27, నవంబర్ 2019, బుధవారం

అలకల కొలికి...


ఉ.  మాసిన చీర గట్టికొని మౌనముతోడ నిరస్త భూషయై
      వాసెనకట్టు గట్టి నిడువాలిక కస్తురిపట్టు వెట్టి లో
       గాసిలి చీకటింటికడ కంకటిపై జలదాంతచంద్ర రే
       ఖాసదృశాంగి యై పొరలె గాఢమనోజవిషాద వేదనన్.

భావం: ( కోపించిన సత్యభామ ) మాసిన చీర కట్టుకుంది. ఒంటి మీది నగలన్నీ తీసి వేసింది.తలకి  గుడ్డ కట్టుకుంది. నుదుట దట్టంగా కస్తూరిపట్టు పెట్టింది. మేఘాల చాటున చంద్ర రేఖలా తీవ్ర మయిన మన్మథ వేదనతో చీకటి గదిలో మంచం మీద  అలవిమాలిన దుఃఖంతో, బాధతో దొర్లింది.

   ఈ పద్యం నంది తిమ్మన పారిజాతాపహరణం ప్రబంధం లో  సత్య భామ కోపగృహంలో ప్రవేశించిన ఘట్టం లోనిది. కోపం వస్తే అయినింటి ఇల్లాళ్ళు అందరూ ఏం చేస్తారో, ఈ రాణి వాసపు  స్త్రీరత్నం  సత్య భామ కూడా అదే చేసింది! మాసిన చీర కట్టుకుంది. నగలన్నీ తీసేసింది. తలకి గుడ్డ చుట్టుకుంది. శిరో వేదనకి  వేసుకునే కస్తూరి పట్టు వేసుకుంది. చీకటి గదిలో మంచం మీద అశాంతిగా దొర్లింది !

      సత్య కోప కారణానికి ముందు చాలా గ్రంథమే నడిచింది. శ్రీకృష్ణుడు తన పట్టపు రాణి రుక్మిణి ఇంట ఉండగా, కలహభోజనుడు నారదుడు పారి జాత పుష్పాన్ని తెచ్చి ఇచ్చాడు. అంతటితో ఊరు కోక, నచ్చిన చెలికి ఇమ్మన్నాడు. కృష్ణుడు ఇరుకున పడ్డాడు !  సత్యకి తెలిస్తే ఏమవుతుందో అని శంకిస్తూనే, రుక్మిణికి ఇచ్చాడు. రుక్మిణి ఆనందంగా దానిని అందుకుంది. ఇక నేం ! తగవులమారి  నారదుడు సవతుల మధ్య అగ్గి రాజేసే మాటలు చాలా అన్నాడు.ఆ పారిజాత పుష్పం ఎన్నటికీ వాడదనీ. సువాసన వీడదనీ చెప్పాడు. కృష్ణుడు  దానిని రుక్మిణికే ఇవ్వడంతో సవతులలో  అతనికి ఆమె పట్లనే అనురాగం ఎక్కువ అని తెలుస్తోందన్నాడు. ఇక సవతులందరూ ఆమెకు దాసీ లవడం ఖాయం అన్నాడు. అంతటితో ఊరుకున్నాడా ! శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడనే మాట కల్ల అని దీనితో తేలి పోయిందని కూడా అన్నాడు !

  ఇంకే ముంది !  ఒక చెలికత్తె ద్వారా ఈ మాటలన్నీ సత్యచెవిని పడ్డాయి . ఆమె కర్ర దెబ్బతిన్న పామే అయింది. నెయ్యి పోస్తే భగ్గున మండే అగ్ని కీలలా లేచింది! భర్త అనాదరం చూపితే అభిమానవతులలో వచ్చే కళ్ళు ఎర్రబడడం,గొంతు బొంగురు పోవడం వంటి  శారీరక మార్పులన్నీ వచ్చేయి. తటాలున పడకటింటికి చేరింది. మాసిన చీర కట్టుకోడం, నగలు తీసి పారెయ్యడం,తలకి గుడ్డ బిగించడం,కస్తూరి పట్టు పెట్టుకోడం, మంచం మీద ఆశాంతిగా దొర్లడం, ఇవన్నీ కోప గృహం వాతావరణాన్ని మరింత వేడెక్కించేవే!  చివరకి రానే వచ్చేడు కృష్ణుడు.  అనునయ వాక్యాలతో ఆమెను ఓదార్చాలని చూసేడు. చివరకు ఆ జగన్నాటక సూత్రధారి ఆమె పాదాల మీద తల వాల్చి మ్రొక్కాడు! బ్రహ్మాది  దేవతలచే పూజింప బడే ఆ శిరస్సును  సత్య ఎడమ కాలితో తన్నింది.
నాథుల అపరాధాన్ని సహించని స్త్రీలు ప్రణయ కోపంలో ఉచితానుచితాలు చూస్తారా !

         ఈ సరస శృంగార కావ్యం అంటే తెలుగు వారికి ఎంత మక్కువో చెప్పలేం!

26, నవంబర్ 2019, మంగళవారం

మీ వాడితో మేం ఇక పడలేం తల్లీ ..



మత్త.   పుట్టి పుట్టఁడు నేఁడు దొంగిలఁబోయి మా యిలు సొచ్చి తా
           నుట్టి యందక రోళ్ళుఁబీటలు నొక్క ప్రోవిడి యెక్కి చే                           
            వెట్టఁ జాలక కుండ క్రిందొక తూఁటొనరించి మీ
             పట్టి మీఁగడ పాలుఁ జేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ !


భావం: అమ్మా, యశోదమ్మా ! ఏం పిల్లడమ్మా, మీ పిల్లడు ! నిన్న గాక మొన్న పుట్టాడో, లేదో, దొంగ తనాలు మొదలు పెట్టాడు !ఇవాళ మా ఇంట జొరబడ్డాడు. ఉట్టి అందక, రోళ్ళు, పీటలు ఒక దాని మీద ఒకటి పేర్చి వాటి మీద ఎక్కి అందుకోవాలనుకున్నాడు. వాడలా చేస్తాడని ఊహించి,ఉట్టి అందకుండా ఎత్తుగా కట్టేం. కన్నయ్యకి ఉట్టిలో చేయి పెట్టడం సాధ్యం కాలేదు. ఇక లాభం లేదనుకున్నాడేమో, కిందనుంచే  కుండకు పెద్ద చిల్లు పెట్టి, మీగడ పాలను దోసిళ్ళతో పట్టి త్రాగాడు !

      చేత వెన్న ముద్దతో,బోసి నవ్వులు చిందిస్తూ బంగురుతూ ఉండే కన్నయ్య వర్ణ చిత్రం తెలుగు లోగిళ్ళలో ఒక అపూర్వ ఆకర్షణ. పసి బిడ్డలున్న ఇంట, చిన్ని కృష్ణుడితో తమ బిడ్డను సరి పోల్చుకుని మురిసి పోని తల్లి దండ్రులూ ఉండరు. వెన్న దొంగ దుడుకు చేష్టలను పోతన మహా కవి తన ఆంధ్ర మహా భాగవతం దశమ స్కంధంలో కమ్మని పద్యాలలో పటం కట్టి  పద్యరూప వర్ణ చిత్రాలుగా ఆవిష్కరించేడు.!

