2, జులై 2010, శుక్రవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 6


అఙ్ఞాత వాసం ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిర్ణయించుకున్నాక, పాండవులు ఒక్కొక్కరూ మారు వేషాలలో వచ్చి, విరటుని కొలువులో చేరారు.

ధర్మ రాజు , భీముడు , అర్జునుడు , నకులుడు , సహ దేవుడు వరుసగా కంకు భట్టు , వలలుడు ,బృహన్నల , దామగ్రంథి ,తంత్రీ పాలుడు అనే పేర్లతో విరటుని కొలువులో ప్రవేశించారు. (ఆ వివరాల కోసం ఆయా పేర్ల వద్ద నొక్కి చూడండి.)

ఇక, మిగిలింది ద్రౌపది. ఆమె సైరంధ్రీ వేషంలో మాలినిగా విరాట మహా రాజు పట్ట మహిషి సుధేష్ణ కొలువులో వచ్చి చేరింది.

ఆమె తన దేశాచారం ప్రకారం కేశపాశం అంతా విప్పుకుని, కొప్పుగా అమర్చడానికి అనువుగా జడను అల్లుకున్నది. కొప్పు కొద్దిగా కుడి వైపునకు ఒరిగే విధంగా అమర్చుకుంది. కొద్దిగా మాసిన చీర కట్టుకుంది. ముతక నార బట్టతో స్తన మండలాన్ని కప్పుకుంది.

ఆమె తన ఆకారంలో దాసీత్వ లక్షణాన్ని ఉట్టి పడేటట్లు చేసికొంది. దాసీ భావాన్ని స్థిరంగా మనసులో నిలుపు కొన్నది. ఆవిధంగా విరటుని రాచ నగరు లోనికి ప్రవేశించింది.

అలా పైరంధ్రీ వేషంలో వస్తున్న ద్రౌపది మేఘం క్రమ్మడం వల్ల కాంతి తగ్గిన చంద్ర కళలా ఉంది. మంచు కప్పడం చేత వన్నె తగ్గిన పద్మంలా ఉంది. పొగ క్రమ్మడం వల్ల కాంతి తగ్గిన దీప శిఖలా ఉంది. దుమ్ము పడగా నిగ నిగలు తగ్గి, లావణ్యం కొరవడిన తీగ లాగ ఉంది. మొత్తానికి ఈ వేషంలో ఆమె రూపం లోని సహజంగా ఉండే ఉజ్వలత్వం మరుగున పడింది.

అలాంటి వేషంతో వస్తున్నద్రౌపదిని చూసి, పుర జనులు తమలో తాము యిలా అనుకున్నారు:

‘‘ ఈమె రోహిణి కాని , అరుంధతి కాని అయి ఉండాలి. అంతే కాని , మానవ కాంత మాత్రం కాదు. తన రూపలావణ్యం చేత చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతే కాదు, అందరి మన్ననలు పొందుతోంది. మంగళ ప్రదమయిన ఆ శరీర కాంతి చూస్తే సందేహం కలుగుతోంది. ఏ లోకం లోనయినా , యిటువంటి అపురూప రూపవైభవం కలవారు ఉంటారా ?’’ అనుకుంటూ బిలబిలా ఆమె దగ్గరకి వచ్చి చేరారు. ‘‘ నీవెవరు ? ఏ పని మీద ఎక్కడికి పోతున్నావు?’’ అని అడిగారు. అప్పుడు ద్రౌపది సుముఖత, సద్భావం వెల్లడి అయేవిధంగా ఇలా అంది:

ద్రౌపది:

‘‘నేను సైరంధ్రిని. నాకు కూడూ గుడ్డా చాలును. ఎవరు నన్ను దయతో పోషిస్తారో వారి దగ్గర పనులు చేస్తాను ’’

ఆమె మాటలు విని అక్కడి వారు ఆశ్చర్య పోయారు. వారికి కొంచెం సందేహం కూడ కలిగింది, ‘‘ ఈమె కడుపు కూటికి ఎక్కడయినా ఉంటానంటున్నది. ఇది నమ్మదగిన మాటేనా?’’ అనుకుంటూ ఆమెని చూస్తూ చుట్టుముట్టారు.

