30, డిసెంబర్ 2010, గురువారం

కోతుల రాజ్యంలో కోదండ రాముడు లేడా ?


కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటే, మా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
ఇదేఁవిటిరా నాయనా అంటే, చూడవోయ్, బోలెడంత కామెడీ దొరుకుతుంది. పొట్ట చెక్కలై ఛస్తావ్ ! అంటాడు.
సరే చూదామని, చూడడం మొదలెట్టేను. క్రమేపీ కామెడీ కోసం ఆ ఛానెళ్ళు చూడడానికి ఎడిక్ట్ అయి పోయాను.
కామెడీ కాక పోతే, మరేమిటి చెప్పండి ? మన నాయకమ్మన్యుల నటనా విలాసాలు. ఆంగిక వాచిక విన్యాసాలూ, అభినయ విశేషాలూ, సంభాషణా చాతుర్యాలూ చూస్తూ ఉంటే, మా కోనేటి రావు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
వీధి కొళాయి దగ్గర తగవులు కూడా వారి వాదోపవాదాల దగ్గర దిగదుడుపే అనిపిస్తుంది.
ఏదో అంటాడు. అనలేదంటాడు. తిడతాడు. తిట్ట లేదంటాడు. మీరు నా మాటల్లో అంతరార్ధం అసలే అర్ధం చేసుకో లేదు పొమ్మని దబాయిస్తాడు. కాదంటే కోపంతో బుసలు కొడతాడు. అవినీతి కోట్లలో జరిగిందని అలిసి పోయే వరకూ అరుస్తాడు. ఆధారాలడిగితే, సమయం వచ్చిప్పుడు బయట పెడతానంటాడు ( ఆ దిక్కు మాలిన సమయం ఎప్పుడు వచ్చి ఛస్తుందో విధాతకి సైతం తెలియదు) పెజా సేవ అంటూ శోష వచ్చే వరకూ గీ పెడతాడు. కుర్చీలాటలో తలముకలవుతాడు. అబద్ధాలను అవలీలగా కళాత్మకంగా వినిపించడంలో దిట్టలు. అర చేతిలో వైకుంఠాలు వారి మేని ఫెస్టోలు.
టీవీల్లో చర్చా వేదికలు కదన రంగాలను తల పోస్తూ ఉంటాయి. పార్టీ కార్య క్రమాల్లో సైతం పిశాచ సమవాకారాలు వినిపిస్తూ ఉంటాయి. బాహా బాహీ, కచ్చా కచ్చీ, దండా దండీ. అంతా శిఖ పట్ల గోత్రాలు.
సాయ్ లెన్స్ ! అని పంతులు అరిస్తే బడి పిల్లలయినా అల్లరి మానేస్తారేమో కానీ, వీళ్ళు మాత్రం అరచు కోవడాలు తగ్గించరు. ఎవరేం అంటున్నారో తెలియక జుట్టు పీక్కోవాలి మనం. అది మన ప్రారబ్ధ ఖర్మ.
ఒక సారి రాజకీయ పాప పంకిలంలోకి దిగేక, ప్రతి ఛోటా నాయకమ్మన్యుడూ తాను దైవాంశ సంభూతుడననుకుంటాడు. సకల సుగుణ శోభిత పురుషోత్తముడ ననుకుంటాడు. సమస్త శక్తులూ సంక్రమించాయనుకుంటాడు.వాడి నడక, నడత, మాట తీరు, ప్రవర్తన అన్నీ అనూహ్యంగా మారి పోతాయ్.
ఎక్కడికి పోతున్నాం, మనం !
ఎక్క వలసిన ఎవరెస్టు శిఖరాల పైకా ?
దిక్కు మాలిన పాపాల పాతాల కుహరాల లోకా ?
(సి.నా.రె)
అని విస్తు పోతాం. దశాబ్దాలుగా అలవాటు పడి పోయాం. ధరలు పెరిగి పోతున్నాయని గగ్గోలు పెడతాం. నల్లాలో పది నిమిషాల పాటు నీళ్ళొచ్చాయని సంబర పడి పోతాం. కలల్ని జోకొడుతూ కమ్మగా నిద్ర పోతాం. నిద్ర మత్తు లోనే జోగుతూ బ్యాలెట్ బాక్స్ ల వద్దకు వెళతాం. మనం ఓటు వేసి గెలిపించు కున్న మకిలి వాసననే ఆఘ్రాణిస్తూ పరవశించి పోతాం.
అనతం విషాదమే జీవితానుభవం అనుకుంటాం. కారణాలు వెతకం. ఈ భగ్న జీవిత కుటీరాలను ఎలా మరమ్మతులు చేసు కోవాలో ఆలోచించం. గొంగళీ పురుగుల్లాగా ముడుచుకుని పడుకుంటాం. మరి లేవం. లేవడానికి ఇష్ట పడం. అంత కన్నా, లేవడానికి భయ పడతాం అనడం సమంజస మేమో ?
నాయకమ్మన్యులు ఇంత అహంకార పూరితులు కావడం ఎందుకు జరుగుతోందో ఆలోచిస్తూ ఉంటే, ఈ క్రింది శ్లోకాలు గుర్తుకు వచ్చేయి.
చూడండి:
యౌవనం ధన సంపత్తి: ప్రభుత్వ మవివేకితా
ఏకైక మస్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్ ?
యౌవనం, ధన మదం, అధికారం, తెలివి తక్కువ తనం ఇవన్నీ వేటి కవే ఒక్కొక్కటీ అనర్ధదాయకాలు. మరి, ఒకే చోట ఈ నాలుగూ కూడితే, చెప్ప వలసిన దేముంది ?
మరో శ్లోకం చూడండి:
కపిరపి చ కాపిశాయన మద మత్తో వృశ్చికేన సందష్ట:
అపిచ పిశాచ గ్రస్త: కిం బ్రూమో వైకృతం తస్య.
అసలే కోతి ! అది కల్లు త్రాగిందిట. దాని మీద తేలు కుట్టిందిట. ఆ పైన పిశాచం పట్టిందిట ! ఇక చూడాలి, దాని
చేష్టలు ! అంటున్నాడు శ్లోక కర్త.
ఈ కోతుల రాజ్యంలో కోతి మూకను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడే లేడా ?
స్వస్తి.

29, డిసెంబర్ 2010, బుధవారం

టిక్కెట్టు డబ్బులు వాపసు చెయ్యరూ ?


ఈ శ్లోకంలోని చమత్కారాన్ని గమనించండి:

ప్రాయో ధనవతా మేవ, ధన తృష్ణా గరీయసీ
పశ్య కోటి ద్వయాసక్తం, లక్షాయ ప్రవణం ధను:

డబ్బు మీద వ్యామోహం అందరకీ సర్వ సాధారణమే అయినా, బాగా ధనవంతులయిన వారికి ధనం మీద ఆశ మరీ ఎక్కువగా ఉంటుందిట. కోట్లు కల వారు కూడ లక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారుట. ఇదీ ఈ శ్లోక భావం.

శ్లోకంలోని రెండవ పాదం గమనించండి.

కోటి అనే పదానికి వంద లక్షలు అనే అర్ధమే కాక, వింటి కొప్పు ( ధనుస్సు చివర ) అనే అర్ధం కూడా ఉంది. అందు వల్ల ధనుస్సునకు రెండు కోట్లు ( రెండు చివరలు) ఉన్నాయన్నమాట !

ధనుస్సు ఎప్పుడూ ఛేదించ వలసిన లక్ష్యం వేపే గురిపెట్టి చూస్తూ ఉంటుంది.

లక్ష అనే పదానికి కూడ వంద వేలు అనే అర్ధమే కాక, గుఱి అనే అర్ధం కూడా ఉంది.

కనుక, రెండు కోట్లు గల ధనుస్సు ఎప్పుడూ లక్ష కోసం ( ఛేదించ వలసిన లక్ష్యం కోసం ) ఎదురు చూస్తూ ఉంటుందన్న మాట.

అలాగే, రెండు కోట్లు కల వాడు కూడా (మరో) లక్ష కోసం చూస్తూ ఉంటాడు. ఆశాపాశము కడున్నిడుపు, లేదంతంబు ....

ఎప్పుడో చదివిన ఒక జోక్ గుర్తుకు వస్తోంది. వెనుకటికి, ఓ ఊళ్ళో ప్రదర్శన జరుగుతూ ఉండగా సినిమా హాలు ఒక్క సారిగా కుప్ప కూలి పోయింది. చాలా మంది గాయ పడ్డారు.హాలు యాజమాన్యం వారు వచ్చి, అందరినీ బ్రతిమాలుకుని అందరకీ వైద్యం చేయించుకొమ్మని తలాయింతా ఇచ్చి, ఇళ్ళకు పంపి వేసారుట.

ఒక ప్రేక్షకుడు మాత్రం డబ్బు అందుకుని కూడా సీటు లోనుండి కదల్లేదు.

హాలు యజమాని సవినయంగా అడిగేడు: ‘‘ తమకి మరేమయినా కావాలా ?’’