     నల్లనయ్య అల్లరి చేతలు చూసి వ్రేపల్లె లోని ఇళ్ళాళ్ళకు ఓర్పు నశించి పోయింది. అంతా కలసి కట్టుగా నందుని యింటికి వచ్చి యశోదమ్మతో పిల్ల వాని ఆగడాలను ఏకరువు పెట్టారు. నల్లనయ్య బాల్యక్రీడలన్నీ అతని లీలా విలాసాలే !    ‘‘బాలురకు పాలు లేవని బాలింతలు మొత్తు కుంటూ ఉంటే,  నీ బిడ్డ లేగల త్రాళ్ళు విప్పి ఆవుల దగ్గరకి వదిలేస్తూ ఉంటాడు. చక్కగా కాగిన పాలను తన నేస్తాలకు పోస్తాడు. అంతటితో ఊరుకోకుండా కడవలు పగుల కొట్టి మరీ జారుకుంటాడు! ఎప్పుడు ఇంట్లో జొరబడతాడో, పాలు, వెన్న దొంగిలించి ఎప్పుడు బయటకి మాయమవుతాడో తెలియదు. వెళ్తూ వెళ్తూ , యింత వెన్నను నిద్ర పోతున్న కోడలి మూతికి రాస్తాడు. దానితో అత్త కోడలిని దండిస్తుంది.అలాగే పాలూ, నెయ్యీ జుర్రుకున్నాక పగుల కొట్టిన కడవలను  ప్రక్కనున్న యిళ్ళలో పడేసి పోతాడు. దానితో యిరుగు పొరుగులకి తగువులే, తగువులు . ఆ గదులకు భద్రంగా తాళాలు వేస్తే, వేసిన తాళాలు వేసినట్టే ఉండేవి. నీ కొడుకు లోపల నాట్యం చేస్తూ ఉన్నాడమ్మా! కడవలు అందకుండా ఉండడం కోసం మా యిళ్ళలో ఉట్లు ఎత్తుగా కట్టి ఉంచేం. అయినా ,పీటలు, రోళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి అందుకోవాలని చూస్తాడు. అది వీలు కాకపోతే కడవలకి తూట్లు పెట్టి పాలూ, వెన్నాత్రాగేస్తున్నాడు. యశోదమ్మా, యింక మా ఇళ్ళలో నీ కుమారుడు పాలూ పెరుగూ ఉండ నివ్వడు. ఎక్కడికయినా వెళ్ళి పోతాం. నంద ప్రభువుల వారి ఆవుల మీద ఆన !’’  అని గోపికలు వాపోయేరు.
ఇంత చెప్పినా యశోదమ్మ కన్నయ్యనే వెనకేసు కొచ్చింది !  చనుబాలు త్రాడం వదలని తన పసి బిడ్డపై నిందలు వేయ వద్దని బ్రతిమాలుకుంది.    

 మాతృత్వపు మాధుర్యానికి  ఆకాశమే హద్దు మరి!

23, నవంబర్ 2019, శనివారం

సత్యమేవ జయతే

చం.  మును మునుఁబుట్టె నాకు నొక ముద్దుల పట్టి, యతండు పుట్టి యే
       డెనిమిది నాళ్ళ పాటి గలఁడింతియ పూరియ మేయ నేరఁడేఁ
        జని కడుపార చన్గుడిపి చయ్యన వచ్చెద, నన్నుఁ బోయి ర
         మ్మని సుకృతంబు గట్టి కొనవయ్య దయా గుణ ముల్లసిల్లఁగన్.
భావం:  నిన్న గాక మొన్న నాకొక ముద్దుల కుమారుడు పుట్టాడు. వాడు పుట్టి ఇంకా ఏడెనిమిది రోజులు కాలేదు.  ఇంత గడ్డి కూడ తిన లేడు.నేను ఇంటికి పోయి వాడికి కడుపు నిండా పాలిచ్చి ఇక్కడున్నట్టుగా వేగంగా వచ్చేస్తాను. దయతో నన్ను పోయి రమ్మని పుణ్యం కట్టుకోవయ్యా పులి రాజా!
     ‘‘అవు – పులి’’  కథ  చెప్పని పెద్దలూ, వినని బిడ్డలూ తెలుగు నాట ఏ ఇంట్లోనూ ఉండరు. ఈ కథని అనంతామాత్యుడు భోజరాజీయం లో పద్య రూపంలో  చాలా ఆర్ద్రంగా వ్రాసాడు.. ఈ కథా కావ్యంలో మూడు పెద్ద కథలూ, మరెన్నో ఉప కథలూ ఉంటాయి. అనంతుడు ఇదే కాక, రసాభరణం అనే ఆలంకారిక గ్రంథమూ, ఛందో దర్పణం అనే ఛందో గ్రంథమూ కూడా వ్రాసాడు. 
       ఒక అడవిలో మేతకు వెళ్ళిన ఒక ఆవు దారి తప్పి పోయింది. ఒక పెద్ద పులి ఎదురు పడి, దానిని తిని వేస్తానంటుంది.  ఆకొన్న వారికి ఆహారం పెట్టడం కన్నా పుణ్యం లేదని, పులికి ఆహార మవడానికి  సిద్ధ పడుతుంది ఆవు. కాని, ఒక్క సారి ఇంటికి పోయి, ఏడెనిమిది రోజుల వయసున్న తన బడ్డకు కడుపు నిండా పాలిచ్చి రావడానికి అనుమతి కోరింది. అంతే కాదు, ‘‘ ఈ ఉదయం పాలిచ్చి వచ్చాను. నా బిడ్డ అటూ, యిటూ గెంతులు వేయడంతో ఆ పుడిసెడు పాలు ఈపాటికి అరిగి పోయి ఉంటాయి. ఇప్పుడు వాడి కేది దారి?’’ అని దిగులు చెందింది. ‘‘ గుమ్మెడు పాలు నా బిడ్డకి తృప్తి నిచ్చి వాడి ఆకలి తీరుస్తాయి. నా ఒంట్లో మాంసం అంతా తిన్నా సరే, నీ జఠరాగ్ని చల్లారదు. కనుక ఇందులో మొదట చేయ దగిన పని ఏదో నీకు తెలయదా ! అన్నా! పులి రాజా! నన్ను పోయి రమ్మను. ఇలా వెళ్ళి అలా వస్తాను’’ అని కూడా ప్రార్ధించింది. ఆ మాటలతో కూడ పులి మనసు కరగ లేదు. గోవుని చూసి అపహాస్యం చేసింది. ‘‘ నన్ను బేల్పరచి, నీ కొడుకు దగ్గరకి పోయి, నేను తినేస్తానని తెలిసి కూడా తిరిగి వస్తావా ?! చెప్పే వారు ఎన్నయినా చెబుతారు. వినే వారికి వివేకం ఉండొద్దూ !’’ అని వెక్కిరించింది. ‘‘ అడవిలో  ఉన్నంత మాత్రం చేత పులి అంత తెలివి మాలిన దనుకున్నావా !’’ అని కూడ నిష్ఠర మాడింది. అప్పుడు ఆవు తన మాట నమ్మమని ఎన్నో ఒట్లు పెట్టి మరీ చెప్పింది. మాట జవదాటితే తనకు ఎలాంటి దుర్గతి పడుతుందో చెప్పింది. ఎలాగయితేనేం చివరకి పులి అంగీకరించి ,ఆవును సత్వరమే  తిరిగి రమ్మని పంపించింది. సత్య నిష్ఠ గల ఆవు ఆడిన మాట తప్ప లేదు!  బిడ్డకి పాలిచ్చి, నీతులు చెప్పి, పులి దగ్గరకి  తిరిగి వచ్చి, తనని తిని, ఆకలి చల్లార్చు కొమ్మంది.     విభ్రమం కొలిపే ఆ సత్య సంధతకి  నివ్వెర పోయిన పెద్ద పులి ఆవుని  శ్లాఘించి, విడిచి పెట్టింది!
     సత్య వాక్కుకి ఉన్న శక్తి అలాంటిది మరి ! ఈ కథ ప్రతిపాదించే విశ్వజనీన మయిన నీతి అదే !