ఆసమయంలో -

విరాట మహా రాజు పట్టమహిషి సుధేష్ణ తన అనుగు చెలికత్తెలతో అంత:పురం మేడ పైభాగంలో విహరిస్తోంది. ఆ మేడ కిటికీల గుండా సైరంధ్రి పుర వీధిలో రావడం గమనించింది. ఆత్మగతాన యిలా అనుకుంది,

సుధేష్ణ : ( తనలో)

‘‘ఈమె ఎక్కడి నుండి వస్తున్నదో ? ఎక్కడికి వెళ్తున్నదో కదా? ఒంటరిదానిలా ఉంది. ఈమెలో అందం ,ఔన్నత్యం కనిపిస్తున్నాయి. అయినా, ఒక సేవకురాలిలాగా వినయంగా వంగి మాట్లాడుతోంది. నగర ప్రజలు కూడ ఎంతో వింతగా ఆమెను చూస్తూ ఉన్నారు. తొందరగా వెళ్ళి ఆమెను వెవటబెట్టుకుని రండి ’’ అని చెలులను పురమాయించింది. సుధేష్ణ యిలా చెప్పడంతో ఇద్దరు ప్రౌఢాంగనలు బయలు దేరి ద్రౌపది దగ్గరకి వెళ్ళి ‘‘ విరాట మహా రాజుల వారి పట్ట మహిషి సుధేష్ణా దేవి దయతో నిన్ను తన దగ్గరకి తీసికొని రమ్మని మమ్ములను పంపించింది, రా ’’ అని పలికారు. అప్పుడు ద్రౌపది మేలి ముసుగు సవరించుకుంది. వినయమే స్త్రీ రూపం ధరించిందా అన్నట్టుగా ఆ చెలుల వెంట అంత:పురం లోనికి బయలు దేరింది.

ద్రౌపది పాదాలు ఎర్రగా ఉన్నాయి. అందు చేత ఆమె నడుస్తున్నంత మేరా కుంకుమ పోసి నట్టు ఎర్రబడి పోతోంది. ఆమె శరీరం మిలమిలలాడి పోతోంది. అందు చేత ఆమె వస్తూ ఉంటే గోడలూ, అరుగులూ మణులు పొదిగినట్టుగా ప్రకాశిస్తున్నాయి. ఆమె కళ్ళు ఒక వింత కాంతితో మెరిసి పోతున్నాయి. ఆ చూపులు పూలు చల్లినట్టుగా ఉన్నాయి. ఆమె జుట్టు నల్లగా నిగ నిగలాడి పోతోంది. అందు చేత గదుల

పై భాగాన నల్లని పట్టు చాందినీ కట్టినట్టుగా కనిపిస్తోంది. ఆమె అడుగిడగానే విరటుని అంత:పురమంతా ఒక కొత్త కాంతితో మెరిసి పోయింది. ఈ విధంగా ద్రౌపది నెమ్మదిగా సుధేష్ణ ఉన్న మేడ మీదకి ఎక్కి వచ్చింది.

అలా వస్తున్న ద్రౌపదిని విరాటుని దేవేరి చూసింది. ఆమె ముఖంలో ఒక విధమయిన గౌరవభావం కదలాడింది. సాదరంగా చేతులు ముందుకు సాచింది. కనీకనబడనట్టుగా దంతకాంతులు వ్యాపిస్తూ ఉండగా ద్రౌపదిని ప్రేమగా దగ్గరకి రమ్మని పిలిచింది. ద్రౌపది మెల్ల మెల్లగా ఆమె దగ్గరకి చేరి నిలబడింది. సుధేష్ణ ఒక సారి ఆమెను ఆపాదమస్తకం పరిశీలించింది. కుతూహలంతో యిలా అడిగింది:

సుధేష్ణ :

‘‘ తల్లీ, నీకులమేమిటి ? నీవు ఎవరిదానవు? ఏ పని మీద ఎక్కడికి వెళ్దామని బయలు దేరావు? మాకు అంతా వివరంగా చెప్పు.’’