ప్రేక్షకుడు నసుగుతూ : ‘‘ మరే, సినిమా పూర్తిగా చూడనే లేదు, టిక్కెట్టు డబ్బులు వాపసు యిప్పిస్తే ...’’





28, డిసెంబర్ 2010, మంగళవారం

కానుకల కథా కమామీషూ !


ఎవరింట్లోనో, ఏదో వేడుక జరుగు తోంది. వెళ్ళాలి. అయితే, వట్టి చేతులతో వెళ్ళ లేం కదా? ఏదో ఒక కానుక తీసికొని వెళ్ళడం సముచితం. ఏం పట్టి కెళితే బావుంటుందో ఒకంతకి నిర్ణయానికి రాలేం. కుటుంబ సభ్యలు ఒక్కొక్కరూ ఒక్కో సలహా పారేస్తూ ఉంటారు. అదంటే యిదనీ, ఇదంటే అదనీ సూచనలు పరంపరగా వస్తూ ఉంటాయి. చివరకి విసిగి పోయి, మనకు తోచినంత నగదు కవర్లో పెట్టి ఇవ్వడానికి సిద్ధ పడి పోతూ ఉంటాం.

సమయానుకూలంగా , సమయోచితంగా ఎదుటి వారికి కానుకలు ఇవ్వడం కూడా ఒక కళ. సమయోచిత వస్త్రధారణ లాగే ఇది కూడా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. సందర్భ శుద్ధి లేని మాటలూ. ప్రవర్తనా కూడా వికటించి, హేళనలకు పాత్రములవుతాయి. చావు యింటికి పరామర్శకి బయలు దేరి, పట్టు బట్టలు కట్టుకుని వెళ్ళం కదా? తద్దినం బోయినం తిని, త్రేన్చి, అన్నదాతా సుఖీ భవ ! అని వాగడం మంచిది కాదు కదా ?

పిల్లల పుట్టిన రోజుకి ఇవ్వతగిన కానుకలు, వివాహ సందర్భంగా వధూవరులకు ఈయ తగిన కానుకలు, ప్రేమికులు పరస్పరం ఇచ్చుకో తగిన బహుమతులు, షష్టి పూర్తి సందర్భంగా ఇచ్చేవి, నూతన గృహ ప్రవేశం సందర్భంగా ఇవ్వతగినవి, పదవీ విరమణ కానుకలు ... ఇలా ఈ వింగడింపు చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుంది.

ఏతావాతా ఎవరింటి కార్యక్రమానికి వెళ్ళినా, వట్టి చేతులతో వెళ్ళ కూడదన్నది దీని సారాంశం.
ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నారు పెద్దలు. ఒక పండు, పత్రి, పువ్వు, లేదా చివరాఖరకి నీళ్ళు సమర్పించు కోవాలి తప్ప, చేతులు ఊపుకుంటూ వెళ్ళడం తగదు.

రిక్త హస్తాలతో వెళ్ళరాని తావులు ఏవో క్రింద శ్లోకంలో మనువు చెబుతున్నాడు.

అగ్నిహోత్రం గృహం క్షేత్రం, గర్భిణీం వృద్ధ బాలకౌ
రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుమ్.

అగ్నిహోత్రం దగ్గరకి, స్వగృహం దగ్గరకి, పుణ్యక్షేత్ర దర్శనానికి పోయి నప్పుడు, గర్భిణీలు, ముసలి వారు,పిల్లలు,
రాజు, దైవము, గురువు - వీరి వద్దకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళ కూడదు. ఏదో ఒక కానుక తీసికొని పోచి సమర్పించాలి అని దీని భావం.

ఈ జాబితాలో స్నేహితుల ప్రస్తావన లేదు. కాని, మైత్రీబంధం కలకాలం నిలబడాలంటే చిన్న చిన్న కానుకలు ఒకరిరి కొకరు అడపాదడపా ఇచ్చుకుంటూ ఉండాలి.

బాల సఖుడు శ్రీ కృష్ణుని వద్దకు అటుకుల మూటతో వెళ్ళిన కుచేలుని కథ చూదాం ....

కుచేలుడు బహుకుటుంబీకుడు. గంపెడు సంతానం. ఎలాగో ఒకలాగ సంసారాన్ని లాగు కొస్తున్నాడు. బతుకు బండి మరి ముందుకు సాగ లేక కుయ్యో, మొర్రోమంటూ మొరాయిస్తోంది. కటిక దారిద్ర్యం యింట తాండవస్తోంది. బిడ్డలు ఆకలి బాధతో కృశించి, ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, చేతుల్లో ఆకులూ, గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడుగుతూ ఉంటే, ఆ తల్లి విలవిల లాడి పోయింది. ఇహ లాభం లేదు. మీ బాల సఖుడు కన్నయ్య దగ్గరకి పోయి రండి .ఏమేనా ఇస్తాడు అని ఉపాయం చెప్పింది.

బాలసఖుండైన యప్పద్మ నేత్రుఁ
గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను
లైన మనము నుద్ధరింపుము; హరి కృపా క
టాక్ష రవి దీప్తి వడసి మహాత్మ ! నీవు

స్వామీ ! కృష్ణుడు మీ బాల్య సఖుడు. ఆ మహానుభావుడిని దర్శించి రండి.అతని కృపాకటాక్షం పొంది దారిద్య్రంతో తల్లడిల్లుతున్న పిల్లలను ఉద్ధరించండి అని వేడుకుంది.

కలలో కూడా ఎన్నడూ తలచుకోని కష్టాత్ముడు కూడా ఆపద కాలం లో ఒక్క తూరి తలచుకుంటే, వాడికి సకల భోగాలూ ఇస్తాడే, అవసరపడితే తనని తానుగా సమర్పించుకుంటాడే, అట్టి మహనీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే వారికి సమస్త సంపదలూ ఇవ్వకుండా ఉంటాడా ? అని బోధించింది.

సరే వెళ్తానన్నాడు కుచేలుడు. అయితే, వట్టి చేతులతో ఎలా వెళ్ళడం ? అని సంశయించేడు. దానికామె నిజమే సమా అని, అటుకులను కొన్నింటిని అతని చిరిన వస్త్రపు కొంగులో ముడి వేసింది. ఇహ వెళ్ళి రండని అంది. బయలు దేరాడు కుచేలుడు.
గోవింద దర్శనోత్సాహంతో బయలు దేరాడే కానీ కొన్ని సంశయాలు అతనిని పట్టి పీడిస్తున్నాయి.

ద్వారకా నగరంబు నేరీతి జొత్తును ? భాసురాంత:పురవాసి యైన
య ప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగిఁ దర్శింపఁగలనొ? తద్ద్వార పాలు
రెక్కడి విప్రుడ ? నిందేల వచ్చెద ? వని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న నూహింప నర్ధశూన్యుండ నేను ;

నయిన నా భాగ్య మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండు గలదె ? యాతఁ
డేల నన్ను నుపేక్షించు ? నేటి మాట
లనుచు నాద్వారకాపుర మతఁడు సొచ్చి.

ద్వారక లోనికి ఎలా ప్రవేశిస్తాను ?అంతి పురంలో ఉన్న ఆ పుండరీకాక్షుని ఎలా చూడ గలను ? ద్వార పాలకులు అడ్డగిస్తే ఏందారి ? పోనీ వారికి ఏదయినా బహుమానం (లంచం) ఇద్దామంటే చేతిలో చిల్లి గవ్వ లేని కటిక దరిద్రుడిని. ఇంతకూ నా భాగదేయం ఎలా ఉందో, ఏమిటో ? అయినా, నా పిచ్చి కానీ, ఆ స్వామి నన్ను ఎందుకు ఉపేక్షిస్తాడులేఇలా అనుకుంటూ కక్ష్యాంతరాలు గడచి, కడకు కన్నయ్యను దర్శించు కున్నాడు.

కృష్ణుడు తన బాల సఖుని అత్యంత ఆదరంతో అక్కున చేర్చు కున్నాడు. గొప్ప ఆతిథ్యమిచ్చి సంభావించాడు.

సరసన కూర్చుండ బెట్టుకుని, బంగారు కలశం లోని నీళ్ళతో కుచేలుని పాదాలు కడిగాడు. ఆ నీటిని భక్తిగా తల మీద చల్లు కున్నాడు.కస్తూరి, పచ్చ కప్పురము కలిపిన మంచి గంధం బాల సఖుని మేని మీద పూసాడు.మార్గాయాసం తీరే లాగున అగరు ధూపం వేసాడు. సవినయంగా వీవెనతో విసిరాడు మణిమయ దీపాలతో నివాళులర్పించాడు. మిత్రుని సిగలో పూల దండలు ముడిచాడు. కర్పూర తాంబూలం యిచ్చాడు. గోదానం చేసాడు.ఆదర పూర్వకంగా యిలా బాల సఖుని స్వాగతించేడు.

ఆ ఆతిథ్యం స్వీకరించిన కుచేలుని శరీరం పులకించి పోయింది. కృష్ణుని పట్టపు దేవేరి కూడ కుచేలునికి వింజామరలు వీచి సేవించింది.

ఈ అద్భుత దృశ్యం చూసి అంత:పురకాంతలు విస్మయం చెంది యిలా అనుకున్నారు:

ఏమి తపంబు సేసెనొకొ ! యీ ధరణీ దివిజోత్తముండు తొల్
బామున ! యోగి విస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధి నాథు నిజతల్పమునన్ వజియించి యున్నవాఁ
డీ మహనీయ మేర్తి కెనయే ముని పుంగవు లెంతవారలున్ ?

ఈ బ్రాహ్మణుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా ! మునపటి జన్మలో ఎంతటి గొప్ప తపమాచరించాడో కదా ? యోగివంద్యుడైన పంకజనాభుని పానుపు మీద అధివసించాడు ! ఎంత లేసి ముని శ్రేష్ఠులు కూడ ఈ మహానుభావునికి సాటి రారు కదా !

తర్వాత మిత్రులిద్దరూ గురుకులం లో గడిపిన మధుర దినాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ తలపోతలతో మైమరచి పోయారు.

అంతలో శ్రీకృష్ణుడు కుచేలుని చినిగిన ఉత్తరీయంలో ముడి వేసి తెచ్చిన మూటను విప్పి, గుప్పెడు అటుకులను ఆదరంతో ఆరగించాడు.

మరో పిడికెడు అటుకులను తిన బోతూ ఉంటే రుక్మిణీ దేవి:‘‘ స్వామీ ! ఇతనికి సకల సంపదలూ అందించడానికి మీరు మొదట తిన్న పిడికెడు అటుకులు చాలును.’’ ఇక తినకండి. అంటూ వారించింది.

ఆ యింట తనకు దక్కిన మర్యాదలకు కుచేలుడు అమితానందం చెందాడు.ఇలా భావించాడు:

శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు
న్నీని తెఱంగు గానఁబడె ; నెన్న ’ దరిద్రుఁడు సంపదంధుడై
కానక తన్నుఁజేరఁ‘డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం
భోనిధి సర్వ వస్తు పరిపూర్ణునిఁగా ననుఁ జేయ కుండునే ?

నా చెలికాడు శ్రీకృష్ణుడు నన్ను బాగానే సత్కరించాడు. బాగానే ఉంది. కానీ నాకు ధనమేదీ ఇవ్వాలని అతను అనుకున్నట్టుగా లేదు. దరిద్రుడనైన నేను సంపన్నుడ నైతే గర్వాంధకారంతో తనను సేవించనని తలచేడు కాబోలు ! లేక పోతే, ఆశ్రిత జనుల ఆర్తిని పోగొట్టే ఆ కృపా సముద్రుడు నన్ను ఐశ్వర్యవంతునిగా చేయ కుండా ఉంటాడా ?


ఇలా పరిపరివాధాలుగా ఆలోచిస్తూ తన ఊరు చేరుకున్న కుచేలునికి ఓ అద్భుత దృశ్యం కనిపించింది ! దరిద్రానికి నిలయమైన తన కొంప అప్పుడక్కడ లేదు. దాని స్థానంలో ఇప్పుడొక విలాస తమయిన భవనం కనిపిస్తోంది. అతని దరిద్రమంతా పటాపంచలై పోయింది.

కుచేలుని ఎదుట సూర్య చంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి కట్టడాలూ, శుక పిక మయూరాలతో నిండిన చక్కని ఉద్యాన వనాలూ, వికసించిన తామరలతో, కలువలతో కనులు పండువు చేస్తున్న సరోవరాలూ, మణికంకణాలూ, వివిధ ఆభరణాలు ధరించిన దాస దాసీజనమూ, కలిగిన ఒక అద్భత మందిరాన్ని చూసి, ఇది ఏ పుణ్యాత్మునిదో కదా ! అని అబ్బుర పడ్డాడు. ఆ దివ్య భవంతి తనదే అని తెలుసుకుని అమితానందం చెందాడు.

ఈ సంపదలన్నీ శ్రీకృష్ణుని కృపాకటాక్షం వల్లనే సిద్ధించాయని సంతోషించాడు.

నేను నా బాల సఖుని వద్దకు అర్ధ కాంక్షతో వెళ్ళాను. ఆ మహానుభావుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ అడుగ కుండా నాకు వీడ్కోలు పలికి పిమ్మట వీటిని నాకు సమ కూర్చాడు.

భక్తులు సమర్పించిన లేశమాత్రమయిన పదార్ధాల నయినా దానిని కోటి గుణితంగా భగవంతుడు స్వీకరించి మన్నిస్తాడని అనడానికి కుచేలుని కథ ఒక గొప్ప ఉదాహరణ అని చెప్ప వచ్చును.

ఇదీ కుచేలోపాఖ్యానం.

చివరిగా ఒక మాట.

కానుకలు తీసి కోవడమే కాదు ; ప్రతి కానుకలు ( రిటర్న్ గిఫ్ట్ లు ) ఇచ్చే సంస్కారమూ అలవరచు కోవాలి.

ప్రతి కానుక అంటే, దేవదాసు పార్వతికి ఇచ్చిన కానుక లాంటిది కాదండోయ్ !
పరికిణీ చాటున తెచ్చిన తాయిలాన్ని పార్వతి దేవదాసుకి ఇస్తే, అంతా తినేసి, ఏదో విషయంలో అలిగి చేతి కర్రతో పార్వతికి దేవదాసు ఒకటి ఇచ్చు కోవడం గుర్తుంది కదూ ! చంద్రునిలో మచ్చ లాగున పార్వతి నుదుటుటి మీద పాపం, ఆ మచ్చ అలాగే ఉండి పోయింది. ఆ అందమైన మచ్చతో మహానటి సావిత్రి ముఖారవిందం ఈ జన్మకి మరిచి పోగలమా ?

కానుకలు ఇవ్వడమూ, ప్రతి కానుకలు ఇవ్వడమూ కూడా ఓ కళ ! కదూ ?!!

ఇదండీ, కానుకల కథ !!

ఇక స్వస్తి.



27, డిసెంబర్ 2010, సోమవారం

వాగుడు కాయలకు ఓ ఝలక్ !


అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్ల గాను
కంచు మ్రోగు నట్లు కనకంబు మ్రోగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ.

సుప్రసిద్ధ మయిన ఈ వేమన పద్యం వివరించే అర్ధమే కలిగిన ఒక సంస్కృత శ్లోకం చూదామా ?

నిస్సారస్య పదార్ధస్య, ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ధ్వని స్తాదృక్ , యాదృ క్కాంస్యే ప్రజాయతే.

నిస్సారములయిన అల్ప వస్తువులకు ఆడంబరం ఎక్కువగా ఉంటుంది.
కంచు మ్రోగినట్లు బంగారం మ్రోగదు కదా !

26, డిసెంబర్ 2010, ఆదివారం

బాలల కోసం ఓ బహుమతి - జగన్నాథ శర్మ గారి సరళ వచన మహా భారతం


బాలల కోసం సరళ వ్యావహారికంలో అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ రచించిన మహా భారతం (ఆది పభా అరణ్య పర్వాలు ) హైదరాబాద్ పాలపిట్ట బుక్స్ వారు ఇటీవల వెలువరించారు.

పుస్తకం చూడ ముచ్చటగా ఉంది. బాలి వేసిన అందమైన ముఖ చిత్రంతో చూడ గానే ఆకట్టు కునేలా ఉంది. ముద్రాపకులు తమ ముందు మాటలో మరల ఎందుకనగా ... అంటూ, భారతాన్ని మరల ఎందుకు ప్రచురిస్తున్నారో సహేతుకంగా వివరించారు. తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అనే మాట ఈతరం పిల్లలకు తెలుసా ? అనే ప్రశ్నను ముందుగా సంధించి, ఆబాల గోపాలాన్ని శతాబ్దులుగా అలరిస్తున్న ఈ అధ్బుత పౌరాణిక గాథను మరల మరల ప్రతి తరం చదివి తీరాలని చెబుతున్నారు. ఇప్పటికే వ్యాస ప్రోక్త భారతాన్ని తెలుగులో చాల మంది పద్యంలోను, గద్యం లోను రచించారు. అత్యాధునిక సాంకేతిక ధోరణులు ప్రబలిన ఇరవయ్యొకటో శతాబ్దంలో జీవిస్తున్న వారి చేత సరి కొత్తగా చదివించాల్సిన గ్రంథమిది. భారతాన్ని ఎందరో తిరుగ రాసి నప్పటికీ, ఎప్పటికప్పుడు వచ్చే తరానికి కొత్తగా వినిపించాల్సిన గాథ మహా భారతం. అద్భుత కథన నైపుణ్యం కలిగిన జగన్నాథ శర్మ గారు పిల్లలకు సులువుగా బోధ పడేందుకు గాను, ఈ తరానికి నచ్చేట్టుగాను, వారి మనసు మెచ్చేట్టుగాను, చవులూరిస్తూ చదివించే విధంగా సరళ వచనంలో ఈ రచన చేసారు. నవ్య వార పత్రికలో ధారావాహికంగా వెలువడుతున్న ఈ పిల్లల వచన మహా భారతం అసంఖ్యాక పాఠకుల మనసులు దోచుకుంటోంది. ఎందరో ఎంతగానో ప్రశంసలు కురిపించారు, కురిపిస్తున్నారు. పద్దెనిమిది పర్వాల జగన్నాథ శర్మ గారి వచన భారతం రచనను మొత్తం ఆరు భాగాలుగా వెలువరిస్తున్నట్టుగా ప్రచురణ కర్తలు తెలియ జేస్తున్నారు. ఆ వరసలో వెలువడిన తొలి సంపుటం యిది. ఈ సంపుటిలో ఆది, సభా, అరణ్య పర్వాల కథ ఉంది. శర్మ గారు ఈ వచన భారతాన్ని తమ జననీ జనకులు అయల సోమయాజుల రామ సోదెమ్మ, జగన్నాథం గారలకు భక్తి ప్రపత్తులతో అంకితం చేసారు. ప్రతి ఇంట తల్లి దండ్రులు కొని , తమ చిన్నారులకు బహుమతిగా యిచ్చి వారి చేత చదివించ తగిన చక్కని పుస్తకమిది. పిల్లలకు ఇవ్వ తగిన గొప్ప బహుమతి గా పుస్తకాన్ని చెప్పుకో వచ్చును.

జగన్నాథ శర్మ గారి గురించి ఈ సందర్భంగా ఒకటి రెండు మాటలు .....

1956లో పార్వతీ పురంలో జన్మించిన శర్మ గారు వందలాది కథలు వ్రాసేరు. యువ మాస పత్రికలో వచ్చిన వీరి రాజధాని కథలు, పల్లకి వార పత్రికలో వచ్చిన మా ఊరి కథలు, ఆది వారం ఆంధ్ర జ్యోతిలో వచ్చిన అగ్రహారం కథలు విశేష ప్రాచుర్యం పొందాయి. నవలా రచయితగా, సినిమా, టి.వి. రచయితగా కూడా వీరు ప్రసిద్ధులు. ప్రస్తుతం నవ్య వారపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. అరణి, అనీలజ, నీలకంఠాచార్య వీరి కలం పేర్లు.

ఇప్పటి వరకు ప్రచురితమయిన వీరి రచనలు ....

తెలుగు లోనికి అనువాదం చేసిన ప్రపంచ ప్రఖ్యాత పిల్లల జాన పద కథలు పాల పిట్ట కథలు. ( వివరాల కోసం ఇక్కడ నొక్కి చూడండి)

పేగు కాలిన వాసన (కథా సంకలనం)

బాలల కోసం సరళ వ్యావహారికంలో రచించిన మహా భారతం ( ఆది సభా అరణ్య పర్వాలు)

త్వరలో వెలువడనున్న పుస్తకాలు ....

జగన్నాథ రధ చక్రాల్ ( నవ్య మొదటి పేజీ)

అగ్రహారం కథలు


20, డిసెంబర్ 2010, సోమవారం

భజంత్రీలు


పొగడ దండలు అనే టపాలో పొగడ్తల గురించి కొంత మాట్లాడు కున్నాం కదా ? ( ఇక్కడ నొక్కి చూడండి)

ఇప్పుడు పొగడ్తలలో రకాల గురించి చెప్పు కుందాం.

తప్పని పరి పొగడ్తలు, మొహ మాటపు పొగడ్తలు, బలవంతపు పొగడ్తలు, బరి తెగించిన పొగడ్తలు,ముక్తసరి పొగడ్తలు యిలా చాలా రకాలు ఉన్నాయి లెండి. ఇవి పొగిడే వాడి లెవెలుని బట్టీ,పొగిడించు కునే వాడి అర్హతానర్హతలను బట్టీ కూడా మారుతూ ఉంటాయి.

ఇవన్నీ అంతర భేదాలు. పొగడ్తలన్నీ కేవలం పొగడ్తలే కాక పోవచ్చు. అవి తెగడ్తలు కూడా కావచ్చును.

మందీ మార్బలాన్ని వెంట బెట్టుకుని ఓ పత్రిక ఆఫీసులో చెల్లికి ( మళ్ళీ) పెళ్ళి అని సొంత కవిత్వం వినిపించిన తణికెళ్ళ భరణి గుర్తున్నాడా ? అతను కవిత శీర్షిక చెప్తాడో, లేదో, చుట్టూ ఉన్న వాళ్ళు వహ్వా, వహ్వా అంటూ భజంత్రీలు వాయించేస్తారు. భరణి గారు ష్ ! నేనింకా కవిత్వం షురూ చెయ్ నే లేంటూ విసుక్కుంటారు కూడానూ.

ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు ప్రక్కన సొంత డబ్బాకి భంజంత్రీలు వాయించే మేళం మీకు గుర్తుండే ఉంటుంది.

ఎవడు కాయిన్ చేసాడో, కానీ, సొంత డబ్బా అనే మాట చాలా విలువైనది.

డబ్బా మనదైనప్పుడు ఎంత సేపయినా, ఎలాగయినా వాయించు కో వచ్చును కదా.

సొంత డబ్బా సంగతి ఇలా ఉంటే, ఒకరి జబ్బ ఒకరు చరుచు కోవడం కూడా ఉంటుంది. నువ్వు నా జబ్బ చరిస్తే, నీ జబ్బ నేను చరుస్తాను. అదీ మన మధ్య ఒప్పందం.

నువ్వు నా వీపు గోకితే, నేను నీ వీపు గోకుతాను. ( నా టపాకి నువ్వు కామెంట్లు పెడితేనే నీ టపాకి నేను కామెంట్లు పెడతాను )

ఈ సూత్రం అనుసరించి భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. డబ్బాలు వాగుతూ ఉంటాయి. వీపులు గోక బడుతూ ఉంటాయి.

సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, పొగడ్తల రకాలు చూదాం.

మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అని రెండు రకాలు చెబుతూ ఉంటారు.

బయటకి పొగుడు తున్నట్టే ఉంటుంది. లోపలి అర్ధం తిట్టడమే.

బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని , నిజానికి అది పొగడడమే.

వ్యాజ స్తుతి అంటే, స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.

వ్యాజ నింద అంటే, నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.

ముందుగా వ్యాజస్తుతికి ఉదాహరణలు చూదాం:

పెద్దా పురం ప్రభువు తిమ్మ రాజు వొట్టి లోభి. ఎంగిలి చేత్తో కాకికిని తోలడు. దాన దరిద్రుడు. ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి:

అద్దిర శ్రీ భూ నీళలు

ముద్దియలా హరికి గలరు ముగురందరిలో

పెద్దమ్మ నాట్య మాడును

దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

శ్రీహరికి ముద్దు సతులు మువ్వురు. శ్రీభూనీళలు. వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని ఇక్కడ కవి భావం.

తెనాలి రామ కృష్ణ కవి పేర వినిపించే ఈ చాటువు చూడండి:

అన్నాతి గూడ హరుడగు

నన్నాతిని గూడ కున్న నసుర గురుండౌ

నన్నా తిరుమల రాయుడు

కన్నొక్కటి లేదు కాని కంతుడు గాడే.

కవి ప్రభువును సాక్షాత్తు శివుని తోను, శుక్రాచార్యునితోను, మన్మధుని తోను సరి పోలుస్తున్నాడు.

అయితే, ఈ పొగడ్తలు కండిషనల్డ్ పొగడ్తలు. ఎలాగంటే,

రాజు గారు తమ రాణీ గారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే. ఎందు కంటే, పాపం, రాజు గారు ఏకాక్షి. ఒంటి కన్ను వాడు. రాణి గారి తో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివీ కలిపి మూడు కన్నులవుతాయి కనుక, ప్రభువులవారు ముక్కంటితో సమానం.

రాణి తో కలసి ఉండ నప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడయిన శుక్రాచార్యడితో సమానం.

శుక్రాచార్యుని వలె రాజు గారికి కూడా ఒకే కన్ను కనుక ఈ పోలిక అన్వర్ధం అంటాడు కవి.

అంతే కాదు, ఒక కన్ను లేదు కానీ, ప్రభువు సాక్షాత్తు మదనుడేనట.

నగపతి పగతు పగతుని

పగతుండగు మగధ రాజుఁబరి మార్చిన యా

జగ జట్టి యన్న తండ్రికి

దగు వాహన మైన యట్టి ధన్యుండితడే.

ఈ పద్యంలో బాదరాయణ సంబంధం చిక్కు విడ దీస్తే వచ్చే అర్ధం - దున్న పోతు

అని !

నగపతి - ఇంద్రుడు

అతని పగతుడు (శత్రువు) - నరకుడు

అతని పగతుడు - శ్రీ కృష్ణుడు

అతని పగతుడు - జరాసంధుడు ( మగధ రాజు)

అతని పగతుడు - భీముడు

అతని అన్న - ధర్మ రాజు

అతని తండ్రి - యముడు

అతని వాహనం - దున్న పోతు !