22, నవంబర్ 2019, శుక్రవారం

రామ ! రామ!

చిలుకా పలకవే

సద్విద్యా యది కా చింతా

వరా కోదర పూరణే
శుకోప్యశన మాప్నోతి
రామ రామేతి చాబ్రువన్

ఎంత చక్కని శ్లోకమో చూడండి ...

రామ రామ అనే రెండు మాటలు నేర్చిన చిలుకే తన తిండిని తాను సంపాదంచుకో గలుగుతోంది. హాయిగా బ్రతుకుతోంది.
మరి, బాగా చదువుకున్న వారికి ఎందుకంత బెంగ ?

బాగుంది కదూ ! ఇలాంటి చక్కని శ్లోకాల నీ, మంచి పద్యాలనీ ఇక నుండీ ఈ టపాలో మీరు చూడ వచ్చును ...

మూడే, మూడడుగులు...



మ. వడుగా ! యెవ్వరి వాఁడ? వెవ్వఁడవు? సంవాస స్థలం బెయ్య? ది
      య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్;                            
       గడు ధన్యాత్ముఁడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
        గడతేఱెన్ ! సుహుతంబులయ్యె శిఖులుం ! గల్యాణ మిక్కాలమున్.

భావం: ఓ బ్రహ్మచారీ !నీ పేరేమిటి? ఎవరి కుమారుడవు? నీ నివాసం ఎక్కడ?నీ రాక వల్ల నా వంశం, జన్మ ధన్యమయ్యాయి. నేను చేస్తున్న ఈ యాగం కృతార్ధ మయింది. నా కోరికలు నెర వేరాయి.అగ్నులు చక్కగా వ్రేల్చ బడ్డాయి.(  దేవతలకు సమర్పించ బడిన హవిస్సులు సఫల మయ్యాయి) ఈ సమయం మిక్కిలి శుభప్రదం!
   రాక్షస ప్రభువైన బలి చక్రవర్తి ఆడి తప్పని వాడు. సద్ధర్ముడు అమరావతి నుండి దైత్య కులానికి శత్రువయిన ఇంద్రుడినీ ఇతర దేవతలనూ వెళ్ళ గొట్టాడు.ముల్లోకాలకు ప్రభువయ్యాడు.దేవతలకు చేటు కాలం దాపురించింది. దేవతల తల్లి అదితి  వారి దురవస్థను చూడ లేక పోయింది. భర్త కశ్యప ప్రజాపతి సూచన మేరకు శ్రీహరిని ధ్యానించింది. ఆమె ప్రార్ధన మన్నించి బలిని సంహరించి దేవతలను కాపాడడానికి  శ్రీహరి ఆమె గర్భాన  వామనుడై జన్మించాడు.తండ్రి కశ్యపుడు వామనునికి వడుగు చేసాడు.ఆ సందర్భంగా వటువుకి సూర్యుడు గాయత్రినీ, బృహస్పతి జంద్యాన్నీ,కశ్యపుడు ముంజ దర్భల మొల త్రాడునీ,అదితి కౌపీనాన్నీ,భూ దేవి నల్లని జింక చర్మాన్నీ,దండాన్ని చంద్రుడూ, గొడుగును ఆకాశమూ,బ్రహ్మ కమండలాన్నీ, సరస్వతి జపమాలనూ, సప్తర్షులు దర్భలనూ  ఇచ్చారు!  భిక్షాటనకు వటువుకి అన్నీ అమిరాయి !
 
   
    ఆ పిమ్మట వటువయిన వామనుడు బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. బలి వామనుని భక్తితో సత్కరించి, కుశల ప్రశ్నలు అడిగిన ఈ పద్యం పోతన భాగవతంలోని వామనావతార ఘట్టం లోనిది.

బలి ఇవ్వ జూపిన సకల భోగోపకరణాలనీ కాదని మూడడుగుల నేల దానమిమ్మని వామనుడు కోరాడు. అదే తనపాలిట బ్రహ్మాండమని పలికాడు ! రెండడుగులతో భూనభోంతరాలను ఆక్రమించాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు వారిస్తున్నా మహా దాత అయిన దైత్య రాజు మూడో అడుగు తల దాల్చి వటువు చేత పాతాళానికి అణచి వేయబడ్డాడు.    ఆ దాన వైభవం అపూర్వం !  అజరామరం . అనితర సాధ్యం !

        ‘‘ కారే రాజులు ...’’,  ‘‘ ఆదిన్ శ్రీసతి కొప్పుపై ..’’ ‘‘ ఇంతింతై వటుడింతయై ...’’, ‘‘ రవి బింబంబుపమింప ..’’ మొదలయిన పద్యాలతో   పోతన గారి భాగవతంలో  వామనావతార ఘట్టమంతా ఒక తేనె వాక లాగ మధురాతి మధురం ! రస బంధురం ! తెలుగు వారి భాగ్య వశాన పోతన కవి ప్రసాదించిన కవితా స్వాదు ఫలం !
                                                                                                         

21, నవంబర్ 2019, గురువారం

తెలుగు మధురిమలు


మ. తన వెంటన్ సిరి,లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె
      న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చ                            
       క్ర నికాయంబును, నారదుండు,ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
       య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపాలమున్ !

భావం: మొసలి బారిన పడి, శరణు వేడుతూ ఆక్రోశిస్తున్న భక్తుడయిన గజేంద్రుని మొర విని, వైకుంఠ వాసుడయిన విష్ణువు బయలు దేరాడు. అతని వెంట లక్ష్మీ దేవి, ఆమె వెనుక అంత:పుర కాంతలూ బయలుదేరారు. వారి వెంట గరుడుడూ,  ఆతనిని అనుసరిస్తూ విల్లూ, గదా, చక్రమూ, శంఖమూ వచ్చాయి. వాటి వెంట నారదుడూ, విష్వక్సేనుడూ వచ్చారు. వారి వెంట మొత్తం వైకుంఠ వాసులంతా శీఘ్రంగా బయలుదేరి వచ్చారు.
      
        త్రికూట పర్వత శ్రేణిసమీపాన ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో   తిరిగే ఏనుగుల గుంపు లోనుండి  ఒక రోజు ఒక గజ రాజు  మంద నుండి విడి పోయి దారి తప్పాడు. భార్యలతో తిరుగుతూ బాగా డస్సి పోయాడు. అక్కడొక మడుగు కనిపించి ఆనందంతో  మడుగు నీటిలో దిగి క్రీడిస్తూ అక్కడే ఉండే ఒక మొసలి బారిన పడ్డాడు. శక్తి కొలది మొసలితో పోరాడాడు.  ఆ నీరాట వనాటాలకు పోరు వెయ్యేండ్లు అతి భీకరంగా సాగింది. గజరాజు బాగా అలసి సోయాడు.మొసలితో పోరాడే ఓపిక సన్నగిల్లి పోయింది.      ఇక తనకు దిక్కు ఆ మహా విష్ణువే అనుకున్నాడు. ఈ లోకం ఎవని వలన పుడుతుందో, ఎవని వలన లయమవుతుందో,ఈ విశ్వానికి ఎవడు మూలకారకుడో, అన్నీ తానైన వాడెవ్వడో అట్టి భగవంతుడినే శరణు కోరుకోడానికి ఉద్యుక్తుడయ్యాడు.‘‘ దేవా ! నాలో మరింక పోరాడే శక్తి లేదు. ధైర్యం సన్నగిల్లి పోయింది.ప్రాణాలు కడతేరుకు పోతున్నాయి.మూర్ఛితుడనవుతున్నాను.నీవే తప్ప అన్యు లెవరూ నన్ను రక్షింప లేరు. నన్ను కాపాడు !’’  అని ఎలుగెత్తి విలపించాడు

    గజరాజు మొర శ్రీమహా విష్ణువు చెవిని పడింది. అప్పుడా పురుషోత్తముడు అల  వైకుంఠ పురంలో రమా దేవితో క్రీడావినోదియై ఉన్నాడు.  గజేంద్రుని మొర ఆలకించాడు. ఆ భక్త జన రక్షకుడు వెంటనే కదిలాడు. లక్షీ దేవికి మాట మాత్ర మయినా చెప్ప లేదు.ఆయుధాలయిన శంఖ చక్రాలను చేతులలోకి తీసుకో లేదు.సేవకులనూ.గరుడ వాహనాన్ని పిలువ లేదు.జారి పోయిన జుట్టు ముడిని సవరించుకో లేదు. చివరకి చేతిలో ఉన్న రమా దేవి పైట కొంగును కూడా ఆ తొందరలో విడిచి పెట్ట లేదు.! పోతన గారి ఆంధ్ర మహా భాగవతం గజేంద్ర మోక్షణం లోని ఈ ఘట్టం లోనిదే మీది పద్యం !   కరి రాజును కాపాడడానికి బయలు దేరిన హరి వెంట లక్ష్మీ దేవి,రాణివాసం, శంఖ చక్రాది ఆయుధాలూ,నారద విష్వక్సేనులూ, మొత్తం వైకుంఠమే కదిలి వచ్చిన దృశ్యాన్ని కనుల ముందు మత్తేభ వృత్తంలో సాక్షాత్కరింప చేసిన  మధుర  మనోహర మయిన కల్పన యిది !


      మానవ ప్రయత్నం విఫలమైన చోట దైవ సహాయం భక్తులకు తప్పక లభిస్తుందని చెప్పే కథ గజేంద్రమోక్షణం!



20, నవంబర్ 2019, బుధవారం

తెలుగు మధురిమలు


సీ. తనయందు నఖిలభూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగు వాఁడు !
      పెద్దలఁబొడగన్నభృత్యుని కైవడిఁ జేరి నమస్కృతుల్ సేయువాఁడు !
       కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృభావము సేసి మరలు వాఁడు !                            
       తల్లిదండ్రుల భంగి ధర్మ వత్సలతను దీనులఁ గావఁజింతించు వాఁడు !

తే.    సఖులయెడ సోదర స్థితి జరుపువాఁడు, దైవతములంచు గురువులఁ దలచు వాఁడు !
        లీలలందును బొంకులు లేని వాఁడు, లలితమర్యాదుఁడైన ప్రహ్లాదుఁ డధిప !
భావం: ఓ ధర్మ రాజా ! దానవ రాజయిన హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు  మర్యాదా పూర్వక మయిన మంచి నడత కల వాడు. హరిభక్తుడయిన  అతడు లోకము నందలి అన్ని ప్రాణులనూ తన లాగా భావిస్తాడు. పెద్దలు ఎదురయితే సేవకుని లా మిక్కిలి గౌరవభావంతో నమస్కరించే వినయ సంపన్నుడు. పర స్త్రీలను తల్లి వలె భావించి, అణకువతో ప్రక్కకి తొలగి పోతాడు. దీనులను తల్లిదండ్రుల లాగా ఆదరిస్తాడు.   స్నేహితులను  సోదర భావంతో చూసే సహృదయుడు. గురువులను దైవంతో సమానంగా కొలుస్తాడు. హాస్యానికి కూడా ఎప్పుడూ అబద్ధమాడడు.
         పోతన గారి ఆంధ్ర మహా భాగవతంలో రాజసూయ యాగ సమయంలో విచ్చేసిన నారద మహర్షి ధర్మ రాజుకి ఈ హరి తత్వ కథలను చెప్పినట్టుగా శుకుడు పరీక్షిత్తుకు వివరిస్తాడు సనక సనందనాదులను వైకుంఠద్వారం వద్ద నిరోధించి, శాపగ్రస్థులయిన ద్వార పాలకులు జయవిజయులు తదనంతర జన్మలలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగను, రావణ కుంభ కర్ణులుగను, శిశుపాల దంతవక్తృలుగను పుట్టి ,వైర భక్తితో  విరోధించి హరి చేతిలో నిహతులయ్యారు.  వీరిలో ,దితి కుమారులు హిణ్యకశిప,హిరణ్యాక్షులలో హిరణ్యాక్షుని శ్రీహరి వరాహ రూపంలో వధించాడు. సోదరుని మరణంతో ఖిన్నుడయిన హిరణ్య కశిపుడు మరింత విష్ణు ద్వేషిగా మారాడు. హరి నామం చెవిని పడితేనే కుపితుడయ్యే వాడు.
    అట్టి హరి ద్వేషికి కుమారుడయిన ప్రహ్లాదుడు మహా విష్ణు భక్తుడు. నిత్యం హరినామ స్మరణతో పులకించి పోయే వాడు. తనయుని హరి భక్తి మాన్చటానికి హిరణ్యకశిపుడు చేయని దుష్కృత్యాలు లేవు. చివరకు ఆ వైర భక్తితోనే  నరసింహావతారమెత్తి వచ్చిన  శ్రీమహా విష్ణువు చేతిలో వధింప బడతాడు.
     
       హరి ద్వేషి అయిన దానవ వీరుని కుమారుడయిన ప్రహ్లాదుని గుణగణాలు పోతన ఈ పద్యంలో మనోహరంగా వర్ణించాడు.సర్వభూతాలను తనతో సమానంగా చూసుకునే సమదర్శి. పెద్దల యెడ అమిత వినయశీలి. పరస్త్రీలను తల్లుల వలె భావించే సుగుణాల ప్రోవు.దీన జనులను సమాదరించే ఆర్ద్ర హృదయుడు. సంగడికాండ్రను సోదర భావంతో చూసే సహృదయుడు.గురువులను దైవంతో సమానంగా చూసుకునే ఆదర్శ విద్యార్ధి. హాస్యానికయినా  అసత్యమాడని సత్యసంధుడు లలితమర్యాదుడు .
         మానవ వ్యక్తిత్వ వికాసానికి మహాకవి పోతన చెప్పిన  తొలి పాఠాలు కదూ యివి !
   