సైరంధ్రి:

‘‘ నేను సైరంధ్రీ జాతి దానను. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. ఒకానొక కారణం వలన మా విరోధులు అహంకారంతో నా భర్తల ఎదుటే నన్ను జుట్టు పట్టుకుని లాగి అవమానించారు. నా భర్తలతో కలసి అడవికి వెళ్ళాను. అక్కడ కందమూలాలు తిని కాలక్షేపం చేసాను. బ్రహ్మచర్యాన్ని అవలంబించాను. ఇంక, నాకొక నియమం ఉంది. ఆనియమం ఇంకా ఒక్క ఏడాది మాత్రం ఉంది. నీవు ధర్మపరురాలవని విన్నాను. నీదగ్గరే ఉండాలని వచ్చాను. నావ్రతసంపూర్తి ఇక్కడే చేసుకుంటాను. నా చేతనయిన పనులు చేస్తాను’’

సుధేష్ణ :

‘‘ దేవతలు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, కిన్నరులు, యక్షులు, సిద్ధులు - వీరికి చెందిన కాంతలలో నీవు ఒకతెవు కావచ్చును. ఈ నగరానికి రావడానికి కారణం ఏమిటో అబద్దమాడకుండా చెప్పు.’’

ద్రౌపది : ( మందహాసం చేస్తూ )

‘‘ నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్య భామ దగ్గర, ఆ పిమ్మట ద్రౌపది దగ్గర పని చేసే దానిని.

పరిచారికలు చేసే పనులన్నీ నాకు తెలుసును. ఆపనులన్నీ నేను చేసినవే. వాటిని చేయడంలో నాకు చాల సమర్ధత ఉంది. అమ్మా, విను. ద్రౌపది నన్ను ప్రాణప్రదంగా చూసుకునేది. అంతెందుకు? నన్ను తనతో సమానంగా చూసుకునేది.

నీవు కూడ అలాగే చూడాలని కోరుతున్నాను. నీచములయిన పనులకు నేను తగను. ఈ విషయం ముందుగా నీవు తెలుసుకోవాలి. గౌరవమయిన పద్ధతిలో నన్ను స్వీకరించు. నా సైరంధ్రీ జాతి ఆచారానికి విఘాతం కలగని విధంగా నన్ను ఏలుకో.

కలపాలు ( చందనాది సుగంధ ద్రవ్య విశేషాలు) కలపడం నాకు బాగా తెలుసును. రకరకాలయిన తిలకాలు దిద్దడమూ తెలుసును. వింత వింతలుగా పూలమాలలు కట్టడం, ముద్దుగా కొప్పులలో ముడవటం, దండగుచ్చటం అన్నీ నాకు బాగా తెలుసును.’’

ఆమాటలకు సుధేష్ణ ఆశ్చర్యపోతూ ఇలా అంది:

సుధేష్ణ:

‘‘ అమ్మాయీ ! నీ రూపాన్ని చూసి మా రాజు ఆకర్షితుడయి ఉవ్విళ్ళూరడం ఖాయం ! అటువంటిది, నీ చేత నేను ఎలా పనులు చేయించుకుంటాను చెప్పు? మగ వాళ్ళ సంగతి అలా ఉంచు ఆడవారు కూడా నీ అందం చూసి కళ్ళు మరల్చ లేక పోతున్నారు కదా? ఇంకా వేరు మాటలు ఎందుకు?

నిన్ను భరించడం చాల కష్టం తల్లీ ! నీరక్షణ పీత గర్భంలాంటిది ! నిన్ను చేరదీసి, నా వినాశనం నేనే కొనితెచ్చుకున్నట్టవుతుంది. అది తెలివయిన పని కాదు.’’

(ఎండ్రకాయ (పీత) ప్రసవించే సమయంలో పిల్లలు తల్లి గర్భం చీల్చుకుని పైకి వస్తాయి. తల్లి చనిపోతుంది. అందు చేత పీత గర్భం క్షేమకరం కాదు)

అని పలికిన మహారాణితో ద్రౌపది ఇలా అంది.

