23, జనవరి 2012, సోమవారం

అ ఆలు దిద్ది నందుకు మీరూ తలో చెయ్యీ వెయ్యండి ...ఒక విఙ్ఞప్తి.





తెలుగు ప్రపంచానికో విఙ్ఞప్తి - మూడు యాభయిల

మన గురజాడ 1862 - 2012

విజయ నగరం జిల్లా కలెక్టరు శ్రీ ఎం. వీర బ్రహ్మయ్య గారి సౌజన్యంతో తే 21.09.2011 ది నాడు వెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రారంభించిన ‘‘ మూడు యాభయిల మన గురజాడ’’ వేడుకలలో భాగంగా విజయ నగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో స్థానిక కళాకారుల బృందం సమర్పించిన కన్యా శుల్కంనాటక ప్రదర్శనకి విచ్చేసిన వేలాది ప్రేక్షకులకు అంత పెద్ద హాలూ చాలింది కాదు. అదీ గురజాడ అప్పారావు ( 1862 – 1915) సాధించిన విజయం.

చూస్తున్నాం కదా ! మనకిప్పుడు కన్యాశుల్కం సమస్య అయితే లేదు. అయినా కన్యా శుల్కం నాటకం నూరేళ్ళు దాటినా నిత్య నూతనంగా నేటికీ బతికే వుంది.

కారణం ?

గ్రామ గ్రామాన గిరీశాల ఇష్టారాజ్యం ఇంకా చెల్లుబాటుగానే వుందన్న మాట.

తనతో లేచిపోయి రావడానికి బుచ్చమ్మ అంగీకరించక పోతే, ఆనాటి గిరీశం తల కొట్టుకు ఛస్తానన్నాడు. మరిప్పుడో ! మదమెక్కిన గిరీశాలు కత్తులతో వీరనాట్యం చేస్తూ పదిమందీ చూస్తూ వుండగానే మిట్ట మధ్యాహ్నం, నట్ట నడిరోడ్డు మీద బుచ్చమ్మ గొంతులు ప్రేమను అంగీకరించక పోతే తెగ నరుకు తున్నారు

‘‘ Twinkle ! Twinkle ! Little Star ’’ అంటున్న వెంకటేశాలని చూస్తూ నేటికీ ఇంటింటా వెంకమ్మలు తెగ మురిసి పోతున్నారు.

ఏ కోర్టు వరండాలో చూసినా ‘‘ నేను రామప్పంతుల్నిరా అబ్బాయీ ’’ అంటూ పలకరిస్తున్నారు నేటి రామప్పంతుళ్ళు.

ఇలా సమాజం కనిపిస్తున్నంత కాలం ‘‘ కన్యాశుల్కం’’ ఎన్నాళ్ళయినా బతికే వుంటుంది. కన్యా శుల్కం పోయి వరకట్న దురాచారం రాచపుండు లా సమాజాన్ని కుళ్ళబొడుస్తోంది. దాన్ని రూపుమాపడానికి మరో మహానుభావుడు రావల్సే వుంది. తనకనువయిన రచయితని సమాజమే తయారు చేసుకుంటుంది. ‘‘సంభవామి యుగే యుగే’’ అన్నది అందుకే.

తన వ్యాసంగానికి తను వేసుకున్న ప్రణాళికలకూ సహకరించని ఆరోగ్యం అప్పారావు గారిది. తేది 31.03.1895 నాడు డా. బ్రౌనింగ్ , గురజాడ ఆరోగ్యాన్ని సమీక్షిస్తూ ఎండలో తిరగ కూడదనీ, సైకిలు తొక్క కూడదనీ, శారీరక సుఖానికి కూడా దూరంగా వుండాలని హెచ్చరించాడంటే, గురజాడ స్వరూపం అర్ధమవుతుంది. మహారాజా కాలేజీ లెక్చరర్ గా పని చేస్తున్న గురజాడను రాజావారి ఆంతరంగిక కార్యదర్శిగా కుదిర్చారంటే అప్పారావు గారి ఆరోగ్యం పట్ల డాక్టరు ఆందోళన అర్థం చేసుకో వచ్చు.

అంత బక్కజీవీ సంస్థానం పెద్దదావా (1899) భుజాన వేసుకుని వి.యపథాన నడిపించాడు. ఎదటి పక్షం రాజులు 40 వేల రూపాయలు ఇచ్చి, దావా పనులనుండి తప్పు కోవాలని ఆశ పెడితే,

‘‘ అజీర్తి వ్యాధితో పిడికెడు మెతుకులే అరిగించు కోలేని నాకు ఈ డబ్బు ఎలా జీర్ణమవుతుంది ? ’’ అని వారిని సగౌరవంగా సాగనంపాడంటే గురజాడ రుజు మార్గం మనకు సుళువుగానే తెలుస్తుంది. ఆ రోజుల్లో అమల్లో వున్న సంస్థానం పద్ధతి ప్రకారం తను అద్దెకుంటున్న సంస్థానం ఇంటిని కొనుక్కుని తన అవసరాలకు అనుగుణంగా బాగు చేసుకోడానికి తన వద్ద సరిపడా డబ్బు లేదనీ, అందుకని దయతో రెండు వేల రూపాయలు అప్పుగా ఇప్పించాలనీ దివాణం వారికి అర్జీ ( 7.2.1913) పెట్టు కున్నాడంటే 1899 నాటి 40 వేల విలువ సుళువుగానే వూహించు కోవచ్చును. అదీ గురజాడ ఔన్నత్యం.

‘‘ రామతీర్థం’’ అయ్యంగార్ల వారి చేరీకి చెందిన ఓ ఆచార్యుల వారు 15.3.1914 నాటి తన దినచర్యలో ‘‘ రూ.8-4-0 విజయనగరం ఖర్చులకు పట్టకుని వెళ్ళినాను. సాయంకాలమునకు విజయ నగరంలో ప్రవేశించినాను. వెంటనే అప్పారావు పంతులు గారిని చూచినాను. వారు రేపు మద్రాసు వెళుతున్నామనిన్ని, వచ్చిన పిమ్మట దర్శనం ప్రయత్నం చేస్తమని చెప్పి సర్కారులోకి వెళ్ళినారు’’ అని వ్రాసుకున్నారు. తరువాత ద్వారకా వారింటికీ, రంగమ్మ గారింటికీ, శంకర్రావు పంతులుగారింటికీ తిరిగి కోటలోకి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నాలు చూస్తే రాజాస్థానంలో అప్పారావుగారి కున్న హోదా తెలుస్తుంది.

మొక్కలాంటి కన్యాశుల్కం (1892) నాటకాన్ని తిరగరాసి (1909) మహా వృక్షంగా తీర్చి దిద్ది తెలుగు నాటకాన్ని ప్రపంచ స్థాయి నాటకాల సరసన నిలబెట్టిన నేర్పు గొప్పది. దాన్ని ఎరుక పర్చడానికి డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తిగారు 722 పేజీల తులనాత్మక పరిశోధనా గ్రంథమే రాయాల్సొచ్చింది.

గిడుగు రామ్మూర్తి పంతులు ( 1863 – 1940) గారితో కలిసి వ్యావహారిక భాషోద్యమం నడిపి తెలుగు భాషను పండిత వర్గంనుండి గుంజి, ప్రజలపరం చేసాడు. వారిద్దరు నడిపిన ఉద్యమమే లేకపోయి వుంటే నేటికీ మన విశ్వ విద్యాలయాల్లో కరటక శాస్త్రి శిష్యుడిలా ‘‘ ప్రియా ముఖం కింపురుషశ్చచుంబతి’’ లాంటి సంస్కృత శ్లోకాలు వల్లె వేసుకుని స్నాతకోత్సవాల ఫొటోలను చూసుకుంటూ మురిసి పోదుం.

అంతెందుకు, ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం లాంటి ఎల్లలేం చెప్పకుండా

‘‘ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’’ అంటూ మనిషికే పట్ట కట్టడం బహుశా ప్రపంచ సాహిత్యంలోనే అరుదైన ఆణిముత్యంలాంటి వాక్యం.

భావకవిత్వపు జలధారలొచ్చి, గురజాడ అందించిన జీవధారని పక్కకి నెట్టాయి. పుత్తడిబొమ్మ పూర్ణమ్మకీ (1910) చెల్లి చంద్రమ్మకీ (1971) మధ్యన దూరాన్ని కల్పించిన మిడతంభొట్లు, వెతగ్గలిగితే చిక్కక పోడు. గురజాడ మార్గాన్ని తొలితరం కవులు ఏసంకోచం లేకుండా అందుకొనుంటే మన సంస్కారం ఈ తీరునుండకపోను. తెలుగు భాష అంతరించి పోతుందన్న పీకుడూ లేకపోను.

‘‘ My cause is the cause of the people and I have cultured opinion at my back. I do not mind if those who are incapable of understanding the subject array themselves against me. Their conversion can do no good to the language. They are so hopelessly wedded to the old highly artificial literary dialect.’’

మహా మహోపాధ్యాయ వేదం వేంకటరాయ శాస్త్రి ( 1853 -1929) ఆంధ్రనాటక పితామహ శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు ( 1853 – 1912) పండితులు, పరిశోధకులు శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877 – 1929) లాంటి అఖండ పండితుల నుద్దేశించి అన్న ఈ మాటలు చూస్తే, శ్రీ.శ్రీ కూడా ఇంత సాహసం ప్రదర్శించ లేదు. అయితే తొలితరం కథక చక్రవర్తులు శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు ( 1865 – 1940) , చింతా దీక్షితులు ( 1891 -1960), శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ( 1891 – 1961 ), శ్రీ గుడిపాటి వెంకట చలం (1894 – 1879) లాంటి హేమా హేమీలు కవిత్వానికి పట్టిన గతి పట్టకుండా కథను ప్రజల పరం చేసారు. నాటకం సరే. నేటికీ ‘‘ కన్యాశుల్కం ’’ స్థాయిని అందుకోటానికి ప్రయత్నాలే మొదలవలేదు.

గురజాడ స్థాయిని మనమేం తక్కువగా చూస్తున్నామా అంటే, అదేం లేదు. ఆయన ప్రపంచ స్థాయి సాహితీవేత్తల సరసనే నిలవాలని అంచనాలయితే వేస్తున్నాం కానీ, తెలుగేతర ప్రపంచం గురజాడను చూచి అబ్బురపడే స్థాయిలో ఇంతవరకూ ఏ కార్యక్రమం జరిపించుకో లేకపోయాం. మనకు గురజాడ అభిమానులకైతే కొదవేంలేదు. ‘‘ కన్యాశుల్కం నూరేళ్ళ పండగ’’ (1992) సాలు పొడుగునా అజేయంగా నిర్వహించుకొన్న ధైర్యంతో ‘‘ మూడు యాభయిల మన గురజాడ’’ కార్యక్రమం రవీంద్రుడికి, సుబ్రహ్మణ్య భారతికీ దక్కుతున్న స్థాయిలో జరుపుకోడానికి

డా. పూసపాటి ఆనందగజపతిరాజు గారు ముఖ్య పోషకులుగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకున్నాం. అందుకు జాతీయ, అంతర్జాతీయ తెలుగువారైన మీరు గురజాడ ఆత్మీయులుగా ఈ కార్యక్రమానికి చేయూత అందించాలని వేడుకుంటూ శక్తిమేరకు మీ విరాళాలు ‘‘ వెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ – విజయ నగరం ’’ పేరున అందించాలని ప్రార్ధిస్తున్నాం.

21-09-2011 - 21 -09 2012 కార్యక్రమాలు.

· నెలనెలా కీలకోపన్యాసాలు.

· ప్రఖ్యాత నర్తకులచే పూర్ణమ్మ, కన్యక నృత్యరూపక ప్రదర్శనలు.

· మనిషి ప్రపంచ మానవుడిగా రపు దిద్దుకోడానికి దేశభక్తిగీతం చేసిన దిశానిర్దేశం వెలుగు పర్చడం.

· తెలుగేతర ప్రపంచానికి గురజాడని ఎరుక పర్చడం

· చివరి మూడు రోజుల మహా సభలు గురజాడ స్థాయికి తగ్గట్టు రూపకల్పన చేసుకోవడం.

· స్థానిక నటవర్గంచే ‘‘సంపూర్ణ కన్యాశుల్కం ’’ ప్రదర్శన.

· సమగ్ర ప్రత్యేక సంచిక

· బాపు గారి సచిత్ర కన్యాశుల్కం.

· విజయ నగరంలో సర్వాంగసుందరంగా సమస్త సదుపాయాలతో గురజాడ భారతి ఆడిటోరయం.

‘‘ ఏవిట్రా వీడి గోతాలు ! ’’ అనీకండేం.

ఇవన్నీ జరిగితేనే మన ఆబోరు దక్కేది.

*ఇతర వివరాలకు :

కన్వీనర్,

శాసపు రామినాయుడు,

పొనుగుటి వలస

రాజాం – 532127

శ్రీకాకుళం జిల్లా. ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.

సెల్ 8985922183

మూడు అపురూప చిత్రాలు

విజయ నగరంలో తెలుగు కథకు వెలుగు జాడ గురజాడ స్వగృహం




విజయ నగరంలో చిన్నిపల్లి వారి వీథిలో తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో గారి ఇల్లు. చా.సో హవేలీ.

గురజాడ వారు రచనలు చేయడానికి ఉపయోగించిన టేబిలు, కుర్చీలు.


12, జనవరి 2012, గురువారం

కథా రచయితలకు పెద్ద పండుగ

పండుగలలో పెద్ద పండుగంటే సంక్రాంతే. మూడు రోజుల పండుగ. ఎక్కడెక్కడి బంధువులూ చేరు కుంటారు. సందడే సందడి.
మా విజీనారం వాళ్ళ కయితే ఈ పెద్ద పండుగ కొంచెం సాగి, సరిగ్గా జనవరి పది హేడవ తేదీ నాడు ఖచ్చితంగా మరో పెద్ద వేడుకతో ముగుస్తుంది. అది, చా.సో స్ఫూర్తి అవార్డుల ప్రదానోత్సవం. ఎక్క డెక్కడి సాహితీ ప్రియులూ బిల బిలా విజీనారం చేరు కుంటారు. అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఈ సాహితీ క్రతువు కథా రచయితలకు ఎంతో ఇష్ట మయిన వేడుక.
పండక్కి ముందే సున్నాలూగట్రా వేసి, తోరణాలూ గట్రా కట్టి ఇంటిని ముస్తాబు చేసి నట్టుగా , 17.1.2012 న జరుగ బోయే ఈ కథల పండుగకు ముందే, చాగంటి కృష్ణ కుమారి గారు ‘‘ వండనన్నావ్ ? ఎందుకొండేవ్?’’ కథను 18.1.2012 తేదీ నవ్య వార పత్రికలో ప్రచురించారు .

అచట పుట్టిన చిగురు కొమ్మ కథ యిది
.
తన కథా వారసురాలి వైపు చూపుడు వేలు పెట్టి చూపిస్తూ, ‘‘ నీకంటే’’ అంటూ ఆ వేలుని తన వేపుకి తిప్పి, ‘‘ ఇది బాగా రాయ గలదు’’ అని గడుసుగా మెచ్చుకున్న చా.సో గారిని మెప్పించాలంటే మన తరఁవా, యేఁవిటి !

చా.సో గారికి ఒక కథ ఫైనల్ వెర్షన్ వచ్చే వరకూ కనీసం నాలుగయిదు చిత్తు ప్రతులు రాసి చింపెయ్యడం అలవాటుగా ఉండేది. వారలా చెయ్యకుండా ఉంటే, ఒకే రచయిత ఒకే వస్తువుతో రాసి వదిలేసిన వాటికీ, ఫైనల్ వెర్షన్ కథకీ తారతమ్యాలు బేరీజు వేసుకొని మంచి కథలెలా రాయాలో బుర్రలు బద్దలు కొట్టుకునే కొత్త రచయితలకు మార్గదర్శకంగా ఉండేదేమా అనే ఆలోచనకు ఈ రచయిత్రి తెరతీసారు.

కథ చదవండి మరి ...

చిన్న సాంకేతిక సహాయం : ఒక వేళ కథ పేజీలలోని అక్షరాలు చదవడానికి చిన్నవిగా అని పిస్తే, ఆ పుట మీద మౌస్ ఉంచి నొక్కండి. ఇప్పుడు ఓపెన్ లింక్ ఇన్ న్యూ విండో (Open Link in new windo) అనేది సెలెక్ట్ చేసుకొని చూడండి. పేజీని జూమ్ చేసే అవకాశం వస్తుంది. బోధ పడిందా !

అప్పటికీ మన పప్పులుడకక పోతే సుబ్భరంగా నవ్య కొనుక్కొని చదివెయ్యడమే. అసలిదే ఉత్తమం. న్యాయం కూడానూ.





Posted by Picasa

నేను, చా.సో, మా విజయ నగరం ... ఙ్ఞాపకాల తోటలో ఆనంద విహారం !


విజయ నగరం మడి కట్టుకొన్న పెద్ద ముత్తయిదువులా ఉంటుంది.
కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించే అమ్మలా ఉంటుంది.
చిటికెన వేలు పట్టుకుని బజారు వీధుల్లో వింతలు చూపించే నాన్నలా ఉంటుంది.
ఆ ఙ్ఞాపకాల తోటలో ఆనంద విహారం ఎలా ఉంటుందంటే,
నేను,చా.సో, మా విజయ నగరం అనే జగన్నాథ శర్మ గారి వ్యాసంలా ఉంటుంది.
ఆ వ్యాసం మీ కోసం. చూడండి:





నవ్య వార పత్రిక సంపాదకులు ఎ.ఎన్. జగన్నాథ శర్మ ఈ నెల 17 వ తేదీన విజయ నగరంలో ప్రతిష్ఠాత్మకమైన చా.సో స్ఫూర్తి అవార్డు స్వీకరించ బోతున్నారు. ఆ సందర్భంగా జగన్నాథ శర్మ ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో తెలుగు కథకు తూర్పు దిక్కు శ్రీ చాగంటి సోమయాజులు ( చా.సో) గారితో తన చిన్ననాటి అనుభవాలూ, ఙ్ఞాపకాలూ హృదయంగమంగా కలబోసుకున్నారు. ఆ వ్యాసమే యిది.
వ్యాసం పూర్తి పాఠం ఇక్కడ మరింత చక్కగా చదవొచ్చును :
అవార్డు కార్యక్రమం గురించిన ఇతర వివరాలు ఇక్కడ నొక్కి చూడ వచ్చును.

Posted by Picasa

8, జనవరి 2012, ఆదివారం

స్నాన ఘట్టాలు !


కవి గారు చెప్పనే చెప్పారు కదా. జలకాలాటలలో ఏమి హాయిలే హలా ! అని ! వస్తే పాటలు పాడుకుంటూనో, లేదంటే కూని రాగాలు తీసుకుంటూనో, జలకాలాటలు ఆడుకుంటూ ఉంటే ఆ హాయే వేరు. బాత్ రూమ్ లలో షవర్ కింద, నల్లాల కింద జలకాలాటలు ఆడాలంటే కుదిరే పని కాదు. నదులలోనో, సరస్సులలోనో, ఏరుల్లోనో, చెరువుల్లోనో అయితే బావుంటుంది.

బుడుంగ్ బుడుంగ్ మని ఓ రెండు చెంబుల నీళ్ళు నెత్తి మీద పోసుకొని స్నానం అయిందనిపిస్తే సరి కాదు. తీరిగ్గా గోరు వెచ్చని నీళ్ళతో చేసే స్నానం చేయడంలో మజాయే వేరు. అది శీతాకాపు పొద్దు అయితే ఆ మజా మరీనూ.

స్నానము అనే అర్ధం ఇచ్చే పదాలు చాలా ఉన్నాయి.

చూడండి: అభిషనము, అభిషేకము, అభిషేచనము, అవగాథము, అవభృథము, ఉదగామము, దానము, బుడుక, మజ్జనము, మునుక, స్నయము, స్నాత్రము , నిమజ్జనము, పరి కర్మము, నీరాటము, జలక్రీడ, ప్రక్షాళనము, నీరు పోరు,
తీర్ధ మాట ప్రణేజనము .....

ఇదిలా ఉంచితే, తల మీద నుండి చేసే స్నానానికి శిరస్నానము, అభ్యంగము, అభ్యంజనము, తలగడుగు, తలమునుక, తలంటు మొదలయిన పేర్లు ఉన్నాయి.

సిల్లలకు చేయించే స్నానానికి బోరుకు అంటారు.

వివాహ వేళ, వధూ వరులకు మంగళ స్నానాలు చేయిస్తారు.

పండుగలప్పడూ, వేడుక లప్పుడూ తలంటు స్నానాలు చేసాకే కదా, కొత్త బట్టలు కట్టు కునేది ?

స్త్రీలు బహిష్ఠు సమయంలో చేసే స్నానానికి ఋతు స్నానం, మాఱు నీళ్ళు అంటారు.

అన్ని శుభాశుభ కార్యాలకీ ముందూ వెనుకా చేసే స్నానాలను వరసగా మంగళ స్నానాలనీ, మైల స్నానాలనీ అంటారు.

నవజాత శిశువుకి బొడ్డుతాడు కోసాక ముందుగా చేయించే ఉపచర్య స్నానమే కదా.


స్నానానికి ఉపయోగించే నలుగు పిండిని సున్ని, స్నానీయం అని కూడా అంటారు.

సబ్బుని చౌకారం, స్తోమక్షారం అంటారు.

పసుపుకి చాలా పేర్లు ఉన్నాయి : అళది, కాంచని, కావేరి, పవిత్రం, మేఘాగ్ని, విభావరి, హరిద్ర, శోభన, యామిక .... ఓ, మరెన్నో ఉన్నాయి లెండి.

స్నానానికి చెందిన సామెతలు కొన్ని కనిపిస్తున్నాయి.

స్నానానికి ముందు, సంభావనకు వెనుక కూడదు.

ఈ సామెత వెనుక చాలా దూరాలోచన ఉంది. స్నానం చేయాలంటే నదుల్లోనో, చెరువుల్లోనో, మడుగుల్లోనో దిగే వారు కదా, పూర్వం? తెలిసిన చోటయితే ఫరవా లేదు కానీ, కొత్త చోట దాని లోతెంతో తెలియదు. అందు చేత, స్నానాకి ముందుగా తయారయి పోవడం మంచిది కాదని ఈ సామెత చెబుతోంది. ముందు దిగిన వాడెవడయినా, లోతు తెలియక దిగి. బుడంగున మునిగి పోతే మనం ముందుగా దిగం కనుక బతికి పోవచ్చు.

ఇక, సంభావనకు వెనుక ఉండ కూడదన్నారు. నిజమే కదా, దొరలూ, రాజులూ, జమీందారులూ ఇచ్చే సంభావనలకు ముందే ఉండాలి. లేక పోతే మనకు దక్కే సంభావన తగ్గి పోవచ్చు. లేదా, మొదటికే మోసం రావచ్చు. ఏమంటారు !

తా మునిగింద గంగ, తా వలచింది రంభ అని మరో సామెత.

స్నానాలు లేని బ్రాహ్మలకు శాపాలు లేవు అని, వేరొక సామెత ఉంది. అంటే, శుచీ శుభ్రం లేని బ్రాహ్మల శాపాలు పని చెయ్యవని కాబోలు.

మోక్షానికి పోతే, మొసలెత్తుకు పోయిందిట !

ఈ సామెతకి అర్ధం, ముక్తి కోరి తీర్ధ స్నానం చేస్తే ఆ సరస్సులో ఉండే మొసలి ఎత్తుకొని పోయిందిట. పుణ్యానికి పోతే ... అంటే యిదే నన్న మాట !

తల కడుక్కోవడం అనే జాతీయం, బరువు బాధ్యతలు తీరాక, తలారా స్నాం చేసి, హమ్మయ్య ! అనుకోవడం గురించి కదా.

ఈ సందర్భంగా సన్ బాత్ గురించి గుర్తుకు తెచ్చు కోక తప్పదు. ఇదో రోగ నిదాన ప్రక్రియ. కాక పోతే ఆరోగ్య పరి రక్షణకు కొందరు సన్ బాత్ చేస్తూ ఉంటారు. ఆవిరి స్నానం అని కూడా ఒకటి ఉంది.

సన్ బాత్ ఉన్నప్పుడు మూన్ బాత్ ఎందుకు ఉండ కూడదూ ! అని మా తింగరి బుచ్చి గాడు లాజిక్కు లేవ తీస్తూ ఉంటాడు. అది వేరే విషయం.
ఇక,

పుణ్య తిథులలోనూ. గ్రహణాల వేళ పట్టు విడుపుల సమయాలలోనూ సముద్ర స్నానాలు చేయడం తెలిసినదే కదా !


స్నానాల గురించి మరి కొంత సమాచారం ...

ఇప్పు డెక్కడా నూతులు లేవు కానీ, నూతి నీళ్ళతో చేసే స్నానం చాలా హాయిగా ఉంటుంది.

కూపోదకం, వటచ్ఛాయా, తరుణీ స్థన మండలం
శీత కాలే భవేదుష్ణం, ఉష్ణ కాలేతు శీతలమ్ అంటారు.

కూపం అంటే నుయ్యి. నూతిలో నీళ్ళు శీతా కాలంలో వెచ్చగానూ, వేసవి కాలంలో చల్లగానూ ఉంటాయన్న మాట ! మిగతా రెండింటి విషయమూ ఇక్కడ అప్రస్తుతం కనుక వాటి గురించిన వివరణ ఇవ్వడం లేదు.

శ్రీ.శ్రీ గారి గొప్ప కథ ‘‘ ఒసే, తువ్వాలందుకో ’’ గుర్తుందా ?

చాలా మంది మగ మహా రాజులకి బాత్ రూం లలో దూరి తలారా స్నానం చేసాక కానీ తువ్వాలు తెచ్చు కోలేదన్న మాట గుర్తుకు రాదు. అప్పుడు అరుస్తారు, ‘‘ఏమేవ్ ! తువ్వాలందుకో !’’ అని.

శ్రీ.శ్రీ గారి కథలో ఇలాంటి మగ మహారాజే తువ్వాలు మరిచి పోయి, స్నానాల గదిలో దూరి భార్యని ముద్దుగా కేకేసి, ‘‘ ఒసే, తువ్వాలందుకో !’’ అని అరుస్తాడు. అంతకు ముందు స్నానాల గదిలో భర్త గారి ఊహాపోహలు, , ఇటు భార్య గారి ఆలోచనలూ ఈ కథకి ఆయువు పట్టులు. సర్దుకు పోయే సంసారాల గుట్టు ఇందులో గొప్పగా చెప్పారు శ్రీ.శ్రీ.

బెజ్జ మహా దేవి పరమేశ్వరుని పసి వాడిగా చేసి స్నానాలు చేయింే ఘట్టం పాల్కురికి సోమన తన బసవ పురాణంలో అద్భుతంగా చిత్రీకరించేడు. చూడండి:

అనయంబు బెజ్జ మహా దేవి తాను
జననియై పరమేశుఁదనయు గావించి

తొంగిళ్ళు పైనిడి లింగ మూర్తికిని
నంగన గావించు నభ్యంజనంబు

ముక్కొత్తు చెక్కొత్తు ముక్కన్ను పులుము
నక్కొత్తు కడుపొత్తు నట వీపు నిమురు
బెరుగంగ వలెనని తరుణి వీడ్డడగ

చరణముల్కరములు చాగంగ దిగుచు
నలుగులు నలుచు నర్మిలి పెట్టి

జలముల వీపున చరుచు నంతతంత
వెగచి బెగడ కుండ వెన్ను వ్రేయుచును

నొగి మస్తకమున నీరొత్తు దోయిటను
వదనంబు సొచ్చుచో యుదకంబు లనుచు
నదుము పొట్టను నోరి కడ్డంబు పట్టు

చెన్నుగా పసుపార్చి చేయు మజ్జనము
కన్నులు చెవులును గాడంగ నూదు .... ....

బెజ్జ మహా దేవి పరమ శివుని పసి వానిగా భావించి, చేయించిన అభంయంజనమిది ! పసుపు రాసేది. నలుగు పెట్టేది. తల మీద నూనె అదిమేది. ముక్కూ, చెక్కిళ్ళూ అదిమేది. మూడో కన్ను పులిమేది. బాగా పొడవుగా పెరగాలని కాళ్ళూ చేతులూ సాగదీసేది. నీళ్ళు దోసిళ్ళతో తీసికొని వాని నడ్డి మీద చరిచేది. వెన్ను నిమిరేది. తల మీద నీళ్ళు కళ్ళ లోకి జారకుండా పదిలంగా పోసేది. అందు కోసం వాని నోటికి అడ్డంగా చెయ్యి పెట్టేది. కడుపు అదిమేది. స్నానం చేయించాక, కళ్ళూ చెవులూ గట్టిగా ఉఫ్ మని ఊదేది ....


ఇక, ద్రౌపదీ దేవి మహా భారతంలో ...

‘‘ రాజసూయావభృథంబున శుచియై పెనుపొందిన వేణి వట్టి, ఈ యేవురు సూడగా సభకు నీడ్చె, కులాంగన నిట్లొనుర్తురే ! ’’ అని వాపోయింది.

రాజసూయ యాగం పరి సమాప్త మయ్యాక అభ్యంగన స్నానం చేయడం వల్ల పవిత్రమైన ఈ జుత్తు పట్టుకొని , నాభర్తలు ఈ ఐదుగురూ చూస్తూ ఉండగా ఒకడు ( దుశ్శాసనుడు ) కౌరవ సభలోనికి ఈడ్చుకొని వచ్చేడు. లోకంలో ఎక్కడయినా కుల స్త్రీలను ఇలా అవమానం చేస్తారా ?’’ అంటూ విలపించింది.

పుష్కర కాలంలో పవిత్ర నదీ జలాల లోకి ముక్కోటి దేవతలూ ప్రవేశిస్తారని, అందు చేత ఆ కాలంలో నదీ జలాలు పరమ పవిత్రాలని హిందువుల విశ్వాసం. అందు చేత, పుష్కర సమయంలో నదులలో పవిత్ర స్నానాలు చేయడానికి తహతహలాడుతారు. అలా స్నాలు చేసే స్థలాలు పుష్కర ఘట్టాలు, స్సానాల రేవులూనూ. అక్కడ స్నాలు చేసే వారి భద్రత కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి.

తిరుపతి మొదలైన చోట్ల పాప వినాశనం వగైరా చోట భక్తులు ఆ జలధారల కింద స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.

వెనుకటి రోజులలో వీర మడిని పాటిస్తూ కొన్ని వర్గాలకు చెందిన ఆడవారు నది లోనో, చెరువు లోనో స్నానాలు చేసుకొని, మడి నీళ్ళ బిందె నెత్తి కెత్తుకొని , దారంట వస్తూ, మళ్ళీ ఏదో కారణం చేత మడి భంగం ( వ్రత భంగం లాగ !)
జరిగితే మళ్ళీ స్నానం , మళ్ళీ బిందోతో నీళ్ళు పట్ట కోవడం జరిగేది.

పెళ్ళిళ్ళలో , ముఖ్యంగా బ్రాహ్మల వివాహాలలో సరిగ్గా భోజనాల వేళ ఏటికి లేదా నదికి పోయి స్నానం చేసి, సంధ్య వార్చకొని వస్తానంటూ పెళ్ళి పెద్దలలో ఎవరో ఒకరు వెళ్ళి పోయే వారు. అంతే ! దానితో భోజనాలు బంద్. అతను వచ్చే వరకూ వడ్డింపులు, ఉండేవి కావు. పంక్తి నకనకలాడుతూ అతని రాక కోసం ఎదురు చూసేది. ఎంతకీ రాడాయన. ఇదో అల్లరి ( ట ?!).
ఇదిలా ఉంచండి ...ఇక ...


గంగానది కలుష హారిణి. గంగలో స్నానం చేయడం ఒక అపూర్వానుభవం.

చేమకూర కవి విజయ విలాసంలో తీర్ధ యాత్రలు చేస్తూ గంగా నదిలో మునక వేయడం జరిగింది. ఈ ఘట్టంలొ కవి గొప్ప శబ్ద చమత్కారం కలిగిన ఒక చిన్న పద్యం చెప్పాడు. చూడండి:

మునుకలు గంగా నదిలో
నొనరించుట కన్న భాగ్య మున్నదె ? యనుచున్
మునుకలు గంగా దిగి, పరి
జనములు కైలా గొసంగ స్నానోన్ముఖుఁడై

అర్జునుడు తీర్ధ యాత్రల సందర్భంగా గంగా నదిని చూసి ఇలా అనుకున్నాడు. గంగా నదిలో ముుకలు వేయడం కన్నా ( స్నానం చేయడం కన్నా ) మరేమి భాగ్యం ఉంది ? ఇలా అనుకుంటూ సేవకులు దారి చూపిస్తూ ఉంటే, గంగలో దిగి స్నానం చేసాడు.

ఈ పద్యంలో మునుకలు గంగా నదిలో అనీ మును కలుగంగా అనీ పదచ్ఛేదం వల్ల గొప్ప శబ్ద చమత్కతి సాధించాడు కవి. మొదటి దానికి గంగా నదిలో మునకలు వేయడం అనీ, రెండవ చోట సేవకులు నది లోతుపాతులు తెలుసు కోడానికి ముందుగా దిగి చూసాక అనీ స్వారస్యం చెప్పారు పెద్దలు.

కవి గంగా నది గురించి, దాని పవిత్రత గురించి మరిన్ని చెప్పాడు. మచ్చునకు మరో పద్యం :

తల నీ గంగా తీర్ధము
చిలికినవాఁడీశ్వరుండు . చేరెడు లోఁగోఁ
గలిగినఁ దరగలఁదేలం
గలిగినఁ దన్మహిమ లెన్నఁగా దర మగునే ?

తల మీద గంగా జలాన్ని చిలకరిస్తేనే ఈశ్వరత్వం పొందు తున్నారు. ఇకచ చేరెడు గంగా తీర్ధం పుచ్చుకొన్నా, గంగా నదిలో స్నానం చేసినా, ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో కదా !

ఇక, తీర్ధ యాత్రలు చేస్తూ, పవిత్ర నదీ జలాలలో స్నానాలు ఆచరించడం మన సాంప్రదాయం.

ప్రవరుడు మను చరిత్రలో సిద్ధుడిని ఏయే దేశాలు చూశారు చెప్పరూ ? అంటూ అడిగిన ప్రశ్నావళిలో ఏ తీర్ధాలలో స్నానాలు చేసారు ? అని కూడా ఉండడం గమనించాలి.

దేవతా స్త్రీలూ, రాచ కన్నెలూ వన విహారాలూ, జల క్రీడలూ చేయడం చాలా గ్రంథాలలో చదువుతాం.

గోపికలు విలాసంగా నదీ స్నానాలు చేస్తూ ఉంటే వారి కోక లెత్తుకు పోయిన కొంటె కృష్ణుడి గురించి వేరే చెప్పాలా?

మరో రెండు శ్లోకాలను చూడండి:

కించి దుష్ణోదక స్నానం, కించి దుష్ణాన్న భోజనం.
మానవానా మిదం సధ్యం, సయ: స్నానం వయ: స్త్రియ:

అంటే, గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం, మృష్టాన్న భోజనం చేయడం, పాలు త్రాగడం, తరుణ స్త్రీ సంగమం - ఈ నాలుగూ మనుషులకు పథ్యాలుట !

స్నానానంతరం చేయాల్సినవి కూడా మన పెద్దలు చెప్పారండోయ్ ! చూడండి:

స్నాత: చందన లిప్తాంగ: సుగంధ: సు మనోన్విత:
భుక్త వృష్య స్సు వపన: సువేష సమలంకృత:

తాంబూలవదన: పత్న్యాం, అను రక్తో2ధిక స్మర:
పుత్రార్ధీ పురుషో నారీమ్, ఉపేయా చ్ఛయనే శుభే.

దీని భావం ఏమిటంటే, స్నానం చేసి, పరి శుద్ధు డయ్యాక, చందనాది సుగంధ ద్రవ్యాలు పూసు కోవాలి. పు్వులు పట్టు కోవాలి. మంచి బట్టలు ధరించాలి. చక్కని ఆహార్యం ధరించాలి. అలంకారాలు పెట్టు కోవాలి. బలవర్ధక మైన ఆహారంభుజించాలి. తంబూలం వేసు కోవాలి. భార్యయందు అనురక్తితో ఆమె పొందు స్వీకరించాలి. ఇది శాస్త్రం చెప్పిన తృతీయ పురుషార్ధం అన్న మాట!

‘క్షణంలో బాత్ చేసి రానూ !’ అంటూ బాత్ రూం లో దూరి, గంటలు గడిచినా రాని స్నాన రుద్రులూ, ఏడాదికి ఒకసారో, రెండు సార్లో తప్ప అసలెప్పుడూ స్నానం చెయ్యని తెగల వారూ ఉన్నారని తెలుసు కోవాలి.

ఈ టపా రాస్తూ ఉంటే, ఆంధ్ర జ్యోతి ఛానెల్ లో తణికెళ్ళ భరణి గారు తన జీవిత కాలంలో పేద్ధ బాత్ రూం కట్టకొని, అందులో తనివితీరా గంట సేపు స్నానించాలనీ , తన మనసులో కోరికను బయట పెట్టారు.

అయ్యా, ఇదీ స్నాన ఘట్టం ! స్నానాల గొడవ ! ఇలా చెబుతూ పోతూ ఉంటే, దీనికి అంతూ పొంతూ ఉండేలా లేదు ... కనుక,

స్వస్తి.

స్నానాల గురించి బ్లాగరు రసఙ్ఞ గారు చక్కని శాస్త్రీయమైన వివరణలతో ఒక టపా రాసారు. దాని లింక్ ఇక్కడ నొక్కి చదవండి.

అంకితం :

స్నానాల గదిలో ఒళ్ళంతా సబ్బు పట్టించు కున్నాక, తొట్టెలో నీళ్ళు నిండుకొని, కుళాయిలు బంద్ అయి పోతే, నానా అవస్థలూ పడే వారికి ఈ టపా అంకితం చేస్తున్నాను.

మరింకా, మా తింగరి బుచ్చి గాడికి కూడా లోపాయికారీగా అంకితం చేస్తున్నాను. ఎందుకంటే జల గండం పేరిట వాడు మూడ్నాలుగు రోజులకో సారి స్నానం చేస్తాడని కథా మంజరి దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఉంది.
















7, జనవరి 2012, శనివారం

చెప్పండి చూద్దాం !-4.



ఈ సంస్కృత శ్లోకార్ధం సుబోధకం. సరళం. దీనికి ఒక చక్కని అనువాద పద్యం మన తెలుగు శతకాలలో ఒక దానిలో శతకకారుడు రచించేడు. ఆ పద్యం ఏమిటో చెబుదురూ !

అజగామ యదా లక్ష్మీ: నారికేళ ఫలాంబువత్,

నిర్జగామ యదా లక్ష్మీ: గజ భుక్త కపిత్థవత్

నిజానికీ సమస్య మన పెద్దల కోసం ఇచ్చినది కాదు. పిల్లలలో తెలుగు భాషాబిమానం పెంపొందించడానికి ఇలాంటి సమస్యలని మనమే తయారు చేసుకుందాం.

1. ముందుగా పిల్లలకి ఈ శ్లోకం లోని ముఖ్యమైన పదాలకు అర్ధాలు చెప్పాలి.

2. వాటికి తెలుగులో ఉన్న పర్యాయ పదాలు కూడా చెప్పాలి.

3. శ్లోక భావం మాత్రం చెప్ప కూడదు.

4.తరువాత తెలుగులో వచ్చిన ప్రసిద్ధమైన శతకాలు వారి ముందు ఉంచాలి. వీలైనంత వరకూ భావాలతో కూడిన శతకాలు ఇవ్వాలి ( అప్పుడు వారి పని కొంత సుళువవుతుంది )

5.వాటిలో ఈ శ్లోకానికి అనువాద పద్యం ఉన్న శతకాన్ని ఉంచడం మరిచి పోకూడదు.

6. ఇప్పుడు ఈ శ్లోకార్ధం ఇచ్చే పద్యం వారినే వెతికి చెప్ప మనాలి.

7. గెలిచిన పిల్లలకు బహుమానాలు ఇవ్వాలి.

8. చెప్ప లేక పోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలి.

నేను హైస్కూల్లో తెలుగు పండితునిగా పని చేసే రోజులలో పిల్లలు ఈ రకమయిన సమస్యలతో ఇచ్చిన క్రీడలను ఎంతగానో ఇష్ట పడే వారు. చురుకుగా పాల్గొనే వారు.

టీ.వీ లకో, వార్తా పత్రికలకో అతుక్కు పోకుండా పిల్లలతో మమేక మవుదాం ! ఏమంటారు ?

6, జనవరి 2012, శుక్రవారం

ఈ ఏడాది జగన్నాథ శర్మకు చా.సో. స్ఫూర్తి అవార్డు ...


జగన్నాథ శర్మకి ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు లభించింది. తెలుగు కథకి తూర్పు దిక్కు శ్రీ చా.సో అవార్డు వీరికి లభించడం కథకి గర్వ కారణం.

శ్రీ జగన్నాథ శర్మ బుల్లి తెరకు (జెమిని, ఈ టి,వీ) కథా, మాటల రచయితగా చిర పరిచితులు. కొన్ని సినిమాలకు కథా సహకారం అందించారు, ప్రసిద్ధ పత్రికలకు సహ సంపాదకత్వ బాధ్యత వహించి, ప్రస్తుతం నవ్య వార పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర జ్యోతి వారి నవ్య వార పత్రికను పాఠకుల పత్రికగానూ, రచయితల పత్రికగానూ కూడా సమర్ధ వంతంగా తీర్చి దిద్దడంలో వీరి కృషి అనన్య సామాన్య మైనది. నవ్యలో విశేష పాఠకుల ఆదరణ పొందిన పాలపిట్ట ప్రపంచ జానపద కథల ధారా వాహికం, కథా సరిత్సాగరం వీరి ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యాలు.
వీరి వచన మహా భారతం , జగన్నాథ రథ చక్రాల్ (మొదటి పేజీ సంపాదకీయ రచనలు) పాఠకులను విశేషంగా ఆకట్టు కొంటూ సాగుతున్నాయి.


అసంఖ్యాకంగా కథల పోటీలు పెడుతూ, కథా నీరాజనం శీర్షికను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ తెలుగు కథకు జయ కేతన మెత్తు తున్నారు. తెలుగు నాట ఎక్కడ కథా గోష్ఠులు నిర్వహించినా, వాటి వివరాలు ఫొటోలతో పాటు చక్కని వార్తా కథనాలు నవ్యలో ప్రచురిస్తున్నారు.

ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు ఎ.ఎన్ జగన్నాథ శర్మకు ఇస్తున్నట్టుగా చా.సో గారి కుమార్తె ప్రముఖ రచయిత్రి, చా.సో స్ఫూర్తి పురస్కార ట్రస్టు వ్యవస్థాపకురాలు చాగంటి తులసి ఈ క్రింది ప్రకటన చేసారు :

ప్రముఖ కథారచయిత చాగంటి సోమయాజులు (చాసో) 18వ స్ఫూర్తి పురస్కారం 2012, జనవరి నెల 17వ తేదీన విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత అయ్యల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మకు వచ్చింది. . పేగు కాలిన వాసన కథలు, అగ్రహారం కథలు, మావూరి కథలు రచయితగా, అనువాదకుడిగా జగన్నాథశర్మ కథాభిమానులకు చిర పరిచితులు. ఆయన కథల్లో వాస్తవికత, మానవీయతల మేలుకలయిక కనిపిస్తుంది., వ్యవస్థలోని అవకతవకలకు అద్దం పట్టి , సామాన్య మానవుల పట్ల అపారమైన ప్రేమ ఉన్న రచయిత వీరు.. కథ అల్లి చెప్పే కౌశలంతో ఎదిగి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున చాసో స్ఫూర్తి పురస్కారానికి జగన్నాథ శర్మను ఈ అవార్డు వరించింది. జనవరి 17న చాసో 97వ పుట్టినరోజు , ఆరోజు సాయంత్రం విజయ నగరం మహారాజ లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ఐఎఎస్ అధికారి కె.వి.రమణాచారి అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో శ్రీ జగన్నాథ శర్మకి రూ. 10,000 ల నగదు పురస్కారంతో పాటు, ప్రశంసా పత్రం అంద.జేయడం జరుగుతుంది.

కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి ...



ఇంత వరకూ చా.సో అవార్డు అందుకొన్న రచయితలు :


ఇంత వరకూ పుస్తక రూపంలో వెలువడిన జగన్నాథ శర్మ రచనలు ...











5, జనవరి 2012, గురువారం

3, జనవరి 2012, మంగళవారం

వన్స్ మోర్ !! మా రాముడు వలస బుగత గారూ !



ఉద్యోగ విజయాలు నాటక ప్రదర్శన ముగిసింది. కొంత మంది ప్రేక్షకులు శ్రీకృష్ణ పాత్రధారిని చూడాలని ఉవ్వళ్ళూరారు.గ్రీన్ రూమ్ లోకి వచ్చేరు. అక్కడ మేకప్ తీసేసి, తన సహజమైన వస్త్రధారణలో - అంటే, చిన్న చిలక్కట్టు, భుజం మీద చిన్న తుండు గుడ్డ, నల్లని శరీరంతో బల్ల మీద కూర్చుని, చుట్ట కాల్చుకుంటూ నాటకాల గురించీ, మహాభారత భాగవత, రామాయణాల గురించీ, వివిధ పురాణాల గురించీ అనర్గళంగా మాట్లాడుతున్నారు వారు. ఆయనే శ్రీకృష్ణ వేషధారి పీసపాటి నరసింహ మూర్తి గారు అంటే ఎవరూ ఒక పట్టాన నమ్మ లేక పోయేరు. ఆయన నాటకం ముగిసిన తరువాత దాదాపు ప్రతీ ఊళ్ళోనూ జరిగే తంతే యిది !

వారి స్వగ్రామం రాముడు వలస . ఆ ఊరికి నేను చాలాసార్లు వెళ్ళడం జరిగింది. మా పార్వతీపురానికి దగ్గరే వారి ఊరు. విజయ నగరం సంస్కృత కళాశాలలో నాతో పాటు చదువుకున్న మంగిపూడి వేంకట రమణ మూర్తి ( ప్రముఖ హరి కథకులు) గారి తండ్రి గారూ, పీసపాటి వారూ దగ్గరి బంధువులు. అంచేత, నేను రాముడు వలస వెళ్ళి నప్పుడల్లా వారు నన్ను మా రమణ మూర్తితో పాటు ఎంతో ఆదరంగా పలకరించే వారు. సంస్కృత కళాశాల విద్యార్థులం అనే అపేక్ష వల్ల కూడానేమో ! ఎప్పుడు రాముడు వలస వెళ్ళినా, నాయనా ! అని ఆదరంగా పిలిచే వారు . ‘‘ ఎప్పుడు వచ్చితీవు ? ...’’ అంటూ రాగయుక్తంగా పలకరించే వారు. వారితో సహపంక్తి భోజనం చేసే అదృష్టం నాకు చాలా సార్లు కలిగింది. వారి భోజన కార్యక్రమం దైవ పూజ చేస్తున్నంత నిష్ఠగా సాగేది. చిన్న కావి రంగు ముతక గావంచా కట్టకొని, పై మీద నాగుల తువ్వాలుతో వారి రూపం చూస్తే - రంగ స్థలం మీద అపూర్వ తేజస్సుతో వెలిగి పోతూ, కమ్మగా పద్యాలు చదివే మహా నటుడు వారే నంటే ఎవరికీ నమ్మ బుద్ధి కాదు.

రాగాన్ని అర్ధ రహితంగా సాగదీసి, పద్యం పాడడమే నటన అని అటు నటులలోనూ, ఇటు ప్రేక్షకుల లోనూ ఉండే భావనకి అడ్డ కట్ట వేసిన ఘనత వారిదే. కాంట్రాక్టు నాటకాలు కాంబినేషన్ పద్ధతికి అలవాటు పడడంతో ఒకే నాటకంలో ముగ్గురు నలుగురు శ్రీకృష్ణులు వగైరా పాత్రధారులు కనిపించే వారు. అంతమంది కృష్ణులలో పీసపాటి వారే అపురూపంగా మెరిసి పోయే వారు. ఆయనకు పద్యమే గద్యం. గద్యమే పద్యం. ఆయన పాండితీ వైభవం అబ్బుర పరుస్తుంది. ఇంతటి ప్రఙ్ఞావంతుడి ఎడ్యు కేషనల్ క్వాలిఫి కేషన్ అయిదో తరగతి ఫెయిల్ కావడం !

1920 జులై 10 వ తేదీన బొబ్బిలి తాలూకా, జలిజి పేట మండలం వంతరాం అనే గ్రామంలో పీసపాటి వారి జననం. చిన్న తనంల లోనే తల్లి దండ్రుల వియోగంతో కాకినాడలో వారి పిన తండ్రి గారింట పెరిగారు. కొంత కాలం పౌరోహిత్యం చేసారు. 1939 లో సామర్ల కోటకు చెందిన వాణీ నాట్య మండలి లో చేరి వశాంబి కృష్ణ మూర్తి గారి వద్ద నటనను అభ్యసించారు. ఆ సంవత్సరమే పాపమ్మ గారితో వారి వివాహం జరిగింది. 1945 లో శ్రీకాకుళం జిల్లా పొందూరు కి నివాసం మార్చారు. అక్కడ శ్రీరామ నాట్య మండలిని స్థాపించారు. 1949 లో గుంటూరులో తిరుపతి కవులలో ఒకరైన చెళ్ళపిల్ల వేంకట శాస్త్రి గారి ఆస్థాన కవి పట్ట ప్రదానోత్సవంలో జరిగిన పాండవోద్యోగ విజయాలు నాటక ప్రదర్శనలో శ్రీకృష్ణ పాత్రను అద్వితీయంగా ప్రదర్శించి కవిగారి చేతుల మీదుగా బంగారు కిరీటిన్ని బహుమతిగా అందు కున్నారు.

వారికి జరిగిన సన్మానాలకు, వారు పొందిన బిరుదులకు లెక్క లేదు.

1993 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఫెలోషిప్, తెలుగు విశ్వ విద్యాలయం వారి విశిష్ఠ పురస్కారం, రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి సత్కారం, 1949 లో టంగుటూరి ప్రకాశంపంతులు గారి చేతుల మీదుగా సువర్ణ నటరాజ విగ్రహం స్వీకరణ. నరసరావు పేటలో సువర్ణ ఘంటా కంకణం, 1950 లో విజయ నగరంలో బంగారు కిరీటం, సుదర్శన చక్రం , 1958 లో గుంటూరులో సుదర్శన చక్రం, సాలూరులో బంగారు సింహతలాటాలు. 1958 లో తెనాలిలో సువర్ణ పుష్పాభిఫేకం. స్థానం వారి చేతుల మీదుగా గండ పెండేరం బహూకరణ, 1972లో బాపట్లలో గజారోహణ, నటశేఖర బిరుదు ప్రదానం 1975 లో విశాఖ పట్నంలో తెన్నేటి విశ్వ నాథం గారి చేతుల మీదుగా గండపెండేరం, నటసమ్రాట్ బిరుదు ప్రదానం, 1976 లో ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాట్య కళా అకాడమీ వారి నుండి నాటక కళా ప్రపూర్ణ బిరుదు స్వీకరణ, .... ఇలా లెక్కకు మించిన బిరుదులు. సత్కారాలు వారిని వరించాయి.

198లో రంగూన్ రౌడీ అనే సాంఘిక నాటకంలో కృష్ణ మూర్తి పాత్ర పోషణతో వీరి రంగస్థల విజయ విహారం మొదలయింది.
ఎన్నో నాటక సంస్థలతో మమేకమై నాటక కళా పురోభి వృద్ధికి వీరు చేసిన సేవ అసామాన్యమైనది.

1979 లో విశాఖ పట్నంలో అక్టోబరు 12, 13, 14 తేదీలలో సాంబ మూర్తి కళామందిరంలో వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జన సంద్రం ఉప్పొంగి పోయింది !

పద్య భావం పూర్తిగా అవగతం కానప్పుడు మాత్రమే నటుడు రాగాన్ని పట్టుకొని వేళ్ళాడతాడు ! అని కుండ బద్దలు కొట్టి నట్టుగా చెప్పిన పీసపాటి వారిని శ్రీ కృష్ణ పాత్రలో రంగస్థలం మీద చూడ లేక పోయిన వారిదే దురదృష్టమంతానూ !

ప్రేక్షక జన సందోహం నుండి నిరంతర ఘోషగా వెల్లువెత్తే ‘‘ వన్స్ మోర్ !’’ లతో నాటకంలోని కథ కించిత్తు కూడా ముందుకుజరగేది కాదనేది వీరి మీద వీరిని , వీరి పద్య పఠనాన్ని అమితంగా అభిమానించే వారు ముద్దుగా చేసే ఫిర్యాదు.

2007 సెస్టెంబరు 28 న ఈ మహా నటుడు శివైక్యం చెందారు. ఆంధ్ర నాటక రంగం ఆనాడు శోక సముద్రమే అయి రోదించింది. ఆంధ్ర జ్యోతి దిన పత్రిక సంపాదకీయమే ప్రచురించింది.

వన్స్ మోర్ ! పీసపాటి వారూ, మళ్ళీ మా కోసం పుట్టరూ ? ‘‘ నాయనా !’’ అని నన్ను ఆదరంగా పిలవరూ ?
‘‘ ఎప్పుడు వచ్చితీవు ’’ అంటూ చిలిపితనంతో, ముద్దుగా రాగయుక్తంగా పలకరించరూ ?

ముఖాన రంగేసుకొని పద్యాలు వినిపించరూ ? మీరు సరేనంటే వన్స్ మోర్ !! లు పలకడానికి వేలాది గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి .

రంగ స్థల పద్య పఠనానికి రంగూ , రుచీ, వాసనా అద్దిన మీరు మళ్ళీ రావొచ్చు కదా ?

పోనీ,‘‘ మా బుగతేడీ ? ’’ అని బిత్తర పోయి అడిగే మీ రాముడు వలస రైతువారీ జనం కోసమయినా
రాకూడదూ ?


1, జనవరి 2012, ఆదివారం

కొత్త జీవితానికో కొండ గుర్తు !




అందరికీ నూతన సంవత్సర ( 2012 ) శుభాకాంక్షలు ... ... మీ కథా మంజరి.

ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభపు దినాన ( ఆమాట కొస్తే, ప్రతి ప్రత్యేక మైన దినాన కూడా ) మనలో చాలా మందిమి ఏవేవో కొ్త్త నిర్ణయాలు మన జీవితంగురించి తీసుకుంటూ ఉంటాము. ( వాటిని అమలు పరచ గలగడం, లేక పోవడం మన సంకల్ప బలం మీద ఆధార పడి ఉంటుంది. అలాగని కొత్త నిర్ణయాలను సంకల్పించు కోకుండా ఉండ లేం కదా! ఉండ కూడదు కూడా!

ఈ అంశం ప్రధాన ఇతి వృత్తంగా తీసికొని 11.4.1979 లో ఆంధ్ర ప్రభ సచిత్రవార పత్రికలో ప్రచురించబడిన నా కథ తిరిగి కథా మంజరి అభిమానుల కోసం ....