   


   















































18, నవంబర్ 2019, సోమవారం

కథా మంజరి బ్లాగుని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. దీర్ఖ విరామం తరువాత మళ్ళీ కొత్త పోస్టుు పెడదమనుకుంున్నాను ఆశీర్వదించండి

27, సెప్టెంబర్ 2016, మంగళవారం

కొత్త పుస్తకం ... వింత పరిమళం ...




ఓలేటి శ్రీనివాస భాను అంటేనే నిలువెత్తు భావుకత.
తీయందనాల తెలుగు పదాల పోహళింపు.
భాను పేరు చెబితేనే పొగబండి కథలు కథా సంపుటం మదిలో మెరుపులా మెరుస్తుంది.కలకండ పలుకులు చవులూరిస్తాయి.  ఎల్వీ ప్రసాద్ పుల్లయ్య గార్ల జీవిత చరిత్రలు కళ్ళ ముందు  కదలాడుతాయి.
విరామ మెరుగని కలం యోద్ధ. చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు.

మిత్రుడు భాను ఇటీవల వొక అందమయిన, అపురూప మయిన పుస్తకం వెలువరించేడు. అదే ముకుంద మాల !
శ్రీ కుల శేఖర ఆల్వారుల కృతికి అను సృజన. ముకుంద మాలను గేయ రూపంలో గుండెలకు చేరువ చేసిన భాను ధన్యుడు.
ఈ పుస్తకంలో చాలా విశిష్ఠతలున్నాయి.
శ్రీకృష్ణశ్శరణం మమ అంటూ వి.ఎ.కె రంగారావు గారు అందించిన మున్నుడి,  ముకుందమాలా గ్రధన కౌశలం పేరిట ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు కవి పై అవ్యాజానురాగంతో చల్లిన ఆశీరమృత సేసలు ! ఇంకేం!  పసిడికి పరిమళం అబ్బింది. చిన్ని పొత్తం తాళ ప్రమాణం అధిగమించి అలరించింది. పరిమళించింది.


ముకుంద మాలను గేయచ్ఛందస్సులో అందించడానికి తనకు స్ఫూర్తినిచ్చిన శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్య గారి కి ముకుంద మాలను అంకితం
 చేస్తూ భాను వ్రాసిన మాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. కథన రూపంలో సాగిన వొక అపురూప ఙ్ఞాపకాల పునశ్ఛరణ అది.
శ్రీ పెమ్మరాజు రవికిశోర్ గారు గేయాలను అంద మయిన చేతి వ్రాతతో నగిషీలు చెక్కారు.
ముఖచిత్రం హిందూ దిన పత్రిక కార్టూనిస్ట్ ఖేశవ్ గారు పెయింటింగ్ కట్టి పడేసేలా ఉంది.

ముకుంద మాల లోకి ప్రవేశిస్తూనే వొక సంభ్రమాశ్చర్యాల మనశ్చలనానికి లోనవుతాం.
సరళ సుందర మయిన గేయ పంక్తులూ, ఆ ప్రక్కనే కళ్ళు త్రిప్పుకో లేని విధంగా శ్రీ బాలి గారు వేసిన బొమ్మలూ... రకరకాల భంగిమలతో ముకుందుడు కనువిందు చేస్తూ దర్శనమిస్తాడు. గేయ రచన, గీత రచన పోటా పోటీగా సాగాయి.ఈ ముకుంద మాల గేయాల పుస్తకానికి ఆ రేఖా చిత్రాలతో  బాలి గారు మరింత ప్రాణం పోసారు . తేజోవంతం చేసారు.


ఓలేటి శ్రీనివాస రావు గారి కొత్త పుస్తకం ముకుంద మాలను  క్రియేటివ్ లింక్స్  పబ్లికేషన్స్ , హైదరాబాద్ వారు ప్రచురించారు. అన్ని ప్రముఖ పుస్తక ప్రచురణాలయాల లోనూ లభ్యమవుతాయి. మిగతా వివరాల కోసం ఈ చరవాణిలలో సంప్రదించ  వచ్చు:
9440567151  లేదా  7032480233       ఓలేటి శ్రీనివాస భాను.
9848065658 లేదా 9848506964         ప్రచురణ కర్తలు.
నాటి జనార్దనాష్టకం లాగ అదే సైజులో, బాలి గారి వర్ణ చిత్రాలతో ఈ ముకుంద మాల కూడా  రావాలని కోరుకోవడం
అతి శయోక్తీ కాదు, అత్యాశాకాదు.











28, ఆగస్టు 2016, ఆదివారం

KANAKADHARA STOTRAM

Bhagvadgeetha by Ghantasala-Telugu full

Ayigiri Nandhini - Navaratri Paatalu by Nitya Santhsoshini

Sri Lakshmi Sahasranama Stotram In Telugu

Sri lalitha Sahasranama Stothram and PhalaSruthi

Vishnu Sahasranamam Full

11, మే 2016, బుధవారం

ఙ్ఞానం అసంపూర్ణమ్ !



గొప్ప గొప్ప రచయితలూ , అసంపూర్ణ రచనలూనూ !

ముందుగా మీకు మా తింగరి బుచ్చిని పరిచయం చేయాలి.

ఉబుసు పోకనో, యదాలాపంగానో, ఖర్మ కాలో కథా మంజరి బ్లాగు చూసే వారికి ఈ తింగరి బుచ్చి పరిచిత పూర్వుడే ! కొత్త బిచ్చగాళ్ళ కోసం ... మన్నించాలి ! కొత్త పాఠకుల కోసం వాడిని గురించి పునశ్చరణ చేయక తప్పడం లేదు.

ఈ తింగరి బుచ్చి మా ఆవిడకి దూరపు బంధువు. పుట్టింటి వారి తరఫు బంధువనీ, అన్నయ్య వరస అనీ మా ఆవిడ తెగ మురిసి పోతూ ఉంటుంది. పుట్టింటి తరఫు బంధువు అనే మాట ఎలా ఉన్నా, వాడు అతి త్వరలోనే, మా వంటింటి బంధువయి పోయేడు.

పరిచయ మయిన తొలి రోజులలో ‘‘ మరో ఇడ్లీ వెయ్య మంటారా అన్నయ్య గారూ ? ! ’’ అని మా ఆవిడ అడిగితే సిగ్గు , మొహమాటం వగైరా వగైరాలని తెగ అభినయిస్తూ, ‘‘ఒ క్ఖటి ... ఒక్కటంటే ఒఖ్ఖటి ... ’’ అని ఇదై పోయే వాడు. ( ఏదయి పోయే వాడని మీరు నన్ను నిలదీస్తే చెప్పడం కష్టం. )

అలాంటిది, కొంత పరిచయం పెరిగాక ( అంటే వాడే మాతో పెంచు కున్నాక, ) ‘‘ చెల్లాయ్ ! ఇవాళ టిఫి నేమిటో ? ’’ అని ఆరా తీసే స్థాయికి ఎదిగాడు. తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి పోయి, తనకి ఏ టిఫిను కావాలో అడిగి ( హొటల్లో మాదిరి ) ఆర్డరు వేసి చేయించుకునే స్థాయికి చేరి సోయేడు.