ద్రౌపది (సైరంధ్రి):

‘‘ అమ్మా, నీవనుకున్న విధంగా ఎన్నటికీ జరుగదు. నా భర్తలు సామాన్యులు కారు. ఉపాయశీలురు. మిక్కిలి బలవంతులు. గొప్ప పరాక్రమం కలవారు. ఒక్క నిమేష కాలమయినా, నావిషయంలో వారు పరాకుగా ఉండరు. నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు.

నన్ను ఎవడయినా నీచ బుద్ధితో చూస్తే నా భర్తలు ఆ నీచుడిని ఆ రాత్రే కడతేరుస్తారు. హరిహరాదులు అడ్డం వచ్చినా సరే యిదితప్పదు. వారెంత బలమూ, పరాక్రమమూ ఉన్న వారయినా నా భర్తల చేతిలో హతం కావలసిందే.

నన్ను నీచ బుద్ధితో చూసే ఆనీచులకు వందల కొద్దీ బంధువులు ఉండవచ్చును. వాళ్ళు గొప్ప పరాక్రమం కలిగిన వారు కావచ్చును. మదాంధులు కావచ్చును. శక్తి సంపదతో భయంకరులు కానోపును. ఏనుగుల వలె ఉండవచ్చును. అయినా సరే, నా భర్తలు కీళ్ళకు కీళ్ళు విడదీసి వారిని చంపి వేస్తారు. అందు వలన మగవారు నా వేపు తేరిపారి చూడడానికి కూడ భయపడుతారు.

అంతే కాదు. నా మనసు అటువంటి వారికి గోచరించదు. నా పెద్దల శిక్షణ, ఆచారం అలాంటివి. కనుక, ఇటువంటి అల్పమయిన మాటలు మాట్లాడ వద్దు. మనసులో ఇంకేమీ పెట్టుకోకు. నా మీద సందేహం వద్దు. నన్ను నీ సేవకురాలిగా స్వీకరించు. నాగరికమూ, ఉదాత్తమూ అయిన పనులు , నీకు నచ్చిన పనులు, నీకు నచ్చిన పద్ధతిలో భయభక్తులతో చేస్తాను.నా చేతలు పెద్దలు కూడ మెచ్చుకుంటారు. అందరూ ప్రశంసించేలా నా ప్రవర్తన ఉంటుంది.

నన్ను నీచకార్యాలకు పంపని వారిని, ఎంగిలి కూడు నాకు పెట్టకుండా నన్ను గౌరవంతో చూసుకునే వారిని నా భర్తలు కూడా ఎంతో ఆదరంతో చూస్తారు.’’

సైరంధ్రి పలికిన ఈ మాటలతో విరాట మహా రాజు పట్ట మహిషి సుధేష్ణ సంతోషించింది. ఆ మాటలతో ఆమె మనసు కుదుట పడింది. ఆమెను తన వద్ద సేవకురాలిగా చేర్చుకుంది. సైరంధ్రి కూడ అంత:పుర మర్యాదలకు అనుగుణంగా ప్రవర్తించ సాగింది.

ఈ విధంగా పాండవులయిదుగురూ., వారితో పాటు ద్రౌసది మారు వేషాలతో, మారు పేర్లతో విరటుని కొలువులో చేరారు. దీనితో లోగడ ఓ అష్టావధానంలో అవధాని సమస్యను పూరించినట్టు - కుంజర యూథం దోమ కుత్తుకను చొచ్చినట్టయింది !!

తదుపరి హిత వచనమ్డాట్ కామ్ లో మరి కొన్ని ...

స్వస్తి.

1 కామెంట్‌:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

" రసికుఁ<డు కవి. అద్భుత కథ " ఇంకేముంది. పాథకులదే అదృష్టమంతా.
మీరు సహజంగా గొప్ప కథా రచయిత. అందునా మహోత్కృష్టమైన భారతేతివృత్తం. ఇంకేముంది. మ భాగ్యం పండింది. అద్భుతం. మీకథా కథన విధానం అత్యద్భుతం.
ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి