా2పి కుశల ప్రశ్న:, తత్ర్త హర్మ్యే న గమ్యతే.

ఎవడి గృహానికి వెళ్తే ఆ యింటి యజమాని లేచి, ఎదురేగి మంచి మాటలతో పలుకరించి, కుశలాదికాలు అడిగి ఆదరించడో అలాంటి వాడి ఇంటికి వెళ్ళ కూడదు.

ఇదీ శ్లోక భావంట. గాడిద గుడ్డేం కాదూ?

చింకి లెక్చర్లో మరి కొన్ని శ్లోకాలు కూడా చెప్పాడండోయ్

ఉత్తమస్యా2పి వర్ణస్య, నీచో2పి గృహమాగత:
పూజనీయో యథాయోగ్యం, సర్వదేవమయో2తిథి:

పెద్దింటి వాడింటికి చిన్నింటి వాడు వచ్చి నప్పటికీ వానిని యథోచితంగా సత్కరించి, భోజనాదులు సమకూర్చాలి. అతిథి సర్వ దేవమయుడని గుర్తుంచు కోవాలి.

గ్రాసాదపి తదర్ధేన, కస్మాన్నో దీయతే2ర్ధినే,
ఇచ్ఛానురూపో విభవ: కదా కస్య భవిష్యతి.

ఇంటికి వచ్చిన వాడికి ఆ పూట శ్రద్ధతో భోజనం పెట్టాలి. లేదా, తగినంత ధనమైనా యిచ్చి పంపించాలి. వాడే మరో చోట తింటాడు. ఎప్పుడో తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తాననడం వట్టి మాట.
తనకు కావలసినంత ధనం ఎప్పుడూ ఎవడి దగ్గరా ఉండడం చూడం కదా. అంచేత, ఎంతుంటే అంతా యిచ్చి పంపాలి.

న్యాయార్జిత ధనసత్త్వ, ఙ్ఞాననిష్ఠో2తిథి ప్రియ:
శాస్త్రవిత్ సత్యవాదీ వా, గృహస్థత్వే2పి ముచ్యతే.

న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించే వాడూ, తత్వ్త ఙ్ఞానం నందు శ్రద్ధ కలవాడూ, అతిథి అభ్యాగతులను ఆదరించి సేవించే వాడున్నూ, శాస్త్రఙ్ఞుడు, సత్యవ్రతుడు అయిన వాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ముక్తిని పొందుతాడు అని ధర్మ శాప్త్రాలు చెబుతున్నాయి.

దాతవ్య మన్నం విధివత్, సత్కృత్య నతు లీలయా
సర్వే వర్ణా యథా పూజాం, ప్రాప్నువంతి సుసత్కృతా:

ఆయా వర్ణముల వారికి యథోచితముగా సత్కరించి, విధివిహితంగా పూజించి అన్నం పెట్టాలి కాని, ఏదోలే అని, తేలిక భావంతో అన్నం పడవేయ కూడదు సుమా !

తృణాని భూమి రుదకం, వాక్చతుర్ధీ చ సూనృతా,
ఏతాన్యపి సతాం గేహే, నోచ్చిద్యంతే కదాచన

అతిథికి అన్నం పెట్టే శక్తి లేక పోయినప్పటికీ, ధార్మికుడైన గృహస్థుని యింట విశ్రమించే చోటు, దాహానికి మంచి తీర్ధం,నాలుగు మంచి మాటలు ... వీటికి లోటు చేయ కూడదు సుమీ.

అరాప్యుచితం కార్యం ఆతిథ్యం గృహ మాగతే
ఛేత్తు: పార్శ్వగతాం ఛాయాం, నోపసంహరతే ద్రుమ:

ఇంటికి వచ్చిన అతిథి, తన శత్రువయినా సరే, ఆతిథ్యం యిచ్చి గౌరవించాలి. నరకడానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనే ఇస్తోంది కదా.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంస భక్షణమ్.

అతిథి వాకిటిలో ఉండగా వాడిని విడిచి తాను మాత్రమే అన్నం తినడం మహా దోషం. అలాంటి వాడు పట్టిన ఆపోశనం మద్యపానం చేయడంతో సమానం. వాడు తినే అన్నం గోమాంసంతో సమానం.

బాలో వా యది వా వృద్ధో, యువా వా గృహమాగత:
తస్య పూజా విధాతవ్యా, సర్వస్యా2భ్యాగతో గురు:

ఇంటికి అతిథి, అభ్యాగతునిగా వచ్చిన వాడు బాలుడు కానీ, వృద్ధుడు కానీ - అలా వచ్చిన వాడు పూజనీయుడు. వాడిని పూజించ వలసినదే. అభ్యాగతులు గురువుల వలె అందరకీ ఆదరణీయులు.
అల్లసాని పెద్దన మను చరిత్రలో ప్రవరుని అతిధి సేవాతత్పరత గురించి చాలా విలువైన పద్యాలు రాసేడు.
ప్రవరుడు నిత్యం అతిధులూ, తీర్ధ సంవాసులూ వస్తున్నారని వింటే, ఎదురు వెళ్ళి ఇంటికి తీసుకుని వస్తాడుట. తెచ్చి, ఆతిధ్య మిస్తాడుట. ఇచ్చి వారిని సంతృప్తులుగా చేస్తాడుట. చేసి వారి చెంతనే కూర్చుని కుశలాలూ, వారి యాత్రా విశేషాలూ అడిగి మరీ తెలుసు కుంటాడుట. ఆ పిమ్మట, అయ్యో అవేవీ నేను చూడ లేక పోయానే అని విచారిస్తాడు !
‘‘ తీర్ధ సంవాసులేతెంచి నారని విన్న నెదురుగా నేగు దవ్వెంత యైన ’’ అనే పద్యం లో ఈ భోగట్టాలన్నీ పెద్దన చెప్పేడు.
వాళ్ళావిడ కూడా అంతేనుట ! ‘‘ వండ నలయదు వేవురు వచ్చి నేని ...’’
( ఏడిసినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. ఇలాగయితే మూణ్ణాళ్ళలో మన కొంప కొల్లేరు కాదూ ?! )

ఈ విధంగా కథా మంజరి వాడు అతిథి సేవను గురించి చాలా సేపు నాకు ఓ చింకి లెక్చరు యిచ్చి నా బుర్ర తినీసేడు.

చుట్టాల బాధని ఎలా వదిలించు కోవాలో చెప్పరా నాయనా అంటే చింకి లెక్చర్లతో మెదడు తినేసే
( మధ్యలో సంస్కృత శ్లోకాలూ, వాడి పిండాకూడూనూ) ఈ చాదస్తపు బ్లాగరెక్కడ దొరికాడురా బాబూ. ఇహ మీద వాడి కథా మంజరి బ్లాగు నేను చదవను గాక చదవను.

మీరు కూడా చదవొద్దు. ఏం ?!


26, ఫిబ్రవరి 2015, గురువారం

అవునా ! అదన్నమాట సంగతి !


మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసు కోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని చూడండి:
ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:
ధర్మో రక్షతి రక్షిత:
సత్య మేవ జయతే
అహింసా పరమో2ధర్మ:
ధనమూల మిదం జగత్
జననీ జన్మ భూమిశ్చ
 స్వర్గాదపి గరీయసి
కృషితో నాస్తి దుర్భిక్షమ్
బ్రాహ్మణానా మనేకత్వం
యథా రాజా తథా ప్రజా
పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
శత శ్లోకేన పండిత:
శతం విహాయ భోక్తవ్యం
అతి సర్వత్ర వర్జయేత్
బుద్ధి: కర్మానుసారిణీ
వినాశ కాలే విపరీత బుద్ధి:
భార్యా రూప వతీ శత్రు:
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:
వృద్ధ నారీ పతి వ్రతా
అతి వినయం ధూర్త లక్షణమ్
ఆలస్యం అమృతం విషమ్
దండం దశ గుణం భవేత్
ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?
ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?
ధర్మ ఏవో హతో హంతి
ధర్మో రక్షతి రక్షిత:
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.
 చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్
 ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

పుస్తకం, ఆడుది , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ.

శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్

విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

అప్పుడు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !
ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.
వీటిలో స్త్రీల విషయమై చెప్పిన వాటి విషయమై నాకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కాని. పూర్వులు చెప్పిన దానిని మార్చ రాదు కనుక , యథాతథంగా ఇచ్చాను. స్త్రీవాదులు కినక వహించకుందురు గాక !

స్వస్తి.

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

సారీ, గురూ !


మా తింగరి బుచ్చి గాడు మీకు గుర్తున్నాడు కదూ!
వీడు రెండో తరగతి రెండుసార్లు చదివి ‘ ఇహ మనకీ చదువులు వంట బట్టవు కానీ ’ అనుకోని వదిలేసాడు. ఆ తర్వాత తన నేస్తులయిన బడి గుంటలంతా పాస్ పీస్ మంటూ ఏవో ఇంగిలిపీసు ముక్కలు మాట్లాడేస్తూ ఉండడంతో తనూ ఓ నాలుగు ఇంగిలీసు ముక్కలు నేర్చుకోవాలను కున్నాడు. ముందుగా ఓ రెండింటిని ఒంట పట్టించు కున్నాడు.
అవి : 1. టాంక్యూ
2. షారీ ! ...
వాడు వాటిని అలాగే పలుకుతాడు. అవేమిటో మీకు నేను చెప్పనక్కర లేదు. ఈ రెండూ నేర్చుకొన్న కొత్తలో ఏది ఎప్పుడు వాడాలో తెలియక తెగ తికమక పడి పోతూ ఉండే వాడు. దానికిదీ, దీనికదీ వాడేస్తూ ఉండే వాడు. అలవాటయ్యే సరికి వారం పది రోజులు పట్టింది.
సరే, టాంక్యూ సంగతి అలా ఉంచితే వాడు షారీ పదం నేర్చుకొన్న కొత్తలో ఆ మోజు కొద్దీ దాన్ని ప్రయోగించడానికి తగిన పరిస్థితులను తానే కల్పించుకొనే వాడు.
సినిమా హాళ్ళలో, ఇంటర్వెల్ అయ్యాక తిరిగి షో మొదలయ్యే వేళ, చీకట్లో కావాలనే కుర్చీలలో కూర్చునే వారి కాళ్ళు
తొక్కి ‘ షారీ ’ ! అని పళ్ళికిలించే వాడు. ఈ సరదా ఒక్కో సారి వికటించి, ‘‘ ఎవడ్రా నువ్వూ ’’తో మొదలై తిట్ల దండకాలతోనూ, ఒక్కోతూరి గూబ గుయ్యి మనిపించడాలతోనూ ముగిసేది. మూడు తిట్లూ, ఆరు చెంప కాయలతో వాడికా పదం బాగా వంటబట్టింది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకో లేదు వాడు.
మనలో చాలా మంది ఈ సారీ పదం అలవోకగా వాడేస్తూ ఉంటాం. అడుసు తొక్క నేల ? కాలు కడుగ నేల ? అని కూడా చూసు కోం.
అండగా సారీ అనే దిక్కుమాలిన పదం ఒకటుండగా
ఆలోచించి పని చెయ్యడ మెందుకు దండగా ! ... అనుకొంటూ ఉంటాం, కాస్త కవితాత్మకంగా.
మన పూజా విధానంలోనూ, మనం పలికే మంత్రంలోనో, చేసే పూజలోనో, అసలు మన భక్తిలోనో ఏమేనా పొరపాట్లూ గట్రా ఉంటే దేవుళ్ళకు సారీ చెప్పేసే సుళువు ఒకటి మన వాళ్ళు పొందు పరిచే ఉంచారు.
మీ తెలిసినదే కదా.
వినాయక పూజ చేస్తున్నామనుకోండి, చివరలో
మంత్రహీనం, క్రియాహీనం, భక్తి హీనం గణాధిప:
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.
అని లెంపలు వాయించు కోవాలి. ఎలాగూ సారీ చెప్పేస్తున్నాం కదా అని భక్తిలో కానీ, పూజా విధానంలో కానీ, మంత్రంలో కానీ బుద్ధి పూర్వకంగా పొరపాటు చేయ కూడదు. అలాగే ఏమరుపాటూ తగదు. కళ్ళు పోతాయ్.
అసలు సారీ చెప్పు కోవాల్సిన పరిస్థితి తెచ్చు కోవడమే తప్పయితే, అలా చెప్పే సారీని కూడా కుర్రకారు కొంతమంది
మరీ విడ్డూరంగా, యాదాలాపంగా, నిర్లక్ష్యంగా , తలపొగరుగా కూడా చెబుతూ ఉండడం కద్దు. అదే -
సారీ గురూ ! ఇది మరింత దిక్కు మాలిన పదం.
సారీ ! డాడ్ .. సారీ మమ్మీ .. మీకు ముందుగా చెప్పే వీలు లేక పోయింది .. ఈమె మీ కోడలు ! అని వొకానొక రోజున అథాట్టుగా బాంబు పేల్చి నట్టుగా చెప్పే పుత్ర రత్నాలూ ...
నీ చేత గొడ్డు చాకిరీ చేయించు కుని, నీ ఆశల మీద నీళ్ళు కుమ్మరించేస్తూ, ‘‘ సారీ, నీకు ఇంక్రిమెంటు ఇవ్వడం కుదరదు’’ అని చెప్పే ఆఫీసర్లూ ...
‘‘ మీ రచన బావుంది. కానీ సారీ మేం వేసుకో లేం’’ అని చెప్పే సంపాదకులూ ...
ఏ గంటన్నర సేపో శ్రమ తీసుకుని ముస్తాబై కూర్చుంటే, ‘‘ సారీరా ! ఇవాళ వేగిరం రావడం కుదరదు. సినిమాకి రేపు వెళదాంలే’’ అని ఫోను చేసే భర్తలూ ...
ఇలా ఈ సారీ అనే పదం చాలా తేలిగ్గా వాడేసుకో గలిగే పదం.
 
ఇక,
మన ప్రాచీన కవులకు కవిత్వం పట్ల, ఛందస్సు పట్ల , అసలు అక్షరం పట్ల ఎంత విధేయత ఉండేదో చూడండి :
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో2స్తుతే.
ఎక్కడయినా అక్షర స్ఖలనం జరిగినా, అంటే అక్షర దోషం కలిగినా, ఛందోభంగం వచ్చినా, లేదా మరే దోషాలు నా కవిత్వంలో ఉన్నా, ఓ అక్షర మూర్తీ ! వాటిని అన్నింటినీ మన్నించు తండ్రీ ! నారాయణుడవైన నీకిదే నా నమస్కారం !
ఇంత భక్తీ, నిబద్ధతా ఉండబట్టే వారు మహా కవులయ్యారు. ఋషులయ్యారు. నానృతి: కురుతే కావ్యమ్ కదా.
పొరపాటు చేసినా క్షమించమని అడగడంలో ఇంత ఉదాత్తత చూపించాలి. ఇంత విధేయత కనబరచాలి.
అంతే కానీ, సారీ గురూ ! అనేస్తే చాలనుకో కూడదు. ఇదే నేను చెప్ప దలచినది.
నేను చెప్ప దలచిన దానిని అర్ధమయ్యేలా సరిగా చెప్ప లేదనిపిస్తోందా. కథా మంజరి ( ఏకైక నస బ్లాగు ) తరఫున,
సారీ, గురూ !


22, ఫిబ్రవరి 2015, ఆదివారం

తిడితే తిట్టే నంటారు, కానీ, బ్రహ్మయ్యకి బుద్ధుందా చెప్పండి ?!


అవున్నిజఁవే ! బ్రహ్మ దేవుడ్ని తిట్ట కూడదు. ! తప్పు. కళ్ళు పోతాయ్ !  లెంపలు వాయించుకో ... కానీ, అతడు చేసే తింగరి పనులకు ఒక్కోసారి శతక కవి థూర్జటి style లో తిట్టాలనిపిస్తుంది. కదూ !
లేక పోతే ఏఁవిటి చెప్పండి ?
అష్టైశ్వర్యాలూ ప్రసాదిస్తాడు. అజీర్తి రోగం పట్టు కునేలా ఆశీర్వదిస్తాడు.
సకల విద్యాపారంగతునివి కమ్మని చెబుతాడు. అష్ట దరిద్రాలూ అనుభవించు పొమ్మంటాడు.
అందమైన మనోహర రూపం ప్రసాదిస్తాడు. అలవి మాలిన అహంకారాన్నీ, అఙ్ఞానాన్నీ అంట గడతాడు.
ఏ టీ ఎమ్ సెంటర్లో ఏ.సీ ఉండి, అది పని చేస్తూ, ఏ టీ ఎమ్ మాత్రం పని చేయ నట్టుగానూ ...
రైల్ లో బెర్తు కన్ ఫరమ్ అయిన కులాసాలో మనం ఉండగా రైలే రద్దయే పరిస్థితి కలిగినట్టుగానూ ...
నువ్వు పో గొట్టు కొన్న నీ పర్సులో వేలాది రూపాయలు ఉండడమూ, నీకు దొరికిన ఎవడో తల మాసిన వాడి పర్సులో చిల్లర నాణేలు మాత్రమే ఉండడమూ ...
కష్టపడి నువ్వు నానా గడ్డీ కరచి, నానా పుర్రాకులూ పడి ఎన్నికల్లో నెగ్గితే, నీ పార్టీ ప్రతి పక్ష హోదాకి కూడా నోచుకోకుండా గల్లంతయినట్టుగానూ  చమత్కారం చేస్తాడు !
నీ అందమయిన పెళ్ళానికి అణకువ తక్కువ చేస్తాడు.
నీ ఐశ్వర్యవంతుడయిన మొగుడికి మంకు తనం అలవిమాలినంత ఇచ్చి, వేధించుకు తినమంటాడు, వేథ !
నీబీటెక్ కొడుక్కి తాసీల్దారు ఆఫీసులో గుమస్తా ఉద్యోగం వేయిస్తాడు.
వాడి ఏడో తరగతి ఫెయిల్డ్ ముద్దుల బిడ్డకి వ్యాపారంలో పిచ్చ పిచ్చగా చక్రం త్రిప్పే నేర్పు ప్రసాదిస్తాడు.
ఎదురింటి వాడింట్లో కరెంటు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటే, నువ్వు చీకట్లో తచ్చాడాల్సిన స్థితిని కల్పిస్తాడు, ఇద్దరి కనెక్షనూ ఒకే స్తంభం నుండే వచ్చినా !
నువ్వు కాపీ కొట్టిన ముందు వరుస రుర్రాడు అన్నీ తప్పుడు జవాబులే బరబరా రాసి పారేస్తాడు. వెర్రి బకరావై దాన్నే కాపీ కొట్టి. బొక్కబోర్లా పడతావు !

 ఎందుకు లెండి . చెబితే చేంతాడంత. వాడు చేసే తిక్క పనులు అన్నీ ఇన్నీ కావు.
ఈ శ్లోకం చూడండి :
యాత: క్ష్మామఖిలాం ప్రదాయ హరయే పాతాల మూలం బలి:
సక్తుప్రస్థవిసర్జనాత్ స చ ముని: స్వర్గం సమారోపిత:
ఆబాల్యా దసతీ సురపురీం కుంతీ సమారోహయత్
హా ! సీతా పతి దేవతా2గమదధో ధర్మస్య సూక్ష్మా గతి:
దీని అర్ధం ఏమిటంటే,
వామనుడు మూడడుగుల నేల దానం ఇమ్మని బలిని కోరాడు. ముందూ వెనుకా చూసు కోకుండా సరే ఇస్తున్నా పట్టు అన్నాడు మహా దాత బలి. అప్పటికీ రాక్షస గురువు శుక్రాచార్యడు వద్దు సుమీ, దుంప నాశనమై పోతావ్ ! అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ బలి విన లేదు ! అంత గొప్ప దానాన్ని చేసిన బలికి ఏం జరిగింది ?
పాతాళానికి పోయేడు !
సక్తుప్రస్థుడు అనే ఒక ముని కొద్దిపాటి పేల పిండిని ఎవడికో పెట్టాడు. వానికి స్వర్గం లభించింది !
వివాహం కాకుండానే తల్లి అయిన కుంతికి స్వర్గం లభించింది.
పరమ పతివ్రత అయిన సీతా దేవి మాత్రం భూగర్భంలో పడిపోయింది. ఆహా ! ధర్మం నడక ఎంత సూక్ష్మమైనదో కదా !
ఇదీ శ్లోక భావం.
అలారాసి పెట్టి ఉంది మరి అనుకుంటాం. కానీ అలా రాసిన వాడిని థూర్జటి కవిలాగా తిట్ట కూడ దంటూనే తిట్టే సాహసం చెయ్యం !
ఇంతకీ థూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో వేథను ఎలా తిట్టాడో కాస్త చూదామా ?
వేథం దిట్టగ రాదు గాని భువిలో విద్వాంసులం జేయనే
లా ? థీ చాతురిం జేసినన్ యటుల రా బాటంచు నేఁ బోక క్షు
ద్భా దాదుల్ కలిగింప నేల ? యది కృత్యంబైన దుర్మార్గులం
యీ ధాత్రీశుల చేయ నేటి కకటా ! శ్రీకాళ హస్తీశ్వరా !
దీని భావం:
ఓ శ్రీకాళహస్తీశ్వరా ! బ్రహ్మ దేవుడిని తిట్ట కూడదు. కానీ, లేక పోతే, మమ్మల్ని పండితులు గానూ, కవులుగానూ పుట్టించడం ఎందుకు ? పోనీ, తన బుద్ధి నేర్పరితనం వల్ల అలా చేసేడే అను కుందాం. ఆ పాండిత్యం వలన కలిగిన ఙ్ఞానంతో మిమ్ములను సేవించు కుంటూ, ఆ మార్గంలో నడవనీయ కుండా మాకు ఆకలి దప్పులు ఎందుకు పెట్టాడయ్యా
మాకుండే ఆ బాధలను ఆసరాగా చేసుకొని, తమ చుట్టూ తిరిగేలా చేసుకొంటున్న ఈ దుర్మార్గులయిన రాజులను ఎందుకు పుట్టించాడయ్యా !
ఈ ఆకలి బాధలూ, సంసార జంఝాటాలూ లేకుండా ఉంటే, ఓ దేవా ! నీవు మాకు ప్రసాదించిన పాండిత్యంతో , దాని వలన కలిగిన మంచి ఙ్ఞానంతో సదా మిమ్ములనే సేవించు కుంటూ ఉండే వారము కదా !
(తిక్కలోడివి కాక పోతే, మాకు మంచి పాండిత్యం ఇవ్వడ మెందుకు ? దానిని మీ కోసం వినియోగించ కుండా రాజులను ఆశ్రయిస్తూ దేబిరించడ మెందుకూ ? అలా దేబిరించడానికి కారణభూత మయిన ఆకలిదప్పులను మాకు ఇవ్వడ మెందుకూ ? వాటిని ఆసరాగా చేసు కొని మా బలహీనతలనూ, దీనత్వాన్నీ ఆసరాగా చేసుకొని మమ్ములను తమ చుట్టూ తిప్పుకొని రాక్షసానందం పొందే ఈ దుర్మార్గులయిన రాజులను పుట్టించడమెందుకూ ! )
గూగులమ్మ ఉచితంగా బ్లాగులు పెట్టుకోండని అనడ మెందుకూ ?  ఈ కథా మంజరి బ్లాగరు పనీపాటా లేకుండా చేతికొచ్చిన రాతలు రాయడ మెందుకూ ?
లలాట లేఖో న పున: ప్రయాతి.
తల రాత మార్చ లేం కదా.

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

తమాషాగా లేదూ ?!

అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !
వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని పట్టు కోవచ్చును.
విజయ విలాసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆకాశంలో ఉండే చంద్రుడు తన దారంట తానుపోతూ ఆ మేడల కిటికీల గుండా పయనిస్తూ అవతలి వేపుకి పోతూ ఉంటాడుట. ఆ నగరు లోని రాణి వాసపు అమ్మాయిలకు ఆ చందమామ లోని కుందేలుని పట్టు కోవాలని కోరిక. కుందేలుని ధరిస్తాడనే కదా చంద్రుడికి శశాంకుడు అని పేరు కలిగింది. పూర్ణ శశాంకుడు అంటే నిండు చందమామ. సరే ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం !
మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం.
ఇలాంటిదే అర చేతిలో ఉసిరి కాయ అని కూడా ఒక జాతీయం ఉంది. దీన్ని సంస్కృతీకరిస్తే కరతలామలకం అవుతుంది. అర చేతిలో ఉసిరి కాయని ఎప్పుడేనా గుటకాయ స్వాహా అనిపించొచ్చును కదా !
ఇదంతా ఎందుకు చెబు తున్నా నంటే,
మనకి లభ్యమాన మయేదాని పట్ల అంతగా ఆసక్తిని చూపించం. చిన్న పిల్లాడు తన చేతిలో తాయిలం ఉంచుకుని,ఎదుటి వాడి చేతి లోని తాయిలాన్ని చూడడం లాంటి దన్నమాట.
మరి,కాక పోతే ఏమిటి చెప్పండి ?
మా స్వస్థలానికి అరకు లోని బొర్రా గుహలూ, హైదరాబాద్ కి బెల్లుమ్ గుహలూ
కొంచెం అటూ యిటూగా దాదాపు సమాన దూరంలో ఉన్నాయి.
మా స్వగ్రామం పార్వతీ పురం లోనూ,పని చేసి పదవీ విరమణ చేసిన విజయ నగరం లోనూ దగ్గర దగ్గర అరవై యేళ్ళ వరకూ గడిపానా ? దగ్గర లో ఉన్న బొర్రా గుహలు చూడనే లేదు !
అలాగే, ఉద్యోగ విరమణానంతరం భాగ్య నగరంలో నాలుగున్నరేళ్ళు గడిపానా ?బెల్లుమ్ గుహలు చూడనే లేదు.
నివాసం హైదరాబాద్ మార్చేక ,ఇహ లాభం లేదని మావేపు వచ్చి,అరకు లోని బొర్రా గుహలు చూసాము. అలాగే, హైదరాబాద్ వదలి ఇటీవల తిరిగి విజయ నగరం మకాం మార్చేసాక, మరో పని మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి బెల్లుమ్ గుహలు చూసాము.
అంటే ఏమన్నమాటా ?. వొళ్ళు బద్ధకం. చూదాంలే అనే నిర్లిప్త ధోరణి. చూసేం కనుక సరి పోయింది. లేక పోతే ఎన్ని అందాలు చూసే అదృష్టాన్ని పోగొట్టు కునే వాళ్ళమో కదా !
అందు చేత,నేను అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, దూరభారాలలో ఉండే వింతలనీ,చూడ తగిన ప్రదేశాలనీ చూడండి. ఆ అవకాశం లేక పోతే,కనీసం దగ్గరలో ఉన్న వాటిని వాయిదాలు వేయకుండా వెంటనే చూడండి. తర్వాత చూద్దాంలే అనుకుంటే చాలా కోల్ప,ఎలాగయితే నేం బెల్లుమ్ గుహలు చూశాం అన్నాను కదా ! వాటిని గురించి కొద్దిగా పరిచయం చేయడమే ఈ టపా ముఖ్యోద్దేశం.
బిలం అనే సంస్కృత పదానికి రంధ్రం లేదా కన్నం అని అర్ధం కదా. జనబాహుళ్యం నోటబడి అదే క్రమంగా బెల్లుమ్ గా ఈ గుహలు మన రాష్ట్రం లోని నంద్యాల పట్టణానికి 60 కి,మీ దూరం లోనూ,కర్నూలుకి 105 కి.మీ దూరం లోనూ. తాడిపత్రికి కేవలం 30కి.మీ దూరంలోనూ ఉన్నాయి !
ఆసియా ఖండంలో పొడవైన గుహలలో ఇది రెండోది మాత్రమే.దీనిని మొదటి సారిగా ఒక బ్రిటిష్ సర్వేయరు 1884 లో చూసాడుట. రాబర్ట్ అతని పేరు. తర్వాత 1982 – 84 ల మధ్య ఒక జర్మనీ దేశ బృందం దీనిని చూసిందిఈ గుహలు 1988 లో మన పర్యాటక శాఖ కంట పడడం దానిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ది,
























ఎలాగయితేనేం,2002 నుండి పర్యాటకులను అనుమతించడం జరుగుతోంది ...
3.5 కి.మీ పొడవైన ఈ గుహలు ప్రస్తుతం 1.5 కి.మీదూరం వరకూ మాత్రమే చూడడానికి అవకాశం ఉంది.
ఈ గుహలు మానవ నిర్మితాలు కావు కదా. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటి కోత చేత,గాలి కోత చేత ఏర్పడిన పొడవైన అందమైన గుహలు యివి !
ఒక మోస్తరు కన్నం లోనుండి ప్రవేశించి ( మొదటి ఫొటో చూడండి.. )విశాలమైన బిలం లోకి నడుచు కుంటూ పోవడం నిజంగా ఒక మధురానుభూతి అనే చెప్పాలి ! విద్యద్దీపాలు అక్కడక్కడా ఉంచేరు కనుక సరి పోయింది కానీ,లేక పోతే గాడాంధకారమే !
ఇలా అన్నానని భయపడే పని లేదు. ఆ మాట టూరిజం వాళ్ళు ముందే చెప్పి తగిన భరోసా యిచ్చేరు. సైన్ బోర్డులు పెట్టి. కరెంటు పోతే ఎక్కడి వారు అక్కడే ఓ క్షణం నిలుచుండి పోతే సరి,జెనరేటరుతో వెల్తురు వస్తుంది. మరేం భయం లేదు.
గుహలలో చాలా చోట్ల కొంచెం దూరంలో కనబడే విద్ద్యుద్దీపాల కాంతులు మనకి మండే అగ్ని గోళాలలా కనిపిస్తాయి !
( ఫొటోలు చూడండి )
విశాలమైన ప్రాంగణాలూ,అక్కడ క్కడా ఇరుకైన తావులూ,నీటి ధారలూ ... ఓహ్ !
చెప్పడానికి మాటలు రావు ! వెళ్ళగా వెళ్ళగా ఎక్కడో చివర పెద్ద జలధార కనిపించడం చూసి మతి పోతుంది !
పాతాళ గంగ అని దానికి పేరు. అంతే,అక్కడితో సరి. మరింక మనం ముదుంకి వెళ్ళేది లేదు. గుహలు మాత్రం ఇంకా చాలా పొడవుగా ఉన్నాయి. మనకి అనుమతి అంత వరకూ మాత్రమే. అదే చాల్లెండి. అప్పటికే ఒకటిన్నర కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి ఉన్నాం. తిరిగి ఏదారిని వెళ్ళామో,అదే దారిని తిరిగి నడుచుకుంటూ బయటికి వస్తాం. బయటి కొచ్చేక ఒక్క సారిగా బాహ్య ప్రపంచం కనిపించి పులకించి పోతాం ! ఎక్కడో పాతాళం లోకాస్సేపు గడిపి వచ్చిన అనుభూతి కలుగుతుంది మనకి !
ఇంతకీ అంత దూరం గుహలలో నడిచామా ?మనం తిరుగుతున్న గుహల పైకప్పు మీద అంతా మామ్మూలే. జన సంచారమూ,వాహనాల రాకపోకలూ,అన్నీ ఉంటాయని తెలుసు కుంటే ... తమాషాగా లేదూ ?!







17, ఫిబ్రవరి 2015, మంగళవారం

గాడిదల కథా కమామీషూ ... !


కుక్కలు విశ్వాసానికీ, గాడిదలు సహనానికీ పెట్టింది పేరు.
కాకుల గురించి కాకి గోల ( ఇక్కడ నొక్కి ఆ కాకి గోల భరించండి) అనే టపా రాస్తూ త్వరలో గాడిదల గురించి కూడా
ఓ టపా పెడతానని చెప్పాను కదా.
ఇప్పుడు గాడిదల గురించి రాయడం మానుకుంటే ‘ మాట తప్పేడురా గాడిద కొడుకు ! ’ అని ఎవరు తిడతారో అనే భయంతో ఇది పెడుతున్నాను.
మా చిన్నప్పుడు ఆవకాయలు పెట్టే రోజున మామిడి టెంకలనూ,జీళ్ళనూ చేజిక్కించుకుని గోడలన్నీ ‘‘ దడిగాడు వాన సిరా’’ లాంటి వ్రాతలతో ఖరాబు చేసే వాళ్ళం. ‘‘ గోడలు పాడు చేసిన గాడిద ఎవర్రా ?! అని పెద్దాళ్ళతో తిట్లు తినే వాళ్ళం.
ఇప్పుడు పెద్దయ్యాక, ఖరీదయిన పెయింట్లు తిరిగి వేయించుకో లేక, చాపల్యం చావక కాబోలు, అలాంటి అడ్డమయిన రాతలూ బ్లాగుల్లోనూ, ముఖ పుస్తకాలలోనూ రాయడం మొదలు పెట్టాం.
సరే, మరి గాడిదల కథా కమామీషూ కాస్త చూడండి ...
‘ ఖర’ నామ సంవత్సరం గురించి కథా మంజరి తెగ గర్విస్తోంది.
గాడిదకు చాలా పేర్లుఉన్నాయి. చక్రీవంతం,బాలేయం, రాసభం,గర్ధబం, గార్ధభం,గాడ్ద, ఖరం, గాలిగాడు ... ఇలా.
ఏ పేరుతో పిలిచినా ఓండ్ర పెడుతూ పలుకుతుంది కనుక అందరకీ తెలిసిన గాడిద అని పిలుచుకుంటేనే సుఖంగా ఉంటుంది.
రామాయణంలో ఖర దూషణలు అనే ఇద్దరు రాక్షసులు కనిపిస్తారు. ఇద్దరూ అన్న దమ్ములు. రావణుని చెల్లెలు శూర్ఫణఖ దండకారణ్యంలో ఉన్న శ్రీరాముని మీద మనసు రాక్షసంగా పారేసుకుంది. లక్ష్మణుడు దాని ముక్కు చెవులూ కోసి తరిమేసాడు. అది వెళ్ళి ఈ అన్నదమ్ములిద్దరికీ తన గోడు చెప్పుకుంది. ఈ అడ్డగాడిద లిద్దరూ రామునిపైకి దండెత్తి, అతని చేతిలో చచ్చారు.

భాగవతంలో గార్ధభాసురుడు అనే వాడు కనిపిస్తాడు. వీడూ రాక్షసుడే. వీడు బలరాముని చేతిలో హతుడయ్యాడు.
ఇక, దేవకీ వసు దేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు పుడితే , కసంసుడిపాల బడకుండా వసు దేవుడు ఆ పసివాడిని గంపలో పెట్టుకొని యమునానది దాటి వ్రేపల్లెకు చేరి యశోదమ్మ ప్రక్కన ఉంచి ఆమె కన్న ఆడశిశువును తనతో నిరాటంకంగా తెచ్చుకొన్నాడు. విష్ణుమాయ చేత ఆ పనిలో అతనికి ఎలాంటి ఆటంకాలూ ఎదురు కాలేదు. కానీ
దారిలో ఒక గాడిద మాత్రం రహస్య భేదనం జరిగేలా ఓండ్ర పెట్టింది. ఓండ్ర శబ్దంలో ఓం కారం ఉంది కనుక తన అరుపు
ఓంకారనాదం అనుకుందేమో పిచ్చి ముండ ! శాంతం పాపం ! శాంతం పాపం!
ఇహ లాభం లేదని, వసు దేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకో వలసి వచ్చింది.
గాడిద ముఖం కలిగిన దేవుళ్ళూ, దేవగణాల వాళ్ళూ ఉన్నారంటే ఈ చతుష్పాది ఎంత మహిమ కలదో వేరే చెప్ప నక్కర లేదు.
ఇవి గాడిదల ప్రస్తావన ఉన్న పురాణ కథలు కాగా, గాడిదల గురించిన నీతి కథలు అనేకం ఉన్నాయి.
అందరికీ తెలిసిన ప్రముఖమైన కథ ఇది:
ఒక చాకలి ఇంట కుక్క గాడిద ఉండేవి. కుక్క అతని ఇంటిని కాపలా కాస్తూ ఉంటే, గాడిద బరువులు మోసేది. తనెంత విశ్వాసంగా ఉన్నా ఇంటి యజమాని తనని సరిగా చూడడం లేదని కుక్కకి కోపం వచ్చింది. ఇక వాడి పట్ల విశ్వాసంగా ఉండ కూడదని భౌ భౌ తీర్మానం ఒకటి ఆత్మగతంగా చేసుకొంది. ఓ రాత్రి యజమాని ఇంట దొంగలు పడ్డారు. సహాయ నిరాకరణకు పూనుకొన్న కుక్క దొంగను చూసి కూడా మొరగడంమానేసింది. గాడిద కంగారు పడి కుక్కను హెచ్చరించింది. కుక్క ససేమిరా అని మొరగడానికి నిరాకరించింది. అయ్యో యజమాని, పాపం, అనుకుంటూ దొంగలొచ్చారని యజమానికి తెలియ జేయడం కోసం గాడిద ఓండ్ర పెట్టింది. చాకలి లేచాడు. నిద్రాభంగమయినందుకు కోపంతో దుడ్డు కర్రతో గాడిదను చావ మోదాడు ! ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకో కూడదని చెప్పే నీతి కథ ఇది.
గాడిదల గురించి కొన్ని జాతీయాలూ, సామెతలూ కూడా చూదాం:

గాడిద గత్తర
గాడిద పిల్ల కోమలం
గాడిద పుండుకి బూడిద మందు
గాడిద కేం తెలుసు గంధం వాసన
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట.
పనీ పాటా లేని అడ్డ గాడిద
యజమానికి ఎదుటా, గాడిదకు వెనుకా ఉండ రాదు.
గాడిద గుడ్డు
గాడిద గుడ్డూ గరుడ స్తంభం
గాడిదతో చెలిమి కాలి తాపులకే
గాడిదల మోత, గుర్రాల మేత
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్య పడితే, ఒంటె అందం చూసి గాడిద మూర్ఛ పోయిందిట !
అందానికి లొటిపిటా, పాటకి  గాడిదా అంటూ కన్యా శుల్కంలో  ఉత్తరం చదివే ఘట్టంలోమధుర వాణి విరగబడి నవ్వడం గుర్తుందా ?
పూర్వం యుద్ధాలలో గజ సైన్యం, ఆశ్విక సేన వగైరాలు ఉండేవి. గాడిదల సేనలు ఉండేవో లేదో తెలియదు. రాజ్య కాంక్షతో యుద్ధాలు చేసే రాజులే ఎలాగూ గాడిదలు కనుక వేరే గాడిదల సేన ఉండే అవసరం లేక పోయి ఉండ వచ్చును.
కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులూ, లుబ్ధావధానులూ పరస్పరం త్వం శుంఠా అంటే త్వం శుంఠా ! అనీ,
గాడిదా ! అంటే అడ్డగాడిదా !అనీ ఒకరినొకరు ముచ్చటగా తిట్టుకునే వారు.
మరి గాడిద ప్రస్తావన గల కొన్ని పద్యాలు కూడా చూదామా ?
గాడిదల గురించిన చక్కని చాటువు చూడండి:
రేరే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిమ్ ?
రాజా శ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్ !
సర్వా పుచ్ఛవతో హయమితి వదంత్య త్రాధికారే ప్థితౌ
రాజా తై రుపదిష్టమేవ మనుతేన్ సత్యం తటస్థాపరే:

దీని అర్ధం : ఓ గాడిదా ! బట్టలు మోస్తూ గ్రామాలు తిరుగుతూ శ్రమ పడతావెందుకు ? హాయిగా రాజు గారి గుర్రాల శాలకు పోయి అక్కడ గుర్రాలతో పాటు గుగ్గిళ్ళు తింటూ గడుపు. తోక లున్నవన్నీ గుర్రాలే నని అక్కడి అధికారు లంటారులే. రాజు కూడా గుడ్డిగా ఆ మాట నమ్ముతాడు !
చవట గాడిదలన తగిన రాజుల గురించీ, అధికారుల గురించీ ఈ సంస్కృత చాటువు వివరిస్తే, శ్రీనాథుని తెలుగు చాటువు కూడా చూడండి మరి:

బూడిద బంగలై యొడలు పోడిమి దప్పి మొగంబు వెల్ల నై
వాడల వాడలం దిరిగి వచ్చెడు వారల ’’ చొచ్చొచో ‘‘ యనన్
గోడల గొందులం దొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో
గాడిద ! నీవునుం దొదిగి కవివి కావు కదా ! యనుమాన మయ్యెడున్ !
బూడిద రంగులో ఒళ్ళంతా కళావిహీనమై, పాలి పోయిన ముఖంతో, వీధీ వీధీ తిరుగుతూ, వచ్చీ పోయే వారు అదిలిస్తూ ఉంటే గోడల వెనుకా. సందుగొందలలోనూ ఒదిగి పోతూ ఓండ్ర పెడుతూ ఉంటావు. ఓ గాడిదా ! నాకు అనుమానం కలుగుతోంది. ఈ కొండవీటిలో నువ్వు కూడా ఒక కవివి కాదు కదా !

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివిడైనను నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ !

గంగి గోవు పాలు చిన్న గరిటెడు చాలు. కడివెడు గాడిద పాలు ఎందుకని వేమన సభక్తికంగా పెట్టే అన్నం ఏ కొద్దిపాటి అయినా చాలును అని చెప్పడానికి మధ్యన పాపం గాడిదను లాక్కుని వచ్చాడు. గాడిద పాలకి ఉన్న విలువ గురించి సైన్సు చెప్పని రోజులవి.
కవి చౌడప్ప గాడిదనూ వదల లేదు. అతడివే మూడు పద్యాలు చూడండి:
వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా కుందవరపు కవి చౌడప్పా.
కవిత్వాన్ని మెచ్చు కుంటూ ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ అవహేళన చేస్తూ, అవమాన పరిచే తుంటరి వాడు గాడిద.
ఆడిన మాటలు తప్పిన
గాడిద కొడు కంచు తిట్టగా విని మదిలో
వీడా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవి చౌడప్పా.
పలికిన మాటను మరిచే అబద్ధాలకోరును గాడిదా అని ఒక తండ్రి ఎవడో తిడితే, ఇలాంటి వాడా నా కొడుకు ! ఛీ ! అని గాడిద కూడా ఏడిచిందిట.
గాడీపాలకి గలగిన
వాడయితేనేమి కవుల వంచించిన యా
గాడిద కొడుకును దిట్టగ
గాదా మరి కుంద వరపు కవి చౌడప్పా.
పెద్ద పెద్ద వాహనాలు, పల్లకీలు ఉంటే మాత్రం ఏం ? కవులను మోసగించే వాడు గాడిద కొడుకు ! వాడిని తిడితే ఏం తప్పు కనుక ? పిరదౌసిని మోసగించిన సుల్తాను ప్రభువు గాడిదే కదా ?
వెనుకటి రోజులలో సార్ధవాహులు తమ ప్రయాణాలలో ఎడ్లబళ్ళూ, గుర్రాలూ , మూటలూ అవీ మోయడానికి గాడిదలనూ వినియోగించే వారన్నది తెలిసిన విషయమే కదా.
గోపాల కృష్ణ రావు గారు చెప్పిన సాలూరి గాడిదల మీది పద్యం కూడా చూడండి మరి ..
గాడిద సాలూరు విడచి
ఏడకొ పోయేనటంచు నెంచకు బ్రదరూ
ఏడకు పోలే దదియును
ఈడనె పాల్టిక్సులోన ఎదిగెను మంత్రై!!
వొకప్పుడు సాలూరులో గాడిదలు ఎక్కువగా ఉండేవిట.అవన్నీ ఎక్కడకి పోయాయి చెప్మా ! అని బెంగ పడే పని లేదుట. అవన్నీ మంత్రులై భాగ్య నగరానికి పోయేయిట.

అవునూ, కవులకు కవి వృషభులు అని బిరుదులూ అవీ ఇస్తూ ఉంటారు కదా. కవి గార్ధభ బిరుదులు ఇవ్వరు.
ముట్నూరు కృష్ణారావు పంతులు గారి మనుమరాలు వోసారి తాత గారితో ముచ్చటలాడుతూ ‘‘ తాతా ! మీ బందరులో గాడిదలు ఎక్కవే సుమండీ !’’ అందిట. దానికాయన‘‘ అవునమ్మ, ఇక్కడి గాడిదలు చాల వన్నట్టు పొరుగూరి గాడిదలు కూడా వచ్చి పోతుంటాయి !’’ అని వో చురక వేసారుట !
అలాగే మునిమాణిక్యం నరసింహారావు గారు కాంతం కథలలో కాంపోజిషను పుస్తకాల దొంతర పట్టు కెళుతున్న మేష్టరు గారితో ‘‘ ఏమిటి మాష్టారూ ! గాడిద బరువు మోసుకెడుతున్నారూ ?!’’ అని పరాచికాలాడ బోయేడుట. దానికాయన వెంటనే ‘‘ అబ్బీ !ఇవి 40 గాడిదల బరువురా !’’ అని చురక వేసి నోరు మూయించేరుట. డవాలా బంట్రోతులకి మల్లె పాపం, మేష్టర్లకీ, కోర్టు కాగితాల కవిలె కట్టలు  మోసుకెళ్ళే లాయర్లకీ ... యిలా .. కొన్ని వృత్తుల వారికి ఈ గాడిద బరువులు మోయడం విధాయకమే మరి. కదా !
కవి సమ్మేళనాలలో పాత మాటల మూటలతో నానా చెత్తా మోసుకొని వచ్చి ఆహూతులను చచ్చినట్టు వినేలా చేసే కవులూ , ప్రజానీకాన్ని అడ్డగాడిదల్లా అడ్డంగా మోసగించి, దొరికినంతా దోచుకు తినే రాజకీయ ఖరనాయకులూ, వారికి కొమ్ము కాచే కొన్ని పత్రికల వాళ్ళూ, , టీవీల వాళ్ళూ , కుక్కలనీ, పిల్లులనీ, గాడిదలనీ నానా చెత్తా కుమ్మరించే కథా మంజరి బ్లాగరూ, తన చుట్టూ జరిగే అన్న్యాయాన్ని ఎదిరించే సత్తా లేని వాళ్ళూ, ఆడవాళ్ళను కాల్చుకు తినే వాళ్ళూ ,లంచాలు మేసే వాళ్ళూ... వీళ్ళంతా గాడిదలు ... కాదేమో, అడ్డ గాడిదలు. కదా మరి.

ఈ టపా తమ మీద పెట్టిన కథా మంజరి బ్లాగరుకి గాడిదలు అంతర్జాతీయ గార్ధభ మహా సభ పెట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానించి ’’ దడిగాడువానసిరా ’ అనే బిరుదు ప్రదానం చేయ బోతున్నాయని ఒక (అ) విశ్వసనీయమైన సమాచారం వల్ల తెలుస్తోంది.

పిల్లుల గురించి మరోసారి. ఇక శలవు.







పన్నగ ధారీ ! నగ ధారీ ! ... ఓ చమత్కార శ్లోకం ...

ఈ శ్లోకం చూడండి:

పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ:
శశి ఖండ శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్.

ఈశ్లోకంలో కవి శివ పరమయిన అర్ధమూ, విష్ణు పరమయిన అర్ధమూ  వచ్చేలా రచించాడు.
ముందుగా శివ పరమయిన అర్ధం చూదాం.


శివ పరంగా అర్ధం చెప్పు కునేటప్పుడు శ్లోకం లో పదచ్ఛేదం ఇలా ఉంటుంది:
పన్నగధారి,  కరాగ్ర:,  గంగా, ఉమా లక్షిత:,   గదా, అగ్ర భుజ:,  శశి ఖండ శేఖర:,   ఉమా పరిగ్రహ:,  అనాది:, ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

పన్నగధారి:, గంగా ఉమా లక్షిత:, అగదోగ్ర భుజ:, శశిఖండ శేఖర:, ఉమా పరిగ్రహ:, అనాది: , మహు:, త్వామ్ అవతు !

భావం: చేతిలో పామును ధరించిన వాడూ, గంగా, పార్వతుల ప్రియ నాథుడూ, భుజాల మీద చక్కని బాహుపురులూ, బంగారు ఆభరణాలూ ధరించిన వాడూ, చంద్ర రేఖను తల మీద అలంకారంగా ధరించిన వాడూ , పార్వతీ దేవిని తన అర్ధాంగిగా పొందిన వాడూ, పుట్టుకే లేని అభవుడూ అయిన పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడు గాక !

కవి ఈ శ్లోకంలో శివుడికి  ఈ విశేషాణాలు వేసాడు.
 పన్నగధారి                                     =    పామును ధరించిన వాడు
గంగో మా లక్ష్మిత: = గంగా = ఉమా లక్షిత:    =    గంగా పార్వతులచే కోరబడిన వాడు
అగదోగ్ర భుజ:                                  =    భుజాల మీద బాహుపురులు,                                         
                                                        స్వర్ణాభరణాలు ధరించిన వాడు
శశిఖండ శేఖర:                                  =    చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.
ఉమా పరిగ్రహ:                                  =     పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                                           =     పుట్టుక లేని వాడు
మహు:, త్వామ్ అవతు                        =      సదా   మిమ్ము కాపాడు గాక !     

ఇక, శ్లోకం లోని అర్ధాన్ని విష్ణు పరంగా చెప్పు కోవాలంటే, కవి శివుడికి వేసినట్టుగా చెప్పిన విశేషణ పదాలలోని తొలి అక్షరాలను తొలిగించి చదువు కోవాలి !


విశేషణాలలోని తొలి అక్షరాలు తొలిగిస్తే,  పదచ్ఛేదం ఇలా ఉంటుంది:
నగధారి, కరాగ్ర: ,  గో, మా లక్షిత: , గద: , అగ్ర భుజ:, శిఖండ శేఖర:,  మా, పరిగ్రహ: , అనాది: , ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

కరాగ్ర:, నగధారి, గో,మా లక్షిత:, అగ్ర భుజ: గద:, శిఖండ శేఖర:, మా , పరిగ్రహ: , అనాది: , త్వామ్, ముహు:, అవతు.

కరాగ్ర: నగధారి            =       గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు
గో                           =      ఆవుల చేత,
మా                         =       లక్ష్మీదేవి చేత
లక్షిత:                      =       కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్షీ దేవికి ప్రభువు
                                     అయిన వాడు )
గద: అగ్ర భుజ:            =       భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు
శిఖండ శేఖర:             =        శిరసున నెమలి పింఛం ధరించిన వాడు
మా                          =      లక్షీ దేవిని
పరిగ్రహ:                     =      భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                      =      ( మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన అర్ధమగు) విష్ణువు
                                     పుట్టుక లేని వాడు అయిన విష్ణువు
ముహు: , త్వామ్, అవతు =      సదా మిమ్ము కాపాడు గాక !

భావం:  గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడూ,  గోవులకూ, లక్ష్మీ దేవికీ ప్రభువూ, భుజాన గదనూ, తల మీద నెమలి పింఛాన్నీ ధరించిన వాడూ, రమా పతీ అయిన వాడూ, పుట్టుక లేని వాడూ అయిన శ్రీ మహా విష్ణువు మిమ్ములను ఎల్లప్పుడూ కాపాడు గాక !
స్వస్తి.

   


16, ఫిబ్రవరి 2015, సోమవారం

మాయమై పోయానోచ్ ... ఒక చమత్కార శ్లోకం ...


ఎవరయినా సంపదలనిచ్చే లక్ష్మీ దేవిని నుతిస్తారే తప్ప, దరిద్ర దేవతను పొగడరు కదా ?
కాని, ఈ శ్లోకంలో కవి దరిద్ర దేవతను ఎలా నుతిస్తున్నాడో చూడండి:

దరిద్రాయ నమస్తుభ్యం, సిద్ధో2హం త్వత్ప్రసాదత:
సర్వం పశ్యామి దేవేశ, న మాం పశ్యతి కశ్చన.
దీని అర్ధం ఏమిటంటే,
ఓ దరిద్ర దేవతా ! నీకు వందనాలు. ఎందువల్లనంటే, నీ అనుగ్రహం వల్లనే కదా, నేను సిద్ధుడనైనాను. నాకు మహిమాన్వితమైన గొప్ప సిద్ధులు చేకూరాయి.
ఎలా అంటావా?
నేను అన్నింటినీ చూడ గలుగు తున్నాను. కాని ఒక్కరు కూడా నన్ను చూడ లేక పోతున్నారు.
ఈ కామరూప విద్య నాకు ప్రసాదించింది నువ్వే కదా, తల్లీ !
ఇదీ కవిగారు దరిద్ర దేవతను నుతించిన వైనం.
ఇందులో చమత్కారం సులభ గ్రాహ్యమే. అష్ట దరిద్రుడైన వాడికి అందరూ కనిపిస్తారు. కానీ వాడి మీద ఒక్కరి చూపు కూడా పడదు. దరిద్రుడిని ఎవరు మాత్రం చూస్తారు చెప్పండి? వాడి ఉనికిని ఎవరు మాత్రం గుర్తిస్తారు చెప్పండి?
‘దరిద్రుడనయినందు వలన నన్ను ఎవరూ పట్టించు కోవడం లేదు’ అని వాపోతున్నాడన్నమాట.

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

లేడిని చూసి పారి పోయిన వొక సింహం కథ

మన కవులు భాషను క్రీడా రంగంగా చేసుకుని ఎన్ని చక్కని ఆటలు ఆడుకున్నారో గమనిస్తే చాలా సరదాగా ఉంటుంది ..
 

క్రింది శ్లోకాన్ని పరికించండి ...

కస్తూరీ జాయతే తస్మాత్ ? కో హన్తి కరిణామ్ శతమ్ ?
కిం కుర్యాత్ కౌతరో యుద్ధే ? మృగాత్ సింహ: పలాయతే.
 

లేడిని చూసి సింహం పారిపోతోందని కవి గారి ఉవాచ !!

పోదురూ, మరీ బడాయి కాక పోతేనూ ! 

ఇప్పుడు కవి గారి అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తాను. చూడండి ...
చరణాల వారీగా ఇలా చెప్పు కుందాం...
కస్తూరి దేని నుండి పుడుతుంది ? ... మృగాత్ = మృగం నుండి
అనేక ఏనుగులను చంపేది ఏది ? .... సింహం
పిరికిపంద యుద్ధంలో ఏం చేస్తాడు ? ....పలాయతే ... పారి పోతాడు!

శ్లోకంలోని మూడు ప్రశ్నలకీ వరుసగా చివరి పాదంలోని మృగాత్ సింహ:, పలాయతే అనే వాటిని జవాబులుగా చెప్పుకుంటే మరే అసంగతమూ ఉండదులేడిని చూసి సింహం పరిగెత్తడమూ ఉండదు!
క్రమాలంకారంతో కవి గారు సాధించిన చమత్కారం యిది !
బాగుంది కదూ ? ...

10, ఫిబ్రవరి 2015, మంగళవారం

హవ్వ ! దేవతలకూ దారిద్ర్యమేనా ? !


దేవతలకు కూడా దారిద్ర్యమేనా ? అవుననే అంటున్నారు మన కవులు. కేవలం చమత్కారం కోసమే నండోయ్.
చూడండి:
హలమట బలస్య, ఏకోనడ్వాన్ హరస్య, నలాంగలం
క్రమ పరిమితా భూమిర్విష్ణో: న గౌ ర్న చ లాంగలం
ప్లవహతి కృషి:నాద్యా ప్యేషాం ద్వితీయం గవం వినా
జగతి సకలే నే దృగ్దృష్టం దరిద్ర కుటుంబకమ్.

బలరాముడికి నాగలి ఉంది. కాని ఎద్దులు లేవు.
శివుడుకి ఎద్దు ఉంది. కాని నాగలి, భూమి లేవు.
హరికి మూడడుగుల నేల ( బలి ఇచ్చినది) ఉంది. కానీ, ఎడ్లు, నాగలి లేవు.
ఇంత దరిద్ర కుటుంబం ఎక్కడా చూడ లేదయ్యా ! అంటున్నాడు కవి ఈ శ్లోకంలో.
కేవలం చమత్కారం కోసమే సుమండీ. నాగలి, ఎద్దు, భూమి మొదలయినవి ఆయా దేవతలకి వరుసగా ఆయుధమూ, వాహనమూ, ధర్మ పత్ని గానూ శోభిల్లుతున్నాయి.
కాసుల పురుషోత్తమ కవి కూడా వ్యాజ నిందా రూపమైన తన ఆంధ్రనాయక శతకంలో హరి పరమ దరిద్రుడని వెటకారంగా అన లేదూ?
చూడండి:
ఆలు నిర్వాహకురాలు భూదేవియైయఖిల భారకుడను నాఖ్యఁదెచ్చె
ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై
కామితార్ధదుడన్న ఘనతఁదెచ్చె
కమలఘర్భుడు సృష్టికర్త తనూజుడై
బహు కుటుంబికుడన్న బలిమిఁదెచ్చె
కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుడన్న ప్రతిభఁదెచ్చె
ఆండ్రు బిడ్డలుఁదెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ !
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !
శ్రీహరికి అఖిల భారకుడు ( సమస్త లోక భారాన్ని వహించేవాడు), కామితార్ధదుడు ( కోరిన కోరికలు ఇచ్చే వాడు), బహు కుటుంబికుడు ( జగమంత కుటుంబంకలవాడు), పతిత పావనుడు
( పతితులను వారి పాపాలు పోగొట్టి, పుణ్యాత్ములుగా చేసే వాడు) అనే పేర్లు ఉన్నాయి.
అయితే , మన కవి హరికి ఈ పేర్లన్నీ రావడానికివరుసగా అతని భార్యలు భూదేవి, శ్రీ లక్ష్మి, అతని కుమారుడు బ్రహ్మ, కుమార్తె గంగ కారణం తప్ప అతని గొప్పేమీ లేదని వ్యాజ నిందా రూపంలో చెబుతున్నాడు. హరి మొదటి నుండీ (దరిద్ర) దామోదరుడేనుట !
దామోదరుడు అంటే, దామము (పద్మము) ఉదరము నందు కలవాడని అర్ధం. శ్రీహరి నాభిలో కల పద్మం నుండే కదా బ్రహ్మ జనించినది.
ఇది నిందా రూప స్తుతి. అట్టి మహనీయులను పత్నులుగాను, కుమారునిగాను, కుమార్తె గాను కలిగిన హరి మరింత ఘనత వహించిన వాడు కదా. వ్యాజ నిందా రూపంలో హరిని నుతించడానికి కవి అతనికి లేని పోని దారిద్ర్యాన్ని ఆపాదించి చెబుతున్నాడు.
దేవతల దారిద్ర్యాన్ని గురించిన మరొక చాటువు కూడా చూదాం
శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింట నుంట, రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడ లేక సుమీ !
కవి తమాషాగా శివుడు హిమవత్పర్వతం మీద నివాసం ఏర్పరచు కోవడం, సూర్య చంద్రులు ఆకాశంలో ఉండడం, శ్రీహరి నిరంతరం పాలకడలిలో ఆది శేషుని మీద పవళించడం కేవలం నల్లి బాధ పడ లేకనే అని చెబుతున్నాడు.నల్లులూ, దోమలతో వేగాల్సిన దరిద్రం ఆ దేవతలకీ తప్పడం లేదని చమత్కారంగా చెబుతున్నాడు.
పరమేశుడు కాశీ నగరం విడిచి రావడానికి కూడా ఈ దరిద్రమే కారణం కదా.
దేవతల దారిద్ర్యం గురించిన ఈ చమత్కారాలకు ఇక స్వస్తి. మరో టపాలో మళ్ళీ కలుద్దాం.