ఈ పద్యంలో కవి సభలోని వారిని కసి తీరా ఎలా పొగడ్త రూపంలో తిడుతున్నాడో చూడండి:

కొందరు భైరవాశ్వములు, కొందరు పార్ధుని తేరి టెక్కెముల్

కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని యెక్కిరింతలున్

కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు నీ సదస్సులో

నందరు నందరే మఱియు, నందరు నందరు నందరందరే.

సభలోని వారందరినీ కుక్కలు, కోతులు,పందులు, దున్న పోతులు, గాడిదలు అని కవి వెక్కిరిస్తున్నాడు.

ఈ పద్యం చూడండి:

ఎఱుగుదువు సకల విద్యలు

నెఱుఁగని విఁవ రెండు కలవ వేవే వన్నన్

పిఱికి తనంబును లోభము

గుఱుతెఱుఁగవు జగతి నెన్న గువ్వల చెన్నా

కవి గారు రాజుని పొగుడుతూ, ఇలా అన్నాడు: ఈ ప్రభువుకి అన్నీ తెలుసు. సకల విద్యలూ వచ్చును. మహా వివేకి. కాని రెండే తెలియవు . అవి ఏమంటే, పిఱికి తనం అంటే తెలియదు. లోభత్వం అంటే తెలియదు. పొగడ్త అంటే శీతాకాలంలో గోరు వెచ్చని నీటి స్నానం లాగ ఇలా ఉండాలి!

చివరిగా ఓ పద్యం. ( బూతు అని వార్యం)

జూపల్లి ధర్మా రాయుడు అనే రాజు మహా పిసినారి. అర్ధులకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటాడు.రప రాజు అనే బట్టు కవి అతనిని యాచించ డానికి అతని సభకి వెళ్ళి వచ్చేడు. ఆ కవికి సూరప రాజు అనే కవి మిత్రుడు ఒకడు ఉన్నాడు. రాజ దర్శనానికి వెళ్ళి వచ్చిన తన మిత్రుడైన ఈరప రాజుని చూడగానే ఆత్రతతో ప్రభువులు ఏమిచ్చారు, ఏమిచ్చారు ? అని అడిగేడు.

సూరప రాజు:

‘‘ జూపల్లె ధరాయం

డేపాటి ధనం బొసంగె ? నీరప రాజా ?’’

దానికి ఈరప రాజు ఇచ్చిన సమాధానం ఇదీ !

‘‘పాపాత్ముండెవ్వరికిని

చూపనిదే చూపెనయ్య, సూరప రాజా !’’

ఆ పాపాత్ముడు ఎవరికీ చూపించనిది కవిగారికి చూపించేడుట.

ఇప్పుడు నిందా రూప స్తుతి చూదాం

బయటకి నిందిస్తున్నట్టే ఉంటుంది. అంతరార్ధం మట్టుకు పొగడడమే. దీనికి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం గొప్ప ఉదాహరణ. మచ్చునకు ఒక్క పద్యం చూదాం:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై

యఖిల భారకు డన్న నాఖ్యఁదెచ్చె

నిష్ట సంపన్నురాలిందిర భార్య యై

కామితార్ధదుఁడన్న ఘనత తెచ్చె

కమల గర్భుఁడు సృష్టి కర్త తనూజుఁడై

బహు కుటుంబికుఁడన్న బలిమి తెచ్చె

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై

పతిత పావనుఁడన్న ప్రతిభ తెచ్చె

అండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతి కాని

మొదటి నుండియు నీవు దామోదరుఁడవె !

చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ 1

హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !!

శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుకి అఖిల భారకుడు, కామితార్ధదుడు, బహు కుటుంబీకుడు, పతిత పావనుడు అనే బిరుద నామాలు ఉన్నాయి. వాటికి వరుసగా సమస్త లోకాల భారాన్ని వహించే వాడు, కోరిన కోరికలను తీర్చే వాడు, పెద్ద కుటుంబం కల వాడు, అన్ని పాపాలు పోగొట్టే వాడు అని అర్ధాలు. అయితే, విష్ణు దేవునికి ఈ బిరుద నామాలు అన్నీ అతని ఇరువురి భార్యలు, కుమారుడు, కుమార్తెల వలన వచ్చినవే కాని అతని గొప్ప ఏమీ లేదని, అతను తొలి నుంచి దరిద్ర దామోదరుడనీ కవి ఇందులో హేళన చేస్తున్నాడు.

నిజానికి ఇది, నిందా రూపమైన స్తుతి .

సమస్త భారాన్నీ వహించే భూదేవి అతని భార్య. భర్త అంటే, భరించే వాడు. అంటే సమస్త భారాన్నీ వహించే భూ దేవిని భార్యగా పొందిన హరి ఎంత ఘనుడో కదా ? సర్వ సంపదలనూ ప్రసాదించే లక్ష్మీ దేవినే భార్యగా పొందిన విష్ణువు ఘనత ఎన్నతరమా ?

అదే విధంగా, అన్ని ప్రాణులను సృష్టించే వానిని పుట్టించిన వాడు, పాపాలు హరించే గంగను కుమార్తెగా పొందిన వాడు ఎంతటి ఘనుడో కదా.

దామోదరుడు అంటే, దామము ( పద్మము) ఉదరము నందు కల వాడు అని అర్ధం. పద్మ గర్భుడు .

చిత్ర విచిత్రమయిన ప్రభావాలు కల వాడు, దయా గుణము కల వాడు, శత్రువులనే వారిని రూపుమాపిన వాడు శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడు.

ఇవీ నిందా రూప స్తుతి, స్తుతి రూప నిందలకు కొద్ది పాటి ఉదాహరణలు.

ఇస్తే పొగడడం లేక పోతే నోటి కొచ్చినట్టు తిట్టడం కూడా ఒక కళగా మన కవులు నిర్వహించేరు.

చూడండి. వీర మల్లుడు అనే రాజు ఒక కవికి కొన్ని మాన్యాలు ఇచ్చేడు. తిరిగి ఎందుకో వాటిని లాగేసు కున్నాడు దాంతో కవి గారికి తిక్క రేగి రాజుని ఇలా తిట్టేడు:

తెగి తాఁ బొడువని పోటును

తగ నర్ధుల కీయ నట్టి త్యాగము, సభలోఁ

బొగిడించు కొనుచుఁ దిరిగెడి

మగ లంజల మగడు వీర మల్లుడు ధాత్రిన్

వీర మల్లుడు వట్టి పిరికి పంద. దాన గుణం ఇసుమంత లేదు. ఎప్పుడూ చుట్టూరా తనని పొగిడే వాళ్ళని ఉంచుకుని తనివి తీరా పొగడించు కుంటూ ఉంటాడు. ఈ వీర మల్లుడు మొడుడికి మొగుడు.

ఇవీ పొగడ దండలు. స్వస్తి.

17, డిసెంబర్ 2010, శుక్రవారం

పొగడ దండలు !!


లోకంలో పొగడ్తకి లొంగని వాడు లేడు. బయటకి ’అబ్బే, మీరు మరీనూ ...‘ అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, లోపల లోపల ఆ పొగడ్తలకి పొంగి పోతూనే ఉంటాడు. మరి కాస్సేపు పొగిడితే బావుండునని అనుకుంటూ ఉంటాడు.తనని పొగిడే వాడి కోసం ఏం చేయడానికయినా సిద్ధ పడి పోతాడు.పొగడ్తల మహిమ అలాంటిది మరి !

ఆడవాళ్ళయితే ఈ పొగడ్తలకి మరింత తేలికగా వశులై పోతారనే అభిప్రాయం కూడా లోకంలో ఉంది. మగరాయళ్ళు ఆ బలహీనతను బాగా ఉపయోగించు కుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

పూర్వ కాలంలో రాజులు ఈ పొగడ్తలు చెవిని పడనిదే శయ్య దిగే వారు కాదు. కనులు తెరిచే వారు కాదు. భట్రాజులు రకరకాలుగా పొగుడుతూ ఉంటే కాని వారి అడుగు ముందుకి పడేది కాదు.

రాజకీయ నాయకుల చుట్టూ చేరే అనుచర గణం ఆ నాయకుని ప్రతి మాటకీ చర్యకీ వత్తాసు పలుకుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. దానితో సదరు నాయకమ్మన్యుడు భూమికి ఓ అడుగు ఎత్తున విహరిస్తూ ఉంటాడు.

పొగడ దలచిన వాడెప్పుడూ స్వీయ ప్రయోజనం నెర వేరాలనే ఆలోచిస్తాడు. ఎవడిని పొగుడు తున్నాడో వాడిలో అతనికి ఏ లోపాలూ కనిపించవు. అన్నీ సుగుణాలే మిల మిలా మెరిసి పోతూ ఉంటాయి. ధగ ధగా వెలిగి పోతూ ఉంటాయి.

కూరిమి గల దినములలో నేరము లెన్నడూ కనిపించవు కదా ! ఆ కూరిమి విరసమై నప్పుడే కదా, అన్ని దోషాలూ కనిపిస్తూ ఉంటాయి.

అందు వలన ఇవాళ పొగిడిన వాడు రేపు పొగుడుతాడనే గ్యారంటీ లేదు. పొగిడినా, మునపటి స్థాయిలో పొగుడుతాడనే భరోసా లేదు.

నీ ప్రభ వెలుగుతున్నంత కాలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తిన వాడే రేపు నిన్ను నిర్ధాక్షిణ్యంగా తిట్టి
పోయడానికి వెనుదీయడు.

నువ్వు ఇంద్రుడివనీ, చంద్రుడివనీ, అదనీ ఇదనీ , తెగ పొగిడిన నోరే తెగనాడుతుంది.

నీ ముందు పాదాక్రాంతుడైన వాడే నీ ముఖాన ఛీత్కరించుకు పోతాడు.

సరే, ఇదంతా కాస్సేపు ప్రక్కన పెడితే.

ఎవరెవరిని పొగడాలో ఎవరిని అస్సలు పొగడ కూడదో కవి గారు ఒక శ్లోకంలో చెబుతున్నారు.

చూడండి:

ప్రత్యక్షే గురవ: స్తుత్యా:, పరోక్షే మిత్రబాంధవా:
కర్మాంతే దాసభృత్యాశ్చ, న కదాచన పుత్రకా:

గురువులను ఎదుట పొగడ వచ్చును.
బంధువులను, మిత్రులను వారి పరోక్షంలో మాత్రమే పొగడాలి.
సేవకులను, వారి విధి నిర్వహణ పూర్తయేక పొగడాలి.
పుత్రులను మాత్రము ఎన్నడూ పొగడ కూడదు సుమా !

గురువులు ఙ్ఞాన ప్రదాతలు. వారి గొప్పతనాన్ని వారి సముఖాన పొగిడితే దోషం కాదు. వారు స్థిత ప్రఙ్ఞులు కనుక మనం పొగిడినంత మాత్రాన పొంగి పోరు. పొగడక పోతే చిన్నబుచ్చు కోరు.

బంధువులు . స్నేహితులు ... వీరి గురించి ఎట్ట ఎదుట పొగడ కూడదు. మరీ అంత భజన పనికి రాదు. మరీ పొగుడుతూ ఉంటే వారి కళ్ళు స్థాన భ్రంశం చెందే అవకాశం కూడా ఉంది.

ఇక, పని వాళ్ళని ఎప్పుడు పొగడాలయ్యా, అంటే, వాళ్ళ పని, వాళ్ళు సక్రమంగా పూర్తి చేసిన తరువాత మాత్రమే పొగడాలి.

మా పనమ్మాయి అంత మంచిది, ఇంత మంచిది, అంత పనిమంతురాలు, ఇంత పనిమంతురాలు అంటూ ఆమె పని చేయక ముందే పొగిడితే ఉబ్బి తబ్బిబ్బయి పోయి మనతో పాటు టీ.వీ చూస్తూ కూర్చుంటుంది, కమ్మని కాఫీ ఇస్తే చప్పరిస్తూ ...

చివరిగా ఎవరిని ఎప్పుడూ పొగడ కూడదో కూడా చెబుతున్నాడు కవి, పుత్రులను అసలు ఎప్పుడూ పొగడనే కూడదట.

అలా పొగడడం వారికి ఆయుక్షీణం అని మన వారి నమ్మకం కూడానూ.

పుత్రులను పొగడరాదని చెప్పడానికి ప్రచారంలో ఉన్న ఓ కథని చూదాం ...

కిరాతార్జునీయమ్ వ్రాసిన భారవి గురించిన ఈ కథ లోకంలో ప్రచారంలో ఉంది.

యువకుడైన భారవి కవిత్వాన్ని, గొప్పతనాన్ని మెచ్చు కుంటూ అందరూ తెగ పొగుడుతూ ఉంటే, భారవి తండ్రి మాత్రం కొడుకు గురించి ఒక్క మెచ్చుకోలు మాటా అన లేదుట.

దానితో భారవికి విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. తండ్రి బుర్ర బ్రద్దల కొట్టేద్దామా అన్నంత ఆగ్రహం కలిగింది.

అదే పని మీద ఓ రాత్రి ఒక పెద్ద బండ రాయిని పట్టుకుని అటక ఎక్కి కూర్చున్నాడు. రాత్రి పూట తండ్రి గారి బుర్ర మీద దానిని గిరాటు వేసి, తనని పొగడని తండ్రి గారి మీద తన కసి తీర్చు కోవాలని అనుకున్నాడు.

సరే, రాత్రయింది. భారవి తల్లిదండ్రులు అక్కడకి చేరి మాట్లాడుకుంటున్నారు. అదను కోసం చూస్తున్న భారవి చెవిని ఆ మాటలు పడుతున్నాయి.

‘‘లోకమంతా మన భారవి కవిత్వాన్ని ఇంతలా మెచ్చు కుంటూ ఉంటే, మీరేమిటండీ వాడి గొప్పతనాన్ని గురించి ఒక్క మాటా అనరు ? వాడిని పొగిడితే మీ నోటి ముత్యాలేమయినా రాలి పోతాయా ? ’’ అని నిష్ఠూరంగా పలికింది తల్లి.

దానికాయన, ‘‘ పిచ్చి ముఖఁవా ! ( పెళ్ళాల వెప్పుడూ పిచ్చి ముఖా లే కదా, హత విధీ !!) భారవి గొప్ప తనం నాకు తెలియదుటే? వాడు ఎంత గొప్ప కవిత్వం వ్రాస్తున్నాడో చూస్తున్నాను. వాడి గొప్ప తనం చూసి ఎంతగా పొంగి పోతున్నానో, నీకేం తెలుసు? అయితే, మన బిడ్డని మనం పొగడ కూడదు. అది వాడికి శ్రేయస్కరం కాదు. అంచేత వాడిని పొగడడం లేదు కానీ , వాడంటే ఇష్టం లేక కాదు సుమీ ! ’’ అన్నాడు.

అంతే !

భారవి కవి ఆగ్రహమంతా మంచులా కరిగి పోయింది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి తను చేయ దలచిన ఘోరకృత్యం గురించి చెప్పి, తన పాపానికి తగిన శిక్ష విధించ మని కోరాడు.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. శిక్ష విధించి తీరాలని పట్టు పట్టేడు.

‘‘సరే, ఓ యేడాది పాటు మీ అత్తారింట గడిపి రా ! ’’ అని తండ్రి శిక్ష విధించాడు.‘ ఇదేం శిక్ష! ’ అనుకుని భారవి ఎగిరి గంతేసి, భార్యతో పాటు అత్తారింటికి వెళ్ళాడు.

కొన్ని రోజు పాటు అత్త వారింట సకల మర్యాదలూ జరిగేయి. తర్వాత మొదలయ్యేయి, విసుక్కోవడాలూ, సణుక్కోవడాలూ, పిల్లి మీదా కుక్క మీదా పెట్టి వ్యంగ్యాస్ర్తాలూ, సూటీపోటీ మాటలూ ...

కవి గారు ఏం చేస్తారు; భరించక తప్పదు, శిక్షా కాలం యేడాదీ ముగిసే వరకూ.

ఇలా ఉండగా భార్య ఏదో నోము చేయాలనుకుంది. చేతిలో ఎర్ర ఏగానీ లేదు. భార్య కోరిక ఎలా తీర్చడం ?

భారవి అప్పుడు తను వ్రాస్తున్న కిరాతార్జునీయమ్ కావ్యం లోనుండి ఓ శ్లోకం ఉన్న తాటాకు తీసి, ఆమెకి ఇచ్చి, ఎవరిదగ్గరయినా దానిని కుదవ పెట్టి ధనం తెచ్చుకుని నోము చేసుకొమ్మన్నాడు.

ఆమె దానిని ఊర్లో ఓ ధనవంతుడయిన ఒక వ్యాపారి వద్ద కుదవ పెట్టింది. అతడు ఆ శ్లోకం చూసి, భారవి కవిత్వం గొప్ప తనం తెలిసినవాడు కనుక, ఆమెకు చాలా ధనం ఇచ్చి పంపించాడు.

తరువాత, అతడు ఆ తాళ పత్రాన్ని ఒక కత్తి ఒర లో ఉంచి, గూట్లో పెట్టాడు. ఆ పిమ్మట ఆ వణిజుడు వర్తకం కోసం చాలా ఏళ్ళపాటు దూర దేశాలకు వెళ్ళాడు.

అలా దేశాలు పట్టి తిరిగి, చాలా ఏళ్ళకి ఇంటి కొచ్చిన అతనికి తమ పడక గదిలో ఎవరో పరాయి మగాడు ఉండడం గమనించి ఆగ్రహం కలిగింది. మరో ఆలోచన లేకుండా గూట్లో ఉన్న ఓర లోనుండి కత్తిని బయటకి లాగేడు. దానితో పాటు, ఎప్పుడో తాను అందులో పెట్టిన తాళపత్రం కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా, అని చదివాడు.