నిజం చెప్పొద్దూ ?! మా తింగరి బుచ్చి గాడు మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు, నేను వేరే ఎవరో పరాయి కొంపలో ఉన్నట్టుగా ఉంటుంది !

అంత చనువు సంపాదించేసాడు మాయింట్లో.

వాడి వాలకం నచ్చక మాఆవిడకు నచ్చ చెప్పబోతే, నా మాట వినడం మానేసింది. అందుకు వాడు వేసిన మంత్రం ఏమిటంటే, ‘మా చెల్లాయి చేతి వంట అమృతమే ! ’ అంటూ ఆమెను ఉబ్బేయడమే. అన్నీ అబద్ధాలే ... ఆకాడికి అమృతం వాడేదో రుచి చూసినట్టు అని లాజిక్కు వినిపించాను. ‘‘ ఊరుకోండి ! మీకంతా కుళ్ళు ... మీరు తప్ప నా చేతి వంట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెచ్చు కుంటారు ... మీరే ఎంపుళ్ళు పెడతారు ’’ అని మూతి మూడు వంకర్లుతిప్పింది. నాలో పురుషాహంకారం విజృంభించి, ‘‘ ఆకాడికి నీ చేతి వంటని లోకం లోని ప్రజానీకమంతా తిన్నట్టు ! బిల్ గేట్స్ తిన్నాడా ? బిల్ క్లింటన్ తిన్నాడా ?

అక్కినేని నాగేశ్వర రావు తిన్నాడా ? అమితాబ్ బచ్చన్ రుచి చూసాడా ?... ఘంటసాల తిన్నాడా ? పెంటగాన్ ప్రజలు చవి చూసేరా !... చైనా వాడు తిన్నాడా ? నానీ పాట్కర్ తిన్నాడా ! ...’’ అంటూ వర్లించేను. ఆ దెబ్బకి మా ఆవిడ వారం రోజులపాటు నాతో మాట్లాడడం మానీసింది. అప్పటి నుండి మా తింగరి బుచ్చి గాడొస్తే, వొళ్ళు మండి పోతున్నా సరే, ఓర్చుకుని మౌనంగా ఉండడం మొదలెట్టాను. కన్యా శుల్కంలో చెప్పినట్టు పేషెన్ప్ ఉంటే కానీ లోకంలో బతకలేం ! ( పూర్ రిచర్డ్ ఉవాచ. గిరీశం నోటంట)

సరే, అదలా ఉంచితే , తింగరి బుచ్చి గాడి బలహీనతా, బలమూ కూడా ఒక్కటే. ! అది ... వేదికను చూస్తే వెర్రెత్తి పోవడం ! మైకుని చూస్తే మైమరచి పోవడం ! ప్రజా సమూహాన్ని చూస్తే పరవశించి పోవడం !

ఎవరెంత వెనక్కి లాగినా కించ పడకుండా అనర్గళంగా ఉపన్యాసం దంచడం ...

చాలా సార్లు వాడిని జనాలు బలవంతంగా వాడి చేతి లోని మైకుని లాక్కుని, వేదికి మీద నుండి లాగి పడేసారు. దాని కతడు ఏమాత్రమూ అవమాన పడి నట్టు లేదు. పైగా, ‘ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బ లన్నట్టు ’ అనే ఉదాత్త మయిన ఉపమానంతోనూ. ‘ మొరిగే కుక్కకే కాలి దెబ్బ లన్నట్టూ ’ అనే నీచోపమానంతోనూ సమర్ధించు కునేవాడు.

‘‘ నువ్వు గిరీశానికి తక్కువా, గణపతికి ఎక్కువా నయ్యా ’ అన్నాను ఓసారి నేరక పోయి. దాని కతడు సంతోషించేడు. గిరీశం వంటి మహాను భావుడి సంగతి ప్రక్కన పెడితే గణపతితో సమానం చేసి మన్నించడం నాకు చాలా సంతోషంగా ఉంది కథా మంజరీ !’’ అని ఆనందాశ్రువులు రాల్చేడు. ముద్దొచ్చి నప్పుడల్లా వాడు నన్నలాగే సంబోధిస్తాడు. అప్పటికి గానీ నేనెంత తప్పు చేసానో నాకు స్ఫురించ లేదు. సాహితీ ప్రియుల మనోభావాలు ఎంతగా దెబ్బ తింటాయో కదా ! అని మనసు విలవిల లాడి పోయింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా అన్నట్టు ‘‘ అంతే కాదు ... నువ్వు జంఘాల శాస్త్రికి తక్కువా, జన్ని వలస కన్నయ్యకి ఎక్కువానోయీ !’’ అనేసాను. ఈ సారి కూడా వాడు అమందానంద కందళిత హృదయారవిందు డయ్యేడు ....‘‘‘

‘‘ఎంత మాట !

జంఘాల శాస్త్రి గారితోనా పోలిక ! .. అపరాధం ! కానీ, ఆ జన్ని వలస కన్నయ్యగా రెవరోయీ ’’ అన్నాడు తన్మయంగా ... వీడికి వాడి గురించి తెలియక పోవడం నా అదృష్టం.

( వాడో పిచ్చోడు . తనలో తనే ఎప్పుడూ ఏదో వదరుతూ తిరుగుతూ ఉంటాడనే సత్యం నేను తింగరి బుచ్చికి చెప్ప దల్చుకోలేదు. )

అయిందా ?
అలాంటి తింగరి బుచ్చి అనే శాల్తీ నా ప్రారబ్ధం కొద్దీ ఈ ఉదయం మా ఇంటికి ఊడి పడి ... ‘‘ బావా ! ఎలాగయినా నువ్వో అసంపూర్ణ రచన ఒకటి వేగిరం రాసి పడెయ్యాలి !’’ అని భీష్మించుకు కూర్చున్నాడు. నేను అవాక్కయ్యాను. ( కొందరు కొన్ని విపత్కర పరిస్థితులందు ఇట్లు అవాక్కగు చుందురు కదా )

‘‘ అసంపూర్ణ రచనలంటూ ఎవరూ చెయ్యరోయి ! వివిధ కారణాల చేత వారి రచనలలో ఒకటో రెండో అలా అసంపూర్ణంగా మిగిలి పోతూ ఉంటాయంతే ...’’ అని ఙ్ఞాన బోధ చేయ బోయాను.

వాడు నవ్వి, ‘‘ నువ్వెంత అమాయకుడివి బావా ! అవి నిజంగా అసంపూర్ణ రచనలనుకుంటున్నావా ? కాదు ... కాదు ... కమ్మన్నా కాదు ! కొందరు ప్రముఖ రచయితలు మొదట్లో ఎడా పెడా రచనలు చేసి పారేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించీసుకుని, వాటిని కలకాలం పదిలంగా నిలబెట్టు కోవడం కోసం ఓ అసమగ్ర రచన రాసి పారేసి, లోకం మీద పడేస్తారు. కావాలనే ఆ రచనను అసంపూర్ణంగా రచిస్తారు. ఆ లోగుట్టు తెలీక మనం వెర్రి వెంగళప్పల్లాగా, ఫలానా ప్రముఖ రచయిత గారి అసంపూర్ణ రచన యిదీ ! అంటూ లొట్ట లేసుకుంటూ పదే పదే చదువుతాం! తెలుసా !అసలు కంటే కొసరు ముద్దనీ ... ఈ అసంపూర్ణ రచనలే వారు ముందు సంపాయించుకున్న కీర్తి ప్రతిష్ఠలను కలకాలం నిలబెడతాయ్ ఆ రహస్యం తెలియక నీబోటి వాళ్ళు ఆహా, ఓహో ! అంటూ వాటిని చదువుకుంటూ ఊఁ ... ఇదై పోతూ ఉంటారు ! ’’ అని తేల్చేసాడు.

‘‘ గోపీ చంద్ యమపాశం, రావి శాస్త్రి రత్తాలూ రాంబాబూ. అంతెందుకూ, మన అలమండ గాంధీ బాబు, అదే మన పతంజలి రాజుల లోగిళ్ళూ అలా రాసిన అసంపూర్ణ రచనలే ! కాక పోతే వాళ్ళు వాటిని పూర్తి చెయ్ లేకనా ! ’’ అని తీర్మానించీసేడు.

నా నోట్లో తడారి పోయింది. నిలువు గుడ్లేసుకుని ఉండి పోయేను.

ఈ తింగరోడి మాటలకి బదులు చెప్పే సాహసం చెయ్య లేను కదా !

’‘‘ అంతెందుకూ, నీకో పరమ రహస్యం యెబుతాను విను ! అసలు ఆనాడు నన్నయ్యగారూ. పోతన గారూ కూడా ఈ ట్రిక్కు ఉపయోగించే అసంపూర్ణ రచనలు చేసి వదిలారు తెలుసా ? ’’

ఈ వదరుబోతు మాటలకి నా జవజీవాలూ కృశించి పోయేలా ఉన్నాయి.

నా పరిస్థితిని పట్టించు కోకుండా తింగరి బుచ్చి తన ఉపన్యాసం కొనసాగించేడు.

ఆ విధంబెట్టి దనిన ...

‘‘ నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతా మణితోనే అఖండ మయిన కీర్తి ప్రతిష్ఠలను మూట కట్టుకుని కూడా దానిని పదిలంగా నిలుపు కోవడం కోసం భారతం అనే అసంపూర్ణ రచన చేసాడు. రెండో, రెండున్నర పర్వాలో రాసి ఊరు కున్నాడు. అలాగే పోతన గారు కూడా ముందుగా రాసిన భోగినీ దండకంతోనే కీర్తి కాంతను స్వంతం చేసుకుని దానిని నిలుపు కోవడం కోసం భాగవతం అనే అసంపూర్ణ రచన చేసాడు ! అయితే, వారి రచనలకు మూల రచనలంటూ ఉండబట్టి ఆతర్వాత భారతాన్ని తిక్కన, ఎర్రనలూ. భాగవతాన్ని పోతన గారి కుమార రత్నమూ, శిష్య రత్నమూ పూర్తి చేసి పారేసారు ! ఆ విధంగా అసపూర్ణ రచనలుగా ఉంచేద్దామనుకున్న వారి ఆశలు కల్ల లయ్యాయి, ఆ విషయం బతికుండగా వారికి తెలియ దనుకో ... గతించేక తెలిసే అవకాశం ఎలానూ లేదు ! ...

అసంపూర్ణ రచనల వల్లనే కిర్తి ప్రతిష్ఠలు చిరకాలం ఎలా నిబెడతాయని నీ సందేహం. అవునా ? !

చెబుతా విను ! ఓ చిన్న ఉదాహరణ చెబుతాను ... విను ...

’’ అని గుక్క తీసు కోడానికి కాస్సేపు ఆగేడు.

ఆసరికి చేతిలో అట్లకాడతో సహా మా ఆవిడ బిగ్గరగా సాగుతున్న వాడి ఉసన్యాస ధోరణికి ముగ్ధురాలై యాంత్రికంగా నడుచుకుంటూ అక్కడకి వచ్చి నిలుచుంది.

వాడు తిరిగి తింగర్యోపన్యాసం మొదలెట్టాడు :

‘‘ నువ్వంతకు ముందెన్నడూ చూడని ఓ ఊరికి వెళ్ళా వనుకో ... అక్కడ అంద మయిన ఓ పదో ఇరవయ్యో ఇళ్ళ వరస కనిపించి. సంతోష పడతావు. ఆ భవన నిర్మాణ కౌశలాన్ని మెచ్చు కుంటావు. సరే వాటి మధ్య ఖర్మ కాలి ఓ అసంపూర్ణ కట్టడం కనిపించిందనుకో. నివ్వెర పోతావు. అయ్యో అనుకుంటావు. సరే, మళ్ళీ ఆఊరెళ్ళే పని నీకు పడక పోయినా ... తర్వాతి రోజులలో ఎప్పటికీ నీకా ఊరు గుర్తుకు వచ్చి నప్పుడల్లా ముందుగా ఆ అసంపూర్ణ కట్టడమే మదిలో మెదులుతూ ఉంటుంది. ఇందులో గొప్ప సైకాలజీ ఉంది. దానికి జర్మన్ లోనో, లాటిన్ లోనో, అధవా ఇంగ్లీషులోనో బారెడు పేరొకటి ఉండే ఉంటుంది. మనకికంకా తెలీదనుకో ! ఙ్ఞానం అసంపూర్ణంగా ఉండడం కూడా మనకి ఓ చక్కని అలంకారమే అనుకో ! ...

అసంపూర్ణ రచనలు చేసి లోకం మీద వదిలేసిన మహా రచయితలంతా ఈ సైకలాజికల్ పాయింట్ మాబాగా పట్టు కొన్నారు.

అందుచేతనే, గొప్ప వాళ్ళంతా అధమ పక్షం ఒకటయినా అసంపూర్ణ రచన చేస్తున్నారు. చెయ్యాలి కూడా. మరంచేత, నువ్వూ వెంఠనే ఓ అసంపూర్ణ రచన రాయాలి బావా ! ’’ అని ముగించాడు. ఆ వాగ్ధోరణికి మా ఆవిడ పరవశించి పోయి చప్పట్టు కొట్టింది. దాంతో రెచ్చి పోయి తింగరి బుచ్చి మరి కొంత సేపు ఇలా ప్రసంగించాడు :

‘‘ ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి రోజూ రుచి కరమైన వంటలు చేసి పెడుతున్నా, ఖర్మ కాలి ఓ రోజు ఉడకని అన్నమో, ఉడికీ ఉడకని కూరో చేసి, ఆ అసంపూర్ణ వంటకాన్ని మన ముఖాన తగ లేసారనుకో ! అదే మనకు చిరకాలం గుర్తుండి పోతుంది !

అసలా బ్రహ్మ దేవుడు కూడా కొన్ని అసంపూర్ణ రచనలు చెయ్య బట్టే, లోకంలో అర్ధాంతర చావులూ ... అల్పాయుష్క మరణాలూ సంభవిస్తున్నాయి. అందరికీ నూరేళ్ళే నుదుటన రచిస్తే, ఇక ఆ వెర్రి బ్రహ్మని తలుచు కునే దెవరు చెప్పు ? ...’’ అని ముగించాడు.
అప్పటికి నా ప్రాణాలు కడతేర్చుకు పోతున్నాయి.

సిగపాయ తీసి తందును కదా ! అనిపించింది కానీ మనకంత ధైర్యమేదీ ?!

అదీ కాక మా అమాయకపు శ్రీమతి వాళ్ళ అన్న గారి దివ్యమైన సలహాకి పొంగి పోయి : ‘‘ అవునండీ ... మీరు కూడా ఓ అసంపూర్ణ రచన చేద్దురూ ! ’’ అని ముందు గోముగానూ , తర్వాత శాసిస్తూనూ నిలదీసేప్రమాదం ఎలానూ పొంచి ఉంది. హతోస్మి !
ఇంతలో ... ... మా ఆవిడకు తటాలున ఏదో గుర్తుకొచ్చి. కెవ్వున అరచినంత పని చేసి చేతిలో అట్లకాడతో వంటింట్లోకి పరిగెత్తింది.

వెనుక మేమూ గాభరాగా పరిగెత్తాం.
అక్కడ ... ... పెనం మీద ఆవిడ రచించిన ఓ అసంపూర్ణ రచన --- మాడి పోయిన అట్టు రూపంలో పొగలు కక్కుతోంది. !

తింగరి ఉపన్యాసమ్ ప్రస్తుతానికి సమాప్తమ్.

ఇట్లు విధేయుడు,

ఖర్మకాలిన కథామంజరి బ్లాగరు, మరియు తింగరి బుచ్చి గాడి బాధితుడు.

12, ఏప్రిల్ 2016, మంగళవారం

మంచి పుస్తకం మళ్ళీ దొరికింది !



మనకి ఎంతో యిష్ట మయిన వో మంచి పుస్తకం చాలా కాలానికి మళ్ళీ కంట బడితే ఎంత సంతోషంగా ఉంటుందో కదూ ! అదే జరిగింది. నా చిరకాల మిత్రులు లతిక  (   స్వర్గీయ  రాళ్ళపల్లి   గౌరీపతి శాస్త్రి) గారి చిరు పొత్తం అనుకోకుండా ఇవాళ నా కంట పడింది.  వీరిదే  భజరంగ భళీ అనే  వొక కందార్ధ శతకం కూడా అనుకోకుండా ఈ నెలలోనే చాన్నాళ్ళకి తిరిగి చూడడం జరిగింది.

ఆ రోజులలో లతిక గారి రచన లేని ఆంద్ర పత్రిక ప్రభ వారపత్రికలు ఉడేవి కావు. మంచి కవి. రచయిత. భావుకుడు. సహృదయుడు.  లతిక గారి సత్యాభిరామం పుస్తకం అనుకో కుండా ఇవాళ నా కంట పడింది. 81లో నాకు వారిచ్చిన ఆ పుస్తకం నాకెంతో ప్రీతిపాత్రం. ఎక్కడో మరుగున పడి పోయింది. చాలా రోజులుగా వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికి దొరికింది. దానిని మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. 


ఇది విశాఖ సాహితి ప్రచురణ. ముఖ చిత్రం శ్రీ బాలి గారు చాలా అందంగా వేసారు. ప్రస్తావన పేరుతో శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు గారు ముదు మాట వ్రాసేరు. ఇందులో 1. విలాసినీ విజయం (24- 10 -1962 ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలోప్రచురణ.) 2.సుగాత్రి (ఆంధ్ర ప్రభ వీక్లీ 30-5-1962 లో ప్రచురణ) 3.లవంగి (సాహితి మాస పత్రిక సెప్టంబరు 64 లో ప్రచురణ) 4. భామతి (ఆంధ్ర పత్రిక క్రోధి సంవత్సరాది సంచిక లో ప్రచురణ) 5. మీనాంబిక (ప్రభ వీక్లీ 2-9-1966 సంచికలో ప్రచురణ) అనే 5 గేయ కథలు ఉన్నాయి.
ఇందులో విలాసినీ విజయం అనే గేయ కథ నంది తిమ్మన గారి పారిజాతాపహరణం కావ్యం లోని కథకు గేయ రూపం. పారిజాతాపహరణంలో సత్యభామ అలక, కృష్ణుడు ఆమె అలక తీర్చబూనడం. ఆమె ఆ త్రైలోక్యారాధుని ఎడద కాలితో తన్నిత్రోసి వేయడం. చివరకు పంతం నెగ్గించుకుని ఆ విలాసిని పారిజాతాన్ని ఇంద్ర లోకంనుండి గెలిచి తెప్పించుకుని పెరటి చెట్టుగా నాటించు కోవడం కథ మనకు తెలిసినదే.ఇదొక స్వాధీన పతిక కథ!
సుగాత్రి అనే గేయ కథకు మూలం పిగళి సూరన గారి కళాపూర్ణోదయం లోని సుగాత్రీ శాలీనుల కథ. సర్వాభరణ భూషిత అయిన భార్య సుగాత్రిని చేరదీయడు ఆమె భర్త శాలీనుడు. ఆ ఇల్లరికపుటల్లుడి మనోగతం ఎవరికీ అంతు చిక్కదు. చివరకు తోట పనిలో వర్షపు వేళ భర్తకు అలంకారాలన్నీ తీసి వేసి, సాదా వస్త్రధారణతో పని చేసి అలసి సొలసిన అందం చూసి శాలీనుడు ఆమెను అక్కు చేర్చుకోవడం ఇందులో కథ.శ్రమైక జీవన సౌందర్యంతో పతి మనసు చూరగొన్న అతివ కథ యిది.
లవంగి గేయ కథ ... షాజహాన్ చక్రవర్తి కొలువులో జగన్నాథ పండితరాయలు రాజ నర్తకి లవంగిని చూసి ఆమెను భార్యగా స్వీకరించడం.కుల మతాలను భ్రష్టు పట్టించాడని తోటి పండితులు ఛీత్కారాలు.ఇదే కారణంతో ఆ దంపతులను గంగా స్నానానికి కూడ అనుమతించక పోవడం. అరవై మెట్టున్న ఆ గంగా నది ఒడ్డున పండితరాయలుగంగా మాతను ఆశువుగా స్తోత్రం చేయడం. గంగానది అన్ని మెట్లూ అధిగమించి పైకి వచ్చి ఆ దంపతులను తరింప చేయడం ఇందులోకథ.పండితరాయలు ాశువుగా చెప్పినదే గంగాలమరి కావ్యం!
వ్యాసుడు రచించిన బ్రహ్మ సూత్రాలకు ఆది శంకరులు భాష్యం రచించారు. దానికి వాచస్పతి మిశ్రుడు వివరణ వ్రాసాడు. అతని భార్య భామతి. ఆమె పేరే ఆ వివరణ గ్రంథానికి ఉంచాడు వాచస్పతి మిశ్రుడు. ఆ కథకి గేయ రూపమే భామతి.
ఇక చివరిదయిన మీనాంబిక అనే గేయ కథ శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి నవలకు గేయ రూపం.భర్తకు, తండ్రికి ప్రాణ భిక్ష సాధించు కున్న సాధ్వీలలామ కథ యిది.
లతిక గారు ఈ చిన్ని పొత్తాన్ని తమ తల్లిదండ్రులకు అంకితం చేసారు.
శ్రీపాద లక్ష్మీనారాయణ మూర్తి తమ అనుంగు శిష్యుడయిన లతికను ఆశీర్వదిస్తూ చెప్పినట్టుగా యిది ... రమ్య గేయాల సత్యాభిరామ కృతి.