అందులో భారవి వ్రాసిన ఈ శ్లోకం ఉంది:

సహసా విధధీత నక్రియామ్
అవివేక: పరమాపదాం పదాం
వృణుతేహి విమృశ్య కారిణామ్
గుణ లుబ్ధా: స్వయమేవ సంపద:

వేయి విధాలుగా ఆలోచించి కాని ఏ పనీ చేయ కూడదు. చక్కగా ఆలోచించి పని చేసిన వానికి సంపదలు తమంతట తామే సమ కూడతాయి. అని దీని భావం.

ఈ శ్లోకం చదివేక, అతని కోప తీవ్రత కొంత తగ్గింది. కాస్త చల్ల బడ్డాడు. ఈ లోగా భార్య లేచి, అతని రాకను చూసి అమితానందం చెంది, ఆ పురుషుని తమ బిడ్డగా పరిచయం చేసింది.చాలా ఏళ్ళ క్రింట తాను విదేశ గమనానికి సిద్ధ పడిన రోజులలో భార్య గర్భవతి అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చిందతని.

తొందర పడి కత్తి వేటుకి చేజేతులా భార్యనీ కొడుకునీ కడ తేర్చే వాడిని కదా అని అతడు పశ్చాత్తాపం చెందాడు. తనని తొందర పాటు నుండీ, ఒక మహా విపత్తు నుండీ కాపాడిన ఆ శ్లోక కర్త భారవికి అతడు భూరి కానుకలిచ్చి సత్కరించేడు.


ఇక, పొగడడంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్దతి అనే రకాలు కూడా ఉన్నాయండోయ్. అంటే, పొగుడు తున్నట్టుగా తిట్టడం, తిడుతున్నట్టుగా పొగడడం. వీటినే మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అంటారు. ఆ రకమయిన పద్ధతులను గురించి విపులంగా పొగడ దండలు 2 టపాలో చూదాం.

స్వస్తి.

16, డిసెంబర్ 2010, గురువారం

వెర్రి మొర్రి శంకలు

అనుమానం పెనుభూతం అన్నారు. మనకి రాను రాను అన్నీ అనుమానాస్పదాలుగానే తోచడం ఒక విషాదం. తినే తిండి మంచిదో కాదో అనుమానం. తాగే నీరు మంచిదో కలుషితమైనదో భయం. పీల్చే గాలి స్వచ్ఛమైనదో కాదో అనే శంక పీడిస్తూ ఉంటుంది. చదివే చదువుకి సరైన ఉపాథి లభిస్తుందో లేదో తెలియక సతమత మైపోతూ ఉంటాం. దరి చేరిన వాడు మిత్రుడో, సమయం చూసి వెన్ను పోటు పొడుస్తాడో తెలియదు. వొంటికి ఏ రోజున ఏ రోగం వస్తుందో అని హడలి పోయి ఛస్తూ ఉంటాం. సగం రోగాలకి ఆ భయమే కారణం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మ కూడదో తెలియదు. నమ్మిన వాడు పాల ముంచుతాడో, నట్టేట ముంచుతాడో అర్ధం కాదు. నమ్మక పోతే ఏం అనర్ధమో తెలియదు. ఆఫీసు కెళ్ళిన భర్త / భార్య అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారో అనే అనుమానంతో వ్యథ చెందే అనుమాన పిశాచులూ ఉంటారు. అలాంటి మూర్ఖుల వల్ల వారికీ మశ్శాంతి ఉండదు. వారిని వెన్నంటి ఉండే వారికీ సుఖం ఉండదు. ఇంటికి వేసిన తాళం గడియ ఊడిపోయే లాగున పది సార్లు లాగి చూస్తే కానీ తాళం సరిగా వేసామో, లేదో, అనే శంక తీరదు. ఊరికెళ్ళి వచ్చే సరికి ఇల్లు దోచుకో బడకుండా భద్రంగా ఉంటుందో లేదో అనే అనుమానంతో మనశ్శాంతి కరువవుతుంది. బజారులో కొన్న పచారీ వస్తువులు కల్తీవో, నాణ్యమైనవో గ్రహించడం కష్టమై పోతోంది. విత్తనాలు కొన్న రైతుకి పాపం, అవి మంచివో, నకిలీ విత్తనాలో తెలీదు. పోనీ, పండిన పంట ఏరకమయిన అతివృష్టి, అనావృష్టి లాంటి వేవీ లేకుండా సరిగా చేతి కందుతుందో లేదో తెలీదు. మన వద్ద ఉన్న వంద, అయిదు వందలు, వెయ్యి నోట్లు మంచివో కాదో తెలియక తికమక పడిపోతూ ఉంటాం.బోలెడు డబ్బు పోసి టిక్కెట్లు కొనుక్కుని వెళ్తే సినిమా బావుంటుందో, చీదేస్తుందో తెలియదు.ఇంట్లో కరెంటు ఎప్పుడు టప్పున ఆరి పోతుందో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా ఎంత సేపు ఉంటుందో గ్యారంటీ లేదు. ఇంటాయన ఇంటద్దె ఎప్పుడు పెంచేస్తాడో ఏమో అని బెంగ పడుతూ ఉంటాం. సొంత ఇల్లయితే, ఏలిన వారు ఎంత శాతం పన్ను పెంచి పన్నూడ గొడతారో తెలియదు.ముచ్చట పడి కొనుక్కున్న చీర రంగు ఎంత కాలం వెలిసి పోకుండా ఉంటుందో నిర్ధారణగా చెప్పలేం. పత్రికకి పంపిన రచన పడుతుందో, తిరిగొస్తుందో ఎవరికెరుక ? అచ్చేసుకున్న పుస్తకాలు అమ్ముడు పోతాయో, మూలన పడి బూజు పడతాయో తెలియదు. ఎక్క వలసిన రైలు, లేదా విమానం సకాలానికి బయలు దేరుతుందో, రద్దవుతుందో తెలియదు. నల్లా లో నీళ్ళు ఎప్పుడు వదులుతారో ఏమో తెలియదు. వచ్చినా, ఎంత సేపు ఉంటుందో తెలియదు. ఎంత బాగా రాసినా పరీక్షలో ఎన్ని మార్కులు పడతాయో తెలియదు. ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చిన ఉద్యోగం ఎప్పుడు ఊడి పోతుందో నమ్మకం లేదు. కంప్యూటరు ఎప్పుడు మొరాయిస్తుందో ఖర్మ ! మహిళా బిల్లు అమలుకి నోచు కుంటుందో లేదో ? భీమ్ పాపాల శర్మ మన నెత్తి మీదకి మళ్ళీ ఏ సినిమా కథ చెబుతాడో తెలీదు. విప్లవం వస్తుందో రాదో అగమ్య గోచరం. ఏ ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టు కుంటుందో ఎవడికీ తెలియదు. పొత్తులు ఎంత కాలం నిలుస్తాయో అసలే తెలీదు. అయోధ్యలో రామాలయం కడతారో లేదో తెలీదు. తెలంగాణా వస్తుందో రాదో తెలీదు. వస్తే, హైదరాబాదు సంగతి ఏం చేస్తారో తెలీడం లేదు. తీరా, తెలంగాణా ఇచ్చేక మరెన్ని చిన్న రాష్ట్రాల కోసం పేచీలు మొదవుతాయో తెలీదు. గెలిపించిన ప్రభుత్వం ఐదేళ్ళూ పాలిస్తుందో, మధ్యంతరానికి దారులు తీస్తుందో చెప్ప లేం. 2012 దాటేక ప్రళయం వస్తుందో ఏమో నని బెంగ. ( ఈ విషయంలో ఇప్పటికే ఘనత వహించిన కొన్ని టీ వీ ఛానెళ్ళు పని కట్టుకుని ఊరికే ఊదర గొట్టేస్తున్నాయి కదా ? )

ఈ కథా మంజరి టపాని ఎంత మంది చదువుతారో తెలీదు. చదివిన వారు ఎంత మంది కామెంట్ లు పెడతారో తెలీదు

ఇది అనంతం. వీటికి అంతం లేదు.....

హితోపదేశంలో కవి ఒక శ్లోకంలో మనకు కలిగే అనేక శంకల గురించి ఉటంకిస్తూ, అన్ని శంకలు పెట్టుకుంటే బతక లేం అని తేల్చి పారేసేడు.

చూడండి:

శంకాభి: సర్వ మాక్రాంతం, అన్నం పానం చ భూతలే
ప్రవృత్తి: కుత్ర కర్తవ్యా, జీవితవ్యం కథం ను వా.

భూమ్మీద అన్ని విషయాలూ అనేక అనుమానాలతో కూడి ఉంటున్నాయి.
చివరకి అన్నం తినడం, నీరు త్రాగడం కూడ అనుమానం వల్ల దుర్భరమవుతోంది. అంటే,
తినడానికీ, త్రాగడానికీ కూడా ఊరికే భయ పడి పోతూ ఉంటున్నాం. ఇలాగయితే బతకడం ఎలాగ ? అని దీని భావం.

ఇన్ని అనుమానాలతో బతకడం కష్టం కనుక మరీ వెర్రి మొర్రి అనుమానాలు పెట్టు కోకుండా ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఈ టపా రాయడంలో నేను చెప్ప దలచిన పరమార్ధం అదే.

ఈ విషయం ఎంత మంది సరిగా అర్ధం చేసుకుంటారో కదా, అనేదే నా అనుమానం !!

స్వస్తి.



10, డిసెంబర్ 2010, శుక్రవారం

నస మంజరి - 2


ఒకటి నుండి వంద వరకూ ఉన్న అంకెలలో వందదే అగ్రస్థానం. వంద ఒక పూర్ణత్వానికి నికషగా మనం భావిస్తూ ఉండడం కద్దు.

ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే సినీ జీవులు దానిని ఒక గొప్ప కితాబుగా భావిస్తూ ఉంటారు. తమ చిత్ర రాజం వంద రోజులు ఆడడం కోసం ఎన్ని పుర్రాకులయినా పడుతూ ఉంటారు. వంద రోజుల ఆటలూ ఎలాగో ఒక లాగ పడే లాగున నానా తంటాలూ పడుతూ ఉంటారు. ఆడక పోయినా, ఆడిస్తారు.చివరకి వంద రోజులూ పూర్తి కాగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చు కుంటారు. భుజాలు చరుచు కుంటారు.

అలాగే, మన పెద్దలు ఆశీర్వదించేటప్పుడు ‘ శతమానం భవతి’ అంటూ ఆశీర్వదిస్తారు. నూరేళ్ళు బ్రతకమని కోరు కుంటారు. ( కాకిలా కలకాలం బ్రతకడం వేష్టుగా భావించే నిరాశా వాదులూ ఉంటారు. అది విషయాంతరం)

మహానుభావుల శత జయంతులు ఘనంగా జరుపు కుంటూ ఉంటాం. వందేళ్ళ నాటికి కూడా వారి పేరు స్మరించు కోవడం వారి ఘనతకు నిదర్శనం.

వంద సంఖ్యను తలుచు కుంటూ ఉంటే వంద మంది కౌరవులు గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు. వంద సంఖ్య ప్రత్యేకతను మంట గలిపిన వారు కౌరవులు

కవి ఆరుద్రకి కూడా వంద సంఖ్య మీద ఏమంత ప్రత్యేక మైన మోజు ఉన్నట్టుగా తోచదు.

తరాని కో వంద కవులు
తయారవుతా రెప్పుడూ
వంద లోనూ మంద లోనూ
మిగల గలిగే దొక్కడు !

అని తేల్చి చెప్పీసేడు.


సరే, ఈ శ్లోకం చూడండి ...

శతనిష్కో ధనాఢ్యశ్చ, శతగ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా, శత శ్లోకేన పండిత:

వంద నిష్కలు కల వాడు ధనికుడు. వంద గ్రామాలు కల వాడు భూకామందు. వంద గుఱ్ఱాలు కల క్షత్రియుడే రాజు. వంద శ్లోకాలు ఎవడి కయితే వచ్చో, వాడు పండితుడు అని దీని అర్ధం.

ఈ లెక్కలో నిష్కము అంటే, మాడ, టంకము, నూట యెనిమిది మాడలు, పతకము, బంగారము, వెండి అనే అర్ధాలు ఉన్నాయని శబ్ద రత్నాకరం చెబుతోంది.

మాడ అంటే బంగారం అని నిఘంటువు. ఒక ప్రత్యేక మైన విలువ కలిగిన బంగారు నాణెము మాడ.

టంకము అనే దానికి పదహారు డబ్బుల బంగారు నాణెము అని నిఘంటువు. దీనికే దీనారము అని మరో పేరు.

మరి, డబ్బు అంటేనో ? రెండు దుగ్గానుల రాగి నాణెము అని అర్ధం.

దుగ్గాని అంటేనో ?

దుగ + కాని = దుగ్గాని. అంటే రెండు దమ్మిడీల విలువ కలది. ఈ పాత కాలపు నాణేల గురించి తెలుసు కోవడం తమాషాగా ఉంటుంది. ఒక టంకానికి పదహారు డబ్బులు కనుక ఈ లెక్క ప్రకారం ఇక్కడ కాని అంటే దమ్మిడి అని శబ్ద రత్నాకరం చెబుతోంది.

అయిదు కాసుల నాణెమును దమ్మిడి అంటారుట. కొందరయితే, రెండు కాసుల నాణెమును దమ్మిడి అంటారని నిఘంటువు వివరిస్తోంది.

ఇక, కాసు అనే పదానికి నిఘంటువు ఏం చెబుతోందో సరదాగా చూదాం ...

కాసు అంటే,దుగ్గానిలో నాలుగవ భాగమని కొందరు, కాదు కాదు ... దుగ్గానిలో పదవ భాగమని కొందరు అంటారుట.

కాసు వీసం కలిగి ఉంటే ... అని ఒక గేయంలో గురజాడ ప్రయోగించాడు. వీసం అంటే ఒక రూకలో పదహారవ భాగం.



నిఘంటువు రూక అనే పదానికి ధనము అనే అర్ధంతో పాటు, చిన్న మెత్తు వెండి బంగారముల నాణెము అని కూడా అర్శాన్ని ఇచ్చింది.

ఇప్పుడోసారి మళ్ళీ వెనక్కి డబ్బు దగ్గరకి వెళదాం.

డబ్బు అంటే రెండు దుగ్గానుల నాణెం అని తెలుసు కున్నాం కదా?

డబ్బు అనే దానికి బొంకు, బొంకు పలకడం అనే వేరే అర్ధాలు కూడా ఉన్నాయి !

వాడొక డబ్బు డబ్బేడు అంటే, వాడొక అబద్ధం చెప్పేడు అని అర్ధం. ( ఈ ఉదాహరణ నిఘంటు కారుడు ఇచ్చినదే)
ఈ అర్ధాలే కాక, డబ్బు అనే దానికి డంబము అనే అర్ధం కూడా ఉంది. డంబము అంటే, స్థితికి మంచిన వేషము అని అర్ధం.


ఏతావాతా ఇంతలా కొండను తవ్వి నేను పట్టిన ఎలుక ఏమిటయ్యా అంటే,

డబ్బు అంటే వొట్టి అబద్ధం అని మనం గ్రహించాలి. డబ్బు అనే పదార్థం వొట్టి మిథ్య. వచ్చి నట్టే ఉంటుంది. రాదు. ఉన్నట్టే ఉంటుంది, ఉండదు. వస్తూనే పోతూ ఉంటుంది. పోతూ వస్తూ ఉంటుంది. నానా రగడా చేస్తుంది. దానికి అల్లరీ ఆగమూ హెచ్చు. ఉన్నప్పటికీ తృప్తి నివ్వదు. లేక పోతే బతక నివ్వదు. లక్ష్మి చంచలమైనదని ఊరికే అన్నారా?

అందు చేత ఈ డబ్బు మాయలో పడి కొట్టుకు పోకుండా జీవితం వేరే విధంగా సార్ధకం చేసుకోడానికి మార్గాలు ఏమైనా వెతుక్కోవాలి. తప్పదు.

ఎందు కంటే,

ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే, నారీ గృహ ద్వారి, జన:శ్మశానే
దేహాశ్చితాయాం పర లోక మార్గే, కర్మా2నుగో గచ్ఛతి జీవ యేక:

అని పెద్దలు చెబుతున్నారు.

మనం సంపాదించు కున్న ధనం ( డబ్బు) మన వెంట రాదు. భూమి మీదే ఉండి పోతుంది.
మనం పోషించిన పశువులు పశుశాల విడిచి మన పార్ధివ దేహం వరకూ కూడా రావు.భార్య ద్వారం దాటి ఇవతలికి అడుగు పెట్టదు (పెట్టరాదని నియతి కాబోలు) బంధువులు పరేత నిలయ ప్రాంతం వరకూ వస్తారు. దేహం చితి వరకూ మాత్రమే వస్తుంది.

మరి, పర లోక ప్రయాణంలో మన వెంట వచ్చేది ఏమిటయ్యా అంటే, మన పుణ్య పాప కర్మలు మాత్రమే అని దీని భావం.

అందండీ సంగతి.

అయితే, డబ్బే వద్దా, అంటే కావాలి.‘‘ డబ్బు తేలే నట్టి నరునకు కీర్తి సంపద లబ్బవోయి ’’ అని కవి చెప్పాడు

‘‘ వ్చర్ధం నిర్ధనికస్య జీవన మహోదారైరపి త్యజ్యతే’’ అన్నారు. అంటే ధనం లేని వ్యర్ధుడిని జీవన సహచరి కూడా ఫో, ఫోవోయ్ అంటుందిట.

అంచేత, మన గుండె డబ్ డబ్ మని కొట్టుకుంటున్నంత వరకూ డబ్బు కావాలి. కాని అది మన నిజమైన అవసరాలకి మించి అక్కర లేదని తాత్పర్యం. మన సంపాదనకి మనం ట్రష్టీలం మాత్రమే అని అంటారు గాంధీజీ.

అదండీ డబ్బు జాలం ( నెట్) కథ !